ఆమోసు ప్రవక్త ఆమోసు గ్రంథాన్ని వ్రాశాడు. ఈ చక్కని పుస్తకములో 9 అధ్యాయాలు మనము చూస్తున్నాము. పాత నిబంధనలో అనేక మంది ప్రవక్తలు మనకు కనిపిస్తారు.
ప్రవక్తకు, ప్రవక్తకు మధ్య కన్ఫ్యూషన్ లేకుండా ఉండాలంటే, నేను తయారు చేసిన ఈ చార్ట్ చూడండి. ఈ చార్ట్ కావలసిన వారు మా వెబ్ సైట్ www.doctorpaul.org కి వెళ్లి బైబిల్ చార్టులు అనే పేజీకి వెళ్లి ఈ చార్ట్ డౌన్ లోడ్ చేసుకోండి.
ఆమోసు ప్రవక్త క్రీ.పూ 763 – 755 సంవత్సరముల మధ్య ఇశ్రాయేలు దేశములో పరిచర్య చేశాడు. ఆయన ఒక మాట అంటున్నాడు: 4 అధ్యాయము 12 వచనము చూద్దాము.
12. కాబట్టి ఇశ్రాయేలీయు లారా, మీయెడల నేనీలాగునే చేయుదును గనుక ఇశ్రాయేలీయులారా, మీ దేవుని సన్నిధిని కనబడుటకై సిద్ధ పడుడి.ప్రపంచ దేశాలను నేను తీర్పు తీర్చబోవుచున్నాను. మీరు కూడా జాగ్రత్తపడండి, మీ దేవుని సన్నిధిని కనబడుటకై సిద్దపడండి.
ఈ ఆమోసు గ్రంథము యొక్క ముఖ్య అంశం ‘న్యాయం కావాలి’. ‘న్యాయం కావాలి’. ఆమోసు ప్రవక్తకు ఎటు చూసినా అన్యాయం కనిపిస్తున్నది.అందుకనే, ‘న్యాయం కావాలి’ అని అడుగుతున్నాడు. అబ్రహం హెర్స్చేల్ అనే యూదు మేధావి ఒక మాట అన్నాడు. Prophet’s eye is directed to thecontemporary scene but his ear is inclined to God. ప్రవక్త కన్ను తన సమాజం మీద ఉంటుంది, కానీ అతని చెవి దేవుని వైపు ఉంటుంది. మన కన్ను మన సమాజం మీద ఉండోచ్చు. అయితే మన చెవి దేవుని వైపు ఉండాలి. దేవుని స్వరాన్ని మనము వినాలి. ఆమోసు దేవుని స్వరాన్ని విన్నాడు.
ఆయన ఒక రైతు, ఒక గొఱ్ఱెల కాపరి.ఆయన చాలా సామాన్యమైన వ్యక్తి. ఆయన రాజ కుటుంబానికి చెందిన వాడు కాదు, మేధావి కాదు, మతాధికారి కాదు. గొప్ప వ్యాపారస్తుడు కాదు. ఒక సామాన్యమైన రైతు, ఒక సామాన్యమైన గొఱ్ఱెల కాపారి. దేవుడు ఆయనను పిలిచాడు: ఆమోసు, నా సందేశాన్ని నీవు ప్రజలకు చెప్పాలి.
యెరూషలేముకు 11 మైళ్ళ దూరములో తెకోయ అనే గ్రామములో ఆమోసు జీవించాడు. ఆయన జీవించిన కాలములో ఇశ్రాయేలీయులు రెండు దేశములుగా జీవిస్తున్నారు. ఉత్తర ఇశ్రాయేలు దేశము, దక్షిణ యూదా దేశము.ఉత్తర ఇశ్రాయేలు దేశములో యరొబాము రాజుగా ఉన్నాడు. దక్షిణ యూదా దేశములో ఉజ్జియా రాజుగా ఉన్నాడు. యోనా ప్రవక్త, హోషేయా ప్రవక్త, యెషయా ప్రవక్తలు జీవించిన కాలములో ఆమోసు జీవించాడు. ఆయన యూదా దేశానికి చెందిన వాడు. కానీ తన సందేశాన్ని
ఉత్తర ఇశ్రాయేలు దేశానికి అందించాడు. ఇశ్రాయేలీయులు ఆ సమయములో బాగా స్థిరపడ్డారు, ఆర్థికంగా బాగా ఎదిగారు. చాలా సుఖముగా జీవిస్తున్నారు. పాలు, తేనెలు ప్రవహించే దేశమువలె ఆ దేశము ఉంది. సుఖముగా బ్రతుకుతున్నారు కానీ వారి జీవితములో ఆరాధన లేదు.
ఆమోసు ప్రవక్తకు వారి జీవితములో రెండు లోపాలు కనిపించినవి. మొదటిది వారి జీవితములో నిజమైన ఆరాధన లేదు, రెండవది వారి సమాజములో న్యాయము లేదు.ఆమోసు అటువంటి సమాజములో నివసించాడు. మన సమాజము కూడా అలానే ఉంది. నిజమైన ఆరాధన మన సమాజములో లోపించింది. ఆరాధన అంటే
వర్షిప్. వర్షిప్ అనే ఇంగ్లీష్ పదం ‘వర్త్ షిప్’ అనే మాటలో నుండి జనించింది. అంటే యోగ్యత. దేవుడు మాత్రమే మన ఆరాధనకు యోగ్యుడు.దేవుడు మన సృష్టికర్త, సహాయకుడు, సంరక్షకుడు కాబట్టి మనము ఆయనను మాత్రమే ఆరాధించాలి.
ఆమోసు ప్రవక్త ఇశ్రాయేలీయులను రెండు ప్రశ్నలు అడిగాడు. ‘మీ జీవితములో ఆరాధన ఎందుకు లేదు?’ ‘మీరు ఎందుకు అన్యాయముగా జీవిస్తున్నారు?’ ఆరాధన, న్యాయము – ఈ రెండూ కలిసే ఉంటాయి.నిజమైన ఆరాధన చేసే వ్యక్తి న్యాయముగా ప్రవర్తిస్తాడు. న్యాయము సత్యం మీద ఆధారపడి ఉంటుంది. సత్యం దేవుని మీద ఆధారపడి ఉంటుంది. దేవుని ఆరాధించకపోతే మనము సత్యం తెలుసుకోలేము. సత్యము లేకుండా నిజమైన ఆరాధన మనము చేయలేము. యోహాను సువార్త 4:24 లో యేసు ప్రభువు ఒక మాట అన్నాడు:
దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించు వారు ఆత్మతోను సత్యముతోను ఆరాధింపవలెననెను.
యేసు ప్రభువు ఇక్కడ స్పష్టముగా మనకు తెలియజేస్తున్నాడు: దేవుడు ఆత్మయై ఉన్నాడు. ఆయనను ఆరాధించేవారు ఆత్మతో, సత్యముతో ఆరాధించాలి. మన ఆరాధనలో బొమ్మలు ఉండవు, జంతు బలులు ఉండవు, హారతులు ఉండవు.మన ఆత్మలో మనము దేవుని ఆరాధించాలి. ఆరాధన మన పెదవుల మీద మాత్రమే కాకుండా మన హృదయములోనుండి రావాలి. అది దేవుని మీద కేంద్రీకరించబడి ఉండాలి. దేవుడు త్రియేక దేవుడు. దేవుడు ఒక్కడే కానీ ఆయనలో ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. త్రిత్వం అంటే ముగ్గురు దేవుళ్ళు అని కాదు. ఒక్కడే దేవుడు కానీ ఆయనలో ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. తండ్రి ఐన దేవుడు, కుమారుడు ఐన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు. ఆ ముగ్గురు వ్యక్తుల స్వభావం ఒక్కటే, ఆ ముగ్గురు వ్యక్తుల లక్షణాలు ఒక్కటే. అయితే ఆ ముగ్గురు విభిన్నమైన వ్యక్తులు. త్రిత్వములోని రెండవ వ్యక్తి, అంటే కుమారుడైన దేవుడు మన ప్రభువైన యేసు క్రీస్తుగా మానవ రూపములో ఈ లోకానికి వచ్చాడు. ఆయన మన రక్షకుడు. సిలువ మీద మన పాపముల కొరకు ఆయన మరణించాడు.సమాధి చేయబడి, తిరిగి మూడవ దినమున తిరిగిలేచాడు. ఈ రోజున ఆయన మన సజీవుడైన రక్షకుడు. ఈ రోజున మనం ఆరాధించే రక్షకుడు మృతుడు కాదు, ఆయన సజీవుడు. ఎవరైతే యేసు క్రీస్తును విశ్వసించి, ఆయనను ప్రభువుగా ఒప్పుకొంటారో, వారు రక్షించబడతారు. రక్షించబడిన వ్యక్తి పరిశుద్ధాత్మను పొందుతాడు. దేవుని సత్యాన్ని పొందుతాడు. అప్పుడు మాత్రమే నిజమైన ఆరాధన చేయగలడు. క్రీస్తు లేని వ్యక్తి మృతుడే. అతనిలో జీవం లేదు. అతను సాతానుకు సేవకుడే. ప్రతి ఒక్కరూ క్రీస్తుతో ఉండాలి, లేకపోతే సాతానుతో ఉన్నట్లే. మూడో మార్గము లేదు. రక్షణ పొందితే పరలోకానికి, దేవుని ఇంటికి వెళ్తావు. రక్షణ పొందకపోతే, సాతాను చెరకు, నరకానికి వెళ్తావు.
మరొక గమ్యం లేదు. మీరు రక్షణ పొందకపోతే, మీరు ఈ రోజే క్రీస్తు యొద్దకు రావాలి, మీ పాపములు ఒప్పుకోవాలి, క్రీస్తును మీ రక్షకునిగా, ప్రభువుగా అంగీకరించాలి. అప్పుడు మీకు దేవునితో సంబంధము ఏర్పడుతుంది. దేవునికి, మీకు మధ్య ఉన్న శత్రుత్వము పోతుంది.దేవుని కుటుంబములో మీరు చేరతారు. పరిశుద్ధాత్ముడు మీలో నివసిస్తాడు. అప్పుడు మాత్రమే మీరు నిజమైన ఆరాధన చేయగలరు. రక్షణ పొందకుండా మీరు మీ జీవితమంతా చర్చికి వెళ్లి కూర్చున్నా మీరు ఆరాధన చేయలేరు.
దేవుని ఆరాధించువారు ఆత్మతో, సత్యముతో ఆరాధించాలి అని యేసు ప్రభువు చెప్పాడు.
సత్యములో నుండే స్వాతంత్రం వస్తుంది. అసత్యం ఒక బానిసత్వము. యోహాను సువార్త 8:31,32 లో యేసు ప్రభువు ఒక మాట చెప్పాడు: మీరు సత్యమును గ్రహించెదరు; అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులనుగా చేయును ముందు మీరు సత్యాన్ని గ్రహించాలి, అప్పుడు సత్యము మిమ్ములను స్వతంత్రులనుగా చేస్తుంది. ఈ ప్రపంచములో ఉన్న సత్యము మొత్తము దేవుని యొద్ద నుండి వచ్చిందే. మీరు కాలేజీ కి వెళ్లి సత్యము తెలుసుకోవచ్చు.ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ, మ్యాథమెటిక్స్ నేర్చుకోవచ్చు. వాటిలో ఉన్న సత్యాలు కూడా దేవుని యొద్ద నుండి వచ్చినవే. ఫిజిక్స్ లో ఉన్న సత్యాలతో మీరు చంద్రుని మీద అడుగుపెట్టొచ్చు, మార్స్ మీదకు, లేదా వేరొక గ్రహం మీదకు వెళ్ళవచ్చు. అయితే, పరలోకం వెళ్ళలేరు. పరలోకం వెళ్ళటానికి ఆ సత్యాలు పనికిరావు. పరలోకానికి వెళ్ళటానికి క్రీస్తు సత్యాలు మీకు కావాలి. యోహాను సువార్త 14:6 లో, యేసు ప్రభువు ఒక మాట అన్నాడు.
యేసు – నేనే మార్గమును, సత్యమును,జీవమును; నా ద్వారానే తప్ప యెవడును తండ్రియొద్దకు రాడు.
దేవుని సత్యము యొక్క మానవ రూపం – మన ప్రభువైన యేసు క్రీస్తు. యోహాను సువార్త ఎంతో మనోహరమైన మాటలతో ప్రారంభం అవుతుంది: ఆ వాక్యము శరీరధారియై, కృపాసత్యసంపూర్ణుడుగా మనమధ్య నివసించెను కృపాసత్యసంపూర్ణుడుగా మనమధ్య నివసించుటకు వచ్చిన వాక్యము ఎవరు? యేసు క్రీస్తే.
ధర్మశాస్త్రము మోషే ద్వారా అను గ్రహింపబడెను; కృపయు సత్యమును యేసు క్రీస్తు ద్వారా కలిగెను
(యోహాను 1:17)
ధర్మశాస్త్రము మోషే ద్వారా వచ్చింది. దేవుని కృప యేసు క్రీస్తు ద్వారా వచ్చింది. దేవుని సత్యము యేసు క్రీస్తు ద్వారా వచ్చింది ఆ సత్యము తెలుసుకొన్నప్పుడు మనకు స్వాతంత్రం వచ్చింది. సాతాను శక్తి నుండి, పాపము యొక్క శక్తి నుండి మనకు విడుదల కలిగింది.
ఆమోసు ప్రవక్త వారిని చూసినప్పుడు, ఇశ్రాయేలీయులకు సత్యము లేదు, వారు అసత్యములో ఉన్నారు. వారికి ధనము, ఐశ్వర్యము ఉన్నప్పటికీ ఆత్మసంబంధముగా దరిద్రులుగా ఉన్నారు. ఆత్మసంబంధముగా బానిసత్వములో ఉన్నారు.రాజకీయముగా, సామాజికముగా స్వేచ్ఛ ఉన్నప్పటికీ, వారి ఆత్మలు బానిసత్వములో ఉన్నాయి. నిజమైన ఆరాధన లేకుండా స్వాతంత్రం లేదు.అది మనము తెలుసుకొనవలసిన చాలా ముఖ్యమైన సత్యము.
ఆమోసు ప్రవక్త వారిని చూసినప్పుడు ఇశ్రాయేలీయులలో నిజమైన ఆరాధన లేదు,వారిలో సత్యము లేదు. వారి జీవితాలు విగ్రహారాధనతో నిండిపోయి ఉన్నాయి. ఆదాము యొక్క సృష్టికర్త ఐన దేవుని వారు మరచిపోయారు.అబ్రాహాము ద్వారా వారితో నిబంధన చేసిన దేవుని వారు మరచిపోయారు. మోషే ద్వారా వారిని విమోచించిన దేవుని వారు మరచిపోయారు. దావీదు ద్వారా వారిని పాలించిన దేవుని వారు మరచిపోయారు. తమ చుట్టూ ఉన్న అన్యజనుల యొక్క దేవతలను, దేవుళ్లను తీసుకొని వాటిని పూజిస్తున్నారు. వారి సమాజములో హింస పెరిగిపోయింది. అన్యాయము పెరిగిపోయింది.
ఆమోసు ప్రవక్త వారికి రెండు ముఖ్య సంగతులు బోధించాడు. మీలో నిజమైన ఆరాధన లేదు, అందుకనే మీలో అన్యాయము పెరిగిపోయింది, హింస పెరిగిపోయింది. మన సమాజములో కూడా ఎంతో హింస పెరిగిపోయింది, ఎంతో అన్యాయం పెరిగి పోయింది. మాకు న్యాయం కావాలి అని అనేకమంది పోరాటాలు చేస్తున్నారు. అమెరికా దేశములో ‘బ్లాక్ లైవ్స్ మాటర్’ అనే సంస్థ మొదలయ్యింది. మార్క్సిజం ద్వారా సమాజములో మార్పు తెస్తాము అని వీరు బయలుదేరారు. మార్క్సిజం ప్రపంచములో ఎక్కడా సామాజిక మార్పు తేలేకపోయింది. మన దేశములో నక్సలిజం సమాజములో మార్పు తేలేక విఫలమయ్యింది. అలాంటిదే ఈ ‘బ్లాక్ లైవ్స్ మాటర్’. వారు వీధులలో పోరాటాలు చేస్తున్నారు. నల్ల జాతి వారికి సమాన హక్కులు ఉండాలి, వారి ప్రాణాలకు రక్షణ ఉండాలి అని ప్రదర్శనలు చేస్తున్నారు. విగ్రహాలు కూల్చుతున్నారు. కొన్ని చోట్ల చర్చిల మీద కూడా దాడులు చేస్తున్నారు. బైబిళ్లు తగులబెడుతున్నారు. సాతానుడు అంధకారంలో వారిని బంధించాడు.సామాజిక న్యాయము కోసము వీరు పోరాటం చేస్తూ ఉన్నారు.
ఈ ప్రపంచానికి సామాజిక న్యాయం గురించి చెప్పిందే బైబిలు. దానిని తగులబెట్టడం ఎంత అవివేకం! వారి జీవితాల్లో దేవుడు లేడు, యేసు క్రీస్తు లేడు, ఆరాధన లేదు, దేవుని సత్యం లేదు. వారు ఎన్ని పోరాటాలు చేసినా ఉపయోగం ఉండదు. ఎందుకంటే, ఆమోసు ప్రవక్త తన గ్రంథములో చెప్పినట్లు, నిజమైన ఆరాధన లేకుండా సామాజిక న్యాయము రాదు. సత్యము లేకుండా స్వతంత్రం రాదు.దేవుడు లేకుండా సత్యం రాదు.
రిచర్డ్ అలెన్ అనే బానిస గురించి నేను చదివాను.1760 లో ఫిలడెల్ఫియా నగరములో ఆయన జన్మించాడు. ఆయన కళ్ళముందే ఆయన తల్లిని బానిసత్వములోకి అమ్మివేశారు. ఆయన కళ్ళముందే ఆయన సోదరులను బానిసలుగా మార్చుకొన్నారు. చివరకు రిచర్డ్ ని కూడా చిన్న బాలునిగా ఉన్నప్పుడే బానిసను చేసుకొన్నారు. 17 సంవత్సరములో ఒక పొలములో చాకిరీ చేస్తూ ఉన్నాడు. ఆ సమయములో ఒక సువార్తికుడు ఆ ప్రాంతానికి వచ్చాడు. యేసు క్రీస్తు గురించి ఆ సువార్తికుడు చెప్పిన మాటలు రిచర్డ్ విన్నాడు. ఈ యేసు క్రీస్తు నాకు కావాలి అని రిచర్డ్ అప్పుడే యేసు ప్రభువును నమ్ముకొన్నాడు. అప్పుడు భూస్వామి దగ్గరకు వెళ్లి, బ్రతిమలాడాడు. ‘నేను యేసు ప్రభువును నమ్ముకున్నాను. నాకు స్వాతంత్రం కావాలి, నన్ను వెళ్లనివ్వండి’ అని అడిగాడు.నీకు విడుదల కావాలంటే 2000 డాలర్లు చెల్లించు అని భూస్వామి చెప్పాడు. రిచర్డ్ 2000 డాలర్లు పొదుపు చేసి ఆ డబ్బులు భూస్వామికి చెల్లించి విడుదల కొనుకొన్నాడు.
ఈ లోక సంభందమైన విడుదల కోసం ప్రజలు వేల డాలర్లు భూస్వాములకు చెల్లించాల్సి వస్తున్నది. అయితే ఆత్మ సంభందమైన విడుదలను దేవుడు ఉచితముగా మనకు అనుగ్రహించాడు. దేవుని కృప ఎంత గొప్పదో మీరొక సారి ఆలోచించండి. రిచర్డ్ అల్లెన్ 23 సంవత్సరముల వయస్సులో బానిసత్వము నుండి బయటపడ్డాడు. బైబిల్ చదవడం ప్రారంభించాడు. ఉదయం 5 గంటలకే లేచి నల్లవారికి, తెల్లవారికి యేసు క్రీస్తు సువార్త బోధించడం మొదలుపెట్టాడు. ఒక నల్లవాడు మాకు బోధించడం ఏమిటి? అని కొంతమంది తెల్లవారు ప్రశ్నించినా పట్టించుకోకుండా తన సభలు నిర్వహించాడు.1793 లో యెల్లో ఫీవర్ జబ్బు అమెరికా లో ప్రవేశించింది.
అనేకమంది అస్వస్థతకు గురయ్యారు. ఆ సమయములో రిచర్డ్ అల్లెన్, అతని భార్య, అతని సంఘస్తులు రోగులకు సేవలు చేశారు. వారి కోసం ప్రార్ధనలు చేశారు.వారి ప్రేమతో అనేక మంది హృదయాలు మార్చారు. 1794 లో ఫిలడెల్ఫియా నగరములో రిచర్డ్ ‘బేతేలు మందిరం’ స్థాపించాడు. వేలాది మంది ఆరాధనకు వెళ్లారు. క్రైస్తవ సత్యాలు తెలుసుకొన్నారు. 1831 లో రిచర్డ్ అల్లెన్ చనిపోయేనాటికి అమెరికా దేశములో వందలాది క్రైస్తవ సంఘాలు ఆయన ప్రేరణతో మొదలయినాయి. అనేక మంది భూస్వాములు యేసు క్రీస్తు సువార్త విని బానిసలకు విముక్తి కలిగించారు.ఆ మార్పు ఎలా మొదలయ్యింది? వారికి న్యాయము ఎలా కలిగింది? రిచర్డ్ అల్లెన్ ఆరాధనతో మొదలుపెట్టాడు.
యేసు క్రీస్తు సువార్తతో మొదలుపెట్టాడు. నిజమైన ఆరాధన లేకుండా మొదలయ్యే ఉద్యమాలు సమాజములో మార్పు తేలేవు. బ్లాక్ లైవ్స్ మ్యాటర్ ఉద్యమకారులు విగ్రహాలు కూల్చుతున్నారు, ఇల్లు తగులబెడుతున్నారు, పోలీసుల మీద రాళ్లు రువ్వుతున్నారు.దాని వలన మార్పు రాదు. ఈ రోజున అబార్షన్ లు చేసి గర్భములోనే ఎంతో మంది పిల్లల ప్రాణాలు తీస్తున్నారా? నోరు లేని ఆ గర్భస్థ శిశువులకు న్యాయం చేసేది ఎవరు? వారివి ప్రాణాలు కావా?
ఆమోసు గ్రంథాన్ని మనము మూడు భాగాలు చేయవచ్చు.
1-2 అధ్యాయాలు: దేవుడు అన్యజనుల మీద తేబోయే తీర్పులు వ్రాయబడ్డాయి
3-6 అధ్యాయాలు: ఇశ్రాయేలీయులలలో ఉన్న అవినీతిని చూపించాయి.
7-9 అధ్యాయాలు: వారి భవిష్యత్తు ఎలా ఉంటుందో వివరించాయి.
ఇశ్రాయేలీయులలో ఉన్న అవినీతిని దేవుడు ప్రశ్నించాడు.
అమెరికా దేశములో లిబర్టీ యూనివర్సిటీ అని ఒక పెద్ద క్రైస్తవ యూనివర్సిటీ ఉంది.ఇది ప్రపంచములోనే అతి పెద్ద క్రైస్తవ యూనివర్సిటీ. దీనికి జెర్రీ ఫేల్వెల్ అనే ఆయన ప్రెసిడెంట్ గా ఉన్నాడు. ఆయన, ఆయన భార్య మీ మధ్యలో వ్యభిచారం చేస్తూ పట్టుబడ్డారు. ఎక్కడెక్కడ ఎవరెవరితో తిరుగుతున్నారో సోషల్ మీడియా లో పోస్ట్ చేశారు. భార్యాభర్తలిద్దరూ కూడబలుక్కొని వ్యభిచారం చేస్తూఉన్నారు. బోర్డు మెంబర్లు ఏమన్నారంటే, మీరిద్దరూ వ్యభిచారం చేస్తూ పట్టుబడ్డారు కాబట్టి మీరు ఈ క్రైస్తవ సంస్థకు మేనేజర్లుగా ఉండకూడదు. పదవీ విరమణ చేయండి. దానికి ఆ భార్య భర్తలు, మేము పదవీ విరమణ చేయాలంటే మాకు 10 మిలియన్ డాలర్లు నష్టపరిహారం ఇవ్వండి అన్నారు. 10 మిలియన్ డాలర్లు, అంటే 70 కోట్ల రూపాయలు తీసుకొని ఆ పదవికి రాజీనామా చేశారు. ఒక క్రైస్తవ యూనివర్సిటీ ని వీరు నడిపిస్తున్నారు. వ్యభిచారం చేస్తూ పట్టుబడ్డారు. సిగ్గుపడాల్సింది పోయి, ఆ యూనివర్సిటీ దగ్గర 70 కోట్లు కాయజేశారు. ఆ డబ్బంతా క్రైస్తవ యువతీ యువకుల దగ్గర నుండి ఫీజుల రూపములో వసూలు చేసిందే. ఇలాంటి వారి వలన క్రైస్తవ సాక్ష్యం దెబ్బతింటుంది. వారిని చూసిన వారు రక్షణ కూడా పొందకుండా నశిస్తారు. ఆమోసు ప్రవక్త ఇశ్రాయేలీయులలో ఉన్న అవినీతిని బయటపెట్టాడు. ఆమోసు అంటే, ‘భారము మోసేవాడు’ అని అర్థం. ఆయన హృదయములో ఇశ్రాయేలీయుల కోసం ఆయన భారం మోస్తున్నాడు. ఈ రోజు దేవుడు మనలను కూడా భారం మోసే వారిగా చేస్తున్నాడు. నశించిన ఆత్మల కోసం మీకు భారం ఉందా? అన్యజనుల కోసం మీకు భారం ఉందా? యువతీయువకుల కోసం మీకు భారం ఉందా? వృద్ధుల కోసం మీకు భారం ఉందా? సంఘముల కోసం మీకు భారం ఉందా? విశ్వాసుల కోసం మీకు భారం ఉందా? భారం మోయటానికి దేవుడు ఆమోసు ను ప్రవక్తగా పిలిచాడు.
12. కాబట్టి ఇశ్రాయేలీయులారా, మీయెడల నేనీలాగునే చేయుదును గనుక ఇశ్రాయేలీయులారా, మీ దేవుని సన్నిధిని కనబడుటకై సిద్ధ పడుడి.
I will do this unto thee, prepare to meet thy God, O Israel!” prepare to meet thy God
ఆమోసు గ్రంథము నుండి ఈ రోజు మనము కొన్ని సత్యాలు చూశాము. ఇశ్రాయేలీయుల సమాజములో ఆమోసు రెండు ముఖ్య లోపాలు గమనించాడు.
1.మొదటిగా, వారిలో నిజమైన ఆరాధన లేదు
2.రెండవదిగా, వారిలో న్యాయం లేదు. న్యాయం సత్యము మీద ఆధారపడిఉంది, సత్యము దేవుని మీద ఆధారపడి ఉంది. దేవుడు లేకుండా మనము అక్కడక్కడా కొన్ని సత్యాలు ఏరుకోవచ్చు కానీ సంపూర్ణమైన సత్యము కావాలంటే మనము యేసు క్రీస్తు దగ్గరకు రావాలి.
ఆ వాక్యము శరీరధారియై, కృపాసత్యసంపూర్ణుడుగా మనమధ్య నివసించెను. కృపాసత్యసంపూర్ణుడుగా మనమధ్య నివసించుటకు వచ్చిన వాక్యము ఎవరు? యేసు క్రీస్తే. ఆయన దగ్గరకు వచ్చినప్పుడు మన నిజమైన స్థితిని మనం చూస్తాము. యేసు క్రీస్తు ప్రభువు దగ్గరకు మనము వచ్చినప్పుడు దేవుడు మన పాపములను క్షమించి తన నిత్యజీవాన్ని మనకు అనుగ్రహిస్తున్నాడు. ఆ సత్యాన్ని మీరు గ్రహించాలన్నదే నేటి మా ప్రేమ సందేశం.