హబక్కూకు ప్రవక్త : డాక్టర్ పాల్ కట్టుపల్లి సందేశం

ఈ రోజు హబక్కూకు గ్రంథం నుండి ధ్యానం చేద్దాము. పాత నిబంధన గ్రంథము లో హబక్కూకు పుస్తకం నుండి ఒక మంచి ప్రేమ సందేశం మీకు ఇవ్వాలని నేను ఆశపడుతున్నాను. 

 ప్రవక్తయగు హబక్కూకునొద్దకు దర్శనరీతిగా వచ్చిన దేవోక్తి.2 యెహోవా, నేను మొఱ్ఱపెట్టినను నీవెన్నాళ్లు ఆలకింప కుందువు? బలాత్కారము జరుగుచున్నదని నేను నీకు మొఱ్ఱపెట్టినను నీవు రక్షింపక యున్నావు.3 నన్నెందుకు దోషము చూడనిచ్చుచున్నావు? బాధ నీవేల ఊరకయే చూచుచున్నావు? ఎక్కడ చూచినను నాశనమును బలా త్కారమును అగుపడుచున్నవి, జగడమును కలహమును రేగుచున్నవి.4 అందువలన ధర్మశాస్త్రము నిరర్థకమాయెను, న్యాయము ఎన్నడును జరుగకుండ మానిపోయెను, భక్తి హీనులు వచ్చి నీతిపరులను చుట్టుకొందురు, న్యాయము చెడిపోవుచున్నది.5 అన్యజనులలో జరుగునది చూడుడి, ఆలోచించుడి, కేవలము  విస్మయము నొందుడి. మీ దినములలో నేనొక కార్యము జరిగింతును, ఆలాగు జరుగునని యొకడు మీకు తెలిపినను మీరతని నమ్మకయుందురు.6 ఆలకించుడి, తమవికాని ఉనికిపట్టులను ఆక్రమించవలెనని భూదిగంతముల వరకు సంచరించు ఉద్రేకముగల క్రూరులగు కల్దీయులను నేను రేపు చున్నాను.

                       హబక్కూకు 1 

     ఇప్పటి వరకు ప్రవక్తలందరూ దేవుడు చెప్పిన మాటలు ప్రజలకు వినిపించారు. కానీ హబక్కూకు లో ఒక ‘రెబెల్’ మనకు కనిపిస్తున్నాడు. అయితే హబక్కూకు ప్రవక్త ప్రత్యేకత ఏమిటంటే, ఆయన దేవుని సందేశాన్ని ప్రజలకు వినిపించే ముందు దేవుని వైపుకు తిరిగి – దేవా, ఏంటి నీవు చేస్తున్న పని? నాకు ఏమీ అర్ధం కావటం లేదు. హబక్కూకు ప్రవక్త ఎన్నో ప్రశ్నలు అడుగుతున్నాడు. ఆ ప్రశ్నలు దేవునికి సంధించాడు. దేవా, ఎందుకు మౌనముగా ఉన్నావు? ఎటు చూసినా నాశనము, హింస, బలాత్కారం, కొట్లాటలు, తన్ను లాటలు. ఇవన్నీ చూసి నాకు ఎంతో బాధగా ఉంది. నువ్వు మాత్రం మౌనముగా ఉన్నావు. నా ఆక్రోశం నీకు చలనం కలిగించుట లేదా? నా బాధ నీకు కనిపించదా? నా ఆవేదన నీకు అర్థం కాదా? 

హబక్కూకు కు వచ్చిన ప్రశ్నలు మనకు కూడా వస్తూనే ఉంటాయి. ఈ పుస్తకములో హబక్కూకు చెప్పే సందేశం మనందరికీ ఆశీర్వాదకరముగా ఉంటుంది. ఈ పుస్తకములో 3 అధ్యాయాలు మాత్రమే ఉన్నాయి. ఇది మైనర్ ప్రొఫెట్స్ లో ఒక పుస్తకం. అంటే చిన్న ప్రవక్తల పుస్తకాలలో ఇది ఒకటి. 

    ఈ ప్రవక్త గురించి మనకు పెద్దగా తెలియదు. ఆయన జీవితం గురించి బైబిల్లో సమాచారం లేదు. ఇటలీ దేశములో డోనాటెల్లో అనే గొప్ప శిల్పి ఉండేవాడు. ఆయన క్రీ శ 1386 – 1466 ల మధ్య జీవించాడు. హబక్కూకు అనే శిల్పాన్ని డోనాటెల్లో చెక్కాడు. ప్రవక్తను బట్టతలతో చూపించాడు. ఆ శిల్పాన్ని ఎంత గొప్పగా చెక్కాడంటే, దానిని చూసి అప్పుడప్పుడూ, ‘హబక్కూకు, నీ నోరు తెరచి నాతో మాట్లాడు’ అని ఆ విగ్రహముతో అంటూ ఉండేవాడు. 

   హబక్కూకు జీవించి ఉన్నప్పుడు దేవుని ఎన్నో ప్రశ్నలు అడిగాడు. హబక్కూకు పడిన ఆవేదన మనకు అర్ధం కావాలంటే ఆయన జీవించిన పరిస్థితులను మనం చూడాలి. హబక్కూకు ప్రవక్త యూదా దేశములో జీవించాడు. యూదా దేశము క్రీ.పూ 586 లో బబులోను చెర లోనికి తీసుకొని వెళ్ళబడింది. దానికి ముందు హబక్కూకు ప్రవచించాడు. ఆయన జెఫన్యా, యిర్మీయా, దానియేలు, యెహెఙ్కేలు ప్రవక్తల కాలములో జీవించాడు. 

క్రీ.పూ 612: నినివే పతనం

    ఆ సమయములో అషూరు సామ్రాజ్యం తన ప్రాబల్యం కోల్పోతూ ఉన్నది. బబులోను చక్రవర్తులు బలపడుతూ ఉన్నారు. క్రీ.పూ 612 లో బబులోను వారు, మాదీయులతో చేతులు కలిపి అషూరు సామ్రాజ్యం రాజధాని నినివే నగరాన్ని చుట్టు ముట్టి దానిని ధ్వంసం చేశారు. ఆ సమయములో ఐగుప్తు రాజు నెకో I అషూరు సైన్యానికి సహాయం చేయాలని యూదా దేశము గుండా ప్రయాణిస్తున్నాడు. యూదా రాజైన యోషీయా నెకో రాజును ఆపాలని ప్రయత్నించాడు. మెగిద్దో నగరము వద్ద యోషీయా ఐగుప్తు రాజును ఎదుర్కొన్నాడు. ఆ యుద్ధములో యోషీయా రాజు తీవ్రముగా గాయపడి మరణించాడు. యూదా దేశము ఐగుప్తు కు బానిస దేశముగా మారింది. 

     క్రీ.పూ 605 లో బబులోను సామ్రాజ్యం వృద్ధి నెబుకద్నెజరు చక్రవర్తిగా మధ్య ప్రాశ్చాన్ని కబళించింది. కర్కెమీషు యుద్ధములో బబులోను చక్రవర్తి నెబుకద్నెజరు అషూరు సైన్యాన్ని కోలుకోలేని దెబ్బ తీశాడు. అటువంటి పరిస్థితుల్లో బబులోను ను వ్యతిరేకించడం అంటే నిప్పుతో చెలగాటం లాంటిదే. అయితే యూదా ఆ తప్పుడు నిర్ణయమే తీసుకొంది. యిర్మీయా ప్రవక్త హెచ్చరిక పట్టించుకోకుండా యూదా రాజులు బబులోను ను ప్రతిఘటించాలనే నిర్ణయం తీసుకొన్నారు. యోషీయా రాజు చేసిన ప్రమాద కరమైన నిర్ణయాన్నే ఆయన తరువాత వచ్చిన నలుగురు రాజులు – యెహోయాహాజు, యెహోయాకీము, యెహోయాకీను, సిద్కియా లు కూడా తీసుకొన్నారు. ఈ నలుగురు రాజులు దుష్ట పరిపాలన చేశారు. వీరి పాలనలో జరిగిన ఘోరాలు హబక్కూకు ప్రవక్తను తీవ్రముగా కలచివేశాయి. 

క్రీ.పూ 586, జూలై:యెరూషలేము నాశనం 

     చివరకు క్రీ.పూ 586 జూలై నెలలో నెబుకద్నెజరుయెరూషలేమును అగ్ని చేత దహించాడు. దేవుని ఆలయం బూడిద అయ్యింది. అది కూడా హబక్కూకు ను గొప్ప షాక్ కు గురి చేసింది. ఆ సమయములో హబక్కూకు ఈ పుస్తకము వ్రాశాడు. అనేక ప్రశ్నలతో ఈ పుస్తకం మొదలవుతున్నది. 

3 వచనం చూద్దాము: 3 నన్నెందుకు దోషము చూడ నిచ్చుచున్నావు? బాధ నీవేల ఊరకయే చూచుచున్నావు? ఎక్కడ చూచినను నాశనమును బలా త్కారమును అగుపడుచున్నవి, జగడమును కలహమును రేగుచున్నవి.తన చుట్టూ ఉన్న సమాజములో జరుగుతున్న హింస, రక్త పాతం హబక్కూకు ను కలవర పరచడం మనం చూస్తున్నాము. ఆయన దేవుని ప్రశ్నించాడు. దేవా, ఇవన్నీ చూసి నాకే ఇంత ఆవేదన కలుగుతున్నది. మరి నువ్వు ఏమి చేస్తున్నావు? వీటిని నీవు పట్టించుకోవా? నిశ్శబ్దం గా ఎలా ఉండగలుగు తున్నావు? 

   హబక్కూకు లో మనకు యోబు కనిపిస్తున్నాడు. యోబు కూడా సమస్తం కోల్పోయాడు. తన ఆస్తులు కోల్పోయాడు, తన బిడ్డలను కోల్పోయాడు, ఆరోగ్యం కోల్పోయాడు. దేవా, ఏంటి? ఏమి జరుగుతుంది నాకు? నువ్వు ఎక్కడ ఉన్నావు? అని యోబు దేవుని ప్రశ్నించాడు. యోబు ప్రశ్నలు వ్యక్తిగతమైనవి, హబక్కూకు ప్రశ్నలు సామాజిక మైనవి. 

2 అధ్యాయం మొదటి వచనం చూస్తే హబక్కూకు గోడ ఎక్కాడు. గోపురం మీద కూర్చుని చూస్తున్నాడు. ఆ టవర్ మీద నుండి చూస్తే ఆయనకు చుట్టుపక్కల జరుగుతున్న ఘోరాలు అన్నీ కనిపిస్తున్నాయి. యోబు తన గదిలో కూర్చుని ఉన్నాడు. ఆయనకు ఆయన బాధలతోనే సరిపోయింది. కానీ హబక్కూకు గోడ మీద ఎక్కాడు. ఆయనకు యెరూషలేము మొత్తం కనిపిస్తున్నది. ఒక బర్డ్’స్ ఐ వ్యూ ఒక పక్షి నేత్రం తో ఆయన తన సమాజాన్ని దానిలో జరుగుతున్న ఘోరాలు చూశాడు. ఈ రోజు మనకు ఒక శాటిలైట్ వ్యూ ఉంది. ఒక ప్రపంచ నేత్రం మనకు ఉంది. మన సమాజములో జరిగే హింసను చూసి మనం కూడా హబక్కూకు వలె ఆందోళన చెందుతాము. ఈ ఊరిలో ఒక కొడుకు  తల్లిని చంపాడు, ఆ ఊరిలో ఒక తల్లి కొడుకును చంపింది. 

ఈ ఊరిలో ఒక కొడుకు తండ్రిని హతమార్చాడు, ఆ వూరిలో ఒక తండ్రి కొడుకును హతమార్చాడు. కత్తులతో పొడుచుకోవటం, గొడ్డళ్లతో నరుక్కోవటం, బాంబులు, వేసుకోవటం తుపాకులతో కాల్చుకోవడం – ఇవన్నీ చూస్తే మనకు కూడా హబక్కూకు వలె దేవుని మీద కోపం రావచ్చు. దేవా, ఇవన్నీ నీకు కనిపించవా? 

   మనం కూడా కొన్ని సార్లు యోబు వలె,  హబక్కూకు వలె దేవుని ప్రశ్నిస్తాము. దేవుని ప్రశ్నించడం లో తప్పు లేదు. దేవుని నిశ్శబ్దం హబక్కూకు ఓపికకు పరీక్ష పెట్టింది. మనం అడిగే ప్రశ్నలకు కూడా దేవుడు జవాబులు ఇవ్వక పోవచ్చు. 

ఈ వ్యక్తికి క్యాన్సర్ ఎందుకు వచ్చింది? ఆయన ప్రమాదంలో ఎందుకు చనిపోయాడు? ఆ నిర్దోషి మీద నేరాలు ఎందుకు మోపారు? మా అమ్మాయికి పెళ్లి సంబంధాలు ఎందుకు రావటల్లేదు? మా అబ్బాయికి ఉద్యోగం ఎందుకు రావటల్లేదు? నాకెందుకు ప్రమోషన్ రావటల్లేదు? ఇలాంటి ప్రశ్నలు మన అందరికీ వస్తూనే ఉంటాయి. ఈ రోజు ఒక వ్యక్తి నన్ను అడిగాడు. యేసు క్రీస్తు నిజమైన దేవుడు అయితే ఎందుకు ఇంత మంది క్రైస్తవులు కరోనా తో చనిపోతున్నారు? అలాంటి ప్రశ్నలు రావడములో, అడగడములో ఎలాంటి తప్పు లేదు. ఆ సమయములో హబక్కూకు కు దేవుడు మరొక చెడు వార్త చెప్పాడు: 6 వచనం: భూదిగంతముల వరకు సంచరించు ఉద్రేకముగల క్రూరులగు కల్దీయులను నేను రేపు చున్నాను

నా ప్రజలైన ఇశ్రాయేలీయులను శిక్షించడానికి నేను బబులోను వారిని తీసుకువస్తున్నాను. ఆ మాట విని హబక్కూకు కు ఇంకా ఎక్కువ ఆవేదన కలిగింది. మూలిగే నక్క మీద తాటి కాయ పడినట్లు అయింది. నక్క మూలుగుతూ ఉంది. దాని మీద తాటి కాయ పడితే దాని పరిస్థితి ఇంకెంత దారుణముగా ఉంటుంది? 

దేవుని మాట హబక్కూకు కు ఏమాత్రం రుచించలేదు. ఏ దేశం బాగా లేదు అని బాధ పడుతున్నాను. ఈ దేశాన్ని బాగు చేయాలి కానీ అసలు ఈ దేశాన్నే లేకుండా నాశనం చేస్తాను అంటా వేమిటి? వీళ్ళే దుర్మార్గులు, బబులోను వారు వీరి కంటే దుర్మార్గులు వారి చేత వీరిని శిక్షించడం ఏమిటి? దేవాలయం బాగోలేదు అని నేను బాధ పడుతున్నాను, దానిని బాగు చేయాలి కానీ దానిని తగల బెడతాను అని ఎందుకు అంటున్నావు? 

హబక్కూకు అడిగిన ప్రశ్నలకు దేవుడు తనదైన శైలిలో సమాధానాలు ఇచ్చాడు. 

మనిషి ప్రశ్న : దేవుని నిశబ్దం

  1. దేవుని ప్రణాళిక – The Plan of God 

మొదటిగా, Plan of God దేవుడికి ఒక ప్లాన్ ఉంది. 5 వచనం చూద్దాము 

1:5 అన్యజనులలో జరుగునది చూడుడి, ఆలోచించుడి, కేవలము విస్మయమునొందుడి. మీ దిన ములలో నేనొక కార్యము జరిగింతును, ఆలాగు జరుగునని యొకడు మీకు తెలిపినను మీరతని నమ్మకయుందురు.

Acts 13:41 ఇదిగో తిరస్కరించువారలారా, ఆశ్చర్యపడుడి నశించుడి మీ దినములలో నేనొక కార్యము చేసెదను ఆ కార్యము ఒకడు మీకు వివరించినను మీరెంత మాత్రమును నమ్మరు అనెను.

   అంతియొకయ ప్రజలతో మాట్లాడుతూ, అపోస్తలుడైన పౌలు గారు హబక్కూకు 1:5 వారికి గుర్తు చేశాడు. దేవుడు ఒక గొప్ప కార్యము జరిగించబోవుచున్నాడు. యేసు క్రీస్తు అనే రక్షకుని ఈ లోకానికి పంపించబోవుచున్నాడు. ఆయన సిలువ రక్తము ద్వారా మనకు పాప క్షమాపణ, మారు మనస్సు అనుగ్రహిస్తున్నాడు. మనం యేసు క్రీస్తు స్వరూపం ధరించుకొంటే మన సమాజములో హింస, రక్తపాతం, మాన భంగాలు, అత్యాచారాలు, దోపిడీలు ఉండవు. 

2:14 ఏలయనగా సముద్రము జలములతో నిండియున్నట్టు భూమి యెహోవా మాహాత్మ్యమును గూర్చిన జ్ఞానముతో నిండియుండును.హబక్కూకు 2:14 

ఇప్పుడు మన ప్రపంచం సాతాను జ్ఞానముతో, సాతాను అధికారముతో నిండి ఉంది. అయితే, రాబోయే యేసు క్రీస్తు ప్రభువు పాలనలో ఈ లోకము దేవుని జ్ఞానముతో నిండి ఉంటుంది, ఈ ప్రపంచం దేవుని అధికారము క్రింద ఉంటుంది. దేవుడు ఈ ప్రపంచాన్ని మరచిపోలేదు. 

1941 డిసెంబర్ నెలలో జపాన్ సైన్యం ఫిలిప్పీన్ దేశమును ఆక్రమించుకొంది. ఫిలిప్పీన్స్ ప్రజలను వారు ఎన్నో హింసలు పెట్టారు. ఆహారం లేక ప్రజలు ఆకలితో అలమటించారు. కని పించిన ప్రతి జంతువును, పాములను సహా చంపుకొని తినాల్సిన దుర్గతి వారికి పట్టింది. అలాంటి సమయములో జనరల్ డగ్లస్ మ్యాక్ ఆర్థర్ వారిని దర్శించాడు. వారి దీన స్థితిని కళ్లారా చూశాడు. జపాన్ సైన్యం వారి మీద చేస్తున్న దౌర్జన్యాలను చూశాడు. వారిని విడిచి పెట్టి వెళ్లే ముందు వారితో ఒక మాట అన్నాడు. 

“నేను మళ్ళీ మీ కోసం వస్తాను’   ‘I shall return’ అన్నాడు. 

october 20, 1944 

తన సైన్యముతో ఫిలిప్పీన్స్ దేశం తిరిగి వెళ్ళాడు. 

ఫిలిఫ్ఫిన్స్ ప్రజలారా, నేను తిరిగి వచ్చాను 

“People of the Philippines, I have returned!” 

తన సైన్యముతో జపాన్ సైన్యాన్ని ఓడించి ఫిలిప్పీన్స్ ప్రజలను డగ్లస్ మ్యాక్ ఆర్థర్ విడిపించాడు. యేసు క్రీస్తు ప్రభువు కూడా నేను మీ కోసం మళ్ళీ వస్తాను అనే వాగ్దానముతో మన యొద్ద నుండి పరలోకం వెళ్ళాడు. తన పరలోక సైన్యముతో ఆయన మనలను విడిపించుటకు తిరిగి వస్తాడు. అది ప్రణాళిక యొక్క ముఖ్య లక్ష్యం. 

2. రెండోది Presence of God 

2. దేవుని సన్నిధి – The Presence of God

2 అధ్యాయం, 20 వచనం 

2:20

అయితే యెహోవా తన పరిశుద్ధాలయములో ఉన్నాడు, ఆయన సన్నిధిని లోకమంతయు మౌనముగా ఉండును గాక

                హబక్కూకు 2:20 

దేవుడు ఎక్కడికీ పారిపోలేదు. ఆయన తన  పరిశుద్ధాలయములోనే ఉన్నాడు. ఆయన తన సింహాసనం మీదే ఉన్నాడు. మనం ఆయన సన్నిధిని మౌనముగా, 

ఓపికతో ఉండాలి. మన ప్రశ్నలకు దేవుడు సమాధానం ఇవ్వకపోవచ్చు, అయితే ఆయన సన్నిధిని మాత్రం దేవుడు మనకు మెండుగా అనుగ్రహిస్తున్నాడు. దేవుని కార్యాలు మనకు అర్ధం కాకపోయినా దేవుని సన్నిధి మాత్రం మనకు ఎల్లప్పుడూ లభ్యమవుతుంది. 

3. Power of God 

మూడోదిగా దేవుని శక్తి. 3 అధ్యాయం, 3 వచనం చూద్దాము 

3 దేవుని మహిమ ఆకాశ మండలమంతటను కనబడు చున్నది భూమి ఆయన ప్రభావముతో నిండియున్నది.

4 సూర్యకాంతితో సమానమైన ప్రకాశము కనబడు చున్నది ఆయన హస్తములనుండి కిరణములు బయలువెళ్లు చున్నవి. అచ్చట ఆయన బలము దాగియున్నది.

5 ఆయనకు ముందుగా తెగుళ్లు నడుచుచున్నవి. ఆయన పాదముల వెంట అగ్ని మెరుపులు వచ్చు చున్నవి

6 ఆయన నిలువబడగా భూమి కంపించును

నా శక్తిని చూడు అని దేవుడు హబక్కూకు ప్రవక్తతో అంటున్నాడు. ఈ విశ్వము మొత్తం దేవుని యొక్క గొప్ప శక్తిని చూపిస్తుంది. ఆయన చేతిలో బలము దాగి ఉంది. మనకు శ్రమలు వచ్చినప్పుడు దేవా, నాకు సహాయం చేసే శక్తి నీకు ఉందా? అని మనకు అనిపించడం సహజం. రెండో ప్రపంచ యుద్ధం జరుగుతున్న సమయములో హిట్లర్ యూదుల మీద  విరుచుకుపడ్డాడు. ఎలీ విసుల్ అనే యూదు యువకుడు ఉన్నాడు. ఆయన కుటుంబ సభ్యులను హిట్లర్ అధికారులు హతమార్చారు. ఎలీ విసుల్ ని కూడా తీసుకొని వెళ్లి ఒక కాన్సంట్రేషన్ క్యాంపు లో పడేశారు. ఆయన జీవితం తలక్రిందులయ్యింది. ఆయనకు దేవుని మీద చాలా కోపం వచ్చింది. ఆయన ఒక ప్రార్ధన  చేసాడు, ‘దేవా, నీకు చేతకాక పొతే తప్పుకో, నీ కన్నా సమర్ధుని నీ కూర్చీలో కూర్చో పెట్టు’ 

Elie Wiesel said of the God, “If that’s who God is, why doen’t he resign and let someone more competent take his place?

ఈ ప్రపంచాన్ని బాగుచేసే శక్తి, సామర్ధ్యం దేవునికి లేవు అనుకొనే వారు చాలా మంది ఉన్నారు. అయితే దేవునికి శక్తి లేక కాదు. దేవుని శక్తి ఆయన ప్రణాళిక ప్రకారం పనిచేస్తుంది. యేసు క్రీస్తు ప్రభువును సిలువ వేస్తున్నప్పుడు ఆయనను రక్షించే శక్తి దేవునికి లేదా? తన కుమారుని రోమన్ సైనికుల మధ్య లో నుండి విడిపించి, తీసుకొని వెళ్లే శక్తి దేవునికి ఉంది. అయితే దేవుడు ఆ శక్తిని బయట పెట్టకుండా నిశబ్దముగా చూస్తూ ఉన్నాడు. ఎందుకంటే, తన కుమారుని మరణం ద్వారా మనకు విమోచన అనుగ్రహించాలని దేవుని ప్రణాళిక. 

  హబక్కూకుకు దేవుడు ప్రకృతిలో ఉన్న తన శక్తిని చూపిస్తున్నాడు. యోబుకు కూడా దేవుడు ప్రకృతి లో, సృష్టిలో ఉన్న తన శక్తిని చూపించాడు. కాబట్టి దేవుని ప్రణాళిక, దేవుని సన్నిధి, దేవుని శక్తి ఈ మూడింటినీ గుర్తు పెట్టుకొని విశ్వాసి ముందుకు వెళ్ళాలి. 

  హబక్కూకు అడిగిన ప్రశ్నలకు దేవుడు సమాధానాలు ఇవ్వలేదు. ‘హబక్కూకు, నాకు ఒక ప్లాన్ ఉంది అని గుర్తుపెట్టుకో, నా సన్నిధిని గుర్తుపెట్టుకో నా శక్తిని గుర్తుపెట్టుకో’ అన్నాడు. 

    హబక్కూకు అనే పేరుకు  ‘హత్తుకొనుము’ అని అర్ధం పేరుకు తగ్గట్లుగానే  హబక్కూకు విశ్వాసముతో దేవుని హత్తుకున్నాడు. 2 అధ్యాయం, 4 వచనం 

నీతిమంతుడు విశ్వాసము మూలముగ బ్రదుకును

ఎంత గొప్ప మాటలు! 

నీతి మంతుడు విశ్వాస మూలముగా బ్రతుకును

          the just shall live by faith

                 హబక్కూకు 2:4

మన చూసేవి, వినేవి, అడిగేవి, ఆలోచించేవి చాలా విషయాలు మనకు అర్థంకాకపోవచ్చు. అయితే దేవుని యందు విశ్వాసముతో మనం బ్రతుకుతున్నాము. రక్షణ పొందాలంటే ప్రభువైన యేసు క్రీస్తు నందు మనం విశ్వాసము ఉంచాలి. జీవన ప్రయాణములో కూడా విశ్వాసము కీలకమైనది. విశ్వాసము లేకుండా మనం ముందుకు వెళ్లలేము. 

3 అధ్యాయములో చూస్తే, హబక్కూకు ప్రవక్త ప్రార్ధన చేస్తున్నాడు. ఆయన కీర్తనలతో దేవుని స్తుతిస్తున్నాడు. 17 వచనం చూద్దాము: 

17 అంజూరపు చెట్లు పూయకుండినను ద్రాక్షచెట్లు ఫలింపకపోయినను ఒలీవచెట్లు కాపులేకయుండినను చేనిలోని పైరు పంటకు రాకపోయినను గొఱ్ఱలు దొడ్డిలో లేకపోయినను సాలలో పశువులు లేకపోయినను

18 నేను యెహోవాయందు ఆనందించెదను నా రక్షణకర్తయైన నా దేవునియందు నేను సంతో షించెదను.

19 ప్రభువగు యెహోవాయే నాకు బలము ఆయన నా కాళ్లను లేడికాళ్లవలె చేయును ఉన్నతస్థలములమీద ఆయన నన్ను నడవచేయును.

   హబక్కూకు ప్రవక్త పరిస్థితులను చూస్తూ ఈ పుస్తకం మొదలుపెట్టాడు. దేవా, ఇదేంటి, అదేంటి అని అనేక ప్రశ్నలతో గందర గోళం చెందాడు. అయితే తన పరిస్థితులను చూడకుండా దేవుని వైపు చూచుచూ ఈ పుస్తకం ముగించాడు. 

17 అంజూరపు చెట్లు పూయకుండినను ద్రాక్షచెట్లు ఫలింపకపోయినను ఒలీవచెట్లు కాపులేకయుండినను చేనిలోని పైరు పంటకు రాకపోయినను గొఱ్ఱలు దొడ్డిలో లేకపోయినను సాలలో పశువులు లేకపోయినను 18 నేను యెహోవాయందు ఆనందించెదను నా రక్షణకర్తయైన నా దేవునియందు నేను సంతో షించెదను.19 ప్రభువగు యెహోవాయే నాకు బలము ఆయన నా కాళ్లను లేడికాళ్లవలె చేయును. ఉన్నతస్థలములమీద ఆయన నన్ను నడవచేయును.

    హబక్కూకు ప్రవక్త అనేక ప్రశ్నలకు సమాధానం లేనప్పటికీ దేవుని ప్రణాళిక ను నమ్మాడు, దేవుని సన్నిధిలో సేద దేరాడు, దేవుని శక్తి మీద ఆధారపడ్డాడు, క్రీస్తు వైపు చూచుచూ విశ్వాసముతో ముందుకు సాగాడు. అదే నేటి మా ప్రేమ సందేశం. 

Leave a Reply