అణు విధ్వంసం: బైబిల్ ప్రవచనాల్లో ప్రపంచ అంతం

  

ఈ వారం నేను అణువు గురించి ఆలోచిస్తూ ఉన్నాను. ఆ తలంపులు కొన్ని ఈ రోజు మీతో పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను. ‘అణువు’ atom. ఎంతో ఆశ్చర్యకరమైన వస్తువు. ఈ విశ్వం అణువులతో ఏర్పడింది. మన శరీరం అణువులతో ఏర్పడింది. మన చుట్టూ ఉన్న వస్తువులు అన్నీ అణువులతో నిర్మించబడ్డాయి. గ్రీకు తత్వవేత్తలు డెమోక్రిటస్, లూసిప్పస్ అణువు గురించి ఊహించారు. వేలాది సంవత్సరాలు అణువు గురించి మానవ సమాజం పట్టించుకోలేదు. దానిని ఒక కల్పిత ఆలోచన గా కొట్టేవేశారు. 

   అయితే ఆధునిక యుగములో సైంటిస్టులు అణువు నిజమైనది అని నిరూపించారు. ఈ రోజు స్కానింగ్ టన్నెల్ మైక్రోస్కోప్ ల ద్వారా మనిషి అణువులను చూడ గలుగు తున్నాడు. అణు నిర్మాణాన్ని అర్థం చేసుకొన్నాడు. అణువు లో ఉన్న శక్తిని తెలుసుకొన్నాడు. అనేక అణువులను కనుకొని పీరియాడిక్ టేబుల్ తయారు చేయగలిగాడు. ఈ పీరియాడిక్ టేబుల్ లో ఉన్న అణువులను అనేక రకాలుగా కలిపి అనేక రకాలయిన వస్తువులను మనిషి తయారుచేయ గలిగాడు. చాకలెట్లు, ఐస్ క్రీమ్ లు మొదలుకొని పెద్ద పెద్ద విమానాలు, సూపర్ కంప్యూటర్ లు అంతరిక్ష వాహనాలు అణువులతో నిర్మించబడినవే. ఒక రసాయనిక చర్యను మనం గమనిస్తే అణువులు ఎంత నిర్దిష్టమైన, ఖచ్చితమైన రీతిలో అవి పనిచేస్తాయో అర్థం అవుతుంది. అణు గడియారాలు సమయాన్ని మైక్రో సెకండ్ల తో సహా మనకు తెలియజేస్తాయి. 5జి లాంటి ఆధునిక సాంకేతికత అణువు మీద ఆధార పడాల్సిందే. అణువులో ఉన్న శక్తిని బయటికి తీసి ఎలక్ట్రిసిటీ గా మనం ఉపయోగించుకొంటున్నాము. అణు శక్తితో జలాంతర్గాములు పనిచేస్తున్నాయి. ఏక అణువులతో కంప్యూటర్ చిప్స్, ట్రాన్సిస్టర్స్ చేయగలుగుతున్నారు. వీటి ఆధారముగా కనీ వినీ ఎరుగని వేగముతో పనిచేసే సూపర్ కంప్యూటర్స్, క్వాంటమ్ కంప్యూటర్స్ చేయగలుగు తున్నారు. 

     ఒక MRI మెషిన్ చూడండి. మన శరీరములో వ్యాధులను కనిపెట్టే శక్తి దానికి ఉంటుంది. అణువు లో ఉండే ప్రోటాన్లు అన్నిటినీ కొన్ని క్షణాల పాటు స్తంభింపజేసి మనం శరీరాన్ని మనం స్కాన్ లు తీయవచ్చు. అణువు నిర్మాణం అర్థం చేసుకోవటం వలనే ఇటువంటి ఆధునిక వైద్య చికిత్సలు మనకు అందుబాటు లోకి వచ్చినాయి. అణువులను మార్పులకు గురిచేసి, కణములో జరిగే జీవ ప్రక్రియలను క్రొత్త మార్గాల్లో నడిపిస్తూ అనేక రకాలయిన మందులు, వాక్సిన్ లు చేయగలుగుతున్నారు.  

    మరో పక్క, మనలను భయపెట్టే శక్తి కూడా అణువుకు ఉంది. హిరోషిమా, నాగ సాకీ, చెర్నోబిల్, ఫుకుషిమా లాంటి పేరులు వినిపిస్తే అణు శక్తి యొక్క భయానకమైన రూపం మన కళ్ళ ముందు మెదలుతుంది. రెండో ప్రపంచ యుద్ధము ముగింపులో జపాన్ దేశము లో హిరోషిమా, నాగసాకి నగరాల మీద అణు బాంబులు ప్రయోగించబడ్డాయి. 

వేలాది మంది ప్రజలు ఆ అణుబాంబుల వేడిలో మాడి మసి అయిపోయారు. లక్షల మంది అణు ధార్మికత వలన అనేక రోగాలకు గురయ్యారు. కొన్ని రోజుల క్రితం చైనా దేశం హైపర్ సోనిక్ అంతరిక్ష క్షిపణి ప్రయోగం చేసింది. ధ్వని వేగం కంటే 5 రెట్లు వేగముగా ప్రయాణించే ఈ క్షిపణి అంతరిక్షం లోకి దూసుకొని వెళ్లగలదు. అక్కడ నుండి ఏ దేశం మీదకు అయినా అవి దాడి చేయగలవు. వాటి మీద అమర్చిన అణు బాంబులు హిరోషిమా, నాగ సాకి ల మీద ప్రయాగించబడిన అణు బాంబుల కంటే ఎన్నో రెట్లు శక్తి కలవి. అణువు లోపల దేవుడు ఉంచిన ఈ గొప్ప శక్తిని మనిషి తన దుష్టత్వానికి, విధ్వంసాలకు వాడుకొంటున్నాడు. అమెరికా, చైనా దేశాల మధ్య గొప్ప పోరాటం ఇప్పుడు మొదలయ్యింది. ప్రపంచ ఆధిపత్యం కోసం వారిద్దరూ పోటీ పడుతున్నారు. అణు శక్తిని సరిగ్గా ఉపయోగించుకొనే వాడే ప్రపంచ భవిష్యత్తును శాసించ గలడు. 

    అణువు ను అర్థం చేసుకొనే మేథస్సును దేవుడు మనిషికి ఇచ్చాడు. గణిత శాస్త్రం అణు పరిశోధనల్లో ఎంతో ఉపయోగ పడింది. సర్ ఐజాక్ న్యూటన్ గొప్ప భౌతిక శాస్త్రవేత్త. భౌతిక ప్రపంచం అర్థం చేసుకోవాలంటే గణిత శాస్త్రం చాలా ముఖ్యం అని ఆయన గ్రహించాడు. క్యాలి క్యులస్ కనుకొన్నాడు. గణిత శాస్త్రం ఆధారముగా న్యూటన్ అణువులు ఉన్నాయని ప్రతిపాదించాడు. తన శక్తిని ప్రకృతిలో ఉంచిన దేవునికి న్యూటన్ స్తుతులు చెల్లించాడు. ఇంగ్లాండ్ దేశములోని కేంబ్రిడ్జి యూనివర్సిటీ లో గణిత శాస్త్రాన్ని ఆయన బోధించాడు. 

    జోసెఫ్ ప్రీస్ట్ లీ (1733 – 1804). ఒక ప్రక్క పాస్టర్ గా, మరొక ప్రక్క సైంటిస్ట్ గా ఆయన పనిచేశాడు. ఐజాక్ న్యూటన్ వలె  జోసెఫ్ కూడా దేవుని యందు విశ్వాస ముంచాడు. ప్రకృతి ని పరిశీలిస్తే దేవుని సృష్టి కార్యాలు మనకు అర్థం అవుతాయి అని ఆయన నమ్మాడు. గాలి మొత్తం ఒకే వాయువుతో నిండి ఉంది అని ఆ రోజుల్లో భావించేవారు. అయితే గాలిలో అనేక వాయువులు ఉన్నాయని జోసెఫ్ ప్రీస్ట్ లీ నిరూపించాడు. ఆక్సిజన్ వాయువును ఆయన కనుగొన్నాడు. అణువు యొక్క అన్వేషణలో ప్రపంచం మరొక ముందడుగు వేసింది. 

     ఆయన తరువాత చెప్పుకొనదగిన సైంటిస్ట్ జాన్ డాల్టన్ (1766 – 1844). ఆయన ఒక రసాయనిక శాస్త్రవేత్త. పదార్ధాలు ఒక నిర్దిష్ట నిష్పత్తి చొప్పున ఒక దానితో ఒకటి కలిసి రసాయనిక చర్యలు కలిగించడం ఆయన గమనించాడు. 100 గ్రాముల టిన్ ఒక రసాయనిక చర్యలో 13.5 గ్రాముల ఆక్సిజన్ తో కలిస్తే, అదే 100 గ్రాముల టిన్ మరొక రసాయనిక చర్యలో 27 గ్రాముల ఆక్సిజన్ తో కలిసింది. 

13.5/27  = 1:2 నిష్పత్తి ని ఆయన చూశాడు. దానిని బట్టి ఒక నిర్దిష్టమైన రేషియో లో ఇతర పదార్ధాలతో కలిసే శక్తి ఆక్సిజన్ కి ఉందని డాల్టన్ గ్రహించాడు. దీనిని బట్టి ఆక్సిజన్ అణువులు కలిగి ఉండాలి అని డాల్టన్ ప్రతిపాదించాడు. అప్పటి వరకు అణువులను ఎవరూ చూడలేదు. అయినప్పటికీ అణువులు ఉన్నాయి అని జాన్ డాల్టన్ అణు సిద్ధాంతము వ్రాశాడు. అది సైన్స్ లో ఒక గొప్ప మైలు రాయి. ఆయన తరువాత అణు పరిశోధన లో చెప్పు కొనదగిన గొప్ప సైంటిస్ట్ రాబర్ట్ బ్రౌన్ (1773 – 1858). ఆయన ఒక బొటనిస్ట్. చెట్లను, పువ్వులను ఆయన అధ్యయనం చేస్తున్నాను.పరిశోధనలో భాగముగా ఒక రోజు తన మైక్రో స్కోప్ లో ధాన్యం యొక్క బీజ రేణువు లను చూస్తూ ఉన్నాడు. ఆ రేణువులు నీటిలో పడినప్పుడు చాలా వేగముగా కదలడం ఆయనకు ఆసక్తి కలిగించింది. దానికి బ్రౌనియన్ మోషన్ Brownian Motion/ బ్రౌనియన్ కదలికలు అనే పేరు వచ్చింది. ఈ రేణువులు ఎందుకు ఇంత వేగముగా కదులు తున్నాయి అనే ప్రశ్న సైంటిస్టులను వేధించింది. ప్రఖ్యాత సైంటిస్ట్ ఆల్బర్ట్ ఐన్ స్టయిన్ ఆ చిక్కు ముడి విప్పాడు. ఆల్బర్ట్ ఐన్ స్టయిన్ మరొక సైంటిస్ట్ జేమ్స్ క్లార్క్ మాక్స్ వెల్ (1831 – 1879)పరిశోధనల మీద ఆధారపడ్డాడు. ఆయన 1831 – 1879 సంవత్సరముల మధ్య స్కాట్లాండ్ దేశములో జీవించాడు. ఒక మంచి క్రైస్తవ కుటుంబములో ఆయన పెరిగాడు. 

    జేమ్స్ బైబిల్ లో అధ్యాయాలకు అధ్యాయాలు కంఠస్తం చేసి గుర్తుపెట్టుకొన్నాడు. ఎనిమిది సంవత్సరాల వయస్సులో 119 కీర్తన మొత్తం కంఠస్తం చేసాడు. బైబిల్ గ్రంథములో అది పెద్ద అధ్యాయం కంఠస్తం చేయడం అంటే సామాన్య మైన విషయం కాదు కదా. 

   ‘ప్రకృతి ని చూడు, దాని వెనుక ఉన్న దేవుని జ్ఞానం చూడు’అని జేమ్స్ తల్లి అతనికి చిన్నప్పటి నుండి బోధించింది. ఆ మాటలు జేమ్స్ ని ఎంతో ప్రభావితం చేసినవి. ఆ రోజుల్లో విద్యుత్ శక్తి, అయస్కాంత శక్తి ఆ రెండిటినీ వేరు, వేరుగా చూసేవారు. అవి రెండు ఒకటే నని జేమ్స్ మాక్స్ వెల్ గ్రహించాడు. తన పరిశోధనల ఆధారముగా గొప్ప ఈక్వేషన్ లు వ్రాసాడు. ఆ ఈక్వేషన్ లు గొప్ప విప్లవం సృష్టించాయి. జేమ్స్ క్లార్క్  మాక్స్ వెల్ ను చాలా గొప్ప శాస్త్రవేత్తగా నిలబెట్టాయి. 18 శతాబ్దం న్యూటన్ కి చెందితే, 20 శతాబ్దం ఆల్బర్ట్ ఐన్ స్టయిన్ కి చెందితే, 19 శతాబ్దం జేమ్స్  క్లార్క్  మాక్స్ వెల్ కు చెందుతుంది. 

   ఆయన పరిశోధనలు మన ప్రపంచాన్ని సమూల మార్పులకు గురి చేశాయి. ఆయన ఎలక్ట్రో మాగ్నెటిజం తరంగముల వలన రేడియో కనిపెట్టారు. టెలివిజన్ కనిపెట్టారు. కలర్ టెలివిజన్ కనిపెట్టారు. విమాన ప్రయాణం లో ప్రమాదాలు తగ్గించిన రాడార్ లు కనిపెట్టారు. పైలట్లు విమానం నడిపేటప్పుడు వాడే పరికరాలు జేమ్స్ పరిశోధనల వలనే తయారు చేయబడ్డాయి. పెద్ద పెద్ద బ్రిడ్జి లు, డ్యామ్ లు నిర్మించడం వీలు పడింది. ఈ డ్యామ్ లలో పెద్ద, పెద్ద టర్బయిన్ లు ఉంచి విద్యుత్ ను సృష్టించి, అనేక ప్రాంతాలకు దానిని సరఫరా చేసి మానవ జీవితాన్ని సమూలంగా మార్చి వేసింది. కరంట్ లేకపోతే బ్రతక గలమా అనే పరిస్థితికి ఈ రోజు మనం వచ్చాము. 

    జేమ్స్  క్లార్క్  మాక్స్ వెల్ మరొక గొప్ప విప్లవం: గణిత శాస్త్రం నియమాల ద్వారా, తన ఈక్వేషన్ ల ద్వారా మన కంటికి కనిపించని వాటిని కూడా మనం అర్ధం చేసుకోవచ్చు. మన కంటికి కనిపించని అణువులు, పరమాణువులు, బ్లాక్ హోల్స్ వాటిని కూడా మనం గణిత శాస్త్రం ద్వారా చూడవచ్చు. అణువు నిజమైనది అని ఆయన సిద్ధాంతాలు నిరూపించాయి. అంత మాత్రమే కాకుండా అణువు లోపల ఇంకా ఏ కణాలు ఉన్నాయి అనే విషయాలు మనిషి గ్రహించగలుగు తున్నాడు. దేవుని మీద విశ్వాసముతో సైన్స్ లో అడుగుపెట్టిన  ఒక క్రైస్తవ సైంటిస్టు ఎంత గొప్ప పరిశోధనలు చేస్తాడో, ఈ ప్రపంచాన్ని ఎంత మార్పులకు గురిచేస్తాడో  జేమ్స్  క్లార్క్  మాక్స్ వెల్ ను చూస్తే మనకు అర్థం అవుతుంది. ఆల్బర్ట్ ఐన్ స్టయిన్ తన టేబుల్ మీద జేమ్స్  క్లార్క్  మాక్స్ వెల్ ఫోటో పెట్టుకొనేవాడు. అటు రాబర్ట్ బ్రౌన్, ఇటు జేమ్స్  క్లార్క్  మాక్స్ వెల్ ఇద్దరి పరిశోధనలను ఆధారం చేసుకొని ఆల్బర్ట్ ఐన్ స్టయిన్ నిజమైనవి అనే నమ్మకం అందరికీ కలిగించాడు. 

     1905 సంవత్సరం – ఆల్బర్ట్ ఐన్ స్టయిన్ (1879-1955) అద్భుత సంవత్సరం అని పిలువబడింది. ఎందుకంటే ఆ సంవత్సరం సైన్స్ ని గొప్ప మార్పులకు గురి చేసిన 5 పరిశోధన పత్రాలు ఐన్ స్టయిన్ ప్రచురించాడు. వాటిలో ఒక పేపర్ లో ఐన్ స్టయిన్ బ్రౌనియన్ మోషన్ ని వివరించాడు. నీటిలో కదులు తున్న ఆ బీజ రేణువులు అణువులు నీటితో జరుపుతున్న భౌతిక చర్యల వలనే కలిగిస్తున్నాయి అని ఐన్ స్టయిన్ నిరూపించాడు. 1905 లోనే  ఆల్బర్ట్ ఐన్ స్టయిన్ ‘స్పెషల్ థియరీ అఫ్ రెలెటివిటీ’ ప్రత్యేక సాపేక్ష సిద్ధాంతము అనే మరొక పరిశోధన వ్యాసం కూడా ప్రచురించాడు. దాని ప్రకారం సమయము, స్థలము రెండూ కలిసే ఉన్నాయి. ఆ రెండూ వేరు, వేరు కాదు. కాలం స్థిరమైనది కాదు. మన ఉనికిని, మన సమయాన్ని మనం వేరు చేయలేము. అణువు, సమయము, స్థలం ఈ మూడు వేరు వేరు కాదు, అవి ఒక దానితో ఒకటి పెనవేసుకుని ఉన్నాయి అని ఆల్బర్ట్ ఐన్ స్టయిన్ నిరూపించాడు. 

   అణువులు నిజమైనవి అని ఆ తరువాత కొద్ది కాలానికే ఆధారములతో సహా నిరూపించబడింది. అణువు మాత్రమే కాకుండా దాని లోపల ఉండే ఎలెక్ట్రాన్ లు, ప్రోటాన్ లు, న్యూట్రాన్ లు, క్వార్క్ లు, మూవన్ లు, లెప్టాన్ లు, మొదలైన క్రొత్త క్రొత్త కణాలు ఇప్పుడు బయట పడుతున్నాయి. అణువు లోపల దేవుడు ఉంచిన గొప్ప శక్తి ని మనిషి అనేక రకాలుగా ఉపయోగించు కొంటున్నాడు. బైబిల్ ప్రవచనాల్లో చూస్తే దేవుడు ఈ విశ్వాన్ని చివరకు ఒక అణు విధ్యంసము లోనే అంతం చేస్తాడు అనే సత్యం మనకు అర్థం అవుతుంది. 

     2 పేతురు పత్రిక 3 అధ్యాయం లో నుండి కొన్ని మాటలు మనం చూద్దాము . 8 వచనం నుండి చదువుదాము. 

8 ప్రియులారా, ఒక సంగతి మరచిపోకుడి. ఏమనగా ప్రభువు దృష్టికి ఒక దినము వెయ్యిసంవత్సరములవలెను, వెయ్యిసంవత్సరములు ఒక దినమువలెను ఉన్నవి.9 కొందరు ఆలస్యమని యెంచుకొనునట్లు ప్రభువు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాడు గాని యెవడును నశింపవలెనని యిచ్ఛయింపక, అందరు మారుమనస్సు పొందవలెనని కోరుచు, మీ యెడలధీర్ఘశాంతముగలవాడై యున్నాడు.10 అయితే ప్రభువు దినము దొంగవచ్చినట్లు వచ్చును. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించి పోవును,పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోవును,భూమియు దానిమీద ఉన్నవన్నియు 11  ఇట్లు లయమై పోవునవి గనుక, ఆకాశములు రవులుకొని లయమైపోవు నట్టియు, పంచభూతములు మహావేండ్రముతో కరిగిపోవు నట్టియు,12 దేవుని దినపు రాకడకొరకు కనిపెట్టుచు, దానిని ఆశతో అపేక్షించుచు, మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోను భక్తితోను ఎంతో జాగ్రత్తగలవారై యుండవలెను.

                2 పేతురు 3:8-12 

     ఇక్కడ అపోస్తలుడైన పేతురు గారు ఈ విశ్వం ఏ విధముగా అంతం చెందుతుందో ఎంతో వివరముగా వ్రాశాడు. 

Time – Space – Atom (Matter) 

సమయము – అంతరిక్షం – అణువు 

   దేవుడు ఈ మూడింటినీ ఒకే సారి సృష్టించాడు. ఆది కాండము మొదటి అధ్యాయములో మనం ఆ సత్యాలు చదువుతాము. ఈ మూడింటినీ దేవుడు ఒక దానితో ఒకటి వేరు చేయలేని విధముగా సృష్టించాడు. భవిష్యత్తులో దేవుడు ఈ మూడింటినీ ఒకే సారి నాశనం చేస్తున్నాడు. 

   మొదటిగా సమయము: 

8 వచనము చూద్దాము: ఏమనగా ప్రభువు దృష్టికి ఒక దినము వెయ్యిసంవత్సరములవలెను,  వెయ్యిసంవత్సరములు ఒక దినమువలెను ఉన్నవి.10 అయితే ప్రభువు దినము దొంగవచ్చినట్లు వచ్చును. 

  దేవుని దృష్టికి ఒక దినము వెయ్యి సంవత్సరముల వలె ఉంది. వెయ్యి సంవత్సరములు ఒక దినము వలె ఉన్నాయి.  సమయాన్ని దేవుడు, మనం ఒకే విధముగా చూడలేము. మనం సమయములో బంధించ బడి ఉన్నాము. అయితే దేవుడు సమయము బయట ఉన్నాడు. ఆయన దృష్టికి వెయ్యి సంవత్సరాలు ఒక రోజు వలె ఉన్నాయి.

ఆదాము 6 రోజుల క్రితమే జీవించాడు. 

అబ్రహాము 4 రోజుల క్రితమే జీవించాడు. 

దావీదు 3 రోజుల క్రితమే జీవించాడు. 

ప్రభువైన యేసు క్రీస్తు 2 రోజుల క్రితమే జీవించాడు. 

మార్టిన్ లూథర్ సేవ చేసింది కొన్ని గంటల క్రితమే. 

చార్లెస్ స్పర్జన్ సేవ చేసింది కొన్ని నిమిషాల క్రితమే. 

   సమయము దేవుని దృష్టికి వేరుగా ఉంది. ఈ మాటలు చదివే టప్పుడు ఆల్బర్ట్ ఐన్ స్టయిన్ ను జ్ఞాపకం చేసు కోకుండా ఉండలేము. ఆయన యూదా మతస్తుడు. ఆయనకు పాత నిబంధన తెలుసు. ఈ సత్యం 90 కీర్తన లో వ్రాయబడింది. ప్రభువా, తరతరములనుండి మాకు నివాసస్థలము నీవే.నీ దృష్టికి వేయి సంవత్సరములు గతించిన నిన్నటివలె నున్నవి రాత్రియందలి యొక జామువలెనున్నవి.

                కీర్తన 90:4 

    దేవుడు మనవలె సమయమును చూడడు అని బైబిల్ చదివిన వారికి ముందే తెలుసు. 

10 వచనం చూద్దాము: 

అయితే ప్రభువు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో  గతించి పోవును

       2 పేతురు 3:10 

ప్రభువు దినము అంటే దేవుని తీర్పు దినం. మన ప్రపంచానికి, మానవ చరిత్రకు, ఈ విశ్వానికి అది చివరి దినం. ఆ రోజున దేవుడు సమయమునకు కూడా ముగింపు పలుకుతాడు. ఆ తరువాత సమయం ఉండదు. అందరూ నిత్యత్వము లోకి ప్రవేశిస్తారు.

రెండోది స్పేస్. అంత రిక్షం. 

“ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించి పోవును”

   ఆకాశములు అంటే అంతరిక్షం. అది కూడా ఆ రోజు అంతం చెందుతుంది, మహా ధ్వనితో అది గతించి పోతుంది. 

మూడోది అణువు

10 వచనం 

ఆ దినమున పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోవును, భూమియు దానిమీద ఉన్నవన్నియు లయమై పోవును

           2 పేతురు 3:8-12

   ఇక్కడ పంచ భూతములు అనే మాట వాడాడు. గ్రీకు భాషలో అపోస్తలుడైన 

పేతురు గారు stoicheia అనే పదం వాడాడు. 

Stoicheia kausoumena teketai

   Stoicheia అంటే వరుసలో అమర్చబడినవి. అంటే అణువులు అని మనకు అర్ధం అవుతుంది. ఒక స్కానింగ్ టన్నెలింగ్ ఎలెక్ట్రాన్ మైక్రోస్కోప్ ద్వారా చూస్తే అణువులు వరుసలు, వరుసలుగా మనకు కనిపిస్తాయి. దీనిని బట్టి stoicheia అనే మాటకు అణువులు అని మనకు అర్థం అవుతున్నది. ఈ అణువులు మొత్తం ఆ రోజున మహా వేండ్రముతో కరిగి పోయి మాయమైపోతాయి. దేవుని మహా ఉగ్రత దినం రోజున ఆ విధముగా మన విశ్వం అంతరించి పోతుంది. వేలాది సంవత్సరములుగా అణువు ను అర్థం చేసుకోవటానికి మనిషి ప్రయత్నిస్తున్నాడు. డెమోక్రిటస్ తో మొదలయిన ఆ గొప్ప ప్రయత్నం ఆధునిక యుగములో ఫలించింది. ఆల్బర్ట్ ఐన్ స్టయిన్ మరొక అడుగు వేసి, సమయం, అంత రిక్షం అణువులు – ఈ మూడూ కలిసే ఉన్నాయి అని శాస్త్రీయ ఆధారాలతో నిరూపించాడు. 

    బైబిల్ లో మనం చూస్తే ఆ మూడూ ఒకే సారి సృష్టించబడినట్లు ఆదికాండము 1 అధ్యాయములో మనకు అర్థం అవుతున్నది. బైబిల్ ప్రవచనాలు చూస్తే,భవిష్యత్తులో దేవుడు మీ మూడింటినీ ఒకే సారి అంతం చేస్తాడని పేతురు తన పత్రికలో వ్రాసాడు. అది ఒక గొప్ప విధ్వంసం. అటువంటి సంఘటన ఈ విశ్వ చరిత్రలో మరొకటి లేదు. దానిని చూడటానికి ఎవరూ ఉండరు. దానిని చూసి తట్టుకొనే శక్తి ఎవరికీ ఉండదు. 

   దేవుని యొక్క ఆ మహా ఉగ్రత దినం తప్పించుకోవాలంటే మీరు రక్షణ పొందాలి. ప్రభువైన యేసు క్రీస్తు రక్తం చేత మీరు కడుగబడాలి. ఆయన కృప ద్వారా దేవుడు అందిస్తున్న పాప క్షమాపణ మనం పొందాలి. ప్రభువైన యేసు క్రీస్తు నందు దేవుడు మనతో శాంతిని ఏర్పరుస్తున్నాడు. అదే నేటి మా ప్రేమ సందేశం.  

Leave a Reply