జెఫన్యా ప్రకటించిన దేవుని ఉగ్రత దినం: డాక్టర్ పాల్ కట్టుపల్లి సందేశం

ఈ రోజు జెఫన్యా ప్రవక్త గురించి ఒక ప్రేమ సందేశం మీకు ఇవ్వాలని నేను ఆశ పడుతున్నాను. పాత నిబంధన చివరి భాగములో హబక్కూకు గ్రంథము తరువాత ఈ జెఫన్యా గ్రంథము మనకు కనిపిస్తుంది. మొదటి అధ్యాయము నుండి కొన్ని మాటలు చదువుదాము. 

  యూదారాజగు ఆమోను కుమారుడైన యోషీయా దినములలో హిజ్కియాకు పుట్టిన అమర్యా కుమారుడగు గెదల్యాకు జననమైన కూషీ కుమారుడగు జెఫన్యాకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు.

2 ఏమియు విడవకుండ భూమి మీదనున్న సమస్తమును నేను ఊడ్చివేసెదను; ఇదే యెహోవా వాక్కు.3 మను ష్యులనేమి పశువులనేమి నేను ఊడ్చివేసెదను; ఆకాశ పక్షులనేమి సముద్ర మత్స్యములనేమి దుర్జనులనేమి వారు చేసిన అపవాదములనేమి నేను ఊడ్చివేసెదను; భూమిమీద ఎవరును లేకుండ మనుష్య జాతిని నిర్మూలము చేసెదను; ఇదే యెహోవా వాక్కు.

                       జెఫన్యా గ్రంథము 1 

    ఈ మాటలు మనం గమనిస్తే దేవుడు జెఫన్యా ప్రవక్త ద్వారా తన ప్రజలతో మాట్లాడుతున్నాడు. జెఫన్యా అంటే ‘దేవుని యందు దాగుకొనిన వాడు’ అని అర్థం. ‘దేవుని యందు భద్ర పరచబడిన వాడు’ అని అర్థం. ఈయన సందేశం మనకు అర్థం కావాలంటే మనం ఆయన పుట్టుపూర్వోత్తరాల గురించి తెలుసుకోవాలి. 

జెఫన్యా పరిచర్య క్రీ.పూ 640 – 609 

    క్రీస్తు పూర్వం 640 – 609 సంవత్సరముల మధ్య యోషీయా రాజు కాలములో జెఫన్యా ప్రవచించాడు. ఆయన హిజ్కియా రాజు ముని మనుమడు. దానిని బట్టి జెఫన్యా ప్రవక్త రాజ కుటుంబానికి చెందిన వాడని మనకు అర్థం అవుతుంది. హిజ్కియా రాజు దేవుని వెంబడించిన గొప్ప భక్తుడు. అయితే ఆయన కుమారుడైన మనషే చాలా దుర్మార్గుడిగా జీవించాడు. దేవుని ప్రజలను తప్పు ద్రోవ పట్టించాడు, యూదా దేశాన్ని విగ్రహారాధన తో నింపి వేశాడు. దేశములో పాపం విపరీతముగా పెరిగిపోయింది. తమ బిడ్డలను కూడా అన్యదేవతలకు బలి ఇవ్వటం ప్రజలు మొదలు పెట్టారు. మనషే రాజు తరువాత యూదా దేశాన్ని అతని కుమారుడైన ఆమోను పాలించాడు. ఆయన కూడా తండ్రి వలెనే దేవునికి దూరముగా జీవించాడు. ఇశ్రాయేలీయులను దుష్ట మార్గములలో నడిపించాడు. 

క్రీ.పూ 640: యోషీయా రాజు పట్టాభిషేకం 

    క్రీ.పూ 640 లో ఆమోను తరువాత అతని కుమారుడైన యోషీయా రాజు అయ్యాడు. అతని కాలములో జెఫన్యా ప్రవచించాడు. క్రీ పూ 627 లో యిర్మీయా ప్రవక్త తన పరిచర్య ప్రారంభించాడు. దీనిని బట్టి జెఫన్యా, యిర్మీయా ఇద్దరూ ఒకే కాలములో జీవించారని మనకు అర్థం అవుతున్నది. 

జెఫన్యా, యిర్మీయా ఇద్దరూ ఒకే కాలములో జీవించారు : ఆ రోజుల్లో ప్రజలు దేవుని వాక్యాన్ని పూర్తిగా మరచిపోయారు. అయితే ఆ సమయములో ఒక ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది. దేవుని ధర్మశాస్త్రం ప్రతి ఒకటి యెరూషలేము లోని ఆలయములో దొరికింది. అది యోషీయా రాజు వద్దకు చేరింది. దానిని చదివిన రాజు ఎంతో క్షోభకు గురయ్యాడు. దేవుని ధర్మ శాస్త్ర్రము నుండి వారు ఎంత దూరముగా వెళ్లిపోయారో రాజుకు అర్థం అయ్యింది. ఆయన బట్టలు చింపుకొని ఎంతో ఆవేదన చెందాడు. దేవుని వాక్యం అనుసరించి ఎన్నో ఆధ్యాత్మిక సంస్కరణలు అమలు చేసాడు. ప్రజలకు దేవుని ధర్మ శాస్త్రం బోధించాడు. అపవిత్రమైన కార్యములను నిషేధించాడు. దేవుని ఆలయములో నిలబెట్టిన విగ్రహములను తొలగించి దానిని శుభ్రం చేశాడు. ఆ సమయములో జెఫన్యా చేసిన ప్రవచనాలు కూడా ఈ సంస్కరణలను ప్రభావితం చేశాయి. 

జెఫన్యా పరిచర్య క్రీ పూ 621 లో ముగిసింది. 

    క్రీ. పూ 609 లో యోషీయా రాజు ఒక యుద్ధములో మరణించాడు. ఆయన తరువాత రాజ్యం చేసిన నలుగురు రాజులు యెహోయాహాజు, యెహోయాకీము, యెహోయాకీను, సిద్కియా ప్రజలను భ్రష్టత్వం వైపు నడిపించారు. యూదా దేశం చుట్టూ బబులోను సామ్రాజ్యం విస్తరించింది. క్రీ పూ 586 లో బబులోను సైన్యము యూదా దేశాన్ని నిర్మూలము చేసింది. యూదా దేశం యొక్క చరిత్రలో చాలా సంక్లిష్టమైన సమయములో జెఫన్యా ప్రవక్త ప్రవచించాడు. ప్రజలు ఆయన సందేశాన్ని ఖాతరు చేయలేదు. ఆయన సహచరుడు యిర్మీయా ను యూదా అధికారులు ఎన్నో శ్రమలు పెట్టారు. జెఫన్యా ను కూడా అలానే శ్రమపెట్టి ఉంటారు. దేవుడు తన ప్రజలను వారి పాపములను బట్టి శిక్షించినప్పటికీ వారిని తిరిగి సమకూరుస్తాడు అనే మంచి సందేశం ఈ గ్రంధములో ఉంది. 

   ఈ జెఫన్యా గ్రంథములో మూడు అధ్యాయాలు మనకు కనిపిస్తున్నాయి. ఈ పుస్తకము యొక్క ప్రధాన అంశం: దేవుని ఉగ్రత దినం. 

The Day of the Lord

దేవుని ఉగ్రత దినం 

    దేవుని ఉగ్రత గురించి మాట్లాడుకోవటం మనకు ఇష్టం ఉండదు. ఆ అంశం గురించి చర్చించడం మనకు ఇష్టం ఉండదు. అందరూ ఎప్పుడూ సుఖ సంతోషాలతో జీవించాలనే మనం కోరుకొంటాము. ఎవరి మీదకు దేవుని శిక్ష రాకూడదు అని మనం కోరుకొంటాము. అయితే ప్రపంచ చరిత్ర మనం కోరుకున్నట్లు ముందుకు వెళ్ళదు. అవిధేయులైన ఈ ప్రపంచ ప్రజల మీద దేవుడు తన ఉగ్రతను కుమ్మరిస్తాడు అని జెఫన్యా మనకు తెలియజేస్తున్నాడు. 

    దేవుని ఉగ్రత అనేది బైబిల్ లో మనకు కనిపించే చాలా ముఖ్యమైన అంశం. దేవుని ఉగ్రత దినం మనకు బైబిల్ లో అనేక సార్లు కనిపిస్తున్నది. పరిశుద్ధుడైన దేవుడు పాపమును సహించలేడు. పాపమును ఆయన శిక్షిస్తూనే ఉంటాడు. 

-ఆదాము పాపము చేసినప్పుడు అతని శిక్షించాడు. ఏదెను వనము నుండి అతడు వెళ్లగొట్టబడ్డాడు. 

-కయీను పాపము చేసినప్పుడు దేవుడు కయీనును శిక్షించాడు. దేవుని సన్నిధి నుండి అతడు శాప గ్రస్తునిగా వెళ్లగొట్టబడ్డాడు. 

-ప్రపంచ ప్రజలు పాపము చేసినప్పుడు నోవహు కుటుంబం మినహాయించి మిగిలిన వారినందరినీ జల ప్రళయములో శిక్షించాడు. 

-సొదొమ, గొమొఱ్ఱాలు పాపము చేసినప్పుడు ఆకాశము నుండి అగ్ని గంధకములు కురిపించి వారిని బూడిద చేశాడు. 

-ఐగుప్తు రాజైన ఫరో పాపము చేసినప్పుడు దేవుడు అనేక రకాలయిన తెగుళ్లు పంపించి అతని, అతని దేశాన్ని శిక్షించాడు. 

-ఇశ్రాయేలీయులు పాపము చేసినప్పుడు వారిని అన్యజనుల చేత శిక్షించాడు. 

ప్రపంచ చరిత్ర చివరిలో కూడా దేవుడు సమస్త మానవాళిని శిక్షించబోవుతున్నాడు. అదే దేవుని మహా ఉగ్రత దినం. 

 ఆ ఉగ్రత దినం ఈ గ్రంధములో వివరించబడింది. 

1:7 – అది ప్రభువైన యెహోవా దినం 

1:8 – అది దేవుని బలి దినం 

1:10 – అది గొప్ప నాశనం కలుగజేయబోయే దినం 

1:15 – అది అంధకారమును గాఢాంధకారము కమ్ముదినము, మేఘములును గాఢాంధ కారమును కమ్ముదినము

   ప్రవక్త అయిన జెఫన్యా ఈ దేవుని ఉగ్రత దినం గురించి మనకు తెలియజేస్తున్నాడు. ఈ చిన్న పుస్తకములో 3 అధ్యాయాలు మనకు కనిపిస్తున్నాయి. 

జెఫన్యా ప్రవచించిన ఉగ్రత దినం

దేవుని ఉగ్రత దినం: యూదులు 

దేవుని ఉగ్రత దినం: అన్య జనులు 

దేవుని ఉగ్రత దినం: దేవుని రాజ్యం 

   మొదటి అధ్యాయములో: దేవుని ఉగ్రత దినం: యూదులు

రెండవ అధ్యాయములో: దేవుని ఉగ్రత దినం: అన్య జనులు

మూడవ అధ్యాయములో : దేవుని ఉగ్రత దినం; దేవుని రాజ్యం 

  1. దేవుని ఉగ్రత దినం: యూదులు 

మొదటిగా దేవుని ఉగ్రత దినం యూదుల మీదకు వచ్చింది. 

ప్రభువైన యెహోవా దినము సమీపమాయెను 1:7 

10 ఆ దినమందు మత్స్యపు గుమ్మములో రోదనశబ్దమును, పట్టణపు దిగువభాగమున అంగ లార్పును వినబడును, కొండల దిక్కునుండి గొప్ప నాశనము వచ్చును. ఇదే యెహోవా వాక్కు.11 కనానీయులందరు నాశమైరి,ద్రవ్యము సమకూర్చుకొనినవారందరును నిర్మూలము చేయబడిరి గనుక మక్తేషు లోయ నివాసులారా,  అంగలార్చుడి.

           జెఫన్యా 1:10,11

యెరూషలేము గుమ్మములు, దాని ప్రాకారములు, దాని చుట్టూ ఉన్న కొండలు,లోయలు ఎంతో భద్రతకు చిహ్నముగా ఉన్నాయి. దేవుడు వారితో ఏమంటున్నాడంటే, ఆ గుమ్మములు, ప్రాకారములు, కొండలు, లోయలు మిమ్ములను నా ఉగ్రత నుండి రక్షించలేవు. ‘ద్రవ్యము సమకూర్చుకొనిన వారందరును నిర్మూలము చేయబడిరి’ కొంతమంది తమ డబ్బు మీద నమ్మకం పెట్టుకొన్నారు. అయితే ఆ డబ్బు వారిని రక్షించలేక పోయింది. 

    ఈ రోజు మన ప్రపంచములో అత్యంత ధనికులు ఇలాన్ మస్క్, జెఫ్ బెజోస్, రిచర్డ్ బ్రాన్సన్ తమ డబ్బు తో అంతరిక్ష ప్రయాణాలు చేస్తున్నారు. వీరు అభివృద్ధి చేసిన టెక్నాలజీ తో అంతరిక్షంలో కూడా మనుష్యులు ప్రయాణం చేసి, జీవించ గలిగే ఏర్పాట్లు చేసుకొంటున్నారు. భూమి మీద కాకపొతే మరో గ్రహం మీద బ్రతుకుతాము అని వారు అనుకొంటున్నారు. మనిషి మొదటి సారి చంద్రుని మీద అడుగు పెట్టినప్పుడు బైబిల్ తెరచి దేవుని స్తుతించాడు. అయితే నేటి అంత రిక్ష ప్రయాణికులు దేవుని పూర్తిగా మరచిపోయారు. అంత రిక్షాన్ని జయించాము అని వీరు విర్రవీగుతున్నారు. దేవుని ఉగ్రత దినాన్ని వీరు తప్పించుకోలేరు. అది భూమి ని మాత్రమే కాకుండా సమస్త సృష్టిని అల్లాడిస్తుంది. 

   జెఫన్యా ప్రవచించి నట్లుగానే దేవుని ఉగ్రత దినం ఇశ్రాయేలీయుల మీదకు వచ్చింది. క్రీ పూ 586 లో బబులోను సైన్యం యూదా దేశం మీదకు విరుచుకు పడింది. ఇశ్రాయేలీయులను వారు హతం చేశారు. వేలాది మందిని బానిసలుగా బబులోనుకు చెరగా ఈడ్చుకొని వెళ్లారు. దేవుని మందిరాన్ని తగల బెట్టారు. దేవుని ఉగ్రత దినం ఆ రోజు ఇశ్రాయేలీయుల మీదకు వచ్చింది. 

దేవుని ఉగ్రత దినం: అన్య జనులు 

   రెండవదిగా దేవుని ఉగ్రత దినం అన్యజనుల మీదకు కూడా రాబోవు చున్నది. రెండో అధ్యాయములో ఆ విషయం ప్రవక్త మనకు తెలియజేశాడు. ఇశ్రాయేలు చుట్టూ ఉన్న అన్యజనులు – ఫిలిష్తీయులు, కెరేతీయులు, మోయాబీయులు, అమ్మోనీయులు, కూషీయులు, అషూరీయులు వారి మీదకు కూడా దేవుని ఉగ్రత దిగి వస్తుంది. 

1:18

యెహోవా ఉగ్రత దినమున తమ వెండి బంగారములు వారిని తప్పింప లేకపోవును,రోషాగ్నిచేత భూమియంతయు దహింప బడును, హఠాత్తుగా ఆయన భూనివాసులనందరిని సర్వ నాశనము చేయబోవుచున్నాడు

                  జెఫన్యా 1:18 

  తాను ఎన్నుకొనిన ఇశ్రాయేలీయులు పాపం చేసినప్పుడు దేవుడు వారిని శిక్షించాడు. అదే విధముగా అన్యుల పాపములను కూడా దేవుడు శిక్షిస్తాడు. దావీదును దేవుడు ఎంతో ప్రేమించాడు. దావీదు పాపం చేసినప్పుడు దేవుడు అతని కూడా శిక్షించాడు. 

   ఒక పట్టణములో ఒక జడ్జి ఉన్నాడు అనుకొందాము. ఆ జడ్జి కి ఒక కుమారుడు ఉన్నాడు అనుకొందాము. ఆ జడ్జి తన కుమారుని ఎంతో ప్రేమించాడు. అయితే, ఆ కుమారుడు ఒక రోజు నేరం చేశాడు. ఆ కుమారుని పోలీసులు అరెస్ట్ చేశారు. కోర్ట్ లో నిలబెట్టారు. నేరస్తుడైన తన కుమారునికి ఆ జడ్జి ఎలాంటి శిక్ష విధించాలి. తన కుమారుని యొక్క నేరం రుజువయ్యింది. చట్ట ప్రకారం ఆ జడ్జి తన కుమారునికి శిక్ష విధించాడు. జైలుకు పంపించాడు. ఆ పట్టణములో ప్రజలు ఏమనుకున్నారంటే, ఈ జడ్జి చాలా నీతి మంతుడు. నేరం చేస్తే ఆయనకు ఎవరైనా ఒక్కటే. కన్న కొడుకునే వదలి పెట్టని వాడు ఇతరులను వదలి పెడతాడా? మనం కూడా దేవుని వైపు ఆ విధముగానే చూడాలి. తన బిడ్డలైన ఇశ్రాయేలీయులనే శిక్షించిన దేవుడు అన్యజనులను శిక్షించ కుండా వదలి పెడతాడా? ఎట్టి పరిస్థితులలో వదలి పెట్టడు. ఆయన ఉత్తరదేశముమీద తన హస్తమును చాపి అష్షూరు దేశమును నాశనముచేయును; నీనెవె పట్టణమును పాడు చేసి దానిని ఆరిపోయిన యెడారివలె చేయును.

        జెఫన్యా 2:13

ఆషూరు ఘోరమైన పాపాలు చేసింది. గొప్ప సామ్రాజ్యము నిర్మించుకొంది. నినివే నగరాన్ని ఎంతో వైభవముగా నిర్మించుకొంది. అయితే దేవుని ఉగ్రతను అది తప్పించుకోలేకపోయింది. క్రీ . పూ 612 లో బబులోను వారు దానిని నాశనం చేశారు. ప్రవక్త అయిన జెఫన్యా చెప్పినట్లే నినివే ఎడారి వలె ఎండిపోయింది. 

ప్రకటన గ్రంథం 6 అధ్యాయములో కూడా కొన్ని మాటలు చూద్దాము. 

15 భూరాజులును, ఘనులును, సవాస్రాధిపతులును, ధనికులును, బలిష్ఠులును, ప్రతి దాసుడును, ప్రతి స్వతంత్రుడును కొండ గుహలలోను 16 బండల సందులలోను దాగుకొనిసింహాసనాసీనుడై యున్న వానియొక్కయు గొఱ్ఱపిల్లయొక్కయు ఉగ్రత మహాదినము వచ్చెను. దానికి తాళజాలినవాడెవడు?17 మీరు మామీద పడి ఆయన సన్నిధికిని గొఱ్ఱపిల్ల ఉగ్రతకును మమ్మును మరుగు చేయుడి అని పర్వతములతోను బండల తోను చెప్పుచున్నారు.

                                                                        ప్రకటన గ్రంథం 6

    ఉగ్రత దినం రోజు ప్రపంచ ప్రజల పరిస్థితి ఎలా ఉంటుందో ఇక్కడ మనము చూస్తున్నాము. వారు కొండల మధ్యకు బండ సందుల మధ్యకు పారిపోవుతున్నారు. మా మీద పడి, గొఱ్ఱె పిల్ల ఉగ్రత నుండి మమ్ములను మరుగు చేయండి అని వారు బండలను బ్రతిమలాడుకొంటున్నారు. దేవుని ఉగ్రత దినం అంత ఘోరముగా ఉంటుంది. 

దేవుని ఉగ్రత దినం: దేవుని రాజ్యము 

   మూడవదిగా ప్రవక్త దేవుడు తన ప్రజలకు చూపించబోయే కృపను కూడా మనకు తెలియజేస్తున్నాడు. 

ఆయన ఉగ్రత దినమున మీరు దాచబడుదురు

     జెఫన్యా 2:3

దేవుని ఉగ్రత దినమున మీరు దాచబడాలి అంటే మీరు క్రీస్తు నందు దాగుకోవాలి. తాను మీకు విధించిన శిక్షను యెహోవా కొట్టివేసియున్నాడు; మీ శత్రువులను ఆయన వెళ్లగొట్టి యున్నాడు; ఇశ్రాయేలుకు రాజైన యెహోవా మీ మధ్య ఉన్నాడు, ఇక మీదట మీకు అపాయము సంభవింపదు.

                   జెఫన్యా 3:15

తాను మీకు విధించిన శిక్షను యెహోవా కొట్టివేసియున్నాడు. యేసు క్రీస్తు నందు దేవుడు మన మీద ఉన్న శిక్ష కొట్టివేశాడు. యూదులు, అన్య జనులు వీరు ఒకరిని ఒకరు ఎంతో ద్వేషించుకొన్నారు. అయితే దేవుడు వీరిద్దరినీ క్రీస్తు నందు కలిపాడు. 

    ఐర్లాండ్ దేశములో డెఱి అనే నగరములో hands across the divide అనే శిల్పం ఉంది. ఆ దేశములో దాదాపు 30 సంవత్సరములు ప్రొటెస్టెంట్లు, కేథలిక్కులు కొట్లాడుకొన్నారు. 1998 లో గుడ్ ఫ్రైడే ఒప్పందం చేసుకొని శాంతి సంబంధాలు పెట్టుకొన్నారు. గుడ్ ఫ్రైడే రోజున యేసు క్రీస్తు సిలువ దగ్గర దేవుడు మనలను క్షమించినట్లుగానే మనం కూడా ఒకరి నొకరు క్షమించుకోవాలి అని వారు ఆ గుడ్ ఫ్రైడే ఒప్పందం చేసుకొన్నారు. విడిపోయిన మనం చేతులు కలుపుకొందాం అని ఆ శిల్పం చెక్కుకొన్నారు. దేవుడు యేసు క్రీస్తు నందు యూదులకు, అన్యులకు మధ్య ఉన్న అడ్డు గోడను తొలగించాడు. వారిని తన కుమారుని యందు ఒక్క మందగా చేశాడు. క్రీస్తు నందు దేవుడు ఈ రోజు మన మధ్యలో నివసిస్తున్నాడు. 

యెరూషలేమూ, భయపడ కుము, సీయోనూ, ధైర్యము తెచ్చుకొనుము;నీ దేవుడైన యెహోవా నీమధ్య ఉన్నాడు; ఆయన శక్తిమంతుడు, ఆయన మిమ్మును రక్షించును, ఆయన బహు ఆనందముతో నీయందు సంతోషించును, నీయందు తనకున్న ప్రేమను బట్టి శాంతము వహించి నీయందలి సంతోషముచేత ఆయన హర్షించును.                       జెఫన్యా 3:16-17

   యెరూషలేమూ, భయపడకుము అని దేవుడు యెరూషలేమును ధైర్యపరుస్తున్నాడు. దేవుని హృదయములో యెరూషలేముకు ప్రత్యేక స్థానం ఉంది. దావీదు దానిని తన రాజధానిగా చేసుకొన్నాడు. తన ప్రజలైన ఇశ్రాయేలీయుల మధ్య యెరూషలేము లోని ఆలయములో దేవుడు తన ప్రజల మధ్య నివసించాడు. అనేక మంది ప్రవక్తలను అక్కడకు పంపించాడు. ప్రభువైన యేసు క్రీస్తు గా ఆ నగరాన్ని దర్శించాడు. అక్కడే సిలువ వేయబడ్డాడు. సమాధి చేయబడి, మూడవ దినమున తిరిగి లేచాడు. యెరూషలేము నుండే పరలోకానికి ఆరోహణుడై తిరిగి వెళ్ళాడు. భవిష్యత్తులో తిరిగి యెరూషలేముకు ఆయన తిరిగి రాబోవు చున్నాడు. అక్కడ నుండే ఈ ప్రపంచాన్ని పరిపాలించబోవుతున్నాడు. 

    సెయింట్ అగస్టీన్ భక్తుడు ‘సిటీ అఫ్ గాడ్’ దేవుని నగరం అనే ప్రసిద్ధ పుస్తకము వ్రాశాడు. మొదటి భాగములో జెఫన్యా ప్రవచించిన క్రీస్తు రాజ్యము ఈ ప్రపంచం చూస్తుంది అని వ్రాశాడు.జెఫన్యా ఇశ్రాయేలీయులను దేవుడు తిరిగి సమకూర్చుతాడు అని కూడా ప్రవచించాడు. 

   ఆ కాలమున మీరు చూచు చుండగా నేను మిమ్మును చెరలోనుండి రప్పించి, మిమ్మును సమకూర్చిన తరువాత మిమ్మును నడిపింతును; నిజముగా భూమిమీద నున్న జనులందరి దృష్టికి నేను మీకు ఖ్యాతిని మంచి పేరును తెప్పింతును; ఇదే యెహోవా వాక్కు.

                                  జెఫన్యా 3:20 

   1948 లో యూదులు ఇశ్రాయేలు దేశము ను స్థాపించుకొనిన తరువాత ప్రపంచం నలుమూలల నుండి దేవుడు వారిని తిరిగి వారికి వాగ్దానము చేసిన దేశానికి సమకూర్చాడు  భవిష్యత్తులో దేవుని ఉగ్రత దినం ప్రపంచం మీదకు రాబొవుతున్నది. అప్పుడు ఇశ్రాయేలు ను దేవుడు పవిత్రపరుస్తాడు. వారిని తన వైపుకు తిప్పికొంటాడు. క్రైస్తవ సంఘము దేవుని ఉగ్రత దినము రాకముందే ఈ భూమి మీద నుండి ఎత్తబడుతుంది. 

ముగింపు: 

జెఫన్యా గ్రంథము ను ఈ రోజు మనం ధ్యానించాము. జెఫన్యా ఈ భూమి మీదకు రాబోవుచున్న దేవుని ఉగ్రత దినం గురించి ప్రవచించాడు. అయితే ఉగ్రత దినం ముందు దేవుడు తన ప్రజలను సమకూర్చి వారికి ఒక రాజ్యమును అనుగ్రహిస్తాడని ఆయన తెలియ జేశాడు. 

  జెఫన్యా అంటే ‘దేవుని యందు దాగుకొనిన వాడు’ అని అర్థం. ‘దేవుని యందు భద్ర పరచబడిన వాడు’ అని అర్థం. ఆ పేరు ఆయన ప్రవచనాలకు ఎంతో సరిపోయింది. దేవుని ఉగ్రత గురించి ఆయన ప్రవచించాడు. ఆ ఉగ్రత నుండి దేవుడు ఆయనను భద్రపరచాడు. క్రీ.పూ 586 లో ఇశ్రాయేలీయుల మీదకు వచ్చిన ఉగ్రత దినం చూడకుండానే ఆయన పరలోకం వెళ్ళిపోయాడు. ఆయన దేవుని యందు దాగుకొన్నాడు. 

    ఈ రోజు మనం కూడా క్రీస్తు నందు దాగుకోవాలి. దేవుని ఉగ్రత దినం ఈ ప్రపంచం మీదకు రాబోవు చున్నది. ఆ రోజు రాక ముందే క్రైస్తవ సంఘం ఎత్తబడుతుంది. ఆ ఉగ్రత దినం తప్పించుకోవాలంటే మీరు క్రీస్తు నందు దాగుకోవాలి. మీరు సిలువ క్రింద ఆశ్రయం పొందాలి. సిలువ మీద మన పాపములను బట్టి మనం పొందవలసిన దేవుని ఉగ్రత ఆయన ప్రియ కుమారుడు ప్రభువైన యేసు క్రీస్తు భరించాడు. మన పాపములను యేసు క్రీస్తు పవిత్ర రక్తము చేత దేవుడు కడిగి వేశాడు. క్రీస్తు నందు విశ్వాస ముంచిన ప్రతి వ్యక్తి దేవుని ఎదుట నీతి మంతునిగా ఎంచబడుతున్నాడు. దేవుడు అనుగ్రహించే ఆ రక్షణ మీరు పొందాలన్నదే నేటి మా ప్రేమ సందేశం.  

Leave a Reply