
ఈ రోజు హగ్గయి గ్రంథం నుండి మీకు ఒక ప్రేమ సందేశం ఇవ్వాలని నేను ఆశపడుతున్నాను. పాత నిబంధన చివరిలో ఈ హగ్గయి గ్రంథం మనకు కనిపిస్తున్నది. మనం సమయం తీసుకొని పాత నిబంధన కూడా చదువుతూ ఉండాలి. అందులో చరిత్ర, వేదాంతం, ఫిలాసఫీ, ఆర్కి యాలజీ లాంటి అనేక సంగతులు మనకు కనిపిస్తాయి. అన్నిటికంటే ముఖ్యముగా దేవుడు తన ప్రజల కోసం ఎటువంటి కార్యాలు చేశాడో, ఈ ప్రపంచ చరిత్రను ఏ విధముగా ముందుకు నడిపిస్తున్నాడో మనకు అర్థం అవుతుంది. ఆ కారణాలను బట్టి పాత నిబంధనను మనం చదువుతూ ఉండాలి. హగ్గయి గ్రంథము లో నుండి కొన్ని మాటలు చూద్దాము.
రాజైన దర్యావేషు ఏలుబడియందు రెండవ సంవత్స రము ఆరవ నెల మొదటి దినమున ప్రవక్తయగు హగ్గయి ద్వారా యూదా దేశముమీద అధికారియు షయల్తీయేలు కుమారుడునైన జెరుబ్బాబెలుకును ప్రధానయాజకుడును యెహోజాదాకు కుమారుడునైన యెహోషువకును యెహోవా వాక్కు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను
సైన్యములకధిపతియగు యెహోవా ఆజ్ఞ ఇచ్చున దేమనగా 2 సమయమింక రాలేదు, యెహోవా మందిర మును కట్టించుటకు సమయమింక రాలేదని యీ జనులు చెప్పుచున్నారే. 3 అందుకు యెహోవా వాక్కు ప్రత్యక్షమై ప్రవక్తయగు హగ్గయిద్వారా సెలవిచ్చినదేమనగా 4 ఈ మందిరము పాడైయుండగా మీరు సరంబీవేసిన యిండ్లలో నిసించుటకు ఇది సమయమా? 5 కాబట్టి సైన్యములకధిపతియగు యెహోవా సెలవిచ్చునదేమనగా మీ ప్రవర్తననుగూర్చి ఆలోచించుకొనుడి.
ఈ మాటలు మీరు గమనిస్తే దేవుడు హగ్గయి ప్రవక్త ద్వారా తన ప్రజలతో మాట్లాడుతున్నాడు. ఈ ప్రవక్త ఎవరు? ఎప్పుడు జీవించాడు?ఎక్కడ జీవించాడు? అనే ప్రశ్నలు మనకు వస్తాయి. పాత నిబంధన ప్రవక్తలు అనే చార్ట్ నేను తయారుచేసాను. ఈ చార్ట్ కావలసిన వారు www.doctorpaul.org వెబ్ సైట్ కి వెళ్లి దీనిని డౌన్ లోడ్ చేసుకోండి.
మీరు గమనిస్తే దానియేలు, యెహెఙ్కేలు ప్రవక్తల తరువాత హగ్గయి జీవించాడు. యూదులు బబులోను నుండి తిరిగి వచ్చిన తరువాత ఆయన పరిచర్య ప్రారంభం అయ్యింది. యూదులు తిరిగి వచ్చిన తరువాత ముగ్గురు ప్రవక్తలు మనకు కనిపిస్తున్నారు. వీరిని Post-Exilic Prophets అని పిలుస్తాము. వారిలో ఈ హగ్గయి ఒకడు. ప్రవక్త అయిన జెకర్యా కూడా హగ్గయి జీవించిన రోజుల లోనే జీవించినట్లుగా ఇక్కడ మనకు అర్థం అవుతున్నది. హగ్గయి యొక్క ముఖ్య సందేశం ఏమిటంటే, దేవుని ఆలయము ను నిర్మించుట. ఇశ్రాయేలీయులకు ఆలయం అవసరం ఎందుకు వచ్చింది?
ఇశ్రాయేలీయులు రెండు దేశములుగా నివసిస్తున్నారు. ఉత్తరాన 10 గోత్రాలు ఇశ్రాయేలు దేశం, దక్షిణాన 2 గోత్రాలు యూదా దేశం. కాల క్రమేణా వారు దేవునికి దూరం అయిపోయారు. దేవుని ఆజ్ఞలను అతిక్రమించారు. దేవుడు ఏ పనులు చేయవద్దు అని వారిని ఆఙ్ఞాపించాడో, ఆ పనులే చేశారు. వారిని శిక్షిస్తానని దేవుడు తన ప్రవక్తల చేత ఇశ్రాయేలీయులను హెచ్చరించాడు. వారు బబులోను దేశానికి చెరగా ఈడ్చుకొని వెళ్లబడతారని దేవుడు తన ప్రవక్త అయిన యెషయా ద్వారా తెలియజేశాడు. పెర్షియా చక్రవర్తి కోరెషు ద్వారా దేవుడు తన ప్రజలను చెర నుండి విడిపిస్తాడని యెషయా ప్రవక్త తెలియజేశాడు. (యెషయా 44:28)
ఇశ్రాయేలీయులు బబులోను లో 70 సంవత్సరాలు చెరలో గడిపిన తరువాత దేవుడు వారిని తిరిగి యూదా దేశానికి తీసుకు వస్తాడని యిర్మీయా ప్రవక్త కూడా తెలియజేశాడు (యిర్మీయా 25:11, 29:10-14; దానియేలు 9:2)
క్రీ.పూ 722 లో ఉత్తర దేశం అషూరు సామ్రాజ్యం చేతిలో అంతం చెందింది.
క్రీ.పూ 606 లో బబులోను సైన్యము యూదా దేశమును చుట్టుముట్టింది.
క్రీ.పూ 586 లో యెరూషలేమును బబులోను వారు నాశనం చేశారు. అక్కడ ఉన్నటు వంటి సొలొమోను కట్టించిన దేవుని ఆలయమును కూడా వారు తగుల బెట్టారు.
వేలాది మంది యూదులను బబులోను దేశానికి చెరపట్టుకొని తీసుకు వెళ్లారు. దానియేలు, యెహెఙ్కేలు వంటి గొప్ప ప్రవక్తలు కూడా చెరలోకి వెళ్లారు. బబులోను సామ్రాజ్యం క్షీణించిన తరువాత పర్షియా సామ్రాజ్యము మధ్య ప్రాశ్చాన్ని తన చేతిలోకి తీసుకొంది. ఆ సమయములో సైరస్ లేక కోరెషు చక్రవర్తి అయ్యాడు.
యూదు చరిత్ర కారుడు జోసిఫస్ తన గ్రంథములో ఒక విషయం వ్రాశాడు. ఒక రోజు దానియేలు ప్రవక్త కోరెషు గురించి యెషయా ప్రవక్త వ్రాసిన ప్రవచనాలను కోరెషు కు చూపించాడు. వాటిని చదివిన తరువాత యూదులు తమ దేశానికి తిరిగి వెళ్ళవచ్చు అని కోరెషు చక్రవర్తి ఆజ్ఞ ఇచ్చాడు. దేవుడు యెషయా, యిర్మీయా ల ద్వారా తాను చేసిన ప్రవచనాలను ఆ విధముగా నెరవేర్చాడు (ఎజ్రా 1:1).
మూడు గుంపులుగా చెరలోనికి వెళ్లిన ఇశ్రాయేలీయులను మూడు గుంపులుగా దేవుడు చెర లో నుండి తిరిగి యూదా దేశానికి తీసుకు వచ్చాడు.
క్రీ పూ 538 లో మొదటి బృందం జెరుబ్బాబెలు, యెహోషువ నాయకత్వములో యూదా దేశం చేరింది. (ఎజ్రా 1-6)
క్రీ.పూ 458 లో రెండవ బృందం ఎజ్రా నాయకత్వములో యూదా దేశం చేరింది (ఎజ్రా 7-10)
క్రీ పూ 445 లో మూడవ బృందం నెహెమ్యా నాయకత్వములో యూదా దేశం చేరింది (నెహెమ్యా 1-13)
-క్రీ పూ 536 లో దేవుని ఆలయం నిర్మించ డానికి వారు పూనుకొన్నారు. అయితే అనేక కారణాల వలన మరో 16 సంవత్సరాలు ఆ ఆలయం నిర్మాణానికి నోచుకోలేదు.
-క్రీ పూ 520 లో దేవుడు హగ్గయి ప్రవక్తను వారి యొద్దకు పంపాడు. నా ఆలయం నిర్మించడానికి నా ప్రజలను నీవు ప్రోత్సహించాలి అనే పనిని దేవుడు హగ్గయి కి అప్పగించాడు. హగ్గయి ఇచ్చిన ప్రోత్సాహముతో ఇశ్రాయేలీయులు 5 సంవత్సరాలలో క్రీ పూ 515 నాటికి దేవుని ఆలయము నిర్మించి పూర్తి చేశారు.
హగ్గయి ఇశ్రాయేలీయులతో ఒక మాట అన్నాడు.
2. సమయమింక రాలేదు, యెహోవా మందిర మును కట్టించుటకుసమయమింక రాలేదని యీ జనులు చెప్పుచున్నారే.
హగ్గయి 1:2
దేవుని ఆలయం కట్టడానికి ఇది సమయం కాదు, టైం వచ్చినప్పుడు చూద్దాములే అని వారు అంటున్నారు. మనిషి కున్న చెడు లక్షణాలలో ఇది ఒకటి. రక్షణ పొందు అంటే, ఇప్పుడు కాదులే, టైం వచ్చినప్పుడు చూద్దాములే అని అంటారు. దేవుని మాట విను అంటే, ఇప్పుడు కాదులే, టైం వచ్చినప్పుడు చూద్దాములే అని అంటారు. ప్రార్ధన చేయి అంటే, ఇప్పుడు కాదులే, టైం వచ్చినప్పుడు చూద్దాములే అని అంటారు.
ఇక్కడ ఇశ్రాయేలీయులు అదే పని చేస్తున్నారు. దేవుని ఆలయమా? ఇప్పుడు అది అంత అవసరమా? మనం అంత తొందర పడాలా? టైం వచ్చినప్పుడు చూద్దాములే అంటున్నారు. దేవుడు వారితో ఒక మాట అంటున్నాడు: మీరు చేస్తున్నది మంచి పని కాదు. ఈ మందిరము పాడైయుండగా మీరు సరంబీవేసిన యిండ్లలో నివసించుటకు ఇది సమయమా?
మీ ఇళ్ళు మాత్రం దిట్టముగా కట్టుకున్నారు. నా ఇంటి గురించి మాత్రం మీరు పట్టించుకోరు. వారి ఇళ్లను దేవదారు మ్రానులతో కట్టుకున్నారు. సొలొమోను తన ప్రసిద్ధ ఆలయాన్ని దేవదారు మ్రానులతో నిర్మించాడు. (1 రాజులు 7). ఈ దేవదారు చెట్లు పర్వతాల మీద ఎంతో బలముగా, అందముగా పెరుగుతాయి.
మన దేశములో కూడా హిమాలయ పర్వతాల్లో ఇవి కనిపిస్తాయి. కరోనా లాక్ డౌన్లతో విసిగిపోయి చాలా మంది హిమాలయా పర్వతాలకు వెళ్తున్నారు. కాశ్మీర్ లో గుల్మార్గ్ అనే పట్టణానికి చాలామంది వెళ్తున్నారు. అక్కడ మంచు మీద స్కీయింగ్ చేస్తున్నారు. దేవదారు చెట్ల మధ్య గుండా స్కీయింగ్ చేస్తే హిమాలయ పర్వతాల అందం మనకు కనిపిస్తుంది అని వీరు చెబుతున్నారు. ఈ దేవదారు చెట్లను వుపయోగించి సొలొమోను దేవుని ఆలయాన్ని నిర్మించాడు. అది దేవునికి ఇష్టమైన చెట్టు.
‘దాని కొమ్ములు శృంగారములు, దాని గుబురు విశాలము, దానికొన బహు ఎత్తయినందున మేఘములకు అంటెను.4 నీళ్లుండుటవలన అది మిక్కిలి గొప్పదాయెను (యెహెఙ్కేలు 31:3-4)
12 నీతిమంతులు ఖర్జూరవృక్షమువలె మొవ్వువేయు దురు లెబానోనుమీది దేవదారు వృక్షమువలె వారు ఎదుగు దురు (కీర్తన 92:12)
నీతి మంతులు లెబానోను దేవదారు వృక్షము వలె ఎదుగుదురు అని 92 కీర్తన లో మనం చదువుతాము. ఈ చెట్లు రాళ్ళ మీద బలముగా నిలబడతాయి. వారు కూడా క్రీస్తు అనే రాయి మీద బలముగా ఎదుగుతారు. ఈ చెట్టు సువాసనలు వెదజల్లుతుంది. నీతిమంతులు యేసు క్రీస్తు నందు దేవునికి సువాసనగా ఉన్నారు. ఈ చెట్టు ఆ విధముగా దేవుని ఆలయములో స్థానం పొందింది. సొలొమోను వలె మనము కూడా దేవదారు మ్రానుతో మందిరం కట్టాలి అని వారు అనుకొన్నారు. లెబానోను దేశం నుండి దేవదారు మ్రానులు సముద్రం మీద యొప్పే పట్టణానికి తెప్పించారు. అయితే ఆ దేవదారును (ఎజ్రా 3:7) తమ ఇళ్ళు కట్టుకోవడానికి ఉపయోగించుకున్నారు.
మీకు ముఖ్యమైనవి ఏమిటి? మీ జీవితములో ముఖ్యమైనవి ఏమిటి?
What are your priorities in life?
ఇశ్రాయేలీయులను దేవుడు ఆ ప్రశ్న అడిగాడు. మీ జీవితములో ముఖ్యమైనవి ఏమిటి? దేవుని మందిరం మన జీవితములో ముఖ్యమైనది గా ఉండాలి. దేవుని ఆరాధన మన జీవితములో ముఖ్యమైనదిగా ఉండాలి. చాలా మంది రాంగ్ ప్రియరిటిస్ తో ఉంటున్నారు. ముందు నేను, నా ఉద్యోగం, నా సంపాదన, నా కుటుంబం, నా విహార యాత్రలు నా సరదాలు నాకు ముఖ్యం. ఎప్పుడో క్రిస్మస్ కో, ఈస్టర్ కో అప్పుడప్పుడూ దేవుని సన్నిధి కి వెళ్తే సరిపోతుంది అని వారు అనుకొంటున్నారు. అయితే అన్నిటికంటే ముఖ్యమైనది దేవుని మందిరం, దేవుని ఆరాధన. యేసు ప్రభువు మనకు స్పష్టముగా చెప్పాడు: నీ పూర్ణహృదయముతోను, నీ పూర్ణాత్మతోను, నీ పూర్ణమనస్సుతోను, నీ దేవుడైన ప్రభువును ప్రేమించాలి
(మత్తయి 22:37)
హగ్గయి వారితో ఒక మాట అన్నాడు: మీ ప్రవర్తనను గూర్చి ఆలోచించుకొనుడి (1:7). Consider Your Ways
దేవుడు మీ నుండి ఆశించింది ఏమిటి? మీరు చేస్తున్నది ఏమిటి? ఒక సారి ఆలోచించుకోండి అని వారితో అన్నాడు.
ఇశ్రాయేలీయులు హగ్గయి మాటలు విన్నారు. దేవుని ఆలయము నిర్మించడం మొదలు పెట్టారు. దేవుడు వారికి ఇద్దరు నాయకులను ఇచ్చాడు. జెరుబ్బాబెలు అనే అధికారి యెహోషువ అనే యాజకుడు. జెరుబ్బాబెలు యూదా రాజ గోత్రానికి చెందిన వాడు. రాజైన యెకొన్యా కు ఆయన మనుమడు. ఒక రకంగా ఆయన వారికి రాజుగా ఉన్నాడు. యెహోషువ అనే యాజకుడు కూడా వారికి ఉన్నాడు. ఈయన యెహోషువ గ్రంథములో కనిపించే యెహోషువ కాదు. ఈయన వేరు.
జెరుబ్బాబెలు అనే రాజు
యెహోషువ అనే యాజకుడు
హగ్గయి అనే ప్రవక్త
ఈ ముగ్గురు కలిసి దేవుని ఆలయం నిర్మించారు. ఈ ముగ్గురిలో ప్రభువైన యేసు క్రీస్తు రూపం మనకు కనిపిస్తుంది.
ఆయన మన రాజు
మన ప్రధాన యాజకుడు
మన ప్రవక్త
ఆయన నిర్మించే దేవుని ఆలయం ఎంతో గొప్పది. ఆయన శరీరమే దేవుని ఆలయం. ఈ రోజు యేసు క్రీస్తు నందు నమ్మకం ఉంచిన ప్రతి విశ్వాసి ఆ ఆలయములో ఒక రాయిగా ఉన్నాడు. యేసు క్రీస్తు నిర్మిస్తున్న దేవుని ఆలయం అన్నిటి కంటే గొప్పది.
బైబిల్ గ్రంథములోని 7 దేవుని ఆలయాలు
బైబిల్ గ్రంథములో మనకు 7 దేవుని ఆలయాలు కనిపిస్తున్నాయి.
మొదటిది ప్రత్యక్ష గుడారం. ఇశ్రాయేలీయులు అరణ్యములో ప్రయాణించిన 40 సంవత్సరాలు ఆ తరువాత వారు కనాను దేశములో స్థిరపడిన తరువాత అది దేవుని ఆలయము గా ఉంది.
రెండోది సొలొమోను ఆలయము. అది క్రీ పూ 997 నుండి క్రీ పూ 586 వరకు కొనసాగింది.
మూడోది ఇక్కడ హగ్గయి గ్రంథము లో మనకు కనిపిస్తుంది. జెరుబ్బాబెలు ఆలయం గా అది పిలువబడింది. అది క్రీ పూ 515 నుండి క్రీ పూ 20 సంవత్సరము వరకు కొనసాగింది.
నాలుగోది హేరోదు ఆలయము. జెరుబ్బాబెలు ఆలయమును మరమత్తులు చేసి, దానిని విశాల పరచి హేరోదు రాజు దీనిని నిర్మించాడు. ఇది క్రీ పూ 20 నుండి క్రీ శ 70 వరకు కొనసాగింది. ప్రభువైన యేసు క్రీస్తు ఈ ఆలయమును అనేక సార్లు దర్శించాడు. ఇది రోమన్ సైన్యము చేతిలో నాశనం అయ్యింది.
ఐదో ఆలయము. ప్రస్తుతము నిర్మించబడుతూ ఉన్నది. ఇది కంటికి కనిపించేది కాదు. ఇది భౌతికమైనది కాదు ఇది ఒక దేశానికో, ప్రాంతానికో పరిమితం అయ్యింది కాదు. ప్రపంచమంతట నుండి క్రెస్తవ విశ్వాసులు సజీవమైన రాళ్లుగా ఈ క్రైస్తవ సంఘం క్రీస్తు అనే శరీరముగా దేవుని ఆలయముగా నిర్మించబడుతున్నది.
క్రైస్తవ సంఘము ఈ భూమి మీద నుండి ఎత్తబడిన తరువాత ఏడేండ్ల శ్రమల కాలం ఈ ప్రపంచము మీదకు వస్తుంది. ఆ సమయములో అంత్య క్రీస్తు ఈ ప్రపంచాన్ని పాలిస్తాడు. అప్పుడు యెరూషలేములో ఒక ఆలయం నిర్మించబడుతుంది. అది ఆరవ ఆలయము. అది అంత్య క్రీస్తు చేత అపవిత్రం చేయబడుతుంది.
చివరిగా 7 ఆలయము ప్రభువైన యేసు క్రీస్తు వెయ్యేళ్ళ పాలనలో నిర్మించబడుతుంది. యెహెఙ్కేలు గ్రంథం 40 – 48 అధ్యాయాల్లో దాని గురించి మనం చదువుతాము. వెయ్యేళ్ళ పాలనలో నిర్మించబడే ఆలయం
మోషేను పిలిచిన నాటి నుండి నేటి వరకు, ఇంకా ప్రపంచ చరిత్ర అంతం వరకు దేవుడు తన కొరకు ఒక ఆలయాన్ని ఈ భూమి మీద కోరుకున్నాడు. ఒక ఆలయము ద్వారా మనుష్యులు నా దగ్గరకు రావాలి అని దేవుని చిత్తము. అయితే మనిషి ఆ సత్యం మరచిపోయాడు. భారత దేశం మొదటి ప్రధాన మంత్రి పండిట్ జవహర్ లాల్ నెహ్రూ గారు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేవాడు. వాటినే ఆయన ‘ఆధునిక ఆలయాలు’ పిలుస్తూ ఉండేవాడు. పెద్ద పెద్ద నీటి పారుదల ప్రాజెక్టులు, పెద్ద పెద్ద విద్యుత్ కేంద్రాలు, పెద్ద పెద్ద స్టీల్ ప్లాంట్లు ఐఐటీ లాంటి ఇంజనీరింగ్ కాలేజీలు ఎయిమ్స్ లాంటి పెద్ద హాస్పిటల్ లు నిర్మించి ఇవే ఆధునిక భారత దేశానికి ఆలయాలు అని ఆయన అంటూ ఉండేవాడు. ఆయన ఆ నమ్మకం తన స్నేహితుడైన జోసెఫ్ స్టాలిన్ నుండి నేర్చుకొన్నాడు. స్టాలిన్ ఏమంటూ వుండేవాడంటే ‘మనం మనిషి మెదడు నే మార్చివేయాలి. అప్పుడే సోషలిస్ట్ రాజ్యం తీసుకొని రాగలం. ఆ భావజాలం ఇప్పుడు ప్రపంచ మంతా ప్రాకింది. సమాజాన్ని అభివృద్ధి చేస్తే చాలు అదే నిజమైన ఆలయం అనుకొంటున్నారు. దేవుని ఆలయం అక్కర లేదు. మంచి కాలేజీలు. మంచి పరిశ్రమలు, మంచి హాస్పిటళ్లు కట్టాలి. అవి నిజమైన ఆలయాలు అని చాలా మంది అను కొంటున్నారు. ఆర్టిఫిసియల్ ఇంటలిజెన్స్ ద్వారా మనిషి స్వభావాన్నే మార్చివేయాలి అని వారు కోరుకొంటున్నారు. అయితే దేవుడు కోరుకొనేది కాదు. మనం ఎంత అభివృద్ధి చెందినప్పటికీ తన సన్నిధి మన మధ్యలో ఉండాలన్నది ఆయన కోరిక.
ఇద్దరు ముగ్గురు నా నామమున
ఎక్కడ కూడి యుందురో అక్కడ
నేను వారి మధ్యన ఉందును అని యేసు
ప్రభువు చెప్పాడు (మత్తయి 18:20)
ఇక్కడ ఇశ్రాయేలీయులతో కూడా దేవుడు అదే మాట అంటున్నాడు. 2 అధ్యాయము 4,5 వచనాలు చూద్దాము: దేశములోనున్న సమస్తజనులారా, ధైర్యము తెచ్చుకొని పని జరిగించుడి; నేను మీకు తోడుగా ఉన్నాను; ఇదే సైన్యములకు అధి పతియగు యెహోవా వాక్కు.5 మీరు ఐగుప్తుదేశములో నుండి వచ్చినప్పుడు నేను మీతో చేసిన నిబంధన జ్ఞాప కము చేసికొనుడి; నా ఆత్మ మీ మధ్యన ఉన్నది గనుక భయపడకుడి.
హగ్గయి 2:4-5
ఇశ్రాయేలీయులు నిరుత్సాహముతో ఉన్నారు. చుట్టూ ఉన్న శత్రువులు వారిని భయపెడుతున్నారు. వారిలో కూడా నిర్లిప్తత పెరిగిపోయింది. అయితే దేవుడు వారితో ఏమన్నాడంటే, మీరు ధైర్యము తెచ్చుకొని పని చేయండి; నేను మీకు తోడుగా ఉన్నాను
రెండు విషయాలు వారికి గుర్తు చేసాడు. 5 మీరు ఐగుప్తుదేశములో నుండి వచ్చినప్పుడు నేను మీతో చేసిన నిబంధన జ్ఞాప కము చేసికొనుడి; నా ఆత్మ మీ మధ్యన ఉన్నది గనుక భయపడకుడి.నా నిబంధన జ్ఞాపకం చేసుకోండి నా సన్నిధి లో జీవించండి.
ఈ రోజు మనకు కూడా ధైర్యం ఇచ్చేది అవే. దేవుడు యేసు క్రీస్తు ప్రభువు నందు మనతో చేసిన క్రొత్త నిబంధన ను మనం జ్ఞాపకం చేసుకోవాలి. అదే విధముగా క్రీస్తు సన్నిధి మన మధ్యలో ఉన్నది అని మనం గుర్తు పెట్టుకోవాలి. హగ్గయి ఇచ్చిన ప్రోత్సాహముతో 5 సంవత్సరాల్లో వారు దేవుని ఆలయం నిర్మించారు. దానిని చూసి వారు ఎలా స్పందించారు? 2: 3
పూర్వకాలమున ఈ మందిరమునకు కలిగిన మహిమను చూచినవారు మీలో ఉన్నారు గదా; అట్టివారికి ఇది ఎట్టిదిగా కనబడు చున్నది? దానితో ఇది ఎందునను పోలినది కాదని తోచుచున్నది గదా.
హగ్గయి 2:3
అక్కడ ఉన్న కొంతమంది సొలొమోను ఆలయమును చూసిన వారు. వారు చిన్న తనములో చూసిన ఆ గొప్ప దేవాలయము వారికి ఇంకా గుర్తుంది. ఇప్పుడు వారి వృద్ధాప్యములో ఈ ఆలయం వారి ముందు కట్టబడింది. అయితే దీనికి దానికి పోలిక లేదు. సొలొమోను ఎంతో వైభవముగా, ఐశ్వర్యముతో, సౌందర్యముతో తన ఆలయాన్ని నిర్మించాడు. జెరుబ్బాబెలు కట్టిన ఆలయం చూసి వారు కన్నీరు పెట్టారు. అయితే దేవుడు వారిని ఓదార్చాడు. ఇది చిన్న ఆలయం అని మీరు నిట్టూర్పులు విడిచి నిరుత్సహపడవద్దు. నా మహిమతో మీ ఆలయాన్ని నేను నింపుతాను. నా శాంతి ని ఈ మందిరములో వుంచుతాను అన్నాడు (హగ్గయి 2:9,10).
మనం కూడా కొన్ని సార్లు అలానే నిరుత్సాహ పడుతూ ఉంటాము. సొలొమోను ఆలయములో పోల్చితే నా ఆలయం బోసిపోయింది అని జెరుబ్బాబెలు అనుకొన్నాడు. ఆయన చేసిన సేవతో పోల్చుకొంటే నాదే ముంది? ఆమె చేసిన సేవతో పోల్చుకొంటే నాదేముంది అని మనకు అనిపించవచ్చు. అయితే దేవుడు మనం చేసే చిన్న చిన్న పనులను కూడా లక్ష్య పెడుతున్నాడు. మనము ఇచ్చే చిన్న కానుకలకు కూడా ఆయన సంతోషిస్తాడు.
ఒకరోజు ప్రభువైన యేసు క్రీస్తు పెద్ద మహా సభ లో మాట్లాడాడు. సభ ముగిసిన తరువాత వారందరికీ భోజనం పెట్టాలి అని ఆయనకు అనిపించింది. ఎవరి దగ్గరైనా ఆహారం ఉందా? అని ఆయన అడిగాడు. ఒక బాలుడు తన దగ్గర ఉన్న 5 రొట్టెలు, రెండు చేపలు తీసుకొని ముందుకు వెళ్ళాడు. ‘ఈ అబ్బాయి దగ్గర ఉన్న 5 రొట్టెలతో వేలాది మంది ఆకలి ఎలా తీరుస్తాము?’ అని శిష్యులు అడిగారు. అయితే యేసు ప్రభువు ఆ బాలుని యొద్ద ఉన్న 5 రొట్టెలు తీసుకొని 5 వేల మంది ఆకలి తీర్చాడు. ఇక్కడ 5 సంవత్సరాల్లో వీరు కట్టిన ఈ దేవుని ఆలయములో 500 సంవత్సరాలు దేవుడు తన సన్నిధిని వారి మధ్య ఉంచాడు. మనం ప్రేమతో చేస్తే అవి చిన్నవైనా వాటియందు ఆనందించే దేవుడు ఇక్కడ మనకు కనిపిస్తున్నాడు. జెరుబ్బాబెలుతో ఇట్లనుము ఆకాశమును భూమిని నేను కంపింపజేయుచున్నాను.
హగ్గయి 2:21
ఏడేండ్ల శ్రమల కాలములో అది జరుగుతుంది. ఆకాశమును, భూమిని దేవుడు కదిలించి క్రీస్తు విరోధికి, అతని వెంబండించే ఈ లోకస్తులకు దేవుడు తీర్పుతీరుస్తాడు. జెరుబ్బాబెలుకు ముద్ర ఉంగరము ఇవ్వబడుతుంది. జెరుబ్బాబెలు సంతానంగా పుట్టిన క్రీస్తు ఈ లోకానికి రాజుల రాజుగా, ప్రభువుల ప్రభువుగా రాబోవుతున్నాడు.
హగ్గయి గ్రంథము ఈ రోజు మనం ధ్యానించాము. ఇశ్రాయేలీయులు దేవుని కొరకు ఒక ఆలయం నిర్మించాలి. భవిష్యత్తులో దేవుని కుమారుడు దానిని దర్శించ బోవుతున్నాడు. దేవుడు అనుగ్రహించే గొప్ప నిరీక్షణ ఈ పుస్తకములో మనకు కనిపిస్తుంది. ప్రభువైన యేసు క్రీస్తు రక్తము చేత కడుగబడి, పాప క్షమాపణ పొంది, దేవుడు నిర్మిస్తున్న ఈ గొప్ప దేవుని ఆలయములో మీరు కూడా ఒక భాగము కావాలి. అదే నేటి మా ప్రేమ సందేశం.