
ప్రేమ సందేశం కార్యక్రమం చూస్తున్న సోదరీ సోదరులకు ప్రభువైన యేసు క్రీస్తు మహిమ కలిగిన పేరు మీద శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. దేవుని కృప యందు మీరు క్షేమముగా ఉన్నారని తలంచు చున్నాము. సంవత్సరం చివరకు మనం వచ్చాము. ఎటు చూసినా క్రిస్మస్ వాతావరణం నెలకొంది. గ్రీటింగ్స్ కార్డులు పంపించడం, క్రిస్మస్ గిఫ్ట్స్ అందుకోవటం, ఇవ్వటం, క్రిస్మస్ స్టార్ మన ఇంటి మీద పెట్టుకోవడం, క్రిస్మస్ ట్రీ ని అలంకరించడం, శాంటా క్లాస్ గురించి మాట్లాడుకోవడం క్రిస్మస్ సందర్భముగా మనం చేసేవే. కరోనా పాండెమిక్ వలన మన క్రిస్మస్ రూపం కూడా మారింది. ఎటు చూసినా ఎంతో ఆందోళన, ఎంతో అనిశ్చితి, ఎంతో అభద్రత, ఎంతో గందర గోళం నెలకొని ఉంది. ఇలాంటి సమయములో క్రిస్మస్ చేసుకోవడం అంత అవసరమా? అని మనకు అనిపించవచ్చు. అయితే ఇలాంటి సమయములోనే క్రిస్మస్ సందేశం మరింత ఆవశ్యకమైనదని, మరింత ముఖ్యమైనదని నేను భావిస్తున్నాను. ఈ క్రిస్మస్ సందర్భముగా ఒక ప్రేమ సందేశం మీకు ఇవ్వాలని నేను ఆశపడుతున్నాను.
ఈ క్రిస్మస్ గురించి 5 విషయాలు మీకు చెప్పాలని నేను ఆశపడుతున్నాను.
మొదటిగా క్రిస్మస్ ప్రత్యేకత.
క్రిస్మస్ ప్రత్యేకత ఏమిటి? క్రిస్మస్ యేసు క్రీస్తు జన్మ దినం. యేసు క్రీస్తు డిసెంబర్ 25 న పుట్టాడు అనటానికి ఆధారాలు లేవు. ఆ రోజు ఆయన పుట్టలేదు అని కూడా మనం చెప్పలేము. ఆయన ఏ తేదీన పుట్టాడు అనేది ముఖ్యం కాదు. ఆయన ఎందుకు పుట్టాడు? అనేది ముఖ్యం.
దేవుడు మానవ రూపములో ఈ భూమి మీదకు వచ్చాడు. అది క్రిస్మస్ ప్రత్యేకత. ఇంకా ఏ మానవుని రూపం దేవుడు పొందలేదు. ఒక్క యేసు క్రీస్తు రూపములోనే దేవుడు ఈ లోకానికి వచ్చాడు. అనంతమైన విశ్వం మన ముందు ఉంది. కోటానుకోట్ల నక్షత్రాలు, గ్రహాలూ మన చుట్టూ ఉన్నాయి. ఈ భూమి మీద కూడా ఎన్నో సముద్రాలు, ఎన్నో చెట్లు, ఎన్నో జంతువులు మనకు కనిపిస్తున్నాయి. వీటన్నిటినీ దేవుడు సృష్టించాడు. కోటాను కోట్ల మానవులను కూడా దేవుడు సృష్టించాడు. అయితే వాటిలో ఏ ఒక్కటి రూపం దేవుడు పొందలేదు. వాటిలో ఏ మనిషి రూపము దేవుడు పొందలేదు. తాను సృష్టించిన వాటిలో దేనితో కూడా దేవుడు తనను ఐక్యం చేసుకోలేదు.
ఏ నక్షత్రం, ఏ గ్రహం, ఏ దేవదూత, ఏ చెట్టూ, ఏ జంతువూ, ఏ ప్రవక్తా, ఏ భక్తుడూ దేవుని స్వరూపం పొందలేదు. కేవలం యేసు క్రీస్తు లో మాత్రమే దేవుడు మనకు ప్రత్యక్షము అయ్యాడు. రెండు వేల సంవత్సరముల క్రితం దేవుడు ఒక కన్యక ద్వారా ఈ లోకములో మానవునిగా జన్మించాడు. అలాంటి సంఘటన ఈ ప్రపంచ చరిత్రలో అంతకు ముందు కానీ తరువాత కానీ జరుగలేదు. అదే క్రిస్మస్ ప్రత్యేకత.
క్రిస్మస్ యొక్క ఈ ప్రత్యేకత గ్రహించక పొతే, క్రిస్ట్మస్ సందేశం మనకు అర్థం కానట్లే. ఇప్పటి క్రిస్మస్ కూడా ప్రత్యేకమైనదే. క్రిస్మస్ పార్టీలు కాన్సల్ అయినాయి. కాలేజీలు ఆన్ లైన్ లో తరగతులు ఈ రోజు మనం ప్రపంచం వైపు చూస్తే, వాక్సిన్ లను కూడా నిర్వీర్యం చేసే క్రొత్త క్రొత్త కరోనా వేరియంట్ లు పుట్టుకొస్తున్నాయి. ఈ కరోనా ఎప్పుడు అంతం చెందుతుందా అని మనం రెండు సంవత్సరములుగా ఎదురు చూస్తున్నాము.

ఈ రోజు నేను హాస్పిటల్ కి వెళ్తే కరోనా రోగులు బారులు తీరి ఉన్నారు. వారిని చూసినప్పుడు డయిట్రిక్ బాన్ హఫర్ వ్రాసిన మాటలు నాకు గుర్తుకు వచ్చాయి. బాన్ హఫర్ జర్మనీ దేశములో నివసించాడు. ఆయన ఒక పాస్టర్ గా పనిచేస్తున్నాడు. హిట్లర్ ని ఎదిరించాడు. జైలు పాలు అయ్యాడు. అతని కుటుంబానికి దూరం అయ్యాడు. స్నేహితులకు దూరం అయ్యాడు. బందువులకు దూరం అయ్యాడు. అతని ఇంటిని నాజీలు బాంబులు వేసి పేల్చి వేశారు. జైలులో ఒంటరిగా ఉన్నాడు. రెండో ప్రపంచ యుద్దం ఎప్పుడు ముగుస్తుందో తెలియదు, హిట్లర్ పీడ విరుగుడు అవుతుందో లేదో తెలియదు. అతను బయట పడతాడో లేదో తెలియదు. అనిశ్చితి అతని జీవితాన్ని ఆవరించింది. అలాంటి సమయములో క్రిస్మస్ పండుగ వచ్చింది. ఆ సమయములో ఆయన తన డైరీ లో ఒక మాట వ్రాశాడు.
“ఈ జైలులో నా జీవితం మొదటి క్రిస్మస్ తో పోల్చవచ్చు. మనం వేచి చూస్తాము, నిరీక్షిస్తాము, ఈ పని చేస్తాము, ఆ పని చేస్తాము, దేని వలన ప్రయోజనం ఉండదు. తలుపు మూయబడింది. గొళ్ళెం వేయబడింది. బయట నుండి మాత్రమే ఈ తలుపు తెరువబడుతుంది” the door is shut, and can only be opened from the outside. తలుపు మూయబడింది, గొళ్ళెం తీసి బయట నుండి ఈ తలుపు తెరువబడవలసిందే.

క్రిస్మస్ రోజున దేవుడు చేసింది అదే. దేవుడు ఆ గొళ్ళెం తీశాడు. తలుపు తెరచాడు. మన మధ్యలోకి వచ్చాడు. ప్రవక్త అయిన యెషయా చెప్పినట్లు యేసు క్రీస్తు చెరలో నున్న మనకు విడుదల ఇవ్వటానికి ఈ లోకానికి వచ్చాడు (లూకా 4:17-18). క్రిస్మస్ ప్రత్యేకత అదే. బయట నుండి గొళ్ళెం వేయబడింది. మనం ఈ ప్రపంచములో బంధించ బడి ఉన్నాము. మనకు విడుదల ఇవ్వటానికి సాక్షాత్తూ దేవుడే మానవునిగా మన మధ్యలోకి వచ్చాడు.

రెండవదిగా క్రిస్మస్ ప్రవచనం.
క్రిస్మస్ శిశువు అందరి శిశువుల వంటి వాడు కాదు. ఆయన జన్మించక ముందు వేలాది, వందలాది సంవత్సరములకు ముందే ప్రవక్తలు యేసు క్రీస్తు గురించి తెలియజేశారు.
ఆయన అబ్రహాము సంతానంగా జన్మిస్తాడు అని మోషే ప్రవక్త తెలియ జేశాడు (ఆది కాండము 12:3).
ఆయన యూదా గోత్రములో జన్మిస్తాడు అని యాకోబు ప్రవక్త తెలియ జేశాడు (ఆది కాండము 49:10)
ఆయన దావీదు కుటుంబములో జన్మిస్తాడు అని సమూయేలు ప్రవక్త తెలియ జేశాడు
(2 సమూయేలు 7:12-13)
ఆయన ఒక కన్యక గర్భము ద్వారా జన్మిస్తాడు అని యెషయా ప్రవక్త తెలియ జేశాడు.
(యెషయా 7:14)
ఆయన బెత్లెహేము అనే చిన్న ఊరిలో జన్మిస్తాడు అని మీకా అనే ప్రవక్త తెలియజేశాడు.
(మీకా 5:2)
ఆ మొదటి క్రిస్మస్ రోజున ఆ ప్రవచనాలన్నీ నెరవేరినాయి. రక్షకుడు ఎప్పుడు జన్మిస్తాడు? మెస్సియా ఎక్కడ జన్మిస్తాడు? అని ఎంతో ప్రజలు ఎదురుచూశారు. వారి నిరీక్షణ ఆ రోజు ఫలించింది.

క్రిస్మస్ ప్రచారం
ఆ తరువాత క్రిస్మస్ ప్రచారం. ఒక రోజు నా కుమారుని ఈ లోకానికి పంపిస్తాను అని దేవుడు చేసిన ప్రచారం క్రిస్మస్ రోజున నెరవేరింది. దేవదూతలు చుట్టూ వెళ్లి ప్రచారం చేశారు. ఆ రాత్రి కొంతమంది కాపరులు తమ గొఱ్ఱెల మందను కాచుకొంటున్నారు. ఒక దేవ దూత వారి యొద్దకు వెళ్ళాడు. వారి చుట్టూ దేవుని మహిమ ప్రకాశించింది. వారు ఎంతో భయపడ్డారు. ఆ దూత వారితో అన్నాడు:
‘మీరు భయపడ వద్దు. ఇదిగో ప్రజలందరికిని కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయు చున్నాను;
11 దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి యున్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు
12 దానికిదే మీకానవాలు; ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్ట బడి యొక తొట్టిలో పండుకొనియుండుట మీరు చూచెద రని వారితో చెప్పెను. Luke 2
ఆ మొదట క్రిస్మస్ రోజున పరలోకం నుండి దేవదూతలు వచ్చి ప్రచారం చేశారు. బేత్లెహేములో ఒక పసి బిడ్డ తొట్టిలో పండుకొని ఉన్నాడు. ఆయనే మీ రక్షకుడు. ఆ గొఱ్ఱెల కాపరులు వెంటనే బెత్లెహేము వెళ్లి ఆ తొట్టెలో పండుకొని ఉన్న క్రీస్తును చూసి, ఆయన ఆరాధించి స్తుతించారు. పోయిన వారం జేమ్స్ మాంట్ గోమరి (1816) వ్రాసిన ఒక క్రిస్మస్ గీతం నేను విన్నాను. ఆ గీతములో ఆయన అనేక మంది ఈ క్రీస్తు శిశువు యొద్దకు పిలుస్తాడు.
దేవదూత లారా రండి, మీ రెక్కలతో ఈ భూమి మీద ఎగ రండి సృష్టి జరిగినప్పుడు మీరు పాటలు పాడారు. ఇప్పుడు క్రీస్తు జన్మ గురించి పాడండి.
కాపరు లారా రండి, రాత్రంతా గొఱ్ఱెలను మీరు కాచారు, ఈ ఇమ్మాను యేలు ను చూడండి. మన మధ్యలోకి వచ్చిన దేవుని చూడండి ఈ శిశువు వెలుగును చూడండి
జ్ఞానులారా రండి, మీ తత్వ చింతన ప్రక్కన పెట్టండి. దేవుని ప్రత్యక్షత చూడండి. సర్వ లోకం ఎదురు చూసిన అతి కాంక్షణీయుడు ఇక్కడ ఉన్నాడు. అతని నక్షత్రాన్ని వెంబడించండి
భక్తులారా రండి, ఆయన సన్నిధిలో మోకరించండి. మీరు భయభక్తులతో, నిరీక్షణతో ఎదురుచూశారు. దేవుడు అకస్మాత్తుగా దిగివచ్చాడు. ఆయన ఆలయములో ప్రత్యక్షం అయ్యాడు.
పాపులారా రండి, మీ మీద ఉన్న పాప భారం ఆయన తొలగిస్తాడు మీ మీద ఉన్న నిందను ఆయన తీసివేస్తాడు. మీ పాపపు సంకెళ్లను త్రెంచి వేస్తాడు మీకు కరుణ చూపిస్తాడు.
రాజులారా రండి, రాజుల రాజు వచ్చాడు
ప్రభువులారా రండి, ప్రభువుల ప్రభువు వచ్చాడు
గురువు లారా రండి, అసలు గురువు వచ్చాడు
ప్రవక్తలారా రండి, అసలు ప్రవక్త వచ్చాడు
యాజకులారా రండి, ప్రధాన యాజకుడు వచ్చాడు
ఈ క్రిస్మస్ శిశువు ప్రతి వ్యక్తికీ కావలసిన వాడు.
యేసు క్రీస్తు మార్గం, ఆయన లేకుండా ఎటు వైపు వెళ్లాలో మనకు తెలియదు.
యేసు క్రీస్తు సత్యం, ఆయన లేకుండా అసత్యము లో నుండి మనం బయటకి రాలేము
యేసు క్రీస్తు జీవం, ఆయన లేకుండా మరణం నుండి మనం బయటికి రాలేము
యేసు క్రీస్తు వెలుగు, ఆయన లేకుండా చీకటిలో నుండి మనం బయటికి రాలేము
యేసు క్రీస్తు జీవాహారం, ఆయన లేకుండా మన ఆత్మ యొక్క ఆకలి తీరదు
యేసు క్రీస్తు జీవ జలం, ఆయన లేకుండా మన ఆత్మ యొక్క దాహం తీరదు.
క్రిస్మస్ ప్రభావం.
ఆ తరువాత క్రిస్మస్ ప్రభావం. ఈ క్రిస్మస్ శిశువు ప్రపంచ చరిత్రను గొప్ప మలుపు తిప్పాడు. మానవ చరిత్రను క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం గా విభజించాడు.ప్రపంచములోని అన్ని రంగాల మీద గొప్ప ప్రభావం చూపించాడు. యేసు క్రీస్తు ఒక్క దేశములోనే జీవించాడు, అయితే ప్రపంచములోని అన్ని దేశాల మీద ఆయన ప్రభావం పడింది
యేసు క్రీస్తు ఒక్క పుస్తకం కూడా వ్రాయలేదు, అయితే ఆయన గురించి వ్రాయబడినన్ని పుస్తకాలు ఇంకే వ్యక్తి గురించి వ్రాయబడలేదు.
యేసు క్రీస్తు కత్తి పట్టి ఎప్పుడూ పోరాడలేదు, అయితే ఆయన ప్రపంచ సామ్రాజ్యాలు అన్నిటినీ జయించాడు
యేసు క్రీస్తు ఒక్క పాట కూడా వ్రాయలేదు అయితే ఆయన గురించి వ్రాయబడినన్ని కీర్తనలు ఇంకే వ్యక్తి గురించి వ్రాయబడలేదు
యేసు క్రీస్తు ఒక్క చిత్రం కూడా గీయలేదు ఆయన జీవిత సన్నివేశాలు ప్రపంచ ప్రసిద్ధ కళా ఖండాలుగా తీర్చబడ్డాయి
యేసు క్రీస్తు ఏ కాలేజీ కి వెళ్లి చదువుకోలేదు ఆయన పేరు మీద పెట్టబడినన్ని స్కూళ్ళు, కాలేజీలు, యూనివర్సిటీ లు ఇంకెవరి పేరు మీద పెట్టబడలేదు
యేసు క్రీస్తు ఏ రాజకీయ పార్టీ పెట్టలేదు కానీ గొప్ప రాజ నీతిజ్ఞులకు ఆయన మాటలు మార్గ నిర్దేశం చేశాయి
ఈ రోజు మన సమాజాన్ని మనం చూస్తే, చాలా మంది క్రిస్మస్ అసలు సందేశం పట్టించుకోరు. వారి మీద క్రిస్మస్ ప్రభావం చూపుతుందా? క్రిస్మస్ సీజన్, షాపింగ్ చేసుకోవటానికి బాగుంటుంది. క్రిస్మస్ సీజన్, పార్టీ లు చేసుకొని, మద్యం త్రాగి, సినిమా పాటలు పెట్టుకొని డాన్సులు వేసుకోవటానికి బాగుంటుంది. క్రిస్మస్ గిఫ్ట్స్ వస్తాయి, వెకేషన్ కి వెళ్లొచ్చు అలా ఆలోచించే వారే ఎక్కువగా ఉంటారు. అయితే దేవుని ఉద్దేశం అది కాదు. మన జీవితం మీద క్రిస్మస్ ప్రభావం ఎలా ఉండాలంటే, మనం మొదటి క్రిస్మస్ ను చూడాలి. గొఱ్ఱెల కాపరులు పార్టీలు చేసుకోలేదు. వారు బెత్లెహేము వెళ్లి శిశువైన క్రీస్తును ఆరాధించారు
లూకా సువార్త 2 అధ్యాయములో చూస్తే, అక్కడ యెరూషలేములో ఉన్న సుమెయోను అనే వ్యక్తి గురించి వ్రాయబడింది. ఈ సుమెయోను నీతి మంతుడు ఎంతో భక్తి కలిగిన వ్యక్తి, పరిశుద్ధాత్మ కలిగిన వ్యక్తి, ఒక రోజు ఆయన దేవుని ఆలయములో ఉన్నాడు. మరియ, యోసేపు దంపతులు యేసు క్రీస్తు శిశువును దేవుని ఆలయము లోనికి తీసుకువెళ్లారు.
సుమెయోను క్రీస్తు శిశువును తన చేతులతో ఎత్తుకొని దేవుని స్తుతించాడు. దేవా,శాంతితో నన్ను పోనిచ్చుచున్నావు అన్యజనులకు వెలుగుగా. ఇశ్రాయేలుకు మహిమగా సకల ప్రజల ఎదుట సిద్ధపరచబడిన రక్షణ గా నీవిచ్చిన ఈ శిశువును బట్టి నీకు వందనాలు అని దేవుని కీర్తించాడు.

అక్కడ అన్న అనే ప్రవక్త్రి కూడా ఉంది. 84 సంవత్సరాలు విధవరాలుగా ఉంది. సోది కబుర్లు చెబుతూ టైమ్ వేస్ట్ చేసుకోకుండా ఆమె ఉపవాస ప్రార్థనలతో రాత్రి, పగలు దేవుని ఆలయములో సేవ చేస్తూ ఉంది. ఆమె కూడా క్రిస్మస్ శిశువును చూసి ఎంతో సంతోషించింది. దేవుని స్తుతించి ఆరాధించింది. క్రిస్మస్ ప్రభావం ఆ విధముగా ఉండాలి.
యేసు క్రీస్తు దేవుడు మనకిచ్చిన రక్షణ
దేవుడు మనకిచ్చిన విమోచన
దేవుడు మనకిచ్చిన పాప క్షమాపణ
దేవుడు మనకిచ్చిన సమాధానం
దేవుడు మనకిచ్చిన నిరీక్షణ
దేవుడు మనకిచ్చిన ధైర్యం
దేవుడు మనకిచ్చిన ఆనందం
క్రిస్మస్ ప్రశాంతత
తరువాత క్రిస్మస్ ప్రశాంతత. క్రిస్మస్ దేవుని శాంతిని మన జీవితాల్లోకి తెచ్చింది. క్రీస్తు శిశువును తన చేతుల లోకి తీసుకొని సుమెయోను ఒక మాట అన్నాడు:
నాథా, యిప్పుడు నీ మాటచొప్పున
సమాధాన ముతో నీ దాసుని
పోనిచ్చుచున్నావు (లూకా 2:29)
సుమెయోను నిరీక్షణ ఫలించింది.వేలాది సంవత్సరాలుగా ప్రవక్తలు ప్రకటించిన రక్షకుడు ఇప్పుడు అతని చేతులలో ఉన్నాడు. దేవుని సమాధానం అతని హృదయాన్ని నింపింది.
బెత్లెహేములో క్రీస్తు జన్మించినప్పుడు పరలోక సైన్య సమూహం దేవుని కీర్తించింది. సర్వోన్నత మైన స్థలములలో దేవునికి మహిమయు ఆయన కిష్టులైన మనుష్యులకు భూమిమీద సమాధానమును కలుగునుగాక. లూకా 2:14
భూమి మీద దేవుని శాంతి, సమాధానం ఇవ్వటానికి ప్రభువైన యేసు క్రీస్తు వచ్చాడు. ఆయన లేకుండా సమాధానం లేదు. తూర్పు దేశపు జ్ఞానులు నడుచుకొంటూ వెళ్తున్నారు. వారి ముందు సువిశాల ఆకాశం, ఎన్నో వేల నక్షత్రాలు వారికి కనిపిస్తున్నాయి. అయితే వారి దృష్టి మాత్రం ఒక్క నక్షత్రం మీదే ఉంది.

విన్ సెంట్ వాన్ గో (1853 – 1890) అనే గొప్ప చిత్రకారుడు గీసిన చిత్రం నేను ఒకటి చూశాను. ఆయన ప్రపంచ చరిత్రలోనే గొప్ప చిత్రకారులలో ఒకనిగా గుర్తింపు పొందాడు. ఆయన ఒక క్రైస్తవ కుటుంబములో జన్మించాడు. క్రైస్తవ మిషనరీ గా కూడా కొంత కాలం గడిపాడు. అయితే క్రైస్తవ్యానికి దూరముగా వెళ్ళిపోయాడు. ఆ సమయములో గొప్ప చిత్రాలు గీశాడు. ఆరోగ్యం నిర్లక్ష్యం చేశాడు. క్రుంగి పోయాడు.
ఒక బ్లేడ్ తీసుకొని తన ఎడమ చెవి కోసుకున్నాడు. 1889 మే నెల నుండి 1890 మే నెల వరకు సెయింట్ రెమి అనే మానసిక చికిత్సాలయం లో ఉన్నాడు. ప్రొద్దునే తన కిటికీ తూర్పు దిక్కున తెరచి ఉదయ కాలం చీకటిలో ఆకాశ నక్షత్రాలు చూస్తూ ఉండే వాడు. వీనస్ గ్రహం ఉదయ కాలపు నక్షత్రం morning star వలె ఆయనకు కనిపించింది. దానిని చూసి ఆయన ఎంతో ప్రభావితం చెందాడు. ఆ ఆకాశ నక్షత్రాలు ఆయనను ఆలోచింపజేశాయి.

జూన్ 18, 1889 – అక్కడ తన రూమ్ లో కూర్చొని the starry night అనే చిత్రం గీశాడు. అందులో ఆకాశం, నక్షత్రాల సమూహాలు, ఒక చిన్న వూరు, ఊరి మధ్యలో ఒక చర్చి, ఎడమ వైపు సైప్రస్ చెట్టు, కుడి వైపు ఒలీవ చెట్లు మనకు కనిపిస్తాయి. అది ఆయన గీచిన చిత్రాల్లో కెల్లా గొప్ప చిత్రముగా చెప్పబడింది. అందులో కొన్ని దేవదారు చెట్లు చూపించాడు. ఈ రోజు వాన్ గో జీవితాన్ని చదివిన పరిశోధకులు ఏమని చెబుతారంటే, the starry night చిత్రం గీసేటప్పుడు వాన్ గో ప్రకటన గ్రంథం గురించి ఆలోచిస్తున్నాడు. తన జీవితం చివరి దశలో నిత్యత్వం అంచున నిలబడి అనంత విశ్వములోకి చూస్తున్నాడు. ఆ చిత్రము లోని సై ప్రస్ చెట్లలో ఆయన మరణాన్ని చూశాడు. ఆయన వాడిన బ్లు రంగు, పసుపు రంగు క్రీస్తును సూచిస్తున్నాయి.
వాన్ గో పడిన అంతర్మథనం ఆ చిత్రములో మనకు కనిపిస్తుంది. అతని హృదయానికి విశ్రాంతి లేదు, అతని మనస్సులో ప్రశాంతత లేదు. ఆ పెయింట్ త్రాగటం మొదలు పెట్టాడు. 37 సంవత్సరాల వయస్సులో ఆత్మ హత్య చేసుకొన్నాడు.
వాన్ గో జీవితం చూసినప్పుడు నాకు ఎంతో విచారం కలిగింది. ఒక క్రైస్తవ కుటుంబములో పుట్టిన వ్యక్తి, ఒక గొప్ప చిత్ర కారుడు – అనంత విశ్వములోకి చూసి ఆందోళన చెందాడు. తాను పడిన వేదన the starry night చిత్రములో చూపించాడు. మనలో ప్రతి ఒక్కరూ the starry night ని చూడాల్సిందే. ఈ అనంత విశ్వములో నా స్థానము ఏమిటి? నా పయణం ఎటు? నా గమ్యం ఏమిటి? ఈ ప్రశ్నలు మనందరికీ వస్తాయి.

క్రిస్మస్ లో కూడా మనకు ఒక స్టార్రి నైట్ కనిపిస్తున్నది. వాన్ గో తన గదిలో తూర్పు వైపున ఉన్న కిటికీ తెరచి ఆ స్టార్రి నైట్ చూశాడు. తూర్పు దేశపు జ్ఞానులు కూడా ఒక స్టార్రి నైట్ ని చూశారు. ఒక చక్కటి నక్షత్రం వారికి కనిపించింది. ఆ నక్షత్రం చూస్తూ వారు ప్రయాణం చేశారు. ఆ నక్షత్రం వెళ్లి క్రీస్తు ప్రభువు ఉన్న ఇంటి మీద నిలిచింది. వారు ఆ ఇంటి లోకి వెళ్లి క్రీస్తు శిశువు ను చూసి, ఆయన ఎదుట సాగిలపడ్డారు. ఆయనను పూజించారు. ఆయనను ఆరాధించారు, ఆయనకు కానుకలు సమర్పించారు.
-నీ ముందు ఉన్న స్టార్రి నైట్ నీలో ఆందోళన కలిగిస్తున్నదేమో. వాన్ గో వలె నీవు కలత చెందుతున్నావేమో. వాన్ గో తన చిత్రములో నక్షత్ర ఆకాశం చూశాడు. ఒక ఊరు చూశాడు. ఒక చర్చి చూశాడు. క్రీస్తును చూపించే రంగులు కూడా దాని మీద అద్దాడు. అయితే క్రీస్తుతో ఎలాంటి వ్యక్తిగత సంభందం లేకుండా ఆయన జీవితం ముగిసింది. ఈ రోజు చాలా మంది వాన్ గో వలె ఉన్నారు. క్రీస్తుతో వ్యక్తిగత సంభందం లేకుండానే వారి జీవిత ప్రయాణం ముగుస్తున్నది.
మనం తూర్పు దేశపు జ్ఞానుల వలె ఉండాలి. ఆ ఇంటిలోకి వెళ్లి క్రీస్తును వ్యక్తిగతముగా చూడాలి. ఆయనతో వ్యక్తిగత సంభందం పెట్టుకోవాలి. ఆయనను ఆరాధించాలి, పూజించాలి, సేవించాలి. ఆ జ్ఞానులు అత్యానంద భరితులయ్యారు అని మనం చదువుతున్నాము. క్రీస్తును చూసిన వెంటనే వారికి ఆనందం, ప్రశాంతత కలిగినవి. సుమెయోను, అన్న కూడా క్రీస్తును చూసిన తరువాత ఆనందం, ప్రశాంతత పొందారు. గొఱ్ఱెల కాపరులు క్రీస్తును చూసిన తరువాత ఆనందం, ప్రశాంతత పొందారు. ఈ ఆనందం, ఈ ప్రశాంతత ప్రతి ఒక్కరికి ఇవ్వాలని దేవుడు ఇష్టపడుతున్నాడు.
క్రిస్మస్ గురించి ఈ రోజు 5 విషయాలు మనం చూశాము.
మొదటిగా, క్రిస్మస్ యొక్క ప్రత్యేకత: సృష్టికర్త అయిన దేవుడు మన మధ్యలోకి ఒక మానవునిగా వచ్చాడు. మనతో ఒక వ్యక్తిగత సంబంధం పెట్టుకోవాలని ఆయన కోరుకొంటున్నాడు.
రెండవదిగా, క్రిస్మస్ యొక్క ప్రవచనం. దేవుడు మన మధ్యలోకి ఇమ్మానుయేలు గా వస్తాడు అని ప్రవక్తలు వేలాది సంవత్సరాలుగా చెప్పిన ప్రవచనాలు క్రిస్మస్ రోజున నెరవేరినాయి.
మూడవదిగా, క్రిస్మస్ యొక్క ప్రచారం. యేసు క్రీస్తు జన్మించాడు అనే ఈ మంచి వార్త మనం ప్రచారం చేయాలి. మొదటి క్రిస్మస్ రోజున దేవదూతలు క్రిస్మస్ గురించి గొఱ్ఱెల కాపరులకు ప్రచారం చేశారు. ఈ రోజు క్రిస్మస్ యొక్క అసలు అర్ధాన్ని అందరికీ చెప్పవలసిన బాధ్యత మన అందరి మీద ఉంది.
నాలుగవదిగా, క్రిస్మస్ యొక్క ప్రభావం. క్రిస్మస్ అంటే క్రిస్మస్ గిఫ్ట్స్ ఇచ్చుకోవటం, మంచి పార్టీ చేసుకోవటం, మంచి బట్టలు వేసుకొని చర్చి కి వెళ్లడం మాత్రమే కాదు. మొదటి క్రిస్మస్ రోజున ఆ జ్ఞానులు, కాపరులు క్రీస్తు ఆరాధించినట్లు మనం కూడా యేసు క్రీస్తు ప్రభువును ఆరాధించాలి. పూజించాలి. రక్షకునిగా స్వీకరించాలి.
ఐదవదిగా, క్రిస్మస్ యొక్క ప్రశాంతత. క్రీస్తు శిశువును చూసి సుమెయోను సమాధానం పొందాడు, శాంతిని పొందాడు. మన ప్రపంచం గందర గోళం లో ఉన్నప్పటికీ, మన పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ, క్రీస్తు వైపు చూసి మనం దేవుడు అనుగ్రహించే శాంతిని, ప్రశాంతత ను పొందవచ్చు. వాటిని మీరు ఈ క్రిస్మస్ సందర్భముగా మెండుగా పొందాలన్నదే మా ప్రేమ సందేశం.
2020 Christmas message by Paul Kattupalli