ప్రేమ సందేశం కార్యక్రమం వీక్షిస్తున్న సోదరీ సోదరులందరికి ప్రభువైన యేసు క్రీస్తు మహిమ కలిగిన పేరు మీద శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. మరో క్రొత్త సంవత్సరములో మనం ప్రవేశించాము. మీ అందరికీ మా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. దేవుని కృప యందు మీరు ఆనందముగా ఉన్నారని తలంచు చున్నాము. మా వెబ్ సైట్ దర్శించి బైబిల్ స్టడీ చేస్తున్న వారందరికీ మా ధన్యవాదాలు. నేను వ్రాసే కామెంటరీ మీరు ఎప్పటికప్పుడు మా వెబ్ సైట్ లో చదువవచ్చు.
ఈ క్రొత్త సంవత్సరములో ఈ కార్యక్రమం బ్రాడ్ కాస్టింగ్ కొరకు ప్రార్ధించండి. దేవుడు మిమ్ములను ప్రేరేపిస్తే బ్రాడ్ కాస్టింగ్ కి ఆర్ధిక సహకారం అందించండి. మీరు అందించిన సహాయము వలన ఇప్పటికి ఏడు సంవత్సరాలు ముగించాము. ఎనిమిదవ సంవత్సరములో ప్రవేశించాము. ఇప్పటికి 250 ఎపిసోడ్ లు చేశాము. ఇవ్వన్నీ మీరు మా యూట్యూబ్ ఛానెల్ లో చూడవచ్చు. మా యూ ట్యూబ్ ఛానల్ కి సబ్ స్క్రైబ్ చేయండి.
ఈ రోజు మీకు ఒక న్యూ ఇయర్ సందేశం ఇవ్వాలని నేను ఆశ పడుతున్నాను. క్రిస్మస్ దాని తరువాత ఒక వారానికి న్యూ ఇయర్ వస్తుంది. క్రిస్మస్ చేసు కొనేటప్పుడు ప్రభువైన యేసు క్రీస్తు ను గూర్చిన తలంపులు మన హృదయం నిండి ఉంటుంది. అవే తలంపులు న్యూ ఇయర్ రోజున కూడా మనకు ఉపయోగపడుతాయి.
యేసు క్రీస్తుకు పెట్టబడిన ఒక పేరు ఇమ్మానుయేలు అంటే ‘దేవుడు మనకు తోడు’ మనకు తోడుగా ఉండుటకు వచ్చిన దేవుడు. ఈ రోజు ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ – సంతోషముతో ఉన్నా, దుఃఖములో ఉన్నా ఆరోగ్యమైనా, అనారోగ్యమైనా ఐశ్వర్యములో ఉన్నా, పేదరికం లో ఉన్నా అందరితో ఉన్నా, ఒంటరిగా ఉన్నా మీరు ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ ఇమ్మానుయేలు మీకు తోడుగా ఉన్నాడు. దేవుని సన్నిధి మీతో ఉంది. రాత్రి 2 సమూయేలు గ్రంథము నేను చదువుతున్నాను. దావీదు వీరుల గురించి అక్కడ వ్రాయబడింది. అందులో నుండి కొన్ని సత్యాలు మీతో పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను. మన బైబిల్ లో 2 సమూయేలు గ్రంథం 23 అధ్యాయం 8 వచనం నుండి కొన్ని మాటలు చదువుదాం:
8 దావీదు అనుచరులలో బలాఢ్యులెవరనగా యోషే బెష్షెబెతను ముఖ్యుడగు తక్మోనీయుడు; అతడు ఒక యుద్ధములో ఎనిమిది వందల మందిని హతము చేసెను.9 ఇతని తరువాతివాడు అహోహీయుడైన దోదో కుమారు డైన ఎలియాజరు, ఇతడు దావీదు ముగ్గురు బలాఢ్యులలో ఒకడు. యుద్ధమునకు కూడివచ్చిన ఫిలిష్తీయులు ఇశ్రాయేలీయులను తిరస్కరించి డీకొని వచ్చినప్పుడు ఇశ్రాయేలీయులు వెళ్లిపోగా ఇతడు లేచి 10 చేయి తివిురి గొని కత్తి దానికి అంటుకొని పోవువరకు ఫిలిష్తీయులను హతము చేయుచు వచ్చెను. ఆ దినమున యెహోవా ఇశ్రాయేలీయులకు గొప్ప రక్షణ కలుగజేసెను. దోపుడుసొమ్ము పట్టుకొనుటకు మాత్రము జనులు అతనివెనుక వచ్చిరి.11 ఇతని తరువాతి వారెవరనగా హరారీయుడగు ఆగే కుమారు డైన షమ్మా;ఫిలిష్తీయులు అలచందల చేనిలో గుంపుకూడగాజనులు ఫిలిష్తీయులయెదుట నిలువలేక పారిపోయిరి.12 అప్పుడితడు ఆ చేని మధ్యను నిలిచి ఫిలిష్తీయులు దాని మీదికి రాకుండ వారిని వెళ్లగొట్టి వారిని హతము చేయుటవలన యెహోవా ఇశ్రాయేలీయులకు గొప్ప రక్షణ కలుగ జేసెను.
దావీదు రాజు యొక్క వీర సైనికుల గురించి మనం ఇక్కడ చదివాము. ఆయనకు అనేక వేల మంది సైనికులు ఉన్నారు. వారందరిలో కొంత మంది ఎంతో శ్రేష్టమైన సైనికులుగా నిలిచారు. 2 సమూయేలు గ్రంథం రాజైన సౌలు మరణముతో మొదలవుతుంది. సౌలు కుళ్ళు బుద్ధి కలిగిన వాడు, అసూయ పరుడు, దేవుని చిత్తానికి లోబడని వాడు,నమ్మకత్వం లేని వాడు, ఇచ్చిన మాట నిలబెట్టు కోలేని వాడు, చివరకు యుద్ధములో ఆత్మ హత్య చేసుకొని తన జీవితం ముగించాడు. సౌలు తరువాత దావీదు ఇశ్రాయేలుకు రాజు అయ్యాడు.
దావీదు లో ఉన్న మంచి లక్షణాలు అతని సైనికులలో కూడా మనకు కనిపిస్తాయి. దావీదు అన్ని పరిస్థితులలో విశ్వాసముతో దేవుని వెంబడించాడు. దేవుని సన్నిధి ని ప్రేమించాడు.దేవుని నామాన్ని స్తుతించాడు. దేవుని ప్రజలను నడిపించాడు. గొల్యాతు లాంటి భయంకరమైన శత్రువును ధైర్యముతో ఎదుర్కొని నేల కరిపించాడు. రాజైన సౌలు ద్వేషము, అసూయతో దావీదును వెంటాడాడు. అప్పుడు కూడా దావీదు దేవుని మీద నమ్మకముతో సౌలు మీద ప్రతీకారం తీర్చుకోలేదు. సౌలు కుమారుడు యోనాతాను తో దావీదు స్నేహం చేశాడు. అతనికిచ్చిన మాటను తరతరాలు నిలబెట్టుకున్నాడు.
దావీదు ఇశ్రాయేలుకు రాజుగా స్థిరపడిన తరువాత అతని కుమారుడు అబ్షాలోము అతని మీద తిరుగు బాటు చేశాడు. యెరూషలేము నుండి దావీదు తన ప్రాణాలు అర చేతిలో పెట్టుకొని పారి పోవలసి వచ్చింది. అబ్షాలోము మరణించినప్పుడు కూడా దావీదు సంతోషించలేదు. కుమారుని మరణ వార్తను విని ఎంతో ఏడ్చాడు. క్షోభించే ప్రేమ కలిగిన తండ్రి హృదయం దావీదు లో మనకు కనిపిస్తుంది. ఇక్కడ 2 సమూయేలు 23 అధ్యాయములో దావీదు జీవితం చివరి దశ మనకు కనిపిస్తుంది. దావీదు దేవునికి చేసిన స్తుతి ఇక్కడ మనకు కనిపిస్తుంది.
5 వచనము
ఆయన నాతో నిత్యనిబంధన చేసియున్నాడు. ఆయన నిబంధన సర్వసంపూర్ణమైన నిబంధనే అది స్థిరమాయెను, దేవునికి పూర్ణానుకూలము అది నాకనుగ్రహింపబడిన రక్షణార్థమైనది. నిశ్చయముగా ఆయన దానిని నెరవేర్చును.
2 సమూయేలు 23:5
దేవుడు తనతో చేసిన నిబంధన ఎలాంటిదో ఇక్కడ దావీదు మనకు తెలియజేస్తున్నాడు.
అది నిత్య నిబంధన
అది సర్వసంపూర్ణమైన నిబంధన
అది స్థిర పరచబడిన నిబంధన
అది దేవునికి పూర్ణానుకూలమైన నిబంధన
అది రక్షణార్థమైన నిబంధన
అది నిశ్చయమైన నిబంధన
ఆ నిత్య నిబంధన ప్రభువైన యేసు క్రీస్తు నందు నెరవేరింది. దావీదు కు దేవుడు కొంత మంది వీరులను ఇచ్చాడు. ప్రభువైన యేసు క్రీస్తు కు కూడా దేవుడు కొంత మంది వీరులను ఇచ్చాడు.
దావీదు యొక్క గొప్ప వీరులు: ఈ గొప్ప వీరులు దావీదు కొరకు చేసిన కార్యములు బైబిల్ గ్రంథములో వివరించ బడ్డాయి. వాటిలో నుండి 7 విషయాలు మనం చూద్దాము.
- ఈ వీరుల యొక్క నేర్పు
యోషే బెష్షెబెతు – ఈ వీరుడు ఒక యుద్ధములో ఎనిమిది వందల మందిని హతము చేసెను. ఎనిమిది వందల మంది శత్రువులను ఒక యుద్ధములో ఎదుర్కోవటం అంటే ఆషా మాషీ వ్యవహారం కాదు. పూర్వం యుద్ధాల్లో కత్తులు, గొడ్డళ్లు, బరిశెలు లాంటి మారణాయుధములతో పోరాడేవారు. అలాంటి యుద్ధాల్లో ఎనిమిది వందల మంది శత్రువులను ఎదుర్కొని, వారిని హతమార్చి ప్రాణాలతో తిరిగి రావాలంటే ఎంతో నేర్పు ఉండాలి. ఏ నిమిషం ఏ ఆయుధాన్ని ఎప్పుడు ఎవరి మీద ఎలా వాడాలో తెలిసి ఉండాలి.
ఈ రోజు మనం మనుష్యుల మీద యుద్ధాలు చేయము. మన శత్రువులు సాతాను అతని దెయ్యాల సమూహములతో మనం యుద్ధం చేస్తున్నాము. ఇక్కడ మనం ఉపయోగించే ఆయుధాలు ఇనుము, ఇత్తడి తో చేయబడినవి కావు. ఇవి ఆత్మ సంబంధమైనవి. మనం ఉప యోగించే ఆయుధం దేవుని వాక్యం. అపోస్తలుడైన పౌలు రెండవ తిమోతి పత్రికలో వ్రాసినట్లు, సత్య వాక్యమును సరిగా విభజించాలి
(2 తిమోతి 2:15)
యేసు క్రీస్తు వీరులకు దేవుని వాక్యమును సరిగా విభజించి, ఉపయోగించే నేర్పు ఉండాలి.
- ఈ వీరుల యొక్క శక్తి
రెండవదిగా ఈ వీరుల యొక్క శక్తి చూడండి. 9 వచనం యుద్ధమునకు కూడివచ్చిన ఫిలిష్తీయులు ఇశ్రా యేలీయులను తిరస్కరించి డీకొని వచ్చినప్పుడు ఇశ్రాయేలీయులు వెళ్లిపోగా ఇతడు లేచి 10 చేయి తివిురిగొని కత్తి దానికి అంటుకొని పోవువరకు ఫిలిష్తీయులను హతము చేయుచు వచ్చెను. శత్రువులైన ఫిలిష్తీయులు ఇశ్రాయేలీయుల మీద విరుచుకు పడ్డారు. అందరూ ప్రాణ భయముతో పారిపోయారు. ఎలియాజరు అనే ఈ వీరుడు ఏమి చేసాడు? కత్తి తీసుకొని ఫిలిష్తీయుల మీద విరుచుకు పడ్డాడు.
రండ్రా, మీ అంతు చూస్తాను అన్నాడు. ఆ యుద్ధములో వారితో ఎలా పోరాడాడంటే, చెయ్యి తిమ్మిరి ఎక్కింది. అతని కత్తి చేతికి అంటుకు పోయింది. ఆ ఖడ్గం చేతి నుండి బయటికి రావటల్లేదు. ఆ వీరుని చేతిలో ఎంత పవర్ ఉందో చూడండి. ఎంత శక్తి ఉందో చూడండి. అలాంటి దేవుని శక్తి యేసు క్రీస్తు నందు విశ్వాసులకు అనుగ్రహించబడింది.
యెషయా ప్రవక్త వ్రాసాడు: బాలురు సొమ్మసిల్లుదురు. అలయుదురు. యౌవనస్థులు తప్పక తొట్రిల్లుదురు. యెహోవాకొరకు ఎదురు చూచువారు. నూతన బలము పొందుదురు. వారు పక్షిరాజులవలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. అలయక పరుగెత్తుదురు. సొమ్మసిల్లక నడిచిపోవుదురు.యేసు క్రీస్తు ప్రభువు దేవుని శక్తి (1 కొరింథీ 1:24) అపోస్తలుడైన పౌలు వ్రాశాడు.
ఎఫెసీ 1:18
విశ్వసించు మన యందు దేవుడు చూపుచున్న తన శక్తియొక్క అపరి మితమైన మహాత్మ్యమెట్టిదో,మీరు తెలిసికొనవలెను. ఆ శక్తిని ఆయన తెలుసుకొన్నాడు. నాలో బలముగా, కార్యసిద్ధికలుగజేయు ఆయన క్రియాశక్తిని బట్టి నేను పోరాడుచు ప్రయాసపడుచున్నాను.క్రైస్తవ విశ్వాస వీరులకు దేవుడు అటువంటి గొప్ప శక్తిని అనుగ్రహిస్తున్నాడు. అది అపరిమితమైన మహాత్యము కలిగినది.
అది రక్షణ కలుగ జేసే సువార్త శక్తి (రోమా 1:16)
అది మహిమ శక్తి (కొలొస్సీ 1:11)
అది యేసు క్రీస్తు కృప వలన వచ్చే శక్తి. కుమారుడా, క్రీస్తుయేసునందున్న కృపచేత బలవంతుడవు కమ్ము.(2 తిమోతి 2:1)
అది పరిశుద్ధాత్ముడు ఇచ్చే శక్తి (ఎఫెసీ 3:15; లూకా 1:35)
అది యేసు క్రీస్తు పునరుత్థాన శక్తి (ఫిలిప్పి 3:10)
అది మరణాన్ని జయించిన శక్తి (హెబ్రీ 2:14; 1 కొరింథీ 6:14)
అది దేవుని క్రియా శక్తి (కొలొస్స 1:29)
అది మన బలహీనతలను అధిగమించే శక్తి (2 కొరింథీ 12:9)
అది సమస్తము మనకు అనుగ్రహించే శక్తి (2 పేతురు 1:1)
అది వాగ్దానములను నెరవేర్చే శక్తి (రోమా 4:21)
అది హృదయాలను మార్చే శక్తి (లూకా 1:17)
ఆ శక్తి మనకు కావాలంటే దేవుడు ఇచ్చే సర్వాంగ కవచమును మనం ధరించుకోవాలి (ఎఫెసీ 6:11)
పౌలు యేసు ప్రభువును వేడుకొన్నాడు. ప్రభువా, ఈ ముళ్ళను తీసివేయి. యేసు ప్రభువు ఆయనతో ఒక మాట అన్నాడు: “నా కృప నీకు చాలును, బలహీనతయందు నాశక్తి పరిపూర్ణమగుచున్నది”. యేసు క్రీస్తు కృప మనకు శక్తి ని యిస్తుంది.
- ఈ వీరుల యొక్క ధైర్యం
మూడవదిగా ఈ వీరుల యొక్క ధైర్యం ఫిలిష్తీయులు అలచందల చేనిలో పడ్డారు. షమ్మా అనే వీరుడు ఏమి చేసాడు. వెళ్లి పొలం మధ్యలో నిలబడ్డాడు. రండ్రా, ఎవడు వస్తాడో చూస్తాను అన్నాడు. ధైర్యముతో, ఒంటరిగా ఫిలిష్తీయులతో పోరాడి వారిని ఓడించాడు. ఆ రోజు దేవుడు గొప్ప రక్షణ వారికి కలుగ జేశాడు. ఈ వీరునిలో ఎంత ధైర్యం ఉందో మీరొక సారి గమనించండి. టంగుటూరి ప్రకాశం పంతులు, లేకపోతే అల్లూరి సీతారామ రాజు కాల్చుకోండ్రా అని బ్రిటిష్ వారికి తమ ఛాతీ చూపించారు. వారికి ఆంధ్ర కేసరి, పల్నాటి సింహం లాంటి పేరులు మనం పెట్టాము. బైబిల్ వీరులు నిజమైన సింహాలను కూడా ఎదుర్కొని వాటిని చీల్చి చెండాడారు. వారి ధైర్యాన్ని చూసి శత్రువులు కూడా వణకిపోయారు. దేవుడు విశ్వాస వీరులకు అటువంటి ధైర్యం అనుగ్రహిస్తున్నాడు.
7 దేవుడు మనకు శక్తియు ప్రేమయు, ఇంద్రియ నిగ్రహమునుగల ఆత్మనే యిచ్చెను గాని పిరికితనముగల
ఆత్మ నియ్యలేదు.(2 తిమోతి 1:7)
యెహోవా నాకు వెలుగును రక్షణయునై యున్నాడు, నేను ఎవరికి భయపడుదును? నాతో యుద్ధము చేయుటకు దండు దిగినను నా హృదయము భయపడదు
(కీర్తన 27:1-3)
గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. (కీర్తన 23:4)
యోహాను సువార్త 14:1 లో యేసు ప్రభువు ఒక మాట అన్నాడు:
మీ హృదయమును కలవరపడనియ్యకుడి; దేవుని యందు విశ్వాసముంచుచున్నారు నాయందును విశ్వాస ముంచుడి.
యోహాను సువార్త 14:1
ఈ వీరులు దేవుని యందు విశ్వాసముంచారు. అందుకనే వారు కలవరపడలేదు, సందేహించలేదు, తొట్రుపడలేదు, సంశయించలేదు, ఆందోళన చెందలేదు, ధైర్యముతో తమ పరిస్థితులను, శత్రువులను ఎదుర్కొన్నారు.
- ఈ వీరుల యొక్క ప్రేమ
ఆ తరువాత ఈ వీరుల యొక్క ప్రేమ చూడండి. దావీదు బెత్లెహేము అనే ఊరిలో పుట్టి పెరిగాడు. అక్కడ ఉన్న ఒక బావి నీరు అంటే ఆయనకు ఎంతో ఇష్టం. కొన్ని సంవత్సరముల తరువాత ఆయనకు ఆ బావి నీరు త్రాగాలి అనిపించింది. సమస్య ఏమిటంటే, ఇప్పుడు బెత్లెహేము ఫిలిష్తీయుల ఆక్రమణలో ఉంది. దావీదు తన హృదయములో ఆశ బయటపెట్టాడు. ‘మా ఊరి బావి లో నీరు త్రాగాలి అని ఉంది’ అని అన్నాడు. ఆ విషయం ముగ్గురు వీరులకు తెలిసింది. వారు బెత్లెహేము వెళ్లారు. ఫిలిష్తీయులు అక్కడ ఉంటారు, చంపేస్తారేమో అని వారు భయపడలేదు. బెత్లెహేము వెళ్లి ఆ బావి నీరు తీసుకొని దావీదు దగ్గరకు వెళ్లారు. వారి చేసిన పని చూసి దావీదు కు మైండ్ బ్లాంక్ అయ్యింది. ఆయన షాక్ కి గురయ్యాడు. ‘ఏంటి మీరు చేసిన పని? నేను నా హృదయములో వున్న ఆశ చెప్పాను కానీ మీరు వెళ్లి నాకు ఆ నీళ్లు తెండి అని చెప్పానా? ఈ నీళ్లు నేను త్రాగలేను. మీ ప్రాణాలు తెగించి ఈ నీళ్లు తెచ్చారు. ఈ నీళ్లు నేను త్రాగితే మీ రక్తం త్రాగినట్లే. దేవునికి మాత్రమే ఇలాంటి వాటిని అర్పించాలి అని దేవునికి ఆ నీటిని అర్పించాడు. (1 దిన వృత్తాంతములు 11)
దావీదు అంటే ఈ వీరులకు అంత ప్రేమ. పిచ్చి ప్రేమ. దావీదు కు ఇది ఇష్టం అని తెలిస్తే చాలు, తమ ప్రాణాలు కూడా లెక్క చేయకుండా దానిని ఆయన కోసం తీసుకు వస్తారు. విశ్వాస వీరులు దేవుని మీద ప్రేమతో జీవిస్తారు. అపోస్తలుడైన పౌలు అన్నాడు: నే నిప్పుడు శరీర మందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి, నా కొరకు తన్నుతాను అప్పగించుకొనిన దేవుని కుమారునియందలి విశ్వాసమువలన జీవించుచున్నాను. (గలతీ 2:20)
‘క్రీస్తు ప్రేమ మమ్ములను బలవంతము చేయు చున్నది’ (2 కొరింథీ 5:14)
యేసు క్రీస్తు నన్ను ఇంతగా ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొన్నాడు.
ఆ ప్రేమ నన్ను బలవంతము చేయుచున్నది.
ఆ ప్రేమ ఆయనను యూదుల మధ్యలోకి తీసుకొని వెళ్ళింది.
వారి సమాజ మందిరములలోకి తీసుకు వెళ్ళింది
ఆ ప్రేమ అన్య జనుల మధ్యలోకి ఆయనను తీసుకువెళ్ళింది
వారి దేవాలయముల దగ్గరకు తీసుకు వెళ్ళింది
ఆ ప్రేమ ఆయనను విశ్వాసుల సంఘముల లోకి తీసుకు వెళ్ళింది
ఆ ప్రేమ ఆయనను జైళ్ల లోకి తీసుకు వెళ్ళింది
ఆ ప్రేమ తత్వవేత్తల తో వాదించింది
ఆ ప్రేమ ఆయనను న్యాయాధి పతుల ముందు నిలబెట్టింది
ఆ ప్రేమ ఆయన శరీరం మీద అనేక గాయాలు చేసింది
ఆ ప్రేమతో ఆయన యూదుల ద్వేషాన్ని ఓర్చుకొన్నాడు
అన్య జనులు పెట్టిన శ్రమలు ఓర్చుకొన్నాడు
ఇతర క్రైస్తవులు పెట్టిన బాధలు ఓర్చుకొన్నాడు
ఆయన చేసిన సమస్త కార్యములు ప్రేమతో చేశాడు.
ఆస్తి పాస్తుల కోసం చేయలేదు
కీర్తి ప్రతిష్టల కోసం చేయలేదు
అధికారం కోసం చేయలేదు
క్రీస్తు ప్రేమ నన్ను బలవంతము చేయు చున్నది.
మదర్ థెరెసా కలకత్తా నగరములో అనాథలను చేర్చుకొని సేవచేసింది. కుష్టు రోగుల గాయాలు కడిగింది. రోగులను ఆదరించింది. వారి కర్మ అలా కాలింది, వారిని పట్టించు కోవద్దు అని సమాజం నిర్లక్ష్యం చేసిన వారికి ఆమె సేవ చేసింది. ఎందుకు చేస్తున్నావు ఈ పనులు? అని ఆమెను అడిగినప్పుడు, ‘నేను క్రీస్తు ప్రేమతో ఈ పనులు చేస్తున్నాను’ అని చెప్పింది. క్రైస్తవ వీరులు దేవుని ప్రేమతో వారు నడిపించబడ్డారు.
- ఈ వీరుల యొక్క నమ్మకత్వం
ఆ తరువాత ఈ వీరుల యొక్క నమ్మకత్వం మనం గమనించాలి. వారు అన్ని పరిస్థితుల్లో దావీదును హత్తుకొని ఉన్నారు. దావీదు ఎక్కడ ఉంటే వారు అక్కడ ఉన్నారు. ఆయన యెరూషలేము లో ఉంటే వారు యెరూషలేము లో ఉన్నారు. అబ్షాలోము తిరుగుబాటు చేసినప్పుడు దావీదు వారితో ఒక మాట అంటాడు: మీరు వెళ్లి అబ్షాలోము క్రింద పనిచేయండి. అయితే వారు దానికి ఒప్పుకోలేదు. దావీదు తన రాజ్యాధి కారం కోల్పోయినప్పుడు కూడా వారు దావీదు దగ్గరే ఉన్నారు. వారి యొక్క నమ్మకత్వం మనకు అక్కడ కనిపిస్తున్నది. వీరు ఎక్కడ అధికారం ఉంటే అక్కడికి పరుగెత్తే రకం రాదు. దావీదు వీరికి ముఖ్యం కానీ ఆయన ఇచ్చే పదవులు కాదు.
శిష్యుడైన యోహాను ప్రభువైన యేసు క్రీస్తు ను చివరి వరకు వెంబడించాడు. రోమన్ సైనికులు యేసు క్రీస్తును అరెస్ట్ చేసి సిలువకు సిద్ధం చేస్తున్నప్పుడు శిష్యులు అందరూ చల్లగా అక్కడ నుండి జారుకున్నారు. అయితే యోహాను మాత్రం యేసు క్రీస్తు దగ్గరే ఉన్నాడు. ఆయన సిలువ దగ్గరలోనే నిలబడ్డాడు. అలాంటి నమ్మకమైన శిష్యుడు యోహాను. విశ్వాస వీరులు అన్ని సందర్భాలలో దేవుని యెడల నమ్మకత్వం కలిగి ఉంటారు. షడ్రకు, మేషకు, అబేద్నెగో – ఈ ముగ్గురినీ బెదిరించారు. నువ్వు ఈ విగ్రహానికి మొక్కాలి, లేకపోతే అగ్ని గుండములో మీ ముగ్గురినీ పడవేస్తాము, మాడి మసై పోతారు’ అయితే ఆ ముగ్గురూ బెదిరిపోయి దేవుని వదిలిపెట్టలేదు. దేవుని యెడల నమ్మకముగా ఉన్నారు. అగ్ని గుండము లోకి కూడా సిద్ధ పడ్డారు. సింహముల బోను చూసి దానియేలు దేవుని వదిలిపెట్టలేదు. సింహముల మధ్య త్రోయబడినప్పుడు కూడా దేవుని యెడల నమ్మకత్వం కనపరిచాడు.
- ఈ వీరుల యొక్క త్యాగం
ఆ తరువాత ఈ వీరుల యొక్క త్యాగం మనం చూడాలి. దావీదు రాజు కోసం వారు తమ ప్రాణాలు కూడా లెక్క చేయలేదు. ఆయన కోసం వారు అనేక శ్రమలు ఓర్చుకొన్నారు. అనేక బాధలు భరించారు. ఎందుకంటే దావీదు వారికి అంత శ్రేష్ఠ మైన వాడు. మరియ ఎంతో విలువైన అత్తరు తీసుకొని యేసు ప్రభువు పాదములకు పూసింది. తన తల జుట్టుతో ఆయన పాదాలు తుడిచింది. చుట్టూ ఉన్న వారు ఏమనుకొన్నారు? డబ్బులు దంగడ కాపోతే, ఈమె చేసే పని ఏమిటి? ఎంతో విలువైన అత్తరు వృథా చేసింది? అనుకొన్నారు. కనీసం ఆయనకు కాళ్లు కడుక్కోవటానికి నీళ్లు కూడా వారు ఇవ్వలేదు. మరియ మాత్రం ఎంతో విలువైనది యేసు ప్రభువు పాదముల మీద పోసింది. ఆయన ఆమెకు అంత శ్రేష్టమైన వాడు.
నా ప్రభువైన యేసుక్రీస్తునుగూర్చిన అతిశ్రేష్ఠమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. ఫిలిప్పీ 3:8
ఆయన కోసము సమస్తము త్యాగం చేసాడు. అపోస్తలుడైన పౌలు తిమోతికి చెప్పాడు. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికునివలె నాతో కూడ శ్రమను అనుభవించుము.
(2 తిమోతి 2:3)
యేసు క్రీస్తు యొక్క మంచి సైనికుని వలె ఒక వీరుడు శ్రమలు అనుభవించటానికి కూడా సిద్ధపడతాడు.
న్యూ యార్క్ టైమ్స్ లో ఒక పాస్టర్ గురించి నేను చదివాను. ఆయన పేరు వినోద్ పాటిల్. మధ్య ప్రదేశ్ రాష్ట్రములో ఒక పాస్టర్. అనేక గ్రామాలకు ఒక బైక్ మీద వెళ్లి ఆయన సువార్త ప్రకటిస్తున్నాడు. ప్రార్ధనా కూటములు నిర్వహిస్తున్నాడు. అనేక మంది రహస్యముగా ఆయన మీటింగ్స్ కి వెళ్ళుతున్నారు. బాప్తిస్మములు ఇస్తున్నాడు. సంఘములు నిర్మిస్తున్నాడు. దీనిని చూసి ఓర్చుకోలేని వారు ఆయనను బెదిరించారు. యేసు క్రీస్తు సువార్త చెబుతున్నావు. నువ్వు చెప్పటానికి వీల్లేదు అని ఆయనను బెదిరిస్తున్నారు. అయితే ఆయన మాత్రం ఒక బైక్ మీద తిరుగుతూ నశించిన ఆత్మలకు యేసు క్రీస్తు సువార్త ప్రకటిస్తున్నాడు. విశ్వాస వీరుడు త్యాగాలకు కూడా సిద్ధపడాలి. దేవుడు అలాంటి విశ్వాస వీరులను మన దేశములో లేపాడు. దానిని బట్టి ఆయనను మనం స్తుతించాలి.
- ఈ వీరుల యొక్క లక్ష్యం
చివరిగా, ఈ వీరులకు లక్ష్యం ఉంది. దావీదు వారి ముందు ఎంత కఠినమైన లక్ష్యం పెట్టినప్పటికీ వారు ఆ లక్ష్యం కోసం పోరాడారు. ఫిలిష్తీయులను ఓడించాలి అంటే ఓడించాలి పట్టణం నిర్మించాలి అంటే నిర్మించాలి. రహదారి వేయాలంటే రహదారి వెయ్యాలి. కాలువ త్రవ్వాలి అంటే కాలువ త్రవ్వాలి. బావి నీళ్లు తేవాలంటే ఆ బావి నీళ్లు తేవాలి. తమ లక్ష్యం కోసం వారు పోరాడారు. ఈ వీరులకు లక్ష్యం ఉంది. దావీదు వారిని ఎందుకు ఎంచుకొన్నాడో వారికి తెలుసు. యేసు క్రీస్తు వీరులు కూడా ఒక లక్ష్యం వైపు పరుగెడుతారు. అపోస్తలుడైన పౌలు ఒక లక్ష్యం వైపు పరుగెత్తాడు. నేను దేని నిమిత్తము క్రీస్తు యేసుచేత పట్టబడితినో దానిని పట్టుకొనవలెనని పరుగెత్తు చున్నాను. ఫిలిప్పి 3:12
యేసు క్రీస్తు ప్రభువు దేని కోసం నన్ను పిలిచాడో దాని కోసం నేను పరుగెడు చున్నాను అన్నాడు. దావీదు యొక్క వీర సైనికుల గురించి ఈ రోజు మనం చూశాము. ఆ వీరులు చేసిన పనులను మనం చూడాలి. ఆ వీరుల యొక్క నేర్పు, శక్తి, ధైర్యం, ప్రేమ నమ్మకత్వం, త్యాగం, లక్ష్యం. వాటి నుండి యేసు క్రీస్తు నందు విశ్వాసముంచిన మనము కూడా నేర్చుకోవాలి. అదే నేటి మా ప్రేమ సందేశం.
REFERENCES