జెకర్యా గ్రంథం పరిచయం: డాక్టర్ పాల్ కట్టుపల్లి

ప్రేమ సందేశం కార్యక్రమం చూస్తున్న సోదరీ సోదరులందరికీ మన ప్రభువైన యేసు క్రీస్తు మహిమ కలిగిన నామములో శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. దేవుని కృప యందు మీరు క్షేమముగా ఉన్నారని తలంచు చున్నాము. బైబిల్ సమాచారం కోసం మా వెబ్ సైట్ దర్శించండి. http://www.doctorpaul.org . మీరు ఈ సందేశాలు మరో సారి చూడాలంటే లేక మిస్ అయిన సందేశాలు చూడాలంటే మా యూట్యూబ్ ఛానల్ దర్శించండి. మా యూ ట్యూబ్ ఛానల్ లో అన్ని సందేశాలు అప్ లోడ్ చేసాము. బైబిల్ పుస్తకాలు పరిచయం అనే అంశం మనం చూస్తున్నాము. దాదాపు పాత నిబంధన చివరకు వచ్చాము.  ఈ రోజు జెకర్యా గ్రంథం నుండి కొన్ని  సత్యాలు మనం చూద్దాము: 

     జెకర్యా  గ్రంథాన్ని ఈ రోజు మీకు ఒక ప్రేమ సందేశం ఇవ్వాలని నేను ఆశ పడుతున్నాను. పాత నిబంధనలో వుండే 12 మంది మైనర్ ప్రొఫెట్స్ అంటే చిన్న ప్రవక్తలలో జెకర్యా 11 వ వాడు. ఇశ్రాయేలు దేశములో డెడ్ సి దగ్గర కేవ్ ఆఫ్ హారర్ అనే గుహలో రెండు వేల సంవత్సరముల నాటి జెకర్యా గ్రంథం ప్రతి ఈ మధ్యలో బయట పడింది. క్రీ పూ 539 లో పర్షియా చక్రవర్తి కోరెషు ఒక ఆజ్ఞ ఇచ్చాడు: బబులోనులో ఉన్న యూదులు తమ దేశానికి తిరిగి వెళ్ళవచ్చు. బబులోను లో నుండి బయలు దేరిన మొదటి గుంపులో జెకర్యా ప్రవక్త, హగ్గయి ప్రవక్త ఉన్నారు. వీరిద్దరూ కలిసి ప్రవచించారు. 

     క్రీ.పూ 520 నుండి జెకర్యా పరిచర్య చేసాడు. తన గ్రంథం వ్రాశాడు. ఇశ్రాయేలీయులు బబులోను చెర నుండి తిరిగి వచ్చిన తరువాత వారికి ఆలయం లేకుండా పోయింది. దేవుడు వారికి కొంతమంది నాయకులను ఇచ్చాడు. గవర్నర్ గా జెరుబ్బాబెలు, ప్రధాన యాజకునిగా యెహోషువ, శాస్త్రిగా ఎజ్రా, గోడలు కట్టే వానిగా నెహెమ్యా,  ప్రవక్తలుగా హగ్గయి, జెకర్యా. ఒక ఆలయం నిర్మించటానికి వారు పూనుకొన్నారు కానీ నిరుత్సాహం వారిని కమ్ముకొంది. 15 సంవత్సరములుగా దేవుని ఆలయం పని ఆగిపోయింది. ఆ సమయములో జెకర్యా ఇశ్రాయేలీయులను ప్రోత్సహించాడు. ఆయన ఇచ్చిన ప్రోద్బలముతో  వారు దేవుని ఆలయం నిర్మించి క్రీ పూ 516 లో ముగించారు.   అంటే, జెకర్యా గ్రంథం వ్రాయబడిన తరువాత 4 సంవత్సరాలకు దేవుని ఆలయం నిర్మించబడింది. ఆ విధముగా జెకర్యా దేవుని ప్రజలను తన ప్రవచనములతో ఉత్సాహ పరచాడు. 

    దేవునికి మనం ఇంకా గుర్తున్నామా అనే సంశయం ఇశ్రాయేలీయులకు కలిగింది. జెకర్యా వారితో ఒక మాట అన్నాడు: దేవుని మాట మీరు వినండి: “మిమ్మును ముట్టినవాడు నా  కనుగుడ్డును ముట్టినట్లే”  జెకర్యా  2:8మిమ్మును పొడిస్తే నా కంటిని పొడిచినట్లే. దేవుడు మీ యందు ఎంతో ఆసక్తి కలిగి ఉన్నాడు. మీ విషయములో దేవునికి గొప్ప ప్రణాళిక ఉంది. 

    జెకర్యా గ్రంథములో 14 అధ్యాయాలు మనకు కనిపిస్తున్నాయి. దాదాపు మొత్తం పుస్తకం ప్రవచనములతో నిండి ఉంది. యేసు క్రీస్తు ను  గురించి చెప్పబడిన ప్రవచనాలు అనేకం మనకు ఈ పుస్తకములో కనిపిస్తాయి. మైనర్ ప్రొఫెట్స్ అందరిలో  ఎక్కువ గా జెకర్యా  క్రీస్తు గురించి ప్రవచించాడు. 

జెకర్యా చూసిన 8 దర్శనాలు 

క్రీ పూ 519 సంవత్సరములో దేవుడు 8 ప్రత్యక్షతలు జెకర్యా కు ఇచ్చాడు. వాటిలో జెకర్యా 8 దర్శనాలు చూశాడు. 

మొదటి దర్శనములో (1:7-17) జెకర్యా అనేక గుఱ్ఱాలు చూశాడు. ‘ఇవి లోకమంతటను తిరుగులాడుటకు యెహోవా పంపించిన గుఱ్ఱములు’. జెకర్యా చుట్టూ చూస్తే ఎంతో స్తబ్దత నెలకొని ఉంది. అసలు దేవుడు ఈ దేశం విషయములో ఏమైనా ఆసక్తి కలిగి ఉన్నాడా? అని అతనికి అనిపించింది. అయితే, ఆ దర్శనములో ఆయన అనేక గుఱ్ఱాలు ప్రపంచం మొత్తం తిరుగు లాడుట చూశాడు. ఆ గుఱ్ఱాలు దేవుని యొక్క కార్యములను సూచిస్తున్నాయి. దేవుడు ఈ ప్రపంచము లో యాక్టీవ్ గా పనిచేస్తున్నాడు. ఏమి లేదబ్బా? ఏమి జరగటం లేదబ్బా అని మనకు అనిపిస్తుంది. కానీ దేవుడు తన గొప్ప కార్యాలు చేస్తూనే ఉన్నాడు. నేను యెరూషలేము విషయములోను సీయోనువిషయములోను అధికాసక్తి కలిగియున్నాను. జెకర్యా 1:14 అని అన్నాడు. దేవుడు ఈ రోజు కూడా ఈ ప్రపంచం పట్ల, తన ప్రజల పట్ల ఎంతో ఆసక్తిని కలిగి ఉన్నాడు. 

2. రెండవ దర్శనములో జెకర్యా 4 కొమ్ములు చూశాడు (1:18-21). ఈ కొమ్ములు నాలుగు ప్రపంచ సామ్రాజ్యాలను సూచిస్తున్నాయి. దేవుడు తన చిత్తం జరిగించుటకు ప్రపంచ సామ్రాజ్యాలను కూడా కదిపించే శక్తి కలవాడని ఆ కొమ్ములలో మనకు కనిపిస్తుంది. ఆది నుండి నేటివరకు – ఐగుప్తీయులు, అషూరీయులు, బబులోనీయులు, పర్షియనులు, గ్రీకులు, రోమన్లు, ఫ్రెంచ్ వారు, బ్రిటిష్ వారు,అమెరికా వారు – ఏ సూపర్ పవర్ ఈ ప్రపంచాన్ని ఏలినప్పటికీ దేవుడు ఇశ్రాయేలు దేశాన్ని సంరక్షిస్తూనే  ఉన్నాడు. ఆ కొమ్ములు దేవుని శక్తిని సూచిస్తున్నాయి. 

3. మూడవ దర్శనములో జెకర్యా యెరూషమును చూశాడు. ఒక దూత యెరూషలేమును కొలుస్తున్నాడు. దేవుడు ఒక మాట అన్నాడు: నేను దానిచుట్టు అగ్ని ప్రాకారముగా ఉందును, నేను దాని మధ్యను నివాసినై మహిమకు కారణ ముగా ఉందును; ఇదే యెహోవా వాక్కు. జెకర్యా 2:5. యెరూషలేమును పునరుద్దరించి, దానిని సంరక్షించే దేవుడు ఆ దర్శనములో కనిపిస్తున్నాడు. యెరూషలేము ఆయన కంటికి ఇప్పుడు కూడా మనోహరముగానే కనిపిస్తున్నది. దాని చుట్టూ నేను అగ్ని ప్రాకారముగా ఉంటాను అని ఆయన అన్నాడు. 

4. నాలుగవ దర్శనములో (3:1-10) జెకర్యా ఒక దేవుని దూతను, ప్రధాన యాజకుడైన యెహోషువను, సాతానును చూశాడు. ఆ దర్శనములో దేవుని దూత న్యాయాధి పతిగా ఉంటే, ప్రధాన యాజకుడైన యెహోషువ ఇశ్రాయేలు దేశమును సూచిస్తున్నాడు. సాతాను అతని మీద ఫిర్యాదు చేస్తున్నాడు. అతని వస్త్రాలు మలినమై మురికిపట్టి వున్నాయి. దూత అతని మురికి వస్త్రాలు తీసివేసి అతనికి తెల్లటి వస్త్రాలు తొడిగించింది. 

    ప్రభువైన యేసు క్రీస్తు రూపం ఆ దర్శనములో మనకు కనిపిస్తున్నది. ఆయన మన పాపపు వస్త్రాలు తీసివేసి మనకు దేవుని నీతి వస్త్రాలు తొడిగించాడు. ‘చిగురు అనే సేవకుడు’ (జెకర్యా 3:8) అక్కడ కనిపిస్తున్నాడు. రాబోయే దేవుని సేవకుడు యేసు క్రీస్తు ను ఆ మాటలు సూచిస్తున్నాయి. ‘ఏడు కన్నులు కలిగిన రాయి’ కూడా ఆ దర్శనములో కనిపించింది. సమస్తమును చూసే సర్వాంతర్యామి అయిన క్రీస్తును ఆ రాయి సూచిస్తున్నది. 

5. ఐదవ దర్శనములో (4:1-14) జెకర్యా ఒక బంగారు దీప స్థంబము ను చూశాడు. ఆ దీప స్థంబము రెండు ప్రక్కల రెండు ఒలీవ చెట్లు కనిపిస్తున్నాయి. ఆ దీప స్థంబము యేసు క్రీస్తు ను సూచిస్తున్నది. ఆయన ఈ లోకమునకు వెలుగు. ‘నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు  చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగి ఉండును’ అన్నాడు. ఆ రెండు ఒలీవ చెట్లు ఏడేండ్ల శ్రమల కాలములో ఈ ప్రపంచానికి తీర్పు తీర్చే ఇద్దరు సాక్షులను సూచిస్తున్నారు. 

Zechariah’s 5th Vision: Menorah and two olive trees (Zechariah 4). Wood engraving, published in 1886.

ప్రకటన 11:3 లో ఆ విషయం మనకు అర్ధం అవుతుంది. శక్తిచేత నైనను బలముచేతనై ననుకాక నా ఆత్మచేతనే నేను ఇది జరిగిస్తాను. జెకర్యా 4:6  అని ఆ దర్శనములో దేవుడు జెకర్యా తో అన్నాడు. మన శక్తి, మన బలం కాదు, దేవుని ఆత్మ పనిచేయాలి. అప్పుడే మన చీకటి తొలగి పోతుంది. 

6. ఆరవ దర్శనములో (5:1-4) జెకర్యా ఎగిరి పోవు పుస్తకము చూశాడు. అది దేవుని ఆజ్ఞలను సూచిస్తున్నది. అది భూమి మీదకు వచ్చే శాపము గా చెప్పబడింది (3 వ). దేవుని ఆజ్ఞలు తిరస్కరించే వారి మీదకు దేవుని శాపం దిగి వస్తుంది. అది వారిని దేవుని సన్నిధి నుండి నిర్మూలిస్తుంది. 

7. ఏడవ  దర్శనములో (5:5-11) అక్కడ ఒక కొల కనిపించింది. ఒక స్త్రీ కూడా కనిపించింది. ఆమె దోష మూర్తి అని పిలువబడింది. ఆమె అబద్ద మత వ్యవస్థలను సూచిస్తున్నది. ఆ అబద్ద మత వ్యవస్థలు యేసు క్రీస్తు నందు దేవుడు ఏర్పరచిన మార్గము ను ఒప్పుకోవు. తమ స్వంత మార్గాల్లో దేవుని యొద్దకు వెళ్లాలని అవి ప్రయత్నిస్తాయి. 

8. ఎనిమిదవ దర్శనములో (6:1-8) రెండు పర్వతములు మనకు కనిపిస్తున్నాయి. అవి ఇత్తడితో చేయబడ్డాయి. ఇత్తడి దేవుని తీర్పుకు సాదృశ్యముగా వుంది. వాటి మధ్యలో నుండి నాలుగు రథములు బయలుదేరాయి. ఆ రథములు బలమైన గుఱ్ఱముల చేత లాగబడుతున్నాయి. సర్వలోకానికి తీర్పు తీర్చేవానిగా దేవుడు మనకు ఈ దర్శనములో కనిపిస్తున్నాడు. 

    ఈ ఎనిమిది దర్శనాలు చూసిన తరువాత దేవుని ప్లాన్ జెకర్యా ప్రవక్తకు అర్థం అయ్యింది. ఒక్కొక్క దర్శనములో దేవుడు తన ప్రజల పట్ల తనకు ఉన్న ఉద్దేశాలు, ప్రణాళికలు జెకర్యాకు తెలియజేశాడు. ఆ తరువాత 7-8 అధ్యాయాల్లో చూస్తే, ఇశ్రాయేలీయులు ఉపవాస పండుగ చేయాలా వద్దా అని దేవుని అడిగారు. దేవుడు వారికి యేమని సమాధానం చెప్పాడంటే, ఉపవాసము కన్నా మీ ప్రవర్తన నాకు ముఖ్యం. సత్యము ననుసరించి తీర్పు తీర్చుడి, ఒకరియందొకరు కరుణా వాత్సల్యములు కనుపరచుకొనుడి.విధవరాండ్రను తండ్రిలేనివారిని పరదేశులను దరిద్రులను బాధపెట్టకుడి,మీ హృదయ మందు సహోదరులలోఎవరికిని కీడు చేయ దలచకుడి.

                          జెకర్యా 7:9-10

మంచి పనులు చేయకుండా ఉపవాస ప్రార్ధనలు చేయడం వలన ప్రయోజనం ఉండదు అని జెకర్యాకు చెప్పాడు. ఆ తరువాత 9-11 అధ్యాయాల్లో మనకు ఇశ్రాయేలీయుల అవిధేయత వారికి కలిగించిన కీడు మనకు కనిపిస్తుంది. 

11 అధ్యాయములో ఒక నిజమైన కాపరి కనిపిస్తున్నాడు. రాబోయే మెస్సియా తన ప్రజలకు కాపరి గా ఉంటాడు. అయితే ప్రజలు ఆ మంచి కాపరిని తిరస్కరించి బుద్ధి లేని కాపరిని కోరుకొంటారు. ఈ బుద్ధి లేని కాపరి ఎవరంటే క్రీస్తు విరోధి, అంత్య క్రీస్తు. 12 అధ్యాయములో చూస్తే, యెరూషలేము మీద శత్రు దేశాలు చేయబోయే యుద్ధం మనకు కనిపిస్తుంది. దీనిని ఆర్మగెద్దోను యుద్ధం అన్నారు. నేను యెరూషలేమును  చుట్టునున్న జనులకందరికి మత్తు పుట్టించు పాత్రగా చేయబోవుచున్నాను. జెకర్యా 12:2 

అన్య జనుల భీకరమైన సైన్యాలు యెరూషలేము మీదకు విరుచుకుపడినప్పుడు నేను దానిని కాపాడుతానని దేవుడు వారికి వాగ్దానం చేశాడు.  ఆ సమయములో ఇశ్రాయేలీయులు బుద్ధి తెచ్చుకొని తమ అవిధేయతను బట్టి దుఃఖిస్తారు అని ప్రవక్త చెబుతున్నాడు (12:10). 13 అధ్యాయములో ఇశ్రాయేలీయుల అపవిత్రతను దేవుడు కడిగివేయడం, వారి దేశము నుండి అబద్ధ ప్రవక్తలను తీసివేయడం మనం చూస్తాము. చివరిగా 14 అధ్యాయములో మెస్సియా యొక్క రెండవ రాకడ, ఆయన ఒలీవల కొండ మీద పాదం మోపి ఈ లోకంలోకి తిరిగి రావడం, ఆయన యెరూషలేములో ప్రవేశించడం, తన రాజ్యమును స్థాపించడం, ఆ దేశమును పవిత్రపరచడం మనకు కనిపిస్తాయి. జెకర్యా 2:12 లో ఇశ్రాయేలు దేశం ‘holy land’ అని పిలువబడింది. మెస్సియా తిరిగి వచ్చినప్పుడు ఆ దేశం నిజమైన రీతిలో పవిత్ర పరచబడుతుంది. 

   ఆ విధముగా, ఈ జెకర్యా గ్రంథము లోని 14 అధ్యాయాలు మనం చదివితే, ఇశ్రాయేలు దేశం పట్ల, అన్య జనుల పట్ల, క్రైస్తవ సంఘం పట్ల దేవుని యొక్క ప్రణాళిక మనకు కనిపిస్తుంది. 

    మన ప్రభువైన యేసు క్రీస్తు ను గూర్చిన ప్రవచనాలు కూడా జెకర్యా గ్రంథములో మనకు స్పష్టముగా కనిపిస్తున్నాయి. ఆయన గాడిద మీద కూర్చుని యెరూషలేము వెళ్తాడు, 30 వెండి నాణెములకు అమ్మబడతాడు,పొడవబడుతాడు అని జెకర్యా ప్రవక్త చెప్పాడు. ఈ గ్రంథములో యేసు క్రీస్తును గూర్చిన మాటలు చూద్దాము: 

జెకర్యా గ్రంథములో యేసు క్రీస్తు 

  1. దేవుని చిగురు: యేసు క్రీస్తు దేవుని చిగురు. ఆయన దేవుని కొమ్మ. 

చెట్లు లేకపోతే ఈ ప్రపంచములో జీవం ఉండదు. మనకు ఆక్సిజన్ అందించేవి 

చెట్లే, మనకు ఆహారం ఇచ్చేవి చెట్లే, మనకు నీడను ఇచ్చేవి చెట్లే. ప్రభువైన యేసు క్రీస్తు మనకు జీవం, మనకు జీవాహారం, మనకు దేవుని నీడ. 

  1. దేవుని నిర్మాణకుడు : 

“అతడు యెహోవా ఆలయము కట్టును.

అతడే యెహోవా ఆలయము కట్టును”

ప్రభువైన యేసు క్రీస్తు దేవుని ఆలయము కట్టుచున్నాడు. ఆయన యందు నమ్మకం 

ఉంచిన ప్రతి విశ్వాసి దేవుని ఆలయములో సజీవమైన రాయిగా ఉన్నాడు. ఆయన 

యెరూషలేములో ఒక భౌతిక మైన ఆలయము కూడా నిర్మిస్తాడు. యెహెఙ్కేలు గ్రంథము లో (40-48) దాని గురించి మనం చదువుతాము. 

  1. దేవుని రాజు 

“అతడు ఘనత వహించుకొని 

సింహాసనా సీనుడై యేలును”

500 సంవత్సరముల తరువాత ఈ ప్రవచనం నెరవేరింది. 

9 వచనం మొదటి రాకడలో నెరవేరింది. ప్రభువైన యేసు క్రీస్తు ఒక గాడిద మీద కూర్చొని యెరూషలేములో ప్రవేశించాడు. దేవుని యొక్క రాజు ఎంతో దీనునిగా యెరూషలేములో ప్రవేశించాడు. యెరూషలేము పాలకులు ఆయనను పట్టించుకోలేదు. కానీ సామాన్య ప్రజలు చిన్న పిల్లలు తమ బట్టలు రోడ్డు మీద పరచారు. చెట్ల కొమ్మలు ఆయన ఎదుట పరచారు. మనకు దేవుని నీతి వస్త్రాలు ఇవ్వటానికి వచ్చిన రాజు, ఆయన ఎదుట మన వస్త్రాలు పరచుటకు ఆయన యోగ్యుడే. మన జీవితాలను చిగురింప జేసే దేవుని కొమ్మ ఆయన ఎదుట మన చెట్ల కొమ్మలు పరచుట మంచిదే. ఎంతో దీనత్వముతో ఒక గాడిద మీద కూర్చుని యెరూషలేములో ప్రవేశించాడు. 

   ముందుగా జెకర్యా ప్రవక్త అలెగ్జాండర్ చక్రవర్తి గురించి ప్రవచించి ఆ తరువాత యేసు క్రీస్తు గురించి ప్రవచించాడు. అలెగ్జాండర్ ఎంతో అట్టహాసముగా గుఱ్ఱములతో, గొప్ప సైన్యముతో యెరూషలేములో ప్రవేశించాడు. అయితే దేవుని కుమారుడు ఎంతో దీనునిగా ఒక గాడిద మీద ఎక్కి యెరూషలేము వెళ్ళాడు. 

   10 వచనం రెండవ రాకడలో నెరవేరుతుంది. యేసు క్రీస్తు రెండవ సారి రాబోవుతున్నాడు. అప్పుడు ఆయన ఈ ప్రపంచం మొత్తాన్ని పరిపాలించే రాజుగా ఉంటాడు. అన్యజనులకు కూడా ఈ రాజు రక్షకుడు అవుతాడు అని జెకర్యా చెప్పాడు. భవిష్యత్తులో అన్యజనులు కూడా యెరూషలేము వెళ్లి నిజ దేవుని ఆరాధిస్తారు అని జెకర్యా (8:22-23) తెలియజేశాడు. యూదులు ఆశీర్వదించ బడితే అన్యజనులు కూడా ఆశీర్వదించ బడతారు. ఎందుకంటే నీయందు నేను సర్వలోక ప్రజలను ఆశీర్వదిస్తాను అని దేవుడు అబ్రహాముకు వాగ్దానం చేశాడు. 

  1. దేవుని యాజకుడు 

“సింహాసనాసీనుడై అతడు యాజకత్వము చేయును” 

సింహాసనాసీనుడైన ఈ రాజు యాజకత్వము కూడా చేస్తాడు. ఆయన మహా రాజు – మహా యాజకుడు. అది ఆయనకు మాత్రమే సాధ్యం. ఇశ్రాయేలీయులకు యాజకులు ఉన్నారు. వారంతా లేవీ గోత్రం నుండి రావాలి. వారికి రాజులు ఉన్నారు. వారంతా యూదా గోత్రం నుండి రావాలి. అంటే ఒక్క మనిషే యాజకునిగా – రాజుగా ఉండడం ఇశ్రాయేలీయులకు సాధ్యపడదు. అయితే యేసు క్రీస్తు మెల్కి సెదెకు క్రమములో మనకు యాజకుడు అయ్యాడు. ఆయన యూదా గోత్రపు సింహం. 

ఒక వైపు సింహాసనాసీనుడుగా ఉండి రాజరికం చేస్తాడు, మరో వైపు యాజకత్వము చేస్తాడు. ఆయన యందు విశ్వాస ముంచిన వారు రాజులైన యాజక సమూహములో చేరారు. 

  1. ఆయన దేవుని కాపరి 

“ఖడ్గమా, నా గొఱ్ఱల కాపరిమీదను నా సహకారి మీదను పడుము” 13:7 మన మీద పడవలసిన దేవుని ఖడ్గం దేవుని కాపరి మీద పడింది. గొఱ్ఱెల కాపరి మన కొరకు తన ప్రాణం పెట్టాడు. వారు యేసు క్రీస్తును  30 తులముల వెండికి అమ్ముకొంటారు అని జెకర్యా ప్రవచించాడు (జెకర్యా 11:12-13) దేవుని కాపరిని వారు 30 తులముల వెండికి అమ్ముకున్నారు. అది వారి దౌర్భాగ్యం. 

జెకర్యా ప్రవక్త ఏమని చెప్పాడంటే, ఇశ్రాయేలీయులు భవిష్యత్తులో ఒక రోజు తమ తప్పు తెలుసుకొంటారు. ఆ కాపరిని వారు హత్తుకొంటారు. 

“వారు తాము పొడిచిన నామీద దృష్టి యుంచుతారు” జెకర్యా 12:10

  ఆ కాపరిని వారు గాయపెట్టారు, పొడిచారు,సిలువ వేయించారు. అయితే ఒక రోజు 

దేవుడు వారి కన్నులు తెరుస్తాడు. వారు పొడిచిన యేసు క్రీస్తును వారు చూస్తారు. 

పరిశుద్దాత్మ మేలుకొలుపు వారికి ఇస్తాడు అప్పుడు వారు తమ తప్పు  తెలుసుకొని 

దేవుని  ఎదుట పశ్చాత్తాపముతో కన్నీరు  పెట్టి, రక్షణ పొందుతారు. 

  1. ఆయన దేవుని రాయి 

(10:4, 4:10) జెకర్యా ప్రవక్త ‘దేవుని రాయి’ గురించి తెలియజేశాడు. ఆ రాయి ఎవరంటే ప్రభువైన యేసు క్రీస్తే. 

ఆయన మూల రాయి (మత్తయి 21:42; 1 పేతురు 2:7) 

అడ్డు  రాయి (1 పేతురు 2:8)

తిరస్కరించబడిన రాయి (కీర్తన 118:22-23)

కొట్టబడిన రాయి (1 కొరింథీ 10:4) 

శక్తి కలిగిన రాయి (దానియేలు 2:34-35) 

ఈ రోజు చూస్తే, ప్రపంచ భవిష్యత్తు ఆందోళన కరముగా ఉంది. ఈ కరోనా ఎప్పుడు పోతుందో ఎవరికీ తెలియదు. ఆందోళన మన జీవితాలను కమ్ముకొంది. ఇలాంటి సమయములో మనకు ధైర్యం ఇచ్చేది ఎవరు? భద్రత ఇచ్చేది ఎవరు? నిశ్చయత ఇచ్చేది ఎవరు? మనకు భద్రత కావాలంటే, క్రీస్తు అనే రాయి మీద మనం నిలబడాలి. ఈ మధ్యలో వార్తలలో మనం చూశాము. 

   ప్రధాన మంత్రి మోడీ పంజాబ్ పర్యటనలో ఆయన భద్రతా వలయం దెబ్బతింది. ప్రధాన మంత్రిని కాపాడటానికి SPG స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ అనే ప్రత్యేక దళం ఉంటుంది. అందులో 3000 ఉంటారు. వారి సంవత్సరం బడ్జెట్ 600 కోట్లు. ఆ 3000 మంది కి ఇవ్వబడిన పని ఒక్కటే : ప్రధాన మంత్రి ప్రాణాలు కాపాడటం. నాకు ఒక్కడు కూడా లేడు కదా, అలాంటి భద్రత నాకు లేదుకదా అని మనకు అనిపించవచ్చు. అయితే  క్రీస్తు నందు దేవుడు మనకు ఎంతో గొప్ప భద్రత అనుగ్రహించాడు. విశ్వాసికి అంత కంటే  గొప్ప భాగ్యం మరొకటి లేదు. క్రీస్తు అనే రాయి లో మీరు భద్రపరచ బడ్డారు. ఆ రాయికి 7 కన్నులు ఉన్నాయి అని జెకర్యా చెబుతున్నాడు. అంటే అది సంపూర్ణ వీక్షణం. SPG కన్నులు అయినా కప్పోచ్చు కానీ ఆయన కన్నులు ఎవరూ కప్పలేరు. అను నిత్యం ఆయన మనలను చూస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, మిమ్మును ముట్టుకొంటే నా కన్ను పొడిచినట్లే అని అంటున్నాడు. తన ప్రజల శ్రమలు అనుభవించే రక్షకునిగా, వారిని భద్రపరిచే రాయిగా ప్రభువైన యేసు క్రీస్తు ఇక్కడ మనకు కనిపిస్తున్నాడు. 

జెకర్యా గ్రంథం ఈ రోజు మనం ధ్యానించాము. ప్రభువైన యేసు క్రీస్తు ను గూర్చిన అనేక ప్రవచనాలు ఈ పుస్తకములో మనకు కనిపిస్తున్నాయి. 

ఆయన దేవుని చిగురు, 

దేవుని నిర్మాణకుడు 

దేవుని రాజు, 

దేవుని యాజకుడు 

దేవుని కాపరి 

దేవుని రాయి 

‘ వారు తాము పొడిచిన వానిని చూస్తారు’ అని జెకర్యా తెలియజేశాడు. నీకై పొడవబడిన క్రీస్తును నీవు చూశావా? నీ రక్షకునిగా ఆయనను అంగీకరించావా? ఈ రోజు మీరు ఆ భాగ్యం పొందాలన్నదే మా ప్రేమ సందేశం. 

Leave a Reply