
బైబిల్ పుస్తకాలు పరిచయం అనే అంశం మనం ధ్యానం చేస్తున్నాము. దాదాపుగా పాత నిబంధన మొత్తం కవర్ చేసాము. మీరు ఏ కార్యక్రమం అయినా మిస్ అయితే మీరు వాటిని మా వెబ్ సైట్ లో చూడవచ్చు, చదవవచ్చు. ఈ రోజు మలాకీ గ్రంథం మనం స్టడీ చేసి పాత నిబంధన ముగిద్దాము.
పాత నిబంధన లో మలాకీ గ్రంథం నుండి ఈ రోజు మీకు ఒక ప్రేమ సందేశం ఇవ్వాలని నేను ఆశ పడుతున్నాను. ఈ మలాకీ ప్రవక్త ఎప్పుడు జీవించాడు, ఎక్కడ జీవించాడు? ఈ చార్ట్ చూడండి. ఇశ్రాయేలీయులు బబులోనులో 70 సంవత్సరములు చెరలో ఉన్న తరువాత వారు తిరిగి ఇశ్రాయేలు దేశం తిరిగి వచ్చారు. అప్పుడు దేవుడు 3 ప్రవక్తలను వారి యొద్దకు పంపించాడు. వీరిని post- exilic prophets అని పిలుస్తాము. అంటే బబులోను చెర తరువాత వీరు దేవుని వాక్యం వినిపించారు. ఈ ముగ్గురి తరువాత 400 సంవత్సరాలు నిశ్శబ్దం నెలకొంది. బాప్తిస్మ మిచ్చే యోహాను ఆ నిశ్శబ్దానికి ముగింపు పలికి దేవుని స్వరం తిరిగి వినిపించాడు. మలాకీ ప్రవక్త వ్యక్తిగత జీవితం గురించి మనకు ఎలాంటి వివరాలు ఇవ్వబడలేదు.

క్రీ. పూ 586 – యెరూషలేము పతనం చెందింది
క్రీ. పూ 538 – బబులోను చెర నుండి మొదటి
గుంపు తిరిగి వచ్చింది
క్రీ.పూ 520 – 480 : హగ్గయి, జెకర్యా ప్రవక్తలు
ప్రవచించారు
క్రీ.పూ 520 – జెకర్యా గ్రంథం వ్రాయబడింది
క్రీ.పూ 516 – దేవుని ఆలయం నిర్మించబడింది
క్రీ.పూ 458 : బబులోను చెర నుండి రెండవ
గుంపు తిరిగి వచ్చింది (ఎజ్రా నాయకత్వం)
క్రీ.పూ 445 : బబులోను చెర నుండి మూడవ
గుంపు తిరిగి వచ్చింది (నెహెమ్యా నాయకత్వం)
క్రీ.పూ 440 – 430: మలాకీ ప్రవచనం
క్రీ. పూ 430 లో మలాకీ గ్రంథం వ్రాయబడింది
యెరూషలేము లో దేవుని ఆలయం తిరిగి నిర్మించాల్సి వచ్చింది. హగ్గయి, జెకర్యా ప్రవక్తలు దేవుని ఆలయం నిర్మించుటలో ప్రజలను ప్రోత్సహించారు. వారు మంచి దేవాలయము నిర్మించుకున్నారు. బాగానే ఉంది. కానీ వారు కొంత కాలానికి చల్లబడిపోయారు. దేవుని మాట వినకుండా తమ స్వంత మార్గాలకు తొలగిపోయారు. అప్పుడు దేవుడు వారి మీద 5 ఆరోపణలు చేసాడు.
దేవుడు చేసిన 5 ఆరోపణలు
- సంవాదం (Right Worship, Absence of)
మొదటిగా వారి సంవాదం.
వారు దేవునితో
వివాదం పెట్టుకొన్నారు. దేవునితో వ్యంగ్యముగా వ్యాజ్యం చేశారు. దేవునికి తిరుగు ప్రశ్నలు వేశారు. వారికి రైట్ వర్షిప్ లేదు. ఆ దేవుని ఆలయములో వారు చేసే ఆరాధన దేవునికి నచ్చలేదు. వారు false worship చేస్తున్నారు. వారు చేసే తప్పుడు ఆరాధన దేవుని హృదయానికి సంతోషం ఇవ్వలేదు. వారిని హెచ్చరించి, గద్దించి మంచి మార్గములో పెట్టడానికి దేవుడు వారి యొద్దకు మలాకీ ప్రవక్తను పంపించాడు. వారిలో సత్యము లేదు. సత్యము గల ధర్మ శాస్త్రము బోధించే యాజకులు వారిలో లేరు (మలాకీ 2:6)
అందుకనే వారు దేవుని ప్రేమను శంకించారు. దేవుడు వారి యెడల తనకు ఉన్న ప్రేమను వారికి తెలియజేశాడు. మొదటి అధ్యాయం లో మనం చదువుతాము:
ఇశ్రాయేలీయులను గూర్చి మలాకీ ద్వారా పలుక బడిన యెహోవా వాక్కు.యెహోవా సెలవిచ్చునదేమనగా నేను మీయెడల ప్రేమ చూపియున్నాను, అయితే మీరుఏ విషయమందు నీవు మాయెడల ప్రేమ చూపితివందురు. ఏశావు యాకోబునకు అన్న కాడా? అయితే నేను యాకోబును ప్రేమించితిని; ఇదే యెహోవా వాక్కు. మలాకీ 1:1-2
దేవుడు వారితో ఒక మాట అన్నాడు: నేను మీకు ఎంతో ప్రేమ చూపించాను. వెంటనే వారు దేవునితో వాదం పెట్టుకొన్నారు. ఆయనను ప్రశ్నించారు: ప్రేమ చూపించావా? ఎప్పుడు? ఎక్కడ? ఎలా? మాకు నీ ప్రేమ ఎక్కడా కనిపించటల్లేదు అన్నారు. కొంతమందికి ఎంత చేసినా, వారు ‘మాకేం చేశావు బూడిద ? నువ్వు మాకు చిల్లి గవ్వ కూడా ఇవ్వలేదు నువ్వు మాకు చేసింది ఏమీ లేదు’ అంటారు. ఇక్కడ ఇశ్రాయేలీయులు కూడా దేవా, మాకు చేసింది ఏమీ లేదు అంటున్నారు.
దేవుడు అబ్రహాము ను పిలిచి వారితో ఒక నిబంధన చేశాడు. అది ప్రేమ కాదా?
వారు ఐగుప్తు దేశములో బానిసత్వములో మ్రగ్గుతున్నప్పుడు వారిని దర్శించాడు. అది ప్రేమ కాదా?
ఐగుప్తు చక్రవర్తి ఫరో ని శిక్షించి, అతని బలమైన చేతి నుండి వారిని విడిపించి మోషే నాయకత్వములో వారిని ఎఱ్ఱ సముద్రం దాటించాడు. అది ప్రేమ కాదా?
40 సంవత్సరములు అరణ్యములో రాత్రిపగలు వారి తో నడిచి, వారిని పోషించాడు. అది ప్రేమ కాదా?
పాలు, తేనెలు ప్రవహించే ఒక చక్కని దేశములో వారిని స్థిరపరచాడు. అది ప్రేమ కాదా?
వారు పాపములో కూరుకుపోయినప్పుడు, అనేక మంది ప్రవక్తలను వారి యొద్దకు పంపి వారిని హెచ్చరించాడు. అది ప్రేమ కాదా?
బబులోను కు చెరగా వారు వెళ్లిపోయిన తరువాత తిరిగి వారిని తమ దేశమునకు తీసుకు వచ్చాడు. అది ప్రేమ కాదా? అయితే వారు దేవుని ప్రేమను చూడలేదు. అందుకనే వారికి దేవుని పట్ల ఎలాంటి కృతజ్ఞత లేదు. ఫలితముగా వారు సరైన రీతిలో దేవుని ఆరాధించ లేకపోతున్నారు. యేసు ప్రభువు సమరయ స్త్రీ లో ఒక మాట అన్నాడు: దేవుడు ఆత్మగనుక ఆయనను ఆరాధించు వారు ఆత్మతోను సత్యముతోను ఆరాధింపవలెను.
యోహాను 4:24
మనలో సత్యం ఉంటేనే మనం నిజమైన ఆరాధన చేయగలం. వారిలో సత్యం లేదు అందుకనే వారు నిజమైన ఆరాధన చేయ లేకపోతున్నారు. వారు చేసే ఆరాధన దేవుని హృదయానికి ఎలాంటి సంతోషం ఇవ్వలేదు. సాతానుడు మనకు అబద్ధాలు చెప్పి మనం సరైన ఆరాధన చేయకుండా చేస్తాడు. ‘దేవుడు నీకు ఏమి చేశాడు? దేవుడు నీకు చేసింది ఏమీ లేదు. నువ్వు అనవసరముగా టైం వేస్ట్ చేసుకోవద్దు. నువ్వు చర్చి కి వెళ్లడం కూడా దండగే’ సాతాను అబద్ధాలు నమ్మి చాలా మంది సత్యముతో, సంతోషముతో, హృదయపూర్వకముగా దేవుని ఆరాధన చేయలేకపోతున్నారు. మలాకీ వారితో అన్నాడు: కాబట్టి మీ మనస్సులను కాచుకొనుడి, విశ్వాసఘాతకులు కాకుడి. (2:16)
రెండవదిగా, వారి సమర్పణ (Right Offerings, Absence of)
రెండవదిగా దేవుడు వారి సమర్పణను తప్పుపట్టాడు. వారి సమర్పణ ఎలా ఉందో మనం చూద్దాము:
7 వచనం
7 నా బలిపీఠముమీద అపవిత్రమైన భోజనమును మీరు అర్పించుచున్నారు. 8 గ్రుడ్డిదానిని తీసికొని బలిగా అర్పించిన యెడల అది దోషముకాదా? కుంటిదానినైనను రోగముగల దానినైనను అర్పించిన యెడల అది దోషముకాదా?
మలాకీ 1:7-8
అపవిత్రమైన వాటిని, గ్రుడ్డి వాటిని, కుంటి వాటిని, రోగము గల వాటిని, చెడిపోయిన వాటిని, కుళ్లిపోయిన వాటిని వారు దేవునికి అర్పిస్తున్నారు. వారు శ్రేష్టమైన వాటిని, విలువైన వాటిని, మంచివాటిని, పరిపూర్ణమైనవి దేవునికి ఇవ్వలేదు. ‘గుడ్ క్వాలిటీ ఉన్నవి మనం ఉంచుకొందాము, లో క్వాలిటీ ఉన్నవి దేవునికి ఇద్దాము’ అనుకొన్నారు. మానవుడు దేవుని యొద్ద దొంగిలునా? అయితే మీరు నా యొద్ద దొంగిలితిరి; దేనివిషయములో మేము నీయొద్ద దొంగిలితిమని మీరం దురు. పదియవ భాగమును ప్రతిష్ఠితార్పణలను ఇయ్యక దొంగిలితిరి.
మలాకీ 3:8
నాకు సమర్పించవలసిన ప్రతిష్టార్పణలు మీరు నాకు ఇవ్వకపోతే నా యొద్ద నుండి దొంగిలించినట్లే. ఆ సందర్భములో దేవుడు వారికి యేసు క్రీస్తును గురించిన ఒక ప్రవచనం చేశాడు.
ఇదిగో నాకు ముందుగా మార్గముసిద్ధపరచుటకై నేను నా దూతను పంపుచున్నాను; మీరు వెదకుచున్న ప్రభువు, అనగా మీరు కోరునిబంధన దూత, తన ఆలయమునకు హఠాత్తుగా వచ్చును; ఇదిగో ఆయన వచ్చుచున్నాడని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చు చున్నాడు
మలాకీ 3:1
400 సంవత్సరముల తరువాత ఈ ప్రవచనం నెరవేరింది. “ఇదిగో నాకు ముందుగా మార్గము సిద్ధపరచుటకై నేను నా దూతను పంపుచున్నాను” ఎవరీ దూత? బాప్తిస్మమిచ్చే యోహాను ఆయన ప్రభువు మార్గము సిద్ధపరచాడు. యేసు క్రీస్తు ప్రభువు కు మార్గం సిద్ధం చేశాడు.
“మీరు వెదకుచున్న ప్రభువు, అనగా మీరు కోరు నిబంధన దూత, తన ఆలయమునకు హఠాత్తుగా వచ్చును” ఈ ప్రవచనము యేసు క్రీస్తు నందు నెరవేరింది. ఆయన రెండు విధములుగా ఇక్కడ పిలవబడ్డాడు.
మీరు వెదకుచున్న ప్రభువు
మీరు కోరు నిబంధన దూత
దూత అంటే గాబ్రియేలు, మిఖాయేలు వంటి దేవ దూత కాదు; ఆయన ఒక మెసెంజర్, వర్తమానికుడు, సందేశం తెచ్చేవాడు అని అర్థం. అంటే దేవుడే ఒక వర్త మానికుడు, దేవుడే ఒక సందేశముతో మన యొద్దకు వచ్చాడు. ఆయన “తన ఆలయమునకు హఠాత్తుగా వచ్చును”
యెరూషలేములో ని ఆలయములోకి ప్రభువైన యేసు క్రీస్తు అకస్మాత్తుగా వెళ్ళాడు. హఠాత్తుగా వెళ్ళాడు. ప్రధాన యాజకులు దానిని ఒక వ్యాపారకేంద్రముగా మార్చివేశారు. యేసు క్రీస్తు యొక్క ఉగ్రరూపం వారు చూశారు. ‘మీరు నా తండ్రి ఇంటిని దొంగల గుహగా చేశారు’ అని వారిని అక్కడ నుండి వెళ్ళగొట్టాడు. నాకు ఇవ్వాల్సిన వాటిని ఇవ్వకుండా దొంగిలించుకోవడమే కాకుండా నా ఆలయాన్నే మీరు దొంగల గుహగా మార్చివేశారు. దేవుడు వారి సమర్పణలను తప్పు పట్టాడు.
మూడవదిగా వారి సంబంధం (Right Relationships)
ఇశ్రాయేలీయుల సంబంధము లను కూడా దేవుడు తప్పు పట్టాడు. యౌవన కాలమందు నీవు పెండ్లి చేసికొని అన్యాయముగా విసర్జించిన నీ భార్య పక్షమున యెహోవా సాక్షియాయెను, అది నీకు తోటిదై నీవు చేసిన నిబంధనకు పాత్రురాలు గదా, నీ పెండ్లి భార్య గదా.భార్యను పరిత్యజించుట నాకు అసహ్యమైన క్రియ యని ఇశ్రాయేలీయుల దేవు డగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. మలాకీ 2:14-16
వారిలో వివాహితులు భార్యలను వదిలి వేసి అన్య స్త్రీలతో తిరుగుతున్నారు. పర్షియనుల తరువాత గ్రీకులు నాటి ప్రపంచం మీద ఆధిపత్యం చేశారు. గ్రీకు చక్రవర్తి అలెగ్జాండర్ అనేక స్త్రీలను పెండ్లి చేసుకొన్నాడు. అన్యులను పెండ్లి చేసుకోండి అని సామూహిక వివాహాలు జరిపించాడు. ఈ గ్రీకు సంస్కృతి ఇశ్రాయేలీయుల మీద కూడా పడింది. వారు భార్యలను వదలిపెట్టి అన్య స్త్రీలతో జీవిస్తున్నారు. దేవుడు దానిని తప్పు పట్టాడు. భార్యను పరిత్యజించుట నాకు అసహ్యమైన క్రియ అని వారితో చెప్పాడు. అది నీకు తోటిదై నీవు చేసిన నిబంధనకు పాత్రురాలు గదా
-క్రైస్తవ వివాహం నిబంధన తో చేయబడింది. అది ఒక శాశ్వత నిబంధన. అది ఒక ఒప్పొందం కాదు. Covenant, Not a Contract. ఈ రోజు వివాహాన్ని మనం ఒక కాంట్రాక్టు వలె చూస్తున్నాము. నువ్వు నాకు ఇలా ఉండాలి, ఈ పనులు చేయాలి, ఇలా ప్రవర్తించాలి. కాకపొతే నిన్ను వదిలేస్తాను. నాకు ఇష్టం లేకపోతే నీకు విడాకులు ఇస్తాను – ఒక కాంట్రాక్టు వలె మనం వివాహాన్ని చూస్తున్నాము. దేవుడు అది ఒక కాంట్రాక్టు కాదు, కోవెనంట్ అంటున్నాడు. అది ఒప్పొందం కాదు, అది ఒక నిబంధన. మరణం వరకు ఉండాల్సిన సంబంధం. దేవునితో మన సంబంధం సరిగ్గా లేకపోతే మన జీవితములోని వ్యక్తులతో కూడా మన సంబంధాలు సరిగా ఉండవు. ఇశ్రాయేలీయులారా, మీ భార్యల పట్ల మీరు ప్రవర్తిస్తున్న తీరు నాకు నచ్చలేదు అని దేవుడు వారితో అన్నాడు.
నాలుగవదిగా సంభాషణ (Right Conversation, Absence of)
నాలుగవదిగా సంభాషణ. దేవుడు వారి సంభాషణలను తప్పు పట్టాడు. యెహోవా సెలవిచ్చునదేమనగా నన్నుగూర్చి మీరు బహు గర్వపు మాటలు పలికి నిన్నుగూర్చి యేమి చెప్పితిమని మీరడుగుదురు.
14 దేవుని సేవచేయుట నిష్ఫల మనియు, ఆయన ఆజ్ఞలను గైకొని సైన్యములకు అధిపతి యగు యెహోవా సన్నిధిని మనము దుఃఖాక్రాంతులుగా తిరుగుటవలన ప్రయోజనమేమనియు,
15 గర్విష్ఠులు ధన్యు లగుదురనియు యెహోవాను శోధించు దుర్మార్గులు వర్ధిల్లుదు రనియు, వారు సంరక్షణ పొందుదురనియు మీరు చెప్పు కొనుచున్నారు.
16 అప్పుడు, యెహోవాయందు భయ భక్తులుగలవారు ఒకరితో ఒకరు మాటలాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను. మరియు యెహోవా యందు భయభక్తులుకలిగి ఆయన నామమును స్మరించుచు ఉండువారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము ఆయన సముఖమునందు వ్రాయబడెను.
మలాకీ 3:16
వారు చాలా గర్వముతో మాట్లాడుతున్నారు. దేవుని హృదయాన్ని ఆయాస పెట్టే మాటలు, దేవుని నామాన్ని తృణీక రించే మాటలు మాట్లాడుతున్నారు. “యెహోవాయందు భయ భక్తులు గలవారు ఒకరితో ఒకరు మాటలాడు కొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను”.(3:16)
మనం మాట్లాడుకొనే మాటలు దేవుడు శ్రద్ధతో వింటున్నాడు. నా మాటలు ఎవరూ వినడం లేదు, నా రాతలు ఎవరూ చూడడం లేదు అని మనం అనుకొంటాము. అయితే దేవుడు చెవియొగ్గి ఆలకిస్తున్నాడు. నోరు విప్పితే అబద్దాలు చెప్పడం, బూతులు తిట్టడం, గాసిప్ మాట్లాడుకోవడం దేవుడు హర్షించడు. మనం మాట్లాడే మాటలు ఎలా ఉంటున్నాయి అని మనం పరీక్షించుకోవాలి. ఇశ్రాయేలీయుల మాటలు దేవుని హృదయాన్ని ఆయాసపెట్టే విధముగా ఉన్నాయి. మీ గర్వపు మాటలు నాకు నచ్చలేదు అని దేవుడు వారితో అన్నాడు.
ఐదవదిగా వారి యొక్క సంకుచితం (Right Conduct, Absence of)
ఐదవదిగా దేవుడు వారి సంకుచిత స్వభావాన్ని విమర్శించాడు. 3:5 లో దేవుడు వారితో అన్నాడు:
‘కూలి విషయములో కూలివారిని విధవరాండ్రను తండ్రిలేనివారిని బాధ పెట్టి పరదేశులకు అన్యాయము చేయువారి మీదను’
మలాకీ 3:5
మరియు ఒకడు తన వస్త్రములను బలాత్కారముతో నింపుట నా కసహ్య మని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చు చున్నాడు (2:16). వారు పనిచేయించుకొని కూలి సరిగ్గా చెల్లించటం లేదు, విధవరాండ్రను బాధపెడుతున్నారు. తండ్రి లేని వారిని హింసిస్తున్నారు పరదేశులకు అన్యాయం చేస్తున్నారు. దేవుడు వారి ప్రవర్తనను తప్పుపట్టాడు. వారి క్రూరత్వాన్ని, అవినీతిని దేవుడు విమర్శించాడు. మలాకీ ప్రవచించిన బాప్తిస్మమిచ్చిన యోహాను కూడా ప్రజలతో అదే మాట అన్నాడు: మీకు మాటలు ఎక్కువ, చేతలు తక్కువ. మేము అబ్రహాము సంతానం అని విర్రవీగడం తప్ప మీలో మంచి పనులు ఏమైనా ఉన్నాయా? మారుమనస్సునకు తగిన ఫలములు ఫలించుడి (లూకా 3:8)
మంచి ఫలములు ఎలా ఫలించగలం? అని ప్రజలు యోహానును అడిగారు. ఆయన వారికి యేమని చెప్పాడంటే, నీ దగ్గర రెండు అంగీలు ఉంటే ఒకటి లేనివానికి ఇవ్వు; నీ దగ్గర ఆహారం ఉంటే ఆకలి గొనిన వానికి కొంత పెట్టు నిర్ణయింపబడినదాని కంటె ఎక్కువతీసికొనవద్దు. ఎవనిని బాధపెట్టవద్దు , ఎవని మీదను అపనింద వేయ వద్దు , మీ జీతములతో తృప్తిపొందిఉండు అని చెప్పాడు.
Absence of
Right worship
Right Offerings
Right Relationships
Right Conversation
Right Conduct
ఈ ఐదు విషయాల్లో వారు తప్పిపోయారు. వాటి సరిచూసుకోండి అని దేవుడు వారిని కోరాడు.
నీతి సూర్యుడు
దేవుడు ఒక గొప్ప వాగ్దానముతో ఈ మలాకీ గ్రంథాన్ని, పాత నిబంధనను ముగించాడు. నా నామమందు భయ భక్తులుగలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును; అతని రెక్కలు ఆరోగ్యము కలుగజేయును
మలాకీ 4:2
ఈ నీతి సూర్యుడు ఎవరంటే ప్రభువైన యేసు క్రీస్తే. ఆయన రెక్కలు ఆరోగ్యం కలుగజేయును. ఈ నీతి సూర్యుడు మనకు ఎప్పుడూ ఆందుబాటులోనే ఉంటున్నాడు. ఆయన శక్తి నిరంతరాయముగా మనకు లభ్యం అవుతున్నది. ఈ ప్రపంచం అలాంటి శక్తిని మనకు ఇవ్వలేదు. 2011 మార్చి నెల 11, జపాన్ దేశం మీద పెద్ద భూకంపం విరుచుకుపడింది. కొద్ది సేపట్లోనే 20,000 ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఫుకుషిమా న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ని కూడా ఆ భూకంపం తాకింది. అందులో 11 రియాక్టర్ లు ఉన్నాయి. రక్షణ చర్యగా ఆ రియాక్టర్ లు వాటంతటికి అవే ఆగిపోయాయి. అది ఒక ఇంజనీరింగ్ మార్వెల్ గా కొంత సేపు చెప్పుకొన్నారు. అయితే కొన్ని మినిషాల తరువాత పెద్ద సునామీ వారి మీద విరుచుకుపడింది. 130 అడుగుల ఎత్తుకు అది ఎదిగింది. దాని దెబ్బకు జనరేటర్ లు పనిచేయకుండా పోయినాయి. కంట్రోల్ రాడ్ల వేడి తగ్గించటానికి మార్గం కనిపించలేదు. దానిని నిర్మించిన వారు వ్రాసిన మాన్యు అల్ లో వారికి జవాబులు లేవు. అందులో పనిచేసే ఇంజినీర్లకు ఏమి చేయాలో దిక్కుతోచలేదు.
ఎలక్ట్రిసిటీ లేక ఫుకుషిమా న్యూక్లియర్ పవర్ ప్లాంట్ గొప్ప విధ్వంసానికి లోనయ్యింది. అటువంటి పరిస్థితి ని వారు కలలో కూడా ఊహించలేదు. దానిని ఇంజినీర్లు ‘Beyond Design Basis Event’ అని పిలిచారు. ఒక పవర్ ప్లాంట్ నిర్మించే టప్పుడు వారు కనీసం ఊహించని విపత్తులు భవిష్యత్తులో జరిగే ప్రమాదం ఉంది. శక్తి అందక తీవ్ర నష్టం వచ్చే పరిస్థితి ఉంది. అయితే అటువంటి పరిస్థితి విశ్వాసికి ఎన్నడూ రాదు.దేవుని శక్తి విశ్వాసికి ఎప్పుడూ అందుబాటులోనే ఉంటుంది. ఎందుకంటే నీతి సూర్యుడు తన శక్తిని, తన కాంతిని ప్రతి విశ్వాసి మీద ఎప్పుడూ ప్రకాశింప జేస్తూనే ఉన్నాడు. రాత్రనక, పగలనక సూర్యుడు తన శక్తిని అన్నివైపులా పంపిస్తూనే ఉంటాడు. అదేవిధముగా నీతి సూర్యుడు అయిన యేసు క్రీస్తు ప్రభువు శక్తి ఆయనను నమ్మిన ప్రతి వ్యక్తికీ ఎప్పుడూ అందుబాటులోనే ఉంటుంది.
దేవుడు ఎప్పుడూ ‘Beyond Design Basis Event’ లను ఎదుర్కోడు. ఆయన ఊహించని పరిస్థితులు, సంఘటనలు ఉండవు. యెహోవానైన నేను మార్పులేనివాడను గనుక యాకోబు సంతతివారైన మీరు లయము కాలేదు.
మలాకీ 3:6
నేను మార్పు లేని వాడను కాబట్టే మీరు నాశనం చెందలేదు. యేసుక్రీస్తు నిన్న, నేడు, ఒక్కటేరీతిగా ఉన్నాడు; అవును యుగయుగములకును ఒక్కటే రీతిగా ఉండును.యేసు క్రీస్తు మార్పు లేని దేవుడు. నిన్న, నేడు, నిరంతరం ఒకే రీతిగా ఉండే దేవుడు.రాబోయే ఏడేండ్ల శ్రమల గురించి కూడా మలాకీ ప్రవచించాడు.
“యెహోవా నియమించిన భయంకరమైన ఆ మహాదినము రాక మునుపు నేను ప్రవక్తయగు ఏలీయాను మీయొద్దకు పంపుదును”
మలాకీ 4:5
దేవుడు నియమించిన భయంకరమైన మహా దినం – అది ఏడేండ్ల శ్రమల కాలం. మన ప్రపంచం మొత్తం అప్పుడు Beyond Design Basis Event లతో నిండిపోతుంది. ఇలాంటి పరిస్థితి వస్తుందని మేము కలలో కూడా ఊహించలేదు అని అధికారులు, నాయకులు అందరూ అంటారు. అటువంటి పరిస్థితి మనకు రాకముందే మనం నీతి సూర్యుని దగ్గరకు వెళ్ళాలి. ఆయన రెక్కల క్రింద మనకు ఆరోగ్యం ఉంది. ఆయన చేతుల క్రింద మనకు రక్షణ ఉంది.
కాన్ స్టాన్ టిన్ గొప్ప రోమన్ చక్రవర్తి. ఆయన అన్య దేవతలను పూజిస్తూ ఉండేవాడు. సోల్ ఇన్విక్టస్ అనే సూర్య దేవుని ఆరాధిస్తూ ఉండేవాడు. అయితే యేసు క్రీస్తు సువార్త వినిన తరువాత ఆయన క్రైస్తవునిగా మారాడు. ఇక నుండి నాకు సోల్ ఇన్విక్టస్ యేసు క్రీస్తు. ఆయన నాకు నీతి సూర్యుడు అన్నాడు. తన వెలుగుతో ఒక రోమన్ చక్రవర్తి జీవితాన్ని కూడా మార్చివేసిన గొప్ప రక్షకుడు యేసు క్రీస్తు. ఎలాంటి చీకటి మన జీవితమును కమ్ముకున్నప్పటికీ మనలను ముందుకు నడిపించే నీతి సూర్యుడు యేసు క్రీస్తే.
-భౌతిక మైన సూర్యుడు మన ఆరోగ్యానికి ఎంతో ముఖ్యం. సూర్యుని కాంతి
మన ఎముకలను బలపరుస్తుంది. యేసు క్రీస్తు మనలను బలపరచేవాడు.
-సూర్యుడు మనకు జీవం ఇస్తాడు. నీతి సూర్యుడు యేసు క్రీస్తు మనకు జీవం
-సూర్యుని కాంతి మన శరీరం మీద ఉండే బాక్టీరియ క్రిములను నాశనం చేస్తుంది. యేసు క్రీస్తు కాంతి మన లో ఉండే పాపమును నాశనం చేస్తుంది.
-సూర్యుని కాంతి మనకు శక్తిని ఇస్తుంది. యేసు క్రీస్తు కాంతి కూడా మనకు శక్తి ఇస్తుంది.
-మానసిక సమస్యలకు సూర్యుని కాంతి మంచింది. డిప్రెషన్ తో బాధపడేవారు సూర్యుని వెలుగు లో కూర్చుంటే వారికి డిప్రెషన్ తగ్గుతుంది. మీ డిప్రెషన్, మీ ఆందోళన తగ్గాలంటే నీతి సూర్యుడు యేసు క్రీస్తు వెలుగు లో కాసేపు కూర్చోండి.
-సూర్యుని వెలుగు మన బ్లడ్ ప్రెషర్ తగ్గించుతుంది. యేసు క్రీస్తు ఇచ్చే వెలుగు మన ఆత్మ భారం తగ్గించుతుంది.
-సూర్యుని వెలుగు మన జీవిత కాలం పొడిగిస్తుంది. యేసు క్రీస్తు వెలుగు మనకు నిత్యజీవము ఇస్తుంది.
-సూర్యుని వెలుగు మనకు మార్గం చూపిస్తుంది. యేసు క్రీస్తు మనకు దారి చూపే నీతి సూర్యుడు. ఆ నీతి సూర్యుని యొద్దకు మీరు రావాలన్నదే నేటి మా ప్రేమ సందేశం.