
ప్రేమ సందేశం కార్యక్రమం చూస్తున్న సోదరీ సోదరులందరికీ ప్రభువైన యేసు క్రీస్తు మహిమ కలిగిన నామములో శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. దేవుని కృప యందు మీరు క్షేమముగా ఉన్నారని తలంచుచున్నాము. మా వెబ్ సైట్ దర్శించి బైబిల్ స్టడీ చేస్తున్న వారందరికీ మా ధన్యవాదాలు. ఈ కార్యక్రమానికి సహకారం అందిస్తున్న వారికి కూడా మా కృతఙ్ఞతలు. ఈ రోజు నేను అమెరికా దేశములోని బోస్టన్ నగరం వచ్చాను. ఈ నగరం గురించి కొన్ని విశేషాలు మీతో పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను.
నేటి కార్యక్రమములో బోస్టన్ నగరములో కొన్ని ప్రదేశాలకు మనం వెల్దాము. దేవుడు చేసిన ఆశ్చర్య కార్యాలు మనకు ఈ నగరములో కనిపిస్తాయి. యేసు క్రీస్తు చరిత్ర కు ప్రభువు Jesus Christ is the Lord of History అనే సత్యము ఇక్కడ తిరిగే టప్పుడు నాకు బోధపడింది.
ఈ బోస్టన్ నగరం అమెరికా దేశం తూర్పు తీరము అంచున ఉంది. ఇక్కడ ఎంతో ప్రకృతి సౌందర్యం, చారిత్రిక ప్రదేశాలు, ఆహ్లాదకరమైన పార్కులు, అందమైన నదులు, ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన కాలేజీలు, యూనివర్సిటీలు, ఆకాశ హర్మ్యాలు, మ్యూసియం లు మనకు కనిపిస్తాయి. 1625 లో విలియం బ్లాక్ స్టోన్ అనే ఒక పాస్టర్ గారు ఈ నగరాన్ని నెలకొల్పాడు.
గత నాలుగు వందల సంవత్సరాల్లో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన నగరంగా ఇది ఎదిగింది. ఇక్కడ మసాచుసెట్స్ జనరల్ హాస్పిటల్ లో పూర్తిగా మత్తు మందు ఇచ్చి చేసిన మొదటి శస్త్ర చికిత్స జరిగింది (1846)

బ్రిగ్ హామ్ హాస్పిటల్ లో మొదటి కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్స జరిగింది (1853)
అలెగ్జాండర్ గ్రాహం బెల్ మొదటి టెలి ఫోన్ సంభాషణ ఇక్కడ జరిగింది (1876)
1844 లో కంప్యూటర్ యుగం కూడా ఇక్కడే మొదలయ్యింది.
2001 లో సెప్టెంబర్ 11 దాడుల్లో టెర్రరిస్టులు ఉపయోగించిన రెండు విమానాలు ఈ నగరం నుండే హైజాక్ కి గురయినాయి.

1630 లో ప్యూరిటన్లు 11 ఓడలలో ఇంగ్లాండ్ దేశము నుండి ఇక్కడికి వచ్చి స్థిరపడ్డారు. జాన్ వింత్రోప్ (1587 – 1649) దీనికి మొదటి గవర్నర్ గా ఉన్నాడు. ఈ నగరం యొక్క లక్ష్యం ఏమిటి? ఈ బోస్టన్ లో మూడు కొండలు ఉన్నాయి. వాటిని చూసినప్పుడు వింత్రోప్ కి యేసు ప్రభువు చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి. మత్తయి సువార్త 5 అధ్యాయం 14 వచనంలో యేసు ప్రభువు ఒక మాట అంటాడు: మీరు లోకమునకు వెలుగైయున్నారు; కొండమీదనుండు పట్టణము మరుగైయుండనేరదు. మత్తయి 5:14

వింత్రోప్ కి ఆ మాటలు స్ఫూర్తిని ఇచ్చాయి. మనం లోకానికి వెలుగు, ఈ బోస్టన్ నగరం యేసు క్రీస్తు వెలుగు ను ప్రకాశించే కొండ మీద ఉండు పట్టణము లాగా ఉండాలి అని వింత్రోప్ అన్నాడు. అప్పటి నుండి ఈ నగరానికి ‘City on a hill’ ‘కొండ మీద ఉన్న నగరం’ అనే పేరు వచ్చింది. ఈ ప్యూరిటన్స్ ఇక్కడ అభివృద్ధి చెందారు. ఇంతకీ ఈ ప్యూరిటన్లు ఎవరు?
ఓల్డ్ సౌత్ మీటింగ్ హౌస్, బోస్టన్
500 సంవత్సరాల క్రితం రోమన్ కాథలిక్ చర్చి నుండి కొంతమంది విడిపోయారు. వారిని ప్రొటెస్టెంట్లు అని పిలుస్తున్నాము. ఇంగ్లాండ్ దేశములో కూడా ‘చర్చి అఫ్ ఇంగ్లాండ్’ క్యాథలిక్ చర్చి నుండి వేరుపడింది. అయితే కొంత మంది ప్రొటెస్టెంట్లకు ‘చర్చి అఫ్ ఇంగ్లాండ్’ కూడా నచ్చలేదు. ప్రతి పని బైబిల్ ప్రకారమే జరగాలి అని వారు బలముగా నమ్మారు. అయితే ఇంగ్లాండ్ దేశ ప్రభుత్వానికి అది నచ్చలేదు. వారు ‘చర్చి ఆఫ్ ఇంగ్లాండ్’ లో అణిగి, మణిగి ఉండాలని ప్రభుత్వం ఆదేశించింది. ‘చర్చి ఆఫ్ ఇంగ్లాండ్’ లో కొనసాగడం ఆ ప్రొటెస్టెంట్లు ఏ మాత్రం ఇష్టపడలేదు. మా హృదయములో బలముగా నమ్మిన వాటిని ఎలాగైనా పాటించాలి, మాకు మత స్వేచ్ఛ ఇవ్వండి’ అని వారు పట్టు బట్టారు. అది వారికి దొరకలేదు.

అప్పుడు వారు, ‘మాకు ఈ ఇంగ్లాండ్ దేశములో మత స్వాతంత్రం లేదు. మేము ఈ దేశములో ఉండలేము. మరొక ఖండానికి వెళ్లి ఒక క్రొత్త దేశం మేము నిర్మించుకొంటాము’ అని వారు ఓడలలో బయలు దేరి అమెరికా ఖండానికి వచ్చారు. 750 మంది ఇక్కడ ఒక కాలనీ స్థాపించారు. ఇంగ్లాండ్ రాజును వారు ఎదిరించారు.

రాచరిక వ్యవస్థకు మొట్టమొదటి దెబ్బ ప్యూరిటన్ల వలన తగిలింది. ఇక్కడ ఇటుక పలుకలతో వేయ బడిన రోడ్డు మీద నేను నడుచుకొంటూ వెళ్ళాను. దీనిని ఫ్రీడమ్ ట్రైల్ ‘స్వాతంత్ర దారి’ అన్నారు.

Old South Meeting House
ప్యూరిటన్లు నిర్మించిన ఒక చర్చి ని చూద్దాము.

ఈ చర్చి ని ప్యూరిటన్లు 1729 లో నిర్మించారు. ఈ చర్చి లో ఎలాంటి విగ్రహాలు, చిత్రాలు వారు పెట్టుకోలేదు. ఎందుకంటే ప్యూరిటన్లు వాటిని నమ్మేవారు కాదు. దేవునికి, మనకు మధ్య ఎటువంటి విగ్రహాలు, సిలువ గుర్తులు, భక్తుల చిత్రాలు ఉండకూడదు అని వారు భావించేవారు. ‘చర్చి’ అని కూడా వారు పిలిచేవారు కాదు. ‘మీటింగ్ హౌస్’ అని పిలుచుకొనేవారు. ఈ మీటింగ్ హౌస్ ని ఆదివారం ఆరాధన చేసుకోవడానికి ఉపయోగించుకొనేవారు. మిగిలిన రోజుల్లో సామాజిక కార్యక్రమాలు జరుపుకునేవారు.

ప్యూరిటన్లు ఇంగ్లాండ్ దేశం వదలి వేసి అమెరికా లో స్థిరపడ్డారు. కొంత కాలం స్వేచ్ఛ ను అనుభవించారు. అయితే ఇంగ్లాండ్ రాజు వారి స్వేచ్చకు ముగింపు పలికాడు. వారిని తిరిగి తన చెప్పు చేతల్లోకి తీసుకొన్నాడు. మేము పారి పోయి ఇక్కడకు వచ్చి స్థిరపడ్డాము, ఇప్పుడు కూడా మమ్మల్ని వదలి పెట్టావా? అని ప్యూరిటన్లు ఇంగ్లాండ్ రాజు మీద కోపగించుకొన్నారు. రాజరిక వ్యవస్థ ను మనం ఎలా తొలగించుకోవాలి? ఒక ప్రజాస్వామ్య దేశం మనం ఎలా నెలకొల్పాలి? అని వారు 300 సంవత్సరముల క్రితం ఈ చర్చి లో సమావేశం పెట్టుకొన్నారు. ఆధునిక ప్రజాస్వామ్యం పుట్టింది ఈ చర్చి లోనే. దానికి అంకురార్పణ చేసింది. ఇక్కడి క్రైస్తవులే. ఆ సమయములో ఈ చర్చి లో సభ్యులుగా ఉన్న వ్యక్తులు అమెరికా దేశానికి నిర్మాతలు అయ్యారు. వారి చిత్రాలు ఇక్కడ మనం చూస్తాము.

బెంజమిన్ ఫ్రాంక్లిన్ ఈ చర్చి లోనే బాప్తిస్మము పొందాడు. ఆయన పెద్ద సైంటిస్ట్ గా, ఫిలాసఫర్ గా పనిచేశాడు. ప్రఖ్యాత బోధకుడు జార్జ్ విట్ ఫీల్డ్ ఈ చర్చి లో బోధించాడు.

ఆయన పరిచర్య వలన మొదలయిన Great Awakening (గొప్ప మేలుకొలుపు) స్వాతంత్ర సమరానికి ప్రేరణ ఇచ్చింది. ఇక్కడ ఉన్న పుల్ పిట్ మీద నుండే శామ్యూల్ ఆడమ్స్ గొప్ప ప్రసంగాలు చేసి స్వాతంత్ర్య ఉద్యమం మొదలు పెట్టాడు. స్వాతంత్రము కోసం అమెరికా ప్రజలు ఇంగ్లాండ్ మీద యుద్ధం చేయవలసి వచ్చింది. ఆ యుద్ధాల్లో పాల్గొన్న పాల్ రెవెరె ఈ చర్చి లో సభ్యునిగా ఉన్నాడు.

బ్రిటిష్ సైనికులు ఈ చర్చి లో తమ గుఱ్ఱాలు పెట్టుకొన్నారు. ఆ విధముగా అమెరికా వారి మీద తమ అక్కసు తెలుపుకున్నారు. అయితే, ఇది ఒక చర్చి, దీనిని గౌరవిద్దాం అని వారు అనుకోలేదు.
ఫిల్లీస్ వీట్లీ నల్ల జాతి మహిళ. ఆమెను ఆఫ్రికా దేశం నుండి బానిసగా తీసుకొని ఇక్కడకు తెచ్చారు. ఆమె ఈ చర్చి లో బాప్తిస్మము పొందింది. బానిసత్వం దేవునికి వ్యతిరేకమైనది అని ఆమె బలముగా నమ్మింది. తన పుస్తకాల ద్వారా ఆ సత్యాలు ప్రచురించింది. ఆ విధముగా బానిసత్వ నిర్మూలన కు కూడా ఈ చర్చి లోనే బీజాలు పడ్డాయి.

George Washington, George Whitfield, Benjamin Franklin, Phillis Wheatley, Samuel Sewell, Samuel Adams – వారందరినీ ఈ చర్చి కలిపింది.
డిసెంబర్ 16, 1773 దాదాపు 5000 మంది ఈ చర్చి లో సమావేశం పెట్టుకొన్నారు. బ్రిటిష్ వారి పన్నులను తిరస్కరించారు. ఇక్కడ నుండి బయలుదేరి వెళ్లి ఓడలలో ఉన్న టీ ని సముద్రములో పారబోశారు. దానిని బోస్టన్ టీ పార్టీ అని పిలిచారు. ఈ చర్చి దగ్గరలో వున్న సమాధులు కూడా చూద్దాము. ప్యూరిటన్లు చాలా సింపుల్ గా తమ సమాధులు కట్టుకున్నారు. కింగ్స్ చాపెల్ బరియల్ గ్రౌండ్ లో జాన్ వింత్రోప్ సమాధి, మేరీ కిల్ టాన్ సమాధులు ఉన్నాయి. మేరీ 1620 లో మే ఫ్లవర్ నౌక లో ఇక్కడకు వచ్చింది.

పైకి ఎంతో సింపుల్ గా కనిపిస్తారు. అయితే వారి ఐడియాస్ వెరీ, వెరీ పవర్ ఫుల్. దేవుని ఎదుట మానవులందరూ సమానులే, ఒక రాజు క్రింద బానిసలుగా మేమెందుకు ఉండాలి? అని వారు ప్రశ్నించారు. వారి ఆలోచనలు ఆధునిక ప్రజాస్వామ్యానికి, బానిసత్వ నిర్మూలనకు దారితీసి, ప్రపంచ చరిత్రను గొప్ప మలుపు తిప్పాయి. ప్యూరిటన్లు విద్యకు ఎంతో ప్రాధాన్యం ఇచ్చారు. వారు నెలకొల్పిన హార్వర్డ్ యూనివర్సిటీ ని కొంతసేపు చూద్దాము.

1636 లో ప్యూరిటన్లు ఈ యూనివర్సిటీ ని స్థాపించారు. బైబిల్ పునాదిగా, యేసు క్రీస్తు మహిమ కొరకు యువతీ యువకులకు ఈ యూనివర్సిటీ చదువులు చెప్పాలి అని వారు కోరుకున్నారు. 1638 లో జాన్ హార్వర్డ్ అనే పాస్టర్ గారు తన ఆస్తిని దీనికి విరాళముగా ఇచ్చాడు. అందుకనే దీనికి హార్వర్డ్ యూనివర్సిటీ అనే పేరు వచ్చింది. తొలుత ఇది పాస్టర్ ట్రైనింగ్ కోసం మొదలయ్యింది. హార్వర్డ్ డివినిటీ స్కూల్ ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఆ తర్వాత ఎకనామిక్స్, బయాలజీ, ఇంజనీరింగ్, మెడిసిన్, లా వంటి శాఖలు ఇక్కడ ప్రారంభించారు. ఇందులో ఉన్న Widener లైబ్రరీ లో 30 లక్షల పుస్తకాలు ఉన్నాయి. ప్రపంచములోనే ఇది అతి పెద్ద యూనివర్సిటీ లైబ్రరీ. గత 400 సంవత్సరాల్లో లక్షలాది మందికి ఈ యూనివర్సిటీ చదువు చెప్పింది. 150 మంది నోబెల్ బహుమానాలు పొందారు. జాన్ f కెన్నెడీ, బరాక్ ఒబామా లాంటి 8 మంది అమెరికా అధ్యక్షులు, సుప్రీమ్ కోర్ట్ జడ్జీలు, కాటన్ మాథెర్, ఇంక్రీస్ మాథెర్ లాంటి బైబిల్ రచయితలు, రతన్ టాటా, బిల్ గేట్స్, మార్క్ జకర్బర్గ్ లాంటి వ్యాపారవేత్తలు ఇక్కడ చదువుకున్నారు.

యేసు క్రీస్తు మహిమ కోసం ఒక యూనివర్సిటీ ఉండాలి అని ఒక పాస్టర్ గారు కనిన కలను దేవుడు ఎంత గొప్పగా ఆశీర్వదించాడో హార్వర్డ్ యూనివర్సిటీ చూస్తే మనకు అర్థం అవుతుంది. అక్కడ నుండి నేను మ్యూసియం ఆఫ్ ఫైన్ ఆర్ట్స్, బోస్టన్ కి వెళ్ళాను. ప్రపంచం నలువైపుల నుండి సేకరించిన విగ్రహాలు, చిత్రాలు ఇక్కడ చూసాను. ప్రభువైన యేసు క్రీస్తు కాలం నాటి దేనారం, షెకెలు వంటి నాణెలు ఇందులో ప్రదర్శించారు.
గ్రీకు దేవతలు అఫ్రోడిటీ, డయానా వంటి విగ్రహాలు మనకు కనిపిస్తాయి. ఒక రోజుల్లో కోట్లాదిమంది జీవితాలను ప్రభావితం చేసిన ఈ దేవతలు ఇప్పుడు మ్యూసియం లలో సర్దుకోవలసి వచ్చింది. అపోస్తలులు ప్రకటించిన యేసు క్రీస్తు సువార్త అటువంటి శక్తి కలిగింది.

ప్రసిద్ధ క్రైస్తవ చిత్రకారులు గీసిన అనేక చిత్రాలు ఇక్కడ ఉన్నాయి. క్రీస్తు శిశువును తీసుకొని ఐగుప్తు కు వెళ్తూ, యోసేపు మరియలు ఒక చోట ఆగి విశ్రాంతి తీసుకోవటం, మరియ తన బిడ్డతో ఒక ఈజిప్షియన్ విగ్రహం క్రింద పండుకొని ఉంది.

ఒక కుటుంబ ప్రార్ధన

బర్తొలొమే మురిల్లో ‘గాయపడిన క్రీస్తు’ ను చిత్రీకరించాడు. అక్కడ నిలబడిన దేవదూతలు ఆయనను సానుభూతితో చూస్తూ వుంటారు.

పీటర్ పాల్ రూబెన్స్ ‘పాత నిబంధన లో ఉన్న పస్కా పండుగ, దేవుని మందసము క్రీస్తును ఎలా సూచిస్తున్నాయో తన చిత్రములో చూపించాడు.

థామస్ కోల్ ఆదాము, హవ్వలు ఏదెను వనములో నుండి ఎలా గెంటి వేయబడ్డారో గీచాడు.

అయితే ఆధునిక యుగములో గీసిన చిత్రాల్లో మనకు దేవుడు కనిపించడు. వారి చిత్రాల్లో చెట్లు, కాయలు, నగ్న స్త్రీలు, నగ్న పురుషులు మనకు కనిపిస్తాయి. పికాసో గీసిన చిత్రాలు చూడండి. వాటిని చూసిన వారికి డిప్రెషన్ వస్తుంది తప్ప ఏ మేలూ జరుగదు. రెంబ్రాంట్ ఒక మహిళను ఎలా చిత్రించాడు? పికాసో ఎలా చిత్రీకరించాడు?
Giotto, Masaccio, Jan van Eyck, Botticelli, Raphael, Leonardo da vinci, Michelangelo, Rembrandt, Caravaggio, Peter Paul Rubens ఇలాంటి క్రైస్తవ చిత్రకారులు గీసిన చిత్రాల్లో మనకు దేవుడు, యేసు ప్రభువు, బైబిల్, ప్రార్ధన వంటి అంశాలు కనిపిస్తాయి. అవి వాటిని చూసే వారికి శాంతిని, నిరీక్షణను, జీవాన్ని ఇచ్చాయి.
కాప్ లే పరలోకానికి వెళ్తున్న క్రీస్తును మనకు చూపిస్తున్నాడు.

Edourad Monet, Renoir, Pissarro, Paul Cezanne, Picasso, Vincet van Gogh – ఆధునిక యుగములో జీవించిన ఈ యూరోపియన్ చిత్రకారులు దేవునితో సంబంధం లేని చిత్రాలు గీశారు. వారి చిత్రాల్లో దేవుని సందేశం లేదు. సువార్త ఇచ్చే నిరీక్షణ లేదు.

దేవుడు లేనప్పుడు మనం గీసే చిత్రాలు కూడా చెత్త లాగా ఉంటాయి అనే సత్యం ఇక్కడ మనకు అర్ధం అవుతుంది. అక్కడ నుండి నేను మౌంట్ ఆబర్న్ సెమెటిరీ కి వెళ్ళాను. అనేక మంది గొప్ప సైంటిస్టు లు, భక్తులు, ఫిలాసఫర్ లు, రాజకీయ నాయకులు ఈ సమాధుల తోటలో పాతిపెట్టబడ్డారు. మాదిరికరమైన క్రైస్తవ సమాధుల తోట నాకు ఇక్కడ కనిపించింది. డాక్టర్ బిజిలో (1787 – 1879) ఈ తోటను డిజైన్ చేశాడు. ఇందులో రెండు చక్కటి చర్చి లు మనకు కనిపిస్తాయి. వీటిలో ఒక దానికి ఆయన పేరు పెట్టారు.

ఒక చోట మేరీ బేకర్ ఎడ్డీ సమాధి నాకు కనిపించింది. ఆమె ‘క్రిస్టియన్ సైన్స్’ అనే క్రైస్తవ సంస్థను స్థాపించింది. ఆమె 1821 – 1910 సంవత్సరముల మధ్య జీవించింది. ఆమె క్రీస్తు వలె నేను కూడా మరణాన్ని జయిస్తాను అని ఆమె అంటూ ఉండేది. వ్యాధి అనేది కేవలం ఊహ మాత్రమే. అని నిజమైనది కాదు అంది. డాక్టర్ల దగ్గరకు వెళ్ళవద్దు, మీ పిల్లల్ని కూడా డాక్టర్ల దగ్గరకు తీసుకు వెళ్ళవద్దు. వ్యాధి అనేది ఒక వూహ మాత్రమే అని బోధించింది. ఆమె మాటలు విని చాలా మంది అమాయకులు ప్రాణాల మీదకు తెచ్చుకొన్నారు. ఆమె చెప్పిన పిచ్చి మాటలు నమ్మి మందులు వేసుకోకుండా, ఆపరేషన్ లు చేయించుకోకుండా, కాన్సర్ చికిత్స చేయించుకో కుండా ప్రాణాలు కోల్పోయారు. చిన్న పిల్లలు అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. వారి సమాధులు కూడా ఇక్కడే ఉన్నాయి.

క్రీస్తు లాగా నేను కూడా మరణాన్ని జయిస్తాను అని ఆమె అంటూ ఉండేది. ఆమె అనుచరులు ఆమె కోసం బ్రహ్మాండమైన సమాధి కట్టారు. ఆమె చనిపోయి, ఇక్కడ పాతిపెట్టబడి 100 సంవత్సరాలు దాటిపోయింది. అయితే ఆమె అనుచరులు ఆమె కోసం ఇంకా ఎదురుచూస్తూనే ఉన్నారు. అయితే ఆమె సమాధి అలానే నిర్జీవంగా పడి ఉంది.

దగ్గరలో నాకు ఒక చక్కటి సమాధి కనిపించింది.
Eliza Riddle Field,
‘Daughter, sister, wife,
mother, friend and artist’
‘He giveth his beloved sleep’

‘కూతురు, సోదరి, భార్య,
తల్లి, స్నేహితురాలు, కళావతి’
‘ఆయన తన ప్రియులకు నిద్రను ఇచ్చును’
127 కీర్తన
127 కీర్తనలో వ్రాయబడిన మాట ఆమె రాయి మీద నాకు కనిపించింది. ‘ యేసు ప్రభువు లాగా నేను కూడా తిరిగి లేస్తాను, ఎదురు చూస్తూ ఉండండి’ అలాంటి పిచ్చి మాటలు మాట్లాడకుండా తన విశ్వాసాన్ని సింపుల్ గా ఆ రాయి మీద చెక్కించుకొంది. క్రైస్తవ నిరీక్షణ అలాంటిది. డాక్టర్ బిజులో ఒక చక్కటి క్రైస్తవ సమాధుల తోట ఇక్కడ కట్టాడు. ఇందులో 5000 చెట్లు నాటారు. దీనిని ఒక తోట లాగా కట్టారు. యేసు ప్రభువు సమాధి కూడా ఒక తోటలో ఉండేది. ఆయన తిరిగి లేచిన తరువాత మొదటిగా మగ్దలేనే మరియకు ఆ తోటలో కనిపించాడు.
యేసు చెప్పెను: పునరుత్థానమును జీవమును నేనే; నాయందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రదుకును
యోహాను 11:25
మౌంట్ ఆబ్రన్ సెమెటిరీ నుండి నేను ట్రినిటీ చర్చి కి వెళ్ళాను. ఇది కాప్ లే స్క్వేర్ అనే ప్రాంతములో ఉంది. ప్రఖ్యాత ఆర్కిటెక్ట్ హెన్రీ హాబ్సన్ రిచర్డ్ సన్ దీనిని నిర్మించాడు. అమెరికా దేశములో టాప్ 10 భవనాల్లో ఇది ఒకటిగా నిలిచింది. ఒక రోజుల్లో ఫిలిప్స్ బ్రూక్స్ గారు (1835 – 1893) దీని పాస్టర్ గా ఉండేవాడు. ఆయన గొప్ప క్రైస్తవ బోధకుడు. ఆయన విగ్రహం చర్చి బయట మనకు కనిపిస్తుంది. చక్కటి ఆర్కిటెక్చర్ లోపల మనకు కనిపిస్తుంది. దాదాపు 5000 ప్రజలు ప్రతి ఆదివారం 5 సర్వీస్ లలో ఇక్కడ ఆరాధన చేస్తారు. ఆరాధన భావం కలిగించే మంచి సంగీతం కూడా లోపల మనకు వినిపిస్తుంది.


బోస్టన్ నగరంలోని కొన్ని ముఖ్యమైన ప్రదేశాలు ఈ రోజు మనం చూశాము. ఇక్కడ తిరుగుతూ ఉంటే,
Jesus Christ is the Lord of History
యేసు క్రీస్తు చరిత్రకు ప్రభువు అనే సత్యం నాకు అర్థం అయ్యింది. ఆయన బోధించిన ‘కొండ మీద ఉండు పట్టణము’ ను స్ఫూర్తిగా తీసుకొని జాన్ వింత్రోప్ ఈ పట్టణాన్ని కట్టాడు. 400 సంవత్సరముల తరువాత కూడా దేవుడు ఈ నగరాన్ని తన మహిమ కొరకు ఉపయోగించుకొంటున్నాడు. అదే నేటి మా ప్రేమ సందేశం.
బోస్టన్ నుండి మీకు శుభాకాంక్షలు
References:
By Nathaniel Currier – http://www.octc.kctcs.edu/mmaltby/his108/Boston%20Tea%20Party.jpg%5Bdead link], Public Domain, https://commons.wikimedia.org/w/index.php?curid=6354651
https://www.theatlantic.com/past/docs/unbound/flashbks/xsci/suffer.htm
By John Rogers Herbert – Art UK, Public Domain, https://commons.wikimedia.org/w/index.php?curid=28250708