నిబంధనలలో క్రీస్తు – డాక్టర్ పాల్ కట్టుపల్లి   

 

  నేటి కార్యక్రమములో దేవుని నిబంధనలు అనే అంశం చూద్దాము. ఈ రోజు ‘దేవుని నిబంధనలు’ అనే అంశం మీద ఒక ప్రేమ సందేశం మీకు ఇవ్వాలని నేను ఆశ పడుతున్నాను. బైబిల్ గ్రంథములో దేవుడు తన ప్రజలతో కొన్ని నిబంధనలు చేశాడు. నిబంధన అంటే ఏమిటంటే అది ఒక ఒప్పందం. ఒక కాంట్రాక్టు. మనుష్యుల మధ్య ఒప్పందాలు ఉంటాయి. ఒక ఉద్యోగం లో మనం చేరితే కాంట్రాక్టు మీద సంతకం చేస్తాము. కాంట్రాక్టు లో ఉన్నట్లు మనం చేయకపోతే మనం ఆ ఉద్యోగం కోల్పోవచ్చు. నేను 10 సంవత్సరములుగా ఒక హాస్పిటల్ నడుపుతున్నాను. అనేక మంది నా దగ్గర పనిచేశారు. చేస్తున్నారు. ప్రతి ఒక్కరికి కాంట్రాక్టు పేపర్స్ ఇస్తాను. హాస్పిటల్ చక్కగా క్లీన్ చేయాలి, పేషెంట్స్ ని బాగా చూసుకోవాలి, మందులు చక్కగా ఇవ్వాలి, బ్లడ్ ప్రెషర్ చూడాలి, సమయానికి రావాలి, పని వేళల్లో సొంత పనులు చేసుకోకూడదు క్యాష్ రిజిస్ట్రీ లో డబ్బులు దొంగిలించకూడదు. ఆ నిబంధనలు పాటించాలి. పాటిస్తాను అని ఆ కాంట్రాక్టు మీద సంతకం చేయాలి. వాటిని పాటించకపోతే కాంట్రాక్టు ని ఉల్లంగించినట్లే. పేషెంట్ లను బాగా చూసుకోవటల్లేదు, ఒక మందులు సరిగ్గా ఇవ్వటం లేదు, సమయానికి ఉద్యోగానికి రావటం లేదు, పని వేళల్లో సొంత పనులు చేసుకొంటున్నావు, ఎంతో సమయము నీ స్నేహితులకు ఫోన్ లు చేసుకొంటున్నావు, డబ్బులు దొంగిలిస్తున్నావు – వాటిల్లో ఏది చేసినా నువ్వు కాంట్రాక్టు ఉల్లంగించినట్లే. యు అర్ ఫై రెడ్. యు అర్ డిస్మిస్డ్. 

    ఒక పొలం అమ్మే టప్పుడు, కొనేటప్పుడు మనం కొన్ని కాగితాల మీద సంతకాలు చేసుకొని రిజిస్ట్రేషన్ చేయించుకొంటాము. ఆ కాగితాలు చదవండి, చాలా చోట్ల ‘covenant’ అనే మాట మనకు కనిపిస్తుంది. అది ఒక కోవెనంట్, అది ఒక నిబంధన. ఒకరికి అమ్మిన పొలాన్ని మరొకరికి అమ్మకూడదు. ఈ రోజు చాలా మంది అవినీతి పరులు ఒక స్థలాన్నే చాలా మందికి అమ్ముతున్నారు. దాని వలన ఆ స్థలము కొనుకొన్నవారు వివాదాల్లో కి లాగబడుతున్నారు. ఏళ్ళ తరబడి కోర్టులు, లాయర్ల చుట్టూ తిరగాల్సి వస్తున్నది. సంతకం చేసిన కోవెనంట్ ని వారు అతిక్రమిస్తున్నారు. 

  ఒక మాట ఇస్తే ఆ మాట మీద నిలబడాలి. రాహాబు యెరికో గోడ మీద నివసిస్తున్నది. యెరికో ను చూడటానికి కొంత మంది గూఢా చారులు వెళ్లారు. వారిని ఆమె తన ఇంటిలో దాచింది. దానికి ప్రతిఫలముగా వారు ఆమెకు ఒక మాట ఇచ్చారు. ఈ ఎఱ్ఱ దారాన్ని నీ కిటికీ మీద కట్టుకో. నిన్ను, నీ ఇంట్లో ఉన్న వారిని మేము రక్షిస్తాము అన్నారు. ఆమె ఆ ఎఱ్ఱ దారాన్ని తన కిటికీ కి కట్టుకొంది. వారు ఆమెతో చేసిన ఒప్పందాన్ని బట్టి యెరికో ని నాశనం చేసేటప్పుడు ఆమెను, ఆమె ఇంటి వారిని రక్షించారు. 

   దేవుడు కూడా మానవులతో కొన్ని ఒప్పందాలు చేసుకొన్నాడు. వీటిని బైబిల్ పరిభాషలో నిబంధన లేక కోవెనంట్ అని మనం పిలుస్తున్నాము. బైబిల్ గ్రంథములో 8 నిబంధనలు మనకు కనిపిస్తాయి. 

దేవుని నిబంధనలు 

  1. ఆదాముతో నిబంధన (పాప పరిహారం) 
  2. నోవహుతో నిబంధన (ప్రభుత్వం)
  3. అబ్రహాముతో నిబంధన (ఇశ్రాయేలు ఎన్నిక) 
  4. మోషేతో నిబంధన (ధర్మశాస్త్రం)  
  5. అహరోనుతో నిబంధన (యాజకత్వం)
  6. స్థల నిబంధన (భూమి కేటాయింపు) 
  7. దావీదుతో నిబంధన (రాజరికం) 
  8. క్రొత్త నిబంధన (మెస్సియా) 

1.ఆదాముతో నిబంధన 

   మొదటిగా ఆదాముతో చేసిన నిబంధన. ఈ నిబంధనకు గుర్తు మంచి చెడ్డల తెలివి ని ఇచ్చు చెట్టు. ఇది unconditional. అంటే మనిషితో ప్రమేయం లేకుండా దేవుడు నెరవేర్చే నిబంధన. దేవుడు ఆదాముతో ఒక నిబంధన చేసాడు. దీనిలో రెండు భాగాలు ఉన్నాయి. పతనం ముందు, పతనం తరువాత పాపం చేయక ముందు, పాపం చేసిన తరువాత.  

    ఏదెను వనములో దేవుడు ఆదాము తో అన్నాడు: ఆదాము, ఈ తోటను నువ్వు జాగ్రత్తగా చూసుకో. ఇందులో ఉన్న చెట్ల కాయాలు తిని ఆనందించు, అయితే ఒక్క చెట్టు కాయలు మాత్రం అంటుకోవద్దు. మంచి చెడ్డల తెలివి ఇచ్చే చెట్టు – దాని కాయలు మాత్రం తినవద్దు. తింటే నీవు చనిపోతావు అన్నాడు. అయితే మనకు తెలిసిందే కదా. ఆదాము, హవ్వలు దేవుని మాటను అతిక్రమించి ఆ చెట్టు కాయలు తిన్నారు. మానవ జాతిలో పాపం ప్రవేశించింది. 

   ఒక కాయ కోసం, దేవుడు ఎందుకు అంత యాగీ చేసాడు? అని ప్రశ్నించే వారు ఉన్నారు. అయితే, నువ్వు కాయతో ఆగవు. నీది కాని చెట్టు కాయ ను నాకు కావాలి అని నీవు వెళ్తున్నావు. ఆ కాయతో నువ్వు ఆగవు. 

నాకు నీ ఇల్లు కావాలి 

నాకు నీ డబ్బు కావాలి 

నాకు నీ ప్రాణం కావాలి 

నాకు నీ భార్య కావాలి 

నాకు నీ భర్త కావాలి 

నాకు నీ బిడ్డ కావాలి 

నాకు నీ పొలం కావాలి 

నాకు నీ దేశం కావాలి. 

 చూస్తున్నాము కదా పుటిన్ ఉక్రెయిన్ దేశం మొత్తం నాకు కావాలి అంటున్నాడు. నాకు ప్రపంచం మొత్తం కావాలి అన్నాడు అలెగ్జాండర్. మనిషి దురాశకు అంతు ఉండదు. నీకు హక్కు లేని దానిని అంటుకోవద్దు అని దేవుడు ఏదెను వనములో మనిషితో అన్నాడు. మనిషి దేవుని మాట వింటే మన ప్రపంచ చరిత్ర మరోలాగా ఉండేది. అయితే ఆదాము ఆ నిబంధన ఉల్లంగించాడు. ఆ కాయను తినిన తరువాత పాపము అతనిలో ప్రవేశించింది. ఆత్మీయముగా ఆదాము, హవ్వలు ఆ రోజే చనిపోయారు. దేవుడు వారిని ఏదెను వనము నుండి వెళ్ళగొట్టాడు. దేవుని మాట విన్నంతకాలం వారు ఏదెను వనము లో ఎంతో ఆనందముగా గడిపారు. ఇప్పుడు వారు ఆ తోట వైపు చూసినప్పుడు, ‘ప్రవేశం నిషిద్ధం’ అనే బోర్డు కనిపిస్తూ వుంది. అది చూసి నప్పుడు వారికి ఎంతో బాధ కలిగి ఉంటుంది. దేవుని నిబంధన అతిక్రమిస్తే పర్యవసానాలు చాలా తీవ్రముగా ఉంటాయి. 

    వారిని పంపించి వేసే ముందు దేవుడు వారితో మరొక నిబంధన చేసాడు. నీ సంతానానికి, నిన్ను మోసం చేసిన సాతానుకు మధ్య నేను వైరం కలుగజేసెదను. అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడిమె మీద కొట్టుదువు. (ఆదికాండము 3:15). 

  ఈ ఒప్పందం క్రీస్తు నందు నెరవేరింది. మానవ జాతిని పాపము లోకి నడిపించిన సాతానును శిక్షించింది యేసు క్రీస్తే. మానవ జాతి మీద సాతాను శక్తిని యేసు క్రీస్తు తన సిలువ ద్వారా జయించాడు. సాతాను తల మీద కొట్టింది ఆయనే. మనిషితో ప్రమేయం లేకుండా ఒక విమోచకుని దేవుడు మన కోసం పంపించాలని నిశ్చయించాడు. అందుకనే ఇది unconditional.

2. రెండవ నిబంధన నోవహు నిబంధన 

ఈ నిబంధనకు గుర్తు సప్త వర్ణాల వలయం. (Unconditional) 

ఒక గొప్ప జలప్రళయం వచ్చి మానవ జాతి మొత్తాన్ని తుడిచిపెట్టింది. భూ గోళం మొత్తాన్ని దేవుడు నీటిలో ముంచివేశాడు. ప్రాణం కలిగిన ప్రతి జీవిని చంపివేశాడు. నోవహు, అతని కుటుంబం, అతనితో పాటు ఉన్న జంతువులను ఒక ఓడలో భద్రం చేశాడు. జల ప్రళయం తరువాత నోవహు కుటుంబము భూమి మీద విస్తరించింది. మన మందరము నోవహు సంతానమే. నోవహు ముందు దేవుడు మానవులతో ఒక నిత్య నిబంధన చేశాడు. ఇంకొకసారి ఈ భూమిని జలప్రళయం తో నాశనము చేయను. దానికి గురుతుగా ఒక 7 వర్ణాల ధనస్సును ఆకాశములో మీకు కనిపిస్తుంది. దేవుడు మానవ సమాజాన్ని కట్టడి చేయడానికి ప్రభుత్వాన్ని ఆ సమయములో నియమించాడు. Age of Government ప్రభుత్వం అప్పుడు ప్రారంభం అయ్యింది. 

ఈ నిబంధన కూడా ప్రభువైన యేసు క్రీస్తు నందు నెరవేరింది. “అతని భుజం మీద రాజ్య భారముండును”

                       యెషయా 9:6 

అని యెషయా ప్రవక్త చెప్పాడు. మానవ ప్రభుత్వం ఒక రోజు యేసు క్రీస్తు క్రిందకు వస్తుంది. యేసు క్రీస్తు మనం దాగుకొనుటకు దేవుడు ఏర్పాటు చేసిన రక్షణ ఓడ. దేవుని ఉగ్రత జలాలు మన మీదకు రాకుండా ఆపగలిగే శక్తి కలిగిన ఓడ యేసు క్రీస్తు ఒక్కడే. 

3.మూడవ నిబంధన, దేవుడు అబ్రహాముతో చేశాడు. (ఆదికాండము 12) 

దీని గురుతు సున్నతి. ఇది కూడా unconditional. దేవుడు అబ్రహాముతో చెప్పాడు: అబ్రహాము, నేను నిన్ను గొప్ప జనముగా చేస్తాను, నీ పేరును గొప్ప పేరుగా చేస్తాను. నిన్ను ఆశీర్వదించేవారిని ఆశీర్వదిస్తాను నిన్ను శపించేవారిని శపిస్తాను భూమి యొక్క సమస్త ప్రజలను నీ ద్వారా ఆశీర్వదిస్తాను. 

   దేవుడు ఆ నిబంధనను నెరవేర్చాడు. అబ్రహాముకు సంతానాన్ని ఇచ్చాడు. వారికి ఒక దేశాన్ని ఇచ్చాడు. వారికి తన ప్రత్యక్షతలు ఇచ్చాడు వారికి తన ధర్మశాస్త్రం ఇచ్చాడు. వారి ద్వారా మన ప్రపంచానికి రక్షకుడైన యేసు క్రీస్తును అనుగ్రహించాడు. 

    ఈ నిబంధనకు గుర్తు సున్నతి. అబ్రహాము, అతని కుటుంబములోని మగవారందరూ సున్నతి చేయించుకోవాలి. మేము దేవుని కొరకుప్రత్యేకించబడినవారం, మా నమ్మకాలు మా ప్రవర్తన మా జీవిత విధానము ఇతరుల కంటే భిన్నముగా ఉంటుంది అని ఆ గురుతు వారికి ఎప్పుడూ గుర్తు చేస్తుంది. ఈ నిబంధన యేసు క్రీస్తు నందు నెరవేరింది. ఆయన అబ్రహాము కుమారుడు. ఆయన ద్వారా మన ప్రపంచానికి దేవుని రక్షణ లభించింది. 

4. నాలుగవ నిబంధన మోషే ఎదుట దేవుడు చేశాడు. దీనిని మోషే నిబంధన అని పిలువవచ్చు. దీని గురుతు సబ్బాతు. ఇది conditional. ఇశ్రాయేలీయులు 400 సంవత్సరాలు ఐగుప్తు దేశములో బానిసత్వములో మ్రగ్గారు. దేవుడు మోషే ని వారి యొద్దకు పంపాడు. అనేక అద్భుత కార్యాలు చేసి తన శక్తి ద్వారా వారిని ఐగుప్తు దేశం నుండి విడిపించి, ఎఱ్ఱ సముద్రము చీల్చి వారిని అరణ్య మార్గములో కనాను దేశము వైపు నడిపించాడు. 

    సీనాయి కొండ మీద దేవుడు మోషే ద్వారా ఇశ్రాయేలీయులకు తన ధర్మ శాస్త్రము ఇచ్చాడు. అందులో ముందుగా 10 ఆజ్ఞలు ఉన్నాయి. అవి దేవుని  నీతిని మనకు తెలియజేస్తున్నాయి. మొత్తం కలిగి 613 ఆజ్ఞలు దేవుడు వారికి ఇచ్చాడు. వివిధ సందర్భాల్లో వారి ప్రవర్తన ఎలా ఉండాలి, వారి కుటుంబ జీవితం ఎలా ఉండాలి, వివాహ జీవితం ఎలా ఉండాలి, పొరుగు వారితో ఎలా ఉండాలి ఎలాంటి పండుగలు చేసుకోవాలి ఎలాంటి బలులు అర్పించాలి మొదలగు వాటి గురించి ఆ ఆజ్ఞలు తెలియజేస్తున్నాయి. 

    ఈ నిబంధన గురుతు సబ్బాతు. ప్రతి సబ్బాతు రోజున ఇశ్రాయేలీయులు మేము నిబంధన జనులం, దేవుడు మమ్ములను ఏర్పరచుకున్నాడు. ఈ విశ్రాంతి దినం రోజు మేము దేవుని సన్నిధిలో గడపాలి, దేవుని నామాన్ని స్మరించాలి అని వారు అనుకునేవారు. ఈ మోషే నిబంధన కూడా యేసు క్రీస్తు నందు నెరవేరింది. ధర్మ శాస్త్రం లో ఒక్క ఆజ్ఞ కూడా అతిక్రమించని మానవుడు ఒక్క యేసు క్రీస్తు మాత్రమే. 

కాబట్టి మనము విశ్వాసమూలమున నీతి మంతులమని తీర్చబడునట్లు క్రీస్తు నొద్దకు మనలను నడి పించుటకు ధర్మశాస్త్రము మనకు బాలశిక్షకుడాయెను.

                         గలతీ 3:24 

    ధర్మ శాస్త్రము మనలను క్రీస్తు యొద్దకు నడిపిస్తున్నది. అది మన పాపాలు మనకు చూపిస్తుంది తప్ప మనలను నీతిమంతులుగా చేయలేదు. అది మనలను యేసు క్రీస్తు వైపుకు నడిపిస్తున్నది. ఆయన యందు విశ్వాసము ఉంచి మనము దేవుని ఎదుట నీతి మంతులముగా తీర్చబడుతున్నాము. 

5. యాజక నిబంధన 

దేవుడు అహరోను, అతని సంతానముతో యాజక నిబంధన చేశాడు. అది సమాధాన నిబంధన అని పిలువబడింది (సంఖ్యా కాండము 25:12) నిత్యమైన యాజక నిబంధన అని పిలువబడింది. ఇశ్రాయేలీయుల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకు అది చేయబడింది. 

    దేవుడు అహరోను ను, అతని కుమారులను యాజకులుగా చేసుకొన్నాడు. ఇశ్రాయేలీయులు సరా సరి దేవుని యొద్దకు వెళ్ళలేరు. వారు యాజకుని దగ్గరకు వెళ్ళాలి. వారి పక్షాన యాజకుడు దేవుని సన్నిధిలోకి వెళ్తాడు. 

    ఆ కార్యకలాపాలు జరిగించడానికి దేవుడు ఒక ప్రత్యక్ష గుడారము ఇచ్చాడు. అందులో ఒక ఆవరణ, ఒక బలిపీఠం, ఒక పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము, ఒక నిబంధన మందసము మొదలగు వస్తువులు మనకు కనిపిస్తున్నాయి. ఈ యాజక నిబంధన గురుతు నిబంధన మందసము. దాని ఎదుట ఇశ్రాయేలీయులు ఒక ప్రధాన యాజకుని ద్వారా దేవుని ఎదుటకు వెళ్లగలిగారు. ఈ యాజక నిబంధన కూడా ప్రభువైన యేసు క్రీస్తు నందు నెరవేరింది. ఆయన మన ప్రధాన యాజకుడు. 

మనము దేవుని ఎదుటకు ఆయన లేకుండా వెళ్లలేము. క్రీస్తు నందు మాత్రమే మనము దేవుని ఎదుటకు వెళ్ళగలం. ఆ ప్రధాన యాజకుని యందు ఉండి మనము దేవుని ఎదుటకు వెళ్లగలుగు తున్నాము. 

ఆయన పవిత్రుడును, నిర్దోషియు, నిష్కల్మషుడును, పాపు లలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును. ఆకాశ మండలముకంటె మిక్కిలి హెచ్చయినవాడునైన యిట్టి ప్రధానయాజకుడు మనకు సరిపోయినవాడు. (హెబ్రీయులకు వ్రాసిన పత్రిక 7:26) 

6. స్థల నిబంధన 

ఆరవదిగా స్థల నిబంధన దీని గురుతు ఇశ్రాయేలు దేశం ఇది conditional. ఇశ్రాయేలీయులు యొర్దాను నది దాటి  కనాను దేశములో ప్రవేశించిన తరువాత వారందరూ రెండు పర్వతముల మీద రెండు గ్రూపులుగా నిలబడ్డారు. ఈ రెండు పర్వతములు – గెరీజీము పర్వతము. ఏబాలు పర్వతము గెరీజీము పర్వతము మీద నిలబడిన వారు దేవుని ధర్మ శాస్త్రము లోని దీవెనలు పెద్దగా పలికారు. ఏబాలు పర్వతము మీద నిలబడిన వారు ధర్మశాస్త్రము లోని శాపాలు చదివారు. దేవుడు వారితో అక్కడ స్థల నిబంధన చేశాడు. ఈ ధర్మ శాస్త్రము మీరు చక్కగా పాటిస్తే ఈ ఇశ్రాయేలు దేశములో మీరు వర్ధిల్లుతారు. నేను మీకు అభివృద్ధి, ఆశీర్వాదం, భద్రత ఇస్తాను. 

  మీరు నా ఆజ్ఞలు అతిక్రమిస్తే, ఈ దేశములో మీకు అభివృద్ధి ఉండదు. మీ మీదకు నా శాపాలు వస్తాయి. మీకు భద్రత ఉండదు. ఈ పాపాలు పెరిగిపోయినప్పుడు ఈ దేశం నుండి మిమ్ములను వెళ్ళగొడతాను. ప్రపంచ దేశాల్లో మీరు చెదరిపోతారు అన్నాడు. ఇశ్రాయేలీయులు దేవుని మాట అనుసరించినంత కాలం వారు ఆ దేశములో దేవుని దీవెనలు పొందారు. దేవుని మాటను అతిక్రమించిన తరువాత ఆ దేశములో వారు ఉండ లేక పోయారు. 

  ఐగుప్తీయులు, అశూరీయులు, బబులోను వారు, పెర్షియా వారు, గ్రీకులు, రోమన్ లు, యూరోపియన్లు, అమెరికన్లు, అరబ్బులు, నాజీలు, కమ్యూనిస్టులు అందరూ యూదులను వేధించినవారే. 

  ఈ స్థల నిబంధనలో కూడా దేవుని యొక్క మంచితనం మనకు కనిపిస్తుంది. ప్రపంచ దేశాల్లో చెదిరిపోయిన యూదులను దేవుడు తిరిగి ఇశ్రాయేలు దేశమునకు సమకూర్చాడు. ఈ నిబంధన గురుతు ఇశ్రాయేలు దేశం. ఆ దేశమును చూసినప్పుడు ఇశ్రాయేలీయులు దేవుడు తమతో చేసిన స్థల నిబంధనను గుర్తుచేసుకోవాలి. ప్రభువైన యేసు క్రీస్తు పాలనలో ఇశ్రాయేలు దేశం గొప్ప స్వర్ణ యుగములో ప్రవేశిస్తుంది. 

7.ఏడవ నిబంధన దావీదు నిబంధన 

దీని గురుతు సింహాసనం ఇది unconditional, conditional. దేవుడు దావీదుతో ఈ నిబంధన చేసాడు. దావీదు యూదా గోత్రానికి చెందిన వాడు. అబ్రహాము కుమారుడు ఇస్సాకు, ఇస్సాకు కుమారుడు యాకోబు, యాకోబు 12 మంది కుమారులు. ఇశ్రాయేలు 12 గోత్రాలు అయ్యారు. వారిలో యూదా గోత్రానికి దేవుడు రాజరికం ఇచ్చాడు. ఆ గోత్రములో దావీదు కుటుంబాన్ని దేవుడు రాజులుగా ఎన్నుకొన్నాడు. 

  దేవుడు దావీదుతో అన్నాడు: దావీదు, నేను నీ రాజ్యమును స్థిరపరుస్తాను. నీ సింహాసనము స్థిరపరుస్తాను. 

  దావీదుతో దేవుడు చెప్పినట్లు అతని కుమారులు అతని తరువాత రాజులు అయ్యారు. సొలొమోను ద్వారా దావీదు వంశం యెరూషలేము నుండి పాలించింది. అబ్రహాము నిబంధన  ద్వారా నిత్య దేశం ఇచ్చిన దేవుడు దావీదు నిబంధన ద్వారా నిత్య రాజ్యం, నిత్య సింహాసనం, నిత్యుడగు రాజు లను వాగ్దానం చేశాడు 

   ప్రవక్త అయిన యిర్మీయా పెట్టిన శాపం వలన యెకొన్యా కుమారులు దావీదు సింహాసనం ఎక్కలేకపోయారు. (యిర్మీయా 22:30). సొలొమోను కుమారుల పాలన అప్పటితో అంతం చెందింది. అయితే దావీదు యొక్క మరొక కుమారుడు నాతాను. ఆయన సంతానము లో నుండి కన్య మరియ వచ్చింది. ఆమె ద్వారా యేసు క్రీస్తు ఈ లోకములో జన్మించాడు. కన్య మరియ ప్రధానం చేయబడిన యోసేపు సొలొమోనులో నుండి వచ్చాడు. ఆ విధముగా క్రీస్తు నందు సొలొమోను, నాతానుల వంశస్తులు కలుసుకున్నారు. 

   ప్రభువైన యేసు క్రీస్తు దావీదు కుమారుడు. దావీదుతో దేవుడు చేసిన రాజ్య నిబంధన ఆయనలో నెరవేరింది. ఆయన రాజుల రాజుగా, ప్రభువుల ప్రభువుగా దావీదు కుమారునిగా, దావీదు సింహాసనం మీద కూర్చుని, దావీదు పట్టణము నుండి మన ప్రపంచాన్ని పరిపాలించబోయే రోజు కూడా దగ్గరపడుతున్నది. 

8. ఎనిమిదవ నిబంధన క్రొత్త నిబంధన 

చివరిగా ఎనిమిదవ నిబంధన క్రొత్త నిబంధన. దీని గురుతు రొట్టె, ద్రాక్షారసం ఉండే ప్రభువు బల్ల. యిర్మీయా 31:31 లో దేవుడు ప్రవక్త అయిన యిర్మీయాకు ఈ నిబంధనను గురించి తెలియజేశాడు. 

ఇదిగో నేను ఇశ్రాయేలువారితోను యూదావారి తోను క్రొత్త నిబంధన చేయు దినములు వచ్చుచున్నవి; ఇదే యెహోవా వాక్కు.

               యిర్మీయా 31:31

   ఇశ్రాయేలీయులు బబులోను చెర లోకి వెళ్లిపోయే సమయములో దేవుడు ఈ నిబంధన గురించి చెప్పాడు.అటువంటి సంక్లిష్టమైన సమయములో ఈ నిబంధన వారికి నిరీక్షణ ఇచ్చింది. 

  దేవుడు వారిని తిరిగి ఆ దేశానికి సమకూరుస్తాడు వారికి రాజ్యం తిరిగి ఇస్తాడు, వారితో ఒక క్రొత్త నిబంధన చేస్తాడు. ప్రభువైన యేసు క్రీస్తు నందు ఆ ప్రవచనం నెరవేరింది. 

   సిలువ వేయబడక మునుపు ఆయన ఒక రొట్టె పట్టుకొని దానిని ఆశీర్వదించి తన శిష్యులకు ఇచ్చాడు. ఇది నా శరీరము అని వారితో చెప్పాడు. ఒక గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. ఆ గిన్నె లోని ద్రాక్షా రసం త్రాగండి. 

ఇది నా రక్తము, అనగా పాపక్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము. నా తండ్రి రాజ్యములో మీతోకూడ నేను ఈ ద్రాక్షారసము క్రొత్త దిగా త్రాగు దినమువరకు, ఇకను దాని త్రాగనని మీతో చెప్పుచున్నాననెను.

                                                మత్తయి 26:28-29 

క్రొత్త నిబంధనలో  రెండు భాగాలు 

  1. పాప క్షమాపణ 
  2. దేవుని రాజ్యం 

ఈ క్రొత్త నిబంధనలో  రెండు భాగాలు ఉన్నాయి. మొదటిది పాప క్షమాపణ: మన పాపక్షమాపణ కొరకు ఆయన నిబంధన రక్తము చిందించాడు. 

రెండవది దేవుని రాజ్యం: నా తండ్రి రాజ్యములో మీతోకూడ నేను ఈ ద్రాక్షారసము క్రొత్త దిగా త్రాగు దినమువరకు, ఇకను దాని త్రాగనని మీతో చెప్పుచున్నాననెను.మళ్ళీ నా తండ్రి రాజ్యములో మీతో కలిసి ఈ ద్రాక్షారసము త్రాగుతాను అని వారికి చెప్పాడు. 

   ఈ రోజు దేవుని నిబంధనలు అనే అంశం మనం ధ్యానించాము. 8 నిబంధనలు దేవుడు తన ప్రజలతో చేసాడు: 

ఆదాముతో నిబంధన 

నోవహుతో నిబంధన 

అబ్రహాముతో నిబంధన 

మోషేతో నిబంధన 

అహరోనుతో నిబంధన 

స్థల నిబంధన 

దావీదుతో నిబంధన 

క్రొత్త నిబంధన 

ప్రతి నిబంధన కు ఒక గుర్తు వుంది 

ఆదాము నిబంధన గుర్తు మంచి చెడ్డల తెలివి ఇచ్చు చెట్టు 

నోవహు నిబంధన గుర్తు ఏడు రంగుల ధనుస్సు 

అబ్రాహాము నిబంధన గుర్తు  సున్నతి 

మోషే నిబంధన గుర్తు సబ్బాతు

అహరోను నిబంధన గుర్తు నిబంధన మందసము 

దావీదు నిబంధన గుర్తు సింహాసనం 

స్థల నిబంధన గుర్తు ఇశ్రాయేలు దేశం 

క్రొత్త నిబంధన గుర్తు ప్రభువు బల్ల

  ఈ గుర్తులు మనకు దేవుని గుర్తు చేయాలి.  ఈ గుర్తులు దేవుని మీద మనకు నమ్మకం కలిగించాలి. రాహాబు తన ఇంటి కిటికీ మీద ఒక యెర్రని దారం వ్రేలాడ దీసింది. అయితే ఆమెను రక్షించింది ఆ యెర్ర దారం కాదు, దేవుని మీద ఆమె విశ్వాస ముంచింది. ఆ విశ్వాసమే ఆమెను రక్షించింది.  

-అబ్రాహామును రక్షించింది సున్నతి కాదు. అబ్రాహాము దేవుని యందు విశ్వాస ముంచెను. అది అతనికి నీతిగా ఎంచ బడెను. సున్నతి మనలను రక్షిస్తుంది అని చాలా మంది యూదులు అనుకొన్నారు అది పొరపాటు. సున్నతి మిమ్ములను రక్షించలేదు అని అపొస్తలుడైన పౌలు అన్నాడు. రోమా పత్రిక సారాంశం అదే. 

-మోషే నిబంధన గుర్తు సబ్బాతు. మోషే మనకిచ్చిన సబ్బాతు, ధర్మశాస్తము మనలను రక్షిస్తాయి అని చాలా మంది యూదులు అనుకొన్నారు. అవి నిబంధన గుర్తులు మాత్రమే. అవి మిమ్ములను రక్షించలేవు. మీరు క్రీస్తు నందు విశ్వాస ముంచాలి. గలతీ పత్రిక సారాంశం అదే.

-అహరోను నిబంధన గుర్తు నిబంధన మందసము. మందసము గుర్తు మాత్రమే. యూదులు ఏమనుకొన్నారంటే, ఈ మందసము మనలను రక్షిస్తుంది. దీని తీసికొని యుద్ధానికి వెళ్తే మనకు విజయం కాదు. యెహోషువ చేసింది అదే కదా.మందసము తీసుకొని వెళ్లినప్పటికీ యుద్ధాల్లో ఓడిపోయారు. యెహోషువ దేవుని మీద విశ్వాస ముంచాడు. మందసము మీద కాదు. ఆ మందసము, ఆ ప్రత్యక్ష గుడారం, ఆ దేవాలయం, ఆ యాజక నియమాలు మిమ్ములను రక్షించ లేవు. అవి గుర్తులు మాత్రమే. మీరు క్రీస్తు నందు విశ్వాస ముంచాలి. హెబ్రీయులకు వ్రాసిన పత్రిక సారాంశం అదే.

-క్రొత్త నిబంధన కు గుర్తు ప్రభువు బల్ల. అయితే ప్రభువు బల్ల మనలను రక్షించ లేదు. నేను రొట్టె విరుస్తున్నాను, ద్రాక్ష రసము త్రాగు తున్నాను. అవే నన్ను రక్షిస్తాయి అని అనుకొనే వారు వున్నారు. అవి మనలను రక్షించ లేవు. మనం క్రీస్తు నందు విశ్వాస ముంచాలి.

దేవుడు ఈ సత్యములను మీ జీవితములకు ఆశీర్వాదకరముగా చేయును గాక! 

Leave a Reply