
ఈ రోజు ఈస్టర్ సందేశం మీకు ఇవ్వాలని నేను ఆశపడుతున్నాను. ‘యేసు క్రీస్తు మృతులలో నుండి లేచాడు’అనే చారిత్రిక సత్యాన్ని ఈస్టర్ పండుగ రోజు మనం జ్ఞాపకం చేసుకొంటున్నాము. మనిషిని వేధించే ముఖ్యమైన సమస్య మరణం. ఫిలాసఫర్ లు మరణం గురించి ఎంతో వ్రాశారు. రోమన్ ఫిలాసఫర్ సెనెకా ‘స్వల్ప కాలపు జీవితం’‘on the shortness of life’ అనే పుస్తకం వ్రాశాడు. ఆ పుస్తకములో ఆయన ఏమని వ్రాశాడంటే, మనం జీవితములో ఎంతో సమయము అర్థం పర్ధం లేని వాటి మీద గడుపుతాము. ముఖ్యమైనవాటిని పట్టించుకోము. మనకున్న తక్కువ సమయాన్ని ప్రాముఖ్యమైన వాటి మీద మనం గడపాలి’. నేటి వరకు ఆ పుస్తకం ఎంతో మందిని ప్రభావితం చేస్తూ ఉంది.
మేము ఏదో ఒక రోజు మరణిస్తాము కాబట్టి మాకు ముఖ్యమైనవిగా తోచిన వాటి మీద మా సమయము వెచ్చిస్తాము అని చాలా మంది అనుకొంటారు. మరణం తరువాత ఏమి ఉందో వారు పట్టించుకోరు. అమెరికా లోని నెవాడా రాష్ట్రములో ప్రతి సంవత్సరం బర్నింగ్ మాన్ అనే పండుగ జరుపుకొంటారు. ఎడారిలో ఒక కృత్రిమ పట్టణము వారు నిర్మించుకొంటారు. దాని మధ్యలో ఒక మనిషిని పోలిన దిష్టి బొమ్మను చెక్కతో చేసి నిలబెడతారు. పండుగ చివరిలో దాని చుట్టూ చేరి దాని ని తగులబెడతారు. ఈ పండుగ సృష్టికర్త లారి హార్వే ఏమంటాడంటే, మన జీవితం కూడా ఎడారి మధ్యలో నిర్మించిన కృత్రిమ పట్టణం లాంటిదే. ఈ దిష్టి బొమ్మ తగులబడి బూడిదగా మారుతుంది. అదే విధముగా మనిషి కూడా చివరకు తగుల బడి తన అణువులు ప్రకృతికి తిరిగి ఇచ్చేస్తాడు.
మన సమాజములో చాలా మంది జీవితాన్ని ఆ విధముగానే చూస్తారు. ప్రకృతి నాకు జీవితాన్ని ఇచ్చింది. దానిని చక్కగా జీవిస్తాను. నా సృజనాత్మకతను వెలికితీస్తాను. మరణించి తగుల బడి నా అణువులు ప్రకృతికి తిరిగి ఇచ్చేస్తాను. అయితే యేసు క్రీస్తు ఇచ్చే జీవిత దృక్పధం అది కాదు. మరణం తరువాత కూడా ఉండే నిత్య జీవాన్ని ఆయన మనకు వాగ్దానం చేశాడు. ‘నా యందు విశ్వాసముంచు వాడు చనిపోయినను బ్రతుకును’ అని ఆయన అన్నాడు. మరణం మనకు ముగింపు కాదు.
మనిషి హృదయములో దేవుడు నిత్యత్వాన్ని ఉంచాడు అని ప్రసంగి గ్రంథములో మనం చదువుతాము. ఆధునిక యుగములో మనిషి నమ్మకాలు చాలా మారిపోయినాయి. మనిషికి ఆత్మ లేదు, అతనికి ఉన్నది కేవలం శరీరం మాత్రమే. ప్రాణం పోయిన తరువాత ఈ శరీరం ప్రకృతిలో కలిసిపోతుంది. మరణం తరువాత ఎలాంటి existence లేదు అని ఆధునిక మానవుడు భావిస్తూ ఉంటాడు. అయితే మనిషి చరిత్రను చూస్తే మనిషి నిత్యత్వం కోసం ప్రాకులాడుట మనకు అన్ని చోట్లా కనిపిస్తుంది. ఈజిప్షియనులు పిరమిడ్ లు నిర్మించుకున్నారు. వారి శరీరములు మమ్మీలుగా భద్రపరచి మరణం తరువాత కూడా కావలసిన ఆహారం, వస్తువులు ఈ పిరమిడ్ లలో వారు పెట్టుకొన్నారు. చైనా లో ఉన్న అనేక సమాధులను ఈ మధ్యలో త్రవ్వారు. వాటిలో చనిపోయిన వారిని భద్రపరచటానికి టెర్రకోట సైనికులను చుట్టూ పెట్టుకునేవారు. మన భారత దేశములో కూడా చాలా మంది పునర్జన్మ ను నమ్ముతారు. మరణం తరువాత మన ఆత్మ వేరొక జీవులుగా మరల జన్మించడం, లేక వేరొక మనిషిగా మళ్ళీ పుట్టడం జరుగుతుంది. కొన్ని రోజుల క్రితం నేను మా ఊరిలో మా నాన్న గారి సమాధి చూడటానికి వెళ్ళాను. ఆ సమాధి ని చూసి నేను నడుచు కొంటూ వెళ్తున్నాను. దగ్గరలో ఉన్న రైల్వే స్టేషన్ లో రైలు దిగి ఒకాయన నా వైపుగా వచ్చాడు. ఆయన మా నాన్నకు స్నేహితుడు. ఆయన ఆగి నాతో అన్నాడు: ‘మీ నాన్న చనిపోయాడని బాధ పడవద్దు. ఆయన మరొక సారి జన్మిస్తాడు’. పునర్జన్మ నమ్మకముతో నన్ను ఆదరించాలని ఆయన ప్రయత్నించాడు. అయితే క్రైస్తవ నిరీక్షణ అది కాదు. యేసు క్రీస్తు సిలువ మీద వ్రేలాడి నప్పుడు ఆయనకు ఇరు వైపుల ఇద్దరు దొంగలు సిలువ వేయబడ్డారు. ఒక దొంగ ఆయన మీద విశ్వాసం ఉంచాడు. ఆ దొంగ యేసు ప్రభువు తో అన్నాడు: ‘యేసూ, నీవు నీ రాజ్యములోనికి వచ్చునప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో’ ఆ దొంగ విశ్వాసముతో అడిగాడు: ‘ప్రభువా, నీవు నీ రాజ్యములోనికి వచ్చునప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో’
యేసు క్రీస్తు అప్పుడు సిలువకు మేకులతో కొట్టబడివున్నాడు. అనేక గాయాలు చేయబడి ఆయన శరీరం నుండి రక్తం ప్రవహిస్తూ ఉంది. మరణానికి కొన్ని నిముషాలు మాత్రమే ఉన్నాయి. అయితే అది ఆయన కు ముగింపు కాదు. సిలువ మరణం తరువాత కూడా యేసు క్రీస్తు ఒక రాజుగా రాజ్యం చేస్తాడని ఆ దొంగ నమ్మాడు. ఆ రాజ్యం లో తాను కూడా ఉండాలని ఆ దొంగ ఆశపడ్డాడు. యేసు క్రీస్తు వెంటనే ఆ విశ్వాసికి ఒక గొప్ప వాగ్దానం చేశాడు: ‘నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువు’
దిక్కూ మొక్కూ లేకుండా చనిపోతున్న ఆ దొంగకు యేసు ప్రభువు ఎంత గొప్ప ప్రామిస్ చేసాడో మీరు గమనించండి. ‘నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువు’
time, place,person fix అయిపోయినాయి.
నేడు : టైం
పరదైసులో: ప్లేస్
నాతో : పర్సన్
ఈ రోజే నువ్వు నాతో కూడా పరలోకములో ఉంటావు అని యేసు ప్రభువు ఆ విశ్వాసికి ప్రామిస్ చేశాడు. time, person, place ఆ మూడింటినీ ఫిక్స్ చేయగలిగిన శక్తి ఒక్క యేసు క్రీస్తుకు మాత్రమే ఉంది. యేసు క్రీస్తు మాటలు నమ్మని వారు ఆయనను అపహాస్యం చేశారు. సిలువ క్రింద కూర్చుని ఉన్న సైనికులు కూడా ఆయన మాటలను ఎగతాళి చేశారు. ‘నిన్ను నువ్వు రక్షించుకోలేవు, లోకాన్ని రక్షించే వాడివి అయ్యావా?’ అని ఆయనను అపహాస్యం చేశారు. ఇలాంటి అపహాసకులు అన్ని సమయాల్లో ఉంటారని పేతురు తన పత్రికలో వ్రాశాడు.
1 పేతురు 1 అధ్యాయం 3, 4 వచనాలు
మన ప్రభువగు యేసుక్రీస్తు తండ్రియైన దేవుడు స్తుతింపబడునుగాక. మృతులలోనుండి యేసుక్రీస్తు తిరిగి లేచుటవలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు, నిర్మలమైనదియు, వాడ బారనిదియునైన స్వాస్యము మనకు కలుగునట్లు, ఆయన తన విశేష కనికరముచొప్పున మనలను మరల జన్మింప జేసెను.
ఆ మాటలు మీరు గమనించండి: జీవముతో కూడిన నిరీక్షణ Living Hope. ఈ జీవముతో కూడిన నిరీక్షణ మనకు ఎలా కలిగింది? మృతులలోనుండి యేసుక్రీస్తు తిరిగి లేచుటవలన ఈ జీవముతో కూడిన నిరీక్షణ మనకు లభించింది. అక్షయమైనదియు, నిర్మలమైనదియు, వాడ బారనిదియునైన స్వాస్యము దేవుడు మనకు ఇచ్చాడు.
తన విశేష కనికరము చొప్పున మనలను మరల జన్మింప జేశాడు. విశేష కనికరం: సిలువ మీద వ్రేలాడుతున్న ఆ దొంగకు కూడా దేవుడు ఆ కనికరం చూపించాడు.
ఇది పునర్జన్మ కాదు – నూతన జన్మ
ఆ దొంగకు యేసు క్రీస్తు నూతన జన్మ అనుగ్రహించాడు. ఆ దొంగ, యేసు క్రీస్తు ఇద్దరూ ఆ రోజు చనిపోయారు. ఇద్దరూ ఆ రోజే పరలోకములో తిరిగి కలుసుకున్నారు.
రోమా 4:25
ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింప బడి,
మనము నీతిమంతులముగా తీర్చబడుటకై లేపబడెను.
యేసు క్రీస్తు మన పాపముల నిమిత్తము అప్పగించబడ్డాడు. మనలను నీతి మంతులుగా తీర్చబడుటకు మరణం నుండి తిరిగి లేచాడు. అంటే యేసు క్రీస్తు తిరిగి లేవకపోతే మనకు ఆత్మ రక్షణ లేదు. అయితే దేవునికి స్తోత్రం. యేసు క్రీస్తు మరణం నుండి తిరిగి లేచాడు. మనకు రక్షణ లభించింది. యేసు క్రీస్తు దేవుడు ఆయనకు ఇచ్చిన రక్షణ కార్యాన్ని సంపూర్ణముగా ముగించాడు. అందుకనే దేవుడు ఆయనకు ఘనమైన అంత్య క్రియలు నిర్వహించాడు.
సిలువ మీద చనిపోయిన వారిని అలాగే వదలివేస్తారు. వారి మృత దేహాలు గద్దలకు, పక్షులకు ఆహారముగా మారిపోతాయి. కానీ యేసు క్రీస్తు విషయములో అలా జరుగలేదు. ఆయనను ప్రేమించిన వ్యక్తులు ఆయన సిలువ దగ్గరకు వెళ్లారు. ఆయన చేతులలో, కాళ్లలో కొట్టబడిన మేకులు తీసివేశారు. ఆయన మృతదేహాన్ని సిలువ మీద నుండి క్రిందకు దించారు. ఆయన గాయాలు కడిగారు. ఆయన దేహానికి సుగంధ ద్రవ్యాలు రాశారు.
నీకొదేము 150 సేర్లు బోళము ను తెచ్చి ఆయన దేహానికి రాశాడు (యోహాను 19:39). మంచి నార బట్టలు ఆ దేహానికి చుట్టారు. సిలువకు దగ్గరలో ఒక తోట ఉంది. ఆ తోటలో యోసేపు అనే ధనవంతుడు తన కోసం సిద్ధపరచుకొనిన క్రొత్త రాతి సమాధిలో యేసు క్రీస్తు దేహాన్ని భద్రపరచాడు (మత్తయి 27:57-66). ధన వంతుని సమాధిలో ఆయన ఉంచబడతాడు అని యెషయా ప్రవక్త చెప్పిన మాట అప్పుడు నెరవేరింది (యెషయా 53:9).
ఆ చక్కటి సమాధిలోకి మీరు వెళ్తే ఎక్కడా దుర్వాసన రాదు. ‘నీ పరిశుద్దుని కుళ్ళు పట్టనియ్యవు’ అని దావీదు చేసిన ప్రవచనం బట్టి దేవుడు యేసు క్రీస్తు శరీరం క్షీణించ కుండా చేసాడు. మూడు రోజుల తరువాత యేసు క్రీస్తు మరణం జయించి తిరిగి లేచాడు. యేసు క్రీస్తు సమాధి ని జయించి మరణం లో నుండి తిరిగి లేచాడు అనే సత్యము మీదే క్రైస్తవ్యము నిర్మించబడింది.
ఈ సత్యము ఎంత ముఖ్యమైనది? అపోస్తలుడైన పౌలు ఏమన్నాడంటే, క్రీస్తు లేపబడియుండనియెడల మేము చేయు ప్రకటన వ్యర్థమే, మీ విశ్వాసమును వ్యర్థమే (1 కొరింథీ 15:14)
క్రీస్తు మరణం నుండి తిరిగి లేచియుండక పోతే మేము చేయు ప్రకటన వ్యర్థమే. మేము అంటే ఎవరు? దేవుని ప్రవక్తలు, దేవుని బోధకులు, దేవుని అపోస్తలులు వారందరి ప్రకటన వ్యర్థమే. యిర్మీయా ప్రవక్త, యెషయా ప్రవక్త దానియేలు ప్రవక్త, మీకా ప్రవక్త, దావీదు ప్రవక్త, జెకర్యా ప్రవక్త… ఆ ప్రవక్తలందరి యొక్క ప్రవచనాలు వ్యర్థమే. మన టీవీ కార్యక్రమాలు, మన రేడియో కార్యక్రమాలు మన సోషల్ మీడియా కార్యక్రమాలు మనం కట్టే దేవాలయాలు మన చేసే ప్రసంగాలు, మనం వ్రాసే పుస్తకాలు, మనం నిర్వహించే సభలు ఇవన్నీ వ్యర్థమైనవే. మనంత వెఱ్ఱి వెంగళప్పలు ఈ ప్రపంచములో ఇంకెవరూ ఉండరు. మనలాంటి అబద్ధికులు ఈ ప్రపంచములో ఇంకెవరూ ఉండరు.
క్రీస్తు లేపబడియుండనియెడల మీ విశ్వాసమును వ్యర్థమే (1 కొరింథీ 15:14) ఎవరి విశ్వాసము? సర్వ కాలాల్లో నివసించిన సమస్త విశ్వాసుల యొక్క విశ్వాసం వ్యర్థమే.
అబ్రహాము విశ్వాసులకు తండ్రి. ఆయన విశ్వాసము కూడా వ్యర్థమే. దేవుడు అబ్రాహాముకు ఇస్సాకు అనే ఒక కుమారుని అనుగ్రహించాడు. ఒక రోజు అబ్రహామును పిలిచి దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడు: నీ కుమారుడైన ఇస్సాకును నాకు బలిగా ఇవ్వు. అబ్రహాము దేవుని మాట విని గొప్ప షాక్ కి గురై ఉంటాడు. అయితే ఆయన దేవుని మాటకు విధేయుడయ్యాడు. దేవుని ఆజ్ఞ చొప్పున మోరియా పర్వతము మీదకు తన కుమారుడైన ఇస్సాకును అర్పించుటకు అబ్రహాము తీసుకొని వెళ్ళాడు.
హెబ్రీయులకు వ్రాసిన పత్రికలో మనం చదువుతాము. ఆ అబ్రాహాము, మృతులను సహితము లేపుటకు దేవుడు శక్తిమంతుడని యెంచినవాడై,తన యేకకుమారుని అర్పించి, ఉపమానరూపముగా అతనిని మృతులలోనుండి మరల పొందెను.(11:19)
అబ్రహాము లాజికల్ గా ఆలోచించాడు:‘దేవుడు నా లో నుండి గొప్ప జనమును పుట్టిస్తాను అన్నాడు. అందుకే నాకు ఇస్సాకును ఇచ్చాడు. ఇప్పుడు నేను ఇస్సాకును చంపివేస్తే దేవుని వాగ్దానం ఎలా నెరవేరుతుంది? దీనిని బట్టి నేను ఇస్సాకును చంపిన తరువాత అతని తిరిగి బ్రతికించే శక్తి దేవునికి ఉండి ఉండాలి’. నా కుమారుని మృతులలో నుండి లేపే శక్తి దేవునికి ఉంది అని అబ్రహాము నమ్మాడు. ఇస్సాకు – మరొక అబ్రహాము కుమారుడు యేసు క్రీస్తు కు సాదృశ్యముగా ఉన్నాడు. ఆయన మన పాపముల కొరకు చంపబడ్డాడు. ఆయనను మృతులలో నుండి లేపే శక్తి దేవునికి ఉంది అని అబ్రహాము నమ్మాడు.
క్రీస్తు లేపబడియుండనియెడల అబ్రహాము విశ్వాసము కూడా వ్యర్థమే. క్రీస్తు లేపబడియుండనియెడల ఇశ్రాయేలీయుల బలులు మొత్తం వ్యర్థమే. వారి ప్రత్యక్ష గుడారము, మహా ప్రాయశ్చిత్త దినం, దహన బలి, సమాధాన బలి, పాప పరిహారార్థ బలి అవన్నీ సజీవుడైన క్రీస్తును సూచిస్తున్నాయి. (హెబ్రీ 9:24). క్రీస్తు లేపబడియుండనియెడల వారి బలులు మొత్తం వ్యర్థమే.
ఇశ్రాయేలీయులు అనేక పండుగలు చేసుకొన్నారు. పస్కా పండుగ, పులియని రొట్టెల పండుగ, ప్రథమ ఫలముల పండుగ, పెంతెకోస్తు పండుగ, బూరల పండుగ, మహా ప్రాయశ్చిత్త దినము, గుడారముల పండుగ ఆ పండుగలన్నీ ఒక దానితో ఒకటి పెనవేసుకొని ఉన్నాయి. వాటిలో ఒకటి ప్రథమ ఫలముల పండుగ. (లేవీయ 23). పంట పండినప్పుడు మొదటి ఫలములు వారు దేవునికి అర్పించాలి. ఆ మొదటి ఫలములు క్రీస్తు యొక్క పునరుత్తానము ను సూచిస్తున్నాయి. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమఫలముగా క్రీస్తు మృతులలోనుండి లేపబడియున్నాడు అని వ్రాశాడు అపోస్తలుడైన పౌలు 1 కొరింథీ 15:20 లో.
నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా యేసు క్రీస్తు మృతులలో నుండి లేచాడు. క్రీస్తు లేపబడియుండనియెడల ఇశ్రాయేలీయుల పండుగలు మొత్తం వ్యర్థమే.
ఇశ్రాయేలీయులు దేవాలయం నిర్మించుకున్నారు. అయితే అది దేనిని సూచించున్నది? యోహాను సువార్త 2 అధ్యాయము చూడండి. అక్కడ యేసు ప్రభువు యెరూషలేములో దేవుని ఆలయము దగ్గర ఉన్నాడు. ఆయన వారితో ఒక మాట అన్నాడు. ఈ దేవాలయమును పడగొట్టుడి, మూడు దినములలో దాని లేపుతాను (యోహాను 2:19)
ఈ దేవాలయం కట్టడానికి 46 సంవత్సరాలు పట్టింది. 3 రోజుల్లో దానిని నీవు ఎలా లేపుతావు? అని వారు ఆయనను అడిగారు. ఆయన తన శరీరం అనే దేవాలయం గురించి అక్కడ మాట్లాడుతున్నాడు. యేసు క్రీస్తు సిలువ మీద మరణించిన క్షణాన ఏమి జరిగింది? దేవాలయపు తెర పై నుండి క్రింది వరకు రెండుగా చినిగింది. భూమి వణకింది. బండలు బద్దలయినాయి. సమాధులు తెరువబడ్డాయి. అనేక మంది మృతులలో నుండి లేచారు. (మత్తయి 27:51-53). క్రీస్తు లేపబడియుండనియెడల ఇశ్రాయేలీయుల దేవాలయము కూడా వ్యర్థమే.
సర్వ కాలాల్లో నివసించిన సమస్త భక్తులు సజీవుడైన క్రీస్తు వైపు చూశారు. ‘పాతాళ బలములో నుండి దేవుడు నా ప్రాణమును విమోచించును’ అని వారు పాటలు పాడు కొన్నారు. యోబు ఎన్నో భయంకరమైన శ్రమలకు రోగాలకు గురయ్యాడు.
‘నా విమోచకుడు సజీవుడు, తరువాత ఆయన భూమి మీద నిలుచునని నేనెరుగుదును. నా శరీరము చీకిపోయిన తరువాత శరీరముతో నేను దేవుని చూచెదను’ (యోబు 19:25-27). నేనే కన్నులారా ఆయనను చూస్తాను. క్రీస్తు లేపబడియుండనియెడల యోబు వంటి విశ్వాసుల నిరీక్షణ కూడా వ్యర్థమే. విశ్వాసమునకు కర్తయు, దానిని కొనసాగించువాడైన క్రీస్తు వైపు చూచుచూ వారు జీవించారు. మరణాన్ని జయించలేని క్రీస్తు విశ్వాసమునకు కర్త కాలేడు. దానిని కొనసాగించలేడు.
క్రీస్తు లేపబడియుండనియెడల దేవుడు కూడా వ్యర్థమే.క్రీస్తు సజీవుడై తిరిగి లేచుట దేవుని ప్రణాళికలో భాగం. క్రీస్తు లేపబడియుండనియెడల దేవుని ప్రణాళికలు వ్యర్థమే. ఆయన పునరుత్థానము కొరకు దేవుడు సమస్తము సిద్ధం చేసాడు. దేవుడు అనేక ప్రవచనాలు దాని గురించి చేసాడు (1 కొరింథీ 15:4; కీర్తన 16:10; లూకా 24:46-47). క్రీస్తు లేపబడియుండనియెడల దేవుని ప్రవచనాలు వ్యర్థమైనట్లే. అప్పుడు మనము దేవుని జ్ఞానాన్ని శంకించవలసి ఉంటుంది. ఎందుకంటే దేవుడు తన జ్ఞానము చొప్పున మనకొరకు రక్షణ మార్గము సిద్ధం చేశాడు. దేవుని శక్తిని మనం అనుమానించవలసి ఉంటుంది. ఎందుకంటే క్రీస్తు తిరిగి లేవక పోతే, దేవునికి శక్తి లేనట్లే.
క్రీస్తు లేపబడియుండనియెడలదేవుని మీద విశ్వాసము కలిగి ఉండుట వ్యర్థమే. క్రీస్తు లేపబడియుండనియెడల యేసు క్రీస్తును నమ్ముకోవటం కూడా వ్యర్థమే.
-యేసు క్రీస్తు అనేక సార్లు తన మరణ, పునరుత్థానముల గురించి ప్రవచించాడు (యోహాను 5:28-29; 12:23-25)
-ఆయన పునరుత్తానము వెలుగులో జీవించాడు (మార్కు 9:9)
-ఆయన తన శిష్యులకు పునరుత్థానము గురించిన ప్రవచనాలు బోధించాడు (లూకా 24:26)
-ఆయన నా ప్రాణము పెట్టుటకు, దానిని తిరిగి తీసుకొనుటకు నాకు అధికారం కలదు అన్నాడు (యోహాను 10:17-18)
-ఆయన తన సందేశములను తన పునరుత్థానము మీద స్థిరపరచాడు (యోహాను 5:24)
-ఆయన ప్రేమ మరణము కంటే శక్తి కలదిగా చెప్పబడింది (రోమా 8:38-39)
-ఆయన జీవాధిపతి (Prince of Life) అని పిలవబడ్డాడు. (అపో కార్య 3:15)
-నేను ఆల్ఫా, ఒమెగా; ఆది, అంతమును; మొదటి వాడను, కడపటి వాడను; మరణం యొక్క తాళపు చెవులు, పాతాళ లోకం యొక్క తాళపు చెవులు నా స్వాధీనములో వున్నాయి అన్నాడు. (ప్రకటన 1:17-18)
-నేనే మార్గము, సత్యము, జీవమును అన్నాడు (యోహాను 14:6)
-పునరుత్థానమును, జీవమును నేనే అన్నాడు (యోహాను 11:25)
క్రీస్తు లేపబడని యెడల అవన్నీ ఒట్టి మాటలే అవుతాయి. క్రీస్తు లేపబడని యెడల యేసు క్రీస్తు చెప్పిన మాటలు, చేసిన కార్యాలు మొత్తం వ్యర్థమే.
దేవదూతలను చూడండి. దేవుడు మనిషితో చెప్పిన మాటలన్నీ వారు విన్నారు.
ఆదాము ఏదెను వనములో నుండి వెళ్లగొట్ట బడినప్పుడు దేవదూతలు చూశారు.
ప్రవక్తలు చేసిన ప్రవచనాలు వారు విన్నారు.
యేసు క్రీస్తు జన్మించినప్పుడు వారు ఆనందముతో కీర్తనలు పాడారు.
క్రీస్తుకు విరోధముగా సాతాను చేసిన పనులను వారు చూశారు.
గెత్సేమనే తోటలో చింతాక్రాంతుడైన క్రీస్తును వారు ఓదార్చారు.
క్రీస్తు లేపబడక పోతే దేవదూతల పనులకు అర్థము లేదు.
వారు పాడిన పాటలు కూడా వ్యర్థమైనవే.
క్రీస్తు లేపబడక పోతే దాని ప్రభావము సాతాను మీద కూడా పడుతుంది.
మరణం సాతాను వలనే ఈ ప్రపంచములో ప్రవేశించింది.
భౌతిక మరణం, ఆత్మీయ మరణం, నిత్య మరణం – అవన్నీ సాతాను ఇచ్చిన బహుమతులే. మార్కు సువార్త 16:9 లో మనం చదువుతాము:
ఆదివారము తెల్లవారినప్పుడు యేసు లేచి, తాను ఏడు దయ్యములను వెళ్లగొట్టిన మగ్దలేనే మరియకు మొదట కనబడెను.
మరణం నుండి తిరిగి లేచి యేసు క్రీస్తు మొదటిగా కనిపించింది మగ్దలేనే మరియకు. ఆమె లో నుండి ఆయన ఏడు దెయ్యాలు వెళ్ళగొట్టాడు. ఆమెను తన శిష్యురాలిగా చేసుకొన్నాడు. క్రీస్తు లేపబడకపోతే మరియమ్మ పరిస్థితి ఏమయ్యేది? ఆ ఏడు దెయ్యాలు తిరిగి ఆమెలో ప్రవేశించేవి. సాతాను ఆమె జీవితము ను నాశనము చేసి నరకానికి ఈడ్చుకొని వెళ్లిఉండేవాడు.
సాతాను క్రియలు నాశనం చేయటానికే దేవుని కుమారుడు ప్రత్యక్షం అయ్యాడు
(1 యోహాను 3:8)
అంధకారసంబంధమైన అధికారములోనుండి మనకు విడుదల ఇవ్వటానికే ఆయన ప్రత్యక్షం అయ్యాడు (కొలొస్స 1:13)
మరణము యొక్క బలము తన దగ్గర ఉంచుకొన్న సాతానును ఓడించడానికే ఆయన ప్రత్యక్షం అయ్యాడు (హెబ్రీ 2:15).
యేసు క్రీస్తు ను నాశనము చేయాలని సాతానుడు శత విధాలా ప్రయత్నించాడు. క్రీస్తు లేపబడి ఉండని యెడల, సాతాను శక్తి మంతుడే. అతడు దేవుని ప్రణాళిక లను అడ్డుకొనగలిగిన వాడే. అతడు దేవుని శక్తిని వమ్ము చేసినవాడే. చివరిగా, క్రీస్తు లేపబడని యెడల నేడు మన విశ్వాసము కూడా వ్యర్థమే.
విశ్వాసులు దేవుని పిల్లలు అని పిలువబడ్డారు. పునరుత్థానము యొక్క పిల్లలు అని పిలువబడ్డారు.
(లూకా 20:36)
విశ్వాసి యొక్క నీతి సజీవుడైన క్రీస్తే (రోమా 4:25)
విశ్వాసి యొక్క శాంతి సజీవుడైన క్రీస్తే (రోమా 13:20-21)
విశ్వాసి యొక్క నిరీక్షణ సజీవుడైన క్రీస్తే (1 పేతురు 1:21)
విశ్వాసి యొక్క శక్తి సజీవుడైన క్రీస్తే (ఫిలిప్పీ 3:10-12)
విశ్వాసి యొక్క ఓర్పు సజీవుడైన క్రీస్తే (హెబ్రీ 11:35)
విశ్వాసి యొక్క ఆదరణ సజీవుడైన క్రీస్తే (1 పేతురు 5:7)
విశ్వాసి యొక్క ప్రభావం సజీవుడైన క్రీస్తే (కొలొస్స 2:12)
విశ్వాసి యొక్క ఆనందం సజీవుడైన క్రీస్తే (యోహాను 16:22)
విశ్వాసి యొక్క మహిమ సజీవుడైన క్రీస్తే (రోమా 8:17)
విశ్వాసి ప్రకటించే శుభవార్త సజీవుడైన క్రీస్తే (రోమా 10:9)
విశ్వాసి తరుపున దేవుని ఎదుట విజ్ఞాపన చేసేది సజీవుడైన క్రీస్తే (రోమా 8:34)
క్రీస్తు లేపబడని యెడల విశ్వాసి కి ఏ ప్రయోజనం ఉండదు. క్రీస్తు లేపబడని యెడల మన విశ్వాసము మొత్తం వ్యర్థమే. అయితే క్రీస్తు లేపబడ్డాడు. సమాధిని జయించి తిరిగి లేచాడు. ఆయన యందు విశ్వాసముంచి పాప క్షమాపణ పొంది మీరు నిరీక్షణ, నిత్యజీవము పొందాలన్నదే నేటి మా ప్రేమ సందేశం.