క్రీస్తు అనే రాయి: డాక్టర్ పాల్ కట్టుపల్లి సందేశం 

Introduction 

ప్రభువైన యేసు క్రీస్తు నామములో సోదరీ సోదరులందరికీ వందనములు. ఈ రోజు ‘క్రీస్తు – మన రాయి’ అనే అంశం మీద కొన్ని తలంపులు మీతో పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను. 1 కొరింథీ 10:4 లో ‘ఆ బండ క్రీస్తే’ అనే మాట మనకు కనిపిస్తుంది. ఆ బండ క్రీస్తే. 

    పాత నిబంధనలో The Lord is my Rock and my fortress అనే వాక్యం మనకు అనేక సార్లు కనిపిస్తుంది. దేవుడు నా బండ, నా ఆశ్రయ దుర్గం.  క్రీస్తు మన బండ  అంటే కీస్తు యొక్క దైవత్వం మనకు కనిపిస్తున్నది. క్రీస్తు అనే ఈ బండ, క్రీస్తు అనే ఈ రాయిని గురించి మనం ధ్యానించాలి. బురదలో నడిచే టప్పుడు, ఎత్తు ప్రదేశం నుండి క్రిందకు నడిచేటప్పుడు లేక పైకి నడిచేటప్పుడు, జారి పడతానేమో అని మనకు అనిపిస్తుంది. అలాంటి సమయములో మనకు ఒక బండ కనిపిస్తే మనకు ఎంతో ఆసరా లభిస్తుంది, మన అడుగులకు స్థిరత్వం కలుగుతుంది. ఈ లోకం ఒక బురద గుంట. ఈ బురద గుంటలో మీరు నడిచేటప్పుడు క్రీస్తు అనే బండ మీద మీరు కాలువేయాలి. లేకపోతే మీరు జారిపడిపోవడం ఖాయం. 

   క్రీస్తు అనే ఈ రాయి లేకుండా మనం విశ్వాసములో ముందుకు అడుగు వేయలేము. ఈ రాయి గురించి 12 విషయాలు మనం చూద్దాము. ‘12 రాళ్లు’ మనం చూద్దాము. 

1.A Stone of Preparation 

ఈ రాయి సిద్ధపరచబడిన రాయి. ఈ రాయి దేవుని చేత సిద్ధపరచబడింది. 

1 పేతురు 2:4 లో మనం చదువుతాము: 

దేవుని దృష్టికి ఏర్పరచబడినదియు

అమూల్యమును 

సజీవమునైన రాయియగు ప్రభువు

    ఇది దేవుని చేత ఏర్పరచబడిన రాయి. దావీదు రాజు దేవుని కొరకు ఒక ఆలయం నిర్మించాలి అని అనుకొన్నాడు. దానికి లక్షలాది రాళ్లు కావాలి. యెరూషలేము దగ్గరలోని పర్వతాలలో 80,000 మంది రాళ్లు చెక్కేవారిని ఆయన పెట్టుకొన్నాడు (1 రాజులు 5:15;1 దినవృత్త 22:2) 80,000 మందిని పెట్టుకొన్నాడంటే ఎన్ని రాళ్లు సిద్ధం చేయాలో మనం ఊహించవచ్చు. దావీదు ఒక ప్లాన్ గీశాడు. ఆ ప్లాన్ ప్రకారం అన్ని లక్షల రాళ్లు దేవుని మందిరం కొరకు ఆయన సిద్ధం చేశాడు. దేవుడు కూడా తన ప్రజల కోసం ఒక ఒక ప్రణాళికతో సజీవమైన రాయి ని సిద్ధం చేసాడు. ఆ రాయి యేసు క్రీస్తే. మనం కూడా ఎలాంటి పునాది మీద మనం నిర్మిస్తున్నామో మనం ఆలోచించుకోవాలి. యేసు ప్రభువు ఒక సారి  చెప్పాడు. 

24 కాబట్టి యీ నా మాటలు విని వాటిచొప్పున చేయు ప్రతివాడును బండమీద తన యిల్లు కట్టుకొనిన బుద్ధి మంతుని పోలియుండును.25 వాన కురిసెను, వరదలు వచ్చెను,గాలి విసిరి ఆ యింటిమీద కొట్టెను గాని దాని పునాది బండమీద వేయబడెను గనుక అది పడలేదు.26 మరియు యీ నా మాటలు విని వాటిచొప్పున చేయని ప్రతివాడు ఇసుకమీద తన యిల్లు కట్టుకొనిన బుద్ధిహీనుని పోలియుండును. 27 వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ యింటిమీద కొట్టెను, అప్పుడది కూల బడెను; దాని పాటు గొప్పదని చెప్పెను. మత్తయి 7 బుద్ధిమంతుడు తన ఇల్లు బండ మీద కట్టాడు. క్రీస్తు అనే పునాది మీద కట్టాడు. అది నిలబడింది. బుద్ధిహీనుడు క్రీస్తు లేని ఇసుక మీద తన ఇల్లు కట్టుకున్నాడు. అది కూలిపోయింది. 

ఇంగ్లీష్ భాషలో మంచి పాట ఉంది 

On Christ the solid rock I stand

All other ground is sinking sand

క్రీస్తు అనే రాయి మీద నేను నిలబడ్డాను 

మిగిలిన దంతా కృంగిపోయే ఇసుక మాత్రమే 

A stone of preparation. 

2.A Stone of Prominence 

      ఆ తరువాత, ఈ రాయి ముఖ్య మైన రాయి. అపోస్తలుడైన పౌలు ఎఫెసీ పత్రికలో వ్రాశాడు: 

ఎఫెసీ 2:20 

క్రీస్తుయేసే ముఖ్యమైన మూలరాయి 

ఎఫెసీ 3:11 

11 వేయబడినది తప్ప, మరియొక పునాది ఎవడును వేయనేరడు; ఈ పునాది యేసు క్రీస్తే.యేసు క్రీస్తు ముఖ్యమైన మూల రాయి. ఆయన తల రాయి. ఆయన పునాది రాయి 

కీర్తన 118:22-23 లో కీర్తనలో మనం చదువుతాము 

22 ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి

 మూలకు తలరాయి ఆయెను.

23 అది యెహోవావలన కలిగినది

 అది మన కన్నులకు ఆశ్చర్యము. 

                  కీర్తన 118:22-23 

క్రీస్తు అనే రాయి చాలా సామాన్యముగా యూదులకు కనిపించింది. అబ్బే, ఈ రాయి మాకు వద్దు అని వారు ఆ రాయిని నిషేధించారు. అయితే, వారు నిషేధించిన రాయి సామాన్యమైన రాయి కాదు అది మూలకు తల రాయి. ప్రభువైన యేసు క్రీస్తు యూదులతో అదే మాట అన్నాడు: 

మత్తయి 21:42 

42 మరియు యేసు వారిని చూచి ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయెను. ఇది ప్రభువువలననే కలిగెను. ఇది మన కన్నులకు ఆశ్చర్యము అను మాట మీరు లేఖనములలో ఎన్నడును చదువ లేదా? అని ఆయన వారిని అడిగాడు. యేసు క్రీస్తు దేవుని ఇంటికి మూల రాయి. ఈ మూల రాయి ఇంటి మొత్తానికి పునాది ఇంటి మొత్తాన్ని కలిపి ఉంచేది. ఇంటి మొత్తాన్ని స్థిరముగా ఉంచేది. ఆ రాయి లేకుండా దేవుడు ఏ నిర్మాణం చేయడు. పేతురు, యోహానులు ఒక రోజు దేవాలయం వద్ద ఒక కుంటి వానిని చూసారు. ఆ కుంటి వాడు వారిని భిక్షం అడిగాడు. వెండి బంగారములు మా యొద్ద లేవు కానీ యేసు క్రీస్తు నామములో నడువు అని చెప్పినప్పుడు ఆ కుంటి వాడు స్వస్థత పొంది నడిచాడు. వారందరూ ఆశ్చర్యపోయారు. యేసు క్రీస్తు కు అంత శక్తి ఉందా? అని ప్రశ్నించారు. 

  అప్పుడు పేతురు 118 కీర్తన వారికి గుర్తు చేసాడు. 

ఇల్లు కట్టు వారు తృణీకరించిన రాయి మూలకు తల రాయి అయ్యింది. 

మీరు సిలువ వేసిన యేసు క్రీస్తు అవును, మీరు సిలువ వేసిన యేసు క్రీస్తే. మీరు తృణీకరించిన రాయి ఆ రాయి యేసు క్రీస్తే. ఆ రాయిని దేవుడు మూలకు తల రాయి చేసాడు. ఆ రాయి లేకుండా రక్షణ లేదు 

మరి ఎవనివలనను రక్షణ కలుగదు; ఈ నామముననే మనము రక్షణ పొందవలెను గాని, ఆకాశము క్రిందమనుష్యులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము

        (అపొస్తలులు కార్యములు 4:10-12) 

నేను యెరూషలేము లో దేవుని ఆలయం కట్టబడిన ప్రదేశానికి వెళ్ళాను. పెద్ద, పెద్ద రాళ్లు అక్కడ కనిపించాయి. యేసు క్రీస్తు చెప్పినట్లే ఆ ఆలయం నిలబడలేదు. అయితే క్రీస్తు అనే రాయి నిలబడింది. 

3. A Stone of Preciousness 

ఆ రాయి ఎంతో ప్రశస్త మైనది. ప్రశస్తమైన రాళ్లను మనం ఎంతో జాగ్రత్తగా ఉంచుకొంటాము.  నేను మీకు ఒక గులక రాయి ఇస్తే, మీరు ఏమి అంటారు? ‘ఏంటి బ్రదర్, గులక రాయి ఇచ్చావు?’ అని దానిని అవతల పడ వేస్తారు. ఆయితే ఒక రత్నం మీకు ఇస్తే, పార వేయరు కదా. దానిని భద్రముగా బీరువా లో పెట్టుకొని తాళం వేస్తారు. ఎందుకంటే అది ప్రశస్తమైనది. 

దావీదు రాజు కిరీటము లో ఒక ప్రశస్తమైన రత్నం ఉండేది (1 దినవృత్తాంతములు 20:2) 

సొలొమోను దేవుని మందిరమును ఎన్నో మిక్కిలి వెలగల రాళ్లతో నిర్మించాడు (1 రాజులు 5:17) 

-షీబా దేశపు రాణి సొలొమోను రాజును చూడ టానికి వెళ్ళినప్పుడు ఎంతో బంగారం, ప్రశస్తమైన రత్నాలను తనతో తీసుకొని వెళ్ళింది. (1 రాజులు 10:2 )

-పరలోక దేశము కూడా ఎన్నో ప్రశస్తమైన రాళ్లతో నిర్మించబడింది. 

వైడూర్యము, కెంపు,సువర్ణరత్నము, గోమేధికము, పుష్యరాగము, పద్మరాగము వంటి ప్రశస్తమైన రాళ్లతో పరలోక దేశము యొక్క గుమ్మములు చేయబడినట్లు ప్రకటన గ్రంథము లో మనం చదువుతాము. (ప్రకటన 21:20) 

ప్రభువైన యేసు క్రీస్తు అమూల్యమైన రాయి అని పిలవబడ్డాడు. 

యెషయా గ్రంథము 28:16 

16 ప్రభువగు యెహోవా ఈలాగున సెలవిచ్చుచున్నాడు

సీయోనులో పునాదిగా రాతిని వేసినవాడను నేనే

అది పరిశోధింపబడిన రాయి, అమూల్యమైన తలరాయి, బహు స్థిరమైన పునాదియైన మూలరాయి యైయున్నది 

విశ్వసించువాడు కలవరపడడు. 

       యెషయా 28 :16 

  పేతురు గారు ఆ సత్యాన్ని మనకు తన పత్రికలో గుర్తుచేశాడు. 

1 పేతురు 2:4 

దేవుని దృష్టికి ఏర్పరచబడినదియు

 అమూల్యమును సజీవమునైన 

రాయియగు ప్రభువునొద్దకు

ఆయన అమూల్యమైన, సజీవమైన రాయి. 

 విశ్వ సించుచున్న మీకు, ఆయన అమూల్యమైనవాడు; 1 పేతురు 2:7 

విశ్వసించుచున్న మనకు ఆయన అమూల్యమైన రాయి. ప్రకటన 2:17 

జయించువానికి మరుగైయున్న మన్నాను భుజింప నిత్తును. మరియు అతనికి తెల్లరాతినిత్తును; ఆ రాతిమీద చెక్కబడిన యొక క్రొత్తపేరుండును; పొందిన వానికే గాని అది మరి యెవనికిని తెలియదు.విశ్వాసికి ఒక తెల్లని రాయి దేవుడు ఇస్తున్నాడు. ఆ రాయి మీద చెక్కబడిన ఒక క్రొత్త పేరు ఉంది. ఆ పేరు ప్రత్యేకమైనది. ఇంకెవరికి తెలియని పేరు దేవుడు ఆ రాయి మీద వ్రాసి మీకు ఇవ్వబోతున్నాడు. 

   మీకు ఒక బిడ్డ ఉంటే, లోకములో ఎన్నో కోట్ల మంది పిల్లలు ఉన్నారు. వారిలో ఈ బిడ్డ ఒక బిడ్డ అనుకోరు. ఈ బిడ్డ ప్రత్యేకమైనది. ప్రశస్తమైనది, అమూల్యమైనది అనుకొంటారు. మనం ఇల్లు కట్టేటప్పుడు అక్కడ వున్న రాళ్లన్నీ మనకు ఒకే లాగా కనిపించవచ్చు. ఏ రాయి మనకు ప్రత్యేకమైనది కాదు. 

నాకు ఉన్న కోట్ల రాళ్ళో వీడు ఒకడు అని దేవుడు అనుకోడు.  

నాకు ఉన్న కోట్ల రాళ్ళలో ఈమె కూడా ఒక రాయి అని దేవుడు అనుకోడు. 

ఆయన దృష్టికి మనం ప్రశస్తమైన రాయి వలె కనిపిస్తున్నాము. 

ఆయన దృష్టికి మనం ప్రత్యేకమైన రాయి గా కనిపిస్తున్నాము. 

అందుకనే ఆయన ఒక ప్రత్యేకమైన పేరు రాసి ఒక తెల్లని రాయి మన చేతిలో పెడుతున్నాడు. 

4.A Stone of Perfection 

ఆ రాయి పరిపూర్ణమైనది.  

ఆ రాయిలో ఎలాంటి డాగు లేదు.  

ఆ రాయిలో ఎలాంటి దోషము లేదు.  

అగ్ని మధ్యలో నుండి దేవుడు మోషే గారితో మాట్లాడాడు. తన పది ఆజ్ఞలను రెండు రాతి పలకల మీద వ్రాసి అతనికి ఇచ్చాడు. దేవుడు తన వ్రేలితో ఆ రాతి పలకల మీద 

ఆ ఆజ్ఞలు వ్రాశాడు (ద్వితీయోప 4:13; నిర్గమ 31:18) 

దేవుని ధర్మశాస్త్రము పరిపూర్ణమైనది (కీర్తన 19:7) 

ఆ రాతి పలకల మీద వ్రాయబడిన ధర్మశాస్త్రం పరిపూర్ణమైనది. ఆ పలుకలను వారు దేవుని మందసములో పెట్టారు. ఆ మందసము ఇశ్రాయేలీయుల తో పాటు నడిచింది. 

మోషే గారు ఇశ్రాయేలీయులతో అన్నాడు: 

మీరు యొర్దాను నది దాటిన తరువాత, వాగ్దాన దేశములో మీరు అడుగు పెట్టిన తరువాత మీరు చేయాల్సిన మొదటి పని ఏమిటంటే పెద్ద రాళ్లను తీసుకొని వాటికి సున్నం పూయండి. ఆ రాళ్లను ఏబాలు కొండమీద పెట్టండి. వాటి మీద దేవుని ధర్మ శాస్త్రము వ్రాయండి. (ద్వితీయోప 27:1-4) 

   మోషే గారు చెప్పినట్లే యెహోషువ చేశాడు. దేవుని ధర్మశాస్త్రము పెద్ద పెద్ద రాళ్ళ మీద వ్రాసి ఏబాలు కొండ మీద పెట్టారు. (యెహోషువ 8:31-32). ఒక వైపు నిబంధన మందసములో ఆ రెండు రాతి పలకల మీద వ్రాయబడిన దేవుని ధర్మశాస్త్రం మరోవైపు ఏబాలు కొండ మీద ఆ పెద్ద రాళ్ళ మీద వ్రాయబడిన దేవుని ధర్మశాస్త్రం ఇశ్రాయేలీయుల ముందు ఉన్నది. వారు దాని ముందు తూగలేక పోయారు 

వారి అపరిపూర్ణత ధర్మశాస్త్రము బయటపెట్టింది. ఇశ్రాయేలీయుల కంటే మనమేమీ ఎక్కువ కాదు. పరిపూర్ణమైన దేవుని ధర్మ శాస్త్రం ముందు మనం కూడా దిగదుడుపే. 

అయితే క్రీస్తు అనే పరిపూర్ణమైన రాయి మనకు  ఉన్నాడు. ఆయన యందు మనం దేవుని ఎదుట నీతి మంతులముగా తీర్చబడ్డాము. క్రీస్తు అనే ఈ పరిపూర్ణమైన రాయి లేకుండా మనకు రక్షణ లేదు. 

5. A Stone of Power

ఈ రాయి శక్తికలిగిన రాయి. గొల్యాతు ఎంతో బలాఢ్యుడు. ఎంతో శారీరిక ధారుడ్యం కలిగిన వాడు. గొల్యాతు ఇశ్రాయేలీయులను ఛాలెంజ్ చేశాడు. ‘నన్ను ఎదుర్కొనే శూరుడు మీలో ఒక్కడన్నా ఉన్నాడా? అతని చూసి అందరూ హడలిపోయారు. అయితే దావీదు అతని ఎదుర్కోవటానికి ముందుకు వెళ్ళాడు. ‘ఒరేయ్, పిల్ల సన్నాసి, ఎలా కనిపిస్తున్నాను రా నీ కంటికి. నేనే మన్నా కుక్కనా, నా మీదకు కఱ్ఱ తీసుకొని వస్తున్నావు? రా, నిన్ను ఒక్క దెబ్బకు చంపేస్తా నిన్ను చంపి నీ మాంసమును పక్షులకు, జంతువులకు వేస్తాను ’ అన్నాడు. దావీదు మౌనముగా ఏటి దగ్గరకు వెళ్లి 5 నున్నటి రాళ్లు ఏరుకొని తన వడిసెలలో వేసు కొన్నాడు. ఒక రాయి వడిసెలలో వేసుకొని గొల్యాతు మీద విసిరాడు. అది దేవుని యందు విశ్వాసముతో ముందుకు వెళ్లిన రాయి. అది దేవుని శక్తి తో ముందుకు వెళ్లిన రాయి గురితప్పకుండా వెళ్లి గొల్యాతు నుదిటిని తాకింది. 

ఢాం….. 

గొల్యాతు బొక్క బోర్లా పడ్డాడు. 

అప్పటి వరకు బిగ్గరగా కేకలు వేసిన గొల్యాతు దావీదు చేతిలో హతమయ్యాడు.

(1 సమూయేలు 17:40)

మీ జీవితములో ఏ గొల్యాతు ఈ రోజు మిమ్ములను బెదిరిస్తున్నాడు? మీరు ఒక చిన్న రాయి తీసుకొని విశ్వాసముతో ఆ గొల్యాతు మీదకు విసరండి. దేవుడు ఎంత పెద్ద గొల్యాతు నైనా సంహరించి మీకు విడుదల ఇస్తాడు . 

-ఇశ్రాయేలు సైన్యములో తలవెండ్రుక మీదికి వడిసెల రాయి విసిరే నైపుణ్యం కలిగిన సైనికులు ఉండేవారు ((న్యాయాధిపతులు 20:16). తల వెండ్రుక దూరముగా కట్టండి. దానిని గురి చూసి కొట్టగలిగే నైపుణ్యం వారికి ఉంది. 

-నెహెమ్యా యెరూషలేము గోడలు కట్టడానికి వెళ్ళాడు. చుట్టూ ఉన్న రాళ్లను ఆయన సమకూర్చుతున్నాడు. అయితే శత్రువులు వచ్చి ఆయనను ఎగతాళి చేశారు. ఏంటి, నెహెమ్యా, నువ్వు కట్టే గోడ ఒక నక్క దాని మీద దూకితే పడిపోతుంది అని వారు గేలి చేశారు. అయితే నెహెమ్యా విశ్వాసముతో ఒక్కొక్క రాయి తీసుకొని యెరూషలేము గోడలు కట్టాడు. అవి దేవుని శక్తితో నిలబడ్డాయి. 

నెబుకద్నెజరు రాజు కు ఒక సారి కల వచ్చింది. 

ఒక బ్రహ్మాండమైన గొప్ప  ప్రతిమ ఆయన చూశాడు. 

దాని శిరస్సు బంగారముతో చేయబడింది 

దాని రొమ్ము భుజములు వెండితో చేయబడ్డాయి 

దాని పొట్ట, తొడలు ఇత్తడితో చేయబడ్డాయి 

దాని మోకాళ్ళు ఇనుము 

దాని పాదాలు ఇనుము, మట్టి 

అయితే చేతి సహాయము లేక తీయబడిన రాయి. ఆ గొప్ప ప్రతిమ రాళ్ళ మీద పడి దానిని తుత్తు తుత్తు చేసింది. (దానియేలు 2:31-45). ఆ విగ్రహము యొక్క ఇనుము, మట్టి ఇత్తడి, వెండి, బంగారము మొత్తం దంచబడి చెత్త వలె, పొట్టు వలె గాలికి కొట్టుకొనిపోయినవి. ఆ రాయి అప్పుడు సర్వ భూలోకమంత పెద్దగా పెరిగిపోయింది. 

క్రీస్తు అనే ఈ రాయి ఎంత శక్తి కలిగిందో మీరొక సారి ఆలోచించండి. ఈ ప్రపంచ సామ్రాజ్యాలను తుత్తు తుత్తుగా చేసే శక్తి ఆ రాయికి ఉంది. 

-మరియు నీవు పేతురువు; 

ఈ బండమీద

నా సంఘమును కట్టుదును, 

పాతాళలోక ద్వారములు దాని యెదుట

నిలువనేరవని నేను నీతో చెప్పుచున్నాను.(మత్తయి 16:18)

నరకము యొక్క ద్వారాలు కూడా ఈ రాయి ముందు నిలబడలేవు. ఆ రాయి ముందు ఇంకా ఏ రాయి నిలబడలేదు. దానియేలును సింహముల బోనులో వేశారు. ఆ గుహ ద్వారమును పెద్ద రాయి వేసి మూసారు. దానియేలు పని అయిపొయింది అనుకొన్నారు. 

ఈ దెబ్బతో దానియేలు ఫినిష్. అయితే దేవుని శక్తి వచ్చి ఆ సింహముల నోరు మూసివేసింది. (దానియేలు 6:16-17) 

   యేసు ప్రభువును ఒక రాతి సమాధిలో పెట్టి ఆ సమాధిని పెద్ద రాతితో మూసి వేశారు. 

ఆదివారము ఉదయం కొంత మంది స్త్రీలు ఆ సమాధి యొద్దకు వెళ్లారు. సమాధి ద్వారము యొద్దకు వారు నడుస్తూ వెళ్తున్నారు. ప్రభువు మృత దేహాన్ని మనం చూడాలి. అయితే మనకొరకు ఆ రాయి యెవడు పొర్లించునని వారు ఢీలా పడిపోయారు. (మార్కు 16:1-7) 

అయితే క్రీస్తు అనే ఈ రాయి సజీవమైన రాయి 

ఇది శక్తి కలిగిన దేవుని రాయి 

ఈ రాయి యొక్క శక్తి ముందు మానవుడు పెట్టే ఏ రాయి కూడా నిలబడలేదు. 

ఆ స్త్రీలు ఆ సమాధి యొద్దకు వెళ్ళినప్పుడు ఆ రాయి తొలగించ బడి ఉంది. 

క్రీస్తు అనే రాయి ముందు ఏ రాయీ నిలబడలేదు. 

అది శక్తి కలిగిన దేవుని రాయి. 

మరణపు ముళ్లును విరిచివేసే శక్తి దానికి ఉంది

సమాధి ద్వారాలు తెరిచే శక్తి దానికి ఉంది. 

6.A Stone of Protection 

ఈ రాయి కాపాడే రాయి 

ఇది సహాయం చేసే రాయి 

ఈ రాయి ఇశ్రాయేలుకు బండ 

నాకు ఆశ్రయ దుర్గం 

నా కోట 

నా రక్షణ శృంగం 

నా నిరీక్షణ 

నా రక్షణాధారము అని కీర్తనా కారుడు అంటున్నాడు (ఆదికాండము 49:24 ; కీర్తన 62:5-7; 18:1-2) 

ఈ రాయి కాపాడేది. ఆదికాండము 29 అధ్యాయములో యాకోబు ఒక బావిని చూశాడు. కాపరులు తమ గొఱ్ఱెలను ఆ బావి దగ్గరకు తీసుకొనివెళ్తున్నారు. 

ఆ బావి మీద పెద్ద రాయి ఉంది. ఆ రాతిని పొర్లించి, బావి నీరు తోడి ఆ గొఱ్ఱెలకు వారు నీరు పోస్తున్నారు. ఆ తరువాత ఆ బావి ని ఆ రాయితో వారు మూసివేస్తున్నారు. 

గొఱ్ఱెల యొక్క బావులను కలుషితం చేయాలని సాతానుడు ఎప్పుడూ ప్రయత్నిస్తాడు. గొఱ్ఱెల యొక్క బావులను విషపూరితం చేయాలని సాతానుడు ఎప్పుడూ తిరుగుతూనే ఉంటాడు. అయితే క్రీస్తు అనే రాయితో మనం ఆ బావులను కాపాడుకొంటూ ఉండాలి. 

సామెతలు గ్రంథములో మనం చదువుతాము: 

10 పురాతనమైన పొలిమేర రాతిని తీసివేయకుము 

తలిదండ్రులులేనివారి పొలములోనికి నీవు చొరబడ కూడదు

11 వారి విమోచకుడు బలవంతుడు 

ఆయన వారిపక్షమున నీతో వ్యాజ్యెమాడును.(సామెతలు 23:10-11; 22:28; హోషేయ 5:10; యోబు 24:2) 

పురాతన మైన పొలిమేర రాయి. Landmark. నేను అమెరికా లో చదువుకొన్న కాలేజీ పేరు ల్యాండ్ మార్క్ కాలేజీ. ఆ పేరు ఈ వాక్యంలో నుండే వచ్చింది. పొలముల మధ్య లో వేయబడిన పొలిమేర రాయి, సరిహద్దు రాయి ఆ రాయి తొలగించవద్దు, తల్లి దండ్రులు లేని వారి పొలములోకి నువ్వు వెళ్లొద్దు, వారి విమోచకుడు బలవంతుడు. నేను వారి తరుపున నీతో పోట్లాడతాను నీ మీద నా ఉగ్రత కుమ్మరిస్తాను  అని దేవుడు అంటున్నాడు. 

-ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయుల మీదకు యుద్ధానికి వచ్చారు. సమూయేలు ప్రవక్త ఇశ్రాయేలీయుల తరుపున దేవునికి మొఱ్ఱ పెట్టాడు. అప్పుడు దేవుడు వారి మొఱ్ఱ విని వారిని ఫిలిష్తీయుల నుండి విడిపించాడు. అప్పుడు సమూయేలు ఒక రాయి తీసుకొని దానికి ఎబెనెజర్ అనే పేరు పెట్టాడు. ఎబెనెజర్ అంటే యెహోవా మనకు సహాయం చేసెను అని అర్ధం. (1 సమూయేలు 7:12-13). ఆ రాయిని చూసినప్పుడు దేవుడు మనకు సహాయం చేసేవాడు అనే సత్యం మనకు అర్ధం అవుతుంది. 

7.A Stone of Presence 

ఆ తరువాత A Stone of Presence 

A Stone of God’s  Presence 

యాకోబు బెయేర్షెబా నుండి హారాను కు పారిపోవుతున్నాడు. ఒక రోజు రాత్రి ఒక చోట ఆయన విశ్రాంతి తీసుకోవటానికి ఆగాడు. ఒక రాయి తీసుకొని తల క్రింద పెట్టుకొని పండుకొన్నాడు. అప్పుడు ఆయనకు ఒక కల వచ్చింది. ఆ కలలో ఒక నిచ్చెన ఆయనకు కనిపించింది. ఆ నిచ్చెన భూమి మీద నుండి ఆకాశానికి అంటుకొంటూ ఉంది. 

దేవదూతలు ఆ నిచ్చెన మీద ఎక్కుతూ దిగుతూ ఉన్నారు. ఆకాశములో నుండి దేవుడు 

యాకోబుతో మాట్లాడాడు: 

యాకోబూ, నీ తండ్రియైన అబ్రాహాము

 దేవుడను ఇస్సాకు దేవుడైన యెహోవాను; 

నీవు పండుకొనియున్న యీ భూమిని నీకును నీ సంతానమునకును ఇచ్చెదను.

14 నీ సంతానము భూమిమీద లెక్కకు ఇసుక రేణువులవలెనగును; 

నీవు పడమటి తట్టును తూర్పుతట్టును ఉత్తరపు తట్టును దక్షిణపు తట్టును 

వ్యాపించెదవు, భూమియొక్క వంశములన్నియు నీ మూలముగాను నీ సంతానము

 మూలముగాను ఆశీర్వదింపబడును.

15 ఇదిగో నేను నీకు తోడై యుండి, నీవు వెళ్లు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరల రప్పించెదను; నేను నీతో చెప్పినది నెరవేర్చువరకు నిన్ను విడువనని చెప్పగా

16 యాకోబు నిద్ర తెలిసినిశ్చయముగా యెహోవా ఈ స్థలమందున్నాడు; 

తన తల క్రింద ఉన్న రాయి ని తీసుకొని దానిని ఒక స్థంబముగా నిలిపాడు. దానికి నూనె పూసి బేతేలు అని పేరుపెట్టాడు. ఇది దేవుని మందిరం దేవుని సన్నిధి ఇక్కడ ఉంది అన్నాడు. (ఆదికాండము 28:10-22)

    ఒంటరిగా ఎవరూ లేని స్థితిలో ప్రయాణం చేస్తున్న యాకోబుకు దేవుడు తన సన్నిధిని ఇచ్చాడు. దేవుడు మనకు కూడా క్రీస్తు అనే రాయి దగ్గర తన సన్నిధి ని అనుగ్రహించాడు. నేను నీ తండ్రి ఐన అబ్రహాము, ఇస్సాకు ల దేవుడను, నేను నిన్ను ఆశీర్వదించేవరకు నా సన్నిధి నీతోనే ఉంటుంది అని దేవుడు యాకోబుకు ఆ రాయి దగ్గర గొప్ప వాగ్దానం చేసాడు. క్రీస్తు అనే ఈ రాయి దగ్గర దేవుడు మనలను ఆశిర్వదించేవరకు తన సన్నిధిని మనకు అనుగ్రహిస్తున్నాడు. 

యోహాను సువార్త 1 అధ్యాయములో మనం చదువుతాము. 

ఫిలిప్పు నతనియేలు తో అన్నాడు: ధర్మశాస్త్రములో మోషేయు ప్రవక్తలును ఎవరిని గూర్చి వ్రాసిరో ఆయనను కనుగొంటిమి; ఆయన యోసేపు కుమారుడైన నజరేయుడగు యేసు. నతనియేలు యేసు ప్రభువు దగ్గరకు వెళ్ళాడు. నువ్వు నాకు తెలుసు, ఆ అంజూరపు చెట్టు క్రింద ఉన్నప్పుడే నేను నిన్ను చూశాను. నతనయేలు ఆశ్చర్యపోయాడు. 

‘నతనియేలు, నువ్వు ఇంకా గొప్ప కార్యాలు చూస్తావు. ఆకాశం తెరువబడుట చూస్తావు దేవుని దూతలు మనుష్యకుమారుని కి పైగా ఎక్కుట, దిగుట నువ్వు చూస్తావు. యాకోబుకు దేవుడు ఇచ్చిన వాగ్దానం క్రీస్తు అనే రాయి దగ్గర నెరవేరింది. ఆయన పరలోకానికి, భూమికి మధ్య నిచ్చెన దేవునికి, నరులకు మధ్య మధ్యవర్తి. క్రీస్తు అనే ఈ రాయి పరలోకమును భూమి మీదకు తెచ్చింది. ఈ రాయి దగ్గర దేవుని సన్నిధి మనకు లభించింది. బేతేలు అంటే దేవుని మందిరం. ఆ మందిరములో మనమందరము సజీవమైన రాళ్లుగా ఉన్నాము. 

అపోస్తలుడైన పౌలు అన్నాడు: 

20 క్రీస్తుయేసే ముఖ్యమైన మూలరాయియైయుండగా అపొస్తలులును ప్రవక్తలును వేసిన పునాదిమీద మీరు కట్టబడియున్నారు.

21 ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి, ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయమగుటకు వృద్ధిపొందుచున్నది.

22 ఆయనలో మీరు కూడ ఆత్మమూలముగా దేవునికి నివాసస్థలమై యుండుటకు కట్టబడుచున్నారు. ఎఫెసీ 2 

యేసు క్రీస్తు అనే మూల రాయి మీద దేవుడు తన ఆలయము కట్టాడు. అది భౌతిక మైనది కాదు. మనిషి తన చేతులతో కట్టిన ఇలాంటి భవనాలు దేవుని సన్నిధి మనకు ఇవ్వలేవు. యేసు క్రీస్తు అనే రాయి ద్వారా దేవుడు ఆత్మసంబంధమైన దేవుని నివాస స్థలమును మనకు ఇచ్చాడు. 

8. A Stone of Provision 

   ఇశ్రాయేలీయులు తమ అరణ్య యాత్రలో రెఫీదీము అనే ప్రాంతానికి వచ్చారు. అక్కడ వారికి నీరు లేదు. వారు మోషే గారితో వాదం పెట్టుకొన్నారు. ఏమయ్యా మోషే , ఐగుప్తు నుండి మమ్ములను, మా పిల్లలను, మా పశువులను నీ మాట విని ఇంత దూరం తీసుకొచ్చాము. దప్పికతో చావటానికా? ‘మనలను ఇంత దూరం నడిపించిన దేవుడు మనకు నీరు ఇవ్వడా? మనం సంయమనం పాటించి, దేవునికి ప్రార్ధన చేద్దాం’ అని ఒక్కడికి కూడా అనిపించలేదు. మోషే గారికి కూడా వారిని చూసి ఆందోళన కలిగింది. ఈ మనుష్యులు కాసేపు ఆగితే నన్ను కూడా రాళ్లు కొట్టి చంపుతారేమో అని ఆయన దేవునితో అన్నాడు. దేవుడు మోషే గారితో ఒక మాట అన్నాడు: మోషే హోరేబు లోని బండ దగ్గరకు వెళ్ళు. నీవు నైలు నదిని కొట్టిన కఱ్ఱతో ఆ బండను కొట్టు. నీవు బండను కొట్టితే అందులోనుండి నీళ్లు వస్తాయి అన్నాడు. 

దేవుని మాటను బట్టి మోషే ఆ రాయిని కొట్టినప్పుడు అందులో నుండి నీరు వచ్చి ఇశ్రాయేలీయుల దాహం తీర్చింది. (నిర్గమ 17:5-6 ). ఆ బండ 40 సంవత్సరాలు వారిని వెంబడించింది. 

1 కొరింథీ పత్రికలో పౌలు గారు వ్రాశాడు 

ఏల యనగా తమ్మును వెంబడించిన ఆత్మసంబంధమైన బండలోనిది త్రాగిరి; 

ఆ బండ క్రీస్తే. 1 కొరింథీ 10:4 

ఆ బండ వారిని వెంబడించింది. 105 కీర్తనలో మనం చదువుతాము: 

ఆకాశములోనుండి ఆహారమునిచ్చి వారిని తృప్తి పరచెను.

బండను చీల్చగా నీళ్లు ఉబికి వచ్చెను ఎడారులలో అవి యేరులై పారెను.

ఆ బండ కొట్టబడింది: క్రీస్తు అనే ఈ రాయి కూడా కొట్టబడింది 

కొట్టబడిన తరువాతే ఆ బండలో నుండి నీళ్లు బయటికి వచ్చాయి. 

సిలువ మీద కొట్టబడిన క్రీస్తు నుండే మనకు దేవుని యొక్క జీవ జలాలు లభించాయి. 

ఆ బండ ఇశ్రాయేలీయులతో పాటు నడిచింది. క్రీస్తు అనే బండ కూడా ఈ రోజు మనతో పాటు నడుస్తున్నది. 

  ఆ బండ లో నుండి నీళ్లు వచ్చాయి. అది స్వయంగా ఆ నీటిని సృష్టించింది. 

ఏ చెరువులో నీళ్ళో, నదిలో నీళ్ళో ఆ బండ వారికి ఇవ్వలేదు. తన లో నుండే నీటిని సృష్టించి వారికి ఇచ్చింది. క్రీస్తు అనే రాయి కూడా స్వయం సృష్టి తో పనిచేస్తున్నది. ఆయన ఇచ్చే జీవ జలం ఎవరి దగ్గరో అరువు తెచ్చుకొన్నవి కావు. 

ఇశ్రాయేలీయుల చుట్టూ పెద్ద ఎడారి అయితే ఆ ఎడారిలో సెల ఏరులు వారి చుట్టూ 

పారినవి. ఈ లోకం అనే ఎడారిలో కూడా క్రీస్తు అనే ఈ రాయి మనకు విస్తారముగా జీవ 

జలాలు ఇస్తున్నది. 

    40 సంవత్సరాల పాటు ఈ రాయి ఇశ్రాయేలీయులతో కలిసి నడిచింది. అది వారిని విడిచిపెట్టని రాయి. క్రీస్తు అనే రాయి కూడా మనలను ఎప్పుడూ విడిచి పెట్టదు. లక్షలమందికి విస్తారముగా  నీరు ఇవ్వాలంటే ఆ రాయి ఎంతో ధృడమైనది అయి ఉండాలి. యేసు క్రీస్తు కూడా కోట్లాది మంది విశ్వాసులకు జీవజలం ఇవ్వగలిగిన రక్షకుడు. ఆ విధముగా ఈ బండ పోషించే బండ 

A Stone of Provision 

9. A Stone of Peace 

    మోషే గారు ఇశ్రాయేలీయులతో ఒక మాట అన్నాడు. మీరు యొర్దాను నది దాటి వాగ్దాన దేశములోనికి ప్రవేశించిన తరువాత దేవునికి ఒక బలిపీఠం కట్టండి. 

ఆ బలిపీఠం చెక్కని రాళ్లతో కట్టాలి. దాని మీద మీరు సమాధాన బలులు 

అర్పించాలి. అక్కడ భోజనం చేసి మీరు యెహోవా సన్నిధిని సంతోషించాలి 

    ద్వితీయోప 27:5-7

  ఇశ్రాయేలీయులు మోషే గారి ఆజ్ఞ మరచిపోలేదు. యెహోషువ 8 అధ్యాయములో మనం చూస్తే, ఏబాలు కొండ మీద వారు పెద్ద పెద్ద రాళ్లు పెట్టారు. వాటికి సున్నం పూశారు. వాటి మీద దేవుని ఆజ్ఞలు వ్రాశారు. వాటి ముందు రాళ్లతో ఒక పెద్ద బలిపీఠం కట్టారు. ఇనుప పనిముట్లు తగిలింపని కారు రాళ్లతో ఆ బలిపీఠం చేయబడింది. 

దాని మీద వారు సమాధాన బలులు అర్పించారు. (ద్వితీయోప 27:5-7; యెహోషువ 8:31-32

   ఏబాలు కొండ మీద దేవుని ధర్మశాస్త్రం, దేవుని బలిపీఠం రెండూ మనకు కనిపిస్తున్నాయి. దేవుని ధర్మశాస్త్రాన్ని మనం పరిపూర్ణముగా పాటించలేము. అలాంటప్పుడు దేవునితో మనకు సమాధానం ఎలా కలుగుతుంది? ఆ బలి పీఠం దగ్గరకు వెళ్లి మనం సమాధానబలి అర్పించాలి. 

క్రీస్తు అనే ఈ రాయి మనకు దేవునికి మధ్య సమాధానం నెలకొల్పింది. 

దేవుని ధర్మశాస్త్రము మనలను అనీతిమంతులుగా తీర్చినప్పటికీ యేసు క్రీస్తు నందు దేవుడు మనతో సమాధానం నెలకొల్పాడు. క్రీస్తు అనే రాయి మీద లేకుండా మనకు సమాధానం లేదు. 

   గ్రీక్ పురాణాల్లో సిసిఫస్ అనే వ్యక్తి ఉంటాడు. అతనికి దేవత ఒక శిక్ష వేస్తుంది. ఒక పెద్ద లోయ ఉంటుంది. దాని ప్రక్కన ఒక పర్వతం ఉంటుంది. సిసిఫస్ ఒక పెద్ద రాయిని పొర్లించుకొంటూ వెళ్ళాలి. క్రింద లోయ లో నుండి పైన పర్వతం వరకు ఆయన ఆ రాయిని దొర్లించుకొంటూ వెళ్తాడు. పైకి వెళ్ళినతరువాత ఆ రాయి తిరిగి లోయలో పడుతుంది. సిసిఫస్ మళ్ళీ ఆ రాయిని దొర్లించుకొంటూ పైకి తీసుకొని వెళ్తాడు. అది మళ్ళీ లోయలో పడుతుంది. సిసిఫస్ మళ్ళీ ఆ రాయిని దొర్లించుకొంటూ పైకి తీసుకొని వెళ్తాడు. అది మళ్ళీ లోయలో పడుతుంది. దానికి ఇక అంతం ఉండదు. 

దేవుని ధర్మశాస్త్రం విషయములో మనం కూడా అంటే. అందులో ఒక్క ఆజ్ఞ అతిక్రమించినా మనం ఎన్నటికీ దాని పరిపూర్ణత అందుకోలేము. అయితే దేవునికి స్తోత్రము. ఆయన మనకు సిసిఫస్ కు వేసిన శిక్ష వేయలేదు. యేసు క్రీస్తు ద్వారా మనతో సమాధానపరచుకొన్నాడు. 

  ఆ బలిపీఠము రాళ్లకు  ఇనుప పనిముట్టు తగులలేదు. మానవుని పనిముట్టు ఆ రాయి మీద పడలేదు. క్రీస్తు అనే ఈ రాయి కూడా మానవుల చేత చెక్కబడింది కాదు. అది సంపూర్ణముగా దేవుని చేత చేయబడింది. ఇశ్రాయేలీయులు ఆ బలిపీఠము మీద సమాధాన బలి అర్పించి, దాని ఎదుట భోజనం చేసి దేవుని సన్నిధిలో ఆనందించారు. 

ఈ రోజు మనం కూడా దేవునితో సమాధాన పరచబడ్డాము. దేవుని సహవాసములో మనం కూడా ఆనందించవచ్చు. ఇక దేని గురించి మనం విచారించవలసిన అవసరం లేదు. ఆందోళన పడవలసిన అవసరం లేదు. దేవునితో మనకు శాంతి కలిగింది. 

యెషయా గ్రంథము 28:16 

16 ప్రభువగు యెహోవా ఈలాగున సెలవిచ్చుచున్నాడు

సీయోనులో పునాదిగా 

రాతిని వేసినవాడను నేనే

అది పరిశోధింపబడిన రాయి

అమూల్యమైన తలరాయి

బహు స్థిరమైన పునాదియైన 

మూలరాయి యైయున్నది 

విశ్వసించువాడు కలవరపడడు. 

10. A Stone of Purification 

ఇది పాపము పరిహరించే రాయి. జెకర్యా గ్రంథము  3 లో మనం చదువుతాము. అక్కడ దేవుని దూత ఎదుట ప్రధాన యాజకుడైన యెహోషువ నిలువబడి ఉన్నాడు. 

సాతాను ఆయన మీద ఫిర్యాదులు చేస్తున్నాడు. యెహోషువ మలిన వస్త్రములు ధరించి ఆ దూత సముఖములో నిలబడ్డాడు. ఇశ్రాయేలు దేశానికి ఆయన ప్రతినిధి గా ఉన్నాడు. దేవుని దూత యెహోషువ యొక్క మలిన వస్త్రాలు తీసివేయించాడు. అతనికి తలమీద తెల్లటి పాగా పెట్టించాడు. యెహోషువ ఎదుట ఒక రాయి ఉంచబడింది. 

దానికి ఏడు కన్నులు ఉన్నాయి. ఆ రాయి వైపు చూడు. ఒక్క రోజులో నీ పాప దోషము పరిహరించ బడుతుంది. (జెకర్యా 3:1-10) 

ఈ రాయికి 7 కన్నులు ఉన్నాయి. దానికి మరుగైనది ఏదీ లేదు 

ఒక రోజు వ్యభిచారంలో పట్టబడిన ఒక స్త్రీని యేసు ప్రభువు దగ్గరకు తీసుకొని వచ్చారు. బోధకుడా, ఈమె వ్యభిచారంలో పట్టుబడింది. మన ధర్మశాస్త్రం ప్రకారం ఈమెను రాళ్లతో కొట్టి చంపాలి. నువ్వు చెప్పే మాట ఏమిటి? 

యేసు ప్రభువు వారితో ఏమన్నాడు? మీలో పాపము లేని వాడు ఆమె మీద మొదటి రాయి వేయండి. వారిలో ప్రతి ఒక్కరూ తమ చేతుల్లోని రాళ్లు అక్కడే పడవేసి వెళ్లిపోయారు. క్రీస్తు అనే ఈ రాయి కి 7 నేత్రాలు వున్నాయి. ఆయన చూడని పాపము లేదు. అయితే పాప పరిహారము కూడా ఆయన వలనే మనకు లభించింది. 

  ఇంతకు ముందు మనం చెప్పుకొన్నట్లు, ఈ రాయి కొట్టబడిన రాయి మన మీదకు రావలసిన శిక్ష ఆ రాయి మీద పడింది. ఈ రోజు ఈ రాయి మనలను పవిత్రపరచేదిగా 

ఉంది. అది మన stone of purification. మనలను పవిత్రపరచే రాయి 

11. A Stone of Priesthood

దేవుడు లేవీ గోత్రికులను తనకు యాజకులనుగా ఏర్పరచుకున్నాడు. ప్రత్యక్ష గుడారములో వారు సేవ చేస్తున్నారు. దేవుడు వారికి ప్రత్యేకమైన ప్రతిష్ఠిత  వస్త్రాలు 

కుట్టించి ఇచ్చాడు. బంగారుతోను నీల ధూమ్ర రక్త వర్ణములుగల ఏఫోదును పేనిన సన్న నారతో అవి చేయబడ్డాయి. పతకము ఏఫోదు, నిలువు టంగీ, విచిత్ర మైన చొక్కాయి పాగా దట్టియు వారు తొడుగుకున్నారు. ప్రధాన యాజకుని భుజముల మీద 2 రత్నాలు పెట్టబడ్డాయి. ఒక్కొక్క రత్నం మీద ఇశ్రాయేలీయుల 6 గోత్రాల పేరులు చెక్కబడ్డాయి. 

ప్రధాన యాజకుని ఛాతీ మీద మరో 12 రత్నాలు నాలుగు వరుసలుగా పేర్చబడ్డాయి. ఆ 12 రత్నాల మీద కూడా ఇశ్రాయేలీయుల 12 గోత్రాల పేరులు చెక్కబడ్డాయి. (నిర్గమ 28:9-21) 

  ప్రధాన యాజకుడు తన సన్నిధిలో అడుగుపెట్టినప్పుడు దేవునికి ఆ రత్నాలు కనిపిస్తున్నాయి. ఆ ప్రశస్తమైన రాళ్ళ మీద దేవునికి తన ప్రజల యొక్క పేరులు కనిపిస్తున్నాయి. మన ప్రభువైన యేసు క్రీస్తు అహరోను కంటే గొప్ప ప్రధాన యాజకుడు. పేతురు గారు తన పత్రికలో వ్రాశాడు: 

1 పేతురు 2:5 

5 యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలము లగు ఆత్మసంబంధమైన బలులనర్పించుటకు పరిశుద్ధయాజకులుగా ఉండునట్లు, మీరును సజీవమైన రాళ్లవలెనుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు.మన ప్రధాన యాజకుడైన యేసు క్రీస్తు నందు మనము సజీవమైన, ప్రశస్తమైన రత్నముల వలె దేవునికి కనిపిస్తున్నాము. క్రీస్తు అనే ఈ రాయిలో ఉండుట  వలన మనం దేవునికి ఎంతో శ్రేష్టమైన వారిగా కనిపిస్తున్నామో మనం గ్రహించవచ్చు. 

12. A Stone of Partition 

చివరిగా ఈ రాయి వేరుచేసేది, విభజించేది. యెహోషువ నాయకత్వములో ఇశ్రాయేలీయులు కనాను దేశానికి బయలుదేరారు. చివరిగా వారి ముందు యొర్దాను నది ఉంది. యాజకులు దేవుని మందసము ను మోయుచు వెళ్ళినప్పుడు వారి కాళ్ళు నీటి అంచులో మునగగానే  దేవుడు యొర్దాను నీటిని ఆపాడు. ఆ నీళ్లన్నీ పెద్ద రాశిగా నిలిచి పోయాయి. ఇశ్రాయేలీయులందరూ ఆరిన నేల మీద యొర్దాను నది దాటి వెళ్లారు. దేవుడు వారితో చెప్పాడు: యొర్దాను నది మధ్యలో యాజకులు నిలిచిన చోట 12 రాళ్లు నిలువబెట్టించండి. ఆ రాళ్లు మీకు జ్ఞాపకార్థముగా ఉంటాయి. ఈ రాళ్లు ఎందుకు అని మీ పిల్లలు అడిగినప్పుడు, ‘దేవుడు యొర్దాను నదిని చీల్చి మమ్ములను 

వాగ్దాన దేశములోకి తెచ్చాడు. దానికి ఈ రాళ్లు జ్ఞాపకార్థము అని మీరు చెప్పాలి. (యెహోషువ 4:1-22). దేవుని ప్రజల ముందు ఎలాంటి అడ్డంకులు ఉన్నప్పటికీ 

ఈ రాయి వాటిని చీల్చివేస్తుంది. 

విశ్వ సించుచున్న మీకు, 

ఆయన అమూల్యమైనవాడు; 

విశ్వ సింపనివారికైతే ఇల్లు కట్టువారు

ఏ రాతిని నిషేధించిరో అదే మూలకు తలరాయి ఆయెను. 

మరియు అది అడ్డురాయియు అడ్డుబండయు ఆయెను. 1 పేతురు 2:7 

తన ప్రజలకు ఆయన అమూల్యమైన రాయి మూలకు తల రాయి విశ్వాసము లేని వారికి ఆయన అడ్డు రాయి, అడ్డు బండ గా ఉన్నాడు. తన ప్రజల ఎదుట ఎఱ్ఱ సముద్రమును చీల్చాడు. వారి శత్రువుల ఎదుట దానిని మూసివేశాడు తన ప్రజల ఎదుట యొర్దాను నదిని చీల్చాడు. వారి శత్రువుల ఎదుట దానిని మూసి వేశాడు. 

విశ్వాసులకు ఆయన తల రాయి. అవిశ్వాసులకు అడ్డు రాయి.  

నాకు క్రీస్తు వద్దు, నా దారిలో నేను వెళ్తాను. అది కూడా సాధ్యపడేది కాదు. ఇహలోక సామ్రాజ్యాలకు ఆయన అడ్డు బండ నెబుకద్నెజరు చూసిన ఆ గొప్ప ప్రతిమను ఆ రాయి వెళ్లి బూడిదగా మార్చివేసింది. ఆయనను నమ్మని యూదులకు ఆయన అడ్డుబండ. 

క్రీస్తు మాకు వద్దు. మా దారిన మేము పోతాము అని వారు అనుకొన్నారు. అయితే యేసు ప్రభువు దానిని ఒప్పుకోలేదు. ‘రాయి మీద రాయి లేకుండా ఈ ఆలయము 

కూల్చివేయబడుతుంది అని ఆయన చెప్పాడు. క్రీస్తు అనే పునాది లేని ఆలయముగా అది ఉంది. దానికి ఆయన అడ్డు బండగా మారాడు. రాయి మీద రాయి లేకుండా అది కూలిపోయింది. 

A Stone of God’s Partition 

ఈ రాయి విభజించేది, చీల్చేది, అడ్డగించేది. 

Conclusion 

దేవుని యొక్క 12 రాళ్లు అనే వంశములో ఈ రోజు 12 రాళ్లు మనం చూశాము. 

1.A Stone of God’s  Preparation 

ఇది దేవుడు సిద్ధపరచిన రాయి 

2.A Stone of God’s Prominence 

ఇది దేవుడు పునాదిగా చేసిన తల రాయి 

3. A Stone of God’s Preciousness 

ఇది దేవునికి ఎంతో అమూల్యమైన రాయి 

4.A Stone of God’s Perfection 

ఇది దేవుని పరిపూర్ణమైన రాయి 

5. A Stone of God’s Power

ఇది దేవుని శక్తితో నిండిన రాయి 

6.A Stone of God’s Protection 

ఇది దేవుని ప్రజలను కాపాడే రాయి 

7.A Stone of God’s Presence 

ఇది దేవుని సన్నిధిని మనకు ఇచ్చిన రాయి 

8. A Stone of God’s Provision 

ఇది దేవుని సమృద్ధిని మనకు ఇచ్చిన రాయి 

9. A Stone of God’s Peace 

ఇది దేవుని శాంతిని మనకు ఇచ్చిన రాయి 

10. A Stone of God’s Purification 

ఇది దేవుని పాప క్షమాపణ మనకు ఇచ్చిన రాయి 

11. A Stone of God’s Priesthood

ఇది దేవుని యాజకత్వము ఇచ్చిన రాయి 

12. A Stone of God’s Partition 

ఇది దేవుని విభజన తెచ్చిన రాయి 

క్రీస్తు అనే ఈ రాయిని మనం స్తుతించాలి. ప్రభువైన యేసు క్రీస్తు ఒక గాడిద మీద కూర్చుని యెరూషలేము లో ప్రవేశించాడు. ప్రజలందరూ యేసు క్రీస్తును స్తుతిస్తున్నారు 

మహిమ పరుస్తున్నారు అయితే పరిసయ్యులు అది చూసి నొచ్చు కున్నారు. బోధకుడా, నీ శిష్యులను గద్దించుము అని వారు ఆయనను అడిగారు 40 ఆయన వారిని చూచి – వీరు ఊరకుండినయెడల ఈ రాళ్లు కేకలు వేయునని మీతో చెప్పుచున్నాననెను. (లూకా 19:39-40). వీరు ఊరకుండిన యెడల, ఈ రాళ్లు కేకలు వేసి దేవుని స్తుతిస్తాయి. సజీవమైన దేవుని రాళ్లుగా ఉన్న మనం కూడా దేవుడు మనకు అనుగ్రహించిన ఈ గొప్ప పునాది రాయి యేసు క్రీస్తు ను స్తుతించాలి మహిమ పరచాలి.

Leave a Reply