డెడ్ సీ స్క్రోల్స్ – 75 సంవత్సరాలు: డాక్టర్ పాల్ కట్టుపల్లి 

    ఇశ్రాయేలు దేశములో డెడ్ సీ స్క్రోల్స్ బయటపడి నేటికి 75 సంవత్సరాలు ముగిసింది. ఈ సందర్భముగా వాటి యొక్క ప్రాముఖ్యతను నేటి కార్యక్రమములో చూద్దాము. డెడ్ సీ స్క్రోల్స్ గురించి కొన్ని ఆసక్తికరమైన సంగతులు మీతో పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను. 

పరిచయం: ఇది ఇశ్రాయేలు దేశములో మృత సముద్రం తీరములోని ఖుమ్రాన్ ప్రాంతం. 1946, 1947 సంవత్సరాల్లో ఇక్కడ ఉన్న గుహలలో బయటపడిన ప్రాచీన బైబిలు, ఇతర గ్రంథాల ప్రతులను డెడ్ సి స్క్రోల్స్ లేక మృత సముద్ర గ్రంథాలు అని పిలుస్తున్నాము. ఇవి క్రీస్తు పూర్వం మూడో శతాబ్దం నుండి క్రీస్తు శకం మొదటి శతాబ్దం వరకు ఉన్న కాలములో వ్రాయబడ్డాయి. వీటి గురించి పది సంగతులు మనం చూద్దాము. 

ప్రసిద్ధి: 

మొదటిగా వీటి ప్రసిద్ధి. ఇవి ఆర్కియాలజీలో ఎంతో ప్రాముఖ్యమైనవి. భూమి ని త్రవ్వినప్పుడు వేలాది సంవత్సరముల క్రితం జీవించిన వారు నివసించిన ఇల్లు, వారు వాడిన వస్తువులు, వారు చదివిన పుస్తక ప్రతులు బయటపడుతూ ఉంటాయి. అలా బయటపడిన వాటిలో డెడ్ సీ స్క్రోల్స్ ఎంతో ప్రసిద్ధి గాంచాయి. మన బైబిలు గ్రంథం యొక్క అత్యంత పురాతనమైన ప్రతులు ఈ డెడ్ సీ స్క్రోల్స్ లో ఉన్నాయి. మొత్తం 11 గుహల్లో 981 ప్రతులు, దాదాపు లక్షకు పైగా ముక్కలు లభ్యమయ్యాయి. కొంతమంది గొఱ్ఱెల కాపరులు వీటిని ముందుగా చూశారు. వాటిని వెలుపలికి తీసుకొని వచ్చి ప్రపంచానికి పరిచయం చేశారు. 

Cave in Qumran, where the dead sea scrolls were found, Israel

ప్రదేశం: 

    నా వెనుక మీరు చూస్తున్న గుహలలో ఈ డెడ్ సీ స్క్రోల్స్ బయటపడ్డాయి. మీకు కనిపిస్తున్నది నాలుగవ గుహ. 90 శాతము ప్రతులు అందులోనే బయటపడ్డాయి. కొంతమంది బెడోయిన్ కాపరులు ఈ గుహలలోకి వెళ్ళినప్పుడు ఇవి దొరికాయి. పెద్ద పెద్ద కుండలలో ఇవి కనిపించాయి. ఈ ప్రదేశములో ఉన్న వేడి, గాలి లో తేమ తక్కువగా ఉండడం ఈ ప్రతులు ఎక్కువ కాలం ఉండడానికి సహకరించాయి. ఈ కొండలకు ముందు మృత సముద్రం మనకు కనిపిస్తుంది. మృత సముద్రం ఎంతో ప్రత్యేకమైనది. ప్రపంచములో ఉన్న అన్ని సముద్రాల్లో కన్నా ఎక్కువ నీటి సాంద్రత ఈ నీటికి ఉంటుంది. ఈ నీటిలో మనం వెనుకకు పండుకొని తేలుతూ గడుపవచ్చు. ఈ నీటికి అంత డెన్సిటీ ఎలా లభించింది? మృత సముద్రం అవతల వైపు చూడండి. 

అక్కడ మనకు మోయాబు పర్వతాలు కనిపిస్తున్నాయి. మోయాబు ఎవరు? లోతు కుమారుడు. లోతు సొదొమ, గొమొఱ్ఱా ల నుండి పారిపోయి ఇక్కడ తలదాచుకున్నాడు. సొదొమ, గొమొఱ్ఱా పట్టణాలు పాపముతో నిండి పోయినప్పుడు దేవుడు వాటి మీద అగ్ని గంధకాలు కురిపించి వాటిని నాశనం చేశాడు. అప్పుడు లోతు, అతని భార్య, ఇద్దరు కుమార్తెలు అక్కడ నుండి పారిపోయారు, లోతు భార్య వెనుకకు తిరిగి చూసి ఉప్పు స్థంభము గా మారిపోయింది. మృత సముద్రం తీరములో చూడండి. ఎంతో ఉప్పు ఇక్కడ దిబ్బలు, దిబ్బలుగా కనిపిస్తుంది. ఈ సముద్రం క్రిందే సొదొమ, గొమొఱ్ఱాలు ఉండే అవకాశం ఉంది. దేవుని తీర్పు ఇక్కడ నివసించిన ఖుమ్రాన్ ప్రజలు ఎప్పుడూ గుర్తుపెట్టుకొన్నారు. వారి మీదకు అన్యజనులు దాడి చేసినప్పుడు కూడా దానిని వారు దేవుని తీర్పు గానే చూశారు. 

   ఈ ఖుమ్రాన్ ప్రాంతములో జరిపిన త్రవ్వకాల్లో క్రీస్తు పూర్వం 100 సంవత్సరముల క్రితం ఇక్కడ ఒక గ్రామము ఉండేది అని బయటపడింది. క్రీస్తు పూర్వం 31 లో ఇక్కడ ఒక భూకంపం జరిగింది. క్రీస్తు పూర్వం 9 లో పెద్ద అగ్ని ప్రమాదం జరిగింది. అగ్ని, వేడి కొన్ని సార్లు ప్రాచీన ప్రతులు భద్రతకు సహకరిస్తాయి. 

   ఇటలీ దేశములో పాంపే పట్టణము దగ్గరలో హెర్క్యూలేనియం అనే ఊరు ఉంది. క్రీస్తు శకం 79 సంవత్సరములో దగ్గరలో ఉన్న మౌంట్ వెసువియస్ అగ్ని పర్వతం ప్రేలి పాంపే, హెర్క్యూలేనియం రెండు పట్టణాలను నాశనం చేసింది. వేలాది మంది ప్రజలు సజీవ సమాధి అయ్యారు. అయితే ఆశ్చర్యకరముగా అనేక ప్రాచీన ప్రతులు హెర్క్యూలేనియంలో త్రవ్వకాల్లో బయటపడ్డాయి. రెండు వేల సంవత్సరాలు అవి నశించకుండా ఎలా ఉన్నాయి. అగ్ని పర్వతాలు సృష్టించిన వేడి వాటిని భద్రపరచింది.ఈ ఖుమ్రాన్ లో కూడా అటువంటి పరిస్థితులు వలనే ఈ డెడ్ సి స్క్రోల్స్ భద్రపరచ బడి ఉండవచ్చు. ఇక్కడ జరిగిన  భూకంపం, అగ్ని ప్రమాదాలు, వాతావరణం లో ఉండే వేడి ప్రత్యేకమైన పరిస్థితులు సృష్టించాయి. డెడ్ సి స్క్రోల్స్ రెండు వేల సంవత్సరాలు భద్రముగా ఉండడానికి కారణమయ్యాయి. 

ప్రజలు: 

ఈ ప్రాచీన ప్రతులను భద్రపరచిన ప్రజలు ఎవరు అనే ప్రశ్న మనకు వస్తుంది. ఎంతో వ్యయప్రయాసలకు ఓర్చి తమ బైబిలు ప్రతులను, ఇతర గ్రంథాలను వారు కుండలలో పెట్టి, ఈ పర్వతాలకు వచ్చారు. వాటిలో ఉన్న లోయలలోకి వారు వెళ్లారు. అక్కడ ఉన్న గుహలలో వీటిని వారు పెట్టారు. బయట ప్రపంచములో వీటికి భద్రత ఉండదు అని వారు అనుకొన్నారు. క్రీస్తు పూర్వం 586 నెబుకద్నెజరు యెరూషలేము ను నాశనం చేశాడు.  

   క్రీస్తు పూర్వం 586 లో బబులోను చక్రవర్తి నెబుకద్నెజరు యెరూషలేము ను నాశనం చేసి, అక్కడ ఉన్న దేవుని మందిరమును కూడా అగ్నికి ఆహుతి చేసాడు. యూదులు 70 సంవత్సరాలు బబులోను చెరకు వెళ్లారు. పర్షియా చక్రవర్తి సైరస్ అనుమతితో యూదులు తిరిగి యూదయ ప్రాంతం వెళ్లారు. క్రీపూ 516 లో వారు రెండవ దేవుని మందిరం నిర్మాణం నిర్మించుకున్నారు. ఆ మందిరములో వారు బైబిలు ప్రతులు భద్రపరిచారు. అయితే యూదుల మధ్య ఐకమత్యం లేకుండా పోయింది. క్రీస్తు పూర్వం 67 లో సలోమే అలెగ్జాండ్రా రాణి మరణించిన తరువాత వారి మధ్య ఆధిపత్య పోరాటాలు మొదలయినాయి.  

   క్రీస్తు పూర్వము 63 సంవత్సరములో రోమన్ జనరల్ పాంపే దండయాత్ర యూదుల మధ్య నెలకొన్న తగాదాలు గురించి విన్నాడు. యూదులలో కొంతమంది నాయకులు ఎదురు తిరిగినప్పుడు వారిని ఊచకోత కోశాడు. యెరూషలేము లోని దేవుని మందిరములో కూడా పాంపే అనేక మందిని హతమార్చాడు. ఆ తరువాత వచ్చిన హేరోదు రాజు ఇక్కడ అన్యుల పద్ధతులు అనుసరించి అనేక విలాస భవనాలు నిర్మించాడు.

దగ్గరలో మసాడా అనే చక్కటి భవనాన్ని ఒక కొండ మీద కట్టాడు. యెరూషలేములో ఉన్న రెండవ దేవుని మందిరాన్ని కూడా విస్తరించి ఎంతో వైభవముగా నిర్మించాడు. ఆ కాలములోనే ప్రభువైన యేసు క్రీస్తు ఈ ప్రపంచానికి రావడం, సువార్త ప్రకటించడం, సిలువ వేయబడడం, మరణించి, సమాధి చేయబడి తిరిగి పరలోకం వెళ్లిపోవడం జరిగింది. ఆ కాలములో యూదులు రోమన్ల మీద తమ తిరుగుబాటు కొనసాగించారు. హేరోదు కుటుంబం, రోమన్ చక్రవర్తులు  యూదులను అణచివేస్తూనే ఉన్నారు. యూదుల ప్రతిఘటన పెరిగిందే కానీ తగ్గలేదు. 

   క్రీ శకం  66 నీరో తన సైన్యాన్ని వారి మీదకు పంపించాడు. ఆ సమయములోనే పౌలు, పేతురు వంటి అపోస్తలులు కూడా చంపబడ్డారు. రోమన్ జనరల్ వెస్పేషియన్, ఆ తరువాత అతని కుమారుడు టైటస్ నాయకత్వములో రోమన్ సైన్యం యూదులను పూర్తిగా అణచివేసింది. క్రీస్తు శకం 68 లో రోమన్ సైన్యం ఈ ఖుమ్రాన్ ప్రాంతాన్ని నాశనం చేసింది. క్రీస్తు శకం 70 లో యెరూషలేములో ఉన్న రెండవ దేవుని మందిరమును కూడా రోమన్లు తగులబెట్టారు. ఆ సమయములో దేవుని మందిరములో ఉన్న బైబిలు ప్రతులను యూదులు తమతో తీసుకొని వెళ్లి ఈ పర్వతాలలోని గుహలలో వాటిని భద్రపరచి ఉంటారని చరిత్రకారులు భావిస్తున్నారు. యెరూషలేము లాంటి పెద్ద నగరాల్లో ఉన్న హింస అణచివేత లను తప్పించుకోవటానికే వీరు ఈ ఖుమ్రాన్ ప్రాంతానికి వచ్చివుంటారు. ఈ మృత సముద్రం ఒడ్డున వారు ఇల్లు నిర్మించుకొని బైబిలు ప్రతులు వ్రాసివుండ వచ్చు.

   ఈ ప్రజలు ఎవరు అనే ప్రశ్న మనకు రావచ్చు. చరిత్ర కారులు ఈ ప్రశ్నకు అనేక రకాలుగా సమాధానం ఇచ్చారు. వీరు యూదులలో ఎంతో సాంప్రదాయముగా జీవించే ఎస్సీను లు అయి ఉండవచ్చు అనే వారు ఉన్నారు. అయితే కొంతమంది స్కాలర్స్ వీరు ఆది క్రైస్తవులు అయి ఉండవచ్చు అంటున్నారు. 

   చరిత్రకారుడు జోసే ఓ కాళ్ళగన్ మార్టినెజ్ (Jose O’Callagan Martinez) 7 వ గుహలోని ఒక ప్రతి 7Q 5 ని మార్కు  సువార్త లో భాగముగా గుర్తించాడు. దీనిని బట్టి, ఈ డెడ్ సి స్క్రోల్స్ ని భద్రపరచిన ప్రజలు క్రైస్తవులు అయి ఉండవచ్చు అని చెప్పటానికి ఆధారం దొరికింది. వారు యూదులయినా, క్రైస్తవులైనా వారు ప్రత్యేక మైన జీవన విధానం గడిపారని ఈ ప్రాంతం చూస్తే మనకు అర్ధం అవుతుంది. వారు వెలుపలి ప్రపంచానికి దూరముగా ఈ గ్రామము కట్టుకున్నారు. వారు కట్టుకున్న ఇల్లు త్రవ్వకాల్లో బయటపడ్డాయి. వారు పుణ్య స్నానాలు చేసే రూములు బయటపడ్డాయి. 

వారు ఈ ప్రతులను వ్రాసిన బల్లలు బయటపడ్డాయి. వారు చేసిన పని 2000 సంవత్సరాలు ప్రపంచము చూడలేదు. యూదులు ప్రపంచము మొత్తము చెదరి పోయారు. 

   20 శతాబ్దములో తిరిగి వారు యూదయకు వెళ్లడం ప్రారంభించారు. అప్పటికే ఆ ప్రాంతములో లక్షలాదిమంది అరబ్బులు స్థిరపడి ఉన్నారు. యూదులకు, అరబ్బులు మధ్య యుద్ధాలు మొదలయ్యాయి. రెండో ప్రపంచ యుద్ధం కూడా మన ప్రపంచాన్ని, ఇశ్రాయేలు ప్రాంతాన్ని అతలాకుతలం చేస్తూ ఉంది. ఆ యుద్ధం తరువాత 1947 లో ఇశ్రాయేలు దేశం ఏర్పడదానికి రంగం సిద్ధమయ్యింది. 

మే 14, 1948 – ఇశ్రాయేలు దేశం ఏర్పాటు 

ఇశ్రాయేలు దేశం స్వాతంత్రం ప్రకటించుకొని క్రొత్త దేశముగా జన్మించింది. దాని కి ఒక నెల రోజుల ముందు 

ఏప్రిల్ 11, 1948 -డెడ్ సీ స్క్రోల్స్ ప్రకటన 

 ఏప్రిల్ 11, 1948 న డెడ్ సీ స్క్రోల్స్ బయటపడడం గురించి అధికారికంగా ప్రకటన వెలువడింది. ఆ తరువాత వెంటనే అరబ్బులు, యూదులకు మధ్య యుద్ధం మొదలయ్యింది. అంటే యూదులు రోమన్లతో యుద్ధం చేస్తున్నప్పుడు ఈ ప్రతులు గుహలలోకి వెళ్ళినాయి. రెండు వేల సంవత్సరాల తరువాత యూదులు అరబ్బులతో యుద్ధం చేస్తున్నప్పుడు అవి గుహలలో నుండి బయటికి వచ్చినాయి. 

ఆ విధముగా డెడ్ సీ స్క్రోల్స్ ఒక యుద్ధములో భద్రపరచబడ్డాయి. మరొక యుద్ధంలో బయటపడ్డాయి. ఒక యుద్ధములో లోపలికి వెళ్ళినాయి. మరొక యుద్ధములో బయటికి వచ్చినాయి. సరిగ్గా ఆధునిక ఇశ్రాయేలు దేశం తిరిగి జన్మించేటప్పుడు దేవుడు వీటిని ప్రపంచానికి చూపించాడు. 

ప్రతులు: 

   డెడ్ సి స్క్రోల్స్ ప్రస్తుతం నా వెనుక కనిపిస్తున్న ‘shrine of the book’ అనే భవనంలో ఉంచబడ్డాయి. మన ప్రపంచం మొదటి సారిగా డెడ్ సి స్క్రోల్స్ ప్రతులను చూసినప్పుడు ఎంతో సంచలనం కలిగించిన విషయం ఏమిటంటే ఒక్క ఎస్తేరు గ్రంథం తప్ప పాత నిబంధనలోని పుస్తకాలు మొత్తం వాటిలో ఉన్నాయి. అత్యధిక ప్రతులు గొఱ్ఱెలు, మేకల చర్మముతో చేయబడిన పొరల మీద వ్రాయబడ్డాయి. అప్పుడు కాగితం గురించి చైనా లో తప్ప,  ప్రపంచానికి తెలియదు. సిరాతో అక్షరం తరువాత అక్షరం ఈ జంతు చర్మాల మీద ఎన్నో వ్యయప్రయాసలు ఓర్చుకొని వారు దేవుని వాక్యం, ఇతర పుస్తకాలు వ్రాసారు.  వీటిల్లో ఎక్కువ హెబ్రీ భాషలో వ్రాయబడ్డాయి. అయితే కొన్ని అరామిక్ భాషలో, కొన్ని గ్రీకు భాషలో వ్రాయబడ్డాయి. 

వీటిలో 40 శాతం బైబిలు పుస్తకాలే ఉన్నాయి. మిగిలినవి ఇతర పుస్తకాలు. 225 బైబిల్ భాగాలు ఇందులో వున్నాయి. అన్నిటి కంటే గొప్ప విషయం ఈ డెడ్ సి స్క్రోల్స్ లో ఉన్న పాత నిబంధన ప్రతులు. అప్పటి వరకు హెబ్రీ బైబిలు పురాతన ప్రతులు క్రీస్తు శకం 10 శతాబ్దము నకు చెందినవి. కొంతమంది విమర్శకులు క్రైస్తవులు పాత నిబంధన గ్రంథాన్ని ఉద్దేశ్యపూర్వకంగా మార్చారు అని క్రైస్తవ సంఘం మీద నిందలు వేస్తూ ఉండేవారు. 

   క్రీస్తు శకం 10 వ శతాబ్దం కు ముందు ఏమి జరిగింది? బైబిల్ ని క్రైస్తవులు మార్చివేశారా? అనే ప్రశ్నలకు సమాధానాలు లేవు. అయితే డెడ్ సీ స్క్రోల్స్ బయటపడినప్పుడు మనకు గొప్ప సమాధానాలు లభించాయి. క్రీస్తు పూర్వం రెండో శతాబ్దానికి చెందిన పాత నిబంధన ప్రతులు డెడ్ సీ స్క్రోల్స్ లో బయటపడ్డాయి. అంటే 2200 సంవత్సరాల క్రితం బైబిల్ ఎలా ఉండేదో వీటి వలన మనకు అర్థం అవుతున్నది. నేటి పాత నిబంధన ను, నాటి పాత నిబంధనను పోల్చిచూస్తే బైబిల్ చెక్కుచెదరలేదు అనే సత్యం మనకు అర్థం అవుతుంది. ఎలాంటి మార్పులు లేకుండా బైబిల్ అలానే ఉంది అనే సత్యము వాటిలో కనిపించింది. క్రైస్తవులు బైబిల్ వాక్యాలు మార్చారు అనే నిందలు వేసినవారు కూడా ఇప్పుడు మౌనముగా ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. 

ప్రయాణం: 

     డెడ్ సి స్క్రోల్స్ బయటపడినప్పుడు చాలా సంవత్సరాలు వాటి విలువ ప్రపంచానికి తెలియలేదు. గొఱ్ఱెల కాపరులు వాటిని దగ్గరలోని ప్రముఖ వ్యక్తులకు అప్పగించారు. వారు వాటిని పట్టించుకోలేదు. అవి ప్రపంచం మొత్తం ప్రయాణము చేశాయి. వాటిని అమ్ముకొని కొంత డబ్బు సంపాయించుకొందాము అని వారు అనుకొన్నారు. అవి అనేక దేశాలకు తరలించబడ్డాయి. అనేకమంది చేతులు మారాయి. 2000 సంవత్సరములు భద్రముగా ఉన్న ఈ ప్రతులు ఆధునిక కాలములో నశించే పరిస్థితి వచ్చింది. చివరకు 1991 లో ఇశ్రాయేలు ప్రభుత్వం చొరవ తీసుకొని ఈ ప్రత్యేక భవనాన్ని వీటి భద్రత కోసం నిర్మించింది. 

ప్రదర్శన: 

   ఆ భవనముతో పాటు ప్రపంచములో అనేక ప్రాంతాల్లో ఈ డెడ్ సి స్క్రోల్స్ ప్రదర్శనకు ఉంచ బడ్డాయి. ఇశ్రాయేలు ప్రభుత్వం నిర్వహిస్తున్న ఇశ్రాయేలు మ్యూజియం లో అందరి కంటే ఎక్కువగా 15,000 ప్రతులు ఉన్నాయి. జోర్డాన్ ప్రభుత్వం, అనేక క్రైస్తవ విద్యా సంస్థలు, విశ్వవిద్యాలయాలు ఈ ప్రతులను భద్రపరుస్తున్నాయి. 

ప్రతిస్పందన: 

   డెడ్ ఈ స్క్రోల్స్ బయటపడినప్పుడు ప్రపంచ వ్యాప్తముగా అది సంచలన వార్త అయ్యింది. క్రీస్తు పూర్వము నాటి బైబిలు ప్రతులు బయటపడ్డాయా అని అందరూ ఆశ్చర్యపోయారు. ఇక ఆర్కియాలజిస్టు లకయితే అది ఒక గొప్ప పండుగే. ప్రపంచము నలు మూలల నుండి ఆర్కియాలజిస్టులు ఇశ్రాయేలు దేశానికి వరుస కట్టారు. ఖుమ్రాన్ చుట్టూ ఉన్న కొండ గుహలలోకి వెళ్లి త్రవ్వకాలు జరిగి చాలా ప్రాచీన ప్రతులు కనుగొన్నారు. వాటి మీద ఎంతో పరిశోధనలు జరిగినాయి. ఇంకా జరుగుతూనే ఉన్నాయి. ఆధునిక టెక్నాలజీ కూడా ఈ ప్రాచీన ప్రతులను అర్థం చేసుకోవటానికి ఎంతో ఉపకరించింది.

అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా ఇన్ఫ్రా రెడ్ ఇమేజింగ్ టెక్నాలజీ వుపయోగించి ఈ ప్రతుల మీద పరిశోధనలు చేస్తున్నది. ఇతర గ్రహాలు, నక్షత్రాలు అర్థం చేసుకోవటానికి అంత రిక్షం లోకి పంపే నౌకల మీద ఈ టెక్నాలజీ ఉంటుంది. ఆ ఇన్ఫ్రా రెడ్ డిజిటల్  టెక్నాలజీ తో నాసా సంస్థ  అనేక డెడ్ సి స్క్రోల్ ప్రతులను పరిశోదించింది. వాటిని ప్రచురించింది. నాసా సంస్థ జెట్ ప్రొపల్షన్ లాబొరేటరీ వారు ఇంతకు ముందు చూడలేని, చదువులేని వాక్యాలను  కూడా ఇప్పుడు చూడగలుగు తున్నారు, చదువగలుగు తున్నారు. ఆసక్తి ఉన్నవారు

www.deadseascrolls.org.il అనే వెబ్ సైట్ కి వెళ్ళండి. అక్కడ మీరు ఈ డెడ్ సి స్క్రోల్స్ ప్రతులను  డిజిటల్ రూపములో చూడవచ్చు. 

   మరొక ప్రక్క DNA టెక్నాలజీ కూడా ఈ ప్రతులు ఎక్కడి నుండి వచ్చాయో తెలుసుకోవడానికి ఉపయోగపడుతున్నది. ఈ ప్రతులు వ్రాయడానికి  జంతువుల చర్మం వాడారు. ఆ చర్మం లోని కణాల్లో ఉన్న DNA ని పరిశోధించి అనేక విషయాలు తెలుసుకొంటున్నారు. 

ప్రముఖం: 

   డెడ్ సి స్క్రోల్స్ లో ప్రముఖముగా ఉన్న బైబిల్ పుస్తకాలు ఏమిటి? అన్నిటికంటే ఎక్కువగా కీర్తనల గ్రంథం 39 ప్రతులు లభించాయి. అంటే ఆ ప్రజలు కీర్తనలు చదువడానికి, దేవుని స్తుతించడానికి ఇచ్చిన ప్రాధాన్యత మనకు అర్ధం అవుతుంది. 

ఆదికాండము ప్రతులు 24 వీటిలో ఉన్నాయి. దేవుడు మన సృష్టికర్త, ముందు విశ్వాన్ని, ఆ తరువాత మానవులను ఆయన సృష్టించాడు. వారితో తన నిబంధనలు చేసాడు. అబ్రహాము ను దేవుడు పిలిచి, అతనితో ఒక గొప్ప నిబంధన దేవుడు చేసాడు. దేవుడు ఆ నిబంధనను నిలబెట్టుకొంటాడు అని ఈ ఖుమ్రాన్ లో నివసించిన ప్రజలు బలముగా నమ్మారు. 

  నిర్గమ కాండము 18 ప్రతులు వీటిలో ఉన్నాయి. దేవుడు మోషే ద్వారా ఇశ్రాయేలీయులను ఐగుప్తు నుండి విమోచించుట, ఎఱ్ఱ సముద్రం చీల్చి తన ప్రజలను అరణ్యములోకి నడిపించడం, సీనాయి పర్వతం మీద వారికి తన ధర్మశాస్త్రం ఇవ్వడం నిర్గమ కాండములో మనం చదువుతాము. 

  ఆ తరువాత ద్వితీయోప దేశ కాండము 33 ప్రతులు వీటిలో ఉన్నాయి. ద్వితీయోప దేశ కాండములో దేవుడు తన ప్రజలకు ఇచ్చిన ఆజ్ఞలు మనకు కనిపిస్తాయి. ఈ ఖుమ్రాన్ ప్రజలు దేవుని ఆజ్ఞలను చదువుట, పాటించుటకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చారు. 

ప్రవచనం: 

   ఈ డెడ్ సి స్క్రోల్స్ లో ప్రవచన గ్రంథాలకు ఎంతో ప్రాధాన్యత మనకు కనిపిస్తుంది. యెషయా గ్రంథం 22 ప్రతులు వాటిలో ఉన్నాయి. దానియేలు గ్రంథము 8 ప్రతులు, యిర్మీయా గ్రంథం 6 ప్రతులు, యెహెఙ్కేలు గ్రంథము 6 ప్రతులు ఇందులో దొరికాయి. ఇక్కడ మనకు ఒక చక్కటి  డెడ్ సి స్క్రోల్ కనిపిస్తున్నది. 1946 లో ఒకటో నంబర్ గుహలో ఈ యెషయా గ్రంథం దొరికింది. అది అతి ప్రాచీన యెషయా గ్రంథం. 

17 చుట్టల మీద మొత్తం పుస్తకం భద్రపరచబడింది. యెషయా గ్రంథం యొక్క ప్రాముఖ్యతను వారు గుర్తించారు. అందుకనే దానిని చాలా జాగ్రత్తగా భద్రపరిచారు. యెషయా ప్రవక్త ఒక వైపు దేవుని తీర్పు, యుద్ధము గురించి ప్రవచించాడు. మరొకవైపు దేవుని సమాధానం, దేవుని ప్రజలకు లభించబోయే విశ్రాంతి గురించి ప్రవచించాడు. అన్నిటి కంటే ముఖ్యముగా ఒక మెస్సియాను దేవుడు పంపిస్తాడు. ఒక రక్షకుని దేవుడు ఈ ప్రపంచానికి పంపిస్తాడు అని యెషయా ప్రవచించాడు. 

ఆ రక్షకుడు ఇశ్రాయేలు దేశములో ఒక కన్యక ద్వారా జన్మిస్తాడు (యెషయా 7:14), 

తన ప్రజలకు సువార్త ప్రకటిస్తాడు (యెషయా 42:1-4), 

వారి పాపముల కొరకు శ్రమపెట్టబడి, చంపబడతాడు, సమాధి చేయబడతాడు, 

తిరిగి మరణం నుండి తిరిగి లేస్తాడు (యెషయా 53). 

ఆయన దేవుని రాజ్యం తెస్తాడు (యెషయా 2:1-4). 

ఆయన రాజ్యములో దేవుని ఆనందం, దేవుని ఆశీర్వాదం ఇశ్రాయేలు దేశం 

అనుభవిస్తుంది (యెషయా 1:24-27).

ప్రపంచము మొత్తం ఆయన ద్వారా ఆశీర్వదించబడుతుంది (యెషయా 49:5-6) 

అని యెషయా ప్రవచించాడు. 

ఆ ప్రవచనాలు అనేకం ప్రభువైన యేసు క్రీస్తు మొదటి రాకడలో నెరవేరినాయి. మిగిలినవి ఆయన రెండవ రాకడలో నెరవేరబోవుతున్నాయి. ఈ డెడ్ సి స్క్రోల్  ప్రతులు ఒక యుద్ధములో భద్రపరచబడ్డాయి. మరొక యుద్ధంలో బయటపడ్డాయి. అయితే దేవుని ప్రజలకు మెస్సియా ద్వారా దేవుడు తన శాంతిని అనుగ్రహించాడు. 

ప్రభావం: 

చివరిగా, ఈ డెడ్ సి స్క్రోల్స్ ప్రభావం మనం చూడాలి. 

మొదటిగా దేవుని కాపుదల: 

దేవుడు కొంతమంది గొఱ్ఱెల  కాపరులకు ఈ డెడ్ సీ స్క్రోల్స్ ని ముందుగా చూపించాడు. ప్రభువైన యేసు క్రీస్తు జన్మించినప్పుడు కూడా దేవుడు మొదటిగా ఆ వార్తను గొఱ్ఱెల కాపరులకు తెలియజేశాడు. వేలాది సంవత్సరముల తరువాత కూడా దేవుని వాక్యం మారలేదు అనే సత్యం ఈ ఈ డెడ్ సీ స్క్రోల్స్ ని చూసినప్పుడు మనకు అర్థం అవుతుంది. దేవుడు తన వాక్యాన్ని కాపాడే గొప్ప కాపరిగా ఇక్కడ మనకు కనిపిస్తున్నాడు. 

   రెండు వేల సంవత్సరాల క్రితం ప్రభువైన యేసు క్రీస్తు, ఆయన శిష్యులు పాత నిబంధనలో నుండే దేవుని వాక్యం బోధించారు. వారు ఉపయోగించిన పాత నిబంధన, ఈ రోజు మనం చదువుతున్న పాత నిబంధన ఎలాంటి మార్పు లేకుండా భద్రపరచబడ్డాయి అనే సత్యం ఈ డెడ్ సి స్క్రోల్స్ చూసినప్పుడు మనకు అర్థం అవుతుంది. 

దేవుని ప్రజల ప్రత్యేక జీవితం: రెండువేల సంవత్సరముల క్రితం ఖుమ్రాన్ ప్రాంతములో జీవించిన ప్రజలు, వారి నమ్మకాలు, వారి పద్ధతులు మనకు కనిపించాయి. బాప్తిస్మమిచ్చే యోహాను కూడా అటువంటి జీవన శైలి నే కలిగిఉన్నాడు. దేవుని రాజ్యం రాబోతున్నది, మీ పాపములను బట్టి చింతించండి. పాప క్షమాపణ పొందండి. బాప్తిస్మము పొందండి అని యోహాను, ప్రభువైన యేసు క్రీస్తు, ఆయన శిష్యులు బోధించారు. 

దేవుని ప్రజల పోరాటం: దేవుని వాక్యం ఎంతో ముఖ్యమైనది. దానిని జాగ్రత్తగా కాపాడుకోవాలి అని ఖుమ్రాన్ ప్రజలు భావించారు. రోమన్ చక్రవర్తి ఇంకా, ఇంకా ప్రపంచ రాజ్యాలను జయించాలి అని పోరాడుతున్నాడు. హేరోదు రాజు ఇంకా, ఇంకా డబ్బు సంపాదించాలి అని పోరాడుతున్నాడు. వీరు మాత్రం, ‘మనం దేవుని వాక్యాన్ని భవిష్యత్తు తరాల కోసం భద్రముగా ఉంచాలి. దాని కోసం ఎంత మూల్యం చెల్లించడానికైనా సిద్ధపడాలి’ అనుకొన్నారు. 

దేవుని రాజ్యం: దేవుని రాజ్యం అనే అంశం డెడ్ సి స్క్రోల్స్ లో ప్రాముఖ్యముగా మనకు కనిపిస్తుంది. ప్రభువైన యేసు క్రీస్తు దాని గురించి కొండ మీద ప్రసంగము చేశాడు (మత్తయి 5-7 అధ్యాయాలు). ఇశ్రాయేలు దేశములో క్రైస్తవ్యం పుట్టినప్పుడుఎలాంటి పరిస్థితులు ఉన్నాయో ఈ డెడ్ సి స్క్రోల్స్ వెలుగు లోకి తెచ్చాయి. వీటిని మనకు అందించిన దేవునికి స్తుతి కలుగును గాక. 

రెఫరెన్సెస్: 

By Department of Archaeology, the Hebrew University, Jerusalem – National Library of Israel, Schwadron collection, CC BY 3.0, https://commons.wikimedia.org/w/index.php?curid=8125288

-By NASA – http://www.nasa.gov/images/content/139495main_frag.jpg, Public Domain, https://commons.wikimedia.org/w/index.php?curid=19681719

-By Abraham Meir Habermann, 1901-1980 – https://archive.org/details/scrollsfromdeser00habeuoft, Public Domain, https://commons.wikimedia.org/w/index.php?curid=19883991

-By ho visto nina volare from Italy – Ercolano 2012Uploaded by tm, CC BY-SA 2.0, https://commons.wikimedia.org/w/index.php?curid=24352578

-By Guido Bertolotti – Lavoro personale (foto presa con permesso della guida nella giornata di Porte Aperte del FAI (Fondo Ambiente Italiano) il 20 Marzo 2005), Public Domain, https://commons.wikimedia.org/w/index.php?curid=2223542

Leave a Reply