
చాలా మంది నన్ను అడిగే ప్రశ్నలలో ముఖ్య మైనవి: దేవుడు నిజముగా ఉన్నాడా? నీవు ఎందుకు క్రైస్తవుడవు అయ్యావు? ఈ రోజు కార్యక్రమములో ఈ ప్రశ్నలకు సమాధానం ఇస్తాను. ఈ రెండు ప్రశ్నలకు నేను చెప్పే జవాబులు ఒక్కటే. 5 విషయాల గురించి నేను తీవ్రముగా ఆలోచించాను. అవే నన్ను దేవుని మీద నమ్మకం కలిగించాయి. అవే నన్ను క్రీస్తు యొద్దకు నడిపించాయి.
ప్రకృతి యొక్క నిర్మాణం
మొదటిగా, ప్రకృతి యొక్క నిర్మాణం. నా చిన్నతనములో మా అమ్మ మా ఇంటి వెనుక అనేక చెట్లు పెంచుతూ ఉండేది. ఆమె ఉద్యోగానికి వెళ్లే ముందు ఆ మొక్కలకు ‘నీళ్లు పోస్తూ ఉండు’ అని నాకు చెప్పేది. ఆ మొక్కలకు నీళ్లు పోస్తూ నేను వాటిని గమనిస్తూ ఉండేవాడిని. ఆ ఫ్లవర్స్ ని చూస్తే వాటి చక్కటి రూపం నన్ను ఆలోచింపజేసింది. ఆ పువ్వులు ఎంత రోటేట్ చేసినా ఒకే రకముగా నాకు కనిపించేవి. వీటిలో ఇంత సిమ్మెట్రీ ఎలా వచ్చింది? అనే ప్రశ్న నాకు కలిగింది. కొన్ని సార్లు చక్కటి సీతాకోక చిలుకలు ఆ పువ్వుల మీద వాలుతూ ఉండేవి. ఆ సీతాకోక చిలుకల రెక్కలలో చక్కటి సిమ్మెట్రీ నాకు కనిపించింది. మొక్కలలోనే కాకుండా జంతువులలో కూడా సిమ్మెట్రీ ఉంది అని నాకు అప్పుడు అర్ధమయింది.


ఒక రోజు చీరాల లో సముద్రం దగ్గరకు నేను వెళ్ళాను. నేను సముద్రం చూడడం అదే మొదటి సారి. ఒక పెద్ద బ్లూ కొండ వలె ఆ సముద్రం నాకు కనిపించింది. ఆ సముద్రం తీరాన ఒక సీ స్టార్స్, ఆక్టోపస్ లు, సాండ్ డాలర్ లాంటి సముద్ర జీవులు నాకు కనిపించాయి. వాటిలో చక్కటి సిమ్మెట్రీ నాకు కనిపించింది.

హై స్కూల్ లో నేను మాథెమాటిక్స్ ఎక్కువగా చదువుతూ ఉండేవాడిని. జియోమెట్రీ లో అనేక ట్రై యాంగిల్స్, స్క్వేర్ లు, క్యూబ్ లు, స్పియర్ లు వాటిల్లో కూడా నాకు ఎంతో సిమ్మెట్రీ నాకు కనిపించింది. మా మాథెమాటిక్స్ టీచర్ గారు ట్రిగోనోమెట్రీ లో cosine, sine, tangent లను నాకు నేర్పించాడు. ఆ తరువాత కాల్కులస్, లోగర్ థమ్స్, క్వా డ్రాటిక్ ఈ క్వే షన్లు, పైథాగొరస్ థీరం లలో కూడా చక్కటి సిమ్మెట్రీ నాకు కనిపించింది.

కెమిస్ట్రీ ల్యాబ్ లో చిన్న చిన్న యా టమ్ లు, చిన్న చిన్న మొలిక్యూల్ లు మైక్రో స్కోప్ లో పెట్టి చూస్తూ ఉండేవాడిని. వాటిల్లో కూడా చక్కటి సిమ్మెట్రీ నాకు కనిపించింది. పీరియాడిక్ టేబుల్ చూసినప్పుడు ఒక చక్కటి ఆర్డర్ నాకు కనిపించింది. అనేక రకాలైన ఎలిమెంట్స్ ఎంత చక్కగా ఆ పీరియాడిక్ టేబుల్ లో చేరినవి. మాథెమాటిక్స్ లో ఇంత ‘సిమ్మెట్రీ’ ఉందా? అని నేను ఆశ్చర్యపోయాను.



ఒక రోజు మా నాన్న యోహాను గారు మా ఇంట్లో అందరినీ విజయవాడ తీసుకొని వెళ్ళాడు. కృష్ణ నది ఒడ్డు ఒక చక్కటి కొండ ఉంది. ఆ కొండ మీద ప్లానెటేరియం ఉంది. ఆ ప్లానెటేరియం కి మేము అందరం వెళ్ళాము. ఆ షో లో చక్కటి నక్షత్రాలు మాకు చూపించారు. మన సౌర కుటుంబం చూపించారు. సూర్యుడు, దాని చుట్టూ తిరుగుతున్న గ్రహాలు చూపించారు. చివరకు మనం నివసిస్తున్న గేలక్సీ చూడండి. ఇది మిల్కీ వే గేలక్సీ అని చూపించారు. కొన్ని నిమిషాల పాటు దానిని చూస్తూ అలాగే ఉండిపోయాను. మిల్కీ వే ఎంతో అందముగా నాకు కనిపించింది. దాని అందము కంటే దాని లో కనిపించిన సిమ్మెట్రీ నాకు ఆశ్చర్యం కలిగించింది.

ఫిజిక్స్ లో కూడా ఎన్నో ఆసక్తికరమైన విషయాలు నాకు కనిపించాయి. న్యూటన్ నియమాలు, కెప్లెర్ నియమాలు ప్రకృతి గురించి మనకు ఎన్నో సత్యాలు నేర్పించాయి. ఆ ఫిజికల్ నియమాల్లో చక్కటి సిమ్మెట్రీ నాకు కనిపించింది. జేమ్స్ క్లార్క్ మాక్స్ వెల్ ఎలెక్ట్రోమాగ్నెటిజం మీద గొప్ప ఈక్వేషన్స్ వ్రాశాడు. వాటిలో కూడా అందమైన సిమ్మెట్రీ మనకు కనిపిస్తుంది.

Laws of conservation: శక్తి మారేది కాదు, పదార్థం మారేది కాదు, గతి మారేది కాదు,
ఎలెక్ట్రిక్ ఛార్జ్ మారేది కాదు. laws of conservation of energy, law of conservation of mass, momentum, electric charge – ఈ నియామాలు కూడా సిమ్మెట్రీ లో నుండి వచ్చినవే.
ఒక రోజు మా ఫిజిక్స్ లెక్చరర్ ఆల్బర్ట్ అయి న్ స్టైన్ గురించి మాకు చెప్పాడు. అయి న్ స్టైన్ గురించి ఇంకా తెలుసుకోవాలి అనే ఆసక్తి ఆ రోజు నాకు కలిగింది. ఆయన వ్రాసిన జనరల్ థియరీ అఫ్ రెలెటివిటీ, స్పెషల్ థియరీ అఫ్ రెలెటివిటీ చదవడం ప్రారంభించాను. అయి న్ స్టైన్ వ్రాసిన ఈక్వేషన్స్ లో కూడా నాకు చక్కటి సిమ్మెట్రీ కనిపించింది. విశ్వము మొత్తములో ఈ సిమ్మెట్రీ వ్యాపించి ఉంది అని నాకు అర్థం అయింది.

నేను MBBS చదివే రోజుల్లో అనాటమీ ల్యాబ్ లో చాలా సమయం గడుపుతూ ఉండేవాడిని. మానవ శరీరము డైసెక్ట్ చేసి చూసినప్పుడు అనేక అవయవాలు ఒక చక్కటి సిమ్మెట్రీ లో కనిపించాయి. హ్యూమన్ బ్రెయిన్ లో సిమ్మెట్రీ నాకు కనిపించింది. ప్రకృతిలో ఉండే ‘సిమ్మెట్రీ’ ని గ్రహించ గలిగే శక్తి మనిషి మెదడులో ఉంది అని నాకు అప్పుడు అర్థమయ్యింది. జీవ కణము లో ఉండే DNA లో ఒక చక్కటి నిర్మాణం నాకు కనిపించింది. అందులో ఉన్న సిమ్మెట్రీ మనకు ఆశ్చర్యం కలిగించక మానదు. నాట్యం చూసేటప్పుడు వారి కదలికల్లో ఒక సిమ్మెట్రీ ఉంటుంది. మంచి సంగీతం వినేటప్పుడు మనకు ఒక మధురమైన అనుభూతి కలుగుతుంది. సంగీతములో ఉండే ‘సిమ్మెట్రీ’ మనకు ఆ అనుభూతి కలిగిస్తుంది.


ఒక రోజు ఆగ్రా లో తాజ్ మహల్ చూడడానికి నేను వెళ్ళాను. తాజ్ మహల్ ని చూసినప్పుడు నేను ఆశ్చర్యానికి గురయ్యాను. అందులో చక్కటి సిమ్మెట్రీ నాకు కనిపించింది. ఎంతో జ్ఞానం కలిగిన మనిషి దానిని ప్లాన్ చేసి నిర్మించాడు అని నేను అనుకొన్నాను. ఈ తాజ్ మహల్ లో కనిపిస్తున్న అందమైన సిమ్మెట్రీ ఒక జ్ఞానం కలిగిన వ్యక్తి మైండ్ లో నుండి వచ్చింది. ఈ విశ్వం మొత్తం లో కనిపిస్తున్న సిమ్మెట్రీ కూడా ఒక జ్ఞానం కలిగిన వ్యక్తి మైండ్ లో నుండి వచ్చి ఉండాలి అని నాకు ఆ రోజు అనిపించింది. ప్రకృతి యొక్క నిర్మాణం చూసినప్పుడు దీని వెనుక తప్పని సరిగా ఒక గొప్ప మైండ్ ఉండి ఉండాలి అని నాకు అనిపించింది.

ప్రమాణాలకు పునాది
రెండవదిగా, ప్రమాణాలకు పునాది ఉండాలి. లేకపోతే వాటిని నమ్మడములో లాజిక్ ఉండదు. మనం నమ్మే నైతిక విలువలలో కూడా ‘సిమ్మెట్రీ’ ఉండాలి. మనం నమ్మే నైతిక విలువలు ఈ విశ్వం మొత్తం ఒకే లాగా ఉండాలి అని మనం అనుకొంటాము. ఈ ప్రపంచములో ఎక్కడా ఏ వ్యక్తి కూడా అన్యాయానికి గురికాకూడదు అని మనం అనుకొంటాము. ఈ ప్రపంచములో ఎక్కడా ఏ స్త్రీ అత్యాచారానికి గురికాకూడదు అని మనం కోరుకొంటాము. ఏ ప్రపంచములో ఎక్కడా ఏ బాలికా మానభంగానికీ గురికాకూడదు అని మనం కోరుకొంటాము. ఏ ప్రపంచములో ఎక్కడా ఏ చిన్నబిడ్డ ఆకలితో చావకూడదు అని మనం కోరుకొంటాము. అంటే అది ఏ ఖండమైనా అది ఏ దేశమైనా, అది ఏ ప్రాంతమైనా, అక్కడి ప్రజలు ఏ మతస్తులైన, ఏ కులస్తులైనా వారు ఏ భాష మాట్లాడినా, వారు ఒకేరకమైన నైతిక విలువలు వారికి ఉండాలని మనం అనుకొంటాము. నైతిక విలువల్లో ‘సిమ్మెట్రీ’ ఉండాలి. అది ఉండాలంటే దేవుడు ఉండాల్సిందే.

న్యూ యార్క్ నగరములో ఒక హాస్పిటల్ లో నేను పనిచేస్తు ఉండేవాడిని . పేషెంట్ లు ఎవరైనా వారికి నేను అందించే సేవలు ఒకే రకముగా ఉండాలి. నేను ఎవరినీ అసమానముగా చూడకూడదు, discriminate చేయకూడదు. ఎందుకు చేయకూడదు? మనుష్యులు అందరూ సమానులేనా?
అప్పుడప్పుడూ వాషింగ్టన్ వెళ్తూ ఉండేవాణ్ణి. వాషింగ్టన్ లో నడుస్తున్నప్పుడు మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ ఒక గొప్ప ప్రసంగము చేసిన ప్రదేశం నాకు కనిపించింది. అమెరికా దేశములో నల్ల జాతి వారిని తెల్ల జాతి వారు వేరుగా ఉంచేవారు. తెల్ల వారు ఉండే ప్రదేశాలకు, వారు తిరిగే బస్సులు, వారు తినే రెస్టారెంట్లు, వారు పనిచేసే ఆఫీస్ లలో నల్ల వారికి ప్రవేశం ఉండేది కాదు. వారి హక్కుల కోసం మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ పోరాటం మొదలు పెట్టాడు. వాషింగ్టన్ లో ‘ఐ హావ్ ఏ డ్రీమ్’ అనే ప్రసంగం చేశాడు. ఆ ప్రసంగములో ఆయన ఒక చోట ఒక మాట అంటాడు.

I have a dream that my
four little children will one day
live in a nation where they will
not be judged by the color of their skin
but by the content of their character.
“నా నలుగురు పిల్లలు వారి
శరీరం రంగును కాకుండా,
వారి వ్యక్తిత్వాన్ని చూసే సమాజము
కోసం నేను నిరీక్షిస్తున్నాను”
ఆ మాటలు నాకు కన్నీరు తెప్పించాయి. కింగ్ ఆ ప్రసంగములో ఒక మాట అంటాడు: ‘మనందరికీ సమాన హక్కులు ఉండాలి ఎందుకంటే మనందరినీ ఒకే దేవుడు సృష్టించాడు. మనందరం ఒకే దేవుని పిల్లలము’
దేవుడు లేకపోతే సమాన హక్కులు అనే నమ్మకానికి అర్థం ఉండదు అని కింగ్ ప్రసంగం వినినప్పుడు నాకు అనిపించింది. కింగ్ ప్రసంగం చేసిన ప్రదేశానికి దగ్గరలోనే అబ్రహం లింకన్ విగ్రహం నాకు కనిపించింది. నల్ల జాతి వారు అమెరికా లో బానిసలుగా ఉండేవారు. వారికి స్వాతంత్రం ఇవ్వడానికి ఆయన ఎంతో శ్రమించాడు, యుద్ధాలు చేశాడు, చివరకు తన ప్రాణం కూడా అర్పించాడు. లింకన్ కూడా, ‘మనందరం ఒక దేవుని పిల్లలం, మనం ఒకరినొకరిని బానిసలుగా చేసుకోకూడదు’ అన్నాడు. అబ్రహం లింకన్ అయినా, మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ అయినా సమానత్వానికి పునాది దేవుడు అన్నారు. మానవ సమాజములో సమానత్వం ఉండాలంటే దేవుడు కావాల్సిందే అని నాకు ఆ రోజు అర్ధం అయ్యింది.

దేవుడు లేకపోతే బానిసత్వం తప్పు కాదు
దేవుడు లేకపోతే కులతత్వం తప్పు కాదు
దేవుడు లేకపోతే ప్రాంతీయ తత్త్వం తప్పు కాదు
దేవుడు లేకపోతే జాత్యహంకారం తప్పు కాదు
దేవుడు లేకపోతే నిరంకుశత్వం తప్పు కాదు.
ప్రవచనాల నెరవేర్పు
చాలా కాలం నేను బైబిల్ ని సీరియస్ గా తీసుకోలేదు. దేవుడు లేడు అని నా స్నేహితులకు చెబుతూ ఉండేవాడిని. బైబిల్ కూడా మానవులు వ్రాసిందే అని నేను వారికి చెబుతూ ఉండేవాడిని. అయితే ఒక సారి ఆల్బర్ట్ అయి న్ స్టైన్ గురించి ఒక పుస్తకం చదువుతూ ఉన్నాను. ఆయన ఒక యూదు కుటుంబములో పెరిగిన వ్యక్తి. యూదులు ప్రపంచములో చాలా పురాతన మైన చరిత్ర కలిగిన వారుగా నాకు కనిపించారు. వారి గురించి తెలుసుకోవటానికి బైబిల్ చదవడం ప్రారంభించాను.

యూదుల పితామహుడు అబ్రహాము. ఆయనకు వంద సంవత్సరాల వయస్సు, ఆయన భార్యకు తొంబై సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు వారికి ఒక కుమారుడు జన్మించాడు. తొంభై సంవత్సరాల వయస్సులో ఉన్న స్త్రీ కి కుమారుడు జన్మించడం అద్భుతం కాదా? అబ్రహాము మనుమడు యాకోబు. యాకోబు కు 12 మంది కుమారులు. 12 మంది కుమారులలో నుండి ఇశ్రాయేలు 12 గోత్రాల ప్రజలు వచ్చారు. ప్రాచీన ప్రపంచములో శిశు మరణాలు చాలా అధికముగా ఉండేవి. ఆ రోజుల్లో 12 మంది కుమారులు పెద్ద వారు కావడం, వారికి సంతానం కలగడం సాధారణం కాదు.
వారు అభివృద్ధి చెందినప్పుడు ఈజిప్ట్ దేశములో వారంతా బానిసలుగా చిక్కుకున్నారు. వారిని విడిపించడానికి మోషే వెళ్ళాడు. ఆయన పది అబ్దుతాలు చేసి ఐగుప్తుకు తీర్పు తీర్చాడు. నీరు రక్తముగా మారుట, దేశమంతా మిడుతలు వాలుట, దేశమంతా చీకటి కమ్ముట, ప్రతి ఇంటిలో పెద్ద కుమారుడు చనిపోవటం లాంటి పది తీర్పులు ఈజిప్తు దేశము మీద కుమ్మరించబడ్డాయి. ప్రతి ఇంటిలో కేవలం పెద్ద కుమారుడు మాత్రమే చనిపోయాడు. అది దేవుడు ఉంటేనే సాధ్యం.

ఐగుప్తు దేశము నుండి ఇశ్రాయేలీయులు చివరకు విడుదల పొంది సీనాయి అరణ్యము వైపు వెళ్లారు. అయితే వారి ముందు ఎఱ్ఱ సముద్రం అడ్డుగా నిలిచింది. అప్పుడు మోషే సముద్రం వైపు తన కఱ్ఱను ఎత్తి చూపించినప్పుడు అది రెండుగా చీలిపోయింది. ఒక మనిషి మాట చొప్పున ఒక సముద్రం మధ్యలో చీలిపోయి ఇశ్రాయేలీయులు అందరూ ఆరిన నేల మీద నడుస్తూ దానిని దాటిపోయేవరకు నీరు రెండువైపులా నిలబడి, ఆఖరి మనిషి దాటిన తరువాత మళ్ళీ ఒక్కటయ్యింది. ప్రపంచ చరిత్రలో అలాంటి అద్భుతం మరొకటి లేదు. ఏ మనిషీ అలాంటి పని చేయలేడు. దానిని బట్టి దేవుడు నిజముగా అని మనకు అర్థం అవుతుంది.

మోషే ఆ సంఘటనలను ప్రత్యక్షంగా చూసి ఆ చరిత్రను వ్రాశాడు. అరణ్యములో ఇశ్రాయేలీయులు నడిచివెళ్లేటప్పుడు ఆకాశములో నుండి వారి మీద మన్నా అనే ఆహారం కురిసింది. ఒక రాయి లో నుండి లక్షలాది మందికి నీరు ఇవ్వబడింది. ఆ తరువాత యెహోషువ కాలములో యొర్దాను నది రెండుగా చీలింది. ఎవరూ ఏమీ చేయకుండానే, యెరికో గోడలు కూలిపోయినాయి. ఆయన యుద్ధం చేసేటప్పుడు ఆయన ప్రార్థన చేశాడు. అప్పుడు సూర్యుడు, చంద్రుడు ఆగిపోవటం మనం చూస్తాము. ఆ అద్భుతాలు దేవుడు ఉంటేనే సాధ్యం.

ఇశ్రాయేలు ప్రవక్తలు అనేక ప్రవచనాలు చేశారు. ఆ ప్రవచనాలు ఖచ్చితముగా నెరవేరడం మనం చూస్తాము. ఉదాహరణకు, యూదులు బబులోను చెరలో 70 సంవత్సరాలు ఉంటారు అని యిర్మీయా ప్రవక్త చెప్పాడు (యిర్మీయా 25:11-12)యూదులు సరిగ్గా 70 సంవత్సరాలు బబులోను చెరలో ఉండి విడుదల పొంది, యూదయ దేశం తిరిగి వెళ్లారు.

పర్షియా చక్రవర్తి ‘సైరస్ ది గ్రేట్’ వారికి విడుదల ఇస్తాడని యెషయా ప్రవక్త చెప్పాడు. సైరస్ పుట్టకముందు 150 ఏళ్లకు ముందే యెషయా ఆయన పేరు కూడా చెప్పాడు. దేవుడు ఉంటేనే అది సాధ్యం.

టైర్ రాజ్యం నాశనం చేయబడుతుంది అని యెహెఙ్కేలు ప్రవక్త తెలియజేశాడు. ఆ ప్రకారమే క్రీస్తు పూర్వం 332 లో అలెగ్జాండర్ చక్రవర్తి టైర్ రాజ్యాన్ని నిర్మూలము చేసాడు.
దానియేలు ప్రవక్త ఏ సామ్రాజ్యం తరువాత ఏ సామ్రాజ్యం వస్తుందో చెప్పాడు. బబులోను సామ్రాజ్యం, ఆ తరువాత పర్షియా సామ్రాజ్యం, ఆ తరువాత గ్రీకు సామ్రాజ్యం ఆ తరువాత రోమన్ సామ్రాజ్యం దానియేలు చెప్పాడు. ఆయన మాటలు చరిత్రలో నెరవేరినాయి. దేవుడు ఉంటేనే అది సాధ్యం. ఏ సామ్రాజ్యం తరువాత ఏ సామ్రాజ్యం వస్తుందో ఏ మనిషీ చెప్పలేడు.




ప్రభువైన యేసు క్రీస్తు చేసిన అద్భుతాలు
యూదులు బబులోను లో 70 సంవత్సరాలు ఉన్నారు. అప్పుడు క్రీస్తు పూర్వం 538 లో దానియేలు ప్రవక్త 70 వారములు ప్రవచనం చేసాడు. ఆ 70 వారములు ఎప్పుడు ప్రారంభం అవుతాయో ఆయన చెప్పాడు. యెరూషలేము పునర్నిర్మాణం నుండి మెస్సియా వచ్చేవరకు 69 వారములు ఉంటాయి అన్నాడు. ఆ మెస్సియా చంపబడతాడు అని చెప్పాడు. ఆ తరువాత యెరూషలేములో దేవుని ఆలయం నిర్మూలించబడుతుంది అని చెప్పాడు.

ఒక్కొక్క వారములో 7 సంవత్సరములు. 69 ని 7 తో హెచ్చిస్తే 483 సంవత్సరాలు. క్రీ స్తు పూర్వం 444 లో పర్షియా చక్రవర్తి అర్తహషస్త యెరూషలేము పునర్నిర్మాణం కొరకు ఆజ్ఞ ఇచ్చాడు. యూదుల క్యాలెండర్ ప్రకారం దానికి 483 సంవత్సరాల తరువాత ఏమి జరిగింది?
క్రీస్తు శకం 33, మార్చి నెల 5 తారీఖు.

ఆ రోజు ఏమి జరిగింది?
యేసు క్రీస్తు ఒక గాడిద మీద కూర్చొని యెరూషలేములో ప్రవేశించాడు.
దానియేలు చెప్పినట్లు ఒక్క రోజు కూడా తప్పకుండా యేసు క్రీస్తు మెస్సియా గా యెరూషలేము లో ప్రవేశించాడు. దానియేలు చెప్పినట్లే ఆయన చంపబడ్డాడు.
దేవుడు నిజముగా ఉంటేనే అలాంటి ప్రవచనాలు ఒక్క రోజు కూడా తప్పకుండా
నెరవేరుతాయి. ప్రవక్త ఒక ప్రవచనం చేయడం, దాని ప్రకారం అది భవిష్యత్తులో నెరవేరడం. ఒక చక్కటి సిమ్మెట్రీ ఆ ప్రవచనాల్లో నాకు కనిపించింది. ఆ ప్రవచనాల నెరవేర్పు చూసినప్పుడు దేవుడు నిజముగా ఉన్నాడు అని నాకు అర్థం అయింది.

సిమ్మెట్రీ లో ఒక పాటర్న్ ఉంటుంది. మాథెమాటిక్స్ లో మనకు ఒక పాటర్న్ కనిపిస్తుంది.
2, 4, 6, 8, 10? ఆ తరువాత ఏమిటి?
12. 12 అని మీరు ఎలా చెప్పగలిగారు?
ఆ సంఖ్యలలో ఉన్న క్రమం మీరు గుర్తించారు. బైబిల్ ప్రవచనాల్లో కూడా ఒక పాటర్న్ రెకగ్నిషన్ వుంది. ఒక రక్షకుడు భవిష్యత్తులో వస్తాడు అని ఇశ్రాయేలు ప్రవక్తలు చెప్పారు. ఆయనను మెస్సియా అని వారు పిలుచుకొన్నారు.
మెస్సియా యూదా గోత్రములో జన్మిస్తాడు అని యాకోబు చెప్పాడు (ఆదికాండము 49:10)
ఆయన దావీదు కుటుంబములో జన్మిస్తాడు అని సమూయేలు చెప్పాడు
(2 సమూయేలు 7:12-13)
మెస్సియా ఒక ప్రవక్తగా వస్తాడు అని మోషే చెప్పాడు (ద్వితీయోప 18:15-19)
మెస్సియా ఒక కన్యక గర్భము ద్వారా జన్మిస్తాడు అని యెషయా చెప్పాడు (యెషయా 7:14)
ఆయన బెత్లెహేము లో జన్మిస్తాడు అని మీకా చెప్పాడు (మీకా 5:2)
మెస్సియా చంపబడతాడు అని కూడా ప్రవక్తలు చెప్పారు. (యెషయా 53; కీర్తన 22)
యేసు క్రీస్తు శిష్యులు గుడ్డిగా ఆయనను నమ్మలేదు. శతాబ్దాలకు పూర్వమే ప్రవక్తలు చేసిన ప్రవచనాలు యేసు క్రీస్తు నందు నెరవేరడం వారు చూసి, ఇదిగో మేము మెస్సియా ను కనుగొన్నాము అని ఆయనను నమ్మి వెంబడించారు. ఆయన చేసిన అద్భుతాలు కూడా వారి నమ్మకానికి బలం చేకూర్చాయి. యేసు క్రీస్తు నీటిని ద్రాక్షారసముగా మార్చాడు. ద్రాక్షా రసము కావాలంటే ద్రాక్ష తోట వేయాలి, దానికి నీరు పోసి సాగు చేయాలి, ఎరువులు వేయాలి. అది పండిన తరువాత ద్రాక్షా కాయలు ఒక చోట చేర్చి వాటిని నలుగగొట్టి ద్రాక్ష రసం చేసుకోవాలి. అంత తతంగం ఉంటుంది. అయితే యేసు క్రీస్తు రెప్పపాటులో నీటిని ద్రాక్షారసముగా చేసి వారికి ఇస్తే వారు త్రాగి ఆనందించారు. ఇంతకు ముందు త్రాగిన ద్రాక్షరసం కంటే ఆయన ఇచ్చిన ద్రాక్షరసం ఎంతో మధురముగా ఉంది అని వారు అన్నారు.

దేవుడు మాత్రమే ఒక్క క్షణములో నీటిని ద్రాక్ష రసముగా చేయగలడు
దేవుడు మాత్రమే మరణించిన వారిని లేపగలడు.
దేవుడు మాత్రమే 5 రొట్టెలు, రెండు చేపలతో 5 వేల మంది కడుపు నింపగలడు. దేవుడు మాత్రమే నోటి మాట తో తుఫాను ఆపగలడు
దేవుడు మాత్రమే సమాధి చేయబడిన తరువాత తిరిగి సజీవుడిగా లేవగలడు.
దేవుడు నిజముగా ఉన్నాడు అనడానికి అన్నిటి కంటే గొప్ప ఆధారం యేసు క్రీస్తే.

ఆయన జీవితములో చక్కటి సిమ్మెట్రీ మనకు కనిపిస్తుంది. ఒక వైపు పాత నిబంధన, మరొక వైపు క్రొత్త నిబంధన వాటి మధ్యలో ఆయన జీవితము, ఆయనలో నెరవేరిన
ప్రవచనాలు, ఆయన చేసిన కార్యాలు మనకు కనిపిస్తున్నాయి.
ప్రతి వ్యక్తి అడిగే జీవిత ప్రశ్న
ప్రతి వ్యక్తికీ ఎప్పుడో ఒక సారన్నా వచ్చే ప్రశ్న: నా జీవితానికి అర్థం ఏమైనా ఉందా?
Is there any meaning to my life? దేవుడు లేకపోతే మనిషి జీవితానికి అర్థం
లేదు. దేవుడు ఉంటేనే ఏ సందర్భములో నైనా మనిషి జీవితానికి అర్థం ఉంటుంది.
ముగింపు:
తాజ్ మహల్ ఒక అందమైన భవనం మాత్రమే కాదు. అది ఒక ప్రేమ చిహ్నం కూడా.
మొఘల్ చక్రవర్తి షాజహాన్ తన భార్య ముంతాజ్ మహల్ మీద ఉన్న ప్రేమతో
ఆ భవనం నిర్మించాడు. ప్రేమ, సౌందర్యం, సత్యం – ఈ మూడు కలిసేవెళ్తాయి.
షాజహాన్ తన భార్యను ప్రేమించి, ఈ సుందరమైన తాజ్ మహల్ నిర్మించాడు. దాని సౌందర్యం వెనుక ‘సిమ్మెట్రీ’ సత్యం దాగి ఉంది.

ఈ విశ్వం కూడా ఎంతో చక్కటి సిమ్మెట్రీ తో చేయబడింది. అది కూడా దేవుడు ఒక
ప్రేమతో నిర్మించిన భవనం లాంటిదే. దేవుడు లేకపోతే ఈ విశ్వం ఎంతో ఒంటరిగా, అర్థం లేని శూన్యము గా, వ్యర్థమైనదిగా మనకు కనిపిస్తుంది.

షాజహాన్ కుమారుడు ఔ రంగ జేబు తండ్రిని సింహాసనము మీద నుండి దించివేసి ఒక కోటలో బందీగా చేసాడు. ఆ బందీ గృహములో నుండే షాజహాన్ తాజ్ మహల్ ని చూసి సంతోషించాడు. షాజహాన్ తలుచుకొంటే తన కుమారుని చంపేసే వాడే. కానీ సొంత కొడుకు చేతిలో ఆయన బందీ కావడానికే ఇష్టపడ్డాడు. దేవుడు కూడా మానవ జాతిని నిర్మూలము చేయకుండా సిలువ వేయబడడానికే ఇష్టపడ్డాడు.
రబింద్రనాథ్ టాగోర్ తాజ్ మహల్ ని ‘a teardrop on the cheek of time’ ‘కాలం బుగ్గ మీద పడిన ఒక కంటి చుక్క’. ఈ విశ్వం కూడా నిత్యత్వములో ఉన్న దేవుని కంటి నుండి కారిన నీటి చుక్క లాంటిదే. అది దేవుడు ఎంతో ప్రేమతో నిర్మించిన సుందర భవనం లాంటిదే. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను అని మనం బైబిల్లో చదువుతున్నాము. ప్రేమ, సౌందర్యం, సత్యం – మూడూ ఆ వచనంలో నాకు కనిపించాయి.
ఈ ఐదు విషయాలు నన్ను దేవుని యొద్దకు నడిపించాయి. యేసు క్రీస్తును నా రక్షకునిగా నమ్మేటట్లు అవి నన్ను పురికొల్పాయి. వీటిని నేను పంచ ‘ప్ర’ లు అని పిలుస్తాను.
పంచ ‘ప్ర’ లు
- ప్రకృతి నిర్మాణములో నాకు కనిపించిన సిమ్మెట్రీ లో దేవుడు ఒక జ్ఞానము కలిగిన నిర్మాణకునిగా నాకు కనిపించాడు.
- ప్రమాణాలకు పునాది ఉండాలి. దేవుడు ఉంటేనే మనం నమ్మే నైతిక విలువలకు సిమ్మెట్రీ ఉంటుంది. దేవుడు పరిశుద్ధుడు అనే సత్యం అప్పుడు నాకు అర్ధమయింది.
- ప్రవచనాల నెరవేర్పు. మానవ చరిత్రలో జోక్యం చేసుకొని దానిని నడిపిస్తున్న దేవుడు నాకు కనిపించాడు.
- ప్రభువైన యేసు క్రీస్తు చేసిన అద్భుతాలు చూస్తే దేవుడు మన కోసం ఈ లోకానికి వచ్చిన రక్షకునిగా కనిపించాడు.
- ప్రతి వ్యక్తి అడిగే జీవిత ప్రశ్నే నేను కూడా అడిగాను. దేవుడు లేకపోతే జీవితానికి నిర్దిష్టమైన అర్థం లేదు. దేవుని యొద్దకు వచ్చినప్పుడు నా జీవితానికి సిమ్మెట్రీ దొరికింది.
ఈ గొప్ప దేవుని యొద్దకు మీరు కూడా రావాలి. ఈ గొప్ప రక్షకుడైన క్రీస్తు యొద్దకు మీరు కూడా రావాలి. అదే నేటి మా ప్రేమ సందేశం.
References
https://www.americanrhetoric.com/speeches/mlkihaveadream.htm