లూకా సువార్త పరిచయం: డాక్టర్ పాల్ కట్టుపల్లి 

  బైబిలు పుస్తకాలు పరిచయం అనే అంశం మనం చూస్తున్నాము. ఇప్పటి వరకు మనం అనేక పుస్తకాలు ధ్యానించాము. మీరు ఏ కార్యక్రమం అయినా మిస్ అయితే మా వెబ్ సైట్ కి వెళ్లి ఆ కార్యక్రమం చూడండి. ఈ రోజు లూకా సువార్తను మనం చూద్దాము. మీ రోజు లూకా సువార్త లో నుండి ఒక ప్రేమ సందేశం మీకు అందించాలని నేను ఆశపడుతున్నాను. క్రొత్త నిబంధనలో మనకు 4 సువార్తలు కనిపిస్తున్నాయి. మత్తయి, మార్కు, లూకా, యోహాను. ఈ సువార్తలు ప్రభువైన యేసు క్రీస్తు జీవితము ను మనకు వివరిస్తున్నాయి. ఫ్రాన్స్ దేశములో చార్ట్రిస్ కేథడ్రాల్ ఉంది. దాని ఒక కిటికీ మీద దానియేలు, యెహెఙ్కేలు, యెషయా, యిర్మీయా ప్రవక్తలు మనకు కనిపిస్తారు. ఆ ప్రవక్తల భుజముల మీద మత్తయి, మార్కు, లూకా, యోహాను లు కూర్చొని ఉంటారు. ఆ చక్కని చిత్రం సందేశం ఏమిటంటే ప్రవక్తలు యేసు క్రీస్తు ను కొంతవరకు మాత్రమే చూడగలిగారు. 

   అయితే మత్తయి, మార్కు, లూకా, యోహాను లు మరింత స్పష్టముగా అనుభవ పూర్వకముగా ఎంతో దగ్గరి సాన్నిహిత్యములో నుండి యేసు క్రీస్తు ప్రభువును చూశారు. ఎంతో చక్కటి చారిత్రిక నేపధ్యములో నుండి లూకా ఈ సువార్తను ఎంతో మనోహరముగా వ్రాశాడు. యేసు క్రీస్తు ఒక పశువుల పాకలో జన్మించడం, గొఱ్ఱెల కాపరులు ఆయనను దర్శించడం –  ఆ  రమ్యమైన క్రిస్మస్ కథ, యేసు క్రీస్తు సాతాను శోధనలు ఎదుర్కొని జయం పొందుట (4 అ), ఆయన చేసిన గొప్ప అద్భుత కార్యాలు, ఆయన చేసిన గొప్ప ప్రసంగాలు, మంచి సమరయుడు, తప్పి పోయిన కుమారుడు లాంటి హృదయాన్ని కదిలించే కథలు ఈ సువార్తలో మనకు కనిపిస్తాయి. 

ఈ సువార్తను వ్రాసినది ఎవరు? 

    ఈ సువార్తను లూకా గారు వ్రాశాడు. ఈయన లూకా సువార్త, అపోస్తలుల కార్యములు అనే రెండు చక్కని పుస్తకాలు వ్రాశాడు. క్రైస్తవ్యం పుట్టుక, దాని అభివృద్ధి, ప్రపంచం నలుమూలలకు అది ఎలా పాకింది లాంటి చారిత్రిక అంశాలు మనకు ఈ పుస్తకాలు చదువుట వలన అర్థం అవుతాయి. లూకా ఒక వైద్యుడు. లూకా అను ప్రియుడైన వైద్యుడు అని కొలొస్సయులకు వ్రాసిన పత్రిక 4:14 లో మనం చదువుతున్నాము. ఒక చరిత్రకారుడు, ఒక డాక్టర్ లూకా లో మనకు కనిపిస్తున్నారు. mind of a historian, heart of a doctor (Warren W.Wiersbe) ఒక చరిత్ర కారుని యొక్క మేథస్సు, ఒక వైద్యుని యొక్క హృదయముతో ఈ పుస్తకం వ్రాశాడు. 

లూకా సువార్త ఎలా ప్రారంభించాడో చూడండి: ఘనత వహించిన థెయొఫిలా, ఆరంభము నుండి కన్నులారా చూచి వాక్య సేవకులైన వారు మనకు అప్పగించిన ప్రకారము మన మధ్యను నెరవేరిన కార్యములను గూర్చి వివరముగా వ్రాయుటకు అనేకులు పూనుకొన్నారు గనుక నీకు ఉపదేశింపబడిన సంగతులు నిశ్చయముగా జరిగినవని నీవు తెలిసికొనుటకు వాటినన్నిటిని మొదటి నుండి తరచి పరిష్కారముగా తెలిసికొనియున్న నేనును నీ పేరట వాటిని గూర్చి వరుసగా రచించుట యుక్తమని ఎంచితిని. (లూకా 1:1-4)

   తన సువార్త ఎందుకు వ్రాశాడో లూకా ఇక్కడ మనకు చెప్పాడు. వాక్యసేవకులైన వారు కన్నులారా చూచిన సంగతులను పరిశోధించి, వాటిని పరిష్కారముగా తెలిసికొని ఈ సువార్త వ్రాశాను అని లూకా చెపుతున్నాడు. ఒక చరిత్ర కారుని వలె ఆయన ఈ పుస్తకం వ్రాశాడు. ప్రభువైన యేసు క్రీస్తు జీవితమును రోమన్ సామ్రాజ్య చరిత్రలో ఆయన పాతాడు. ఈ రోజు చరిత్రకారులు, ఆర్కియాలజిస్టులు లూకా సువార్త చదివి అందులో ఉన్న చారిత్రిక వాస్తవాలను చూసి ఆశ్చర్యపోతున్నారు. అంత ఖచ్చితమైన చరిత్ర ఈ సువార్తలో ఉంది. ప్రపంచ చరిత్రలోనే గొప్ప చరిత్ర కారులలో ఒకనిగా లూకా ను మనం చెప్పు కోవచ్చు. అంత గొప్ప పరిశోధన ఆయన పుస్తకాల్లో మనకు కనిపిస్తుంది. ఈ లూకా అపోస్తలుడైన పౌలు కు స్నేహితుడు, సహచరుడు, జతపని వాడు (ఫిలేమోను 1:24) ఆయన వెంట నడిచిన వాడు, పౌలుకు శరీరములో ఒక ముళ్ళు ఉండేది. ఏదో ఒక జబ్బుతో ఆయన బాధపడుతున్నాడు. లూకా ఆయనకు వైద్య సేవలు అందించాడు. ఆయనతో పాటు అనేక సార్లు జైలుకు కూడా వెళ్ళాడు. 

2 తిమోతి పత్రిక 4:10 చూడండి: 

దేమా యిహలోకమును స్నేహించి నన్ను విడిచి థెస్సలొనీకకు వెళ్లెను,క్రేస్కే గలతీయకును తీతు దల్మతియకును వెళ్లిరి;లూకా మాత్రమే నా యొద్ద ఉన్నాడు. 

          అపోస్తలుడైన పౌలు గారితో ఎంతో మంది నడిచారు. వారిలో చాలా మంది మధ్యలోనే వదలి వెళ్లిపోయారు. లూకా మాత్రమే నా యొద్ద ఉన్నాడు. ఆయనతో చివరి వరకు ఉన్న వ్యక్తి లూకా. రోమ్ నగరములో పౌలు హతసాక్షి అయినప్పుడు, ఆయనకు శిరచ్చేదనం చేసిన తరువాత ఆయన మృత దేహం తీసుకొని ఆయనకు అంత్య క్రియలు చేసిన వ్యక్తి లూకా. మనతో చివరి వరకు ఉండే లూకా వంటి స్నేహితులు అరుదుగా వుంటారు. ఆ విధముగా లూకా అపోస్తలుడైన పౌలు కు ఎంతో నమ్మకమైన సేవకునిగా, సహచరునిగా, స్నేహితునిగా కొనసాగాడు. ‘అన్యజనులకు అపోస్తలుడు’ అని పౌలు పిలవబడ్డాడు. మొదట్లో పౌలుకు కూడా ఆ సంగతి తెలియదు. ఆయన ఆసియా ప్రాంతములో ఉన్న అనేక ప్రాంతాలకు వెళ్లి యూదులకు సువార్త ప్రకటించడం మనం చూస్తున్నాము. అపోస్తలుల కార్యములు 16 అధ్యాయములో పౌలు జీవితం గొప్ప మలుపు తిరిగింది. దేవుడు ఆయన ఒక దర్శనం అనుగ్రహించాడు. ‘మాసిదోనియకు వచ్చి మాకు సహాయం చేయుము’ అని ఒక మాసిదోనియ దేశస్థుడు పౌలును ఆ దర్శనములో అభ్యర్ధించాడు. ఆ దర్శనము చూసిన తరువాత పౌలు గారు యూరప్ వెళ్ళాడు. అక్కడ కూడా యేసు క్రీస్తు సువార్త ప్రకటించడం మొదలు పెట్టాడు. ప్రపంచ చరిత్రలో అది ఒక గొప్ప మలుపు. అపోస్తలుల కార్యములు 16 అధ్యాయము లో లూకా ‘మేము’ అని వ్రాశాడు. అంటే పౌలు తో పాటు లూకా కూడా అక్కడ ఉన్నట్లు మనకు అర్ధం అవుతుంది. పౌలు, లూకా లు అప్పుడు ట్రాయ్ నగరములో ఉన్నారు. అలెగ్జాండర్ చక్రవర్తి ఈ ట్రాయ్ నగరములోనే ప్రపంచం మొత్తాన్ని జయించాలి అని నిర్ణయించుకున్నాడు. అయితే ప్రపంచం మొత్తాన్ని పాలించాలి అనే కల నెరవేరకుండానే అలెగ్జాండర్ మరణించాడు. అదే ట్రాయ్ నగరములో పౌలు, లూకా లు యేసు క్రీస్తు సువార్తతో ప్రపంచాన్ని జయించాలి అని నిర్ణయించుకొన్నారు. దేవుడు వారి ఆశయాన్ని ఆశీర్వదించాడు. అలెగ్జాండర్ సాధించలేనిది దేవుడు యేసు క్రీస్తుకు ఇచ్చాడు. ఆయన సువార్త ఈ ప్రపంచాన్ని జయించింది. 

సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడను కాను. ఏలయనగా నమ్ము ప్రతివానికి, మొదట యూదునికి, గ్రీసుదేశస్థునికి కూడ రక్షణ కలుగజేయుటకు అది దేవుని శక్తియై యున్నది

               రోమా పత్రిక 1: 16

 అని వ్రాశాడు అపోస్తలుడైన పౌలు రోమా పత్రిక 1: 16 లో. లూకా కూడా యేసు క్రీస్తు ను తన సువార్తలో యూదులకు, అన్యులకు రక్షకునిగా చూపిస్తున్నాడు. ఆయన తన సువార్తను ప్రపంచ ప్రజలందరి కొరకు వ్రాసాడు. యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయనపేరట మారు మనస్సును పాపక్షమాపణయు ప్రకటింపబడుననియు వ్రాయబడియున్నది అని వ్రాసాడు (లూకా 24:47) 

   ‘యేసు క్రీస్తు అందరికి ప్రభువు’ అని అపోస్తలుల కార్యముల గ్రంథము లో వ్రాశాడు (అపో 10:36) మీరు ఇండియా వారైనా, అమెరికా వారైనా, ఆఫ్రికా వారైనా ఆయన మీకు ప్రభువే. బైబిల్ గ్రంథము లోని పుస్తకాలు మొత్తము వ్రాసినది యూదులే, ఒక్క లూకా మాత్రమే అన్యుడు. ఒక అన్య జనుని కోణములో నుండి ఆయన యేసు క్రీస్తును చూశాడు. చరిత్ర కారులు యూసిబియస్, జెరోమ్ ల ప్రకారం లూకా అంతియొకయ పట్టణానికి చెందిన వాడు. ఈ పట్టణం ఆది క్రైస్తవ సంఘము ఒకటి వెలసింది. అక్కడే యేసు క్రీస్తు నందు విశ్వాసులు మొదటగా ‘క్రైస్తవులు’ అని పిలువబడ్డారు. 

ఈ లూకా సువార్త ఎప్పుడు వ్రాయబడింది? 

   లూకా రెండు పుస్తకాలు వ్రాశాడు. లూకా సువార్త అపోస్తలుల కార్యములు గ్రంథం ఈ రెండు పుస్తకాలు దాదాపు ఒకే సమయములో ఒక దాని తరువాత ఒకటి వ్రాశాడు. మొదటిగా లూకా సువార్త, ఆ తరువాత అపోస్తలుల కార్యములు వ్రాశాడు. కొన్ని క్లూస్ ఫాలో అయితే ఈ పుస్తకాలు ఎప్పుడు వ్రాయబడ్డాయో మనం తెలుసు కోవచ్చు. యెరూషలేములో ఉన్న దేవుని ఆలయం నాశనం చేయబడుతుంది అని యేసు ప్రభువు చెప్పిన ప్రవచనం లూకా వ్రాశాడు (లూకా 19:42-44). ఆ ప్రవచనం క్రీ.శ 70 లో నెరవేరింది. లూకా రోమన్లు యెరూషలేము ను తగలబెట్టడం చూసి ఉంటే ఆ సంఘటనల గురించి వ్రాసి ఉండేవాడే. కానీ ఆయన తన సువార్తలో కానీ, అపోస్తలుల కార్యములు గ్రంథములో కానీ ఆ సంఘటనల గురించి వ్రాయలేదు. అంటే ఈ రెండు పుస్తకాలు క్రీస్తు శకం 70 కి ముందే వ్రాయబడి ఉండాలి. 

   అపోస్తలుల కార్యములు క్రీస్తు శకం 30 నుండి 62 సంవత్సరముల వరకు జరిగిన సంఘటనలు మనకు తెలియజేస్తున్నాయి. అపోస్తలుడైన పౌలు రోమ్ నగరములో ఒక చెరసాలలో ఉండడము తో అపోస్తలుల కార్యముల గ్రంథము ముగుస్తున్నది. అది క్రీస్తు శకం 62 సంవత్సరము. క్రీస్తు శకం 64 లో రోమన్ చక్రవర్తి నీరో వలన క్రైస్తవులకు గొప్ప శ్రమలు మొదలయినాయి. వాటి గురించి లూకా తన పుస్తకాల్లో వ్రాయలేదు. దీనిని బట్టి అపోస్తలుల కార్యముల గ్రంథం క్రీస్తు శకం 62 – 64 ల మధ్య వ్యయబడి ఉండాలి. లూకా సువార్త అపోస్తలుల కార్యముల గ్రంథం కంటే ముందుగా వ్రాయబడింది. అంటే క్రీస్తు శకం 60 లేక 61 సంవత్సరాల్లో ఇది వ్రాయబడి ఉండ వచ్చు. ఆ విధముగా కొన్ని క్లూస్ మనం ఫాలో అయితే ఈ లూకా సువార్త క్రీస్తు శకం 60 లేక 61 సంవత్సరాల్లో వ్రాయబడింది అని మనకు అర్థం అవుతుంది. 

లూకా సువార్తలో యేసు క్రీస్తు ఎలా కనిపిస్తున్నాడు? 

   ఆ తరువాత మనం చూడవలసిన ముఖ్య మైన అంశం: ఈ లూకా సువార్తలో మన ప్రభువైన యేసు క్రీస్తు ఏ విధముగా మనకు కనిపిస్తున్నాడు? 7 రకాలుగా యేసు క్రీస్తు మనకు ఈ సువార్తలో కనిపిస్తున్నాడు. 

Jesus, the Son: మొదటిగా Jesus, the Son of man ఆయన మనుష్య కుమారుడు. లూకా సువార్తలో అనేక సార్లు యేసు క్రీస్తు తనను తాను మనుష్యకుమారునిగా పిలుచుకొన్నాడు. దేవుని కుమారునిలో ఉన్న మానవత్వము అందులో మనకు కనిపిస్తున్నది. పరలోకములో ఉన్న దేవుడు ఒక మనిషిగా మన మధ్యలోకి వచ్చాడు. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును. అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టుదురు అని యెషయా ప్రవక్త చెప్పాడు. (యెషయా 7:14). ఆయన బేత్లెహేము అనే గ్రామములో జన్మిస్తాడు అని మీకా ప్రవక్త చెప్పాడు. (మీకా 5:2). మనుష్య కుమారుడు పరలోక మహిమ తో ఆకాశ మేఘారూఢుడై వస్తాడు అని దానియేలు ప్రవక్త వ్రాశాడు (దానియేలు 7:13-14). లూకా మనకు ఆ ప్రవచనాలు క్రీస్తు నందు ఎలా నెరవేరాయో వ్రాశాడు. నజరేతు గ్రామం రండి. యెషయా ప్రవచించిన గర్భము ధరించిన కన్య ను చూడండి. బేత్లెహేము రండి. మీకా ప్రవచించిన దావీదు కుమారుని చూడండి. యెరూషలేము రండి. అక్కడ యేసు క్రీస్తు ‘మేఘముల మీద వచ్చే మనుష్య కుమారునిగా తనను పిలుచుకోవటం చూడండి. ఇలాన్ మస్క్ ప్రపంచములో మొత్తములో ధనవంతునిగా ఉన్నాడు. ఈ మధ్యలో ఆయన ‘మనం మార్స్ గ్రహాన్ని మానవులతో నింపాలి’ అన్నాడు. మనుష్యులు ఎందుకు సృష్టించబడ్డారు? ఇతర గ్రహాలను నింపడానికా? దేవుని ఉద్దేశం అది కాదు. దేవుడు మనుష్యులను ఎందుకు సృష్టించాడు? ‘మనుష్య కుమారుడు’ అనే పేరులో ఆ ప్రశ్నకు సమాధానం ఉంది. మనిషిని దేవుడు ఎందుకు సృష్టించాడో యేసు క్రీస్తు ఒక ‘మనుష్య కుమారుని’ గా ఈ సువార్తలో మనకు బోధిస్తున్నాడు. 

దేవుని చిత్తాన్ని చేసే మనుష్యునిగా 

దేవుని వాక్యం ప్రకారం జీవించే మనుష్యునిగా 

దేవుని ప్రణాళిక నెరవేర్చే మనుష్యునిగా 

దేవుని సహవాసంలో ఆనందించే మనుష్యునిగా 

యేసు క్రీస్తు ఈ సువార్తలో మనకు కనిపిస్తున్నాడు. 

Jesus, the Scholar: రెండవదిగా Jesus, the Scholar: మనుష్యకుమారుడు జ్ఞానమందు, వయస్సు నందు, దేవుని దయ యందు, మనుష్యుల దయ యందు వర్ధిల్లాడు. (లూకా 2:52). 12 సంవత్సరాల వయస్సులో యేసు క్రీస్తు యెరూషలేము వెళ్ళాడు. అక్కడ దేవాలయము లోకి వెళ్లి బోధకుల మధ్య కూర్చొని వారిని అనేక ప్రశ్నలు అడిగాడు. ఆ మాటలు విని వారు ఆశ్చర్యపోయారు. ఆయన జ్ఞానము అలాంటిది. ఆయన జ్ఞానము ముందు వారి యొక్క అజ్ఞానం బయటపడింది. సామాన్య ప్రజలు, ప్రవక్తలు, యాజకులు, పరిసయ్యులు, సద్దూకయ్యులు, హేరోదు రాజు, పిలాతు యేసు క్రీస్తు జ్ఞానము చూసి ఆశ్చర్యపోయారు. ఈ సువార్తను ‘gospel of Amazement’ అని కూడా పిలిచారు. ఎందుకంటే, యేసు క్రీస్తు ప్రభువు జ్ఞానము చూసి ప్రజలు అనేక చోట్ల ప్రజలు ఆశ్చర్యపోవడం మనం చూస్తాము. గొఱ్ఱెల కాపరులు, యోసేపు, మరియ నజరేతు ప్రజలు, శిష్యులు, విమర్శకులు అందరూ క్రీస్తు జ్ఞానం చూసి ఆశ్చర్యపోవడం మనం చూస్తాము. ‘ఆశ్చర్య కరుడు’ అనే పేరు ఆయనకు సరిపోయింది. 

Jesus, the Supplicant: ఆ తరువాత Jesus, the Supplicant: యేసు క్రీస్తు ప్రార్థన చేసే వ్యక్తిగా లూకా మనకు చూపిస్తున్నాడు. మిగిలిన మూడు సువార్తల కంటే ఈ సువార్తలో క్రీస్తు ఎంతో సమయము ప్రార్థన లో గడుపుతున్నట్లు మనకు కనిపిస్తుంది. ఆయన బాప్తిస్మము పొందిన వెంటనే ప్రార్థనలో గడిపాడు (లూకా 3:21). ఆయన అరణ్యములోకి వెళ్లి ఏకాంతముగా ప్రార్థనలో గడిపాడు (లూకా 5:16). 12 మంది శిష్యులను ఏర్పరచుకొనే ముందు ఆయన కొండ మీదకు వెళ్లి రాత్రంతా ప్రార్ధనలో గడిపాడు (లూకా 6:12) పేతురు, యోహాను, యాకోబు లను తీసుకొని ఆయన రూపాంతరపు కొండ మీద ప్రార్థన చేశాడు (లూకా 9:28) 

సీమోనూ, సీమోనూ, ఇదిగో సాతాను కుయుక్తుల వలన నీ విశ్వాసము పాడుకాకుండా నేను నీ కోసం ప్రార్థన చేస్తున్నాను అని పేతురు తో అన్నాడు (లూకా 22:31-32) 

‘తండ్రీ, వీరేమి చూచుచున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించు’ అని సిలువ మీద ఆయన ప్రార్థన చేశాడు (లూకా 23:34). తనను హింసించే వారి కోసం కూడా ఆయన ప్రార్థన చేశాడు. ‘తండ్రీ, నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను’ అని ప్రార్థన లోనే ఆయన తన భూలోక జీవితాన్ని ముగించాడు (లూకా 23:46). ఆ విధముగా లూకా తన సువార్తలో ప్రభువైన యేసు క్రీస్తు ను ఎంతో ప్రార్థన లో గడిపే వ్యక్తిగా మనకు చూపించాడు. 

Jesus, the Sympathizer: ఆ తరువాత యేసు క్రీస్తు ఇతరుల బాధలు పంచుకొనే వానిగా ఈ సువార్తలో మనకు కనిపిస్తున్నాడు. సమాజం వెలివేసిన వారిని సహితం యేసు క్రీస్తు చేరదీయటం ఈ సువార్తలో మనకు అనేక చోట్ల కనిపిస్తుంది. మగ్దలేనే మరియ కు ఏడు దయ్యాలు పట్టి వేధిస్తున్నాయి (లూకా 8:2). సమాజము ఆమెను దూరముగా పెట్టింది. అయితే యేసు క్రీస్తు ఆ దెయ్యాలను వెళ్ళ గొట్టి ఆమెను స్వస్థపరచి, ఆమెను తన శిష్యురాలుగా చేసుకొన్నాడు. సమాధి నుండి తిరిగి లేచిన తరువాత కూడా మొదటిగా ఆమెకే కనిపించాడు. కుష్టు రోగులను ఎవరూ అంటుకోరు, వారి దగ్గరకు కూడా ఎవరూ వెళ్ళరు. అయితే యేసు క్రీస్తు వారి దగ్గరకు వెళ్లి వారి ముట్టుకొనే వాడు. 

  లూకా 4 అధ్యాయములో ఆయన విశ్రాంతి దినం రోజున ఆయన యూదుల సమాజ మందిరం లోనికి వెళ్ళాడు. యెషయా గ్రంథం తీసుకొని వారికి వినిపించాడు. 

ప్రభువు ఆత్మ నామీద ఉన్నది

బీదలకు సువార్త ప్రకటించుటకై

ఆయన నన్ను అభిషేకించెను

చెరలోనున్న వారికి విడుదలను, 

గ్రుడ్డివారికి చూపును, 

(కలుగునని) ప్రకటించుటకు….. 

ప్రభువు హితవత్సరము 

ప్రకటించుటకును ఆయన 

నన్ను పంపియున్నాడు. (లూకా 4:18-19) 

   యెషయా ప్రవచనం క్రీస్తులో నెరవేరింది. అనేక అబ్దుతాలు చేసి యేసు క్రీస్తు రోగులను స్వస్థపరచాడు. పాపాత్మురాలైన స్త్రీ యేసు క్రీస్తు పాదముల దగ్గర కూర్చుంది. తన కన్నీటితో ఆయన పాదాలు తడిపింది. తల వెండ్రుకలతో ఆయన పాదములు తుడిచింది. తన తో తెచ్చుకొన్న అత్తరు ను ఆయన పాదములకు పూసి ముద్దు పెట్టుకొంది. ఆమెను చూసిన పరిసయ్యుడు అది సహించలేకపోయాడు. ‘ఇలాంటి పాపాత్మురాలిని ఈయన ఎందుకు తన దగ్గరకు రానిచ్చాడు?’ అని తన మనస్సులో నొచ్చుకొన్నాడు. మనుష్య కుమారుడు వచ్చింది అలాంటి వారి కోసమే అని ఆయన గ్రహించలేకపోయాడు. భూలోకమును తల క్రిందులు చేసే రక్షకునిగా యేసు క్రీస్తును లూకా మనకు చూపిస్తున్నాడు. మహిళలను, చిన్నపిల్లలను చేరదీసేవానిగా పాపులతో స్నేహం చేసేవానిగా పేదలను ఘనపరచేవానిగా లూకా యేసు క్రీస్తును మనకు చూపించాడు. 

Jesus, the Storyteller: ఆ తరువాత యేసు క్రీస్తును ఒక మంచి స్టోరీ టెల్లర్ గా లూకా మనకు చూపిస్తున్నాడు.  మంచి సమరయుని కథ చెప్పాడు. దొంగల చేత కొట్టబడి, దిక్కూ మొక్కూ లేకుండా కొన ప్రాణముతో రోడ్డు ప్రక్కన ఒక వ్యక్తి పడి ఉంటే, ఎవరూ అతని పట్టించుకోలేదు. అయితే సమరయుడు మాత్రం అతని చూసి జాలిపడి, అతని గాయాలు కట్టి అతని హాస్పిటల్ లో చేర్పించాడు. యేసు క్రీస్తు చెప్పిన ఈ మంచి సమరయుని కథ ఎన్ని కోట్ల మందిని ప్రేరేపించింది? మంచి సమరయుని పేరు మీద ఎన్ని వేల హాస్పిటల్ లు నిర్మించబడ్డాయి? ఎన్ని వేల ఆశ్రమాలు, అనాథ శరణాలయాలు నిర్మించబడ్డాయి? ఒక కుమారుడు తండ్రి ఆస్థి లో తన భాగం తీసుకొని దూర దేశానికి వెళ్లి దానిని మొత్తం వ్యర్థముగా పాడు చేశాడు. పందుల పొత్తుతో తన కడుపు నింపుకొనే పరిస్థితి అతనికి వచ్చింది. అయితే బుద్ధి తెచ్చుకొని తన తండ్రి ఇంటికి తిరిగి వెళ్ళాడు. ఆ తండ్రి అతనిని తిరిగి ప్రేమతో తన ఇంటికి ఆహ్వానించాడు. ఆ కథ విని ఎంత మంది కుమారులు, కుమార్తెలు బుద్ధి తెచ్చుకొని తల్లి దండ్రుల దగ్గరకు తిరిగివెళ్ళారు? ఆ కథ విని ఎంత మంది తల్లి దండ్రులు తమ బిడ్డలను క్షమించి చేరదీశారు? యేసు క్రీస్తు చెప్పిన అటువంటి గొప్ప కథలు ఈ సువార్తలో మనకు కనిపిస్తాయి. ఈ రోజు వరకు అవి మన హృదయాలను ప్రేరేపిస్తున్నాయి. 

Jesus, the Savior: ఆ తరువాత Jesus, the Savior. లూకా తన సువార్తలో యేసు క్రీస్తు ను మన రక్షకునిగా చూపిస్తున్నాడు. 9 అధ్యాయములోనే యేసు క్రీస్తు యెరూషలేము యాత్ర మొదలవటం మనం చూస్తాము. మన పాపములనుండి మనలను రక్షించడానికి ఆయన యెరూషలేము వెళ్తున్నాడు. మార్గ మద్యములో యెరికో పట్టణానికి ఆయన వెళ్ళాడు. అక్కడ జక్కయ్య అనే వ్యక్తి యేసు ప్రభువును చూడడానికి మేడి చెట్టు ఎక్కాడు. యేసు ప్రభువు ఆ చెట్టు దగ్గరకు వెళ్ళాడు. జక్కయ్యను క్రిందకు పిలిచాడు. ‘జక్కయ్యా, క్రిందకు దిగిరా, ఈ రోజు నేను నీ ఇంట్లో బస చేయాలను కొంటున్నాను. ఈ రోజు నీ ఇంటికి రక్షణ వచ్చింది. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చాడు (లూకా 19:10). పాపములో నశించి పోయిఉన్న మనలను రక్షించే మనుష్యకుమారునిగా లూకా యేసు క్రీస్తు ను మనకు చూపించాడు. 

Jesus, the Scripture: చివరిగా, Jesus, the Scripture. యేసు క్రీస్తును  దేవుని వాక్యము గా లూకా మనకు చూపించాడు. లూకా సువార్త చివరి అధ్యాయము లో చూడండి. ఇద్దరు వ్యక్తులు ఎమ్మాయి అనే గ్రామానికి నడిచివెళ్తున్నారు. వారు దేవుని కార్యములను చూడలేని స్థితిలో ఉన్నారు. వారి ని యేసు క్రీస్తు అడ్డగించాడు. 

‘అవివేకులారా, మందమతులారా’ అని ఆయన వారిని గద్దించాడు. మోషే దగ్గర మొదలు పెట్టి, సమస్త ప్రవక్తలు క్రీస్తు గురించి ఏమి చెప్పారో, పాత నిబంధన గ్రంథం మొత్తం వారికి వివరించాడు. యేసు క్రీస్తు దేవుని వాక్యం. దేవుని వాక్యము యొక్క ముఖ్యమైన సందేశం యేసు క్రీస్తే. దానిలోని ప్రవక్తలు, దానిలోని రాజులు, దానిలోని పండుగలు, దానిలోని ధర్మ శాస్త్రం, దాని లోని దేవాలయము సమస్తము యేసు క్రీస్తు వైపే మనలను నడిపిస్తున్నాయి. 

 

Leave a Reply