యోహాను సువార్తలో యేసు క్రీస్తు

యోహాను సువార్తలో యేసు క్రీస్తు: డాక్టర్ పాల్ కట్టుపల్లి సందేశం 

www.doctorpaul.org 

ఈ రోజు యోహాను సువార్తను పరిచయం చేస్తూ మీకు ఒక ప్రేమ సందేశం ఇవ్వాలని నేను ఆశపడుతున్నాను. బైబిల్ గ్రంథములోని క్రొత్త నిబంధనలో మనకు 4 సువార్తలు కనిపిస్తున్నాయి. మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త 

ఈ 4 సువార్తలలో మన ప్రభువైన యేసు క్రీస్తు 4 రకాలుగా మనకు కనిపిస్తున్నాడు. 

మత్తయి సువార్తలో ఆయన యూదుల రాజు 

మార్కు సువార్త లో ఆయన ఒక సేవకుడు 

లూకా సువార్తలో మనుష్య కుమారుడు 

యోహాను సువార్త లో దేవుడు 

   ఇది నేను ఎంతో ఇష్టపడే సువార్త. ఎంతో  మనోహరమైన బైబిల్ వచనాలు మనకు యోహాను సువార్తలో మనకు కనిపిస్తాయి. నా చిన్న తనములో నాకు ఒక ఆట వస్తువు కావాలి అనిపించింది. మా నాన్నను నేను దాని కోసం అడిగాను. ఆయన ఏమన్నాడంటే, నీకు ఆ క్రికెట్ బాట్ కావాలంటే యోహాను సువార్త 3:16 కంఠస్థము చేసి చెప్పు అన్నాడు. అప్పుడు నేను యోహాను 3:16 కంఠస్థము చేసాను. అప్పటి నుండి అది నా హృదయములో ఇప్పటికీ నిలచిపోయింది. 

దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. 

కాగా ఆయన తన అద్వితీయకుమారునిగా

పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును

నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను

అనుగ్రహించెను.

        యోహాను 3:16   

ఎంత చక్కటి ప్రేమ సందేశం ఆ వచనములో ఉంది!  దేవుడు లోకమును ఎంతో ప్రేమించి, తన ఏకైక కుమారుని మనలను రక్షించడానికి, మనకు నిత్య జీవం ఇవ్వడానికి పంపించాడు. క్లెమెంట్ అఫ్ అలెగ్జాండ్రియా దీనిని ‘స్పిరిట్యుయల్ సువార్త’ అని పిలిచాడు. ‘ఆత్మీయ సువార్త’ –  ఆత్మ సంభందమైన అనేక సత్యాలు 

ఈ సువార్తలో మనకు కనిపిస్తాయి. దేవుడు ఉన్నాడా? ఉంటే ఆయన ఎవరు? ఆయన వ్యక్తిత్వం ఏమిటి? ఆయన గుణగణాలు ఏమిటి? అనే ప్రశ్నలు మన అందరికీ వస్తాయి. ఈ సువార్త లో దాదాపు 170 ప్రశ్నలు మనకు కనిపిస్తాయి. అవన్నీ రెండు అంశముల మీద కేంద్రీకరించబడ్డాయి. యేసు క్రీస్తు ఎవరు? ఆయనను నమ్మావా లేదా? యేసు క్రీస్తు ఎవరు? ఆయనను నమ్మావా లేదా? అనే రెండు ప్రశ్నలు ఈ సువార్తలో అడుగడుగునా ప్రతిధ్వనించడం మనం వింటాము. మొదటిగా, ఈ సువార్తను వ్రాసినది ఎవరు? యేసు క్రీస్తు శిష్యుడైన యోహాను గారు ఈ సువార్తను వ్రాశాడు. యోహాను శిష్యుడు పోలికర్ప్. పోలికర్ప్ శిష్యుడు ఐరేనియస్. 

ఈ సువార్తను యోహాను వ్రాశాడు అని ఐరేనియస్ మొదటిగా వ్రాశాడు. జెబెదయి, సలోమే దంపతులకు యాకోబు, యోహాను అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. వారి చిన్న కుమారుడు యోహాను ఈ సువార్తను వ్రాశాడు. ఈయన తల్లి సలోమే యేసు ప్రభువు తల్లి మరియమ్మ గారికి సోదరి అయి ఉండే అవకాశం ఉంది (యోహాను 19:25). దీనిని బట్టి యోహాను యేసు క్రీస్తు ప్రభువుకు చాలా దగ్గరి బంధువు అని మనకు అర్థం అవుతుంది. జెబెదయి చేపల వ్యాపారం చేసుకొంటూ ఉన్నాడు. యోహాను కూడా ఆయన దగ్గరే వ్యాపారం చేసుకొంటూ ఉన్నాడు. యేసు ప్రభువు పిలుపు అందుకొని ఆయన శిష్యునిగా మారాడు. యేసు క్రీస్తు పరలోకం వెళ్లిపోయిన తరువాత యోహాను యెరూషలేము లోని క్రైస్తవ సంఘములో ముఖ్య నాయకునిగా ఉన్నాడు. తరువాత ఆయన ఎఫెసు పట్టణము వెళ్ళాడు. రోమన్ చక్రవర్తి ట్రేజన్  కాలము వరకు ఆయన జీవితం సాగింది. పత్మాసు ద్వీపానికి యోహాను వెళ్లగొట్టబడ్డాడు. అక్కడ ఉన్నప్పుడు యేసు క్రీస్తు ప్రత్యక్షతలు పొంది ప్రకటన గ్రంథం వ్రాశాడు. దానికి 20-30 సంవత్సరములకు ముందు ఈ యోహాను సువార్త వ్రాశాడు. యోహాను అతని అన్న యాకోబు – వీరిద్దరినీ యేసు ప్రభువు ‘బోయనెర్గెసు’ అని పిలిచాడు. అంటే ఉరిమే వారు -sons of thunder అని అర్థం. యేసు ప్రభువు తో ప్రయాణము చేసేటప్పుడు వీరు గర్జించే సింహాలుగా ఉన్నారు. యేసు ప్రభువు సువార్త ప్రకటిస్తాడు. కొన్ని చోట్ల ప్రజలు మారు మనస్సు పొందకుండా ఆయన సువార్తను నిర్లక్ష్యం చేసేవారు. అప్పుడు ఈ అన్నదమ్ములకు చాలా కోపం వచ్చేది. ‘ప్రభువా, పరలోకం నుండి అగ్ని తెప్పించి వీరిని దహించి వేయమంటావా? (లూకా 9:54) అంత కోపం వీరికి వస్తూ ఉండేది. యేసు ప్రభువు యోహాను మాట వినిఉంటే ఎంతో మంది ప్రజలు అగ్ని కి ఆహుతి అయిపోయి ఉండేవారు. 

  ఇదే యోహాను తన సువార్తలో చక్కటి మాటలు వ్రాశాడు. నేను కోరుకున్నట్లు మనుష్యులను తగలపెట్టే పనిలో దేవుడు లేడు. ఆయన ప్రేమ కలిగిన దేవుడు – 

దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. 

for God so loved the world. 

యేసు క్రీస్తు ప్రేమను ఆయన తన జీవితములో ముందుగా అనుభవించాడు. 

‘యేసు ప్రేమించిన శిష్యుడు’ ‘యేసు క్రీస్తు రొమ్మున ఆనుకొనిన వాడు’ అని ఆయన తనను పిలుచుకొన్నాడు. 

     యేసు క్రీస్తు ఛాతీ మీద తల పెట్టడం అంటే ఎంత గొప్ప సాన్నిహిత్యం! యేసు క్రీస్తు కు ఎంతో దగ్గరగా జీవించిన శిష్యుడు. ఆయన సిలువ మీద వున్నప్పుడు యోహాను దగ్గరలో నిలబడి చూస్తున్నాడు. యేసు ప్రభువు సిలువ మీద నుండి తన తల్లితో మాట్లాడాడు: ‘అమ్మా, ఇదిగో నీ కుమారుడు’ యోహానుతో ఒక మాట అన్నాడు. ‘ఇదిగో నీ తల్లి’ అప్పటి నుండి యోహాను మరియమ్మ గారికి తన ఇంటిలో ఆతిథ్యం ఇచ్చాడు.

    ఒక వ్యక్తి గురించి మనం తెలుసుకోవాలంటే, ఆ వ్యక్తి యొక్క తల్లితో మాట్లాడితే ఎంతో సమాచారం మనకు లభిస్తుంది. యోహాను కూడా యేసు క్రీస్తు ను గురించిన అనేక విషయాలు మరియమ్మ గారి ని అడిగి తెలుసుకొని ఉంటాడు. అందుకనే మిగిలిన మూడు సువార్తలలో కనిపించని 90 శాతం కన్నా ఎక్కువ సమాచారం మనకు కేవలం యోహాను సువార్తలో కనిపిస్తుంది. మిగిలిన మూడు సువార్తల కన్నా భిన్నముగా యోహాను తన సువార్త వ్రాసాడు.  బైబిలు మానుస్క్రిప్ట్ లలో కూడా యోహాను సువార్త మనకు కనిపిస్తుంది. 

ఒక ప్రాచీన ప్రతి P 52 క్రీస్తు శకం 130 లేదా దానికి ముందు సమయమునకు చెందిన ఒక యోహాను సువార్తలోని భాగం ఈ  P 52. ఈ యోహాను సువార్తలో మనం ప్రభువైన యేసు క్రీస్తు ఏ విధముగా మనకు కనిపిస్తున్నాడు? యోహాను యేసు క్రీస్తు గురించి మూడు ముఖ్యమైన సత్యాలు మనకు తెలియజేస్తున్నాడు. యోహాను సువార్తలో యేసు క్రీస్తు 

  1. సృష్టికర్త అయిన దేవుడు మొదటిగా, ఆయన సృష్టికర్త అయిన దేవుడు (God of the universe) 
  2. యోహాను తన సువార్తను ఎలా మొదలుపెట్టాడో చూడండి. 

ఆదియందు వాక్యముండెను,వాక్యము దేవునియొద్ద ఉండెను, వాక్యము దేవుడై యుండెను.

   యోహాను మన దృష్టిని సృష్టి యొక్క ప్రారంభానికి తీసుకొని వెళ్ళాడు. సృష్టి కి ముందు దేవుడు ఉన్నాడు. ఆ దేవుడు సమస్తమును సృష్టించాడు. 

సమస్తమును ఆయన 

మూలముగా కలిగెను,

కలిగియున్నదేదియు 

ఆయన లేకుండ కలుగలేదు.

                  యోహాను 1:2-3

దేవుని మాట వలన సమస్తము ఉనికి లోకి వచ్చాయి. కొంతమంది సైంటిస్టులు ‘మేము కూడా సృష్టికర్తలమే’ అని అంటూ వుంటారు. సింథటిక్ బయాలజీ లో ఇప్పుడు ఆర్టిఫిషియల్ DNA తయారు చేస్తున్నారు. దేవుడు మాత్రమే కాదు, మేము కూడా DNA చేయగలం అని వీరు అంటున్నారు. దేవుని మాట వలన DNA సృష్టించబడింది. మనిషి కేవలం మాట చేత దేనినీ సృష్టించలేడు. పైనా, క్రింద పడి మనిషి ఎన్నో ప్రయత్నాలు చేసి మనిషి DNA చేయగలిగాడు. అందులో కూడా దేవుని కాపీ కొట్టాడు కానీ తనంతట తానుగా DNA చేయలేకపోయాడు. ప్రకృతిని అర్థం చేసుకొనే శక్తిని మనిషికి ఇచ్చింది దేవుడే. మనిషి కి కూడా దేవుడు ఒక పక్షి యొక్క బ్రెయిన్ ఇచ్చి ఉంటే, లేక ఒక చేప యొక్క బ్రెయిన్ ఇచ్చి ఉంటే మనిషి ఎప్పటికీ సైంటిస్ట్ అయ్యే వాడు కాదు. 

మనిషి దేవుని స్థానాన్ని ఎప్పటికీ తీసుకోలేడు. యోహాను మనకు ఆ సత్యం ఇక్కడ బోధించాడు. సమస్తము ఆ దేవుని మాట వలన, ఆ దేవుని జ్ఞానం వలన existence లోకి వచ్చాయి. 

‘ఆయనలో జీవము ఉండెను, ఆ జీవము మనుష్యులకు వెలుగై ఉండెను’ 

(యోహాను 1:4). దేవుని జీవము, దేవుని వెలుగు మనిషిని నిలబెడుతున్నాయి. ఆ వాక్యము శరీరధారియై, కృపాసత్యసంపూర్ణు డుగా మనమధ్య నివసించెను; తండ్రివలన కలిగిన అద్వి తీయకుమారుని మహిమవలె మనము ఆయన మహిమను కనుగొంటిమి 

                    యోహాను 1:14 

  ఈ సృష్టికర్త అయిన దేవుడు శరీరధారి అయి మన మధ్య నివసించాడు. దేవుని మహిమ ఆయనలో మనం చూశాము. 

యోహాను గొప్ప సంచలన వార్త మనకు చెబుతున్నాడు. బేత్లెహేము లో జన్మించిన ఈ శిశువు నజరేతు లో పెరిగిన ఈ బాలుడు గలిలయ సముద్ర తీరములో నడిచిన ఈ యువకుడు యొర్దాను తీరములో మనకు ప్రకటించిన ఈ బోధకుడు మానవ రూపములో మన మధ్యకు వచ్చిన దేవుడు. 

యేసు క్రీస్తు యొక్క దైవత్వము ఈ సువార్తలో మొదటి నుండి చివరి వరకు మనకు కనిపిస్తుంది. 

-దేవుని మహిమ యేసు క్రీస్తు నందు కనిపించింది ఎందుకంటే ఆయన దేవుడు కాబట్టి.     యోహాను 1:14 

-ఆయన మోషే కంటే గొప్ప వాడు, ఎందుకంటే ఆయన దేవుడు కాబట్టే.యోహాను 1:17 

-యేసు క్రీస్తు సర్వలోక పాపము మోసికొని పోవు దేవుని గొఱ్ఱె పిల్ల, ఎందుకంటే ఆయన దేవుడు కాబట్టే. యోహాను 1:29 

-ప్రవక్తలందరూ యేసు క్రీస్తు గురించి వ్రాశారు, ఎందుకంటే ఆయన దేవుడు కాబట్టే.యోహాను 1:45 

-ఆయన ఎదుట ఆకాశం తెరువబడింది దేవ దూతలు ఆయనకు నమస్కరిస్తున్నాను ఎందుకంటే ఆయన దేవుడు కాబట్టే. యోహాను 1:51 

-యేసు క్రీస్తు దేవాలయము కంటే నేను గొప్ప వాణ్ని అన్నాడు ఎందుకంటే ఆయన దేవుడు కాబట్టి.     యోహాను 2:19-21 

-యేసు క్రీస్తు అందరిని ఎరిగిన సర్వ జ్ఞాని ఎందుకంటే ఆయన దేవుడు కాబట్టి యోహాను 2:24

-యేసు క్రీస్తు ఆరాధించ బడ్డాడు, ఎందుకంటే ఆయన దేవుడు కాబట్టి. యోహాను 4:24 

-విశ్రాంతి దినము కంటే యేసు క్రీస్తు గొప్ప వాడు, ఎందుకంటే ఆయన దేవుడు కాబట్టే. యోహాను 5:10 

-యేసు క్రీస్తు ఈ లోకానికి తీర్పు తీరుస్తాడు, ఎందుకంటే ఆయన దేవుడు కాబట్టే. యోహాను 5:23 

-బైబిల్ గ్రంథము యొక్క ముఖ్య అంశం యేసు క్రీస్తే, ఎందుకంటే ఆయన దేవుడు కాబట్టే. యోహాను 5:46 

-ఎవరూ చేయలేని అద్భుతాలు యేసు క్రీస్తు చేయగలిగాడు, ఎందుకంటే ఆయన దేవుడు కాబట్టే.యోహాను 6:1-10 

-ఎవరూ సాహసించని పేరులతో యేసు క్రీస్తు తనను పిలుచుకొన్నాడు, ఎందుకంటే ఆయన దేవుడు కాబట్టే.యోహాను 6:20 

-యేసు క్రీస్తు లోకమునకు జీవాహారం, ఎందుకంటే ఆయన దేవుడు కాబట్టే. యోహాను 6:35 

-యేసు క్రీస్తు లోకమునకు వెలుగు, ఎందుకంటే ఆయన దేవుడు కాబట్టే.యోహాను 8:12 

-అబ్రహాము పుట్టకమునుపే యేసు క్రీస్తు ఉన్నాడు, ఎందుకంటే ఆయన దేవుడు కాబట్టి. యోహాను 8:58 

-నా ప్రాణం ఎవరూ తీసుకోలేరు అన్నాడు, ఎందుకంటే ఆయన దేవుడు కాబట్టి యోహాను 10:18 

-నేను గొఱ్ఱెల కాపరిని అని దేవుని పేరుతో యేసు క్రీస్తు తనను పిలిచుకొన్నాడు ఎందుకంటే ఆయన దేవుడు కాబట్టి. యోహాను 10:11

-నా గొఱ్ఱెలు ఎప్పటికి నశించవు, నేను మీకు నిత్యజీవము ఇస్తాను అని యేసు క్రీస్తు అన్నాడు, ఎందుకంటే ఆయన దేవుడు కాబట్టే.యోహాను 10:28 

-నేను, తండ్రి ఏకముగా ఉన్నాము ని అన్నాడు ఎందుకంటే ఆయన దేవుడు కాబట్టే.

యోహాను 10:30 

-పునరుత్తానము, జీవమును నేనే అని యేసు క్రీస్తు అన్నాడు, ఎందుకంటే ఆయన దేవుడు కాబట్టే. యోహాను 11:25 

-మీ కోసం పరలోకం నేను నిర్మిస్తున్నాను అన్నాడు, ఎందుకంటే ఆయన దేవుడు కాబట్టే.యోహాను 14:1-2 

-నేనే మార్గమును, సత్యమును, జీవమును అన్నాడు, ఎందుకంటే ఆయన దేవుడు కాబట్టే.యోహాను 14:6

-మీ కోసం పరిశుద్ధాత్ముని పంపిస్తాను, అని ఆయన అనగలిగాడు ఎందుకంటే ఆయన దేవుడు కాబట్టే.యోహాను 14:26 

-ఈ లోకం ఇవ్వలేని శాంతి ని నేను మీకు ఇవ్వగలను అని ఆయన అన్నాడు ఎందుకంటే ఆయన దేవుడు కాబట్టే.యోహాను 14:27 

-నేను లోకమును జయించి ఉన్నాను అన్నాడు ఎందుకంటే ఆయన దేవుడు కాబట్టే. యోహాను 16:33 

-లోకము పుట్టక మునుపే పరలోకము లో యేసు క్రీస్తు దేవుని మహిమతో ఉన్నాడు ఎందుకంటే ఆయన దేవుడు కాబట్టే.యోహాను 17:5 

-సమస్తము సమాప్తముగా సిలువ మీద ముగించగలిగాడు, ఎందుకంటే ఆయన దేవుడు కాబట్టే.యోహాను 19:28 

-శిష్యుల చేత ‘నా ప్రభువా, నా దేవా’ అని పిలవబడ్డాడు, ఎందుకంటే ఆయన దేవుడు కాబట్టే. యోహాను 20:28 

   ఆ విధముగా యోహాను సువార్త లో ప్రతి అధ్యాయం మనం చదువుకుంటూ వెళితే యేసు క్రీస్తు దేవుడు అనే సత్యము మనకు స్పష్టముగా అర్థం అవుతుంది. 

రెండవదిగా, యేసు క్రీస్తు యూదులకు మెస్సియా. 

Messiah of the Jews 

   యోహాను సువార్తలో మనకు కనిపించే మరొక ముఖ్య సత్యము యేసు క్రీస్తు యూదులకు మెస్సియా. మొదటి అధ్యాయములో శిష్యులు యేసు క్రీస్తు ను చూసినప్పుడు ఏమన్నారు? మేము మెస్సియాను కనుగొన్నాము. ధర్మ శాస్త్రములో మోషే, ప్రవక్తలు ఎవరిని గురించి వ్రాశారో ఆయనను కనుగొన్నాము యోహాను 1:40-41 

-సమరయ స్త్రీ యేసు ప్రభువుతో ఒక మాట అంది. ‘మెస్సియా వచ్చినప్పుడు మాకు సమస్తము బోధిస్తాడు’. యేసు ప్రభువు ఆమెతో ఒక మాట అన్నాడు: నీతో మాటలాడుచున్న నేనే ఆ మెస్సియాను. 

అరణ్యములో మోషే ఒక సర్పము ఎత్తాడు, మీ కొరకు ఎత్తబడేవాణ్ణి నేనే అన్నాడు యోహాను 3:14-15 

అరణ్యములో మీ పితరులు మన్నా తిన్నారు. జీవాహారం నేనే అన్నాడు (యోహాను 6:48-50) 

మీ తండ్రి అయిన అబ్రహాము కూడా నా కోసం ఎదురు చూశాడు (యోహాను 8:56) 

యూదుల పండుగలు, వారి ప్రత్యక్ష గుడారము, వారి దేవాలయం అవన్నీ ఈ మెస్సియా వైపే చూపిస్తున్నాయి. ఒక పళ్ళెములో నీళ్లు పోసి ఆ శిష్యుల యొక్క పాదములు కడిగాడు. 

ఇశ్రాయేలీయులను ఎంతగా ప్రేమించాడు, వారి ని ఎంతగా వెంబడించాడు వారి కాళ్ళు కూడా కడుగటానికి సిద్ధపడి వారి మధ్యలోకి వచ్చిన మెస్సియా. 

మూడవదిగా లోక రక్షకుడు 

God of the universe 

Messiah of the Jews 

Savior of the world 

యోహాను తన సువార్తలో యేసు క్రీస్తు ను లోక రక్షకునిగా మనకు చూపిస్తున్నాడు. 

ఇదిగో లోకపాపమును మోసికొనిపోవు దేవుని గొఱ్ఱపిల్ల. 

           యోహాను 1:29 

దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. యోహాను 3:16 

నిజమైన వెలుగు ఉండెను;అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుష్యుని వెలిగించుచున్నది.

                 యోహాను 1:9 

లోకములో ప్రతి మనుష్యుని వెలిగించే దేవుని వెలుగు (యోహాను 12:46) 

లోక రక్షకుడు వ్యక్తి గతముగా వెలుగు ఇచ్చేవాడు. 

గ్రుడ్డి వాడు గ్రుడ్డితనములో ఉన్నాడు. ఆ గ్రుడ్డి వానికి ఆ చీకటి వ్యక్తిగతమైనది

అతని గ్రుడ్డితనం వ్యక్తిగతమైనది. 

అతనికి యేసు క్రీస్తు వెలుగు ఇచ్చాడు. 

తోమా, ‘నా ప్రభువా, నా దేవా’ అన్నాడు. యేసు క్రీస్తు అతనికి వ్యక్తిగత సంబంధం 

ఇచ్చాడు. 

చివరి అధ్యాయములో మీరు చూస్తే యేసు క్రీస్తు సమాధి నుండి తిరిగి లేచిన 

తరువాత మరియ సమాధుల తోటలోకి వెళ్ళింది. ఆమెతో మాట్లాడుతున్న యేసు 

క్రీస్తును గుర్తించలేక పోయింది. అప్పుడు మరియా అని ఆమెను యేసు ప్రభువు పిలిచాడు. మరియా అనే ఆ పిలుపులో ఎంత గొప్ప ప్రేమ ఉంది? ఎంత గొప్ప ఆదరణ ఉంది? ఎంత గొప్ప శక్తి ఉంది? 

మొదటి అధ్యాయములో సర్వలోక సృష్టికర్త గా కనిపిస్తున్న క్రీస్తు చివరి అధ్యాయములో ఒక సామాన్య స్త్రీ పేరు పెట్టి పిలిచే అన్యోన్య సంబంధములో మనకు కనిపిస్తున్నాడు. 

God of the universe 

Messiah of the Jews 

Savior of the world 

ఈ గొప్ప రక్షకుని యొద్దకు మీరు రావాలన్నదే నేటి మా ప్రేమ సందేశం 

Leave a Reply