New Year Message – The Best is Yet to Come
ప్రేమ సందేశం కార్యక్రమం చూస్తున్న సోదరీ సోదరులందరికీ మన ప్రభువైన యేసు క్రీస్తు మహిమ కలిగిన నామములో శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. దేవుని కృప యందు మీరు క్షేమముగా ఉన్నారని తలంచు చున్నాము. బైబిల్ సమాచారం కోసం మా వెబ్ సైట్ దర్శించండి. http://www.doctorpaul.org . మీరు ఈ సందేశాలు మరో సారి చూడాలంటే లేక మిస్ అయిన సందేశాలు చూడాలంటే మా యూట్యూబ్ ఛానల్ దర్శించండి. మా యూ ట్యూబ్ ఛానల్ లో అన్ని సందేశాలు అప్ లోడ్ చేసాము. మా కార్యక్రమం యాప్ మీ మొబైల్ లో డౌన్ లోడ్ చేసుకోండి. ఆ యాప్ ద్వారా మీరు మాకు మీ ప్రేయర్ రిక్వెస్ట్ లు పంపించవచ్చు. మీ జీవితాల్లో దేవుడు చేస్తున్న కార్యాలు మాతో పంచుకోవచ్చు. అందు కోసం మీ మొబైల్ లో మా యాప్ డౌన్ లోడ్ చేసుకోండి. ఈ కార్యక్రమం మీకు ఆశీర్వాదకరముగా ఉంటే దీని బ్రాడ్ కాస్టింగ్ కి సహకరించండి. రెగ్యులర్ గా ఆర్థిక సహకారం అందించండి. మరో క్రొత్త సంవత్సరములో మనం ప్రవేశించాము. ఈ రోజు నూతన సంవత్సరం సందర్భముగా ఒక ప్రేమ సందేశం మీకు ఇవ్వాలని నేను ఆశపడుతున్నాను.
అపోస్తలుడైన పౌలు తిమోతి కి వ్రాసిన రెండవ పత్రికలో నుండి కొన్ని సంగతులు చూద్దాము.
2 తిమోతి 2:8
‘యేసు క్రీస్తును జ్ఞాపకము చేసికొనుము’
2 తిమోతి 2:8
యేసు క్రీస్తును జ్ఞాపకము చేసికొనుము – Remember Jesus Christ.

ఈ క్రొత్త సంవత్సరం సందర్భముగా ఈ చక్కటి వాక్యము మనము ధ్యానం చేద్దాము. అపోస్తలుడైన పౌలు గారు ఏ పరిస్థితుల్లో ఈ మాట వ్రాశాడు? క్రీస్తు శకం 64 లో నీరో చక్రవర్తి రోమ్ నగరాన్ని తగులబెట్టాడు. అపోస్తలుడైన పౌలు గారు కూడా గృహ నిర్బంధం చేయబడ్డాడు. అపోస్తలుల కార్యములు 28 లో ఆ విషయం మనం చూస్తాము. కొన్ని సంవత్సరాల తరువాత ఆయనను రెండవ సారి జైలులో పెట్టారు. ఒక చిన్న జైలు గదిలో, సరైన ఆహారం లేక, సరైన వసతులు లేక ఆయన జీవితం చాలా దుర్భరముగా ఉంది. ఆ దశలో అపోస్తలుడు తన ఆత్మీయ కుమారుడైన తిమోతి కి ఈ పత్రిక వ్రాశాడు. తిమోతి ఎఫెసు అనే పట్టణములో ఉన్న క్రైస్తవ సంఘములో కాపరి గా ఉన్నాడు. అపోస్తలుడైన పౌలు గారి పరిచర్య చివరి దశకు వచ్చింది. ఆయన తన అనుభవములో నుండి తిమోతి కి కొన్ని ప్రశస్తమైన సత్యాలు నేర్పిస్తున్నాడు. సాక్షాత్తూ యేసు క్రీస్తు ప్రభువు ప్రత్యక్షత వలన పౌలు క్రైస్తవుడు అయ్యాడు. ఆపొస్తలుడుగా నియమించబడ్డాడు. అలుపెరుగని యోధుని వలె యేసు క్రీస్తు సువార్త ప్రకటించాడు. ప్రపంచ చరిత్రను మలుపు తిప్పిన గొప్ప విశ్వాస వీరుడు. ఆయన కంటే గొప్ప క్రైస్తవుడు మరొకరు చరిత్రలో లేరు అంటే అతిశయోక్తి కాదు. ఆయన చెప్పే పాఠాలు మనం కూడా నేర్చుకొంటే మంచిది.


ఆయన చెప్పిన మాటలు మీరు గమనించండి: యేసు క్రీస్తును జ్ఞాపకము చేసు కొనుము. నిత్యజీవితములో మన మైండ్ అనేక విషయాల మీదకు వెళ్తుంది. ముఖ్యముగా ఈ డిజిటల్ యుగములో మన మనస్సులను ఏ మాత్రం ఖాళీ లేకుండా చేయడానికి అనేక వ్యాపకాలు ఉన్నాయి. ఒక మొబైల్ ఫోన్ మన చేతిలో పెడితే చాలు మనం ఎక్కడికో వెళ్ళిపోతాము. ఫేస్ బుక్ లో మొదలు పెడితే, ట్విట్టర్, ఇంస్టాగ్రామ్, యూట్యూబ్, డిస్నీ, ఆహా, ఓహో లాంటి అనేక సోషల్ మీడియా మన సమయాన్ని తినివేస్తుంది. యేసు క్రీస్తును జ్ఞాపకం చేసుకొనే సమయం మనకు ఉందా? రెండు వేల సంవత్సరముల క్రితం పౌలు గారు తిమోతి కి, ఒక క్రైస్తవ నాయకునికి ఈ మాటలు వ్రాస్తున్నాడు: యేసు క్రీస్తును జ్ఞాపకము చేసికొనుము. ఒక క్రైస్తవ నాయకుడు కూడా అనేక విషయాల్లో మునిగిపోయే యేసు క్రీస్తు ప్రభువును మరచిపోయే అవకాశము ఉంది.

పౌలు ఏమంటున్నాడంటే, నీవైతే నిరంతరం యేసు క్రీస్తు ను జ్ఞాపకం చేసుకో. ప్రతి రోజూ, ప్రతి గంటా మనం యేసు క్రీస్తును జ్ఞాపకం చేసుకోవాలి. మనం చేసే పనులు, మనం మాట్లాడే మాటలు, మనం పెట్టుకొనే సంబంధాలు, మనం తీసుకొనే నిర్ణయాలు – వీటన్నిటి మీద యేసు క్రీస్తు ప్రభువు యొక్క ప్రభావం కనిపించాలి. మానవ జీవితములో గతం, ప్రస్తుతం, భవిష్యత్తు ఉంటాయి. ఈ మూడిటి మీద క్రీస్తు ఆలోచనలు పడాలి.

Remembering Jesus for the Past

యేసు క్రీస్తును జ్ఞాపకం చేసుకో : గతం
మొదటిగా అపోస్తలుడు తన గతాన్ని చూస్తున్నాడు. అందులో దేవుని కోణం ఉంది,
మానవ కోణం ఉంది. మొదటిగా దేవుని కోణం చూడండి
మన క్రియలనుబట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టియు, అనాదికాలముననే క్రీస్తుయేసునందు మనకు అనుగ్రహింపబడినదియు,క్రీస్తు యేసను మన రక్షకునిప్రత్యక్షతవలన బయలుపరచబడి నదియునైన తన కృపనుబట్టియు, మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచెను.
2 తిమోతి 1:9-10

నా క్రియలను బట్టి కాదు. దేవుడు తన స్వంత సంకల్పము చొప్పున, అనాది కాలముననే, భూమిని, ఆకాశములను సృష్టించక మునుపే యేసు క్రీస్తు నందు మనకు కృప చూపించాడు. విశ్వసించిన మనలను దేవుడు రక్షించాడు. పరిశుద్దమైన పిలుపుతో మనలను పిలిచాడు. గతము లోకి చూసినప్పుడు, దేవుడు నీ మీద చూపించిన కృపను జ్ఞాపకం చేసుకో. యేసు క్రీస్తు నందు దేవుడు నీకు కృప చూపించాడు. దానిని బట్టి సంతోషించి దేవుని స్తుతించు.
నీ పాపములను పూర్తిగా క్షమించి వేసి, నీకు రక్షణ భాగ్యం ఇచ్చాడు. ఆ రక్షణ ను నీవు ఎప్పటికీ కోల్పోవు. యేసు క్రీస్తు ప్రభువు చేతిలో నుండి నిన్ను ఎవరూ దొంగిలించలేరు. దానిని బట్టి దేవుని స్తుతించు. గత సంవత్సరములలో దేవుడు మీకు మేలులను బట్టి ఆయనను స్తుతించండి.

డిసెంబర్ 31 తేదీ న కూడా చాలామంది చనిపోతారు. క్రొత్త సంవత్సరం చూసే ధన్యత వారికి లేదు. దేవుడు క్రొత్త సంవత్సరం లోకి వచ్చే భాగ్యం మీకు అనుగ్రహించాడు. దానిని బట్టి దేవుని స్తుతించు. పౌలు గారు మొదటిగా దేవుడు గతములో ఆయనకు చూపిన కృపను బట్టి దేవుని స్తుతించాడు.
అక్కడ మానవ కోణం కూడా ఉంది.
‘ ఆసియలోని వారందరు
నన్ను విడిచిపోయిరను సంగతి
నీ వెరుగుదువు’
2 తిమోతి 1:15

పౌలు గారికి ఎంతో మంది స్నేహితులు ఉండేవారు. అయితే వారందరూ ఆయనను చివరి దశలో వదలి వేసి వెళ్లిపోయారు. ఆయన ఇప్పుడు జైలులో ఉన్నాడు. ఏ దొంగతనమో, హత్యో, అత్యాచారమో చేసి ఆయన జైలుకు వెళ్ళలేదు. యేసు క్రీస్తు సువార్త ప్రకటిస్తున్నాడు. అనేక మందిని క్రీస్తు వైపు నడిపిస్తున్నాడు అనే దుగ్దతో ఆయన మీద క్రిమినల్ కేసులు పెట్టి, అరెస్ట్ చేసి జైలులో పెట్టారు. అలాంటి దశలో ఆయనకు అండగా నిలబడాల్సిన స్నేహితులు కూడా ఆయనను వదలి వెళ్లిపోయారు.


అయితే దేవుడు ఆయనను వదలి పెట్టలేదు. 17 వచనం చూడండి.
ఒనేసిఫోరు రోమాకు వచ్చినప్పుడు
నా సంకెళ్లనుగూర్చి సిగ్గుపడక శ్రద్ధగా
నన్ను వెదకి, కనుగొని, అనేక
పర్యాయములు ఆదరించెను.
2 తిమోతి 1:15-17
ఒనేసిఫరు రోమ్ నగరం వెళ్ళినప్పుడు పౌలు గారు ఏ జైలులో ఉన్నాడు, ఏ గదిలో ఉన్నాడు, ఎలా ఉన్నాడు అని వెదకి ఆయన దగ్గరికి వెళ్లి ఆయనను పరామర్శించి, ఆదరించాడు. సమస్యలలో ఉన్న స్నేహితులను మనం పరామర్శిస్తున్నామా? కనీసం వారికి ఫోన్ చేస్తున్నామా? ఎక్కడో పరాయి దేశములో, ఇటలీ లోని రోమ్ లో పౌలు ఒక జైలులో వున్నప్పుడు ఒనేసిఫరు ఆయనను దర్శించి ఆదరించాడు. ఆయనను బట్టి పౌలు దేవుని స్తుతించాడు. గతం లోకి చూసినప్పుడు పౌలు ఒక వైపు దేవుని నమ్మకత్వాన్ని చూశాడు. మరొకవైపు తన మిత్రుల నమ్మకద్రోహాన్ని కూడా చూశాడు. దేవుడు గతములో తన వారి ద్వారా మనలను ఆదరించిన సంఘటనలు మనం గుర్తుచేసుకోవాలి. వాటిని బట్టి మనం దేవుని స్తుతించాలి.



Remembering Jesus for the Present

రెండవదిగా, మనం వర్తమానమును బట్టి యేసు క్రీస్తు ప్రభువును జ్ఞాపకం చేసుకోవాలి. ఇందులో కూడా మానవ కోణం ఉంది, దేవుని కోణం ఉంది. మానవ కోణములో మనం చూస్తే, ప్రస్తుత ప్రపంచం మనలను నిరాశ పరుస్తుంది. పౌలు మన సమాజము గురించి ఏమని వ్రాశాడో చూడండి: 2 తిమోతి 3:1-5
అంత్యదినములలో అపాయకరమైన
కాలములు వచ్చునని తెలిసికొనుము.
2 ఏలాగనగా మనుష్యులు స్వార్థ ప్రియులు
ధనాపేక్షులు బింకములాడువారు
అహంకారులు దూషకులు
తల్లిదండ్రులకు అవిధేయులు
కృతజ్ఞత లేనివారు
అపవిత్రులు
అనురాగరహితులు అతిద్వేషులు
అపవాదకులు అజితేంద్రియులు
క్రూరులు సజ్జనద్వేషులు
ద్రోహులు మూర్ఖులు గర్వాంధులు
దేవునికంటె సుఖాను భవము
నెక్కువగా ప్రేమించువారు,
పైకి భక్తిగలవారివలె ఉండియు
దాని శక్తిని ఆశ్రయించనివారునై యుందురు.
2 తిమోతి 3:1-5


మనుష్యుల మీద నమ్మకం పెట్టుకోవద్దు. వారు నిన్ను నిరాశ పెట్టడం ఖాయం. ప్రస్తుత ప్రపంచం మీద నమ్మకం పెట్టుకోవద్దు. అది కూడా మిమ్ములను నిరాశ పెడుతుంది. ఎక్కడ చూసినా రాజకీయ నాయకుల అవినీతి హత్యలు, అత్యాచారాలు మనం చూస్తాము నిరుద్యోగం పెరిగిపోతుంది. చాలా మందికి ఉన్న ఉద్యోగాలే ఊడిపోతున్నాయి. కోవిడ్ వైరస్ రకరకాల వేరియంట్ లుగా ప్రపంచ దేశాలను అతలా కుతలం చేస్తున్నది. హాస్పిటల్ లలో మందులు లేని పరిస్థితి,యువత డ్రగ్స్ కు బానిసలు గా మారిపోవడం, మద్యపానం తో ప్రాణాలు కోల్పోవడం,పరీక్షలలో కాపీలు కొట్టేవారు పెరిగిపోవడం, ఆహారం లో నాణ్యత తగ్గిపోవడం,మత కల్లోలాలు పెరిగిపోవడం, యుద్ధాలు, రక్తపాతం పెరిగిపోవడం,కులోన్మాదం, వర్గ పోరాటాలు పెరిగిపోవడం, అధికారులలో అవినీతి పెరిగిపోవడం – ఇవన్నీ చూస్తే నిరాశ తప్ప నిరీక్షణ ఎవరికీ కలుగదు. ‘ఏమి న్యూ ఇయర్ లే’ అనిపిస్తుంది. అపోస్తలుడైన పౌలు ఏమంటున్నాడంటే, మనుష్యుల వైపు చూడవద్దు, ఈ ప్రపంచాన్ని చూడవద్దు.

యేసు క్రీస్తును జ్ఞాపకం చేసుకో.
8 వచనం చూడండి:
ఎవరీ యేసు క్రీస్తు?
దావీదు సంతానములో పుట్టి
మృతులలో నుండి లేచిన
యేసుక్రీస్తును జ్ఞాపకము చేసికొనుము.2:8
ఇక్కడ రెండు చక్కటి సత్యాలు అపోస్తలుడు మనకు గుర్తుచేస్తున్నాడు. మొదటిగా ఈయన దావీదు సంతానంలో పుట్టిన వాడు. ఆయన మానవత్వము అందులో కనిపిస్తుంది. యేసు క్రీస్తు మానవునిగా మన మధ్యలోకి వచ్చి, మానవ అనుభవాలను పొందిన వాడు. ఈయన శ్రమలు పొందిన వాడు. సిలువ మరణం పొందిన వాడు. సమస్త మైన మానవ బాధలు చూసిన వాడు, అనుభవించిన వాడు.


రెండవదిగా, మృతులలో నుండి లేచిన యేసు క్రీస్తు. అందులో యేసు క్రీస్తు యొక్క దైవత్వం మనకు కనిపిస్తున్నది. ప్రపంచములోని మనుష్యులందరికి, యేసు క్రీస్తు కు మధ్య ఉన్న భేదం ఏమిటంటే, ఆయన ఒక్కడు మాత్రమే మృతులలో నుండి లేచి సజీవునిగా ఉన్నాడు. ఈ సజీవుడైన క్రీస్తును జ్ఞాపకం చేసుకో అని పౌలు మనతో అంటున్నాడు. ఈ క్రొత్త సంవత్సరములో ప్రతి దినం మనం చేయాల్సిన పని అదే. సజీవుడైన క్రీస్తును జ్ఞాపకం చేసుకోవాలి.
మా తాత, మా నాన్న, మా అమ్మ వారు నాకు జ్ఞాపకం వస్తూ ఉంటారు. వారి జ్ఞాపకాలు మంచివే కానీ వారు సజీవులు కారు. అయితే యేసు క్రీస్తును జ్ఞాపకం చేసుకోవడం వేరు. ఆయన సజీవుడిగా మనతో ఉన్నాడు. సజీవుడైన క్రీస్తు ను మనం జ్ఞాపకం చేసుకొంటే ఈ లోక సంబంధమైన సమస్యలు మనలను క్రుంగ దీయవు. సజీవుడైన క్రీస్తు మనకు ప్రతి రోజూ కావలసిన శక్తి ఇస్తున్నాడు.
2 అధ్యాయము, మొదటి వచనం
నా కుమారుడా,
క్రీస్తు యేసు నందున్న కృప చేత
బలవంతుడవు కమ్ము.
2 తిమోతి 2:1
సజీవుడైన క్రీస్తును మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆయన కృప మనకు శక్తి ఇస్తుంది.
ఆయన ఆత్మ మనకు శక్తి ఇస్తుంది.
దేవుడు మనకు
శక్తియు ప్రేమయు,
ఇంద్రియ నిగ్రహమునుగల
ఆత్మనే యిచ్చెను గాని
పిరికితనముగల
ఆత్మ నియ్యలేదు.
2 తిమోతి 1:7
పౌలు అనేక శ్రమల్లో ఉన్నాడు. అందరూ ఆయనను వదలి వెళ్లిపోయారు ఆయన ఒక జైలులో ఉన్నాడు.
ఈ శ్రమలను అనుభవించుచున్నాను
కానీ నేను నమ్మిన వాని
ఎరుగుదును గనుక
సిగ్గుపడను
2 తిమోతి 1:12
1:12 అన్నాడు. తిమోతి కి కూడా అదే చెప్పాడు.
క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె
నాతో కూడా శ్రమను అనుభవించుము
2:3
సజీవుడైన యేసు క్రీస్తు ను మనం జ్ఞాపకం చూసుకొన్నప్పుడు శ్రమలను ఓర్చుకునే శక్తి, కృప మనకు కలుగుతాయి. 2014 లో నైజీరియా దేశములో బోకో హారం అనే ఇస్లామిక్ తీవ్ర వాద సంస్థ క్రైస్తవ బాలికలను కిడ్నాప్ చేసుకొని వెళ్ళింది. 276 క్రైస్తవ బాలికలు ఒకే రాత్రి కిడ్నాప్ కి గురికావడం ప్రపంచ మంతా సంచలనం కలిగించింది. ఆ బాలికలను తీవ్రవాదులు హెచ్చరించారు. ‘యేసు క్రీస్తును మరచిపోండి. లేక పోతే మీకు ఆహారం ఇవ్వం. మీ చేత వెట్టి చాకిరి చేయిస్తాము. మాకిష్టం వచ్చిన వారికి మిమ్మల్ని ఇచ్చి పెళ్ళిచేస్తాము’ అన్నారు. 8 సంవత్సరాల తరువాత వారి పరిస్థితి ఎలా ఉంది? రచయిత పార్కిన్సన్ వారిని ఇంటర్వ్యూ చేసి ఒక పుస్తకం వ్రాశాడు. ‘క్రీస్తు కోసం శ్రమలు అనుభవిస్తామే తప్ప ఆయనను వదలిపెట్టము’ అని వీరు అన్నారు. ఆకలి, వెట్టి చాకిరి, దాస్యం, జైలు జీవితం వాటిని కూడా వీరు అనుభవిస్తున్నారు. వారి శ్రమలతో పోల్చితే మన శ్రమలు చాలా చిన్నవి. మన విశ్వాసము ఎలా ఉంది? మన నిరీక్షణ ఎలా వుంది?

సజీవుడైన క్రీస్తును జ్ఞాపకం చేసుకొని ఈ బాలికలు తమ విశ్వాసం నిలుపుకున్నారు.
ఆ తరువాత చూడండి.
నేను నేరస్థుడనై యున్నట్టు ఆ
సువార్తవిషయమై సంకెళ్లతో బంధింపబడి
శ్రమపడుచున్నాను, అయినను
దేవుని వాక్యము బంధింపబడి
యుండలేదు.
2 తిమోతి 2:9

పౌలు సంకెళ్లతో బంధింపబడి శ్రమ పడుతున్నాడు. ఆయన మాటలు మీరు గమనించండి: నన్ను సంకెళ్లతో బంధించగలరు కానీ దేవుని వాక్యం బంధించలేరు.
ఈ ప్రపంచములోని శక్తులన్నీ ఏకమైనప్పటికీ,
అంధకార శక్తులు అన్నీ ఏకమైనప్పటికీ
దేవుని వాక్యమును మాత్రం బంధించలేరు. అది సజీవమైనది. దేవుని శక్తితో నింపబడింది.
తిమోతి, ఆ వాక్యమును నీవు తెలుసుకొన్నావు. సమయమందు, అసమయమందు దాని ప్రకటించు (4:2). అది రక్షణార్థ మైన జ్ఞానము నీకు కలిగిస్తుంది. అది శక్తి కలిగింది. అది నీ జీవితమును కూడా మార్చివేస్తుంది.
నీవు ¸యౌవనేచ్ఛలనుండి పారిపొమ్ము,
పవిత్ర హృదయులై ప్రభువునకు
ప్రార్థన చేయువారితోకూడ
నీతిని విశ్వాసమును
ప్రేమను సమాధానమును
వెంటాడుము.
2 తిమోతి 2:22

పౌలు ఏమంటున్నాడంటే, చాలా మంది దేవుని వాక్యమును భరించలేక, దురద చెవులు గలవారై స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకుల వైపు వెళ్ళిపోతారు. కల్పనాకథల వైపు వెళ్ళిపోతారు. దీనిని ‘పొపులిస్ం’ అంటారు. ‘మనది ప్రజాస్వామ్య దేశం. ప్రజలకు ఏది ఇష్టమో చూడండి. అదే వారికి చెబుతాము. మనకు సమస్యలు ఉండవు’ సర్వే లు ఏమని చెబుతున్నాయి? ఒపీనియన్ పోల్స్ ఏమని చెబుతున్నాయి? ఎన్నికల్లో ఎవరు గెలుస్తున్నారు? వాటి మీద క్రైస్తవ సువార్త ఆధారపడి ఉండదు. ‘పాపులారిటీ చూసుకోవద్దు. దేవుని వాక్యమును, సత్యమును వెంబడించు అని పౌలు తిమోతి తో అన్నాడు. నన్ను మోడల్ గా చేసుకో అన్నాడు.

నీవు నా బోధను
నా ప్రవర్తనను
నా ఉద్దేశమును
నా విశ్వాసమును
నా దీర్ఘశాంతమును
నా ప్రేమను
నా ఓర్పును వెంబడించు
3:10
Remembering Jesus for the Future

చివరిగా, పౌలు తిమోతి కి ఏమని చెబుతున్నాడంటే, యేసు క్రీస్తును జ్ఞాపకం చేసుకో అది నీ భవిష్యత్తుకు కూడా మంచిది. ముందు మానవ కోణము చూడండి. పౌలు జైలులో ఉన్నాడు.
నాయొద్దకు త్వరగా వచ్చుటకు ప్రయత్నము చేయుము.
శీతకాలము రాకమునుపు నీవు వచ్చుటకు ప్రయత్నము చేయుము. ( 2 తిమోతి 4:9,21)
తిమోతి ని ‘నన్ను దర్శించు’ అని పౌలు గారు పదే పదే అడగడం ఈ
పత్రికలో మనం చూస్తున్నాము. ఆయన పొందుతున్న శ్రమలు అలాంటివి.
అయితే దేవుని కోణములో పౌలు భవిష్యత్తు గురించి ఆందోళన లేకుండా ఉన్నాడు.

క్రీస్తుయేసు, మరణమును
నిరర్థకము చేసి జీవమును
అక్షయతను సువార్తవలన
వెలుగులోనికి తెచ్చెను.
2 తిమోతి 1:10

యేసు క్రీస్తు ఇచ్చిన నిత్య జీవములోకి నేను ప్రవేశించబోతున్నాను.
నేను ఆయనకు అప్పగించినదానిని రాబోవు చున్న ఆ దినమువరకు ఆయన కాపాడగలడని రూఢిగా నమ్ముకొనుచున్నాను. 1:12
నేను వెడలిపోవు కాలము సమీపమై యున్నది.
మంచి పోరాటము పోరాడితిని,
నా పరుగు కడ ముట్టించితిని,
విశ్వాసము కాపాడుకొంటిని.
ఇకమీదట నా కొరకు నీతి
కిరీట ముంచబడియున్నది.
2 తిమోతి 4:6-8
సజీవుడైన క్రీస్తును జ్ఞాపకం చేసుకొని పౌలు భవిష్యత్తును ధైర్యముగా ఎదుర్కొన్నాడు.
మంచి పోరాటం పోరాడాను,
నా పరుగు ముగించాను
విశ్వాసం కాపాడుకొన్నాను
యేసు క్రీస్తు ప్రభువు నీతి కిరీటముతో
నన్ను ఘనపరచ బోయే రోజు
దగ్గరపడింది.

సజీవుడైన క్రీస్తు మీ జీవితములో ఉంటే, your best is yet to come.
అంత్యంత శ్రేష్టమైనవి గతములో లేవు. భవిష్యత్తులో ఉన్నాయి. your best is yet to come.మీ భవిష్యత్తు బంగారు మయముగా ఉంది ఎందుకంటే, సజీవుడైన క్రీస్తు మీ కోసం ఎదురుచూస్తున్నాడు.
‘యేసు క్రీస్తును జ్ఞాపకం చేసుకో’ అని అపోస్తలుడైన పౌలు తన ఆత్మీయ కుమారుడు తిమోతి కి చేసిన హిత బోధ ఈ రోజు మనం ధ్యానించాము.
గతంలోకి చూడు: సజీవుడైన యేసు క్రీస్తు నీకు ఇచ్చిన రక్షణ ను బట్టి సంతోషించు.
ప్రస్తుతములో: సజీవుడైన క్రీస్తు యొక్క కృప ఇచ్చే శక్తి మీద ఆధారపడి జీవించు.
భవిష్యత్తు: సజీవుడైన క్రీస్తు నమ్మకమైన తోడ్పాటు ను బట్టి నిరీక్షణ కలిగి ఉండు.
ఈ క్రొత్త సంవత్సరములో ఆ సత్యాలు మీకు ఆశీర్వాదకరముగా ఉండాలి. అదే నేటి మా ప్రేమ సందేశము.