10.God of Plurality
ప్రేమ సందేశం కార్యక్రమం చూస్తున్న సోదరీ సోదరులందరికీ మన ప్రభువైన యేసు క్రీస్తు మహిమ కలిగిన నామములో శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. దేవుని కృప యందు మీరు క్షేమముగా ఉన్నారని తలంచు చున్నాము. బైబిల్ సమాచారం కోసం మా వెబ్ సైట్ దర్శించండి. http://www.doctorpaul.org . మీరు ఈ సందేశాలు మరో సారి చూడాలంటే లేక మిస్ అయిన సందేశాలు చూడాలంటే మా యూట్యూబ్ ఛానల్ దర్శించండి. మా యూ ట్యూబ్ ఛానల్ లో అన్ని సందేశాలు అప్ లోడ్ చేసాము. మా కార్యక్రమం యాప్ మీ మొబైల్ లో డౌన్ లోడ్ చేసుకోండి. ఆ యాప్ ద్వారా మీరు మాకు మీ ప్రేయర్ రిక్వెస్ట్ లు పంపించవచ్చు. మీ జీవితాల్లో దేవుడు చేస్తున్న కార్యాలు మాతో పంచుకోవచ్చు. అందు కోసం మీ మొబైల్ లో మా యాప్ డౌన్ లోడ్ చేసుకోండి.
బైబిల్ పుస్తకాలు పరిచయం అనే అంశం మనం చూస్తున్నాము. పాత నిబంధన మొత్తం ముగించాము. ఇప్పుడు క్రొత్త నిబంధన గ్రంథం మనం ధ్యానిస్తున్నాము. ఈ రోజు రోమా పత్రికలో నుండి ఒక ప్రేమ సందేశం మీకు అందించాలని నేను ఆశపడుతున్నాను. ‘రోమా పత్రికలో కనిపిస్తున్న దేవుడు’ అనే అంశం ఈ రోజు మనం చూద్దాము. క్రొత్త నిబంధన లోని పత్రికలలో మొదటి పత్రిక రోమీయులకు వ్రాసిన పత్రిక. ఈ పత్రిక మొదటిగా మనం చదివి అర్ధం చేసుకోవాలని దేవుని ఉద్దేశ్యం. దేవుని గురించి మనం తెలుసుకోవలసిన అనేక గొప్ప సత్యాలు ఈ పత్రికలో ఉన్నాయి. ఇంతకు ముందు మనం కొన్ని విషయాలు చూశాము.
God of Preeminence: మన రక్షణ కార్యములో దేవుడు అతి ముఖ్యమైన స్థానము కలిగిఉన్నాడు.
God of Perpetuity: దేవుడు నిత్యుడైన వాడు. సకల యుగాల్లో ఉండే వాడు. ఆయన కార్యములను మనం అర్ధం చేసుకోవాలంటే ఆ సత్యం గమనించాలి.
God of Perfection: దేవుడు పరిపూర్ణుడు, ఆయన ముందు మనం అపరిపూర్ణముగా ఉన్నాము.
God of Possession: సమస్తము దేవుని ఆధిపత్యములో ఉన్నాయి.
God of Power: దేవుడు సర్వశక్తి మంతుడు. ఆయన శక్తి లేకుండా ఎవరూ రక్షణ పొందలేరు.
God of Preparation: ఎంతో ఆలోచించి దేవుడు ఒక ప్రణాళిక ప్రకారం తన కార్యములు చేస్తాడు.
God of Promise: తాను చేసిన వాగ్దానాలు, హామీలు తప్పకుండా నెరవేర్చే దేవుడు.
రక్షణ కార్యములో దేవుడు తాను ముందుగా చేసిన వాగ్దానాలు నెరవేర్చాడు
God of Perseverance: పట్టువదలని దేవుడు. తాను అనుకొన్న పనిని పూర్తి చేసే దేవుడు
God of Peace: మనతో శాంతిని కోరుకొంటున్న దేవుడు. యేసు క్రీస్తు ప్రభువు నందు దేవుడు మనతో శాంతి సంబంధం పెట్టుకొంటున్నాడు. ఈ రోజు మరికొన్ని సత్యాలు చూద్దాము.
10. God of Plurality
దేవుడు ఒక్కడే. అయితే దేవునిలో ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు. ఈ దైవిక త్రిత్వం రోమా పత్రికలో మనకు స్పష్టముగా కనిపిస్తుంది. రోమా పత్రిక 1:4-5 వచనాలు చూడండి.


4 దేవుడు తన కుమారుడును మన ప్రభువునైన యేసుక్రీస్తు విషయమైన ఆ సువార్తను పరిశుద్ధ లేఖనముల యందు తన ప్రవక్తలద్వారాముందు వాగ్దానముచేసెను.5 యేసుక్రీస్తు, శరీరమునుబట్టి దావీదు సంతానముగాను, మృతులలోనుండి పునరుత్థానుడైనందున పరిశుద్ధమైన ఆత్మనుబట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపింపబడెను. రోమా 1:4-5

ఈ పత్రిక ప్రారంభములోనే దైవిక త్రిత్వం మనలను ఏ విధముగా రక్షించారో అపోస్తలుడు వివరిస్తున్నాడు. దేవుడు తన కుమారుడైన యేసు క్రీస్తు వస్తాడు అనే విషయం తన ప్రవక్తల ద్వారా వాగ్దానం చేశాడు. యేసు క్రీస్తు సువార్త పౌలు కల్పించింది కాదు. అది క్రైస్తవ నాయకులు కల్పించింది కాదు. అది దేవుడు పాత నిబంధనలోనే వాగ్దానం చేసిన శుభవార్త.

ఈ శుభవార్త ఏమిటి? యేసు క్రీస్తు శరీరధారిగా దావీదు సంతానములో పుట్టాడు. దైవిక త్రిత్వములో తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు ఉన్నారు. తండ్రి, కుమారుడు అంటే – కుమారుడు తండ్రి లో నుండి వచ్చాడు అని కాదు. కుమారుడైన దేవుడు కూడా తండ్రి వలె నిత్యుడైన దేవుడే. ఆయన శక్తి, ఆయన ప్రేమ పరిపూర్ణమైనదే. అయితే దైవిక త్రిత్వము లోని రెండవ వ్యక్తి మానవ రూపములో జన్మించాడు కాబట్టి ఆయనకు కుమారుడు అనే పేరు వచ్చింది. దైవిక త్రిత్వము లో ఎంతో పరిపూర్ణమైన, అపురూపమైన ప్రేమ బంధం ఉంది. ఆ ముగ్గురు వ్యక్తులు ఒకరిని ఒకరు ఎంతో ప్రేమించుకోవటం, ఒకరిని ఒకరు ఎంతో గౌరవించుకోవటం, ఒకరికి ఒకరు సేవ చేసుకోవడం, ఒకరి పట్ల ఒకరు తగ్గించుకోవడం, ఒకరికి ఒకరు సహకరించుకోవడం బైబిల్ లో అనేకసార్లు మనకు కనిపిస్తుంది. సృష్టికార్యములో ముగ్గురు వ్యక్తులు కలిసి పనిచేశారు. ఇశ్రాయేలు చరిత్రలో ముగ్గురు వ్యక్తులు కలిసి పనిచేశారు. ఇప్పుడు యేసు క్రీస్తు సువార్త లో కూడా ముగ్గురు వ్యక్తులు కలిసి పనిచేస్తున్నారు. యేసు క్రీస్తు సువార్త కోల్పోయిన సంబంధాలను తిరిగి పునరుద్ధరించేది. మనిషితో దేవుడు సంబంధం కోల్పోయాడు. ఆ సంబంధం తిరిగి పునరుద్ధరించడానికి దేవుడు నిర్ణయించుకున్నాడు. దైవిక త్రిత్వము లోని ముగ్గురు వ్యక్తులు ఆ పనిలో కలిసి పనిచేయడం యేసు క్రీస్తు సువార్తలో కనిపించే అపురూపమైన దృశ్యం. 5 యేసుక్రీస్తు, శరీరమునుబట్టి దావీదు సంతానముగా పుట్టాడు అని పౌలు ఇక్కడ వ్రాశాడు. దైవిక త్రిత్వము లోని రెండవ వ్యక్తి యేసు క్రీస్తు ప్రభువుగా దావీదు వంశములో పుట్టాడు. రెండవ కీర్తనలో మనం చదువుతాము
నీవు నా కుమారుడవు.నేడు నిన్ను కనియున్నాను. కీర్తన 2:7

ఆ మాటలు యేసు క్రీస్తు జన్మ గురించే. ఆ తరువాత మాటలు మీరు గమనించండి: యేసు క్రీస్తు మృతులలోనుండి పునరుత్థానుడైనందున పరిశుద్ధమైన ఆత్మనుబట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపింపబడెను.యేసు క్రీస్తు దేవుని కుమారుడు అని ఎలా నిరూపించబడింది? ఆయన మృతులలో నుండి తిరిగి లేచాడు కాబట్టి.
పరిశుద్ధమైన ఆత్మనుబట్టి… యేసు క్రీస్తు తిరిగి లేచాడు. ఇక్కడ దైవిక త్రిత్వము లోని మూడవ వ్యక్తి మనకు కనిపిస్తున్నాడు. ఆయన పరిశుద్ధాత్ముడు. పరిశుద్దాత్ముడు యేసు క్రీస్తు జీవితములో ఎంతో ముఖ్య పాత్ర పోషించాడు.
కన్య మరియ గర్భము దాల్చింది పరిశుద్దాత్మ వలనే.
యేసు క్రీస్తు సాతాను శోధనలు ఎదుర్కొంది పరిశుద్ధాత్మ వలనే.
యేసు క్రీస్తు అనేక అద్భుత కార్యాలు చేసింది పరిశుద్ధాత్మ వలనే.
యేసు క్రీస్తు మరణం నుండి తిరిగి లేచింది పరిశుద్ధాత్మ వలనే.
యేసు క్రీస్తు దేవుని కుమారుడు, మనుష్య కుమారుడు. పరిపూర్ణముగా దేవుడు,పరిపూర్ణముగా మానవుడు. ఆ విధముగా క్రైస్తవ సువార్తలో త్రియేక దేవుని సమైక్య పరిచర్య మనకు కనిపిస్తుంది. వారి మధ్య లో కనిపించే చక్కని అనుబంధము మానవ సంభందాల్లో కూడా వుంటే ఎంతో మంచిది. మనకు అనేక సంబంధాలు ఉంటాయి. భార్య భర్తలు,తండ్రి పిల్లలు, తల్లి పిల్లలు,అన్నదమ్ములు,అక్క చెల్లెల్లు,తాత మనుమళ్ళు,స్నేహితులు,బంధువులు,యజమాని ఉద్యోగులు,ప్రభుత్వ అధినేతలు – వారు పాలించే వారు ఈ సంబంధాలన్నిటిలో త్రియేక దేవుని ఆదర్శముగా ఉంటే, మన ప్రపంచము ఎంతో బాగుంటుంది. మనం పెట్టుకొనే ప్రతి సంబంధానికి ఆదర్శం దేవుడే. He is a God of Plurality
11.God of Progress
ఆ తరువాత He is a God of Progress. నిజమైన ప్రోగ్రెస్ దేవుని వలనే వస్తుంది. అది వ్యక్తిగత వికాసం కావచ్చు లేక సామాజిక వికాసం కావచ్చు – అవి దేవుని వలన మాత్రమే వస్తాయి. ఈ రోజు మన ప్రపంచములో ఉన్న ఒక నమ్మకం ఏమిటంటే, దేవుడు లేకుండా మనం ప్రగతి సాధించగలం. ప్రజలు దేవుని మీద నమ్మకం కోల్పోతే మన సమాజములో ప్రగతి వస్తుంది అని చాలా మంది మేధావులు అంటూ వుంటారు. అయితే రోమా పత్రిక మొదటి అధ్యాయము చూడండి. మనుష్యులు దేవునికి దూరముగా వెళ్లి పోయినప్పుడు వారు చెడిపోతారే కానీ బాగుపడరు అని అపోస్తలుడు అయిన పౌలు గారు వ్రాశాడు. వారు సృష్టికర్తకు ప్రతిగా సృష్టములను పూజిస్తారు. తుచ్ఛమైన అభిలాషలకు వారు లొంగిపోతారు. వారి శరీరాలను అపవిత్రం చేసుకొంటారు. భ్రష్టమైన మనస్సు పొందుతారు.దుర్నీతి, దుష్టత్వం, లోభం, ఈర్ష్య, మత్సరం, నరహత్య, కలహం, కపటం, తల్లిదండ్రులకు అవిధేయులయిపోతారు
3 అధ్యాయము కూడా చూడండి.
మనుష్యులు దేవునికి దూరముగా వెళ్ళిపోతే వారు పలికి మాలిన వారు అయిపోతారు. వారి నోరు తెరచిన సమాధి. మోసము, శాపం, పగ వారి మాటల్లో ఉంటుంది.వారి పాదములు రక్తము చిందించుటకు పరిగెడుతాయి.శాంతి మార్గము వారికి కనిపించదు.
రోమా 3:10-18
ఆ విధముగా దేవునికి దూరముగా వెళ్లే కొద్దీ సమాజం పాడైపోతుందే కానీ బాగుపడదు అని అపోస్తలుడైన పౌలు 2 వేల సంవత్సరాల క్రితమే రాశాడు. 12,13 అధ్యాయములు చూడండి. దేవుని యొద్దకు వచ్చే వారు నిరీక్షణతో జీవిస్తారు, దేవుని ఆనందం వారిలో ఉంటుంది. వారు దీవిస్తారే కానీ శపింపరు. వారు సమాధానముతో జీవిస్తారు. పగ తీర్చుకోకుండా క్షమిస్తారు, కీడు చేయడం వారిలో కనిపించదు. వారు తమ శరీరములను దేవుని మహిమ కొరకు సమర్పిస్తారు. అల్లరితో కూడిన ఆటపాటలు, మత్తు, కామ విలాసములు, పోకిరి చేష్టలు, కలహము, మత్సరం వారిలో కనిపించవు. పన్నులు చెల్లిస్తారు , ప్రేమతో జీవిస్తారు. He is a God of Progress. నిజమైన ప్రగతి దేవుని వలనే వస్తుంది.
12.God of Perdition
ఆ తరువాత He is a God of Perdition. He is a God of Perdition.దేవుడు ఉగ్రత చూపించే వాడు.

రోమా 1:18
దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుష్యులయొక్క సమస్త భక్తిహీనత మీదను, దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకమునుండి బయలుపరచబడుచున్నది.ఆ మాటలు మనం జాగ్రత్తగా గమనించాలి. దేవుని కోపం గురించి పౌలు మనలను హెచ్చరిస్తున్నాడు. ఈ రోజుల్లో దేవుని కోపం గురించి, దేవుని తీర్పు గురించి, నరకం గురించి, నిత్య దండన గురించి మాట్లాడడం అంత పాపులర్ కాదు. ‘దేవుని ప్రేమ గురించి చెప్పు చాలు. నరకం గురించి మాట్లాడొద్దు’ అనే వారే ఎక్కువగా ఉంటారు. అయితే పౌలు ఈ పత్రికలో దేవుని కోపం గురించి వివరముగా ప్రస్తావించాడు. యేసు క్రీస్తు ప్రభువు కూడా దేవుని ఉగ్రత గురించి, తీర్పు గురించి, నరకం గురించి అనేకసార్లు మనలను హెచ్చరించాడు. బైబిల్ లో అందరికంటే ఎక్కువగా నరకంగురించి బోధించింది యేసు క్రీస్తు ప్రభువే. అందువలన, ‘నరకం లేదు అనడం యేసు క్రీస్తును అబద్ధికునిగా చేయడమే. పాప క్షమాపణ పొందిన వారిని రక్షిస్తున్న దేవుడే దానిని పొందని వారిని కఠినముగా శిక్షిస్తున్నాడు.


నోవహు కుటుంబాన్ని దేవుడు రక్షించాడు. అయితే జలప్రళయములో నోవహు కుటుంబం మినిహాయించి మిగిలిన వారి నందరినీ దేవుడు భూమి మీద నుండి తుడిచిపెట్టాడు. దేవుడు లోతు కుటుంబాన్ని రక్షించాడు. సొదొమ, గొమొఱ్ఱా రెండు నగరాల్లోని ప్రజలందరినీ అగ్ని గంధకముల చేత కాల్చివేశాడు. దేవుడు మోషేను, ఇశ్రాయేలీయులను ఐగుప్తు నుండి రక్షించాడు. ఫరో ని, ఐగుప్తీయులను శిక్షించాడు. అతని సేనలను ఎఱ్ఱ సముద్రములో కల్పివేసాడు. దేవుడు రాహాబు ను, ఆమె ఇంటి వారిని రక్షించాడు. యెరికో పట్టణములో మిగిలిన వారిని హతం చేశాడు. కొంత మందిని రక్షించాడు, కొంత మందిని శిక్షించాడు. మీరు ఏ గ్రూప్ లో వున్నారు?
శిక్షించబడే గుంపు లో ఉన్నావా? లేక రక్షించబడే గుంపులో ఉన్నావా?

పౌలు యొక్క హెచ్చరిక మనం జాగ్రత్తగా వినాలి
రోమా 1:18
దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుష్యులయొక్క సమస్త భక్తిహీనత మీదను, దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకమునుండి బయలుపరచబడుచున్నది అని ఆయన అంటున్నాడు. దేవుని కోపం నీ మీదకు వచ్చినప్పుడు నిన్ను రక్షించడానికి ఎవరూ రారు. దేవుని ఉగ్రత నుండి పాపిని రక్షించే శక్తి ఎవరికీ ఉండదు. పాపాన్ని ఎంతో ద్వేషించే ఈ పరిశుద్దుడైన దేవుని ఉగ్రత నుండి మనం ఎలా రక్షించబడతాము?
పౌలు మనకు ఒక శుభవార్త చెబుతున్నాడు.
రోమా 5:8-9
8 అయితే దేవుడు మనయెడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు; ఎట్లనగా మనమింకను పాపులమై యుండగానే క్రీస్తు మనకొరకు చనిపోయెను.9 కాబట్టి ఆయన రక్తమువలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి, మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రతనుండి రక్షింప బడుదుము. రోమా 5

యేసు క్రీస్తు నందు విశ్వాసముంచిన వారిని దేవుడు రక్షిస్తున్నాడు. యేసు క్రీస్తు రక్తము వలన నీతిమంతులుగా తీర్చబడినవారు దేవుని ఉగ్రత లో నుండి తప్పించుకొంటారు. రక్షణ పొండనివారు దేవుని ఉగ్రత కుమ్మరించబడే పాత్రలుగా ఉంటారు (రోమా 2:5)
దేవుడు అసహ్యించుకొనేది ఒక్క పాపం మాత్రమే. ఇంకా దేనిని దేవుడు అసహ్యించుకోడు. ఆయన ఉగ్రత పాపాత్ముల మీదకు దిగివస్తుంది ఎందుకంటే
He is a God of Perdition. ఆయన ఉగ్రత చూపించే దేవుడు
13.God of Paternity
A God of Paternity. దేవుడు యేసు క్రీస్తు నందు విశ్వాసముంచినవారిని తనకు పిల్లలుగా చేసుకొన్నాడు. దేవునికి మనకు ఇలాంటి సంబంధం సాధ్యమేనా? అని మనకు అనిపించవచ్చు. మనలాంటి వారు దేవుని కుమారులు ఎలా కాగలరు?

రోమా 8:15 చూడండి:
15 ఏలయనగా మరల భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదుగాని దత్తపుత్రాత్మను పొంది తిరి. ఆ ఆత్మ కలిగినవారమై మనము అబ్బా తండ్రీ అని మొఱ్ఱపెట్టుచున్నాము.దేవుడు మనకు దత్తపుత్రాత్మను ఇచ్చాడు. ఆ ఆత్మ చేత నడిపింపబడేవారందరూ దేవుని కుమారులు అయ్యారు. దేవుడు మనలను దత్తత తీసుకొన్నాడు. మనలను అడాప్ట్ చేసుకొన్నాడు. ఇప్పుడు మనం ‘అబ్బా, తండ్రీ’ అని దేవుని పిలువవచ్చు. ‘అబ్బా, తండ్రీ’ అని ‘నాయనా, తండ్రీ’ అని యేసు ప్రభువు దేవుని పిలవడం క్రొత్త నిబంధనలో మనకు కనిపిస్తుంది (మార్కు 14:36). ఈ రోజు అటువంటి యోగ్యత దేవుడు మనకు కూడా ఇచ్చాడు. ఎందుకంటే దేవుడు మనలను దత్తత తీసుకొన్నాడు.

మెఫీబోషెతు కుంటివాడు. పైసా సంపాదన లేదు. ఆయన యోనాతాను కుమారుడు. దావీదు రాజుకు మెఫీబోషెతు మీద జాలి కలిగింది. తన మిత్రుడైన యోనాతానును బట్టి మెఫీబోషెతు ను దావీదు దత్తత తీసుకొన్నాడు. అప్పటి నుండి మెఫీబోషెతు దావీదు కుమారుడు అయ్యాడు. దావీదు అంతఃపురంలో నివసించాడు. దావీదు కుటుంబములో సభ్యుడు అయ్యాడు. వారి తో కలిసి జీవించాడు. వారితో కలిసి భోజనం చేసాడు. దావీదును డాడీ అని పిలిచే యోగ్యత అతనికి కలిగింది. ‘ఎవడ్రా నీకు డాడీ, కుంటి వాడా?’ అని దావీదు ఎప్పుడూ అతని కించపరచలేదు. తన ఇతర కుమారుల వలె మెఫీబోషెతు ను కూడా ఒక కుమారునిగా చూశాడు. దేవుడు కూడా మనలను దత్తత తీసుకొన్నాడు. ఇప్పుడు మనం దేవుని కుటుంబములో చేరబడ్డాము.

దేవుని పిల్లలం అని పిలువబడ్డాము. దేవుని వారసులం అయ్యాము. దేవుని సహవాసం లో పాలివారమయ్యాము. ‘డాడీ’ అని దేవుని పిలిచే యోగ్యత మనకు లభించింది. ‘ఎవడ్రా, నీకు డాడీ, పాపాత్ముడా’ అని దేవుడు మనలను కించపరచడు. దేవుని సహవాసం మాత్రమే కాకుండా దేవుని స్వాస్థ్యము కూడా విశ్వాసులకు ఇవ్వబడింది.
17 వచనంలో ఏమంటున్నాడంటే, మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము. యేసు క్రీస్తు నందు విశ్వాసముంచినవారికి దేవుడు తన కుటుంబములో స్థానం కల్పిస్తున్నాడు. అంత మాత్రమే కాకుండా వారికి తన ఆస్థి లో కూడా భాగం ఇస్తున్నాడు. దేవుడు యేసు క్రీస్తు ప్రభువుకు ఇచ్చిన వాటన్నిటిలో ఇప్పుడు విశ్వాసులకు భాగం దొరికింది. యేసు క్రీస్తు పొందిన మహిమ, ఘనత విశ్వాసులకు కూడా దక్కుతుంది. ఈ సత్యం తెలుసుకొన్న విశ్వాసి ఈ ప్రపంచములో ఎలాంటి సమస్యలైనా ధైర్యముగా ఎదుర్కొంటాడు.

18 వచనంలో పౌలు ఏమంటున్నాడంటే మనయెడల ప్రత్యక్షము కాబోవు మహిమయెదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నతగినవి కావని యెంచు చున్నాను.ఈ రోజు మనకు ఎదురయ్యే ఎలాంటి శ్రమ అయినా చిన్నదే ఎందుకంటే దేవుని ఇంటిలో ఉన్న దేవుని కుమారులకు, కుమార్తెలకు దేవుడు గొప్ప మహిమను ఇవ్వబోతున్నాడు.
He is a God of Paternity
మనలను పిల్లలనుగా చేసుకొన్న దేవుడు. యేసు క్రీస్తు నందు మనలను క్షమించడమే కాకుండా మనలను దత్తత తీసుకొని, తన సహవాసము మనకు ఇచ్చి, మనలను తన వారసులనుగా చేసుకొని మనకు తన ఆస్థిలో భాగం ఇచ్చిన దేవుడు. ఆ దేవుని యొద్దకు వచ్చి ఆశీర్వాదము పొందాలన్నదే నేటి మా ప్రేమ సందేశం