దేవుడు చేసే స్వస్థత – మనిషి చేసే మోసం


స్వస్థతల పేరు మీద ఈ రోజు మన ప్రపంచములో ఎన్నో మోసాలు జరుగుతున్నాయి.వాటి గురించి నేటి కార్యక్రమములో చూద్దాము. ఈ మధ్యలో నేను మా హాస్పిటల్ లో కూర్చొని ఉన్నాను. జో అనే వ్యక్తి నా దగ్గరకు వచ్చాడు. అతడు చాలా నీరసముతో ఆయాసముతో బాధపడుతున్నాడు. ఒకటే నీరసం, నడవ లేకపోతున్నాను. బరువు తగ్గిపోతున్నాను. కడుపు నొప్పి. అస్తమానం బాత్ రూమ్ కి పరుగెత్తవలసి వస్తున్నది. కంటి చూపు తగ్గిపోయింది. కొన్ని రోజుల పాటు ఆహారము ముట్టుకోలేదు’ అన్నాడు. అతని పరీక్షించి కొన్ని టెస్టులు చేయడం జరిగింది. అతని బ్లడ్ షుగర్ 470 ఉంది. సాధారణముగా మన బ్లడ్ షుగర్ ఉపవాసము ఉన్నప్పుడు 100 కంటే తక్కువ గానే ఉండాలి. నేను జో తో చెప్పాను. ‘ఇదిగో జో, నీ పరిస్థితిలో ఉన్న వ్యక్తికి బ్లడ్ షుగర్ 100 కంటే తక్కువగా ఉండాలి. నీ బ్లడ్ షుగర్ 470 ఉంది. నీకు ఖచ్చితముగా డయాబెటిస్ ఉంది. నీ ఆరోగ్యం చాలా విషమముగా ఉంది. నీ బ్లడ్ షుగర్ ఇలానే పెరిగిపోతే నీవు కోమా లోకి వెళ్ళిపోతావు. నీ ప్రాణాలు కోల్పోతావు అని చెప్పాను.

నాకు డయబిటీస్ ఉన్నట్లు నాకు తెలియదు. వెంటనే ట్రీట్ మెంట్ మొదలు పెట్టండి అన్నాడు. నేను వెంటనే అతనికి ట్రీట్ మెంట్ మొదలు పెట్టాను. ఇన్సులిన్ ఇచ్చి అతని బ్లడ్ షుగర్ తగ్గించాము. అంటి బయాటిక్స్ వాడి అతని ఇన్ఫెక్షన్ నయం చేశాము. సెలైన్ ఎక్కించి అతనికి ఫ్లూయిడ్స్ ఇచ్చాము. అతడు కోలుకున్నాడు. అతడు ఇంటికి వెళ్ళేటప్పుడు అతనికి చెప్పాను. ‘నువ్వు ఇన్సులిన్ ప్రతి రోజూ తీసుకోవాలి. నీ బ్లడ్ షుగర్ కంట్రోల్ చేసుకోవాలి. లేకపోతే నీ ప్రాణాలకే ప్రమాదం అని చెప్పాను’. అతని భార్యతో కూడా నేను మాట్లాడాను. ఆమె ఏమి చెప్పిందంటే, ‘జో ఎవరి మాటా వినడండి. మీ మాట వింటున్నాడు. నాకు చాలా సంతోషం అని చెప్పింది.

జో తో మాట్లాడిన తరువాత నాకు అతని బ్యాక్ గ్రౌండ్ అర్థం అయ్యింది. అతని ఆరోగ్యం క్షీణించడం మొదలయినప్పటి నుండి అతడు ఒక బోధకుని మాటలు వినడం ప్రారంభించాడు. ‘నాకు స్వస్థతా వరం ఉంది. నేను నిన్ను స్వస్థపరుస్తాను. నీకు విశ్వాసం ఉంటే చాలు. నువ్వు ఏ మందులూ వేసుకోవలసిన అవసరం లేదు’ అని ఆ స్వస్థత బోధకుడు జోకి చెప్పాడంట. ఆయన మాటలు విని జో ఇంట్లోనే ఉన్నాడు కానీ ఎలాంటి వైద్య సహాయం తీసుకోలేదు. చివరకు కోమా లోకి వెళ్లే పరిస్థితి వచ్చిన తరువాత నా దగ్గరకు వచ్చాడు.

జో పరిస్థితి చూసి నాకు బాధ వేసింది. అతను ఒక ఎలక్ట్రికల్ ఇంజనీర్. అలాంటి వాడు కూడా ఎవరో నన్ను స్వస్థపరుస్తారు అనుకొంటూ ప్రాణాల మీదకు తెచ్చుకొన్నాడు. రెండ్రోజుల తరువాత జో నాకు ఫోన్ చేశాడు. నేను చూసే స్వస్థత బోధకుడు ఈ రోజు ఒక సభ పెడుతున్నాడు. నువ్వు కూడా వస్తావా? అని నన్ను అడిగాడు. ఆ తతంగం ఎలా ఉంటుందో చూద్దాము అని ‘నేను వస్తాలే’ అని అతనికి చెప్పాను. సాయంత్రం 7 గంటలకు బయలుదేరి ఆ స్వస్థత సభకు నేను వెళ్ళాను. జో నన్ను ఆ బోధకుని యొద్దకు తీసుకొని వెళ్ళాడు. ‘డాక్టర్ పాల్ నా ప్రాణాలు కాపాడాడు’ అని ఆ బోధకునితో చెప్పాడు. నేను ఆ బోధకునితో కాసేపు మాట్లాడాను. ఆ సభలో జో ప్రక్కనే ఉన్న కుర్చీలో నేను కూర్చుని బోధకుని ప్రసంగం విన్నాను.
ఆ బోధకుడు ఏమని బోధించాడంటే, ‘మీకు ఏ ఆరోగ్య సమస్య ఉన్నప్పటికీ నేను మిమ్ములను స్వస్థపరుస్తాను. నా దగ్గరకు రండి. నా చేయి పట్టుకోండి’ సభలో చాలా మంది ఆయన ముందు నిలబడ్డారు. ఆయన వారిని తల మీద అద్ది వెనుకకు నెట్టుతున్నాడు. వారు వెనుకకు పడుతున్నారు. ఇద్దరు వ్యక్తులు వెనుక నిలబడి వారిని పట్టుకొంటున్నారు. ఆ బోధకుడు నా వైపు చూపించి, ‘విశ్వాసం లేని వారు డాక్టర్ పాల్ దగ్గరకు వెళ్ళండి. అందరికీ విశ్వాసము ఉండదు కదా! వారి కోసమే దేవుడు హాస్పిటల్ లను, డాక్టర్ లను పెట్టాడు’ అన్నాడు. ఆ మాటలు విని నా ప్రక్కన కూర్చొని ఉన్న జో చప్పట్లు కొడుతూ ఆనందిస్తున్నాడు. ప్రాణాల మీదకు తెచ్చుకున్నావు. అయినా నీకు జ్ఞానము రాలేదా? అని అతనితో అనలేదు కానీ నా మనస్సులో అనుకొన్నాను.
అది చాలా ప్రమాదకరమైన బోధ. ఇలా ‘నాకు దేవుడు స్వస్థతావరం ఇచ్చాడు. ఎలాంటి జబ్బు అయినా నేను స్వస్థపరచగలను’ అని చెప్పుకొనే బోధకులు చాలా మంది ని నేను చూశాను. వీరి ప్రగల్భాల్లో ఎంత సత్యం ఉంది? అనే విషయం మనం చూద్దాము. ముందు మనకు జబ్బులు ఎందుకు వస్తాయి? అనే విషయం చూద్దాము. ఆదాము హవ్వలు పాపము చేసిన తరువాత ఈ ప్రపంచములో చెడు ప్రవేశించింది. మన శరీరములో ప్రతి అవయవానికి దేవుడు ఒక ప్రత్యేకమైన పని పెట్టాడు. ఏ అవయవం అయినా దాని పని సరిగ్గా చేయకపోతే మనకు రోగాలు వస్తాయి. సూక్ష్మ జీవులు అయిన బాక్టీరియా, వైరస్ లు మనకు సహాయం చేయడానికే దేవుడు సృష్టించాడు. కొన్ని బాక్టీరియా లు లేకుండా మన శరీరం సరిగ్గా పని చేయదు. అయితే ఈ లోకములో పాపం, మరణం ప్రవేశించిన తరువాత అంటే ఆదాము పతనం తరువాత ప్రకృతి లో సమతుల్యత లోపించింది. వాతావరణం లో మార్పుల వలన, జీన్స్ లో మార్పుల వలన, ఆహార అలవాట్లు మారడం వలన అనేక రోగాలు పుట్టుకొచ్చాయి. ప్రస్తుత ప్రపంచం ఇంకా పతనా వస్థ లోనే ఉంది. రోగాలు రాకుండా మనం ఆపలేము. వృద్దాప్యం రాకుండా మనం ఆపలేము. మరణం రాకుండా మనం ఆపలేము.



ప్రతి రోగం మనకు శారీరక, మానసిక బాధ కలిగిస్తుంది. మా నాన్నకు గుండె జబ్బు వచ్చినప్పుడు, ఆ తరువాత కాన్సర్ వచ్చినప్పుడు నేను ఆయన పడిన బాధ చూశాను. ఆయనతో చివరి సారిగా మాట్లాడినప్పుడు గాలి కూడా పీల్చలేని స్థితిలో ఆయన ఉన్నాడు. మన చుట్టూ ఎంతో ఆక్సిజన్ ఉంటుంది. కానీ దానిని పీల్చడానికి మన శరీరం సహకరించదు. అది ఎంత దురవస్థ! మా అమ్మ కాన్సర్ తో బాధపడుతున్నప్పుడు మంచం మీద నుండి లేచి కూర్చునే శక్తి కూడా ఆమెకు లేదు. ప్రతి జబ్బు మనలను శారీరకముగా, మానసికముగా వేధిస్తుంది. జబ్బులతో బాధపడే వారికి మనం చేతనంత సహాయం చేయాలి. వారిని హాస్పిటల్ లో దర్శించాలి. వారికి సేవ చేయాలి. మందులు వేయాలి. ఇంజెక్షనులు వేయాలి. నర్సింగ్ పనులు చేయాలి.



రోగులకు దేవుని ప్రేమ చూపించడానికి క్రైస్తవులు ప్రపంచవ్యాప్తముగా ఎన్నో హాస్పిటల్ లు కట్టారు. నర్సింగ్ స్కూలు లు పెట్టారు. మెడికల్ కాలేజీలు పెట్టారు. ఫార్మసీలు పెట్టారు. మందులు కనుగొన్నారు. వాక్సిన్ లు కనుగొన్నారు. వాటి వలన ఎంతో మందికి స్వస్థత కలిగింది. ఎంతో మందికి ఉపశమనం కలిగింది. దేవుడు మన ఆరోగ్యం పట్ల శ్రద్ధ కలిగిఉన్నాడు. దేవుడు అద్భుతాలు చేసి తన ప్రజలను స్వస్థపరచడం బైబిల్ లో చాలా చోట్ల మనకు కనిపిస్తుంది. ‘గుండె చెదరిన వారిని ఆయన బాగు చేయువాడు. వారి గాయములు కట్టువాడు’ (కీర్తన 147:3). స్వస్థత కోసం మనం దేవునికి ప్రార్థన చేయాలి. యిర్మీయా గ్రంథం 17:14 ‘యెహోవా, నీవు నన్ను స్వస్థపరచుము.
నేను స్వస్థత నొందుదును’
యిర్మీయా గ్రంథం 17:14


విశ్వాసి ఇక్కడ దేవుని ప్రార్ధించడం మనకు కనిపిస్తుంది. ‘యెహోవా, నీవు నన్ను స్వస్థపరచుము. నేను స్వస్థత నొందుదును’ దేవునికి ఉన్న ఒక గొప్ప పేరు యెహోవా రాఫా అంటే దేవుడు స్వస్థపరచేవాడు అని అర్థం (నిర్గమ 15:26) ఈ రోజు మనం కూడా ఏదైనా అనారోగ్యం, లేదా పెద్ద జబ్బు వచ్చినప్పుడు దేవుని ప్రార్ధించాలి. వైద్య సహాయం కూడా తీసుకోవాలి. డాక్టర్ లు వారికి చేతనంత సహాయం చేస్తారు. దేవుడు తన చిత్తాన్ని బట్టి డాక్టర్ లు చేయలేనిది కూడా చేయడం అనేక సార్లు రుజువు అయ్యింది. అంతే కానీ విశ్వాసము లేని వారు మాత్రమే డాక్టర్ ల దగ్గరకు వెళ్ళండి. విశ్వాసం ఉన్న వారు నా దగ్గరకు వచ్చి స్వస్థత పొందండి అని చెప్పడం తప్పు.

నాకు స్వస్థతా వరం ఉంది అని చెప్పుకొనే ప్రతి బోధకుడు డాక్టర్ ల దగ్గరకు వెళ్లి చూపించుకొంటాడు. ‘నేను అపోస్తలుడను. నాకు స్వస్థత వరం ఉంది’ అని చెప్పుకొనే వారు ఉన్నారు. దేవుడు అపోస్తలులకు స్వస్థతా వరం ఇచ్చిన మాట వాస్తవమే. బైబిల్ లో దేవుడు కొంతమందికి స్వస్థత వరం ఇవ్వడం, వారి చేత ఆశ్చర్యకరమైన రీతిలో అద్భుతాలు చేయడం మనకు కనిపిస్తుంది. అబ్రహాము గారి భార్య శారా గారికి సంతానము లేదు. ఆమె సంతాన వైఫల్యము తో బాధ పడుతున్నది. అది కూడా ఆరోగ్య సమస్యే. దేవుడు అద్భుతము చేసి ఆమెకు సంతానం ఇచ్చాడు.


యేసు ప్రభువు కుష్టు రోగులను స్వస్థపరచాడు.గుడ్డి వారిని స్వస్థపరచాడు. మూగ వారిని స్వస్థపరచాడు.పక్షవాతం కలిగిన వారిని స్వస్థపరచాడు. రక్త స్రావం కలిగిన స్త్రీలను స్వస్థపరచాడు. పేతురు గారి అత్తమ్మ ను స్వస్థ పరచాడు. స్వస్థ పరచే శక్తి యేసు ప్రభువు తన శిష్యులకు కూడా ఇచ్చాడు. అపోస్తలుల కార్యముల గ్రంథం చదివితే ఆ విషయం మనకు స్పష్టముగా అర్ధం అవుతుంది. పేతురు, యోహాను పక్షవాతము తో బాధపడుతున్న వ్యక్తిని స్వస్థపరచారు. యేసు క్రీస్తు ప్రభువు మహిమను చూసిన తరువాత సౌలుకు గుడ్డి తనం కలిగింది. అననీయ ప్రార్థన చేసి సౌలుకు దృష్టి కలిగించాడు. ఆ తరువాత సౌలు అపోస్తలుడైన పౌలు గా లెక్కలేనన్ని స్వస్థత కార్యాలు చేశాడు. మరణించిన వారిని సైతం అపోస్తలులు బ్రతికించారు.




అద్భుత కార్యాలు నాలుగు రకాలు.
- రోగాలు నయం చేయడం
- చనిపోయిన వారిని బ్రతికించడం
- దెయ్యాలు వెళ్లగొట్టడం
- ప్రకృతి ని శాసించడం
యేసు ప్రభువు నాలుగు రకాల అబ్దుతాలు చేశాడు. రోగాలు నయం చేశాడు, చనిపోయిన వారిని బ్రతికించాడు.దెయ్యాలు వెళ్ళగొట్టాడు.ప్రకృతి ని శాసించాడు. ఆయన నీటి మీద నడవడం తుఫానులు ఆపడం మనం చూస్తాము. మీరు గమనించండి. యేసు ప్రభువు అన్ని శక్తులు అపోస్తలులకు ఇవ్వలేదు. మూడు రకాలు అబ్దుతాలు మాత్రమే వారు చేయగలిగారు. పేతురు గారు, పౌలు గారు రోగాలు నయం చేశారు. చనిపోయిన వారిని బ్రతికించారు. దెయ్యాలు వెళ్లగొట్టారు కానీ ప్రకృతిని వారు శాసించలేకపోయారు. అపోస్తలుల కార్యములు 27 అధ్యాయం లో పౌలు గారు ప్రయాణిస్తున్న ఓడ పెద్ద తుఫానులో చిక్కుకుపోయింది. నావికులు అందరూ ప్రాణాపాయం లో చిక్కుకున్నారు. ఓడ బ్రద్దలయిపోయింది. అందరూ బెంబేలెత్తి పోయారు. పౌలు గారు ఆ తుఫాను ఆపలేకపోయాడు. ఆయనకు శక్తి ఉంటే ఆపేవాడే. యేసు క్రీస్తు ప్రభువు వలె తుఫానులు ఆపే శక్తి అపోస్తలులకు లేదు. అయితే మూడు రకాలయిన అబ్దుతాలు మాత్రం వారు బహిరంగముగా అందరి ముందు చేయగలిగారు. రోగాలు నయం చేశారు, మరణించిన వారిని బ్రతికించారు.దెయ్యాలను వెళ్లగొట్టారు.


అపోస్తలులకు ఇవ్వబడిన స్వస్థత వరం నేటి ప్రపంచములో ఎవ్వరికీ ఇవ్వబడలేదు. ఈ వరం మాకు ఉంది అని ప్రకటించుకునే వారిని రెండు వర్గాలుగా విభజించవచ్చు.
మొదటి వర్గం అమాయకులు: వీరు లేనిది ఊహించుకొంటారు.
రెండవ వర్గం అబద్ధికులు. వీరు తమకు ఏ వరం లేదని తెలిసినప్పటికీ ఆ వరం మాకు ఉంది అని ప్రజలను మభ్యపెడతారు. వీరు సాతాను శిష్యులే కానీ దేవుని పరిచారకులు కాదు.
ఈ రోజు మాకు స్వస్థతా వరం ఉంది, మేము అపోస్తలులం అని చెప్పుకొనే బోధకులందరినీ నేను ఛాలెంజ్ చేస్తున్నాను. నా హాస్పిటల్ కి రండి. నా దగ్గరకు వచ్చే పేషెంట్ లలో కాన్సర్ తో బాధపడే వారు ఉన్నారు. గుండె జబ్బుతో బాధపడే వారు ఉన్నారు. లివర్, కిడ్నీ సమస్యలతో బాధపడే వారు ఉన్నారు. వారిని స్వస్థపరచండి చూద్దాము. తెగిపోయిన చెవులు, చేతులు అతికించండి చూద్దాము మరణించిన వారిని తిరిగి లేపండి చూద్దాము.

మీ మధ్యలో తమిళ నాడులో ఒక కుటుంబం చనిపోయిన వ్యక్తి మృత దేహాన్ని ఇంట్లోనే పెట్టుకొన్నారు. పోలీసులు వచ్చి వారిని ఆరాతీస్తే, ‘మా బోధకుడు ప్రార్థన చేశాడు. ఈ మనిషి తిరిగి లేస్తాడు’ అని వారు పోలీసులతో చెప్పారు. కుళ్ళు పట్టి పోయిన మృతదేహం ఇంట్లోనే పెట్టుకొన్నారు. అపోస్తలులకు యేసు క్రీస్తు ప్రభువు ప్రత్యేకమైన శక్తులు ఇచ్చాడు. క్రైస్తవ సంఘం దేవుని యొద్ద నుండి వచ్చింది అని నిరూపించడానికి ఆయన వారికి ఆ వరములు ఇచ్చాడు. ఈ రోజు ఆ అవసరం లేదు. ఈ రోజు ఎవరికీ ఆ శక్తులు లేవు.
ఈ భక్తుడు జుట్టు పట్టుకో. నీ జబ్బు తగ్గిపోతుంది. ఈ యొర్దాను నది నీరు త్రాగు. నీ జబ్బు తగ్గిపోతుంది. యెరూషలేము వెళ్లితే నీకు స్వస్థత లభిస్తుంది. బెత్లెహేము నుండి తెచ్చిన మట్టి ని తాకు. నీ జబ్బు తగ్గిపోతుంది. అవన్నీ మూఢ నమ్మకాలే. పరిశుద్ధ జలం అంటూ ఏమీ లేదు. దేవుడు కూడా అందరికీ స్వస్థత ఇవ్వలేదు. 2 కొరింథీ 12 అధ్యాయములో మనం చదువుతాము. పౌలు గారికి బాధ కరమైన రోగం ఉంది. ‘ప్రభువా, నా శరీరములో ఉన్న ముళ్ళను తీసివేయి అని ఆయన మూడు సార్లు ప్రభువును వేడుకొన్నాడు. యేసు ప్రభువు పౌలు గారితో ఏమన్నాడు? ‘నా కృప నీకు చాలును. బలహీనత యందు నా శక్తి పరిపూర్ణం అగుచున్నది’
(2 కొరింథీ 12:9)

ఏంటి ప్రభువా, ఎంతో మందిని నీ పేరు మీద స్వస్థపరచాను. నన్ను నీవు స్వస్థపరచలేవా? అని పౌలు గారు యేసు ప్రభువుతో ఆర్గుమెంట్ పెట్టుకోలేదు. దేవుని చిత్తానికి లోబడి ఆ ముల్లును ఓర్చుకొన్నాడు. ఈ రోజు మనం కూడా ప్రార్థన చేయాలి. మన జబ్బులు తగ్గినా, తగ్గకపోయినా ‘నా కృప నీకు చాలు’ అనే వాగ్దానము మనం గుర్తు పెట్టుకోవాలి.
ప్రార్థన, వైద్యం పరస్పరం విరుద్ధం కాదు.
ప్రార్థన చేసుకోవాలి, వైద్యం చేయించుకోవాలి. (2 రాజులు 20:7) నేను వెళ్లిన సభలో బోధకుడు ‘అవిశ్వాసులు మాత్రమే హాస్పిటల్ కి వెళ్ళండి’ అని చెప్పాడు. అది చాలా తప్పు బోధ. వారి మాటలు విని జో లాంటి వ్యక్తులు ప్రాణాలు పోయే పరిస్థితికి వెళ్తున్నారు. ‘రోగులకే కానీ ఆరోగ్యము కల వారికి వైద్యుడు అక్కరలేదు’ అని యేసు ప్రభువు అన్నాడు. అంటే రోగులకు వైద్యుడు కావాలి అని ఆయన స్పష్టముగా చెబుతున్నాడు.

హిజ్కియా రాజుకు మరణకరమైన జబ్బు వచ్చింది. ఆయన వేదనతో దేవునికి ప్రార్ధన చేసాడు. యెషయా ప్రవక్త హిజ్కియా యొద్దకు వెళ్ళాడు. అతని పుండు మీద అంజూరపు పండ్ల ముద్ద పెట్టాడు. అప్పుడు హిజ్కియా కురుపు తగ్గిపోయి అతనికి స్వస్థత కలిగింది. యెషయా గారు హిజ్కియా కి వైద్యం చేసాడు. మంచి సమరయుని కథలో రోడ్డు ప్రక్కన గాయాలతో పడి ఉన్న వ్యక్తి ని పరామర్శించి అతని గాయాల మీద ద్రాక్షరసం పోసి జాగ్రత్తలు తీసుకోవడం మనం చూస్తాము. తిమోతి గారు ఒక జబ్బుతో బాధ పడుతున్నాడు. పౌలు గారు నీ జబ్బు కోసం ద్రాక్ష రసం తాగుతూ ఉండు అని అతనికి తన పత్రికలో వ్రాశాడు. రెండు వేల సంవత్సరాల క్రితం వారికి తెలిసిన వైద్యం అది. అంజూరపు కాయలు, ద్రాక్ష రసం, ఒలీవల నూనె మొదలగు వాటితో వారు వైద్యం చేసేవారు. అపోస్తలులు వాటిని ప్రోత్సహించడం మనం బైబిల్ లో చదువుతాము. ఈ రోజు మనకు ఎంతో శాస్త్రీయ వైద్యం లభ్యమవుతూ ఉంది. రక్త పరీక్షలు, ఎక్స్ రే లు, CT స్కాన్లు, MRI స్కాన్లు, ఆల్ట్రాసౌండ్ లు ఆంజియోప్లా స్టీలు, అవయవాలు మార్పిడి చేయడం, అనేక రకాలైన ఆంటి బయాటిక్ లు మందులు, కీమో థెరపీ, రేడియేషన్, సర్జరీలు వీటన్నిటినీ మనం ఉపయోగించుకోవాలి. దేవుడు వాటికి వ్యతిరేకం కాదు.




విశ్వాసముతో ప్రార్థన చేయడం, వైద్య సహాయం పొందడం ఆ రెండూ పరస్పరం విరుద్ధమైనవి కాదు. నేను వెళ్లిన సభలో ప్రసంగించిన బోధకుడు విశ్వాసులు నా దగ్గరకు వచ్చి స్వస్థత పొందండి. అవిశ్వాసులు హాస్పిటల్ కి వెళ్ళండి అన్నాడు. అది చాలా ప్రమాదకరమైన బోధ. జో లాంటి వ్యక్తులు అటువంటి బోధలు విని ప్రాణాల మీదకు తెచ్చుకొంటున్నారు. ఆ పొరపాటు మనం చేయకూడదు. దేవుడు మనకిచ్చిన సమయాన్ని ఆత్మల రక్షణ కోసం, సువార్త ప్రకటించడం కోసం వినియోగించడం మంచిది. విశ్వాసులకు ఆత్మ సంబంధమైన మేలు చేసే వాటి మీద ఎక్కువ సమయం కేటాయించడం మంచిది.
Brother it’s. a good message. Many Christians are still believing that god will do physical healings by prayer. They are not willing to take medicine. But your message gave clarity. May God bless you anna