ప్రభువైన యేసు క్రీస్తు: మన సర్వస్వము: డాక్టర్ పాల్ కట్టుపల్లి 

క్రొత్త నిబంధన లోని పుస్తకాలను మనం ధ్యానం చేస్తున్నాము. కొరింథీయులకు వ్రాసిన పత్రిక లో నుండి  ఈ రోజు ఒక  ప్రేమ సందేశం మీకు ఇవ్వాలని నేను ఆశపడుతున్నాను. 

మొదటి కొరింథీ పత్రిక 1:31 చదువుదాము. 

దేవుని మూలముగా యేసు క్రీస్తు మనకు జ్ఞానమును నీతియు పరిశుద్ధతయు 

విమోచనము నాయెను.

    మొదటి కొరింథీ పత్రిక 1:31 

ఆ  మాటలు మీరు గమనించండి. యేసు క్రీస్తు ప్రభువు మనకు 4 రకాలుగా ఆపాదించబడ్డాడు. ఆయన మనకు జ్ఞానము,మనకు నీతి,మనకు పరిశుద్ధత,మనకు విమోచనము. ఆ నాలుగు కలిసే వెళ్తాయి. వాటిలో నుండి మనము దేనినీ వేరుచేయలేము. 

మొదటిగా 

యేసు క్రీస్తు ప్రభువు – మనకు జ్ఞానము 

ఇప్పుడు భారత దేశములో ఎటూ చూసినా చంద్రయాన్ గురించి మాట్లాడుకొంటున్నారు. విక్రమ్ అనే లాండర్, ప్రగ్యాన్ అనే రోవర్ రెండూ చంద్రుని మీద దక్షిణ ధ్రువం మీద వాలాయి. దక్షిణ ధ్రువం మీద అడుగుపెట్టిన మొదటి దేశముగా భారత దేశం చరిత్ర సృష్టించింది. చంద్రుని మీద అడుగుపెట్టిన 4 వ దేశముగా భారత్ సంచలనం సృష్టించింది. ప్రగ్యాను చంద్రుని యొక్క చిత్రాలు మనకు పంపుతూ వుంది. చాలా కాలం చంద్రుని మీద నీరు లేదు అనుకొన్నారు. భారత దేశం పంపిన చంద్రయాన్ 1 చంద్రుని మీద నీరు ఉందని నిరూపించింది. చంద్రుని గురించిన గొప్ప సత్యాలు మనలను అందరినీ ఆశ్చర్య చకితులను చేస్తున్నాయి. 

    ఈ రోవర్   కి ప్రగ్యాన్ అని పేరు పెట్టారు. అంటే జ్ఞానం అని అర్థం. మనకు తెలియని సత్యాలు అది మనకు బోధిస్తున్నది. మనకు తెలియని సత్యాలు మనకు బోధించిన దేవుని జ్ఞానం యేసు క్రీస్తు. ఏ రోబో, ఏ సైంటిస్ట్ మనకు చెప్పలేని గొప్ప సత్యాలు ఆయన మనకు బోధించాడు. ఆయన పేరే జ్ఞానం. పరలోకములో ఏ ముంది? ఏ సైంటిస్ట్ పరలోకానికి ఒక శాటిలైట్ లేక లాండర్ ని పంపలేడు. నరకములో ఎలా ఉంటుంది? ఏ సైంటిస్ట్ నరకానికి ఒక రోవర్ పంపలేడు. దేవుని స్వభావం ఏమిటి? దేవుని కుమారుడు తప్ప ఎవరూ మనకు ఆ ప్రశ్నకు సమాధానం చెప్పలేరు. యేసు క్రీస్తు మాత్రమే వాటి గురించిన జ్ఞానం మనకు ఇవ్వగలడు.అందుకనే మనం ఆయనను ఆరాధించాలి. 

జులై 21, 1969 

    మొదటి సారిగా చంద్రుని మీద మానవులు కాలుమోపారు. నీల్ ఆర్మ్స్ట్రాంగ్, ఎడ్విన్ ఆల్డ్రిన్ గారు చంద్రుని మీద కాసేపు బైబిల్ చదివారు. రొట్టె, ద్రాక్షరసం త్రాగి ఎడ్విన్ ఆల్డ్రిన్ యేసు ప్రభువును ఆరాధించాడు. భూమి మీద అయినా, చంద్రుని మీద అయినా యేసు క్రీస్తు ప్రభువు మన ఆరాధనకు పాత్రుడు. ఆయన మన జ్ఞానం. 

    రెండవదిగా ఆయన మన నీతి. 

మనలను దేవుని ఎదుట ఉచితముగా నీతి మంతులుగా తీర్చాడు. మన స్వంత నీతి దేవుని ఎదుట మురికి గుడ్డల వలె ఉంది. అది దేవుని ఎదుట మనలను పరిపూర్ణులను చేయలేదు. నీతి ఒక ఆలోచన మాత్రమే కాదు. అది న్యాయము తో ముడిపడి ఉంది. అది చట్టం తో ముడిపడి ఉంది. మన సమాజానికి ఒక నీతి ఉంటుంది. దానిని బట్టి అది చట్టాలు చేస్తుంది. ఆ చట్టాలు అతిక్రమిస్తే మనకు శిక్ష తప్పదు. పోలీసులు ఒక వ్యక్తిని అరెస్ట్ చేస్తే ఆ వ్యక్తిని ఎందుకు అరెస్ట్ చేశారో చెప్పగలగాలి. 

నీలో నీతి లేదు, నువ్వు ఒక  లంచగొండివి. 

నీలో నీతి లేదు, నువ్వు ఒక రేపిస్ట్ వి. 

నీలో నీతి లేదు, నువ్వు ఒక దొంగవు 

నీలో నీతి లేదు, నువ్వు ఒక నరహంతకుడవు. అందుకనే నిన్ను అరెస్ట్ చేశాము. అందుకనే నీ మీద కేసులు పెట్టి ఛార్జ్ షీట్ వ్రాశాము. అందుకనే నీవు కోర్ట్ కి వచ్చి న్యాయమూర్తి ముందు నిలబడాలి. విచారించబడాలి. మనం కోర్ట్ కి వెళ్లి జడ్జి ముందు నిలబడితే, ప్రాసిక్యూటర్ ఏమంటాడు? 

  యువర్ ఆనర్, ఈ నిందితుడు నిజంగానే ఈ నేరాలు చేశాడు. నేను ఈ ఆధారాలు కోర్టు ముందు పెట్టాను. ఈ ముద్దాయిని కఠినముగా శిక్షించండి అంటాడు. అప్పుడు న్యాయమూర్తి మనకు తీర్పు తీర్చి శిక్ష విధిస్తాడు. 

ఆ విధముగా 

నీతి -న్యాయం – తీర్పు : ఈ మూడూ కలిసి వెళ్తాయి. మానవ సమాజం యొక్క నీతి లో నుండే రాజ్యాంగం, చట్ట వ్యవస్థ పుడతాయి. దేవుని నీతి లో నుండి ధర్మశాస్త్రము, దేవుని న్యాయమైన తీర్పులు పుడతాయి. దేవుని వాక్యం మనకు నీతిని బోధిస్తున్నది (2 తిమోతి 3:16-17). దేవుని ధర్మశాస్త్రం నెరవేర్చడములో మనం విఫలం చెందాము. దేవుని న్యాయ వ్యవస్థ మనకు తీర్పు తీర్చింది. అపోస్తలులు కార్యములు 17 అధ్యాయం లో ఒక మాట చూద్దాము. 

30 ఆ అజ్ఞానకాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను; ఇప్పుడైతే అంతటను అందరును మారుమనస్సు పొందవలెనని మనుష్యులకు ఆజ్ఞాపించుచున్నాడు.31 ఎందుకనగా తాను నియమించిన మనుష్యునిచేత నీతి ననుసరించి భూలోకమునకు తీర్పుతీర్చ బోయెడి యొక దినమును నిర్ణయించి యున్నాడు. 

       మృతులలోనుండి ఆయనను లేపినందున దీని నమ్ముటకు అందరికిని ఆధారము కలుగజేసియున్నాడు.అంతటను అందరును మారుమనస్సు పొందవలెనని దేవుడు మనుష్యులకు ఆజ్ఞాపించుచున్నాడు. ఎందుకని? తాను నియమించిన మనుష్యుని చేత, అంటే యేసు క్రీస్తు ప్రభువు చేత, నీతి ననుసరించి భూలోకమునకు తీర్పుతీర్చ బోయెడి యొక దినమును నిర్ణయించి యున్నాడు. దేవుని తీర్పు వస్తుందా? దానికి ఆధారం ఏమిటి? మృతులలోనుండి ఆయనను లేపినందున దీని నమ్ముటకు అందరికిని ఆధారము కలుగజేసియున్నాడు.అవిశ్వాసులకు దేవుడు తప్పకుండా తీర్పు తీరుస్తాడు. దానికి ఆధారం ఏమిటంటే యేసు క్రీస్తు సమాధి నుండి తిరిగి లేవడమే. ఆ తీర్పు నుండి మనలను రక్షించేదెవరు? యేసు క్రీస్తు ప్రభువే. ఎందుకంటే ఆయన మనకు దేవుని నీతి అయ్యాడు. విశ్వసించు ప్రతివానికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తియై యున్నాడు.

                         రోమా 10:4 

దేవుని ధర్మశాస్త్రం మనకు నీతి ని ఇవ్వలేదు (గలతీ 2:21) దేవుని ధర్మశాస్త్రము సంతృప్తి చెందాలి. లేకపోతే మనకు నీతి కలుగదు. దేవుని ధర్మశాస్త్రము సమాప్తి చెందాలి. లేకపోతే మనకు నీతి కలుగదు. దేవుని నీతి లో నుండి వచ్చిన ధర్మశాస్త్రాన్ని ఆయన ఒక్కడు మాత్రమే పరిపూర్ణముగా నెరవేర్చగలిగిన వాడు ఎందుకంటే ఆయనే దేవుని నీతి. ప్రకటన 19:11 11 మరియు పరలోకము తెరువబడియుండుట చూచితిని. అప్పుడిదిగో, తెల్లని గుఱ్ఱమొకటి కనబడెను. దానిమీద కూర్చుండియున్నవాడు నమ్మకమైనవాడును సత్యవంతు డును అను నామము గలవాడు. ఆయన నీతినిబట్టి విమర్శ చేయుచు యుద్ధము జరిగించుచున్నాడు. హల్లెలూయా. విశ్వసించు ప్రతివానికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రము నకు సమాప్తియై ఉన్నాడు. 

2 కొరింథీ 5:21 కూడా చూడండి. 

ఎందుకనగా మనమాయనయందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మనకోసము పాపముగా చేసెను.

                 2 కొరింథీ 5:21

మనలను ఎదుట నీతి మంతులుగా చేయడానికి పాపము లేని మన రక్షకుడు పాపముగా చేయబడ్డాడు. 

యేసు క్రీస్తు – మన పరిశుద్ధత 

ఆ తరువాత యేసు క్రీస్తు మనకు పరిశుద్ధత. పరిశుద్ధత అంటే ఏమిటి? మనం జీవముతో ఉండాలంటే  గాలి పీల్చుకోవాలి. ఈ గాలి పరిపూర్ణమైనది కాదు. అందులో అనేక కాలుష్యాలు మిళితమై ఉంటాయి. పరిపూర్ణ మైన గాలి, అపరిపూర్ణమైన గాలికి మధ్య తేడా ఏమిటి? కాలుష్య మైనవి, విషపూరితమైనవి పరిపూర్ణ మైన గాలిలో ఉండవు. 

     మనం తినే ఆహారం పరిపూర్ణమైనది కాదు. పరిపూర్ణమైన ఆహారం, అపరిపూర్ణమైన ఆహారం – వాటి మధ్య తేడా ఏమిటి? మనకు హాని చేసే పదార్థాలు పూర్తిగా వేరుచేయబడినప్పుడు మన ఆహారం పరిపూర్ణమవుతుంది. మనం త్రాగే నీటిలో నుండి మనకు మేలు చేయనివి పూర్తిగా వేరుచేయబడినప్పుడు ఆ నీరు పరిపూర్ణం అవుతుంది. 

      పరిశుద్ధత మనలను అసంపూర్ణ స్థితి లో నుండి పూర్ణ స్థితిలోకి మారుస్తుంది. పాపము నుండి మనం వేరు చేయబడినప్పుడు మనకు ఈ పరిశుద్ధత వస్తుంది. పాత నిబంధనలో ఈ సత్యం మనకు స్పష్టముగా అర్ధం అవుతుంది. హెబ్రీ భాషలో ‘కేదోషిమ్’ అనే పదం వాడబడింది. బైబిల్ లో అన్నిటి కంటే ఎక్కువగా ఈ పదం మనకు లేవీయ కాండము లో కనిపిస్తుంది. ఆరు సార్లు ఈ పదం లేవీయ కాండములో మనకు కనిపిస్తుంది. (11:44; 11:45; 19:2; 20:7; 20:26; 21:6)

మీరు నాకు పరిశుద్ధులై యుండవలెను. యెహోవా అను నేను పరిశుద్ధుడను. మీరు నావారై యుండునట్లు అన్య జనులలోనుండి మిమ్మును వేరుపరచితిని. 

           లేవీయ కాండము 20:26 

నేను పరిశుద్ధుడను, మీరు కూడా పరిశుద్ధులై ఉండాలి. అందుకనే నేను మిమ్ములను అన్య జనులలో నుండి వేరు చేశాను. యేసు క్రీస్తు ప్రభువును మనం ఏ ఇతర దేవుడితో, దేవతతో కలుపకూడదు. ఆయన ప్రత్యేకమైన వాడు. యెహోవావంటి పరిశుద్ధ దేవుడు ఒకడునులేడు 1 సమూయేలు 2:2

పరిశుద్ధత వేరు చేస్తుంది. దేవుడు ఇశ్రాయేలీయులతో అన్నాడు. మీరు ఆరాధించే దేవుడు వేరు మీరు ధరించే దుస్తులు వేరుగా ఉండాలి.  

మీరు తినే ఆహారం వేరుగా ఉండాలి 

మీరు పెట్టుకొనే సంబంధాలు వేరుగా ఉండాలి 

మీ వివాహ సంబంధాలు వేరుగా ఉండాలి 

మీ లైంగిక సంబంధాలు వేరుగా ఉండాలి 

మీరు మాట్లాడే మాటలు వేరుగా ఉండాలి 

నేను ఏమి తింటే దేవునికి ఎందుకు? అనడానికి లేదు. ఏ మాంసం తినవచ్చు,ఏ మాంసం తినకూడదు – వాటి గురించి దేవుడు స్పష్టమైన ఆజ్ఞలు ఇచ్చాడు. నేను ఎవరితో తిరిగితే దేవునికి ఎందుకు? అనడానికి లేదు. లైంగిక సంభందాలు ఎవరితో బడితే వారితో పెట్టుకోవడానికి లేదు. వాటి గురించి దేవుడు స్పష్టమైన ఆజ్ఞలు ఇచ్చాడు. 

   దేవుడు వారి మధ్య ఒక ప్రత్యక్ష గుడారము వేసుకొని జీవించాడు. అందులో బయట ఒక ఆవరణం, ఒక పరిశుద్ధ మందిరం, దానిలో ఒక అతి పరిశుద్ధ స్థలం ఉన్నాయి. అతి పరి శుద్ధ స్థలములో ఒక మందసము ఉంది. దాని మీద దేవుని సన్నిధి ఉండేది. దేవుని సన్నిధిలోకి ఎవరు బడితే వాళ్ళు ఎప్పుడు బడితే అప్పుడు వెళ్ళటానికి లేదు. ఇశ్రాయేలీయులు అందరూ బయట ఉండాల్సిందే. యాజకులు మాత్రమే లోపలికి వెళ్లగలిగేవారు ఎటువంటి లోపం ఉన్నా వారికి  అందులోకి ప్రవేశం ఉండేది కాదు. దేవుని పరిశుద్ధత ప్రత్యక్ష గుడారము దగ్గర మనకు కనిపిస్తుంది. దేవుడు ఈ భూమి ఉన్నాడు, కానీ వేరుగా ఉన్నాడు. యేసు క్రీస్తు ప్రభువు కూడా ఈ లోకములో ఉన్నప్పుడు, ఆయన వేరుగా ఉన్నాడు. 

ఈ దేవుడు పరిశుద్ధుడు. ఆయన ప్రత్యక్షతలు ప్రత్యేకమైనవి. 

మండుచున్న పొదలో దేవుడు మోషే కు ప్రత్యక్షమయ్యాడు (నిర్గమ 3:1-6)

సీనాయి కొండ మీద ఒక మేఘములో దేవుడు ప్రత్యక్షమయ్యాడు (నిర్గమ 24:15-17)

ప్రత్యక్ష గుడారములో దేవుడు ప్రత్యక్షమయ్యాడు (నిర్గమ 40:34) 

పగలు మేఘ స్థంభముగా, రాత్రి అగ్ని స్థంబముగా ఇశ్రాయేలీయుల ముందు నడిచాడు (నిర్గమ 40:35-38)

యెరూషలేము లో సొలొమోను రాజు దేవుని ఆలయం నిర్మించినప్పుడు కూడా దేవుడు ఆ ఆలయములో వారికి ప్రత్యక్షమయ్యాడు (1 రాజులు 8:10-11) 

ఆ ప్రత్యక్షతలు మొత్తం తాత్కాలికమైనవే, అసంపూర్ణమైనవే. అయితే మన ప్రభువైన యేసు క్రీస్తు నందు కలిగిన దేవుని ప్రత్యక్షత శాశ్వతమైనది. సంపూర్ణమైనది. 

ఆ వాక్యము శరీరధారియై, కృపాసత్యసంపూర్ణు డుగా మనమధ్య నివసించెను 

         యోహాను 1:14 

ఇక్కడ యోహాను గారు  యేసు క్రీస్తు ప్రభువును ప్రత్యక్ష గుడారముతో పోల్చాడు. యేసు క్రీస్తు నందు ఒక్క పాపము కూడా లేదు. ఏ ఒక్క పాపము కూడా చేయ కుండా ఈ ప్రపంచములో జీవించిన ఏకైక మనిషి యేసు క్రీస్తు ఒక్కడే. ప్రత్యక్ష గుడారం దేవుని ప్రజలను ఇతరుల నుండి వేరుచేసింది. యేసు క్రీస్తు ప్రభువు చేసింది అదే. ఆయన దేవుని కొరకు తన వారిని ఈ లోకములో నుండి వేరుచేసి పరిశుద్ధ పరచాడు. యేసు క్రీస్తు పరిశుద్ధత యొక్క ఆవశ్యకతను మనకు బోధించాడు. 

హృదయ శుద్ధి గలవారు ధన్యులు. వారు దేవుని చూచెదరు 

                     మత్తయి 5:8

    పాత నిబంధనలో దేవుడు పరిశుద్ధత ను తన ప్రజలలో కోరాడు. కానీ యేసు ప్రభువు మన పాపముల కొరకు మరణించాడు కాబట్టి మనకు పరిశుద్ధత అక్కర లేదు అనుకొనే వారు ఉన్నారు. అయితే అది పొరపాటు. 

   పాత నిబంధనలో తన ప్రజలు ఇతరులకు వేరుగా ఉండాలి అని కోరుకొన్న దేవుడు, క్రొత్త నిబంధనలో కూడా తన ప్రజలు ఇతరులకు వేరుగా ఉండాలి అని కోరుకొంటున్నాడు. వేరుచేయబడుట దాని అర్థం నేను ఎవరినీ కలవను, ఎవరితో మాట్లాడను అని కాదు. పౌలు గారు మనకు బోధించాడు. మీలో జారత్వమే గాని, యే విధమైన అపవిత్రతయే గాని,లోభత్వమేగాని, వీటి పేరైనను ఎత్తకూడదు, ఇదే పరిశుద్ధులకు తగినది. కృతజ్ఞతావచనమే మీరుచ్చరింపవలెను గాని మీరు బూతులైనను, పోకిరిమాటలైనను,సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు;ఇవి మీకు తగవు.

              ఎఫెసీ 5:3-4 

వాటి పేరు కూడా ఎత్తవద్దు అని పౌలు గారు దేవుని వాక్యములో వ్రాశాడు. మనం మాట్లాడే మాటల్లో పరిశుద్ధత కనిపించాలి. 

మనం చూసే చూపుల్లో పరిశుద్ధత ఉండాలి 

మనం చెప్పుకొనే జోక్స్ లో పరిశుద్ధత ఉండాలి 

మనం చేసే పనుల్లో పరిశుద్ధత ఉండాలి 

మన క్రియలలో మనం ప్రత్యేకముగా ఉండాలి. 

మన ఆరాధనలో ప్రత్యేకత ఉండాలి (రోమా 12:1) 

రక్షించబడిన వారు  రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని 

సొత్తయిన ప్రజలుగా ఉండాలి అని దేవుని ఉద్దేశ్యం (1 పేతురు 2:9). పరిశుద్ధు లగుటకే దేవుడు మనలను పిలిచెనుగాని అపవిత్రులుగా ఉండుటకు పిలువలేదు (1 థెస్సలొనీక 4:7).  పరిశుద్ధులుగా జీవించడానికి దేవుడు మనలను పిలిచాడు (1 తిమోతి 1:9). ఆ విధముగా యేసు క్రీస్తు ప్రభువు మనకు పరిశుద్ధత. He is our Sanctification. మనలను దేవుని ఎదుట పరిశుద్ధులనుగా చేసి, ఈ లోకములో మనలను పరిశుద్ధులుగా ఉండుటకు ఆయన మనలను పిలుచుకొన్నాడు, వేరు చేశాడు. 

యేసు క్రీస్తు ప్రభువు – మన విమోచన 

ఆ తరువాత యేసు క్రీస్తు ప్రభువు మన విమోచన. యేసు క్రీస్తు ప్రభువు మనకు ‘పరిశుద్ధత’ గా ఉండాలంటే ముందుగా ఆయన మనలను విమోచించాలి. యోహాను సువార్త 8:32 లో మనం చదువుతాము. 

పాపము చేయు ప్రతివాడును పాపమునకు దాసుడు 

        యోహాను సువార్త 8:32

మనం దేవుని ఎదుట పరిశుద్ధులముగా చేయబడాలంటే పాపము యొక్క దాస్యం నుండి విడిపించబడాలి. అదే విమోచన. విమోచించడం సామాన్యమైనపని కాదు. దానికి ఎంతో శక్తి కావాలి. దానికి ఎంతో వెల చెల్లించాలి. ఒక బానిసను విడిపించాలంటే ఏమి చేయాలి? ఆ బానిస యొక్క యజమాని మీతో అనవచ్చు. నాకు 50 లక్షలు కట్టు. ఈ బానిసను నీతో తీసుకెళ్లవచ్చు. అంత వెల నేను కట్టలేను అని మీరు అనవచ్చు. లేక అంత వెల నేను కట్టగలను కానీ ఈ బానిస కొరకు అంత వెల చెల్లించడం నాకు ఇష్టం లేదు అని మీరు అనవచ్చు. ఆ బానిస యొక్క యజమాని మీ మాట వినకపోవచ్చు. ‘నువ్వు ఎంత వెల కట్టినా, ఈ బానిసను నేను నీకు ఇవ్వను, పో’ అనవచ్చు. అలాంటి సందర్భాల్లో ఆ యజమానితో పోరాడే శక్తి మీకు ఉండాలి. లేకపోతే మీరు ఆ బానిసను విడిపించలేరు. ఆ విధముగా ఒక బానిసను విడిపించాలంటే శక్తి ఉండాలి, వెల చెల్లించగలిగి ఉండాలి. పాపము క్రింద ఉన్న బానిసను విడిపించ గలిగే శక్తి ఎవరికి ఉంది? అతని కొరకు వెల చెల్లించేది ఎవరు? 

   ఇశ్రాయేలీయులు ఐగుప్తులో బానిసలుగా ఉన్నారు. ఫరో యొక్క బలమైన హస్తం క్రింద వారు నలుగుతూ ఉన్నారు. మోషే, అహరోను లు ఫరో చక్రవర్తి ని అభ్యర్ధించారు. ‘అయ్యా, మమ్ములను వెళ్లనివ్వు. మాకు స్వాతంత్రం ఇవ్వు’ వారి మాటలు విని ఫరోకు చెప్పరాని కోపం వచ్చింది. ఎక్కడికిరా వెళ్ళేది? నా క్రిందే పడి ఉండండి అన్నాడు. ఫరో చేతి క్రింద నుండి బయట పడడం ఆషామాషీ వ్యవహారం కాదు. ఆ పనిచేయడం మోషే వల్ల కాదు. అహరోను వల్ల కాదు. దేవుని యొక్క బలమైన హస్తం కావాలి. దేవుడు తన ప్రజలను తన శక్తితో విమోచించాడు. 

    వారు ఐగుప్తు దేశం వదలి వెళ్లే ముందు వారికి పస్కా పండుగ ను నియమించాడు. మనలను విమోచించడానికి దేవుడు ఎంత గొప్ప వెల చెల్లించాడో పస్కా పండుగలో మనకు కనిపిస్తుంది. వారు ఒక నిర్దోషమైన గొఱ్ఱె పిల్లను తీసుకొని దానిని చంపి, దాని రక్తమును వారి ఇంటి ద్వారము మీద పూసుకోవాలి. 

   ‘నేను ఆ రక్తమును చూసి మిమ్ములను నశింపజేయక దాటిపోయెదను’ అని దేవుడు వారితో అన్నాడు. తన ప్రజలను విమోచించడానికి దేవుడు వెల చెల్లించాడు. పస్కా పండుగలో యేసు క్రీస్తు మన విమోచనగా కనిపిస్తున్నాడు. అమూల్యమైన రక్తముచేత, అనగా నిర్దోషమును నిష్కళంకమునగు గొఱ్ఱపిల్లవంటి క్రీస్తు రక్తముచేత, విమోచింపబడితిరని మీరెరుగుదురు గదా 1 పేతురు 1:19 

ప్రభువైన యేసు క్రీస్తు – మనలను విమోచించుటకు శక్తి కలిగిన రక్షకుడు. మన కొరకు వెల చెల్లించడానికి ఇష్టపడిన రక్షకుడు. 

   గ్రీకు తత్వవేత్త ప్లేటో తన కథలో చెప్పాడు. ఒక గుహలో బంధించబడిన బానిసలుగా మనం ఉన్నాము. మనకు సూర్యుడు కనిపించడం లేదు. కేవలం ఛాయలు మాత్రమే మనం చూస్తున్నాము. మనలను ఈ చీకటి గుహలో నుండి ఎవరు విడిపిస్తారు? మనకు వేయబడిన సంకెళ్లను ఎవరు త్రుంచి వేస్తారు? దేవునికి స్తోత్రం. యేసు క్రీస్తుమనకు విమోచకుడుగా వచ్చాడు.మనలను విమోచించడానికి వచ్చాడు. సాతాను చీకటిలో నుండి దేవుని యొక్క ఆశ్చర్యకరమైన వెలుగులోనికి ఆయన మనలను పిలిచాడు (1 పేతురు 2:9) పస్కా పండుగలో గొఱ్ఱె పిల్ల అర్పించబడింది. దాని రక్తము క్రింద దాక్కుని ఇశ్రాయేలీయులు రక్షణ పొందారు. నేను ఆ రక్తమును చూచి మిమ్ములను నశింపజేయక దాటిపోయెదను అని దేవుడు ఇశ్రాయేలీయులతో అన్నాడు. మనం కూడా దేవుని గొఱ్ఱె పిల్ల యేసు క్రీస్తు రక్తము క్రిందకు వెళ్లి  దేవుని తీర్పు నుండి రక్షణ పొందాము. ఆయన రక్తం మనలను విమోచించింది. 

1 పేతురు 1:20 కూడా చూడండి.  ఆయన జగత్తు పునాది వేయబడక మునుపే నియ మింపబడెను. ఆ మాట మీరు గమనించండి. ప్రో యజ్ఞో స్మెను. అంటే దేవుని యొక్క భవిష్యత్తు జ్ఞానం.  జగత్తు పునాది వేయబడక మునుపే యేసు క్రీస్తు ప్రభువు మన విమోచకునిగా నియమించబడ్డాడు. 

   అక్కడ దేవుని జ్ఞానం మనకు కనిపిస్తుంది. “మనిషి ని నా రూపములో సృష్టిస్తాను, బాగానే ఉంది. కానీ వారు నాకు అవిధేయులై, పాపం చేస్తే నేను ఏమిచేయాలి?” అని దేవుడు ముందే ఆలోచించాడు. మన కొరకు యేసు క్రీస్తును విమోచకునిగా నియమించాడు. ఆ విధముగా మన విమోచనలో దేవుని జ్ఞానం మనకు కనిపిస్తుంది.

 దేవుని జ్ఞానం, దేవుని నీతి, దేవుని పరిశుద్ధత, దేవుని విమోచన ఈ నాలుగు కలిసే వెళ్తున్నాయి. అవి ఒక దానితో ఒకటి పెనవేసుకొని ఉన్నాయి. అవి ఒక దానిని ఒకటి ముందుకు నడిపిస్తున్నాయి. 

    దేవుని పరిశుద్ధత లేకుండా దేవుని జ్ఞానం లేదు దేవుని జ్ఞానం లేకుండా దేవుని విమోచన లేదు. యెహోవాయందు భయభక్తులు కలిగియుండుట తెలి వికి మూలము సామెతలు 1:7 

The fear of the Lord is the beginning of wisdom 

దేవునికి భయపడకపోతే మన జీవితములో పరిశుద్ధత ఉండదు. పరిశుద్ధత కావాలంటే దేవునికి భయపడాలి. దేవునికి భయపడడమే జ్ఞానము. ఆ విధముగా క్రైస్తవ జీవితములో దేవుని భయం, పరిశుద్ధత, జ్ఞానము కలిసి వెళ్లడం మనం చూస్తున్నాము. ప్రభువైన యేసు క్రీస్తు మనకు జ్ఞానం, నీతి, పరిశుద్ధత, విమోచన అయ్యాడు. దేవుని కి స్తోత్రం. 

Leave a Reply