జగన్ అవివేకం – చంద్ర బాబు అరెస్ట్ 

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో పరిస్థితులు గమనిస్తే మాజీ ముఖ్య మంత్రి చంద్ర బాబు నాయుడు గారిని అరెస్ట్ చేసే రాజ మండ్రి సెంట్రల్ జైలు లో పెట్టారు. సీమెన్స్ ప్రాజెక్టు లో అవినీతి జరిగింది అని సీఐడీ పోలీసులు ఆయన ను అరెస్ట్ చేశారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఒక సారి జర్మనీ వెళ్ళాడు. అక్కడ ఆయన సీమెన్స్ శిక్షణ కేంద్రం చూశాడు. టెక్నాలజీ లో, ఆధునిక పరిజ్ఞానం లో సీమెన్స్ కంపెనీ కి మంచి పేరుంది. భారత దేశములో కూడా నైపుణ్యం వృద్ధి చెందాలని మోడీ గారు అనేక రాష్ట్రాల్లో నైపుణ్యాభివృద్ధి ప్రాజెక్టులు ఏర్పాటు చేయాలని భావించాడు. చంద్ర బాబు నాయుడు కి టెక్నాలజీ అంటే చాలా ఇష్టం. సైబరాబాద్ నిర్మాణం, బిల్ క్లింటన్, బిల్ గేట్స్ లాంటి వారిని అక్కడకు పిలిపించడం లాంటివి చేశాడు. ఈ రోజు హైదరాబాద్ నగరానికి టెక్నాలజీ హబ్ గా పేరు వచ్చిందంటే దానికి చంద్ర బాబు కృషి ఎంతో ఉంది. గుజరాత్ లో చేపట్టిన సీమెన్స్ ప్రాజెక్టు ఆంధ్ర ప్రదేశ్ లో కూడా ఉండాలి అని చంద్ర బాబు నాయుడు కోరుకున్నాడు. 

సీమెన్స్ ప్రాజెక్టు లో అవినీతి జరిగింది అందులో చంద్ర బాబు నాయుడు కు కూడా పాత్ర ఉంది అని ముఖ్యమంత్రి జగన్ ప్రభుత్వం ఆయనను అరెస్ట్ చేసింది. అయితే నా అభిప్రాయం ఏమిటంటే చంద్ర బాబు నాయుడు ను అరెస్ట్ చేయడం అవివేకం, కక్ష పూరితం. సీమెన్స్ ప్రాజెక్టు లో అవినీతి జరిగి ఉంటే సమగ్ర విచారణ చేయాలి. సాక్షాధారాలు చూపించాలి. కేంద్ర ప్రభుత్వ సంస్థ సీబీఐ లాంటి వాటిని కూడా వినియోగించుకోవాలి. ఒక అభియోగం ఎదుర్కొంటున్న వ్యక్తి చట్టానికి దూరముగా పారిపోతాడు లేక బయట ఉంటే ఇతర వ్యక్తులకు హాని చేస్తాడు అంటేనే అతని అరెస్ట్ చేయాలి. చంద్ర బాబు నాయుడు గారు – ఆయన ఎక్కడికీ పారిపోవట్లేదు. ఆయన ఎవరి ప్రాణానికి హానికరం కాదు. అలాంటి వ్యక్తిని అరెస్ట్ చేసి జైలు లో పెట్టడం అవివేకం, అమానుషం. 

వై. యస్. వివేకానంద రెడ్డి ని దారుణముగా హతమార్చారు. ఆయనను చంపింది ఎవరో కూడా అందరికీ తెలుసు. సీబీఐ స్పష్టమైన ఆధారాలు కనుగొంది. అయితే సీబీఐ ని అడుగడుగునా ముఖ్యమంత్రి జగన్ అడ్డుకొంటూ ఉన్నాడు. obstruction of justice అని దానిని పిలుస్తున్నాము. అది కూడా నేరమే. ఒక వైపు బాబాయి హంతకులను కాపాడుకొంటూ వస్తున్న జగన్ మరొక వైపు చంద్ర బాబు నాయుడు సమాజానికి ప్రమాదకరం అనడం హాస్యాస్పదం. 

మరి జగన్ ని కూడా సీబీఐ అరెస్ట్ చేసింది కదా, 16 నెలలు జైలులో పెట్టింది కదా. అందులో చంద్ర బాబు పాత్ర ఉంది కదా అని మీరు అనవచ్చు. జగన్ ని అరెస్ట్ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఆయన యొక్క కోట్లాది రూపాయల ఆస్తులను జప్తు చేసింది సీబీఐ. జగన్ నేరాలు చేసాడు అని నమ్మింది సీబీఐ. ఆ కేసులు దర్యాప్తు జరుగకుండా అడ్డుకొంటున్నది జగన్. నేను ఏ నేరం చేయలేదు అని జగన్ నమ్మితే ఆ కేసులు ధైర్యముగా ఎదుర్కోవచ్చు. కానీ ఆయన ఆ పని చేయడం లేదు. అనేక సంవత్సరాలుగా ఆయన బెయిల్ మీద వున్నాడు. 

మరొక విషయం ఏమిటంటే, బైబిల్ బోధించేది ఏమిటంటే శత్రువులను కూడా క్షమించడం, ప్రేమించడం. యేసు ప్రభువు మీద భక్తి తో జగన్ యెరూషలేము వెళ్తూ ఉంటాడు. అయితే యేసు ప్రభువు శత్రువులను ప్రేమించాడు, క్షమించాడు. జగన్ లో ఆ లక్షణాలు మనకు కనిపించడం లేదు. తనను ఇబ్బంది పెట్టిన వారి మీద కేసులు పెట్టి వేధించడం, జైలులో పెట్టి వారిని కొట్టించడం లాంటి పనులు ఆయన చేస్తున్నాడు. వాటి వలన ఆయన క్రైస్తవ్యానికి చెడ్డ పేరు తెస్తున్నాడే కానీ మంచి పేరు తేవడం లేదు. కాబట్టి, వెంటనే చంద్ర బాబు నాయుడుని జైలులో నుండి వదలి పెట్టాలి. ఆయన మీద అనుమానాలు ఉంటే నిష్పక్షపాతముగా విచారణ చేయాలే కానీ ఆయనను వేధించాలి అని చూడకూడదు. 

Leave a Reply