
నేటి కార్యక్రమములో కృత్రిమ మేథస్సు లేక ఆర్టిఫిసియల్ ఇంటెలిజెన్స్ మీద ఒక ప్రేమ సందేశం మీకు ఇవ్వాలని నేను ఆశపడుతున్నాను. ఈ మధ్యలో ఈనాడు పత్రికలో నేను ఒక వార్త చదివాను. కృత్రిమ మేధతో మానవుడే దేవుడు. కృత్రిమ మేధ లేక ఆర్టిఫిసియల్ ఇంటెలిజెన్స్ ఇప్పుడు ప్రపంచ మంతా విస్తరిస్తున్నది. దీని వలన మానవుడే దేవుడు అనే అభిప్రాయం మన చుట్టూ పెరుగుతున్నది.


ఇజ్రాయెల్ దేశానికి చెందిన ప్రసిద్ధ రచయిత యువాళ్ నోవా హోమో డియస్: ఏ బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ టుమారో అనే పుస్తకం వ్రాశాడు. ఈ ఆర్టిఫిసియల్ ఇంటెలిజెన్స్ వాడి మనుష్యులే దేవుడిగా మారుతారు అనే అభిప్రాయం ఆ పుస్తకములో ఆయన వ్రాశాడు. చాట్ GPT సృష్టించిన సామ్ ఆల్ట్ మన్, టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్, గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ లాంటి వారు ఈ ఆర్టిఫిసియల్ ఇంటెలిజెన్స్ మానవులను మించిపోతుంది. దాని వలన సమీప భవిష్యత్తులో మానవాళికే ముప్పు కలుగుతుంది. అది మానవ జాతిని నిర్మూలించే పరిస్థితి రావచ్చు అని చెబుతున్నారు. నిజముగా అది సాధ్యమేనా? అసలు కృత్రిమ మేధ అనేది సాధ్యమేనా? ఆర్టిఫిసియల్ ఇంటెలిజెన్స్అనేది నిజముగా ఉందా? అది ప్రపంచాన్ని తన వశం చేసుకొంటుందా? మానవాళిని అది అంతం చేస్తుందా? అనే ప్రశ్నలు మన అందరికీ వస్తాయి.

1956 లో కంప్యూటర్ సైంటిస్ట్ జాన్ మెక్ కార్తీ ఈ ఆర్టిఫిసియల్ ఇంటెలిజెన్స్ అనే పదం మొదటి సారిగా వాడాడు. అప్పటి నుండి కంప్యూటర్ రంగములో గొప్ప మార్పులు వచ్చాయి. దాదాపు మనం వాడే ప్రతి వస్తువులో ఒక కంప్యూటర్ చిప్ పెట్టుకొనే స్థితికి మనం వచ్చాము. AI ఉపయోగించి ఇప్పుడు రచయితలు వ్యాసాలు వ్రాస్తున్నారు. జర్నలిస్టులు వార్తలు వ్రాస్తున్నారు, డాక్టర్ లు వ్యాధులను కనిపెడుతున్నారు. సర్జన్ లు ఆపరేషన్లు చేస్తున్నారు.

ఇంజనీర్ లు భవనాలు, బ్రిడ్జిలు నిర్మిస్తున్నారు. రాజకీయ నాయకులు ఎన్నికల ప్రణాళికలు రూపొందిస్తున్నారు. అకౌంటెంట్ లు అకౌంట్స్ వ్రాస్తున్నారు. అంతరిక్షంలోకి శాటిలైట్లు, రోవర్లు పంపిస్తున్నారు. AI వలన అనేక ఉపయోగాలు ఉన్నాయి. వాటిని ఒప్పుకోవలసినదే, సంతోషించాల్సిందే. అయితే దీని గురించి మరీ అతిగా గొప్పలు చెప్పుకోవటం కూడా తప్పే. ముందుగా మనం ఈ పరిస్థితికి ఎలా వచ్చామో అర్థం చేసుకోవాలి. ముందుగా దేవుడు మనిషిని ప్రత్యేకమైన రీతిలో సృష్టించాడు అని మనం అర్థం చేసుకోవాలి.

Darwinism gave us Materialism
దేవుడు మన స్వరూపమందు మన పోలికె చొప్పున నరులను చేయుదము. వారుసముద్రపు చేపలను ఆకాశ పక్షులను పశువులను సమస్త భూమిని భూమిమీద ప్రాకు ప్రతి జంతువునుఏలుదురుగాకనియు పలికెను.
ఆదికాండము 1:26


దేవుడు తన స్వరూపములో మానవులను సృష్టించాడు. అది దేవుడు కేవలం మానవులకు మాత్రమే ఇచ్చిన ఆధిక్యత, యోగ్యత. అంతే కాకుండా దేవుడు మనిషిని తన సృష్టికి ఒక కిరీటం గా చేశాడు. వారు ఆకాశ పక్షులను పశువులను సమస్త భూమిని భూమిమీద ప్రాకు ప్రతి జంతువును ఏలుతారు అని దేవుడు చెప్పాడు. దేవుని మాట చొప్పున మనుష్యులు ఈ సృష్టిని ఏలుతూనే ఉంటారు. ఆర్టిఫిసియల్ ఇంటెలిజెన్స్, లేక రోబోలు, సూపర్ కంప్యూటర్ లు మనిషిని తమ బానిసలుగా చేసుకొంటాయి అని అనుకోవడం అజ్ఞానం, అవివేకం. ఆధునిక ప్రపంచం ఈ పరిస్థితికి ఎలా వచ్చిందో ముందు మనం అర్థం చేసుకోవాలి.

1859 లో చార్లెస్ డార్విన్ On the origin of speciesఅనే పుస్తకం వ్రాశాడు. ఈ భూమి మీద నిర్జీవమైన వాటిలో నుండి జీవం పుట్టింది అని ఆయన వ్రాశాడు. ఆ జీవం ముందు సూక్ష జీవులుగా, ఆ తరువాత సరళ జీవులుగా, ఆ తరువాత సంక్లిష్ట జీవులుగా, జంతువులుగా చివరకు మనుష్యులుగా మారాయి అని ఆయన సిద్ధాంతీకరించాడు. జీవం పరిణామం చెందుతుంది అనే ఆలోచన సర్వత్రా వ్యాపించింది. నాలుగు సంవత్సరాల తరువాత 1863 లో శామ్యూల్ బట్లర్ అనే రచయిత Darwin among the machines మెషిన్ల మధ్య డార్విన్ అనే పుస్తకం వ్రాశాడు.


ఈ పుస్తకములో బట్లర్ ఏమని వ్రాశాడంటే, ప్రకృతిలో జీవులు పరిణామం చెందినట్లే, మెషిన్లు కూడా పరిణామం చెందుతాయి. అవి చివరకు మన వలె మారుతాయి. అంతే కాకుండా అవి మనలను కూడా మించి పోతాయి. మనల్ని అవి బానిసలుగా చేసుకొంటాయి. మనలను అంతం చేస్తాయి అని బట్లర్ వ్రాసుకొచ్చాడు. నిర్జీవ పదార్థములో నుండి చివరకు మనిషి మేధ వస్తే, మనం మాత్రం నిర్జీవమైన మెషిన్ల కు కృత్రిమ మేధ ఇవ్వలేమా అని ఆయన వాదించాడు. బైబిల్ లో దేవుడు ప్రపంచ అంతం ఎలా ఉంటుందో కొన్ని ప్రవచనాలు వ్రాశాడు. అలాగే డార్విన్ వాదులు కూడా ప్రపంచము ఎలా అంతం అవుతుందో కొన్ని ప్రవచనాలు చేశారు. వారి ప్రకారం మెషిన్లు మనిషిని అంతం చేస్తాయి.



అయితే అది పొరపాటు. బైబిల్ లో వ్రాయబడినట్లు యేసు క్రీస్తు రెండవ రాకడ జరుగుతుంది. ఏడేండ్ల శ్రమలు ప్రపంచం మీదకు వస్తాయి. క్రీస్తు విరోధి లేక AntiChrist కంప్యూటర్ రంగాన్ని కూడా తన పాప క్రియలకు ఉపయోగించుకొంటాడు. కంప్యూటర్లు, రోబో లు మనిషిని అంతం చేయడం అంటూ జరుగదు. కాబట్టి, ఆర్టిఫిసియల్ ఇంటెలిజెన్స్ పేరు మీద నేడు చాలా మంది చేస్తున్న హడావుడి వెనుక, అతివాదం వెనుక డార్వినిజం దాగివుంది అని మనం గ్రహించాలి. మెటీరియలిజం దాగి ఉంది అని మనం గ్రహించాలి. మెటీరియలిజం అంటే ఏమిటంటే, దేవుడు లేడు. ఆత్మలు లేవు. పరలోకం, నరకం లేవు. ఉన్నది ప్రకృతి, పదార్థం మాత్రమే అనే వాదం. దీని పునాదుల మీదే ఈ ఆర్టిఫిసియల్ ఇంటెలిజెన్స్ వాదం మొదలయ్యింది.



What is Intelligence?
అసలు ఈ రోబో లకు, సూపర్ కంప్యూటర్ లకు ఇంటెలిజెన్స్ ఉందా? వాటికి మేధ అనేది ఉందా? అని కూడా మనం ప్రశ్నించాలి. అసలు ఇంటెలిజెన్స్ అంటే ఏమిటి? అనే ప్రశ్నకు కూడా మనం సమాధానం చెప్పాలి. ఆ ప్రశ్న వందమందిని అడగండి. వంద రకాల జవాబులు వస్తాయి. ఆ వంద మందిలో నేను కూడా ఒకడిని. నేను ఇచ్చే నిర్వచనం ఏమిటంటే,

“Intelligence is conscious, ethical, rational, emotional,intentional, thoughtful, vocal, personal, memorable, creative, teleological, metaphysical, cosmic, and wholesome self-awareness”.
నేను ఇచ్చిన నిర్వచనం చాంతాడు అంత ఉంది. కాదనడం లేదు. కానీ అది ఇంటెలిజెన్స్ అంటే ఏమిటో మనకు తెలియజేస్తుంది.
Intelligence is Conscious
ఇంటెలిజెన్స్ మొదటి లక్షణం కాన్షస్ నెస్. దేవుడు మనిషికి ఇచ్చిన గొప్ప బహుమానం కాన్షస్ నెస్. దానిని నిర్వచించడం కష్టం కానీ అనుభవ పూర్వకముగా తెలుసుకోవడం తేలిక. మన గురించి మనం, మన చుట్టూ ఉన్న ప్రకృతి, ఇతర మనుష్యులు, జంతువులు, చెట్లు, ప్రదేశాలు, కొండలు, లోయలు వాటి ఉనికిని గుర్తించడం, వాటి గురించి ఆలోచించడం చేసింది మనుష్యులు మాత్రమే. మనుష్యులకు ఉన్న ఈ కాన్షస్ నెస్ జంతువులకు లేదు, పక్షులకు లేదు, చెట్లకు లేదు. ఇది కంప్యూటర్ లకు కూడా ఉండదు. AI కి కూడా ఉండదు. కాబట్టి, మనకు, AI కి ఉన్న ఒక ముఖ్య మైన తేడా ఏమిటంటే మనకు కాన్షస్ నెస్ ఉంటుంది. AI కి ఉండదు. తరువాత లక్షణం చూడండి.
Intelligence is Ethical
దేవుడు మనకు ఇచ్చిన కాన్షస్ నెస్ తటస్థమైనది కాదు. అది నైతిక విలువలతో కూడుకొనినది. రోమా 2:15 చూడండి.
అట్టివారి మనస్సాక్షి కూడా సాక్ష్యమిచ్చు చుండగను, వారి తలంపులు ఒక దాని మీద ఒకటి తప్పు మోయుచు లేక తప్పులేదని చెప్పుచుండగను, ధర్మశాస్త్ర సారము తమ హృదయముల యందు వ్రాయబడినట్టు చూపుచున్నారు.
రోమా 2:15

మనుష్యులకు దేవుడు మనస్సాక్షి ఇచ్చాడు. ఈ మనస్సాక్షి మనకు సాక్ష్యమిస్తుంది. అది నువ్వు చేసింది మంచి పని లేక నువ్వు చేసింది తప్పు అని మనకు చెబుతూ ఉంటుంది. దేవుని ధర్మశాస్త్ర సారము కూడా మన హృదయముల యందు వ్రాయబడింది. ఈ నైతికత లేక morality దీనిని దేవుడు ఒక్క మనుష్యులకు మాత్రమే ఇచ్చాడు. జంతువులకు, రోబోలకు, కంప్యూటర్ లకు ఇది ఉండదు. ఆ విధముగా, మనిషికి, AI కి మధ్య ఉన్న మరొక బేధం ఏమిటంటే morality. మన ఎథికల్ నేచర్. తరువాత,
Intelligence is Rational

ఇంటెలిజెన్స్ యొక్క మరొక లక్షణం రేషనాలిటీ. ‘రీసోనబుల్ గా ఉండు’అని మనం అంటూ ఉంటాము. హేతు బద్దముగా ఉండాలి. ఈ హేతువు కూడా మనిషికి దేవుడు ఇచ్చిన గొప్ప కానుక. మనిషి ఈ హేతువు ను వుపయోగించి కంప్యూటర్ ని తయారుచేశాడు. అయితే కంప్యూటర్ మనిషి వలె హేతువును వాడుకోలేదు. అలన్ టూరింగ్ ఇంగ్లాండ్ దేశానికి చెందిన గొప్ప కంప్యూటర్ సైంటిస్ట్. 1912 లో ఆయన జన్మించాడు. ఆయన తల్లిదండ్రులు మన దేశములో బ్రిటిష్ ప్రభుత్వములో పనిచేశారు. 1936 లో అలాన్ టూరింగ్ యూనివర్సల్ కంప్యూటింగ్ మెషిన్ అనే ఊహాత్మక వస్తువు గురించి వ్రాసాడు. ఆయన కర్టు గోడెల్ అనే ఒక గణిత శాస్త్రవేత్తను చూసి ప్రేరణ పొందాడు. మన సంభాషణలను మాథెమటికల్ ఈక్వేషన్స్ రూపములో చూపించవచ్చు అని గోడెల్ నిరూపించాడు. అది గొప్ప ఆలోచన. ఈ మాథెమటికల్ ఈక్వేషన్స్ ను, కొన్ని ఆదేశాలుగా మార్చి మెషిన్ లను కనుగొనవచ్చు అని అలన్ టూరింగ్ గుర్తించాడు. ఆ ఆలోచనలో నుండి వచ్చిందే కంప్యూటర్.


రెండో ప్రపంచ యుద్ధము జరుగుతున్న ప్పుడు అలాన్ టూరింగ్ రీసెర్చ్ బ్రిటిష్ వారికి ఎంతో ఉపయోగపడింది. హిట్లర్ క్రింద ఉన్న జర్మనీ సైన్యం ఎనిగ్మా మెషిన్ తయారు చేసింది. శత్రు దేశాలకు అర్థం కానీ కోడ్ లాంగ్వేజ్ లో జర్మనీ మిలిటరీ సందేశాలు పంపిస్తూ ఉండేది. ఆ కోడ్ లాంగ్వేజ్ ని బ్రేక్ చేయాలి. లేకపోతే జర్మనీ ని ఎవరూ ఓడించలేరు. మా ఎనిగ్మా మెషిన్ పంపే కోడ్ లాంగ్వేజ్ ని బ్రేక్ చేయడం ఎవడి వల్లా కాదు అని జర్మనీ వారు గొప్పలు చెప్పుకొంటూ ఉండేవారు.

ఆ సమయములో బ్రిటన్ సైన్యం అలాన్ టూరింగ్ సహాయం కోరింది. ఆయన ఏమిచేశాడంటే, ఒక శక్తిమంతమైన కంప్యూటర్ ని రూపొందించాడు. అది ప్రతి క్షణం కొన్ని కోట్ల కంబినేషన్స్ చదివేది. ఎంతో శ్రమించి అలాన్ టూరింగ్ ఎనిగ్మా మెషిన్ కోడ్ లాంగ్వేజ్ ని బ్రేక్ చేశాడు. జర్మనీ వారు రోజూ 3000 సందేశాలు పంపించుకొనేవారు. వాటన్నిటినీ చదివి అర్థం చెప్పగలిగే కంప్యూటర్ ని అలాన్ టూరింగ్ సృష్టించాడు. బ్రిటిష్ వారు యుద్ధములో గెలవడానికి అది ఎంతో ఉపయోగపడింది.




చరిత్ర కారులు ఏమంటారంటే, అలాన్ టూరింగ్ లెక్కల వలన రెండో ప్రపంచ యుద్ధం రెండు సంవత్సరాల ముందే ముగిసింది. దాదాపు కోటి నలభై లక్షల మంది ఆ యుద్ధములో చనిపోకుండా అలాన్ టూరింగ్ చేశాడు. మాథెమాటిక్స్ పవర్ అంటే అది. కంప్యూటర్ పవర్ అంటే అది. ఒక క్షణములో కొన్ని కోట్ల లెక్కలు, గణాంకాలు, కాంబి నేషన్స్ చేయగలిగే శక్తి కంప్యూటర్ కి ఉంటుంది. అది మనిషి తన హేతువును ఉపయోగించి కంప్యూటర్ ని చేయగలిగాడు. అయితే హేతువుకు కూడా ఒక పరిమితి వుంది. బెర్ట్రాండ్ రస్సెల్ అనే గణిత మేధావి మాథెమాటిక్స్ ని హేతువు మీద నిర్మిస్తాను అని బయలుదేరాడు.

క ర్టు గోడెల్ అది అసాధ్యం అని నిరూపించాడు. మాథెమాటిక్స్ ని హేతువు మీద నిర్మించలేవు, దానిని రేషనాలిటీ కి కుదించలేవు అని క ర్టు గోడెల్ నిరూపించి చూపించాడు. దీనిని ‘incompleteness theorem’ అని పిలిచారు. అంటే మాథెమాటిక్స్ కి కూడా పరిమితులు ఉన్నాయి. హేతువు కు కూడా పరిమితులు ఉన్నాయి అని అర్థం.

కంప్యూటర్ మాథెమాటిక్స్ లో నుండి వచ్చింది, హేతువులో నుండి వచ్చింది. అంటే దానికి కూడా పరిమితులు ఉన్నాయి. మనిషి హేతువు ను తన దగ్గర ఉన్న అనేక ఆయుధాల్లో ఒకటిగా వాడుకొంటాడు. కంప్యూటర్ ఆ పనిచేయలేదు. అది హేతువులో నుండి పుట్టింది, అది హేతువును అధికమించలేదు. ఆ విధముగా, ఇంటెలిజెన్స్ అంటే అది హేతుబద్దమైనది. అది కంప్యూటర్ లకు లేదు. అది మనకు AI కి మధ్య ఉన్న మరొక బేధం. ఆ తరువాత

Intelligence is Emotional
ఇంటెలిజెన్స్ కి ఉండాల్సిన మరొక లక్షణము ఎమోషన్స్. మనకు ఎమోషన్స్ ఎన్నో ఉంటాయి. ఈ భావోద్రేకాలు మన జీవితాన్ని అనుక్షణం శాసిస్తాయి. ప్రేమ, సంతోషం, శాంతి, కోపం, ద్వేషం, అసూయ, నిర్లిప్తత, దిగులు, ఒంటరి తనం, బాధ, నిరీక్షణ లేక పోవడం, సంతృప్తి, జాలి – ఇవన్నీ భావోద్రేకాలు. ఈ భావోద్రేకాలు కంప్యూటర్ లకు ఉండవు. AI కి ఉండవు.

గ్యారీ కాస్పరోవ్ అని గొప్ప చెస్ ప్లేయర్ ఉండేవాడు. ప్రపంచములోనే ఆయన గొప్ప చెస్ ప్లేయర్. 1997 లో IBM సూపర్ కంప్యూటర్ డీప్ బ్లూ చెస్ గేమ్ లో కాస్పరోవ్ ని ఓడించింది. అయితే కాస్పరోవ్ అంతటి వాడిని ఓడించాను రా అని ఆ కంప్యూటర్ సంతోషించదు. అదే విధముగా 2016 లో గూగుల్ డీప్ మైండ్ సంస్థ చేసిన ఆల్ఫా గో కంప్యూటర్ లీ సెడాల్ అనే ఛాంపియన్ ని ‘గో’ అనే చైనీస్ ఆటలో ఓడించింది. అయితే నీ మీద గెలిచాను అనే ఆనందం ఆ కంప్యూటర్ కి ఉండదు. ఓడిపోతే బాధపడదు, గెలిస్తే సంతోషపడదు.



యేల్ యూనివర్సిటీ లో Donya క్విక్ అనే కంప్యూటర్ సైంటిస్ట్ సంగీతం సృష్టించే AI ని చేసింది. గొప్ప సంగీతం AI సృష్టించగలదు అయితే ఆ సంగీతం విని అది ఒక్క క్షణం కూడా ఆనందించ దు. AI సర్జరీ చేయగలదు. కానీ పేషెంట్ బ్రతికినా, చనిపోయినా దానికి పట్టదు. ఆ విధముగా, మనిషికి, AI కి మధ్య ఉన్న బేధము ఏమిటంటే AI కి భావోద్రేకాలు ఉండవు. ఆ తరువాత

Intelligence is Intentional
మనిషి ఇంటెన్షనల్ జీవి. అంటే ఏమి చేయాలో మనం కోరుకొంటాము. మన ఎమోషన్ కి కూడా ఇంటెన్షన్ ఉంటుంది. నవ్వాలని కోరుకొని నవ్వుతాము ఏడవాలని కోరుకొని ఏడుస్తాము. కంప్యూటర్ లకు కానీ AI కి గాని ఇంటెన్షనాలిటీ ఉండదు. అవి వేటినీ కోరుకోవు. వాటికి ఏ ఉద్దేశ్యాలు ఉండవు. ఆ తరువాత
Intelligence is Thoughtful
ఇంటెలిజెన్స్ యొక్క ముఖ్య లక్షణం ఆలోచన. అది ఆలోచిస్తుంది. మన కాన్షస్ నెస్, మన నైతిక విలువలు, మన రేషనాలిటీ, మన ఎమోషన్స్, మన ఉద్దేశ్యాలు ఇవన్నీ కలిస్తేనే మన ఆలోచనలు. కంప్యూటర్ లకు ఆలోచనలు ఉండవు. మనుష్యులకు, AI కి మధ్య ఉన్న భేదాల్లో అది ఒకటి. AI ఆలోచించలేదు. ఆ తరువాత
Intelligence is Vocal

ఇంటెలిజెన్స్ యొక్క మరొక లక్షణం అది సంభాషించగలుగుతుంది. మనకు ఒక భాష ఉంటుంది. మన ఆలోచనలను, మన భావాలను మనం మాటల రూపములో వ్యక్తీకరించగలం. కంప్యూటర్ లు ఆ పనిచేయలేవు. AI మన వలె మాట్లాడలేదు. అలాన్ టూరింగ్ ఒక మాట అన్నాడు. నువ్వు ఒక రోబో తో మాట్లాడితే, అది ఒక రోబో అని నీకు అనిపించకూడదు. అంత నాచురల్ గా రోబో మాట్లాడిన రోజున వాటికి ఇంటెలిజెన్స్ ఉందని మనం ఒప్పుకోవచ్చు. దీనిని టూరింగ్ టెస్ట్ అని అన్నారు. అలాన్ టూరింగ్ ఆ మాట చెప్పి 80 సంవత్సరాలు అయి పోయింది. ఈ రోజు వరకు టూరింగ్ టెస్ట్ ఏ కంప్యూటర్ కూడా పాస్ కాలేదు. మీరు ఏ రోబో కాల్ వినినా, అది ఒక రోబో అని ఇట్టే చెప్పేయగలరు. మనిషి వలె సంభాషించే శక్తి వాటికి లేదు. ఆ తరువాత

Intelligence is Personal
మనం చాలా మంది మనుష్యులను కలుస్తాము. వారిలో కొంతమంది తో స్నేహంగా ఉంటాము. కొంతమందిని పట్టించుకోము. కొంతమందితో సాన్నిహిత్యముగా ఉంటాము. కొంతమందికి దూరముగా ఉంటాము. ఇవన్నీ మనం తీసుకొనే వ్యక్తిగత నిర్ణయాల మీద ఆధారపడి ఉంటాయి. మనం వ్యక్తులతో వ్యక్తిగత సంబంధాలు పెట్టుకొంటాము. కంప్యూటర్ లు లేక AI ఆ పని చేయలేవు. అవి వ్యక్తిగత సంబంధాలు పెట్టుకోలేవు. వాటికి మిత్రులు, శత్రువులు వుండరు. ఆ తరువాత

Intelligence is Memorable
జీవితములో మనం అనేక అనుభూతులకు లోనవుతాము. అనేక సంఘటనలు జరుగుతాయి. అనేక వ్యక్తులను మనం కలుస్తాము. అవి మన మెమరీ లేక జ్ఞాపకాల్లోకి వెళ్తాయి. కంప్యూటర్ కి ఎంతో మెమరీ ఉంటుంది. మనకు కూడా మెమరీ ఉంటుంది. అయితే మన వలె అవి మెమరీ ని వాడవు. వాడుకోలేవు. అప్పుడప్పుడు మనకు చెడు జ్ఞాపకాలు, మధుర స్మృతులు రెండూ వస్తాయి. మన మెదడు మన మెమరీ లో నుండి వేటిని బయటకు తీస్తుందో మనం చెప్పలేము. అయితే కంప్యూటర్ కి అలా కాదు. దాని మెమరీ లో చెడు జ్ఞాపకాలు, మధుర స్మృతులు అని ఉండవు. దానికి అన్నీ ఒక్కటే. ఆ విధముగా, ఇంటలిజెన్స్ అంటే అందులో అనేకమైనవి ఉన్నాయి.


Intelligence is conscious, ethical, rational, emotional, intentional, thoughtful, vocal, personal, memorable, creative, teleological, metaphysical, cosmic, and wholesome self-awareness.
ఈ రోజు కొన్ని చూశాము. మిగిలినవి వచ్చే వారం చూద్దాము. మనిషికి దేవుడు ఇచ్చిన మేధ లేదా ఇంటెలిజెన్స్ అది ఒక గొప్ప అద్భుత కార్యం. మనిషి తల క్రిందుల తపస్సు చేసినా ఆ ఇంటెలిజెన్స్ ని సృష్టించలేడు. అది దేవుడు తన గొప్ప జ్ఞానముతో మాత్రమే చేయగలిగిన కార్యము. కాబట్టి ఆర్టిఫిసియల్ ఇంటలిజెన్స్ అంటూ ఏమి లేదు. ఏ కంప్యూటర్ కి లేక రోబో కి మనిషికి ఉన్న ఇంటెలిజెన్స్ లేదు. ఎప్పటికీ రాదు. AI ని చూసి మానవుడే దేవుడు అనుకోవడం అజ్ఞానం, అవివేకం.మానవుడు ఎప్పటికీ దేవుడు కాలేడు. దీన మనస్సులతో మనం దేవుని సన్నిధికి రావాలి. రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభువును మనం నమ్మాలి. పాప క్షమాపణ పొందాలి. రక్షణ పొందాలి. అదే నేటి మా ప్రేమ సందేశం.
