ఆర్టిఫిసియల్ ఇంటెలిజెన్స్ అనేది సాధ్యమేనా?  డాక్టర్ పాల్ కట్టుపల్లి సందేశం 

    నేటి కార్యక్రమములో కృత్రిమ మేథస్సు లేక ఆర్టిఫిసియల్ ఇంటెలిజెన్స్ మీద ఒక ప్రేమ సందేశం మీకు ఇవ్వాలని నేను ఆశపడుతున్నాను. ఆర్టిఫిసియల్ ఇంటెలిజెన్స్ అనేది సాధ్యమేనా? అని మనం ఆలోచించాలి. అసలు ఇంటెలిజెన్స్ అంటే ఏమిటి? అనే ప్రశ్నకు కూడా మనం సమాధానం చెప్పుకోవాలి. దేవుడు ప్రత్యేకమైన రీతిలో మనిషిని సృష్టించాడు. ఆదికాండము 5:1 లో మనం చదువుతాము. దేవుడు ఆదామును సృజించిన దినమున దేవుని పోలికెగా అతని చేసెను. ఆ మాట మీరు గమనించండి. దేవుని పోలికగా మనిషి చేయబడ్డాడు. ఇంటెలిజెన్స్ అంటే అదే. అంటే దేవుని పోలిక. ఈ ఇంటెలిజెన్స్ కి ఉన్న లక్షణములు ఏమిటి? దానిని మనం ఎలా నిర్వచించవచ్చు? 

“Intelligence is conscious, ethical, rational, emotional,intentional, thoughtful, vocal, personal, memorable, creative, teleological, metaphysical, cosmic, and wholesome self-awareness”. మొదటి భాగములో మనం కొన్ని లక్షణాలు చూశాము. 

Intelligence is Conscious

ఇంటెలిజెన్స్ మొదటి లక్షణం కాన్షస్ నెస్. దేవుడు మనిషికి ఇచ్చిన గొప్ప బహుమానం కాన్షస్ నెస్. మనుష్యులకు ఉన్న  ఈ కాన్షస్ నెస్ జంతువులకు లేదు, పక్షులకు లేదు, చెట్లకు లేదు. ఇది కంప్యూటర్ లకు కూడా ఉండదు. AI కి కూడా ఉండదు.

Intelligence is Ethical 

మానవులు కొన్ని నైతిక నియమముల మీద ఆధారపడి జీవిస్తారు. వారికి ఒక మనస్సాక్షి ఉంటుంది. జంతువులకు, రోబోలకు, కంప్యూటర్ లకు ఇది ఉండదు. 

Intelligence is Rational 

 ఇంటెలిజెన్స్ యొక్క మరొక లక్షణం రేషనాలిటీ. ‘రీసోనబుల్ గా ఉండు’అని మనం అంటూ ఉంటాము. హేతు బద్దముగా ఉండాలి. ఈ హేతువు కూడా మనిషికి దేవుడు ఇచ్చిన గొప్ప కానుక. మనిషి ఈ హేతువు ను వుపయోగించి కంప్యూటర్ ని తయారుచేశాడు. అయితే కంప్యూటర్ మనిషి వలె హేతువును వాడుకోలేదు.

Intelligence is Emotional 

ఇంటెలిజెన్స్ కి ఉండాల్సిన మరొక లక్షణము ఎమోషన్స్. మనకు ఎమోషన్స్ ఎన్నో ఉంటాయి. ఈ భావోద్రేకాలు మన జీవితాన్ని అనుక్షణం శాసిస్తాయి. రోబో లకు ఎమోషన్స్ ఉండవు. 

Intelligence is Intentional 

మనిషి ఇంటెన్షనల్ జీవి. అంటే ఏమి చేయాలో మనం కోరుకొంటాము. మన ఎమోషన్ కి కూడా ఇంటెన్షన్ ఉంటుంది. నవ్వాలంటే నవ్వుతాముఏడవాలంటే ఏడుస్తాము. కంప్యూటర్ లకు కానీ AI కి గాని ఇంటెన్షనాలిటీ ఉండదు. అవి వేటినీ కోరుకోవు. వాటికి ఏ ఉద్దేశ్యాలు ఉండవు. 

Intelligence is Thoughtful 

ఇంటెలిజెన్స్ యొక్క ముఖ్య లక్షణం ఆలోచన. అది ఆలోచిస్తుంది. మన కాన్షస్ నెస్, మన నైతిక విలువలు, మన రేషనాలిటీ, మన ఎమోషన్స్, మన ఉద్దేశ్యాలు ఇవన్నీ కలిస్తేనే మన ఆలోచనలు. కంప్యూటర్ లకు ఆలోచనలు ఉండవు.

Intelligence is Vocal 

ఇంటెలిజెన్స్  యొక్క మరొక లక్షణం అది సంభాషించగలుగుతుంది. మనకు ఒక భాష ఉంటుంది. మన ఆలోచనలను, మన భావాలను మనం మాటల రూపములో వ్యక్తీకరించగలం. కంప్యూటర్ లు ఆ పనిచేయలేవు. AI మన వలె మాట్లాడలేదు. 

Intelligence is Personal 

మనం చాలా మంది మనుష్యులను కలుస్తాము. కానీ కొంతమంది తోనే వ్యక్తిగత సంబంధాలు పెట్టుకొంటాము. మొన్న వరల్డ్ కప్ క్రికెట్ మ్యాచ్ నేను చూస్తూ ఉన్నాను. విరాట్ కోహ్లీ ఒక చక్కటి సెంచరీ కొట్టాడు. స్టేడియం లో ఉన్న వారందరికీ బ్యాట్ చూపించి అభివాదం చేశాడు. తరువాత తన భార్య అనుష్క శర్మ వైపు చూసి నవ్వాడు. స్టేడియం లో అందరికీ ఆయన తెలుసు. వారందరితో ఆయనకు వ్యక్తిగత సంబంధం ఉండదు. ఆయన భార్యతోనే ఒక ప్రత్యేకమైన సంబంధం ఉంటుంది. మనం వ్యక్తులతో వ్యక్తిగత సంబంధాలు పెట్టుకొంటాము. కంప్యూటర్ లు లేక AI ఆ పని చేయలేవు. అవి వ్యక్తిగత సంబంధాలు పెట్టుకోలేవు. 

Intelligence is Memorable 

మనం అప్పుడప్పుడు చిన్న నాటి జ్ఞాపకాలు మధుర స్మృతులు మనకు ఉంటాయి. వాటిని అప్పుడప్పుడూ గుర్తు చేసుకొని మనం ఆస్వాదిస్తూ ఉంటాము. చేదు అనుభవాలు మరచిపోవడానికి ప్రయత్నిస్తాము. రోబో లు, కంప్యూటర్ లు ఆ పని చేయలేవు. ఏ మధుర జ్ఞాపకమో, ఏది చేదు అనుభవమో వాటికి తెలియదు. 

Intelligence is Creative 

ఇంటెలిజెన్స్ యొక్క మరొక ముఖ్య లక్షణము క్రియేటివిటీ. దేవుడు మనిషికి క్రియేటివిటీ ఇచ్చాడు. జంతువులకు మనంత క్రియేటివిటీ లేదు. బీవర్ జంతువులు డామ్స్ కడుతాయి. వాటికి కూడా కొంత క్రియేటివిటీ ఉంది. అయితే మనిషికి ఇంక ఏ జంతువుకు ఇవ్వనంత గొప్ప సృజనాత్మకత దేవుడు ఇచ్చాడు. మనుష్యులు మాత్రమే ఉత్తరాలు వ్రాయగలరు, పద్యాలు, నవలలు, పాటలు వ్రాయగలరు. పెద్ద పెద్ద ఆనకట్టలు, పెద్ద పెద్ద బ్రిడ్జిలు కట్టగలరు. 

శాటిలైట్లు పంపగలరు, GPS లాంటి వస్తువులు చేయగలరు. 

వ్యాధులను కనిపెట్టగలరు, వాక్సిన్ లు చేయగలరు. 

క్రొత్త క్రొత్త చట్టాలు వ్రాయగలరు. 

మంచి వంటలు చేయగలరు. మంచి మ్యూజిక్ వాయించగలరు. 

మ్యూజిక్ వ్రాసే రోబో లు వచ్చాయి కదా అని మీరు అనవచ్చు. అయితే అవి వ్రాసే మ్యూజిక్ క్రియేటివిటీ వల్ల పుట్టింది కాదు. ఉదాహరణకు జోసెఫ్ హేడెన్ గొప్ప సంగీత విద్వాంసుడు. చిన్న నాటినుండే ఆయన వియన్నా లో ఒక చర్చి క్వాయిర్ లో చేరాడు. అక్కడ వాయించే సంగీతం ఆనందముతో వింటూ ఉండేవాడు. 

   జార్జ్ హ్యాండిల్ వ్రాసిన మెస్సియా సంగీతం ఆయనకు ఎంతో ప్రేరణ ఇచ్చింది. ఆ స్పూర్తితో జోసెఫ్ హేడెన్ ‘క్రియేషన్’ అనే సంగీతమును రచించాడు. ఆయన వ్యక్తిత్వం, దయా గుణం, దేవుని పట్ల భక్తి, సంగీతం పట్ల ఉన్న ప్రేమ, ఇతరుల నుండి ఆయన పొందిన ప్రేరణ అవన్నీ ఆయన సంగీతములో మనకు వినిపిస్తాయి. రోబోలు ఆ విధముగా సంగీతం వ్రాయలేవు. 

    మరొక ఉదాహరణ: వంటలు చేసే రోబో ని మనం కనిపెట్టొచ్చు. అది రక రకాల వంటలు చేయగలదు. నాకు చికెన్ కర్రీ చేసి పెట్టు అని ఆ రోబో ని అడిగితే అది వంట గదిలోకి వెళ్లి ఒక పాత్ర లో ఆయిల్ వేసి మరిగించింది. ఒక కేజీ కోడి మాంసం, ఒక స్పూన్ కొత్తిమెర, ఒక స్పూన్ పసుపు, రెండు స్పూన్ లు కారం, రెండు కప్పులు నీరు, కొన్ని సుగంధ ద్రవ్యాలు అవీ, ఇవీ వేసి చికెన్ కర్రీ చేసి మన ముందు పెట్టింది. మనం తిని ‘ఈ రోబో వంట భలే ఉంది. మంచి రుచి కరముగా ఈ చికెన్ కర్రీ వండింది’ అని మనం అంటాము. అయినప్పటికీ ఆ రోబో కి క్రియేటివిటీ లేదు. అది దానిలో ఫీడ్ చేసిన ఒక రెసిపీ ని అనుకరించి ఆ కూర వండింది. సంగీతం వాయించే రోబోలు కూడా అంతే. అవి ఒక రెసిపీ అనుసరించి మంచి వీనుల విందైన సంగీత కచేరీ అవి మనకు వినిపించవచ్చు. అయితే దానికి ఎలాంటి క్రియేటివిటీ లేదు. 

     ఆల్బర్ట్ ఐన్ స్టెయిన్ గొప్ప సైంటిస్ట్. కొన్ని సార్లు ఆయనకు ఆలోచనలు కదిలేవి కావు. అప్పుడు ఆయన కాసేపు సంగీతం వాయించేవాడు. ఆ సంగీతం వాయిస్తూ ఉంటే ఆయనకు ఆలోచనలు ఎక్కడికో వెళ్లిపోయేవి. అప్పటి వరకు ప్రపంచములో ఇంకెవరికీ తట్టని గొప్ప సైంటిఫిక్ ఆలోచనలు ఆయనకు వచ్చేవి. 

   ఏ రోబో కూడా ఎవరికీ తెలియని సైన్స్ సత్యాలు మనకు చెప్పలేదు. ఎందుకంటే మనిషికి ఉన్న క్రియేటివిటీ వాటికి ఉండదు. ఆ తరువాత, 

Intelligence is Teleological 

ఇంటెలిజెన్స్ యొక్క మరొక లక్షణం టెలి యాలజి. టిలియాలజి అంటే ఒక పర్పస్. ఒక ఉద్దేశ్యం. ఒక లక్ష్యం. గ్రీకు ఫిలాసఫర్ అరిస్టాటిల్ ఏమన్నాడంటే, మనకు ఒక పర్పస్ ఉంటుంది. వ్యక్తిగతముగా, సామాజికముగా మనకు ఒక ఉద్దేశాలు ఉంటాయి. ఆ ఉద్దేశాలు నెరవేరినప్పుడు మనకు సంతృప్తి, సంతోషం కలుగుతాయి. దీనిని గ్రీకులు ‘యూడై మోనియా’ అని వారు పిలిచారు.  ‘యూడై మోనియా’: ఆత్మ సంతృప్తి. ఒక సైనికుడు హిమాలయా పర్వతాల్లో చాలా చలిలో దేశ భద్రత కోసం శ్రమిస్తూ ఉంటాడు. ‘నా దేశం కోసం ఇది చేస్తున్నాను’ అని అతను అనుకొంటాడు. ఆ శ్రమలో అతనికి ఒక పర్పస్, ఒక సంతృప్తి కలుగుతాయి. అతని ప్రాణాలు పోయే పరిస్థితి కూడా అతనికి రావచ్చు. ఆ పరిస్థితుల్లో కూడా ‘నా దేశం కోసం ఒక మంచి పని చేశాను. నా త్యాగం వృథా కాదు’ అని అతను సంతృప్తి చెందుతాడు. అదే ‘యూడై మోనియా’. 

     హిమాలయాల్లో మనం రోబో సైన్యం కూడా పెట్టవచ్చు. ఒక దేశం కోసం మంచి పని చేస్తున్నాను అని ఆ రోబో సైనికులు అనుకోరు. వాటికి టెలి యాలజి, ‘యూడై మోనియా’ రెండూ ఉండవు. ఒక రైతు తన పొలములో పంట వేసి ఎంతో శ్రమిస్తాడు. నేను పండించే ధాన్యం ఎంతో మందికి భోజనం పెడుతుంది అని అతను సంతృప్తి చెందుతాడు. రోబో రైతులకు అటువంటి సంతృప్తి ఉండదు. ఒక సర్జన్ రోగి కి ఆపరేషన్ చేసి ఒక మంచి పని చేశాను అనుకొంటాడు. రోబో సర్జన్ కి అటువంటి తృప్తి ఉండదు. ఒక న్యాయవాది కోర్టు లో వాదించి న్యాయ పోరాటం చేశాను అని తృప్తి పొందుతాడు. రోబో లాయర్ కి అటువంటి తృప్తి ఉండదు. 

    కర్రీ మేకర్ రోబో ఉందనుకోండి. అది రకరకాల వంటకాలు చేసి వండిస్తుంది. అయితే ‘నేను వండింది నలుగురు తిని సంతోషపడ్డారు’ అని అది అనుకోదు. ఆ విధముగా టెలి యాలజి, ‘యూడై మోనియా’ లు మనిషికి మాత్రమే ఉంటాయి. ఆర్టిఫిసియల్ ఇంటెలిజెన్స్ కి అవి ఉండవు. 

Intelligence is Metaphysical

తరువాత ఇంటెలిజెన్స్ మెటాఫిసికల్. అంటే రియాలిటీ. మన ఇంటెలిజెన్స్ రియాలిటీ మీద ఆధారపడి ఉంటుంది. ఏది నిజమైనది, ఏది కల్పన అని మనం ప్రశ్నిస్తాము. ఏది వాస్తవం, ఏది అవాస్తవం అని మనం విచారిస్తాము. ఇది వాస్తవం అని తెలుసుకొంటేనే దానిని మనం ప్రేమించగలం. మీకొక బిడ్డ ఉంటే, ఆ బిడ్డను మీరు ప్రేమిస్తారు. ఈ బిడ్డ నిజం, వాస్తవం, రియల్ అనుకున్నప్పుడే ఆ బిడ్డను మీరు ప్రేమించగలరు. అయితే, ఈ బిడ్డ వాస్తవం కాదు, రియల్ కాదు, ఇది రియల్ కాదు, ఇది ఒక ఇల్యూషన్, వీడు ఒక మిధ్య అనుకొంటే ఆ బిడ్డను మీరు ప్రేమించలేరు. ఏది నిజం, ఏది వాస్తవం, ఏది సత్యం అనే అన్వేషణలో మనిషి నిరంతరం జీవిస్తాడు. కంప్యూటర్ లు ఆ పని చేయలేవు. ఒక బాలున్ని అద్దం ముందు నిలబెట్టండి. అద్దములో తన రూపం చూసుకొని ఆ బాలుడు సంతోషిస్తాడు. నవ్వు కొంటాడు. పాటలు పాడుతాడు. అయితే నాలాంటి ఇంకొకడు అద్దము లోపల ఉన్నాడు అని ఆ బాలుడు అనుకోడు. నేను చూస్తున్నది నా రూపం మాత్రమే అని అతను అనుకొంటాడు.  ఆ జ్ఞానం రోబోలకు ఉండదు. నేను చూస్తున్నది నా రూపం మాత్రమే అని అవి అనుకోవు. 

   మేట్రిక్స్ సినిమాలో రోబోలు మనుష్యులను నియంత్రిస్తాయి. మనుష్యులు డ్రీమ్ లైక్ స్టేట్ లో ఉంటారు. ఏది వాస్తవమో, ఏది అవాస్తవమో ఆ రోబో లకు తెలుస్తుంది కానీ మనుష్యులకు తెలియదు. అయితే అందులో వాస్తవం లేదు. ఏది నిజం, ఏది కల అనే జ్ఞానం మనిషికి మాత్రమే ఉంటుంది. రోబోలకు, ఆర్టిఫిసియల్ ఇంటెలిజెన్స్ కు ఆ జ్ఞానం ఉండదు. 

Intelligence is Cosmic 

ఆ తరువాత Intelligence is Cosmic మనిషి యొక్క జ్ఞానం విశ్వమంత పెద్దది. మనిషి యొక్క అన్వేషణ విశ్వమంత విస్తారమైనది. ఈ విశ్వములో నా స్థానం ఏమిటి? అని మనిషి ఆలోచిస్తాడు. విశ్వ రహస్యాలు చేధించడానికి మనిషి ఎంతో శ్రమపడతాడు. అంతరిక్ష సంస్థ ఇస్రో చేస్తున్న పరిశోధనలు చూడండి. ఆదిత్య – 1 సూర్యని యొక్క లక్షణాలు తెలుసుకోవడానికి దానిని పంపారు. చంద్రయాన్ – చంద్రుని యొక్క లక్షణాలు అర్థం చేసుకోవడానికి. గగన్ యాన్ – అంతరిక్షం లోకి మనిషిని పంపే ప్రయత్నాల్లో భాగం. మనిషి ఈ విశ్వం గురించి ఎప్పుడూ ఆలోచిస్తూనే ఉంటాడు. అది దేవుడు మనుష్యులకు మాత్రమే ఇచ్చిన లక్షణం. కుక్కలు, కోతులు విశ్వం గురించి ఆలోచించవు. దేవుడు ఆదాముతో అన్నాడు. మీరు  భూమిని నిండించి దానిని లోపరచుకొనుడి. 

  ప్రకృతిని లోపరచుకోండి అని దేవుడు మనిషితో అన్నాడు. ఇది దేవుడు మనిషికి మాత్రమే ఇచ్చిన ఆధిక్యత. జంతువులకు, చెట్లకు దేవుడు ఈ ఆధిక్యత ఇవ్వలేదు. కంప్యూటర్, ఆర్టిఫిసియల్ ఇంటెలిజెన్స్, రోబో లకు కూడా ఈ ప్రపంచాన్ని లోపరచుకోవాలి అని ఉండదు. కొన్ని సినిమాల్లో జంతువులు, రోబోలు మానవ సమాజాన్ని ఓడించి, ఈ ప్రపంచాన్ని తమ చేతుల్లోకి తీసుకొన్నట్లు చూపిస్తారు. ఉదాహరణకు, ప్లానెట్ అఫ్ ది ఏప్స్ లో కోతులు మానవ సమాజం మీద గెలుస్తాయి. 

   స్టాన్లీ కుబ్రిక్ తీసిన 2001: A Space Odyssey సినిమా లో ఆర్టిఫిసియల్ ఇంటెలిజెన్స్ మనుష్యులకు ఓడిస్తుంది. ఈ ప్రపంచాన్ని శాసిస్తుంది. అయితే అవి పిచ్చి ఆలోచనలు. మనిషిని ఓడించే శక్తియుక్తులు ఏ జంతువుకూ లేవు. మనిష్యులు అంతరించిపోయినా మనిషి వలె ఈ ప్రపంచాన్ని ఏలడం ఏ జంతువుకూ సాధ్యపడదు. అదే విధముగా మనిషిని జయించే జ్ఞానం ఏ ఆర్టిఫిసియల్ ఇంటెలిజెన్స్ కీ ఉండదు. ఎందుకంటే ఈ ప్రపంచ ఆధిపత్యం దేవుడు మనిషికి మాత్రమే ఇచ్చాడు. ఈ ప్రకృతి ని లోపరచుకొనే శక్తిని, జ్ఞానాన్ని దేవుడు మనిషికి మాత్రమే ఇచ్చాడు. ఆర్టిఫిసియల్ ఇంటెలిజెన్స్ ఆ పనిచేయలేదు. 

రోమా పత్రికలో మనం ఒక మాట చదువుతాము. 

దేవుని అదృశ్య లక్షణములు, అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును, జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపడుచున్నవి

     రోమా 1:20 

ప్రకృతిని చూసి మనిషి దేవుని యొక్క శక్తిని, దేవత్వమును తెలుసుకొంటున్నాడు. ఇది మనిషికి మాత్రమే ఉన్న జ్ఞానం. మానవ సమాజం యొక్క ఆలోచనలు అందులోనుండే పుడతాయి. మనం ఒకరితో ఒకరు మాట్లాడుకొనేటప్పుడు మనం వాడే పదములకు కొన్ని అర్ధాలు ఇస్తాము. లడ్ విగ్ విట్ గెన్ స్టెయిన్ (1889 – 1951) ఆస్ట్రియా దేశానికి చెందిన ఫిలాసఫర్. 

   ఆయన ఏమన్నాడంటే, మనుష్యులు వారి జీవిత అనుభవాల్లో నుండి తమ భావాలకు, తమ చుట్టూ ఉండే వస్తువులకు అర్ధాలు ఇస్తారు. మానవ సమాజములో భాగం అయితేనే, దాని అర్థం మనకు తెలుస్తుంది. ఉదాహరణకు, మరొక మనిషి మనకు I love you అని చెబితే మనకు అర్థం అవుతుంది. మన ఇంట్లో కుక్క  I love you అని చెబితే మనకు అర్థం అవుతుందా? కుక్క జాతి ‘ప్రేమ’ అనే  పదానికి ఏ అర్థం ఇస్తుందో మనకు తెలియదు. ప్రేమకు మానవ జాతి ఇచ్చే నిర్వచనం, కుక్క జాతి ఇచ్చే నిర్వచనం వేరువేరుగా ఉంటాయి. కుక్కలకు మాట్లాడే శక్తి ఇచ్చినా, అవి మాట్లాడే మాటల అర్ధాలు మనం తెలుసుకోలేము అన్నాడు ఈ లడ్ విగ్ విట్ గెన్ స్టెయిన్. 

   ఆర్టిఫిసియల్ ఇంటెలిజెన్స్ కు కూడా అదే వర్తిస్తుంది. ఒక రోబో మీకు I love you అని చెప్పినా అది ఏ అర్థం తో అంటుందో మీరు చెప్పలేరు. ఎందుకంటే రోబో లు మానవ సమాజములో భాగం కాలేవు. అది కుక్క కంటే అధమ స్థితిలోనే ఉంటుంది. ఆ తరువాత, 

Intelligence is Wholesome

   ఇంటెలిజెన్సు విడదీయలేని మిశ్రమం. ఒక కంప్యూటర్ లేక రోబో ని మీరు ఓపెన్ చేసి చూస్తే దానిలో అనేక భాగాలు మనకు కనిపిస్తాయి. ఏ భాగం ఏ పనిచేస్తుందో మనకు తెలుసు. ఏ వైర్ ఎందుకు ఉందో మనకు తెలుసు. వాటిలో ఏ పార్ట్ తీసివేసినా, ఏ వైర్ కట్ చేసినా అవి చేసే పనులు రోబో చేయలేదు. మనిషి అలా కాదు. మానవ జ్ఞానాన్ని మన శరీరములో ఏ ఒక్క భాగముతో ముడిపెట్టలేము. ఒక విడదీయలేని మిశ్రమం వలె అది పనిచేస్తుంది. ఉదాహరణకు, మన ఎమోషన్స్ కు జ్ఞానం ఉంటుంది. మన ఎమోషన్స్ కు నైతికత ఉంటుంది వాటికి హేతువు ఉంటుంది. మరో కోణము లో, మన హేతువుకు ఎమోషనల్ కోణం ఉంటుంది. మన హేతువుకు నైతిక విలువులు ఉంటాయి. ఈ wholesomeness మనిషిలో మాత్రమే మనకు కనిపిస్తుంది. రోబో లకు, ఆర్టిఫిసియల్ ఇంటెలిజెన్స్ కి ఇది ఉండదు. చివరిగా, 

Intelligence is Self-Aware 

మనం ఒక పనిచేస్తున్నామని మనకు తెలుసు. మనకు జూస్ ఇచ్చే రోబో ని మనం చేసుకోవచ్చు. అది మనకు ఒక గ్లాస్ జూస్ ఇచ్చింది అనుకొందాము. మనం జ్యూస్ త్రాగుతున్నాము అంటే మనము  జూస్ త్రాగుతున్నాము అని మనకు తెలుసు. అయితే, నువ్వు త్రాగు అంటే, రోబో ఆ జూస్ తాగుతుంది. రోబో జూస్ త్రాగవచ్చు. అయితే ‘నేను జూస్ త్రాగుతున్నాను’ అనే గ్రహింపు దానికి ఉండదు. ఆ సెల్ఫ్ అవేర్నెస్ దానికి ఉండదు. 

జాన్ సెర్ల – ఈయన ఒక ఫిలాసఫర్. ఈయన చైనీస్ రూమ్ అనే కథ చెప్పాడు. ఒక రూమ్ లో మీరు ఉన్నారు అనుకొందాము. మీకు చైనీస్ భాష రాదు. ఆ రూమ్ తలుపుకు చిన్న కంత ఉంది అనుకొందాము. బయట ఉన్న వ్యక్తి ఒక కార్డు మీద ఒక చైనీస్ పదం వ్రాసి ఇచ్చాడు. దానికి మరొక కార్డు తో మీరు రిప్లై ఇవ్వాలి. దాని మీద ఒక నెంబర్ వుంది.ఈ నంబర్ కార్డు నీకిస్తే ఈ నంబర్ కార్డు తిరిగి ఇవ్వు అని ఒక రూల్ బుక్  ఆ రూమ్ లో ఉంది. ఏ నంబర్ కార్డు మీకు ఇస్తే, ఏ నంబర్ కార్డు తిరిగి ఇవ్వాలో ఆ  రూల్ బుక్ ప్రకారం మీరు చేస్తున్నారు. మీకు చైనీస్ భాష ఒక్క ముక్క రాదు. కానీ ఆ రూల్ బుక్ ప్రకారం పొతే మీరు సరైన కార్డు ఆ కంత లో నుండి బయటికి పంపవచ్చు. బయట ఉన్న వాడు ఏమనుకొంటాడు. లోపల ఉన్న వాడికి చైనీస్ భాష వచ్చు అనుకొంటాడు. కానీ మీకు రాదు. ఏ నంబర్ కార్డు కి ఏ నంబర్ కార్డుతో సమాధానం ఇవ్వాలో ఆ రూల్ బుక్ ప్రకారమే మీరు పనిచేయగలుగుతున్నారు. జాన్ సెర్ల ఏమన్నాడంటే, ఆర్టిఫిసియల్ ఇంటెలిజెన్స్ కూడా అంతే. ఒక రూల్ బుక్ ప్రకారం అది పనిచేస్తుంది. ఫలానా పదం అర్థం చెప్పమ్మా అని దానిని అడిగితే అది ఒక రూల్ బుక్ ప్రకారం దాని అర్థం అది మీకు సమాధానం చెబుతుంది. అయితే దానికి నిజముగా ఆ భాష రాదు. ఒక రోబో కి మనం ఒక బుక్ ఇచ్చి, ‘ఈ బుక్ చదువమ్మా’ అంటే అది ఆ బుక్ చదువుతుంది. అయితే నేను ఒక పుస్తకం చదువుతున్నాను అని దానికి తెలియదు. ఆ సెల్ఫ్ ఎవర్నేస్ దానికి ఉండదు. కాబట్టి ఇంటెలిజెన్స్ అంటే 

“Intelligence is conscious, ethical, rational, emotional,intentional, thoughtful, vocal, personal, memorable, creative, teleological, metaphysical, cosmic, and wholesome self-awareness”. 

ఇది కేవలం మనిషికి మాత్రమే దేవుడు ఇచ్చిన ప్రత్యేకత. 139 కీర్తన లో మనం చదువుతాము. నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. అందునుబట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించు చున్నాను. నీ కార్యములు ఆశ్చర్యకరములు. దేవుడు మనిషిని సృష్టించడం చూసి మనకు భయం, ఆశ్చర్యం కలుగుతున్నాయి. అంత గొప్ప జ్ఞానముతో దేవుడు మనిషిని సృష్టించాడు. కాబట్టి మనిషి ఎప్పటికీ మనిషిని పోలిన యంత్రాన్ని లేక రోబో ని లేక ఆర్టిఫిసియల్ ఇంటెలిజెన్స్ చేయలేడు. ఆర్టిఫిసియల్ ఇంటెలిజెన్స్ అనేదే లేదు. అది కేవలం దేవుడు మాత్రమే చేయగలిగిన కార్యం. ఆ విషయం మనం గ్రహించాలి. 

   అయితే ఈ ఆర్టిఫిసియల్ ఇంటెలిజెన్స్ సాతాను పుత్రుడు అంత్య క్రీస్తు చేతిలో గొప్ప ఆయుధముగా మారుతుంది. ప్రపంచ ప్రజలందరి వ్యక్తి గత సమాచారాన్ని అంత్య క్రీస్తు తన చేతిలో పెట్టుకొంటాడు. సాతాను కుయుక్తులను మనం గమనిస్తూ ఉండాలి. రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభువు నందు విశ్వాసముంచి మీరు దేవుని ఇంటిలో చేరాలి. అదే నేటి మా ప్రేమ సందేశం. 

Leave a Reply