కొరింథీయులకు వ్రాసిన మొదటి పత్రిక

గ్రంథ పరిచయం 

   క్రొత్త నిబంధనలో అపోస్తలుడైన పౌలు కొరింథు సంఘములో ఉన్న విశ్వాసులకు వ్రాసిన  రెండు పత్రికలు ఉన్నాయి.కొరింథీయులకు వ్రాసిన మొదటి  పత్రిక, రెండవ పత్రిక. మరొక పత్రిక కూడా ఆయన వారికి వ్రాశాడు (1 కొరింథీ 5:9). అయితే అది ఇప్పుడు లేదు. ఏమి నమ్మాలి? ఎలా జీవించాలి? ఈ రెండు ప్రశ్నలు చాలా ముఖ్యమైనవి. ఆ రెండు ప్రశ్నలకు జవాబులు తెలుసుకోకపోతే మన జీవితాలకు స్థిరత్వం ఉండదు. దేవుని వాక్యం ఈ రెండు ప్రశ్నలకు మనకు సమాధానం ఇస్తుంది. మనం ఏమి నమ్మాలో దేవుడు మనకు చెబుతాడు. ఈ ప్రపంచములో ఎలా జీవించాలో కూడా ఆయన మనకు చెబుతాడు. 

     ఉదాహరణకు 1 కొరింథీ 13 అధ్యాయం చదవండి. అక్కడ ‘ప్రేమ’ అంటే ఎలా ఉండాలో అపోస్తలుడు వివరించాడు. ‘ప్రేమ’ అంటే ఏమిటి? మనుష్యులను ఆ ప్రశ్న అడిగితే వంద మంది వంద రకాల సమాధానం చెబుతారు. ఫిబ్రవరి 24, 1981 ప్రిన్స్ చార్లెస్, లేడీ డయానా స్పెన్సర్ ITN వార్తా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చారు. వారిద్దరూ ఎంగేజిమెంట్ చేసుకొన్నారు. విలేకరి వారిని అడిగాడు. మీరిద్దరూ ప్రేమలో ఉన్నారని అనుకోవచ్చా? డయానా: అవునండి అని సమాధానం ఇచ్చింది. ప్రిన్స్ చార్లెస్ ఏమన్నాడంటే, ‘whatever ‘in love’ means….you can put your own interpretation there. 

   ప్రేమా…. దాని అర్థం ఏమిటో. నీకు నచ్చిన అర్థం దానికి ఇచ్చుకో. ప్రిన్స్ చార్లెస్ గారి మాటలు నేటి సమాజం పరిస్థితి కి అద్దం పడుతాయి. 

వివాహం… దాని అర్థం ఏమిటో. నీకు నచ్చిన అర్థం దానికి ఇచ్చుకో. 

కుటుంబం…. దాని అర్థం ఏమిటో. నీకు నచ్చిన అర్థం దానికి ఇచ్చుకో. 

సంఘం …. దాని అర్థం ఏమిటో. నీకు నచ్చిన అర్థం దానికి ఇచ్చుకో. 

పురుషుడు… దాని అర్థం ఏమిటో. నీకు నచ్చిన అర్థం దానికి ఇచ్చుకో. 

స్త్రీ…. దాని అర్థం ఏమిటో. నీకు నచ్చిన అర్థం దానికి ఇచ్చుకో. 

     వారి వివాహం ఎంతో ఘనంగా జరిగింది. 11 సంవత్సరాల తరువాత వేరు వేరయిపోయారు. 1996 లో విడాకులు తీసుకొన్నారు. ఆ తరువాత ఒక సంవత్సరానికే డయానా ఒక కారు ప్రమాదములో మరణించింది. ఆమె ఫ్యూనరల్ /అంత్యక్రియలలో  బ్రిటన్ ప్రధాని టోనీ బ్లేయిర్ 1 కొరింథీ 13 అధ్యాయము చదివి వినిపించాడు. 

ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును. 

ప్రేమ మత్సరపడదు; ప్రేమ డంబముగా ప్రవర్తింపదు; అది ఉప్పొంగదు;

అమర్యాదగా నడువదు; స్వప్రయోజనమును విచారించుకొనదు; 

త్వరగా కోపపడదు; అపకారమును మనస్సులో ఉంచుకొనదు. 

దుర్నీతివిషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును.

అన్నిటికి తాళుకొనును,

అన్నిటిని నమ్మును; అన్నిటిని నిరీక్షించును; 

అన్నిటిని ఓర్చును. ప్రేమ శాశ్వతకాలముండును.

                    1 కొరింథీ 13 

   ప్రేమ అంటే ఏమిటి? దాని లక్షణాలు ఏమిటి? అనే ప్రశ్నకు దేవుని వాక్యం ఎంత స్పష్టముగా సమాధానం ఇచ్చిందో చూడండి. ఈ కొరింథీ పత్రికలో దేవుడు అటువంటి గొప్ప సత్యాలు వ్రాశాడు. ఈ సంఘములో ఎక్కువ మంది అన్య జనులే. అయితే వారు ఆస్తి, అంతస్తులు, చదువు, వర్గం లను బట్టి అనేక గ్రూపులుగా విడిపోయివున్నారు. ఈ సంఘం ‘సమస్యల సుడిగుండం’ అని పిలువవచ్చు. వారి సంఘము గ్రూపులుగా విడిపోయారు. ఒకాయన పినతల్లి ని ఉంచుకొన్నాడు. ‘నేను ఏమి తప్పు చేసాను’ అని ఇతరుల మీద విరుచుకుపడుతున్నాడు కానీ తన పాపం ఏమిటో తెలుసుకొని, దానిని ఒప్పుకొని, పశ్చాత్తాప పడలేని స్థితిలో ఉన్నాడు. కొంతమంది విగ్రహాలకు అర్పించిన వాటిని తినే విషయములో సందిగ్ధత కలిగి ఉన్నారు. కొంతమంది ఇతర సహోదరులనుకోర్టు లకు ఈడ్చుకొని వెళ్లి వారి మీద కేసులు పెట్టి గొడవలు చేస్తున్నారు. 

    కొంతమంది ప్రభువు బల్లలో అయోగ్యమైన స్థితిలో పాలుపొందుచూ రోగగ్రస్తులవుతున్నారు. చనిపోవుతున్నారు. అపోస్తలుడైన పౌలు గారు చాలా భారమైన హృదయముతో వారికి ఈ పత్రిక వ్రాశాడు. ఈ పత్రిక చదువుట వలన ఆది క్రైస్తవ సంఘములు ఎలా ఉండేవి, వారు ఎదుర్కొనిన సమస్యలు ఏమిటి? అనే విషయాలు మనకు అర్థం అవుతాయి.  ఈ సంఘస్తులను సరిదిద్దుతూ ఆయన అనేక గొప్ప క్రైస్తవ సత్యాలు ఈ పత్రికలో బోధించాడు. ఇది ఎంతో మధురమైన పత్రిక గా మనకు మిగిలిపోయింది. 20 శతాబ్దాల తరువాత జీవిస్తున్న మనం కూడా అనేక సత్యాలు ఈ పత్రికలో నేర్చుకొనవచ్చు. 

Two Powerful Christian Symbols : రెండు శక్తివంతమైన గుర్తులు 

ఈ కొరింథీ సంఘం చీలికలు, పేలికలుగా వుంది. అనేక సమస్యలు ఆ సంఘములో ఉన్నాయి. విశ్వాసులు గ్రూపులుగా విడిపోయి పోట్లాడుకొంటున్నారు. వీరిని మంచి మార్గములో నడిపించడం ఎలా? ఈ సంఘములో ఉన్న సమస్యలు పరిష్కరించడానికి పౌలు గారు రెండు శక్తివంతమైన గుర్తులను వారికి చూపించాడు. రెండు శక్తివంతమైన గుర్తులు 

  1. యేసు క్రీస్తు ప్రభువు యొక్క సిలువ
  2. ఆయన యొక్క శరీరం

    మొదటిది యేసు క్రీస్తు ప్రభువు యొక్క సిలువ : మన బలహీనతలో దేవుడు ఇచ్చే బలం 

రెండవది ఆయన యొక్క శరీరం: మన తారతమ్యాల్లో దేవుడు ఇచ్చే  ఐక్యత. 

మొదటిది యేసు క్రీస్తు ప్రభువు యొక్క సిలువ : మన బలహీనతలో దేవుడు ఇచ్చే బలం 

రెండవది ఆయన యొక్క శరీరం: మన తారతమ్యాల్లో దేవుడు ఇచ్చే  ఐక్యత 

ముందు సిలువ వేయబడిన క్రీస్తును చూడండి. 

1 కొరింథీ 1:18 

సిలువనుగూర్చిన వార్త, నశించుచున్న వారికి వెఱ్ఱి తనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి.

         1 కొరింథీ 1:18 

  నీవు బలహీనుడవు అయితే దేవుని శక్తి మీకు దొరుకుతుంది. అది యేసు క్రీస్తు ప్రభువు సిలువ యొద్ద దొరుకుతుంది.  రెండవదిగా, పౌలు వారికి క్రీస్తు శరీరము ను చూపించాడు. ఒక శరీరములో అనేక అవయవాలు కలిసి పనిచేస్తేనే ఆ శరీరం ఆరోగ్యకరముగా ఉంటుంది.ఆ అవయవాలు కలిసి పనిచేయకపోతే ఆ శరీరం అనారోగ్యం పాలవుతుంది. అదే విధముగా యేసు క్రీస్తు ప్రభువు శరీరములో మీ రందరూ అవయవములుగా ఉన్నారు. మీరందరూ కలిసి పనిచేస్తేనే ఆ శరీరం చక్కగా ఉంటుంది. క్రీస్తు శరీరమును చూసి మీరు ఐకమత్యముతో వుండండి అని పౌలు గారు కొరింథీ సంఘస్తులకు బోధించాడు. ఈ రోజు మనం కూడా యేసు క్రీస్తు ప్రభువు యొక్క సిలువ ఆయన యొక్క శరీరములను మన దృష్టిలో ఎప్పుడూ పెట్టుకొంటే దేవుడు ఇచ్చే శక్తి, దేవుడు ఇచ్చే ఐక్యత మనకు ఉంటాయి. 

కొరింథు నగరం: కొరింథు నగరములో ఉన్న క్రైస్తవులకు ఈ పత్రిక వ్రాయబడింది. ఇది గ్రీసు దేశములో ఉంది. ప్రాచీన గ్రీసు దేశములో ఇది చాలా పెద్ద నగరం. సంపన్నమైన నగరం. అపోస్తలుడైన పౌలు గారు ఈ నగరములో సువార్త పరిచర్య చేసి క్రీస్తు శకం 50 సంవత్సరములో ఇక్కడ ఒక క్రైస్తవ సంఘము నెలకొల్పాడు. పౌలు గారు మూడు ప్రపంచ సువార్త యాత్రలు చేశాడు. రెండవ యాత్రలో ఈ సంఘం నెలకొల్పాడు. ఇక్కడ ఒక సంవత్సరం ఆరు నెలలు పాటు ఆయన ఉన్నాడు. జీవనోపాధి కొరకు గుడారాలు కుట్టాడు. 

ఈ పత్రిక రచయిత 

రచయిత: అపోస్తలుడైన పౌలు గారు ఈ పత్రిక వ్రాశాడు. క్రీస్తు శకం 5-10 సంవత్సరముల మధ్య ప్రస్తుత టర్కీ దేశములో ఉన్న తార్సు పట్టణములో ఆయన జన్మించాడు. అంటే ఆయన ప్రభువైన యేసు క్రీస్తు కు సమకాలీనుడు. క్రీస్తు శకం 27-33 ల మధ్య ఆయన యెరూషములో గమలియేలు అనే యూదా మత ఆచార్యుడు దగ్గర దేవుని ధర్మశాస్త్రాన్ని క్షుణ్ణముగా అధ్యయనం చేశాడు. అప్పుడే జన్మించిన క్రైస్తవ సంఘాన్ని తీవ్రముగా ద్వేషించాడు. స్తెఫను గారిని రాళ్లు కొట్టి చంపేటప్పుడు అక్కడ కూర్చొని చూశాడు (క్రీ శ 32-33). అయితే దమస్కు అనే పట్టణానికి ఆయన తన పరివారముతో ప్రయాణిస్తున్నప్పుడు ప్రభువైన యేసు క్రీస్తు ఆయనకు ప్రత్యక్షం అయ్యాడు. అన్యజనులకు సువార్తికునిగా మారాడు. ఈ రోజు మనం వెనక్కి తిరిగి చూస్తే ప్రపంచ చరిత్రను మలుపు తిప్పిన గొప్ప విశ్వాస వీరునిగా పౌలు మనకు కనిపిస్తున్నాడు. 

వ్రాయబడిన కాలము: క్రీస్తు శకం 55. అంటే నాలుగు సువార్తల కంటే ముందుగానే ఇది వ్రాయబడి ఉండవచ్చు. 

వ్రాయబడిన స్థలము: ప్రస్తుత టర్కీ దేశం పశ్చిమ తీరములో వున్న ఎఫెసు పట్టణము లో ఉండి పౌలు ఈ పత్రికను వారికి వ్రాశాడు. అకుల, ప్రిస్కిల్ల దంపతులు, అపొల్లో గారితో కలిసి కొరింథు నుండి పౌలు ఎఫెసు పట్టణము వెళ్ళాడు. 

ముఖ్య అంశాలు: 

Unity in the church

క్రైస్తవ సంఘములో ఉండవలసిన ఐకమత్యం గురించి పౌలు ఈ పత్రికలో నొక్కి వక్కాణించాడు. అప్పుడప్పుడు మనం వార్తలలో చూస్తూ ఉంటాము. ఒక చర్చి ని చూపిస్తారు. అక్కడ ఉన్న క్రైస్తవులు గ్రూపులుగా విడిపోయి ఒకరిని ఒకరు తిట్టుకొంటూ, తోసుకొంటూ, కొట్టుకొంటూ కుర్చీలు విసిరేసుకోవడం, బల్లలు విరగగొట్టడం చేస్తూ వుంటారు. ఆ దృశ్యాలు చూసినప్పుడు మనం బాధపడతాం. ప్రపంచం మనలను చూసి నవ్వు కొంటుంది. కొరింథీ సంఘము కూడా ఆ విధముగా తయారయ్యింది. వారు గ్రూపులుగా విడిపోయి కొట్లాడు కుంటున్నారు. 1 అధ్యాయం 10 వచనం చూద్దాము. 

సహోదరులారా, మీరందరు ఏకభావముతో మాట లాడవలెననియు,మీలో కక్షలు లేక, యేక మనస్సు తోను ఏకతాత్పర్యముతోను, మీరు సన్నద్ధులై యుండ వలెననియు, మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట మిమ్మును వేడుకొనుచున్నాను.

        1  కొరింథీ 1:10 

ఈ వచనం ఈ పత్రిక యొక్క సారాంశం. మనం కక్షలు లేకుండా, అసూయలు లేకుండా ఏక మనస్సుతో ఉన్నప్పుడే దేవునికి మహిమ. విశ్వాసులు నేను పౌలు మనిషిని, నేను అపొల్లో మనిషిని అని చెప్పుకొంటూ గ్రూపులుగా విడిపోయారు. అది తప్పు. పౌలు ఎవడు? అపొల్లో ఎవడు? మేము క్రీస్తు యొక్క పరిచారకులమే. నేను నాటాను. అపొల్లో నీళ్లు పోశాడు. మేము దేవుని పొలములో పనివారము మాత్రమే. దేవుని జతపనివారము మాత్రమే. మీరు క్రీస్తుకు చెందిన వారు. మీరు క్రీస్తు అనే పునాది మీద కట్టబడిన వారు. క్రీస్తు విభజింపబడి యున్నాడా? పౌలు మీ కొరకు సిలువ వేయబడెనా?

                 1  కొరింథీ 1:13 

క్రీస్తు విభజించబడి లేడు. క్రీస్తు శరీరం ఒక్కటే. క్రైస్తవ సంఘం కూడా ఒక్కటి గా ఉండాలి. దానిని మనం ముక్కలు చేయకూడదు. ఆ పని చేస్తే మనకు పాపం చుట్టుకొంటుంది. పౌలు మీ కొరకు సిలువ వేయబడెనా? పౌలు మీ కొరకు సిలువ వేయబడలేదు. అపొల్లో మీ కొరకు సిలువ వేయబడలేదు. పేతురు మీ కొరకు సిలువ వేయబడలేదు. వారి పేరు మీద మీరు గ్రూపులు పెట్టుకోవద్దు. మీరు క్రీస్తుకు చెందిన వారు. క్రైస్తవ సంఘములో మనం గ్రూపులు పెట్టుకోకూడదు. మనం ఐకమత్యముతో ప్రభువైన యేసు క్రీస్తు ను మహిమ పరచాలి. 

Calling to be Saints

మరొక అంశం పరిశుద్ధులు 

1:2 

కొరింథులోనున్న దేవుని సంఘమునకు, అనగా క్రీస్తుయేసునందు పరిశుద్ధపరచబడినవారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడినవారికిని…. 1:2 

‘నేను కొరింథు సంఘముకు వెళ్తానండి’ అని ఎవరన్నా చెప్పుకొంటారా? అది సిగ్గుపడాల్సిన విషయం కదా. అయితే వారు కూడా దేవుని దృష్టిలో పరిశుద్ధులే. యేసు క్రీస్తు ప్రభువును నమ్ముకొని రక్షణ పొందిన ప్రతి విశ్వాసీ దేవుని దృష్టిలో పరిశుద్ధుడే. పరిశుద్ధుడు అంటే ఎవరు? మనం ఏమనుకొంటామంటే పరిశుద్ధుడు అంటే అపోస్తలుడైన పౌలు గారు భక్త సింగ్ గారు,బిల్లీ గ్రాహం గారు,ఆర్ ఆర్ కె మూర్తి గారు అలా ఉండాలి. 

   అయితే ప్రతి విశ్వాసి దేవుని దృష్టిలో పరిశుద్ధుడే. దేవుని దృష్టిలో పౌలు గారు ఎంత పరిశుద్ధుడో మీరు కూడా అంతే పరిశుద్ధులు. భక్త సింగ్ గారు ఎంత పరిశుద్ధుడో మీరు కూడా అంతే పరిశుద్ధులు. మన దేవుడు పరిశుద్దుడైన తండ్రి. ఆయన పిల్లలమైన మనము కూడా పరిశుద్ధులమే. దేవుని ఎదుట యేసు క్రీస్తు నందు పరిశుద్ధపరచబడిన మనము పరిశుద్ధత ను మన జీవితములో అలవరచుకోవాలి. తండ్రి అయిన దేవునితో ఉన్న సంబంధం మనం ప్రతి రోజూ గుర్తుచేసుకొంటేనే మనం నేర్చుకోగలం. మన సంబంధాలు మన ప్రవర్తనను ప్రభావితం చేస్తాయి. ఒక పోలీస్ ఆఫీసర్ కొడుకు దొంగతనాలు చేస్తే చూడడానికి బాగోదు. మా నాన్న పోలీస్ ఆఫీసర్ రా. నేను రోడ్డు మీద జేబులు కొట్టడం ఏమిటి రా. మా అమ్మ మదర్ తెరీసా కి చెల్లెలు లాంటిది. నేను సహాయము అడిగితే చేయకుండా ఉండగలనా? నువ్వు ఫలానా యోహాను గారి అబ్బాయి వి కదా. నువ్వెంటి సినిమా హాళ్ళో ఉన్నావు? అదే విధముగా పరిశుద్దుడైన యేసు క్రీస్తుతో సంబంధం పెట్టుకొన్న మనం ఆయన వలన ప్రభావితం చేయబడాలి. 

యేసు క్రీస్తు ప్రభువు బూతులు తిట్టడు కదా. నేనెందుకు తిట్టాలి? 

యేసు క్రీస్తు ప్రభువు వ్యభిచారం చేయడు కదా. నేనెందుకు చేయాలి? 

యేసు క్రీస్తు ప్రభువు దొంగతనం చేయడు కదా. నేనెందుకు చేయాలి? 

యేసు క్రీస్తు ప్రభువు అబద్దాలు చెప్పడు కదా. నేనెందుకు చెప్పాలి? 

యేసు క్రీస్తు ప్రభువు ఎవరినీ ద్వేషించడు, హింసించడు కదా. నేనెందుకు హింసించాలి? 

   పౌలు ఆ సత్యాన్ని కొరింధీయులకు వ్రాశాడు. దేవుడు మిమ్ములను పరిశుద్దులని పిలిచాడు,  పరిశుద్దులుగా ఉండుటకు పిలిచాడు. 

Faithfulness of God: 

దేవుడు నమ్మదగిన వాడు అనే గొప్ప సత్యం ఈ పత్రికలో మనకు కనిపిస్తుంది. 1 అధ్యాయం 9 వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మతగిన వాడు. 1:9

  దేవుడు మామూలుగా మాట ఇస్తేనే మనం ఆయనను నమ్మ వచ్చు. దేవుడు ఎట్టి పరిస్థితుల్లోనూ మాట తప్పే వాడు కాదు, అలాంటిది ప్రభువైన యేసు క్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్ములను పిలిచిన దేవుడు ఇంకెంత నమ్మకముగా ఉంటాడో ఆలోచించండి.  సహవాసము, గ్రీకు భాషలో కోయినోనియా అనే మాట మాట వాడబడింది. అంటే ఏకం కావడం, ఐక్యం కావడం. ఈ సహవాసములో మనం దేవునితో ఏకం చేయబడ్డాము. దేవుడు నమ్మదగిన వాడు. ఆయన నమ్మదగిన వాడు కాబట్టి మనలను ఎప్పుడూ కాదనడు (ప్రకటన 1:4-5) 

ఆయన నమ్మదగిన వాడు కాబట్టి తరతరాలు ఆయన కృప మనకు అందుతూనే ఉంటుంది (మీకా 7:18-20)

ఆయన నమ్మదగిన వాడు కాబట్టి మన పాపములను క్షమిస్తాడు (1 యోహాను 1:9; కీర్తన 34:6-7) 

ఆయన నమ్మదగిన వాడు కాబట్టి ప్రతి దినం తన ప్రేమను మనకు చూపిస్తున్నాడు. (విలాప వాక్యములు 3:22-23)

   చైనా దేశములోని ఊహాన్ అనే నగరములో ఒక పరిశోధనలు చేసే ల్యాబ్ లో ఈ కోవిడ్ వైరస్ మొదలయ్యింది. ఈ మధ్యలో చైనా అధికారులు దానిని ధృవీకరించారు. దానిని అందరి కంటే ముందు ప్రపంచానికి రిపోర్ట్ చేసిన జర్నలిస్ట్ zhang. చైనా కమ్యూనిస్ట్ ప్రభుత్వం ఆమెను అరెస్ట్ చేసి 4 సంవత్సరాలు జైలు శిక్ష విధించింది. ఆమెను జైలులో ఒక జర్నలిస్ట్ కలిసినప్పుడు ఆమె కొరింథీ పత్రిక 10:13 అతనికి చెప్పింది. దేవుడు నమ్మదగినవాడు; మీరు సహింప గలిగినంతకంటె ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపబడ నియ్యడు.1 కొరింథీ 10:13 

All Sufficiency of Christ 

దేవుని మూలముగా యేసు క్రీస్తు మనకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు విమోచనము నాయెను.

    మొదటి కొరింథీ పత్రిక 1:31 

  ఆ  మాటలు మీరు గమనించండి. యేసు క్రీస్తు ప్రభువు మనకు 4 రకాలుగా ఆపాదించబడ్డాడు. ఆయన మనకు జ్ఞానము,మనకు నీతి,మనకు పరిశుద్ధత,మనకు విమోచనము. ఆ నాలుగు కలిసే వెళ్తాయి. వాటిలో నుండి మనము దేనినీ వేరుచేయలేము. 

మొదటిగా 

యేసు క్రీస్తు ప్రభువు – మనకు జ్ఞానము 

   మొదటిగా జ్ఞానము అంటే ఏమిటి? జ్ఞానము అంటే వాస్తవికత ను తెలుసుకొని దానికి అనుగుణముగా జీవితం మలుచుకోవడం. ఒక కారును మీరు డ్రైవ్ చేయాలనుకొంటారు. మీకు ఎలా డ్రైవ్ చేయాలో తెలిసివుండాలి. ఏ రోడ్డు మీద ఎంత వేగముతో ప్రయాణము చేయాలో మీకు తెలిసి ఉండాలి. మీ కారులో బ్రేక్ ఏదో,యాక్సిలేటర్ ఏదో మీకు తెలిసి ఉండాలి. ఆ జ్ఞానం మీకు లేకపోతే మీ కారుకు ప్రమాదం జరుగుతుంది. 

   ఏ రోడ్డు మీద ఎంత వేగముతో, ఏ వైపు నడపాలో మీకు తెలిసి ఉండాలి. లేకపోతె మీ కారుకు ప్రమాదం జరుగుతుంది. సమాచారం మీరు తెలుసుకోవాలి. దానికి అనుగుణముగా మీ ప్రవర్తన మలచుకోవాలి. అదే జ్ఞానం. కొరింథు సంఘములో ఉన్న గ్రీసు దేశస్తులు జ్ఞానము వెదకు చున్నారు. పౌలు గారు వారితో ఏమంటున్నాడంటే, 

యేసు క్రీస్తు మనకు జ్ఞానం. 

బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు

యేసు క్రీస్తు నందే  గుప్తములై యున్నవి.

       కొలొస్సయులకు 2:3 

  కాస్త కూస్తా కాదు అది కొంచెం, ఇది కొంచెం కాదు బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు 

యేసు క్రీస్తు నందే మనకు దొరుకుతున్నాయి. గ్రీకు సంస్కృతి అంటేనే అది ఫిలాసఫర్లకు నెలవుగా ఉన్న సంస్కృతి. జ్ఞానాన్వేషణ, జ్ఞాన సముపార్జనలకు వారు జీవితము మొత్తం వెచ్చిస్తారు.సోక్రటీస్, ప్లేటో, అరిస్టాటిల్ లాంటి గొప్ప మేధావులు జ్ఞానం కోసం తపించారు. సోక్రటీస్ ఒక మాట అంటూ ఉండేవాడు. 

‘the show of wisdom without the reality’ 

కొంతమంది షో చేస్తూ ఉంటారంట. వారు జ్ఞానము ఉన్నట్లుగా షో చేస్తారు దానికి రియాలిటీ ఉండదు. వాస్తవికత ఉండదు. 

    గ్రీకులు ‘టి లి యాలజి’ అనే పదం ఉపయోగించేవారు. అంటే పర్పస్. మనిషి జీవితానికి పర్పస్ ఉందా? ఈ ప్రపంచానికి ఒక పర్పస్ ఉందా? ఈ విశ్వానికి ఒక పర్పస్ ఉందా? గ్రీకులు మనిషి జీవితానికి ఒక పర్పస్ ఉంది అని నమ్మారు. ఈ విశ్వానికి ఒక పర్పస్ ఉంది అని నమ్మారు. దీనిని ‘టిలియాలజి’ అని వారు పిలిచారు. యేసు క్రీస్తు ప్రభువు ఆ టి లి యాలజి ని మనకు బోధించాడు. దేవుడు మనలను సృష్టించింది తన ఆనందం కోసమే, తన మహిమ కోసమే. అందుకనే యేసు ప్రభువు ఏమన్నాడు. 

మనుష్యుడు రొట్టెవలన మాత్రముకాదుగాని దేవుని నోటనుండి వచ్చు ప్రతిమాట వలనను జీవించును. 

             మత్తయి 4:4 

    నిజమైన జ్ఞానం మనకు కావాలంటే మనం దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట జాగ్రత్తగా వినాలి. complete reality సంపూర్ణమైన వాస్తవికత దేవుడు మాత్రమే 

మనకు చెప్పగలడు. సోక్రటీస్ జ్ఞానం కోసం ఎంతో తపించాడు. ఈ ప్రపంచం కేవలం భౌతిక మైన పదార్థం కాదు.ఇందులో ఆత్మ సంబంధమైనవి కూడా ఉన్నాయి అన్నాడు. ఈ విశ్వం ఒక కోణములో భౌతికమైనది. మరొక కోణములో ఆత్మ సంబంధమైనవి కూడా అందులో ఉన్నాయి అని Phaedo లో ఉంది. 

   అయితే సోక్రటీస్ మాటలు అనేకమందికి నచ్చలేదు. తన బోధనలతో సమాజాన్ని పాడు చేస్తున్నాడు అని సోక్రటీస్ మీద నేరం మోపారు. ఆయనకు విషం ఇచ్చి చంపారు. సోక్రటీస్ ఆ విష పాత్ర కూడా సంతోషముగానే త్రాగాడు ఎందుకంటే ఆయన యేమని నమ్మాడంటే, ‘నా ఆత్మ నా శరీరములో బంధించబడి ఉంది. మరణం తరువాత నా శరీరములో నుండి నా ఆత్మ కు స్వేచ్ఛ లభిస్తుంది. అప్పుడు  నేను  సంపూర్ణమైన జ్ఞానము పొందుతాను’ అన్నాడు. కొంతవరకు మనం కూడా దానిని నమ్ముతాము. యేసు క్రీస్తు ప్రభువు మనకు దేవుని జ్ఞానము అయి ఉన్నాడు. ఈ భూమి మీద ఉన్నంత కాలం మాత్రమే కాదు, మరణం తరువాత కూడా ఆయన మనకు జ్ఞానమే. మన మరణం తరువాత యేసు క్రీస్తు ప్రభువును మనం చూసినప్పుడు మనకు సంపూర్ణమైన జ్ఞానం లభిస్తుంది. ఆ రోజు మనం పరిపూర్ణమైన జ్ఞానము పొందుతాము. 

   గ్రీకులు జ్ఞాన సముపార్జన లో రెండు విషయాల గురించి ప్రముఖముగా చెప్పారు. 

మొదటిది Reality and Illusion 

రెండవది Perfection and Imperfection

మొదటిది Reality and Illusion 

ఏది నిజమైనది? ఏది అభూత కల్పన? ప్లేటో రిపబ్లిక్ అనే పుస్తకం వ్రాశాడు. ఇందులో తన సోదరుడు గ్లవ్ కాన్, తన గురువు సోక్రటీస్ ల మధ్య జరిగే సంభాషణ ఆ పుస్తకములో వ్రాశాడు. 

   ఒక గుహ లో కొంతమంది బంధించబడి వుంటారు. వారు సంకెళ్లతో ఆ గుహలో బంధించబడి ఉంటారు. వారి వెనుక ఒక అగ్ని మండుతూ ఉంటుంది. ఆ అగ్ని ముందు కొంతమంది నడుచుకొంటూ వెళ్తారు. వారి యొక్క ఛాయ గుహలో గోడ మీద పడుతుంది. గుహలో వున్న వ్యక్తులు ఆ గోడ వైపు చూస్తూ ఉంటారు. ఆ గోడ మీద పడే ఛాయలు నిజమే అని వారు అనుకొంటూ వుంటారు. మనము కూడా అంతే. ఛాయలే నిజం అని మనం అనుకొంటాము. నీడ ను చూసి అదే వాస్తవం అని మనం అనుకొంటాము. గుహలో బంధించబడిన వ్యక్తి ఆ గొలుసులు వదిలించుకోవాలి. అతడు బయటికి వచ్చి నప్పుడే ‘నేను ఇంత కాలం చూసింది ఛాయ మాత్రమే’ అని గ్రహిస్తాడు. అతడు గుహలో ఉన్నంత కాలం సూర్యుడు అతనికి కనిపించడు. బయటికి వెళ్లిన తరువాత ఏది వాస్తవమో తెలుసుకొంటాడు. కొలొస్సయులకు వ్రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు వ్రాశాడు. ఇవి రాబోవు వాటి ఛాయయే గాని నిజ స్వరూపము క్రీస్తులో ఉన్నది. కొలొస్స 2:17

   ఈ ప్రపంచం మనకు అనేక ఛాయలు చూపిస్తుంది. అవి నిజం కాదు. నిజ స్వరూపం క్రీస్తులో ఉంది. సాతానుడు మనకు అనేక ఛాయలు చూపిస్తాడు. అవి నిజం కాదు. నిజ స్వరూపం క్రీస్తులో ఉంది. ఏదెను వనములో ఆదాము, హవ్వలు ఎంతో సంతోషముగా ఉన్నారు. అయితే సాతాను చెప్పిన అబద్దం వారు నమ్మారు. వారు ఒక illusion లోకి వెళ్లిపోయారు. అంటే ఒక అభూత కల్పనను వారు నమ్మారు. మీరు కూడా దేవుని వలె మారిపోతారు. ఈ కాయ తినండి అని సాతాను వారికి అబద్దం చెప్పాడు. వారు దానిని తిని పతనం చెందారు. సాతాను వారి చుట్టూ ఒక illusion సృష్టించాడు. అప్పుడు వారు రియాలిటీ మరచిపోయారు. దేవుడు మనలను రియాలిటీ వైపు నడిపిస్తే సాతాను మనలను అబద్దాల వైపు నడిపిస్తాడు. 

   ఛాయా లోకములో మనం జీవించకూడదు. అది షాడో వరల్డ్. అందులో మనం జీవించకూడదు. నిజ స్వరూపం క్రీస్తులో వుంది. ఇవి రాబోవు వాటి ఛాయయే గాని నిజ స్వరూపము క్రీస్తులో ఉన్నది. 

ధర్మ శాస్త్రం ఒక ఛాయ మాత్రమే. నిజ స్వరూపం క్రీస్తులో ఉంది. 

ప్రవక్తలు ఒక ఛాయ మాత్రమే. నిజ స్వరూపం క్రీస్తులో ఉంది. 

ప్రత్యక్ష గుడారం ఒక ఛాయ మాత్రమే. నిజ స్వరూపం క్రీస్తులో ఉంది. 

అందులో వారు అర్పించిన బలులు, అర్పణలు ఛాయ మాత్రమే. నిజ స్వరూపం క్రీస్తులో ఉంది. 

పండుగలు ఒక ఛాయ మాత్రమే. నిజ స్వరూపం క్రీస్తులో ఉంది. 

దేవాలయం ఒక ఛాయ మాత్రమే. నిజ స్వరూపం క్రీస్తులో ఉంది. 

ఆ నిజ స్వరూపం తెలుసుకోవడమే జ్ఞానం. 

రెండవది Perfection and Imperfection

   గ్రీకు ఫిలోసోఫేర్లు ఏమన్నారంటే, మనం చూసేవి అసంపూర్ణమైనవి. ఒక triangle మీరు చూడండి. ఒక perfect triangle కి అది ఒక అసంపూర్ణమైన ప్రతిబింబం మాత్రమే. పరిపూర్ణమైన triangle కి పరిపూర్ణమైన 3 కోణాలు ఉంటాయి. మనం గీచుకొనే triangle పరిపూర్ణమైనది కాదు. అది సంపూర్ణమైనది. మనం చేసే పనులు కూడా అసంపూర్ణమైనవే. పరిపూర్ణత యేసు క్రీస్తు నందు మాత్రమే మనకు దొరుకుతుంది. 

మనం చూపించే ప్రేమ అపరిపూర్ణమైనది. పరిపూర్ణమైన ప్రేమ క్రీస్తులో మాత్రమే 

ఉంది. మనకు ఉన్న శక్తి అపరిపూర్ణమైనది. పరిపూర్ణమైన శక్తి  క్రీస్తులో మాత్రమే 

ఉంది. మనకు ఉన్న జ్ఞానం అపరిపూర్ణమైనది. పరిపూర్ణమైన జ్ఞానం  క్రీస్తులో మాత్రమే 

ఉంది. మనకు ఉన్న సంతోషం అపరిపూర్ణమైనది. పరిపూర్ణమైన సంతోషం  క్రీస్తులో మాత్రమే ఉంది. 

ఆ విధముగా యేసు క్రీస్తు మనకు జ్ఞానం అయ్యాడు. గ్రీకులు illusion లో నుండి రియాలిటీ లోకి వెళ్ళాలి. ఇంపెర్ఫెక్షన్ లో నుండి పర్ఫెక్షన్ లోకి వెళ్ళాలి అని అనుకొన్నారు. 

వాటిని మనకు ఇచ్చేది ఇచ్చేది యేసు క్రీస్తు మాత్రమే. 

Jesus Christ is the perfection of wisdom, 

He is the perfection of all reality 

Without Jesus, you are living in illusion, 

Without Jesus, you are living in imperfection 

జ్ఞానము లేని వాడు బుద్ధిహీనుడు. బుద్ధి హీనుడు ఎలా ఉంటాడో దేవుడు తన వాక్యంలో వ్రాశాడు. 

 (కీర్తన 14:1) 

ఒక బుద్ధిహీనుడు దేవుడు లేడు అని తన హృదయములో అనుకొంటాడు

(1 కొరింథీ 1:18) 

ఒక బుద్ధిహీనుడు యేసు క్రీస్తు సిలువను తిరస్కరిస్తాడు 

(1 కొరింథీ 1:20) 

ఒక బుద్ధిహీనుడు ఈ లోక సంబంధమైన సంగతుల యందు అతిశయిస్తాడు 

(సామెతలు 1:7) 

బుద్ధి హీనుడు దేవుని భయం లేకుండా జీవిస్తాడు 

(సామెతలు 12:15) 

బుద్ధి హీనుడు తన దృష్టికి తానే సరియైన వాడు అనుకొంటాడు, ఎవరి సలహాలు తీసుకోడు 

(సామెతలు 14: 16) 

బుద్ధి హీనుడు విఱ్ఱ వీగుతాడు, కీడు చేస్తాడు 

(సామెతలు 24:9)

బుద్ధి హీనుని ఆలోచనలు అతని పాపం వైపు నడిపిస్తాయి 

(సామెతలు 28:26) 

బుద్ధి హీనుడు తన స్వంత మనస్సును ఆధారముగా చేసుకొంటాడు 

(సామెతలు 29:11)

బుద్ధి హీనుడు కోపము అణుచుకోలేడు 

లూకా సువార్త 12:17 లో యేసు ప్రభువు ఒక కథ చెప్పాడు. 

ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను.17 అప్పుడతడునా పంట సమకూర్చుకొనుటకు నాకు స్థలము చాలదు గనుక నేనేమి చేతునని తనలో తానాలోచించుకొనినేనీలాగు చేతును;18 నా కొట్లు విప్పి, వాటికంటె గొప్పవాటిని కట్టించి, అందులో నా ధాన్యమంతటిని, నా ఆస్తినిసమకూర్చుకొని19 నా ప్రాణముతోప్రాణమా, అనేక సంవత్సరములకు,విస్తార మైన ఆస్తి నీకు సమకూర్చబడియున్నది; సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పు కొందునను కొనెను.20 అయితే దేవుడువెఱ్ఱివాడా, యీ రాత్రి నీ ప్రాణము నడుగుచున్నారు; నీవు సిద్ధపరచినవి ఎవని వగునని ఆతనితో చెప్పెను. దేవుడు ఆ ధనవంతుని ఫూల్ అని పిలిచాడు. ఒరేయ్, బుద్ధి హీనుడా అని దేవుడు అతని పిలిచాడు. బుద్ధి హీనుడు నిత్యత్వం గురించి ఆలోచించం కుండా ఈ లోకములో పోగు చేసుకోవడమే పనిగా పెట్టుకొన్నాడు. దేవుడు అతనితో ఏమంటాడంటే, వెఱ్ఱి వాడా, ఈ రాత్రి నీ ప్రాణమును నేను అడుగుతున్నాను. నువ్వు సంపాదించింది మొత్తం ఎవరి వశం అవుతుంది? 

జ్ఞానము కలిగిన వాడు ఎలా ఉంటాడు? 

(కీర్తన 14:1) 

జ్ఞాన వంతుడు దేవుడు ఉన్నాడు అని తన హృదయములో నమ్ముతాడు 

(1 కొరింథీ 1:18) 

జ్ఞానవంతుడు యేసు క్రీస్తు సిలువను స్వీకరిస్తాడు 

(1 కొరింథీ 1:20) 

జ్ఞానవంతుడు ఈ లోక సంబంధమైన సంగతుల యందు కాక ఆత్మ సంబంధమైన సంగతుల యందు  అతిశయిస్తాడు 

(సామెతలు 1:7) 

జ్ఞానవంతుడు దేవుని భయముతో జీవిస్తాడు 

(సామెతలు 12:15) 

జ్ఞానవంతుడు తన దృష్టికి తానే సరియైన వాడు అని అనుకోడు. విమర్శలు సహృదయముతో స్వీకరిస్తాడు 

(సామెతలు 14: 16) 

జ్ఞాన వంతుడు విఱ్ఱ వీగడు, కీడు చేయడు 

(సామెతలు 24:9)

జ్ఞానవంతుడి ఆలోచనలు అతని పరిశుద్ధత వైపు నడిపిస్తాయి. 

లూకా సువార్త 12 

జ్ఞానవంతుడు ఈ లోకములో ఆస్తిపాస్తులు కాకుండా పరలోకములో 

ఆస్తి సంపాయించుకొంటాడు. 

యేసు క్రీస్తు మనకు దేవుని జ్ఞానం. 

రెండవదిగా, 

యేసు క్రీస్తు ప్రభువు మనకు దేవుని నీతి

   మన స్వంత నీతి దేవుని ఎదుట మురికి గుడ్డల వలె ఉంది. అది దేవుని ఎదుట మనలను పరిపూర్ణులను చేయలేదు. నీతి ఒక ఆలోచన మాత్రమే కాదు. అది న్యాయము తో ముడిపడి ఉంది. అది చట్టం తో ముడిపడి ఉంది. మన సమాజానికి ఒక నీతి ఉంటుంది. దానిని బట్టి అది చట్టాలు చేస్తుంది. ఆ చట్టాలు అతిక్రమిస్తే మనకు శిక్ష తప్పదు. పోలీసులు ఒక వ్యక్తిని అరెస్ట్ చేస్తే ఆ వ్యక్తిని ఎందుకు అరెస్ట్ చేశారో చెప్పగలగాలి. 

నీలో నీతి లేదు, నువ్వు ఒక  లంచగొండివి. 

నీలో నీతి లేదు, నువ్వు ఒక రేపిస్ట్ వి. 

నీలో నీతి లేదు, నువ్వు ఒక దొంగవు 

నీలో నీతి లేదు, నువ్వు ఒక నరహంతకుడవు. అందుకనే నిన్ను అరెస్ట్ చేశాము. అందుకనే నీ మీద కేసులు పెట్టి ఛార్జ్ షీట్ వ్రాశాము. అందుకనే నీవు కోర్ట్ కి వచ్చి న్యాయమూర్తి ముందు నిలబడాలి. విచారించబడాలి. మనం కోర్ట్ కి వెళ్లి జడ్జి ముందు నిలబడితే, ప్రాసిక్యూటర్ ఏమంటాడు? 

  యువర్ ఆనర్, ఈ నిందితుడు నిజంగానే ఈ నేరాలు చేశాడు. నేను ఈ ఆధారాలు కోర్టు ముందు పెట్టాను. ఈ ముద్దాయిని కఠినముగా శిక్షించండి అంటాడు. అప్పుడు న్యాయమూర్తి మనకు తీర్పు తీర్చి శిక్ష విధిస్తాడు. 

ఆ విధముగా 

నీతి -న్యాయం – తీర్పు : ఈ మూడూ కలిసి వెళ్తాయి. 

  మానవ సమాజం యొక్క నీతి లో నుండే రాజ్యాంగం, చట్ట వ్యవస్థ పుడతాయి. 

దేవుని నీతి లో నుండి ధర్మశాస్త్రము, దేవుని న్యాయమైన తీర్పులు పుడతాయి. 

దేవుని వాక్యం మనకు నీతిని బోధిస్తున్నది (2 తిమోతి 3:16-17). 

దేవుని ధర్మశాస్త్రం నెరవేర్చడములో మనం విఫలం చెందాము. దేవుని న్యాయ వ్యవస్థ మనకు తీర్పు తీర్చింది. అపోస్తలులు కార్యములు 17 అధ్యాయం లో ఒక మాట చూద్దాము. 

30 ఆ అజ్ఞానకాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను; ఇప్పుడైతే అంతటను అందరును మారుమనస్సు పొందవలెనని మనుష్యులకు ఆజ్ఞాపించుచున్నాడు.31 ఎందుకనగా తాను నియమించిన మనుష్యునిచేత నీతి ననుసరించి భూలోకమునకు తీర్పుతీర్చ బోయెడి యొక దినమును నిర్ణయించి యున్నాడు. 

       మృతులలోనుండి ఆయనను లేపినందున దీని నమ్ముటకు అందరికిని ఆధారము కలుగజేసియున్నాడు.అంతటను అందరును మారుమనస్సు పొందవలెనని దేవుడు మనుష్యులకు ఆజ్ఞాపించుచున్నాడు. ఎందుకని? 

   తాను నియమించిన మనుష్యుని చేత, అంటే యేసు క్రీస్తు ప్రభువు చేత, నీతి ననుసరించి భూలోకమునకు తీర్పుతీర్చ బోయెడి యొక దినమును నిర్ణయించి యున్నాడు. దేవుని తీర్పు వస్తుందా? దానికి ఆధారం ఏమిటి? మృతులలోనుండి ఆయనను లేపినందున దీని నమ్ముటకు అందరికిని ఆధారము కలుగజేసియున్నాడు.అవిశ్వాసులకు దేవుడు తప్పకుండా తీర్పు తీరుస్తాడు. దానికి ఆధారం ఏమిటంటే యేసు క్రీస్తు సమాధి నుండి తిరిగి లేవడమే. ఆ తీర్పు నుండి మనలను రక్షించేదెవరు? యేసు క్రీస్తు ప్రభువే. ఎందుకంటే ఆయన మనకు దేవుని నీతి అయ్యాడు. 

     విశ్వసించు ప్రతివానికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తియై యున్నాడు.రోమా 10:4 

దేవుని ధర్మశాస్త్రం మనకు నీతి ని ఇవ్వలేదు (గలతీ 2:21) దేవుని ధర్మశాస్త్రము సంతృప్తి చెందాలి. లేకపోతే మనకు నీతి కలుగదు. దేవుని ధర్మశాస్త్రము సమాప్తి చెందాలి. లేకపోతే మనకు నీతి కలుగదు. దేవుని నీతి లో నుండి వచ్చిన ధర్మశాస్త్రాన్ని ఆయన ఒక్కడు మాత్రమే పరిపూర్ణముగా నెరవేర్చగలిగిన వాడు ఎందుకంటే ఆయనే దేవుని నీతి.   ప్రకటన 19:11 11 మరియు పరలోకము తెరువబడియుండుట చూచితిని. అప్పుడిదిగో, తెల్లని గుఱ్ఱమొకటి కనబడెను. దానిమీద కూర్చుండియున్నవాడు నమ్మకమైనవాడును సత్యవంతు డును అను నామము గలవాడు. ఆయన నీతినిబట్టి విమర్శ చేయుచు యుద్ధము జరిగించుచున్నాడు. హల్లెలూయా. విశ్వసించు ప్రతివానికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రము నకు సమాప్తియై ఉన్నాడు. 

2 కొరింథీ 5:21 కూడా చూడండి. ఎందుకనగా మనమాయనయందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మనకోసము పాపముగా చేసెను. 2 కొరింథీ 5:21. మనలను ఎదుట నీతి మంతులుగా చేయడానికి పాపము లేని మన రక్షకుడు పాపముగా చేయబడ్డాడు. మన అపరాధముల నిమిత్తము అప్పగింప బడ్డాడు. 

మనము నీతిమంతులముగా తీర్చబడుటకై లేపబడెను. రోమా 4:25 

యేసు క్రీస్తు మనకు దేవుని నీతి. అది ఉచితముగా మనకు అందించబడింది. 

కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే, క్రీస్తుయేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడు చున్నారు. రోమా 3:24 

మనమాయన కృప వలన నీతి మంతులమని తీర్చబడ్డాము. తీతు 3:6 

నీతి మంతుడు విశ్వాసమూలముగా జీవించాలి (రోమా 1:17). 

విశ్వాసి ఈ రోజు దేవుని నీతి ని సాధకము చేయాలి. 

నీవైతే వీటివి విసర్జించి, నీతిని భక్తిని విశ్వాసమును ప్రేమను ఓర్పును సాత్వికమును సంపాదించుకొనుటకు ప్రయాసపడుము. 1 తిమోతి 6:11

యేసు క్రీస్తు ప్రభువు బోధించినది అదే. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి; అప్పు డవన్నియు మీకనుగ్రహింపబడును.మత్తయి 6:33

నీతికొరకు ఆకలిదప్పులు గలవారు ధన్యులు; వారు తృప్తిపరచబడుదురు.మత్తయి 5:6

క్రైస్తవ విశ్వాసి పాపముల విషయమై చనిపోయి, నీతి  విషయమై జీవించాలి (1 పేతురు 2:24). మనం వెళ్లబోయే పరలోకములో నీతి నివసిస్తుంది (2 పేతురు 3:13). 

యేసు క్రీస్తు – మన పరిశుద్ధత 

ఆ తరువాత యేసు క్రీస్తు మనకు పరిశుద్ధత. పరిశుద్ధత అంటే ఏమిటి? మనం జీవముతో ఉండాలంటే  గాలి పీల్చుకోవాలి. ఈ గాలి పరిపూర్ణమైనది కాదు. అందులో అనేక కాలుష్యాలు మిళితమై ఉంటాయి. పరిపూర్ణ మైన గాలి, అపరిపూర్ణమైన గాలికి మధ్య తేడా ఏమిటి? కాలుష్య మైనవి, విషపూరితమైనవి పరిపూర్ణ మైన గాలిలో ఉండవు. 

     మనం తినే ఆహారం పరిపూర్ణమైనది కాదు. పరిపూర్ణమైన ఆహారం, అపరిపూర్ణమైన ఆహారం – వాటి మధ్య తేడా ఏమిటి? మనకు హాని చేసే పదార్థాలు పూర్తిగా వేరుచేయబడినప్పుడు మన ఆహారం పరిపూర్ణమవుతుంది. మనం త్రాగే నీటిలో నుండి మనకు మేలు చేయనివి పూర్తిగా వేరుచేయబడినప్పుడు ఆ నీరు పరిపూర్ణం అవుతుంది. 

      పరిశుద్ధత మనలను అసంపూర్ణ స్థితి లో నుండి పూర్ణ స్థితిలోకి మారుస్తుంది. పాపము నుండి మనం వేరు చేయబడినప్పుడు మనకు ఈ పరిశుద్ధత వస్తుంది. పాత నిబంధనలో ఈ సత్యం మనకు స్పష్టముగా అర్ధం అవుతుంది. హెబ్రీ భాషలో ‘కేదోషిమ్’ అనే పదం వాడబడింది. బైబిల్ లో అన్నిటి కంటే ఎక్కువగా ఈ పదం మనకు లేవీయ కాండము లో కనిపిస్తుంది. ఆరు సార్లు ఈ పదం లేవీయ కాండములో మనకు కనిపిస్తుంది. 

(11:44; 11:45; 19:2; 20:7; 20:26; 21:6)

26 మీరు నాకు పరిశుద్ధులై యుండవలెను. యెహోవా అను నేను పరిశుద్ధుడను. మీరు నావారై యుండునట్లు అన్య జనులలోనుండి మిమ్మును వేరుపరచితిని. లేవీయ కాండము 20:26 

నేను పరిశుద్ధుడను, మీరు కూడా పరిశుద్ధులై ఉండాలి. అందుకనే నేను మిమ్ములను అన్య జనులలో నుండి వేరు చేశాను. యేసు క్రీస్తు ప్రభువును మనం ఏ ఇతర దేవుడితో, దేవతతో కలుపకూడదు. ఆయన ప్రత్యేకమైన వాడు. యెహోవావంటి పరిశుద్ధ దేవుడు ఒకడును లేడు. 1 సమూయేలు 2:2

పరిశుద్ధత వేరు చేస్తుంది. దేవుడు ఇశ్రాయేలీయులతో అన్నాడు. 

మీరు ఆరాధించే దేవుడు వేరు 

మీరు ధరించే దుస్తులు వేరుగా ఉండాలి 

మీరు తినే ఆహారం వేరుగా ఉండాలి 

మీరు పెట్టుకొనే సంబంధాలు వేరుగా ఉండాలి 

మీ వివాహ సంబంధాలు వేరుగా ఉండాలి 

మీ లైంగిక సంబంధాలు వేరుగా ఉండాలి 

మీరు మాట్లాడే మాటలు వేరుగా ఉండాలి 

   నేను ఏమి తింటే దేవునికి ఎందుకు? అనడానికి లేదు. ఏ మాంసం తినవచ్చు, ఏ మాంసం తినకూడదు – వాటి గురించి దేవుడు స్పష్టమైన ఆజ్ఞలు ఇచ్చాడు. 

నేను ఎవరితో తిరిగితే దేవునికి ఎందుకు? అనడానికి లేదు. లైంగిక సంభందాలు ఎవరితో బడితే వారితో పెట్టుకోవడానికి లేదు. వాటి గురించి దేవుడు స్పష్టమైన ఆజ్ఞలు ఇచ్చాడు. దేవుడు వారి మధ్య ఒక ప్రత్యక్ష గుడారము వేసుకొని జీవించాడు. అందులో బయట ఒక ఆవరణం, ఒక పరిశుద్ధ మందిరం, దానిలో ఒక అతి పరిశుద్ధ స్థలం ఉన్నాయి. 

   అతి పరి శుద్ధ స్థలములో ఒక మందసము ఉంది. దాని మీద దేవుని సన్నిధి ఉండేది. దేవుని సన్నిధిలోకి ఎవరు బడితే వాళ్ళు ఎప్పుడు బడితే అప్పుడు వెళ్ళటానికి లేదు. ఇశ్రాయేలీయులు అందరూ బయట ఉండాల్సిందే. యాజకులు మాత్రమే లోపలికి వెళ్లగలిగేవారు. ఎటువంటి లోపం ఉన్నా వారికి  అందులోకి ప్రవేశం ఉండేది కాదు. దేవుని పరిశుద్ధత ప్రత్యక్ష గుడారము దగ్గర మనకు కనిపిస్తుంది. దేవుడు ఈ భూమి ఉన్నాడు, కానీ వేరుగా ఉన్నాడు. యేసు క్రీస్తు ప్రభువు కూడా ఈ లోకములో ఉన్నప్పుడు, ఆయన వేరుగా ఉన్నాడు. ఈ దేవుడు పరిశుద్ధుడు. ఆయన ప్రత్యక్షతలు ప్రత్యేకమైనవి. 

మండుచున్న పొదలో దేవుడు మోషే కు ప్రత్యక్షమయ్యాడు (నిర్గమ 3:1-6)

సీనాయి కొండ మీద ఒక మేఘములో దేవుడు ప్రత్యక్షమయ్యాడు (నిర్గమ 24:15-17)

ప్రత్యక్ష గుడారములో దేవుడు ప్రత్యక్షమయ్యాడు (నిర్గమ 40:34) 

పగలు మేఘ స్థంభముగా, రాత్రి అగ్ని స్థంబముగా ఇశ్రాయేలీయుల ముందు నడిచాడు (నిర్గమ 40:35-38)

యెరూషలేము లో సొలొమోను రాజు దేవుని ఆలయం నిర్మించినప్పుడు కూడా దేవుడు ఆ ఆలయములో వారికి ప్రత్యక్షమయ్యాడు (1 రాజులు 8:10-11) 

ఆ ప్రత్యక్షతలు మొత్తం తాత్కాలికమైనవే, అసంపూర్ణమైనవే. అయితే మన ప్రభువైన యేసు క్రీస్తు నందు కలిగిన దేవుని ప్రత్యక్షత శాశ్వతమైనది. సంపూర్ణమైనది. 

ఆ వాక్యము శరీరధారియై, కృపాసత్యసంపూర్ణు డుగా మనమధ్య నివసించెను 

యోహాను 1:14 

    ఇక్కడ యోహాను గారు  యేసు క్రీస్తు ప్రభువును ప్రత్యక్ష గుడారముతో పోల్చాడు. యేసు క్రీస్తు నందు ఒక్క పాపము కూడా లేదు. ఏ ఒక్క పాపము కూడా చేయ కుండా ఈ ప్రపంచములో జీవించిన ఏకైక మనిషి యేసు క్రీస్తు ఒక్కడే. ప్రత్యక్ష గుడారం దేవుని ప్రజలను ఇతరుల నుండి వేరుచేసింది. యేసు క్రీస్తు ప్రభువు చేసింది అదే. ఆయన దేవుని కొరకు తన వారిని ఈ లోకములో నుండి వేరుచేసి పరిశుద్ధ పరచాడు. 

యేసు క్రీస్తు పరిశుద్ధత యొక్క ఆవశ్యకతను మనకు బోధించాడు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు. వారు దేవుని చూచెదరు (మత్తయి 5:8) 

    పాత నిబంధనలో దేవుడు పరిశుద్ధత ను తన ప్రజలలో కోరాడు. కానీ యేసు ప్రభువు మన పాపముల కొరకు మరణించాడు కాబట్టి మనకు పరిశుద్ధత అక్కర లేదు అనుకొనే వారు ఉన్నారు. అయితే అది పొరపాటు. 

   పాత నిబంధనలో తన ప్రజలు ఇతరులకు వేరుగా ఉండాలి అని కోరుకొన్న దేవుడు, క్రొత్త నిబంధనలో కూడా తన ప్రజలు ఇతరులకు వేరుగా ఉండాలి అని కోరుకొంటున్నాడు. వేరుచేయబడుట దాని అర్థం నేను ఎవరినీ కలవను, ఎవరితో మాట్లాడను అని కాదు. పౌలు గారు మనకు బోధించాడు. 

ఎఫెసీ 5:3-4 

3 మీలో జారత్వమే గాని, యే విధమైన అపవిత్రతయే గాని, లోభత్వమేగాని, వీటి పేరైనను ఎత్తకూడదు, ఇదే పరిశుద్ధులకు తగినది.

4 కృతజ్ఞతావచనమే మీరుచ్చరింపవలెను గాని మీరు బూతులైనను, పోకిరిమాటలైనను, సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు; ఇవి మీకు తగవు.

మనం మాట్లాడే మాటల్లో పరిశుద్ధత కనిపించాలి 

మనం చూసే చూపుల్లో పరిశుద్ధత ఉండాలి 

మనం చెప్పుకొనే జోక్స్ లో పరిశుద్ధత ఉండాలి 

మనం చేసే పనుల్లో పరిశుద్ధత ఉండాలి 

మన క్రియలలో మనం ప్రత్యేకముగా ఉండాలి. 

మన ఆరాధనలో ప్రత్యేకత ఉండాలి (రోమా 12:1) 

   రక్షించబడిన వారు  రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తయిన ప్రజలుగా ఉండాలి అని దేవుని ఉద్దేశ్యం (1 పేతురు 2:9). పరిశుద్ధు లగుటకే దేవుడు మనలను పిలిచెనుగాని అపవిత్రులుగా ఉండుటకు పిలువలేదు (1 థెస్సలొనీక 4:7).  పరిశుద్ధులుగా జీవించడానికి దేవుడు మనలను పిలిచాడు (1 తిమోతి 1:9). ఆ విధముగా యేసు క్రీస్తు ప్రభువు మనకు పరిశుద్ధత. He is our Sanctification. మనలను దేవుని ఎదుట పరిశుద్ధులనుగా చేసి, ఈ లోకములో మనలను పరిశుద్ధులుగా ఉండుటకు ఆయన మనలను పిలుచుకొన్నాడు, వేరు చేశాడు. 

యేసు క్రీస్తు ప్రభువు – మన విమోచన 

ఆ తరువాత యేసు క్రీస్తు ప్రభువు మన విమోచన. 

యేసు క్రీస్తు ప్రభువు మనకు ‘పరిశుద్ధత’ గా ఉండాలంటే ముందుగా ఆయన మనలను విమోచించాలి. యోహాను సువార్త 8:32 లో మనం చదువుతాము. పాపము చేయు ప్రతివాడును పాపమునకు దాసుడు. మనం దేవుని ఎదుట పరిశుద్ధులముగా చేయబడాలంటే పాపము యొక్క దాస్యం నుండి విడిపించబడాలి. అదే విమోచన. విమోచించడం సామాన్యమైన పని కాదు. దానికి ఎంతో శక్తి కావాలి. దానికి ఎంతో వెల చెల్లించాలి. ఒక బానిసను విడిపించాలంటే ఏమి చేయాలి? ఆ బానిస యొక్క యజమాని మీతో అనవచ్చు. నాకు 50 లక్షలు కట్టు. ఈ బానిసను నీతో తీసుకెళ్లవచ్చు. అంత వెల నేను కట్టలేను అని మీరు అనవచ్చు. లేక అంత వెల నేను కట్టగలను కానీ ఈ బానిస కొరకు అంత వెల చెల్లించడం నాకు ఇష్టం లేదు అని మీరు అనవచ్చు. ఆ బానిస యొక్క యజమాని మీ మాట వినకపోవచ్చు. ‘నువ్వు ఎంత వెల కట్టినా, ఈ బానిసను నేను నీకు ఇవ్వను, పో’ అనవచ్చు. అలాంటి సందర్భాల్లో ఆ యజమానితో పోరాడే శక్తి మీకు ఉండాలి. లేకపోతే మీరు ఆ బానిసను విడిపించలేరు. ఆ విధముగా ఒక బానిసను విడిపించాలంటే శక్తి ఉండాలి, వెల చెల్లించగలిగి ఉండాలి. పాపము క్రింద ఉన్న బానిసను విడిపించ గలిగే శక్తి ఎవరికి ఉంది? అతని కొరకు వెల చెల్లించేది ఎవరు? 

   ఇశ్రాయేలీయులు ఐగుప్తులో బానిసలుగా ఉన్నారు. ఫరో యొక్క బలమైన హస్తం క్రింద వారు నలుగుతూ ఉన్నారు. మోషే, అహరోను లు ఫరో చక్రవర్తి ని అభ్యర్ధించారు. ‘అయ్యా, మమ్ములను వెళ్లనివ్వు. మాకు స్వాతంత్రం ఇవ్వు’ వారి మాటలు విని ఫరోకు చెప్పరాని కోపం వచ్చింది. ఎక్కడికిరా వెళ్ళేది? నా క్రిందే పడి ఉండండి అన్నాడు. ఫరో చేతి క్రింద నుండి బయట పడడం ఆషామాషీ వ్యవహారం కాదు. ఆ పనిచేయడం మోషే వల్ల కాదు. అహరోను వల్ల కాదు. దేవుని యొక్క బలమైన హస్తం కావాలి. దేవుడు తన ప్రజలను తన శక్తితో విమోచించాడు. వారు ఐగుప్తు దేశం వదలి వెళ్లే ముందు వారికి పస్కా పండుగ ను నియమించాడు. మనలను విమోచించడానికి దేవుడు ఎంత గొప్ప వెల చెల్లించాడో పస్కా పండుగలో మనకు కనిపిస్తుంది. వారు ఒక నిర్దోషమైన గొఱ్ఱె పిల్లను తీసుకొని దానిని చంపి, దాని రక్తమును వారి ఇంటి ద్వారము మీద పూసుకోవాలి. ‘నేను ఆ రక్తమును చూసి మిమ్ములను నశింపజేయక దాటిపోయెదను’ అని దేవుడు వారితో అన్నాడు. తన ప్రజలను విమోచించడానికి దేవుడు వెల చెల్లించాడు. పస్కా పండుగలో యేసు క్రీస్తు మన విమోచనగా కనిపిస్తున్నాడు. 

19 అమూల్యమైన రక్తముచేత, అనగా నిర్దోషమును నిష్కళంకమునగు గొఱ్ఱపిల్లవంటి క్రీస్తు రక్తముచేత, విమోచింపబడితిరని మీరెరుగుదురు గదా 1 పేతురు 1:19 

ప్రభువైన యేసు క్రీస్తు – మనలను విమోచించుటకు శక్తి కలిగిన రక్షకుడు. మన కొరకు వెల చెల్లించడానికి ఇష్టపడిన రక్షకుడు. గ్రీకు తత్వవేత్త ప్లేటో తన కథలో చెప్పాడు. ఒక గుహలో బంధించబడిన బానిసలుగా మనం ఉన్నాము. మనకు సూర్యుడు కనిపించడం లేదు. కేవలం ఛాయలు మాత్రమే మనం చూస్తున్నాము. మనలను ఈ చీకటి గుహలో నుండి ఎవరు విడిపిస్తారు? మనకు వేయబడిన సంకెళ్లను ఎవరు త్రుంచి వేస్తారు? దేవునికి స్తోత్రం. యేసు క్రీస్తు మనకు విమోచకుడుగా వచ్చాడు. మనలను విమోచించడానికి వచ్చాడు. సాతాను చీకటిలో నుండి దేవుని యొక్క ఆశ్చర్యకరమైన వెలుగులోనికి ఆయన మనలను పిలిచాడు (1 పేతురు 2:9). పస్కా పండుగలో గొఱ్ఱె పిల్ల అర్పించబడింది. దాని రక్తము క్రింద దాక్కుని ఇశ్రాయేలీయులు రక్షణ పొందారు. నేను ఆ రక్తమును చూచి మిమ్ములను నశింపజేయక దాటిపోయెదను అని దేవుడు ఇశ్రాయేలీయులతో అన్నాడు. మనం కూడా దేవుని గొఱ్ఱె పిల్ల యేసు క్రీస్తు రక్తము క్రిందకు వెళ్లి  దేవుని తీర్పు నుండి రక్షణ పొందాము. ఆయన రక్తం మనలను విమోచించింది. 

1 పేతురు 1:20 కూడా చూడండి.  ఆయన జగత్తు పునాది వేయబడక మునుపే నియ మింపబడెను. 

ఆ మాట మీరు గమనించండి. ప్రో యజ్ఞో స్మెను. అంటే దేవుని యొక్క భవిష్యత్తు జ్ఞానం.  జగత్తు పునాది వేయబడక మునుపే యేసు క్రీస్తు ప్రభువు మన విమోచకునిగా నియమించబడ్డాడు. అక్కడ దేవుని జ్ఞానం మనకు కనిపిస్తుంది. “మనిషి ని నా రూపములో సృష్టిస్తాను, బాగానే ఉంది. కానీ వారు నాకు అవిధేయులై, పాపం చేస్తే నేను ఏమిచేయాలి?” అని దేవుడు ముందే ఆలోచించాడు. మన కొరకు యేసు క్రీస్తును విమోచకునిగా నియమించాడు. ఆ విధముగా మన విమోచనలో దేవుని జ్ఞానం మనకు కనిపిస్తుంది. దేవుని జ్ఞానం, దేవుని నీతి, దేవుని పరిశుద్ధత, దేవుని విమోచన ఈ నాలుగు కలిసే వెళ్తున్నాయి. అవి ఒక దానితో ఒకటి పెనవేసుకొని ఉన్నాయి. అవి ఒక దానిని ఒకటి ముందుకు నడిపిస్తున్నాయి. 

దేవుని పరిశుద్ధత లేకుండా దేవుని జ్ఞానం లేదు 

దేవుని జ్ఞానం లేకుండా దేవుని విమోచన లేదు. 

యెహోవాయందు భయభక్తులు కలిగియుండుట తెలి వికి మూలము సామెతలు 1:7 

The fear of the Lord is the beginning of wisdom 

దేవునికి భయపడకపోతే మన జీవితములో పరిశుద్ధత ఉండదు. 

పరిశుద్ధత కావాలంటే దేవునికి భయపడాలి. దేవునికి భయపడడమే జ్ఞానము. ఆ విధముగా క్రైస్తవ జీవితములో దేవుని భయం, పరిశుద్ధత, జ్ఞానము కలిసి వెళ్లడం మనం చూస్తున్నాము. 

   ప్రభువైన యేసు క్రీస్తు మనకు జ్ఞానం, నీతి, పరిశుద్ధత, విమోచన అయ్యాడు. దేవుని కి స్తోత్రం. అదే కొరింథీయులకు వ్రాసిన పత్రిక ముఖ్య సందేశం. 

Leave a Reply