వరల్డ్ కప్ : క్రికెట్ లో కనిపిస్తున్న క్రైస్తవ సత్యాలు

భారత దేశం మొత్తం ఇప్పుడు ప్రపంచ కప్ క్రికెట్ ఉత్సాహములో ఉంది. ఎవరిని కదిపించినా క్రికెట్ గురించిన వార్తలు, విశేషాలతోనే సంభాషణలు కొనసాగుతున్నాయి. ఆస్ట్రేలియా ప్రపంచ కప్ గెలుచుకోవటం అభినందనీయం. ఈ వరల్డ్ కప్ క్రికెట్ చాంఫియన్ షిప్ సందర్భముగా మీకు ఒక ప్రేమ సందేశం ఇవ్వాలని నేను ఆశపడుతున్నాను. క్రికెట్ ఆట కోట్లాదిమంది జీవితములను విశేషముగా ప్రభావితం చేస్తున్నది. కేవలం ఒక గేమ్ మాత్రమే కాకుండా వ్యక్తిత్వ విలువలు పెంచే మంచి శిక్షణ వలె కూడా క్రికెట్ మనకు ఉపయోగపడుతుంది. నా చిన్న తనములో సమయం దొరికినప్పుడల్లా నేను క్రికెట్ ఆడుతూ ఉండేవాడిని. క్రొత్త వ్యక్తుల్ని కలవడం, శ్రమించడం, క్రమశిక్షణ, ఓర్పు, అణకువ లాంటివి నేర్చుకోవడం క్రికెట్ వలన మనకు దొరుకుతాయి. క్రైస్తవ్యం బోధించే అనేక మంచి లక్షణాలు క్రికెట్ లో కూడా మనకు కనిపిస్తాయి. 500 సంవత్సరాల క్రితం ఇంగ్లాండ్ దేశములో కొంతమంది క్రైస్తవ యువకులు ఈ ఆటను కనిపెట్టారు. అనేక బైబిల్ సత్యాలు క్రికెట్ ఆటలో వారు పొందుపరచారు. 

    బ్రిటిష్ సామ్రాజ్యము ప్రపంచ మంతా విస్తరించడం వలన క్రికెట్ కూడా అనేక దేశాలకు వెళ్ళింది. ఈ రోజు అనేక దేశాల్లో క్రికెట్ ఎంతో ప్రజాదరణ పొందిన గేమ్ గా మారింది. కాల క్రమేణా ‘క్రికెట్ స్పిరిట్’ అనే భావజాలం వ్యాపించింది. దేవుని యొద్ద నుండి నేర్చుకొనిన సత్యాలనే గొప్ప క్రీడాకారులు ఈ క్రికెట్ స్పిరిట్ లో ఉంచారు. 

Hard work 

మొదటిగా హార్డ్ వర్క్. ఒక క్రికెటర్ గా ఎదగాలంటే ఎంతో శ్రమ పడాలి. ఒక మంచి బ్యాట్స్ మన్ గా లేక ఒక మంచి బౌలర్ గా  మారాలంటే ఎన్నో సంవత్సరాలు కష్టపడాలి. పీటర్ పొల్లాక్ (జననం 1941) సౌత్ ఆఫ్రికా దేశానికి చెందిన గొప్ప ఫాస్ట్ బౌలర్. 1965 లో జరిగిన ఒక టెస్ట్ మ్యాచ్ లో ఆయన 10 వికెట్లు తీసుకొన్నాడు. చిన్న తనములోనే యేసు క్రీస్తు ప్రభువును రక్షకునిగా హత్తుకున్నాడు. అంతే కాకుండా క్రికెట్ ఆడని సమయాల్లో యేసు క్రీస్తు సువార్త ప్రకటిస్తూ ఉండేవాడు. 

   ఆయన Gods Fast Bowler ని ఒక ఆత్మ కథ వ్రాశాడు. దేవుని మహిమ కోసమే క్రికెట్ ఆడుతున్నాను అని అందులో వ్రాశాడు. ఆయన కుమారుడు షాన్ పొల్లాక్ కూడా గొప్ప క్రికెట్ ప్లేయర్. ఆ పుస్తకానికి షాన్ పొల్లాక్ ముందు మాట వ్రాశాడు. ఆయన మాటలు ఇలా ఉన్నాయి: 

Shaun Pollock, 

“He values hard work, a balanced lifestyle and is committed to Christ”. “With all the worldly success my father has achieved on the sports field and elsewhere,he sees himself as a servant, using his achievements as a catalyst to bring the Word of God to all people. As a devoted evangelist, he displays the same tenacity that had made him such an accomplished fast bowler.” 

“క్రీస్తు కొరకు జీవిస్తూ శ్రమపడడం మా నాన్న గారికి ఇష్టం. ఈ ప్రపంచములో ఎంత గొప్ప పేరు ప్రఖ్యాతులు వచ్చినప్పటికీ ఆయన తన విజయాలను దేవుని వాక్యం ప్రజలకు అందించడానికే ఉపయోగించుకున్నాడు. దేవుని సేవకుని గా తనను ఆయన చూసుకున్నాడు. ఫాస్ట్ బౌలర్ గా ఎంత శ్రమించేవాడో సువార్తికునిగా కూడా అంతే శ్రమించాడు”

   ఆ మాటలు నాకు నచ్చాయి. పీటర్ పొల్లాక్ అంత గొప్ప క్రీడాకారుడు గా ఎదిగినప్పటికీ, క్రీస్తు సేవకునిగానే గుర్తింపు పొందడానికి ఆయన ఇష్టపడ్డాడు. ఆయన నాయకత్వములో సౌత్ ఆఫ్రికా టీం మంచి టీం గా ఎదిగింది. 1 కొరింథీ పత్రికలో పౌలు వ్రాసిన మాటలు ఆయనకు స్ఫూర్తిని ఇచ్చాయి. 

పందెపు రంగమందు పరుగెత్తువారందరు పరుగెత్తుదురుగాని యొక్కడే బహుమానము పొందునని మీకు తెలియదా? అటువలె మీరు బహుమానము పొందునట్లుగా పరుగెత్తుడి.

        1 కొరింథీ 9:24-27

మీరు బహుమానము పొందునట్లుగా పరుగెత్తుడి. అన్ని విషయాల్లో మితముగా ఉండండి. ఈ లోక సంబంధమైనవి క్షయమైనవి. వరల్డ్ కప్ లు, గోల్డ్ మెడలు సాధించడం మంచిదే అయితే అవి క్షయమైనవే. దేవుడు ఇచ్చే అక్షయమైన కిరీటం కోసం మనం పాటుపడాలి. పీటర్ పొల్లాక్ ఆ విధముగా సౌత్ ఆఫ్రికా టీం ని దేవుని వాక్యంలో నింపి, ప్రపంచములోనే అత్యుత్తమ జట్లలో ఒక దానిగా మార్చాడు. 

బలము పొందుట 

క్రికెట్ ఎంతో శ్రమతో కూడుకొన్న ఆట. చాలా మంది ప్లేయర్స్ ఒళ్ళు నొప్పులతో మైదానంలో పడిపోవడం మనం చూస్తూ ఉంటాము. మానసికముగా కృంగిపోవడం కూడా జరుగుతుంది. రెవరెండ్ సర్ వెస్లీ విన్ ఫీల్డ్ గొప్ప క్రికెట్ ప్లేయర్. వెస్ట్ ఇండీస్ జట్టుకు ఆయన ఎంతో సేవలు చేశాడు. ఒక క్రైస్తవ సంఘానికి పాస్టర్ గా ఉంటూనే  క్రికెట్ ని కూడా ప్రేమించాడు. ప్రపంచములోనే ఒక గొప్ప బౌలర్ గా గ్యారీ సోబెర్స్ ఆయన పేరు చెప్పేవాడు.రెవరెండ్  వెస్లీ విన్ ఫీల్డ్ కృంగిపోయిన ప్రతి సారీ దేవుని వాక్యం తో బలపరచబడ్డాడు. 

బాలురు సొమ్మసిల్లుదురు అలయుదురు, యవ్వనస్తులు తప్పక తొట్రిల్లుదురు. యెహోవాకొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. యెషయా 40:30-31

యెహోవాకొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. క్రికెట్ లో ఏ సమస్యవచ్చినా, వెస్లీ విన్ ఫీల్డ్ దేవుని వైపు చూచి బలము పొందేవాడు. గొప్ప క్రికెటర్ గా మారాడు. బార్బొడాస్ లో ఓవల్ స్టేడియం బయట ఆయన విగ్రహం కూడా వెస్ట్ ఇండీస్ వారు పెట్టుకొన్నారు. 

ఫెయిర్ నెస్ : సమానత్వం 

  భారత దేశానికి స్వాతంత్రం రాక మునుపు మన నాయకులు బ్రిటిష్ వారితో సమావేశాలు పెట్టుకునేవారు. బ్రిటిష్ వారు అన్యాయముగా మాట్లాడితే, that is not fair cricket అని మన వారు వారిని విమర్శించేవారు. మనం తొండి చేస్తున్నాము. మనం అన్యాయం చేస్తున్నాము అని అప్పుడు బ్రిటిష్ వారికి చక్కగా అర్థం అయ్యేది. మొన్న శ్రీలంక, బంగ్లాదేశ్ మ్యాచ్ లో ఏంజిలో మాథ్యూ స్ బాటింగ్ కి వెళ్ళాడు. ఆయన హెల్మెట్ బాగా లేదు. దానిని సరిచేసుకొంటూ ఉన్నాడు. వెంటనే బంగ్లాదేశ్ కెప్టెన్ అంపైర్ దగ్గరికి వెళ్లి మాథ్యూ స్ సమయం అయిపొయింది. అతణ్ణి అనర్హుడిగా ప్రకటించండి అన్నాడు. ఒక్క బాల్ కూడా ఎదుర్కోకుండానే మాథ్యూస్ పెవిలియన్ కు చేరుకొన్నాడు. 

    క్రికెట్ రూల్స్ ప్రకారం మాథ్యూస్ టైండ్ అవుట్ అయ్యాడు. దానిని చూసిన వారు బంగ్లాదేశ్ కెప్టెన్ ని ఛీ కొట్టారు. హెల్మెట్ బాగాలేదు, రెండు నిమిషాలు ఓపిక పట్టలేవా? అని చివాట్లు పెట్టారు. క్రికెట్ లో ఓర్పు, శాంతం, ప్రేమ ఉండాలి. ఆ లక్షణాలే మంచి క్రికెటర్ ని చేస్తాయి. 

Integrity 

క్రికెట్ లో కనిపించే మరొక విలువ – నిజాయితీ. గెలిచినా, ఓడిపోయినా మనం నిజాయితీగా ఆడాలి. డబ్బులు తీసుకొని ఓడిపోవడం లాంటివి చేయకూడదు. 2000 వ సంవత్సరములో సౌత్ ఆఫ్రికా టీం మన దేశములో క్రికెట్ ఆడడానికి వచ్చింది. హాన్సీ క్రోన్యే సౌత్ ఆఫ్రికా టీం కి కెప్టెన్ గా ఉన్నాడు. మీ జట్టు ఓడిపోతే నీకు లక్ష డాలర్లు లంచం ఇస్తాము అని క్రికెట్ మీద బెట్టింగ్ చేసేవారు హాన్సీ క్రోన్యే ని కలిసి చెప్పారు. డబ్బుకి కక్కుర్తి పడి హాన్సీ క్రోన్యే తన జట్టుకు గడ్డి తినిపించాడు. ఆయన జట్టులో హర్ షెల్ గిబ్స్, హెన్రీ విల్లియమ్స్ అని ఇద్దరు మంచి ఆటగాళ్లు ఉన్నారు. హాన్సీ క్రోన్యే వారితో ఏమన్నాడంటే, గిబ్స్, నువ్వు 20 రన్స్ కంటే ఎక్కువ కొట్టొద్దు. నా మాట వింటే నీకు 15 వేల డాలర్లు ఇస్తాను అన్నాడు. 

    హెన్రీ విల్లియమ్స్ తో, ‘హెన్రీ, నువ్వు ఫీల్డింగ్ చెత్త, చెత్తగా చెయ్యి. ఎంత చెత్తగా చేయాలంటే, నీ వైపు కొట్టిన బౌండరీలు ఆపవద్దు, క్యాచ్ వస్తే మిస్ అవుతూ ఉండు. నీ వలన కనీసం 50 పరుగులు మన ప్రత్యర్థులు చేయగలగాలి అన్నాడు. ఆ విధముగా సౌత్ ఆఫ్రికా జట్టు ఓడిపోవడానికి దాని కెప్టెన్ కారకుడు అయ్యాడు. 

నాయకత్వం 

క్రికెట్ లో మనకు కనిపించే మరొక విలువ మంచి నాయకత్వం. హాన్సీ క్రోన్యే నాయకత్వములో సౌత్ ఆఫ్రికా జట్టు అక్రమాల పుట్టగా పేరు తెచ్చుకొంది. ‘డబ్బులు ఇస్తే చాలు, ఓడిపోవడానికి వారు ఎప్పుడూ రెడీ గా ఉంటారు అని అందరూ చెప్పుకొనే స్థితికి ఆ జట్టు వెళ్ళిపోయింది. హాన్సీ క్రోన్యే అవినీతి బయటికి వచ్చినప్పుడు ఆయన జీవిత కాలం నిషేధం విధించారు. అప్పుడు 2000 సంవత్సరం ఏప్రిల్ నెలలో సౌత్ ఆఫ్రికా జట్టు నాయకత్వం షాన్ పొలాక్ కి ఇచ్చారు. 

    ఈ షాన్ పొల్లాక్ పీటర్ పొలాక్ గారి కుమారుడు. మంచి ఆల్ రౌండర్ గా పేరు తెచ్చుకొన్నాడు. ఈ కెప్టెన్సీ ని నేను దేవుని మహిమ కోసం చేయాలి అని షాన్ పొల్లాక్ చెప్పాడు. ప్రతి మ్యాచ్ ముందు ఆయన కొంత సేపు ప్రార్థనలో గడిపేవాడు. ఆయన కెప్టెన్సీ లో సౌత్ ఆఫ్రికా జట్టు మళ్ళీ నిలదొక్కుకొంది. 

Human equality 

క్రికెట్ లో కనిపించే మరొక మంచి విలువ సమానత్వం. ఒక రోజుల్లో తెల్ల జాతి వారు తెల్ల జాతి వారితోనే క్రికెట్ ఆడేవారు. తెల్ల జాతి లో కూడా ధనవంతులు ధన వంతులతో మాత్రమే ఆడేవారు. పేద బ్యాక్ గ్రౌండ్ ఉన్న వారితో ధనవంతులు క్రికెట్ ఆడటానికి ఇష్టపడేవారు కాదు. అయితే క్రికెట్ లో సమానత్వము పెరగడం జరిగింది. గ్యారీ సోబెర్స్ అని ఉండేవాడు. ఆయన చాలా గొప్ప క్రికెట్ ప్లేయర్. అయితే ఆయన నల్లవాడు కావడం వలన తెల్లవాళ్లు ఆయనతో ఆడడానికి ఇష్టపడేవారు కాదు. 

   ముఖ్యముగా సౌత్ ఆఫ్రికా జట్టులో నల్ల జాతి వారికి స్థానం ఉండేది కాదు. ప్రసిద్ధ క్రీడాకారుడు డోనాల్డ్ బ్రాడ్మన్ ఒక సారి సౌత్ ఆఫ్రికా వెళ్ళినప్పుడు ఆ దేశం ప్రధాన మంత్రి జాన్ వోర్స్టెర్ ని కలిసాడంట. మాటల్లో ఆయనను అడిగాడంట. ‘మీ జట్టులోకి నల్లవాళ్ళను ఎందుకు తీసుకోరు?’ దానికి ఆ ప్రధాన మంత్రి, ‘నల్లవారికి క్రికెట్ ఆడేంత జ్ఞానం లేదు’ అన్నాడు. 

   డోనాల్డ్ బ్రాడ్మన్ అప్పుడు, ‘ప్రధాన మంత్రి గారు, గ్యారీ సోబెర్స్ పేరు మీరు విన్నారా?’ అని అడిగాడంట. నల్ల వారికి క్రికెట్ ఆడడం చేతకాదు అనే రోజుల్లో గ్యారీ సోబెర్స్ ప్రపంచములోనే గొప్ప క్రికెట్ ప్లేయర్ గా ఎదిగాడు. ఆయన లాంటి వారి వలన నల్లవారు కూడా తెల్లవారితో క్రికెట్ ఆడే మార్పు వచ్చింది. మన దేశములో కూడా వివక్ష ను తగ్గించడానికి క్రికెట్ ఎంతో తోడ్పడింది. 

   లగాన్ సినిమాలో స్వాతంత్రం రాక మునుపు బ్రిటిష్ వారితో భారతీయులు  క్రికెట్ పోటీ పెట్టుకోవడం మనం చూస్తాము. భారత జట్టులో ఒక దళిత వ్యక్తి ఉంటాడు. అతనితో కలిసి మేము ఆడం అని ఇతురులు అంటారు. అప్పుడు వారి కెప్టెన్ ‘అది తప్పు. క్రికెట్ లో సమానత్వం ఉండాలి’ అని వారితో అంటాడు. భారత దేశము జట్టులో మహ్మద్ షామి అని మంచి బౌలర్ ఉన్నాడు. ఆయన ముస్లిం. పాకిస్తాన్ తో జరిగిన ఒక మ్యాచ్ లో భారత్ ఓడిపోయింది. అప్పుడు చాలా మంది క్రికెట్ అభిమానులు ఆయన మీద విరుచుకుపడ్డారు. ఆయన ముస్లిం బ్యాక్ గ్రౌండ్ మీద కూడా వారు విమర్శలు చేశారు. 

    ఆ సమయములో విరాట్ కోహ్లీ మహ్మద్ షామి కి అండగా నిలిచాడు. కోహ్లీ ఏమన్నాడంటే, ‘Attacking someone over religion is the most pathetic thing’ మతం పేరుతో ఒక వ్యక్తి మీద దాడి చేయడం చాలా నీచమైన పని. ‘Attacking someone over religion is the most pathetic thing’. ప్రతి చిన్న విషయములో మత ప్రస్తావన తెచ్చి అర్థం లేని ఆరోపణలు చేయడం ఇప్పుడు సోషల్ మీడియా లో సర్వసాధారణం గా మారింది. కనీసం క్రికెట్ లో కోహ్లీ లాంటి గొప్ప క్రీడాకారుల వలన దానిని ఎదుర్కోవడం మనం చూస్తున్నాము. 

Perseverance

ఆ తరువాత క్రికెట్ లో కనిపించే మరొక మంచి విలువ పట్టుదల. భారత దేశం జట్టులో యువరాజ్ సింగ్ అనే ఆటగాడు ఉండేవాడు. ఆయన మంచి ఫామ్ లో ఉన్నప్పుడు లంగ్ కాన్సర్ వచ్చింది. ఎంతో బలహీనపడ్డాడు. ఎంతో ఢీలా పడ్డాడు. అయితే కృంగిపోకుండా, పట్టుదలతో కాన్సర్ తో పోరాటం చేశాడు. The Test of my life అని ఒక పుస్తకం రచించాడు. అందులో ఏమని వ్రాశాడంటే, “Did I ask for cancer? That night, when I was asking God to make a deal with me, did I tempt fate? When you are ill, when you are down,these questions can come and haunt you.” “But you should square your shoulders and look them in the eye. Look over your life. Count your blessings. Like me you will come around to the view that all in all,like in cricket, everything balances out and it all ends up OK”. 

కాన్సర్ కావాలని నేను దేవుని అడిగానా? నాకు మంచి జరిగినప్పుడు, ఎందుకు ఇలా చేశావు? అని దేవుని ప్రశ్నించలేదు కదా? నాకు చెడు జరిగినప్పుడు, ఎందుకు ఇలా చేశావు అని దేవుని ఎలా ప్రశ్నించగలను. ఇప్పుడు కూడా దేవుడు నాకు చేసిన మేలులను నేను లెక్కిస్తాను. క్రికెట్ ఆటలో వలె జీవితములో కూడా అన్నీ మన మంచికే జరుగుతాయి’. ఇంగ్లాండ్ దేశములో C.T. స్టడ్ అని ఒక క్రికెట్ ప్లేయర్ ఉండేవాడు. 

క్రికెట్ లో ఆయన గొప్ప క్రీడాకారుడిగా పేరు తెచ్చుకొన్నాడు. అయితే సువార్త ప్రకటించడం ముఖ్యం అనుకొన్నాడు. క్రికెట్ లో నేర్చుకొన్న ధైర్యం, ఆత్మ నిగ్రహం, పట్టుదల నాకు దేవుని సేవలో కూడా ఎంతో ఉపయోగపడ్డాయి అని CT స్టడ్ అన్నాడు. చైనా దేశానికి మిషనరీ గా వెళ్లి అక్కడ క్రీస్తు సువార్త ప్రకటించాలి అని ఆయన నిర్ణయం తీసుకొన్నాడు. దేవుడు నా ప్రతి అవసరం తీరుస్తాడు అని ఒక పద్యం కూడా వ్రాశాడు. Only One Life అనే ఈ కవిత ఎంతో ప్రసిద్ధి చెందింది. 

Only one life,

 It will soon be past, 

Only what’s done

 for Christ will last.

నాకు ఉన్నది ఒక్క జీవితమే.  ఇది కూడా తొందరగా గతిస్తుంది. కేవలం క్రీస్తు కొరకు చేసినది మాత్రమే నిలుస్తుంది. 

హెబ్రీ 12 లోని మాటలు CT STudd ఎంతో ఇష్టపడేవాడు. 

విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు, మన యెదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరుగెత్తుదము. 

                 హెబ్రీయులకు 12:1-2 

గొప్ప సాక్షి సమూహం ఒక పెద్ద క్రికెట్ స్టేడియం వలె ఆయనకు అనిపించింది. క్రీస్తు వైపు చూస్తూ పరుగెత్తే పరుగు పందెము వలె ఆయన తన జీవితాన్ని చూశాడు. ఇది నా కోసం కాదు, దేవుని మహిమ కోసం C.T. స్టడ్ క్రికెట్ ని ఆ విధముగా చూశాడు. ఇప్పుడు మన వాళ్ళు ఎలా తయారయ్యారంటే, క్రికెట్ మా మతం, సచిన్ మా దేవుడు అంటున్నారు. నేను మొన్న ఒక క్రికెట్ మ్యాచ్ చూస్తున్నాను. కొంతమంది వీరాభిమానులు Cricket is our religion, Sachin is our God అని అరుస్తూ ఉన్నారు. 

  మొన్న విరాట్ కోహ్లీ సరిగ్గా బ్యాటింగ్ చేయలేదని ఒక రిటైర్డ్ రైల్ వే ఉద్యోగి పెట్రోలు పోసుకొని తగల బెట్టుకొన్నాడు. ఎవడో, ఎక్కడో, ఏ దేశములోనే సరిగ్గా బ్యాటింగ్ చేయలేదని అమూల్యమైన ప్రాణాలు తీసుకొన్నాడు. ఒక స్కూలు కెళ్లే పిల్లోడు కూడా కాదు. ఉద్యోగం చేసి  రిటైర్ అయిన వ్యక్తి. ఎవడో సరిగ్గా బ్యాటింగ్ చేయలేదని, ఎవడో సరిగ్గా బౌలింగ్ చేయలేదని నీ ప్రాణం తీసుకోవద్దు. దేవుని చిత్తం అది కాదు. మన వాళ్ళు చేస్తున్న పిచ్చి పనుల్లో ఇది ఒకటి. క్రికెట్ ని ఒక మతముగా మార్చారు. క్రికెటర్ల ను దేవుళ్లుగా కొలుస్తున్నారు. C.T స్టడ్ గారు దేవునికి మహిమ ఇచ్చాడు.ఆదివారం వస్తే చాలు క్రికెట్, క్రికెట్ అని పరుగెత్తే వారు ఎంతో మంది ఉన్నారు. దేవుని కంటే క్రికెట్ ని వీరు ఎక్కువగా ప్రేమిస్తున్నారు. 

     షాన్ పొల్లాక్ ప్రపంచ ప్రసిద్ధ క్రికెట్ ఆల్ రౌండర్. ప్రతి ఆదివారం దేవుని సన్నిధిలో ఆరాధనలో ఉంటాడు. క్రికెట్ ఆడి ఆనందించండి కానీ దానిని ఒక విగ్రహం గా చేసుకోకండి అని  C.T స్టడ్ గారు అనే వాడు. క్రికెట్ నేర్పించే మంచి విలువలు మనం నేర్చుకోవాలి. అంతే కానీ క్రికెట్ ని ఒక మతం గా, విగ్రహం గా చేసుకో కూడదు. క్రికెట్ స్టార్లను అభిమానించాలి కానీ వాళ్ళే మా దేవుళ్ళు అని మనం విగ్రహారాధన చేయకూడదు. క్రికెట్ అయినా, మరేదైనా సమస్తము దేవుని మహిమ కొరకు చేయండి అని దేవుని వాక్యం మనకు బోధిస్తున్నది. (1 కొరింథీ 10:31). ఆ సత్యం మనం గ్రహించాలి. యేసు క్రీస్తు ప్రభువు నందు దేవుడు మనకు ఇచ్చిన రక్షణ మనం పొందాలి. అదే నేటి మా ప్రేమ సందేశం. 

Leave a Reply