Site icon Defender's Voice

2 కొరింథీయులకు వ్రాసిన పత్రిక

పరిచయం:

ఈ రోజు రెండవ కొరింథీయులకు వ్రాసిన పత్రిక ను మీకు పరిచయం చేయాలని నేను ఆశిస్తున్నాను. రెండవ కొరింథీయులకు వ్రాసిన పత్రిక ఇది క్రొత్త నిబంధనలో 8 వ పుస్తకం. ఈ కొరింథు పట్టణం గ్రీసు దేశములో ఉంది. ఇది చాలా చారిత్రిక, సాంస్కృతిక ప్రాధాన్యత కలిగిన నగరం. అయితే గ్రీసు ను ఓడించడానికి రోమన్లు యుద్ధాలు చేసి ఈ నగరాన్ని కూడా ధ్వంసం చేసారు. 

     కొరింథు పట్టణమును క్రీ. పూ 146 లో రోమన్ సైనిక అధికారి లూసియస్ మమ్మియస్ నాశనం చేశాడు. పురుషులను చంపివేశాడు. వారి స్త్రీలను, పిల్లలను బానిసలుగా చేసుకొన్నాడు. దాదాపు వంద సంవత్సరాలు ఈ ప్రదేశం నిర్మానుష్యముగా పడి ఉంది.

    క్రీ.పూ 44 లో రోమన్ చక్రవర్తి  జూలియస్ సీజర్ ఈ ప్రదేశములో ఒక రోమన్ కాలనీ నిర్మించాడు. గ్రీసు దేశానికి ఇది ఒక ముఖ ద్వారం వలె ఉంటుంది. కొరింథు ప్రజలు ఆర్కిటెక్చర్ లో కూడా నైపుణ్యం సంపాదించారు. దీనిని కొరింతియన్ ఆర్డర్ అని పిలిచారు. రోమన్లు దీనిని ఎంతో ఇష్టపడ్డారు. ఇది ప్రపంచ మంతా విస్తరించింది ఎందుకంటే ఆ బిల్డింగ్స్ చూడటానికి ఎంతో బాగుంటాయి. 

రచయిత

   ఆ తరువాత, ఈ పత్రికను ఎవరు రచించారు? ఈ పత్రిక రచయిత అపోస్తలుడైన పౌలు. ఆయన తార్సు అనే పట్టణములో ఒక ధనిక పరిస్సయుని కుటుంబములో జన్మించాడు. క్రీస్తు శకం 35 వ సంవత్సరములో డమాస్కస్ వైపు ప్రయాణం చేస్తూ ప్రభువైన యేసు క్రీస్తు ను చూసి క్రైస్తవునిగా మారాడు.

అన్యజనులకు అపోస్తలునిగా నియమింపబడ్డాడు. మూడు సువార్త యాత్రలు చేసాడు. 

క్రీస్తు శకం 46 – 48 ల మధ్య మొదటి యాత్ర,

క్రీస్తు శకం 49 – 52 ల మధ్య రెండవ యాత్ర,

క్రీస్తు శకం 53 – 57 ల మధ్య మూడవ యాత్ర – ఈ మూడు యాత్రలలో ఆయన ఆసియా మైనర్ అంటే ప్రస్తుత టర్కీ దేశం ఉన్న ప్రాంతం, ప్రస్తుత గ్రీసు దేశములో చుట్టుపట్ల ఉన్న దీవులలో పర్యటించి, అనేక క్రైస్తవ సంఘాలు స్థాపించాడు. వాటిలో ఒకటి ఈ కొరింథు సంఘము.  అపోస్తలుడైన పౌలు తన సువార్త దండయాత్రలు చేస్తూ గ్రీసు దేశం వెళ్ళాడు. అక్కడ ఉన్న థెస్సలొనీక, బెరయ, ఏథెన్స్, కొరింథు నగరాలకు వెళ్లి, ఆత్మలను రక్షణ సువార్త వైపు నడిపించి, క్రైస్తవ స్థానిక సంఘములను స్థాపించాడు. 

     ఈ కొరింథు సంఘమును స్థాపించి, దాని అభివృద్ధి కొరకు పౌలు ఎంతో శ్రమించాడు. కొరింథు సంఘములో అనేక లోపాలు వున్నాయి. ఆ సంఘస్తులు చేస్తున్న పాపాల గురించి, వారు అనుసరిస్తున్న అబద్ద బోధల గురించి పౌలు గారు వారికి మొదటి కొరింథీ పత్రిక వ్రాసాడు. ఆ పత్రిక చదివి చాలా మంది మారారు. అయితే వారిలో కొంతమందికి పౌలు మాటలు రుచించలేదు. వారు పౌలు మాటలను పట్టించుకోలేదు. ఆయన మీద వ్యక్తిగత విమర్శలకు దిగారు. “పౌలు, మాకు చెప్పే అధికారం నీకు ఎవరు ఇచ్చారు? నీవు అపోస్తలుడవా? నీకు దేవుని అభిషేకం ఉందా? నీ అర్హతలు ఏమిటి? నీకు దేవుని శక్తి ఉందా? యేసు క్రీస్తు ప్రభువును నీవు చూశావా? 

     ఇంగ్లీష్ లో వీటిని యాడ్ హామి నమ్ అటాక్స్ అంటారు. యాడ్ హామి నమ్ అటాక్స్ అంటే ఏమిటంటే ఎవరన్నా మనల్ని విమర్శిస్తే దానికి జవాబు చెప్పకుండా వారి మీద వ్యక్తిగత దాడులు చేయడం. కొరింథీ సంఘము వారు ఆ పనే చేశారు.పౌలు గారి విమర్శలు చదివి, ‘పౌలు గారు చెప్పిన మాట విందాము. మన పాపములు ఒప్పుకొని, క్షమాపణ పొందుదాము’ అని వారు అనుకోలేదు. ‘పౌలు గారు అసలు అపోస్తలుడే కాదు. ఆయన మాట వినాల్సిన అవసరం మనకు లేదు’ అని బుకాయించారు. 

      పౌలు వారి విమర్శలకు సమాధానముగా ఈ పత్రిక వ్రాసాడు. ‘నేను అపోస్తలుడను, దేవుని చేత ఎన్నుకోబడిన వాడిని. యేసు క్రీస్తు ప్రభువు చేత నియమించబడిన వాడను’ అని పౌలు ఈ పత్రికలో అనేక సార్లు బలపరచుకొన్నాడు. వితర్కములను ఎదుర్కోవడములో , దేవునిగూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోయడములో, ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడునట్లు చెరపట్టడములో (రెండవ కొరింథీ 10:3-5) పౌలు గారు సిద్ధహస్తుడు. తోటి విశ్వాసులు ఆయన మీద ఆరోపణలు చేసినప్పుడు పౌలు పరిశుద్ధాత్మ తో నిండినవాడై వారికి సరైన సమాధానములు ఇచ్చాడు.

   ఏ విధముచేతనైనను కొందరిని రక్షింపవలెనని అందరికి అన్నివిధముల వాడనైయున్నాను (1 కొరింథీ 9:22). ఎలాగైనా సరే, దేవుని కొరకు వీలైనంత మందిని రక్షించుకోవాలని పౌలు అందరికి అన్ని విధముల వాడు అయ్యాడు. దేవుని కృప ఆయనకు సహకరించింది. ప్రభువైన యేసు క్రీస్తు కృపను వారికి జ్ఞాపకం చేశాడు. 

     మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురుగదా? ఆయన ధన వంతుడై యుండియు మీరు తన దారిద్ర్యమువలన ధనవంతులు కావలెనని, మీ నిమిత్తము దరిద్రుడాయెను.

                        2 కొరింథీ 8:9 

   యేసు క్రీస్తు ప్రభువు ఎంతో ధనవంతుడు. అయినప్పట్టికీ మనలను ధనవంతులను చేయుటకు ఆయన దరిద్రుడు అయ్యాడు. యేసు క్రీస్తు మనకు చాలా సాధారణముగా మనకు కనిపిస్తాడు. అయితే ఆయనను మనం తక్కువగా చూడకూడదు ఎందుకంటే ఆయన దేవుని చే అభిషేకించబడిన వాడు. దేవుని చేత పంపబడిన వాడు.  పౌలు కూడా అంతే. ఆయన ఎంతో ధనవంతుడు. అయినప్పటికీ యేసు క్రీస్తు సేవకునిగా పేద వాడు అయ్యాడు. కొరింథీయులు ఆయనను తక్కువగా చూశారు. ‘ఆ, ఈయన నిజముగా అపోస్తలుడా? ఈయన మాట మేము వినాలా?’ అని వారు పౌలును నిర్లక్ష్యం చేశారు. పౌలు లాంటి వాడు వారికి పరిచర్య చేయడం ఎంత గొప్ప భాగ్యమో వారు గ్రహించలేకపోయారు. పౌలు ద్వారా వారికి దొరికిన దేవుని కృపను వారు చూడలేకపోయారు. పౌలు వారికి ఈ పత్రిక ద్వారా జ్ఞానోదయం కలుగజేశాడు. తాను క్రీస్తు అపోస్తలుడను అని వారికి తెలియజేశాడు. ఇంకే మనిషికీ ఇవ్వని గొప్ప ధన్యతలు దేవుడు పౌలుకు ఇచ్చాడు. యేసు క్రీస్తు ప్రభువు స్వయముగా ప్రత్యక్షమై పౌలును క్రైస్తవునిగా మార్చాడు. 

    ఆయనకు అరణ్యములో ప్రత్యేక శిక్షణ ఇచ్చాడు. క్రొత్త నిబంధనలో ఎక్కువ భాగం వ్రాసింది ఆయనే. అనేక అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేసే పరిశుద్ధాత్మ శక్తి ఆయనకు ఇవ్వబడింది. సామాన్యుల దగ్గర నుండి రాజుల ముందు, ప్రధానుల ముందు క్రీస్తు సువార్త ప్రకటించాడు. 12 అధ్యాయములో మనం చదువుతాము. మరణించక ముందే పరలోకం చూసి తిరిగి భూమి మీదకు వచ్చాడు. భూమి మీద నుండి పరలోకం వెళ్లి తిరిగి భూమి మీదకు వచ్చిన అపోస్తలుడు ఒక్క పౌలు మాత్రమే. ఆ విధముగా అపోస్తలుడు అని పిలువబడడానికి కావలసిన అర్హతలు మొత్తం పౌలు కు ఉన్నాయి. 

వ్రాయబడిన కాలము: 

ఈ పత్రిక క్రీస్తు శకం 55 – 57 సంవత్సరముల మధ్య మాసిడోనియా నుండి వ్రాయబడి ఉండవచ్చు. 

వ్రాయబడిన స్థలము: 

మాసిడోనియా 

ముఖ్య అంశాలు: 

ఇప్పుడు కొంతసేపు ఈ పత్రికలోని ముఖ్య అంశాలు చూద్దాము. 

శ్రమలు

మొదటిగా మనం పొందే శ్రమలలో దేవుడు మనలను ఆదరించేవానిగా ఈ పత్రికలో మనకు కనిపిస్తున్నాడు. 1:3 లో మనం చదువుతాము. కనికరము చూపు తండ్రి, సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు

           2 కొరింథీ 1:3 

ఆ మాటలు మీరు గమనించండి. సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు. మనకు ఎంత భయంకరమైన శ్రమలు వచ్చినప్పటికీ మనకు విస్తారముగా ఆదరణ ఇచ్చే దేవుడు మనకు ఉన్నాడు. పౌలు తాను ఎంత బాధా కరమైన శ్రమలు అనుభవించాడో 11 అధ్యాయములో మనకు వివరించాడు. అనేక పర్యాయములు జైలుకు వెళ్ళాడు. లెక్కలేనన్ని సార్లు దెబ్బలు తిన్నాడు. అనేక సార్లు ప్రాణాపాయములో పడ్డాడు. ఆయనను రాడ్లు తీసుకొని కొట్టారు. రాళ్లతో కొట్టారు ఓడలో ప్రయాణిస్తుంటే ఓడ బ్రద్దలై రాత్రింబగళ్లు సముద్రములో గడిపాడు. 

పౌలు క్రీస్తు కొరకు అనేక శ్రమలు అనుభవించాడు

   దొంగలు ఆయనను దోచుకున్నారు. యూదులు ఆయనను హింసించారు. అన్య జనులు హింసించారు. అనేక ప్రయాసలు, కష్టములు, ఆకలి దప్పులు, ఉపవాసములు, చలి, దిగంబరత్వం సంఘములలో బాధలు, ఇతర క్రైస్తవులు చేసే విమర్శలు – ఎన్నో శ్రమలు పడ్డాడు. అయితే వాటన్నిలో దేవుడు ఆయనను ఆదరించాడు. క్రీస్తు కోసం ఎంత శ్రమ పడ్డాడో అంత మేర క్రీస్తు ఇచ్చే ఆదరణ ఆయనకు విస్తరించింది(1:5). దేవుడు నమ్మదగిన వాడు, ఆయన వాగ్దానములు నమ్మదగినవి అని పౌలు అనుభవ పూర్వకముగా తెలుసుకొన్నాడు (1:18, 20). దేవుడు ఆయనను విజయోత్సవముతో ఊరేగించాడు (2:14). ఆయన క్రీస్తు సువాసనగా మారాడు (2:15) 

నడిచే బైబిలు: 

2 కొరింథీ 3 అధ్యాయము, 2 వచనం చదువుదాము. మా హృదయములమీద వ్రాయబడియుండి, మనుష్యులందరు తెలిసికొనుచు చదువు కొనుచున్న మా పత్రిక మీరేకారా? 2 కొరింథీ 3:2. మా హృదయముల మీద మీరు వ్రాయబడ్డారు. మిమ్ములను మేము తక్కువగా చూడడం లేదు. మనుష్యులందరూ తెలిసికొనుచు చదువుచున్న మా పత్రిక మీరే. మనుష్యులు బైబిల్ చదవరు. ఆదికాండము లో ఏముందో, మత్తయి సువార్తలో ఏముందో వారికి తెలియదు. దేవుని గురించి, పరలోకం గురించి వారికి తెలియదు. వారు చదివే బైబిలు మనమే. పౌలు ఆ సత్యం ఇక్కడ బోధించాడు. మేము వ్రాసే పత్రికలలోని సత్యాలు మీ జీవితములో ప్రతిఫలించాలి. మనుష్యులు చదివే బైబిలు మీరే. 

దేవుని జ్ఞానము: 

ఆ తరువాత దేవుని జ్ఞానము. 4 అధ్యాయము, 5 వచనము. అంధకారములోనుండి వెలుగు ప్రకాశించును గాక అని పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు మా హృదయములలో ప్రకాశించెను.2 కొరింథీ 4:5. మాకు వెలుగు కావాలి అని యూదులు అంటున్నారు. మాకు జ్ఞానం కావాలి అని గ్రీకులు అంటున్నారు. మాకు మహిమ కావాలి అని రోమన్లు అంటున్నారు. ఆ వెలుగు ఎక్కడ దొరుకుతుంది? ఆ జ్ఞానం ఎక్కడ దొరుకుతుంది? ఆ మహిమ ఎక్కడ దొరుకుతుంది? యేసు క్రీస్తు ప్రభువు నందు ఆ మూడూ మనకు దొరుకుతున్నాయి. 

ప్రేమతో కూడిన పరిచర్య: 

   ఆ తరువాత స్వేచ్ఛ తో కూడిన పరిచర్య. ప్రేమతో కూడిన పరిచర్య మనం చేయాలి అని పౌలు ఈ పత్రిక లో బోధించాడు. ప్రభువు యొక్క ఆత్మయెక్కడ నుండునో అక్కడ స్వాతంత్ర్యము నుండును. 2 కొరింథీయులకు 3:17 క్రీస్తు ప్రేమ మమ్మును బలవంతము చేయుచున్నది.  2 కొరింథీయులకు 5:14

    పౌలు ఎవరి కోసమో దేవుని సేవ చేయడం లేదు. ఎవరో ఒత్తిడి చేస్తే ఆయన సేవచేయడం లేదు. దేవుని ఆత్మ ఇచ్చే స్వాతంత్రం అనుభవిస్తూ ఆయన సేవ చేస్తున్నాడు. క్రీస్తు ప్రేమ మమ్మును బలవంతము చేయుచున్నది. మిమ్ములను ఏది బలవంతం చేస్తున్నది? నన్ను డబ్బు బలవంతం చేస్తున్నది అనే వారు ఉన్నారు. నన్ను అసూయ బలవంతం చేస్తున్నది అనేవారు ఉన్నారు. నన్ను పాపులారిటీ బలవంతం చేస్తున్నది అనే వారు ఉన్నారు. అయితే పౌలు ఏమంటున్నాడంటే, క్రీస్తు ప్రేమ మమ్మును బలవంతము చేయుచున్నది. యేసు క్రీస్తు ప్రభువు మీద ప్రేమతో పౌలు సేవ చేసాడు. 

   హడ్సన్ టేలర్ (1832 – 1905) ఇంగ్లాండ్ దేశం నుండి చైనా దేశమునకు మిషనరీ గా వెళ్ళాడు. 54 సంవత్సరాలు చైనా దేశములో జీవించి 20,000 మంది ని క్రీస్తు యొద్దకు నడిపించాడు. క్రీస్తు కొరకు అనేక శ్రమలు అనుభవించాడు. ఒకసారి ఆయనను అడిగారు. నువ్వు చైనా ను ఎందుకు ప్రేమిస్తున్నావు? ఆయన దానికి ఇచ్చిన సమాధానం. నేను దేవుని ప్రేమిస్తున్నాను. ఆ ప్రేమే నన్ను చైనా ప్రజలను ప్రేమించేటట్లు చేసింది. నశించిన ఆత్మలను మనం ప్రేమించాలంటే ముందు మనకు దేవుని మీద ప్రేమ ఉండాలి. పౌలు వలె, ఈ రోజు మనం కూడా యేసు క్రీస్తు ప్రభువు మీద ప్రేమతోనే దేవుని సేవించాలి. 

పరిశుద్ధత: 

ఆ తరువాత దేవుని పరిశుద్ధత. ఎందుకనగా మనమాయనయందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మనకోసము పాపముగాచేసెను. 2 కొరింథీయులకు 5:21. దేవుడు మనలను ఎందుకు రక్షించాడు? యేసు క్రీస్తు ప్రభువు మన కోసము ఎందుకు పాపముగా చేయబడ్డాడు? మనమాయనయందు దేవుని నీతి అవ్వాలని. కొరింథు విశ్వాసులకు పౌలు ఆ సత్యం బోధించాడు. మీలో దేవుని నీతి కనిపించాలి. ఈ సంఘములో ఒకాయన తన పినతల్లి ని ఉంచుకొన్నాడు. పౌలు దానిని తప్పు పట్టాడు. 

     గ్రీకు పురాణాల్లో ఎంతో ప్రసిద్ధి చెందిన వ్యక్తి ఎడిపస్. ఎడిపస్ తండ్రి లాయివోస్ (Laios). ఈ లాయివోస్ పెలోప్స్ (Pelops) అనే వ్యక్తి కుమారుని మీద అత్యాచారం చేస్తాడు. పెలోప్స్ అప్పుడు లాయీవోస్ మీద ఒక శాపం పెడతాడు: నీ కొడుకే నిన్ను చంపుతాడు. ఆ శాపం ప్రకారం ఎడిపస్ తన తండ్రి  లాయివోస్ ని చంపుతాడు. తన తల్లి జోకాష్ట (Jocasta) ని పెళ్లి చేసుకొంటాడు. ఈ ఎడిపస్ కొరింథు నగరములో పెరిగాడు. ఈ కొరింథు సంఘములో కూడా ఒకాయన తన పిన తల్లిని పెళ్లి చేసుకొన్నాడు. ఎడిపస్ చేయలేదా, నేను చేస్తే తప్పేంటి? అని ఆయన వాదించి ఉంటాడు. మన చుట్టూ ఉన్న సమాజము నేర్పించే సంస్కృతిని మనం వెంబడించకూడదు. దేవుని వాక్యం ఏమి బోధిస్తుంది? అని మనం చూడాలి. అపోస్తలుడైన పౌలు కొరింథీయులతో అదే మాట అన్నాడు. ఆ వ్యక్తిని మీ సంఘములో నుండి బహిష్కరించండి. దేవుడు పరిశుద్ధుడు కాబట్టి మనం పెట్టుకొనే సంబంధాలు కూడా పరిశుద్ధముగా ఉండాలి. క్రీస్తు నందు మీరు దేవుని నీతి పొందాలని దేవుడు మిమ్ములను రక్షించాడు. 

    కొరింథీయులను ఆయన ప్రశ్నించాడు. నీతికి దుర్ణీతితో ఏమి సాంగత్యము? వెలుగునకు చీకటితో ఏమిపొత్తు?క్రీస్తునకు బెలియాలుతో ఏమి సంబంధము? అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది?దేవుని ఆలయ మునకు విగ్రహములతో  ఏమిపొందిక?2 కొరింథీ 6:14-16. ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము, ఇదిగో ఇదే రక్షణ దినము. 2 కొరింథీ 6:3 

ఈ రోజు మనం ఆ సత్యం గ్రహించాలి. రేపు ఏమి జరుగుతుందో మనకు తెలియదు. ఈ రోజే మన జీవితం ముగియవచ్చు. ఈ రోజే మన గుండె ఆగిపోవచ్చు. రక్షణ పొంది పరలోకం వెళ్తున్నామా? లేక రక్షణ పొందకుండా నరకానికి వెళ్తున్నామా? అని మనం ప్రశ్నించుకోవాలి. ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము, ఇదిగో ఈ రోజే  రక్షణ దినము.అని దేవుని వాక్యం మనలను హెచ్చరిస్తున్నది. ప్రభువైన యేసు క్రీస్తు యొద్దకు వచ్చి పాప క్షమాపణ పొంది దేవుడు ఇచ్చే ఈ గొప్ప రక్షణ మీరు పొందాలి. 

బాధ్యత కలిగిన విరాళాల సేకరణ 

    2 కొరింథీ 8 అధ్యాయములో చూస్తే అపోస్తలుడైన పౌలు కొరింథీయులను విరాళాలు అడగడం చూస్తాము. యెరూషలేము సంఘములో అనేక మంది పేదలు ఉన్నారు. వారికి సహాయము చేయాలని పౌలుకు అనిపించింది. కొరింథీ సంఘములో ఉన్న విశ్వాసులు ధనికులు. యెరూషలేము లోని క్రైస్తవులకు సహాయం చేయమని అడుగుతూ పౌలు వారి యొద్దకు తీతు అనే బ్రదర్ ని పంపించాడు. అయితే కొరింథీ సంఘములో కొంత మంది అబద్ద బోధకులు ఉండేవారు. వారు ఏమని ప్రచారం చేశారంటే, ‘పౌలు, డబ్బు సంపాదించుకోవటానికే క్రీస్తు సేవలోకి వచ్చాడు. ఆయన జేబులు నింపుకోవడానికే దేవుని సేవ అంటూ తిరుగుతున్నాడు’ అన్నారు. పౌలు వారి దుష్ప్రచారాన్ని అడ్డుకున్నాడు. దేవుని సేవకుల మీద ఇలాంటి విమర్శలు చేసే వారు ఎప్పుడూ ఉంటారు. వారి విమర్శలు ప్రజలు నమ్మే పరిస్థితి కూడా ఉంది. ఈ మధ్య నేను ఒక వార్తా పత్రికలో చదివాను. 

   అమెరికా దేశములో చాలా మంది క్రైస్తవ బోధకులు ఉండే ఇల్లు మనం చూస్తే, ఒక్కొక్క ఇల్లు 5 మిలియన్ డాలర్లు నుండి పది మిలియన్ డాలర్లు వరకు ఉంది. అంటే ఒక మధ్య తరగతి కుటుంబం ఉండే ఇంటి కంటే వీరి ఇల్లు 10 నుండి 20 రెట్లు ఖరీదు గా ఉంది. కొంత మంది బోధకులకు ఇతరులతో కలిసి ప్రయాణం చేయడం కూడా కష్టమే. వారు ప్రైవేట్ జెట్లు కొనుకొన్నారు. వారు ఇంటి నుండి బయటికి వెళ్లాలంటే ప్రత్యేక విమానాలు కావాలి. దేవుని సేవ పేరుతో డబ్బులు వసూలు చేసి వీరు సుఖ భోగాలు అనుభవిస్తున్నారు అని విమర్శకులు అంటున్నారు. అయితే అపోస్తలుడైన పౌలు తన కోర్కెలు తీర్చుకోవడానికి దేవుని సేవ లోకి వచ్చిన వాడు కాదు. వారితో ఏమని చెప్పాడంటే, మన ప్రభువైన యేసు క్రీస్తు ను మేము ఎప్పుడూ జ్ఞాపకం చేసుకొంటాము. ఆయన ధనవంతుడై ఉండియు మన కోసం పేదవాడు అయ్యాడు. 2 కొరింథీ 8:9 

   ఆయన డబ్బు కోసం దేవుని సేవ చేయలేదు. ఆయన సేవకులముగా మేము డబ్బు కోసం సేవచేయడం లేదు. బైబిలు రెఫెరెన్స్ ఆయన మీద నిందలు వేసే వారి నోళ్లు మూయించడానికి పౌలు ఏమి చేశాడంటే, మరికొంత మంది బ్రదర్స్ ని అకౌంటెంట్ లుగా తీసుకొన్నాడు. బ్రదర్ టైటస్ గురించి ఇక్కడ వ్రాశాడు. ఈ బ్రదర్ నిజాయితీ పరుడు అని సంఘములలో పేరుంది. మరొక బ్రదర్ కి మంచి సువార్తికునిగా పేరుంది. పౌలు వారితో కలిసి ఒక కమిటీ పెట్టాడు. వారందరీ పర్యవేక్షణలో ఆయన డొనేషన్స్ సేకరించాడు. ఆ డబ్బును, వస్తువులను, ఆహారాన్ని పేదలకు పంచాడు. 

ఏలయనగా ప్రభువు దృష్టియందు మాత్రమే గాక మనుష్యుల దృష్టియందును యోగ్యమైన వాటిని గూర్చి శ్రద్ధగా ఆలోచించుకొనుచున్నాము.2 కొరింథీ 8:21 

దేవుని దృష్టిలోనే కాదు, మనుష్యుల దృష్టిలో కూడా మంచి పనులు మనం చేయాలి. క్రైస్తవ సంస్థలకు వచ్చే డొనేషన్స్ మీద, వాటిని ఖర్చు చేసే వారి మీద కేంద్ర ప్రభుత్వం కన్ను వేసింది. చాలా సంస్థలు వారికి వచ్చే నిధులు దుర్వినియోగం చేస్తున్నారు అని కేంద్ర ప్రభుత్వం వారి FCRA లైసెన్సులు రద్దు చేసింది. అన్య జనులు మన మీద నిందలు వేయకుండా మనం జాగ్రత్త పడాలి. 

   మదర్ థెరెసా, భక్త సింగ్ గారు బిల్లీ గ్రాహం గారు – వారి గురించి అవిశ్వాసులు కూడా గొప్పగా చెప్పుకొంటారు. ఎందుకంటే వారు వేల కోట్ల డొనేషన్స్ పొందినప్పటికీ చాలా సాధారణముగా జీవించారు. మదర్ థెరెసా ఎన్నో కోట్లు విరాళాలు అందుకొంది. అయితే వాటితో ఆమె ఆస్తులు పెంచుకోకుండా పేదలకు సేవ చేసింది. చాలా మంది ఆమె ఫోటో ఇంట్లో పెట్టుకొంటారు. మనుష్యుల ఎదుట యోగ్యమైన పనులు అంటే అవే. భక్త సింగ్ గారు వందల కోట్ల డొనేషన్స్ అందుకొన్నాడు. అయితే వాటిని తన జేబులో వేసుకోకుండా దేవుని సేవ కొరకు ఆయన ఖర్చుపెట్టేవాడు. బిల్లీ గ్రాహం గారు వేల కోట్లు డొనేషన్స్ అందుకొన్నాడు. అయితే తన ఆస్తులు పెంచుకోకుండా ఆయన దేవుని కొరకు ఆ డబ్బు ఖర్చు పెట్టాడు. అపోస్తలుడైన పౌలు గారు కూడా తాను సేకరించిన విరాళాలు దేవుని ప్రజలకు ఇచ్చాడు. ఆయన ఆస్తులు పెంచుకోలేదు. 

   అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలెను.ప్రభువు మెచ్చుకొనువాడే యోగ్యుడు గాని తన్ను తానే మెచ్చుకొనువాడు యోగ్యుడు కాడు (2 కొరింథీ 10:17-18) అన్నాడు. దేవుని ఎదుట, లోకం ఎదుట ఎంతో పారదర్శకముతో మేము పని చేస్తున్నాము. మాకు మేము శభాష్ అని చెప్పుకోవలసిన అవసరం లేదు. దేవుని ఎదుట యోగ్యమైన పనులు ఇవే. దేవుడు మెచ్చుకొనే పనులు ఇవే అని వారికి చెప్పాడు. 

ఉత్సాహముగా దేవునికి ఇచ్చుట 

ఆ తరువాత ఉత్సాహముగా దేవునికి ఇవ్వండి అని వారికి వ్రాశాడు. సణుగుకొనకయు బలవంతముగా కాకయు, ప్రతివాడును తన హృదయములో నిశ్చ యించుకొనిన ప్రకారము ఇయ్య వలెను; దేవుడు ఉత్సాహముగా ఇచ్చువానిని ప్రేమించును. (2 కొరింథీ 9:7) దేవునికి ఇచ్చేటప్పుడు మనం సణుగు కోకూడదు. ఎవరో  మనలను బలవంతం చేసినట్లు గా ఇవ్వకూడదు. సంతోషముతో ఇవ్వాలి. హృదయ పూర్వకముగా ఇవ్వాలి. ప్రత్యక్ష గుడారము నిర్మించేటప్పుడు ఇశ్రాయేలీయులు సంతోషముతో దేవునికి కానుకలు ఇచ్చారు. ప్రేమతో మనం ఎవరికన్నా గిన్నెడు చన్నీళ్ళు ఇచ్చినా, అది దేవుని దృష్టిలో ప్రశస్తమైనదిగా ఉంది. (మత్తయి 10:42)

మనం మాటలు చెప్పి చేతులు దులుపుకోకూడదు. ‘నీ కోసం ప్రార్థన చేస్తున్నానులే, వెళ్ళు నీ గురించి ఆలోచిస్తున్నాను లే, దిగులు పడకు’. చేతలు లేకుండా మాటలు చెబితే ప్రయోజనం ఉండదు (యాకోబు 2:14-18). బట్టలు లేని వారికి బట్టలు ఇవ్వకుండా ఆకలితో అలమటిస్తున్న వారికి భోజనం పెట్టకుండా, సమాధానముతో వెళ్ళిరా, తృప్తితో జీవించు అని చెబితే అది క్రియలు లేని విశ్వాసమే. అవసరములో ఉన్న వారికి మనము క్రియలు చేసి సహాయం చేసినప్పుడే మనలో దేవుని ప్రేమ ఉన్నట్లు (1 యోహాను 3:17-18). అటువంటి వారి దాతృత్వం వృథాగా పోదు. వారు పరలోకములో ఆస్థి సంపాదించుకొనేవారిగా ఉన్నారు (మత్తయి సువార్త 6:19-21). బీదలకిచ్చువానికి లేమి కలుగదు (సామెతలు 28:27). అటువంటి దాన ధర్మాలు చేయడం వలన దేవునికి మహిమ కలుగుతుంది (2 కొరింథీ 9:13). మన ఆస్తులు, మన సంపాదనలో ప్రథమ ఫలం దేవునికి ఇచ్చినప్పుడు దేవునికి ఘనత కలుగుతుంది (సామెతలు 3:9). నేను పేదరికం లో ఉన్నాను. నేను ఇవ్వకపోయినా దేవుడు ఏమనుకోడు అని మనం సమర్ధించుకోకూడదు. యేసు ప్రభువు చూస్తూ ఉండగా ఒక బీద విధవరాలు 2 కాసులు కానుక పెట్టెలో వేసింది. యేసు ప్రభువు ఏమన్నాడు? చాలా మంది ధనవంతుల కంటే ఈ బీద విధవరాలు దేవునికి ఎక్కువ ఇచ్చింది అని ఆయన ఆమెను ప్రశంసించాడు (మార్కు 12: 41- 44). ధనవంతులు కూడా తమ డబ్బు ను చూసుకొంటూ సంతోషపడకూడదు. డబ్బు అస్థిరమైనది. మంచి పనులు అనే ధనం కొరకు వారు పాటుపడాలి. తమ డబ్బును ఇతరులతో పంచుకోవాలి. (1 తిమోతి 6:17 – 19)

పౌలు మాటలు మరొక సారి గమనించండి. ప్రతివాడును తన హృదయములో నిశ్చయించుకొనిన ప్రకారము ఇయ్య వలెను; దేవునికి ఇవ్వాలి అని మనం నిశ్చయించుకోవాలి. నాకు తోచినప్పుడు ఇస్తాలే అని అనుకోకూడదు. ఒక ప్లాన్ ప్రకారం, ఒక పద్దతి ప్రకారం మనం దేవునికి ఇవ్వాలి. మనం దేవునికి ఇవ్వకపోతే దేవుని యొద్ద దొంగతనం చేసినట్లే లెక్క (మలాకీ 3:8-10).మీ దగ్గర ఉన్న డబ్బులు ఎవరన్నా కొట్టేస్తే మీకు సంతోషం ఉంటుందా? అయితే, దేవుడు ఉత్సాహముగా ఇచ్చువానిని ప్రేమించును. 2 కొరింథీ 9:7 అని చదువుతున్నాము. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు (యోహాను 3:16). విశ్వాసులను దేవుడు ప్రేమిస్తున్నాడు (రోమా 8:32). అయితే ఉత్సాహముతో ఇచ్చేవారిని దేవుడు ప్రత్యేకముగా ప్రేమిస్తున్నాడు. ఎందుకంటే వారు తమ విశ్వాసాన్ని క్రియలలో చూపిస్తున్నారు. వారు దేవుని వలె ప్రవర్తిస్తున్నారు. 

చెప్పనశక్యము కాని ఆయన వరమును గూర్చి దేవునికి స్తోత్రము. 2 కొరింథీ 9:15

చెప్పనశక్యము కాని దేవుని వరము ఏమిటంటే మన ప్రభువైన యేసు క్రీస్తే. ఆయన మాటలలో వివరించలేనంత గొప్ప కానుక. వర్ణించలేనంత గొప్ప బహుమానం. అంత గొప్ప బహుమానం దేవుడు మనకు ఉచితముగా ఇచ్చాడు కదా! మనం కూడా ప్రేరేపించబడి, ఉత్సాహముతో దేవునికి ఇవ్వాలి కదా! అని పౌలు వారికి చెప్పాడు. ఆ మాటలకు కదిలించబడి కొరింథు సంఘము వారు దేవునికి పెద్ద కానుక ఇచ్చారు. పౌలు గారు దానిని యెరూషలేము లో ఉన్న పేదలకు పంచిపెట్టాడు. ఆ పనుల వలన వారు ఆదరించబడ్డారు. దేవుని మహిమ, ఘనత కలిగినవి. 

దొంగ అపోస్తలులు 

ఆ తరువాత పౌలు దొంగ అపోస్తలుల గురించి హెచ్చరించాడు. 2 కొరింథీ 11:13-14 వచనాలు చూద్దాము. 

ఏలయనగా అట్టి వారు క్రీస్తుయొక్క అపొస్తలుల వేషము ధరించుకొనువారై యుండి, దొంగ అపొస్తలులును మోసగాండ్రగు పనివారునై యున్నారు. ఇది ఆశ్చర్యము కాదు; సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకొనుచున్నాడు (2 కొరింథీ 11:13-14).

దొంగ అపోస్తలులు ఆ సంఘములో ప్రవేశించారు. వారు అపోస్తలుల వేషం వేసుకొన్నారు. మోసం చేస్తున్నారు. మోసం, వేషధారణ, అసత్యం, దొంగతనం – ఇవి దొంగ అపోస్తలుల లక్షణాలు. ఇందులో ఆశ్చర్యపోవలసినది ఏమీ లేదు. వీరి తండ్రి అయిన సాతాను కూడా వెలుగు దూత వేషము వేసుకొని ప్రజలను మోసం చేస్తాడు. సాతాను అంటే మనం నల్లగా, చీకటిలో నడుస్తూ, పెద్ద పెద్ద కొమ్ములు, పెద్ద పెద్ద కళ్ళు వికృత రూపములో ఊహించుకొంటాము. అయితే సాతాను అలా రాదు. వెలుగు దూత వేషములో వస్తాడు. అమ్మో, ఎంత చక్కగా ఉన్నాడు? ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు? పరలోకం నుండి వచ్చాడేమో అని మనకు అనిపించేటంత వేషధారణ సాతాను వేసుకొంటాడు. అతని అనుచరులు కూడా సాతాను వలెనె విశ్వాసులను మోసం చేస్తారు. ఈ అబద్ద బోధకుల గురించి దేవుని వాక్యం మనలను స్పష్టముగా హెచ్చరించింది. వారిని తేలికగా తీసుకోవద్దు. వారు గొఱ్ఱెల వలె చాలా సౌమ్యముగా కనిపిస్తారు. అయితే క్రూరమైన తోడేళ్ళు (మత్తయి 7:15). వారు మందను కనికరింపరు. వంకర మాటలు చెప్పి శిష్యులను తమ వెంట ఈడ్చుకొని పోతారు. (అపో కార్యములు 20:28-30). సాతాను ఆదాము, హవ్వలకు అబద్దాలు చెప్పి మోసం చేసాడు. ఇదిగో మీరు దేవతల వలె మారుతారు అన్నాడు. ఆదికాండము 3:5 

    ఈ దొంగ అపోస్తలులు కూడా ఆ మాట వింటే మీకు అంతా బాగా జరుగుతుంది. మీకు దీవెనలు, ఐశ్వర్యం కలుగుతాయి అని మోసపు మాటలు చెబుతారు. అంత్య దినాల్లో వీరు బాగా విస్తరిస్తారు అని యేసు ప్రభువు ఒలీవల కొండ ప్రసంగములో మనలను హెచ్చరించాడు. సాతాను శక్తి తో వీరు గొప్ప సూచక క్రియలు, మహత్కార్యములు కూడా చేయొచ్చు (మత్తయి 24:24) ఒక వ్యక్తి గొప్ప సూచక క్రియలు చేసినంత మాత్రాన అతడు లేక ఆమె దేవుని యొద్దనుండి వచ్చినట్లు కాదు. వీరు నాశనకరమగు చెడు బోధలు ప్రజలకు చేస్తూ ఉంటారు (2 పేతురు 2:1-3). వీరికి పాపులారిటీ కూడా బాగానే ఉంటుంది ఎందుకంటే చాలా మందికి సత్యం వినడం ఇష్టం ఉండదు. వారు దురద చెవులతో తమ స్వకీయ దురాశలు అనుకూలమైన బోధలను ఇష్టపడుతూ కల్పించిన కథలు వింటూ వినోదం పొందుతూ కాలం గడుపుతారు (2 తిమోతి 4:1-4). అయితే వీరిని వెంబడిస్తే మనకు నాశనమే కలుగుతుంది. ఈ అబద్ధ బోధకుల మాటలు నమ్మి అహాబు రాజు యుద్ధానికి వెళ్లి ప్రాణాలు పోగొట్టు కొన్నాడు (1 రాజులు 22). వారు తమ కడుపుకే దాసులు, యేసు క్రీస్తు దాసులు కాదు. ఇంపైన మాటలు చెప్పి వారు మంచివారిని కూడా మోసం చేస్తారు (రోమా 16:18). ఈ దొంగ అపోస్తలులు బైబిలు తెరచి బోధించవచ్చు. అయితే వారు తమ దురాశలతో అబద్ధాలు బోధిస్తారే కానీ సత్యం బోధించరు. వారు చెప్పేది వారి మాటలే. దేవుని మాటలు కాదు (యిర్మీయా 23:6). వారి ప్రవచనాలు నిరర్థకమైనవి, వారి దర్శనములు వ్యర్థమైనవి. వారి ఉపదేశములు మోసకరమైనవి వారి బోధలు అసత్యమైనవి (విలాప వాక్యములు 2:14). వారు దేవుని సత్యము నుండి మతా చారముల వైపు ప్రజలను తిప్పివేస్తారు (గలతీ 1:6). వారు దేవుని కృపను తమ కామాతురత్వము నాకు దుర్వినియోగం చేస్తారు. చాలా మంది దొంగ అపోస్తలులు లైంగిక సంభందమైన పాపాలలో కొనసాగుతూ ఉంటారు (యూదా పత్రిక 1:4). 

యెజెబెలు వలె వారు వ్యభిచార పనులు చేస్తూ ఉంటారు (ప్రకటన 2:20-22). వారు కయీను వలె దేవుని సత్యమును విసర్జించి అసూయతో నిండుకొంటారు. బిలాము వలె వారు డబ్బు కోసం దేవుని చిత్తాన్ని, దేవుని ప్రజలను విసర్జిస్తారు. (సంఖ్యా కాండము 22). కోరహు వలె వారు దేవుని చేత ఏర్పరచబడిన వారిని ఎదిరిస్తారు (యూదా  1:11). సీమోను వలె డబ్బుతో పరిశుద్ధాత్మను దేవుని శక్తిని కొనాలని ప్రయత్నిస్తారు (అపో కార్యములు 8:9-21). 

సీమోను వలె డబ్బుతో పరిశుద్ధాత్మను దేవుని శక్తిని కొనాలని ప్రయత్నిస్తారు

వారు యేసు క్రీస్తు ప్రభువు మహిమ ను వెదకరు. తమను తామే ఆరాధించుకొంటారు. అంత్య క్రీస్తు కు ఆరాధన చేసే టట్లు ఈ ప్రపంచాన్ని సిద్ధం చేయడములో వీరి పాత్ర కూడా ఉంటుంది (ప్రకటన 13:14-15). ఈ అబద్ద బోధకులను, దొంగ అపోస్తలులను దేవుడు వదిలిపెట్టడు. వారి మీద నేను పగపెట్టాను అని దేవుడు అన్నాడు (యెహెఙ్కేలు 13:8-9). అయితే వారు దేవుని శిక్షను తప్పించుకోలేరు.  (2 పేతురు 2:1-3, యూదా 1:4). దేవుని శిక్ష తమ మీదకు వచ్చినప్పుడు, వారు ప్రభువా, నీ పేరు మీద ఎన్నో పనులు చేశాము కదా అని అంటారు. యేసు ప్రభువు వారితో ఏమంటాడంటే, ‘అసలు మీరు ఎవరో కూడా నాకు తెలియదు’ (మత్తయి 7:21). సాతాను ను దేవుడు నిత్య అగ్ని గుండములో పడేస్తాడు (ప్రకటన 20:10). ఈ దొంగ అపోస్తలులను కూడా దేవుడు నరకానికే పంపిస్తాడు. ఈ అబద్ద బోధకుల నుండి మనం ఎలా రక్షించుకోవాలి? అనే ప్రశ్న మనకు వస్తుంది. దొంగ అపోస్తలుల నుండి మనం తప్పించుకోవాలంటే మనం పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగింపబడిన బోధను ఎప్పుడూ పట్టుకోవాలి. 

ఇంగ్లీష్ లో బావుంటుంది. 

the faith which was once delivered unto the saints

పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగింపబడిన బోధ

  రెండు వేల సంవత్సరముల క్రితం దేవుడు అపోస్తలులకు అప్పగించిన బోధను మనం విడిచి పెట్టకూడదు. బెరయ సంఘము వారి వలె మనం ఉండాలి. వారు అపోస్తలులు చెప్పే బోధలు విని తలకాయ ఊపలేదు. అవి దేవుని వాక్యం ప్రకారం ఉన్నాయో లేదో అని ప్రతి రోజూ లేఖనములు పరిశోధించారు (అపో కార్యములు 17:11). మనం కూడా దేవుని వాక్యం వెలుగులో ప్రతి సందేశాన్ని పరీక్షించాలి. సూచక క్రియలు చూచి మనం మోసపోకూడదు. మన సంఘములలో ఉండే నాయకులను, బోధకులను మనం జాగ్రత్తగా ఎన్నుకోవాలి (తీతు 1:6-16). చెట్టు ఎలాంటిదో  దాని ఫలములను బట్టి తెలుసుకోవచ్చు (లూకా 6:43-45). హృదయం ఎలాంటిదో దాని అన్వేషణను బట్టి తెలుసుకోవచ్చు (మత్తయి 6:21). దొంగ అపోస్తలులను కూడా వారి యొక్క ఫలములను బట్టి మనం గుర్తించవచ్చు. 

Exit mobile version