ఈస్టర్ సందేశం: మన గొప్ప రక్షకుడు

emptytomb1GettyImages-920342214.jpg

ఈ రోజు ఈస్టర్ సందేశం మీకు ఇవ్వాలని నేను ఆశపడుచున్నాను. ఇప్పుడు భారత దేశం మొత్తం లాక్ డౌన్ లో ఉంది. ప్రపంచవ్యాప్తముగా అనేక దేశాలు లాక్ డౌన్ లో ఉన్నాయి. కరోనా వైరస్ అనేక చోట్ల విలయతాండవం చేస్తూ ఉంది. ఇప్పటికే 20 లక్షల మందికి వైరస్ సోకింది. లక్ష మంది ప్రాణాలు బలితీసుకొంది. అమెరికా లో ప్రతి రోజూ 2000 వేల మంది చనిపోతున్నారు. వచ్చే 30 రోజుల్లో అమెరికా దేశములో ప్రతి హాస్పిటల్ లో ప్రతి బెడ్ నింపబడే అవకాశం ఉంది. చనిపోయిన వారిని ఎక్కడ పెట్టాలో కూడా తెలియక అధికారులు తలపట్టుకొంటున్నారు. సామూహిక ఖననాలు, దహనాలు చేస్తున్నారు. ఒక పట్టణము తరువాత మరొక పట్టణము ఒక దేశం తరువాత మరొక దేశం మృత్యువు విషపు కాటుకు గురవుతున్నాయి. రష్యా దేశం ప్రక్కన ఉక్రెయిన్ అనే దేశం ఉంది. అక్కడ ప్రజలు సమాధుల కోసం గోతులు కూడా త్రవ్వుకొన్నారు. ఇంకా ఎవరూ ఈ వైరస్ కు బలికాలేదు, కానీ మాకు చావు తప్పదు అనే నిర్వేదం వారిని ఆవహించింది. ఇలాంటి పరిస్థితుల్లో ఈస్టర్ చాలా మీనింగ్ ఫుల్. మనిషి చావుకు దేవుడు ఇచ్చిన జవాబే ఈస్టర్. మనిషి మరణానికి దేవుడు ఇచ్చిన విరుగుడు ఈస్టర్.
చాలా క్రూరముగా సిలువ వేయబడి, చంపబడి, సమాధి చేయబడిన యేసు క్రీస్తు మూడు రోజుల తరువాత సమాధిని జయించి తిరిగిలేచాడు. మొత్తం ప్రపంచ చరిత్రలోనే ఇది అత్యంత గొప్ప సంఘటన. ఇది అత్యంత సంచలనాత్మక సంఘటన. ఒక మనిషి మరణాన్ని జయించి తిరిగిలేచాడు. ఈ ప్రపంచం ఎంతో మంది ప్రవక్తలను చూసింది, రాజులను చూసింది, మేధావులను చూసింది, జ్ఞానులను చూసింది యోధులను చూసింది, ఐశ్వర్యవంతులను చూసింది. భగవత్ స్వరూపులము, దైవ అంశ స్వరూపులము, యోగులము, గురువులము, భగవాన్ లము అని చెప్పుకొనే వారిని లెక్కలేనంత మందిని చూసింది.అయితే, వారందరూ మరణము ముందు శిరస్సు వంచి భూమి మీద నుండి నిష్క్రమించిన వారే. ఒక్క యేసు క్రీస్తు మాత్రమే
మరణమును జయించి తిరిగి లేచాడు.అది ఆయన యొక్క ప్రత్యేకత.
ఆయన ఎప్పుడు వర్తమానములో ఉండే దేవుడు. నిన్న లూకా సువార్త 20 అధ్యాయములో నేను ఒక మాట చదివాను.అక్కడ యేసు ప్రభువు సద్దూసయ్యులతో ఒక మాట అంటున్నాడు.ఈ సద్దూకయులు అనే వర్గము వారు పునరుత్తానము ను నమ్మరు. వారి నమ్మకం ప్రకారం చనిపోయిన వారు తిరిగిలేవరు. వారితో యేసు ప్రభువు ఒక మాట అన్నాడు: మోషే కి పొదలో ప్రత్యక్షమైనప్పుడు దేవుడు ఆయనతో ఏమన్నాడు? ‘నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను…..
ఆయన సజీవులకే దేవుడు కానీ మృతులకు దేవుడు కాదు, ఆయన దృష్టికి అందరును జీవించుచున్నారు’ (లూకా 20:37-38). నేను అబ్రహాము దేవుడను,
ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను –
I am the God of Abraham, the God of Isaac and the God of Jacob.
I AM. Eternal I AM. ఎప్పుడూ I AM.
ఆయన ఎప్పుడూ వర్తమానంలో ఉండే దేవుడు. ‘ఆయన సజీవులకే దేవుడు కానీ మృతులకు దేవుడు కాదు, ఆయన దృష్టికి అందరును జీవించుచున్నారు’ అబ్రహాము చనిపోయి వేలాది సంవత్సరాలు అయిపొయింది. అయితే దేవుని దృష్టిలో అబ్రహాము బ్రతికే ఉన్నాడు. దేవుని దృష్టిలో అబ్రహాము చనిపోలేదు. ఆ గొప్ప సత్యాన్ని మనము గుర్తుపెట్టుకోవాలి.
యోహాను సువార్త 11 అధ్యాయములో మరియ, మార్త అనే ఇద్దరు సోదరీలు ఉన్నారు. వారి సోదరుడు లాజరు చనిపోయాడు.వారు బాధతో ఏడుస్తూ ఉన్నారు. వారిని ఓదార్చటానికి యేసు ప్రభువు వారి ఊరికి వెళ్ళాడు. ఆయన కూడా వారితో కలిసే ఏడ్చాడు. ఆయన దృష్టిలో లాజరు బ్రతికేవున్నాడు. దేవుడుగా లాజరును మరణం నుండి లేపే శక్తి ఆయనకు ఉంది. అయినప్పటికీ మానవుల మధ్య కూర్చొని ఆయన మనం పడే మరణ వేదనను అనుభవపూర్వకముగా తెలుసుకొన్నాడు. సమాధుల తోటలో వారి బాధను ఆయన పంచుకున్నాడు. వారితో కలిసి కన్నీరు పెట్టాడు. అప్పుడు లాజరు సమాధి దగ్గరకు వెళ్ళాడు. లాజరు చనిపోయి 4 రోజులు అయ్యింది. ‘లాజరూ, బయటికి రా’ అని పిలిచినప్పుడు లాజరు మృతులలో నుండి లేచి, సమాధిలో నుండి బయటికి వచ్చాడు. ప్రభువైన యేసు క్రీస్తు యొక్క దేవుని శక్తి అక్కడ మనకు కనిపిస్తున్నది. లాజరును పిలిచి నట్లు ప్రతి విశ్వాసిని ఆయన పేరు పెట్టి లేపుతాడు. జీవితములో మనం ఎన్నో పోగొట్టుకొంటాము. కొన్ని సార్లు వస్తువులు పోగొట్టుకొంటాము, కొన్ని సార్లు అవయవాలు పోగొట్టుకొంటాము, కొన్ని సార్లు వ్యక్తులను కూడా పోగొట్టుకొంటాము. పోయిన సారి నేను ప్రయాణము చేస్తున్నప్పుడు, నా దగ్గర ఒక సూట్ కేసు ఉంది. అందులో రెండు మంచి సూట్ స్ పెట్టుకొన్నాను.విజయవాడ ఎయిర్ పోర్ట్ కు వెళ్తున్నాను. మధ్యలో ఆగి, కొన్ని స్వీట్స్, ఒక కేక్ కొనుకొన్నాను. ఎయిర్ పోర్టుకు వెళ్లి ఆ సూట్ కేసు ని చెక్ ఇన్ లో ఇచ్చాను. వెళ్లి విమానంలో కూర్చున్నాను.ప్రయాణము అయిపోయిన తరువాత లగేజ్ ఏరియా కి వెళ్ళాను. నా సూట్ కేసు కోసం వెదుకుతూ ఉన్నాను. అది కనిపించలేదు. కాసేపు చూసి ఎయిర్ లైన్స్ వారి దగ్గరకు వెళ్ళాను: ‘నా సూట్ కేసు ఎక్కడ?’ అని వారిని అడిగాను. ‘ఎక్కడ అంటే యేమని చెప్పము.కొన్ని వేల సూట్ కేసులు మా ఎయిర్ పోర్ట్ లో గుండా వెళ్తూ ఉంటాయి. మీ సూట్ కేసు యెక్కడ ఉంది అంటే ఏమని చెప్పము. కంప్లైంట్ వ్రాసి ఇవ్వండి, కనిపిస్తే మీకు ఫోన్ చేస్తాము’ అని తాపీగా చెప్పారు. ఆ సూట్ కేసు నాకు కనిపించకుండా పోయింది. ‘రెండు మంచి సూట్ లు పోయినాయి. ఇంటి కెళ్ళి తిందాం అనుకొన్న స్వీట్స్, కేక్ పోయినాయి’ అని నిరాశ పడుచూ నేను ఇంటికి వెళ్ళాను.
తరువాత హాస్పిటల్ కి వెళ్ళాను. ఒక వ్యక్తి నా దగ్గరకు వచ్చాడు.‘డాక్టర్ నాకు రెండు వేళ్ళు తెగిపోయినాయి’ అన్నాడు. ఒక ఫ్యాక్టరీ లో పెద్ద మెషిన్ దగ్గర అతను పనిచేస్తున్నాడు. పొరపాటున తన చేతిని మెషిన్ కు దగ్గరగా పెట్టాడు. అతని రెండు వేళ్ళు తెగిపోయినాయి. ‘నీ వేళ్ళు ఎక్కడ వున్నాయి?’ అని అతని అడిగాను. ‘అవి నాకు మళ్ళీ కనిపించలేదు’ అన్నాడు. అతని చేతి నుండి రక్తము ధారాళముగా ప్రవహిస్తున్నది. నేను రెండు గంటలు ఆపరేషన్ చేసి అతని చేతిని కాపాడాల్సివచ్చింది. చివరిలో అతను బాధతో ఒక మాట అన్నాడు, ‘నా జీవితమంతా నేను రెండు వేళ్ళు లేకుండా జీవించాల్సిందే కదా’ అతని పరిస్థితి చూసి నాకు బాధ వేసింది.‘రెండు సూట్లు పోయి నేను బాధ పడుతున్నాను. రెండు వేళ్ళు పోయిన ఈ వ్యక్తి ఎంత బాధపడాలి! ఒక సూట్ పోతే ఇంకొకటి కొనుకోవచ్చు, ఒక కేక్ పొతే ఇంకొకటి కొనుకోవచ్చు, ఒక స్వీట్ పొతే ఇంకొకటి కొనుకోవచ్చు , వేళ్ళు కొనుక్కోలేము కదా అతని చూసినప్పుడు నాకు అనిపించింది.
ఈ రోజు వార్తా పత్రికలో ఒక వ్యక్తి గురించి చదివాను. అతను న్యూ యార్క్ నగరములో జీవిస్తున్నాడు. ఆ నగరములో ఇప్పుడు ప్రతిరోజూ వందల మంది కరోనా వైరస్ సోకి మరణిస్తున్నారు. ఈ వ్యక్తి యొక్క తల్లి వృద్ధాప్యములో ఉంది. ఆమెకు జ్వరం వచ్చింది, గాలి పీల్చలేక బాధపడుతూ ఉంది. ఆ యువకుడు తన తల్లి పరిస్థితి చూసి తట్టుకోలేకపోయాడు. ఒక హాస్పిటల్ కు ఫోన్ చూశాడు. అంబులెన్సు కావాలి అని అడిగాడు. కాసేపటి తరువాత ఒక అంబులెన్సు ఆ ఇంటి ముందు ఆగింది. వైద్య సిబ్బంది ఆ ఇంటిలోకి వెళ్ళింది. ఆమెను స్ట్రెచర్ మీద పెట్టారు. అంబులెన్సు లో పెట్టుకొని ఆమెను హాస్పిటల్ కి తీసుకు వెళ్లారు. కాసేపటి తరువాత ఆ యువకుడు హాస్పిటల్ కి ఫోన్ చేసాడు. ‘మా అమ్మ ఎలా వుంది?’ అని అడిగాడు. ‘మీ అమ్మ పేరేంటి?’ అని హాస్పిటల్ స్టాఫ్ అడిగారు. పేరు చెప్పాడు. ‘ఆ పేరుతో మా హాస్పిటల్ లో ఎవరూ లేరు’ అని సమాధానము వచ్చింది. ఆ యువకుడు కంగారు పడ్డాడు.
‘అదేంటి? నిన్న మీ హాస్పిటల్ నుండే మా ఇంటికి అంబులెన్సు పంపించారు. మా అమ్మను తీసుకొని వెళ్లారు. ఆమెను ఎక్కడికి తీసుకు వెళ్లారు? ఆమె ఇప్పుడు ఎలా ఉంది?’ హాస్పిటల్ వారు చేసిన తప్పేమిటి అంటే ఆమె పేరు తప్పుగా వ్రాసుకున్నారు. ఆమె కరోనా వైరస్ బారిన పడింది. ఆమె పరిస్థితి విషమించింది. నా అనే వాళ్ళు లేకుండానే ఒక అనాథ వలె హాస్పిటల్ లో ప్రాణము విడిచింది. ఆ యువకుడు మాత్రం న్యూ యార్క్ లో అన్ని హాస్పిటల్ ళ్లకు ఫోన్ చేశాడు. మా అమ్మ ఎక్కడ? కనీసం ఆమె మృత దేహాన్ని అయినా మాకు ఇవ్వండి’ అని ప్రాధేయపడుతున్నాడు. ‘ఈ నగరములో వేల మంది చనిపోతున్నారయ్యా. మీ అమ్మ ఎక్కడ ఉందంటే ఏమని చెబుతాము. కంప్లైంట్ వ్రాసివ్వు. కనిపిస్తే ఫోన్ చేస్తాము’ అని అతనికి చెప్పారు. పేరులు సరిగ్గా రాసుకోకుండా హాస్పిటల్ లో జేరుస్తున్నారు. చనిపోయిన వారిని ఎవరూ లేని అనాథలు అని చెప్పి, పెద్ద, పెద్ద గోతులు త్రవ్వి సామూహిక ఖననాలు చేస్తూ ఉన్నారు. ఇలాంటి దయనీయ మైన సంఘటనలు ప్రతి రోజూ జరుగుతూనే
ఉన్నాయి. ఎయిర్ పోర్ట్ లో సూట్ కేసులు మిస్ అవుతున్నట్లు హాస్పిటల్స్ ల్లో మనుష్యులు మిస్ అవుతున్నారు. మనిషి యొక్క బలహీనత మనకు అక్కడ కనిపిస్తున్నది. అక్కడికే యేసు ప్రభువునడిచి వస్తున్నాడు. ఆ సమాధుల తోటలో ఆయన లాజరు సమాధి దగ్గరకు వెళ్ళాడు.‘లాజరూ బయటికి రా’ అని పిలిచాడు.
మృతులలో నుండి లేచి సమాధిలో నుండి లాజరు నడుచుకుంటూ బయటికి వచ్చాడు.
‘లాజరూ, బయటికి రా’ అని పిలిచిన ఈ రక్షకుడు ప్రతి వారినీ పేరు పెట్టి పిలుస్తాడు.
‘రాజా రావు, బయటికి రా’
‘సుబ్బా రావు, బయటికి రా’
‘మేరీ, బయటికి రా’
‘సుజాత, బయటికి రా’
‘కాంతా రావు, బయటికి రా’
ప్రభువు నందు నిద్రించిన ప్రతి వ్యక్తిని ఆయన పేరు పెట్టి తన వద్దకు పిలుస్తాడు.
‘ఆయన సజీవులకే దేవుడు కానీ, మృతులకు దేవుడు కాదు’, ‘పునరుత్థానమును, జీవమును నేనే’ I am the Life and the Resurrection.నేను మట్టిలో కలిసి పోయిన తరువాత మిస్ అయిపోతాను అని ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు. అటువంటి గొప్ప భద్రత రక్షకుడైన యేసు క్రీస్తు మనకు ఇస్తున్నాడు.
C.S.లూయిస్ గారు క్రానికల్స్ అఫ్ నార్నియా అనే గొప్ప నవలలు వ్రాశాడు.రెండో ప్రపంచ యుద్ధము జరుగుతున్నప్పుడు లండన్ నగరము మీద హిట్లర్ సైన్యాలు
బాంబుల వర్షము కురిపిస్తున్నది. ఆ సమయములో తల్లిదండ్రులు తమ పిల్లలను
సురక్షిత ప్రదేశాలకు తరలించారు. ఆ చిన్న పిల్లలు ఒక రోజు తమ ఇంటిలో నుండి
‘నార్నియా’ అనే అడవిలోకి ప్రవేశిస్తారు. అక్కడ ‘వైట్ విచ్’ అనే ఒక మంత్ర సాని
రాజ్యము చేస్తూ ఉంటుంది. ఆమె దుష్ట పాలనలో నార్నియా లో ఎవరికీ నెమ్మది
ఉండదు. ఎవరికీ నిరీక్షణ ఉండదు.అందరినీ ఆ దుష్ట శక్తి తన కబంధ హస్తాల్లో
బంధిస్తుంది. ‘ఆస్లాన్’ అనే ఒక సింహం ఆ అడవిలో ప్రవేశిస్తుంది. ఆ సింహం ఆ
ప్రజల కోసం తన ప్రాణం పెడుతుంది.‘సింహం చనిపోయింది’ అని వైట్ విచ్ సంతోషిస్తుంది. అయితే అది కొన్ని రోజులు మాత్రమే. మూడు రోజుల తరువాత సింహం
మరణాన్ని జయించి తిరిగి లేస్తుంది.ఆ సింహం ఎవరంటే యేసు క్రీస్తే.
ఆయన పునరుత్తానాన్ని దేవుడు తన ప్రవక్తల ద్వారా తెలియజేశాడు. సమయము
వచ్చినప్పుడు ఆ ప్రవచనాలు నెరవేర్చాడు.‘ప్రవచనాల్లో పునరుత్తానము’ ఈ చార్ట్ చూడండి.ఈ చార్ట్ కావలసిన వారు మా వెబ్ సైట్ http://www.doctorpaul.org కి వెళ్లి బైబిల్ ప్రవచనాలు అనే పేజీ కి వెళ్లి ఈ చార్ట్ డౌన్ లోడ్ చేసుకోండి.

Resurrectioninprophecy.jpg

ఏదెను వనములో ఆదాము, హవ్వలు పాపం చేసినప్పుడు ఈ ప్రపంచములోకి మరణము ప్రవేశించింది. సాతానుడు అది చూసి సంతోషించాడు. దేవుడు అక్కడే సాతానుకు ఒక మాట చెప్పాడు. ‘మరణాన్ని జయించే రక్షకుని నేను భూలోకానికి పంపిస్తాను. ఆ స్త్రీ గర్భములో నుండే ఆయన ఒక మానవునిగా జన్మిస్తాడు (ఆదికాండము 3:15). హెబ్రీయులకు వ్రాసిన పత్రికలో మనము చదువుతాము.

ఆ ప్రకారమే మరణము యొక్క
బలముగలవానిని,
అనగా అపవాదిని మరణముద్వారా
నశింపజేయుటకును,
జీవితకాలమంతయు
మరణభయము చేత దాస్యమునకు లోబడినవారిని
విడిపించుటకును, ఆయనకూడ
రక్తమాంసములలో పాలివాడాయెను.
హెబ్రీ 2:14-15

దేవుడు రక్త మాంసములు ధరించాడు? ఎందుకంటే మరణము యొక్క బలము గల
సాతానును మరణము ద్వారానే జయించటానికి. మరణ భయము యొక్క దాస్యములో నుండి మనలను విడిపించటానికి. ఆ తరువాత లేవీయ కాండము 23 లో దేవుని ఏడు పండుగలు మనకు కనిపిస్తున్నాయి.
మొదటి పండుగ పస్కా పండుగ. ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశము నుండి బయలుదేరుతున్నారు. ఐగుప్తు దేవతలకు దేవుడు తీర్పు తీర్చాడు.అమెరికా లో హల్క్ హొగన్ అనే ఒక ప్రసిద్ధ ఆట గాడు ఉన్నాడు.రెస్లింగ్ లో ఆయన ప్రపంచ ప్రఖ్యాతి చెందాడు. రెండ్రోజుల క్రితం ఆయన ఒక మాట అన్నాడు: ‘దేవుడు ఐగుప్తు మీదకు తెగులు పంపి ఐగుప్తు దేవతలకు తీర్పు తీర్చాడు. ఈ రోజు కరోనా తెగులును పంపి మనం పూజిస్తున్న ఆధునిక దేవుళ్ళకు తీర్పు తీరుస్తున్నాడు.అనేకమైన ఆధునిక
దేవుళ్లను మనము సృష్టించుకొని పూజిస్తున్నాము.
కొంతమంది మ్యూజిక్ ని పూజిస్తున్నారు
కొంత మంది స్పోర్ట్స్ కార్లను పూజిస్తున్నారు.
కొంత మంది క్రికెట్ ని పూజిస్తున్నారు.
కొంత మంది క్రికెటర్ లను పూజిస్తున్నారు.
కొంత మంది సినిమా యాక్టర్ లను పూజిస్తున్నారు.
కొంత మంది డబ్బును పూజిస్తున్నారు
కొంతమంది రాజకీయ నాయకులను పూజిస్తున్నారు.
ఈ ఆధునిక దేవుళ్ళు, దేవతలు మనలను రక్షించలేవు. దేవుడు ఈ కరోనా తెగులును పంపి పెద్ద, పెద్ద స్టేడియం లను మూయించివేశాడు, క్రీడాకారులను ఇంటికి పంపించి వేశాడు, సినిమా యాక్టర్లను ఇంటికి పంపించి వేశాడు, నాయకులను ఇంటికి పంపించి వేశాడు.మా పరిస్థితి ఏమిటి అని వారు బిక్కు బిక్కు మంటున్నారు. ఈ ఆధునిక దేవుళ్ళు, దేవతలు మిమ్మల్ని రక్షించలేవు. సజీవుడైన యేసు క్రీస్తు దగ్గరకు మీరు రావాలి అనే సందేశాన్ని దేవుడు మన దగ్గరకు ఈ కరోనా తెగులు ద్వారా పంపించాడు’
అన్నాడు. హల్క్ హొగన్ అనే ఈ ప్రసిద్ధ క్రీడాకారుడు ఈ మాటలు అన్నాడు. పస్కా
పండుగకు ముందు దేవుడు పంపిన సందేశం అదే. ఆ పండుగలో యేసు క్రీస్తు మన కొరకు వధించబడిన గొఱ్ఱె పిల్లగా కనిపిస్తున్నాడు.
రెండో పండుగ పులియని రొట్టెల పండుగలో క్రీస్తు సమాధి మనకు కనిపిస్తున్నది. పాపము లేని ఆయన పరిశుద్ధ జీవితము కనిపిస్తున్నది. మూడో పండుగ ప్రథమ
ఫలముల పండుగ. అందులో ఆయన పునరుత్థానము కనిపిస్తున్నది. మృతులలో
నుండి ఆయన ప్రథమ ఫలముగా తిరిగి లేచాడు. ఇశ్రాయేలీయులు ప్రతి సంవత్సరము ఈ ప్రథమ ఫలముల పండుగ చేసుకునేటప్పుడు భవిష్యత్తులో మరణము నుండి తిరిగి లేవనున్న రక్షకుని కొరకు వారు ఎదురుచూశారు. ఆ తరువాత, దావీదు రాజు పునరుత్థానము గురించి ప్రవచించాడు. 16 కీర్తన 10 వచనంలో ‘నీ పరిశుద్ధుని కుళ్లుపట్టనియ్యవు’ అని దావీదు వ్రాశాడు. ఆ ప్రవచనము యేసు క్రీస్తు పునరుత్తానము గురించే. యోబు తీవ్రమైన బాధలో ఉండి ఒక ప్రవచనము చేశాడు. యోబు గ్రంథము 19:25 లో మనము చదువుతాము:
అయితే నా విమోచకుడు
సజీవుడనియు,
తరువాత ఆయన భూమిమీద
నిలుచుననియు నేనెరుగుదును.
యోబు గ్రంథము 19:25

యోబు తాను పొందిన శ్రమల్లో ఆ ప్రవచనము ఆయనకు ఆదరణ ఇచ్చింది.
మహా ప్రవక్త యెషయా ఒక ప్రవచనం చేశాడు. యెషయా గ్రంథము 25:8 లో మనం చదువుతాము.
మరెన్నడును ఉండకుండ
మరణమును
ఆయన మింగి వేయును.
యెషయా గ్రంథము 25:8
ప్రభువైన యేసు క్రీస్తు కూడా భూమి మీద ఉన్నప్పుడు అనేక సార్లు తన పునరుత్తానము గురించి ప్రవచించాడు. మనుష్యకుమారుడు శ్రమపెట్టబడతాడు, సిలువ వేయబడతాడు, సమాధిచేయ బడతాడు, సమాధి నుండి తిరిగి లేస్తాడు అని అనేక సార్లు ఆయన చెప్పటం సువార్తలలో మనం చదువుతాము. దేవాలయమును పడగొట్టండి, మూడు దినములలో దానిని తిరిగిలేపుతాను అన్నాడు.
ఆ ప్రవచనము ఆయన పునరుత్తానము గురించే. నా శరీరాన్ని పడగొట్టండి, మూడు రోజుల్లో దానిని తిరిగి లేపుతాను అని ఆయన అన్నాడు.
ఆ విధముగా ఏదెను వనములో దేవుడు చేసిన ప్రవచనము, లేవీయ కాండము 23
అధ్యాయములోని ప్రథమ ఫలముల ప్రవచనము, దావీదు, యోబు, యెషయాలు చేసిన ప్రవచనాలు, యేసు క్రీస్తు తన గురించి తాను చెప్పిన ప్రవచనాలు మొత్తం ఆయన తిరిగి లేచినప్పుడు నెరవేరినాయి. ఆయన లేఖనముల ప్రకారము మూడవదినమున లేపబడెను. (1 కొరింథీ 15:4)
యేసు క్రీస్తు ప్రభువు పునరుత్తానమే క్రైస్తవ్యానికి పునాది. క్రీస్తు లేపబడియుండనియెడల మేము చేయు ప్రకటన వ్యర్థమే, మీ విశ్వాసమును వ్యర్థమే అని వ్రాశాడు అపోస్తలుడైన పౌలు 1 కొరింథీ 15 అధ్యాయములో (15:14)
అపొస్తలుల కార్యములు 4:33 లో అపొస్తలులు బహు బలముగా ప్రభువైన యేసు
పునరుత్థానమును గూర్చి సాక్ష్యమిచ్చిరి అని మనము చదువుతున్నాము. అపోస్తలుల
తిరిగి లేచిన యేసు క్రీస్తు ను చూశారు, కలిసారు, మాట్లాడారు, ఆయనతో కలిసి నడిచారు, భోజనం చేశారు, సహవాసం చేశారు.అందుకనే అంత బలముగా దాని గురించి సాక్ష్యమిచ్చారు.యేసు క్రీస్తు మరణాన్ని జయించాడు కాబట్టే ఆయన మీద నమ్మకము ఉంచిన వారందరూ భవిష్యత్తులో మరణమును జయిస్తారు. ఈస్టర్ సందర్భముగా ప్రభువైన యేసు క్రీస్తు పునరుత్తానము గురించి ఈ రోజు మనము చూశాము. రోమా పత్రిక 10:9 లో మనం చదువుతాము:
అదే మనగా యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని,
దేవుడు మృతులలోనుండి ఆయనను లేపెనని నీ హృదయ
మందు విశ్వసించినయెడల, నీవు రక్షింపబడుదువు. రోమా పత్రిక 10:9
రక్షణ పొందాలంటే రెండు పనులు చేయాలి: యేసు క్రీస్తును మీ ప్రభువుగా అంగీకరించాలి. ఆయన మరణం తిరిగి లేచాడని మీ హృదయములో మీరు నమ్మాలి, మీ నోటితో ఒప్పుకోవాలి. అదే నేటి మా ప్రేమ సందేశం.