విశ్వాసి జీవితములో అతి ముఖ్యమైన పని దేవుని స్తుతించుట. దేవుని దృష్టిలో అది ఎంతో ప్రశస్తమైనది. మనం చేసే స్తుతి ఆయన హృదయానికి ఎంతో ఆనందమును ఇస్తుంది. కాబట్టి, 66 పుస్తకములలో అతి పెద్ద పుస్తకముగా దేవుడు ఈ స్తుతి కీర్తనలను రచించాడు. మొత్తం విశ్వం మారిపోవుచూ ఉన్నది. విశ్వములో ప్రతిదీ మారిపోతూ ఉంది. మన జీవితములో జరిగే మార్పులను ఆపే శక్తి మనకు లేదు. మారకుండా ఉండేవాడు దేవుడు ఒక్కడే. కానీ మనము మారుచున్నాము కాబట్టి, మన జీవిత ప్రయాణములో అనేక చోట్ల దేవుడు మనకు అనేకరకాలుగా కనిపిస్తాడు. దావీదు తన కీర్తనలలో దేవుని అనేక రకాలుగా స్తుతించుట మనం చూస్తాము. దేవుడు నా కోట, నా కేడెము, నా ఆశ్రయం, నా కొండ, నా రాయి, నా రాజు, నా కాపరి, నా విమోచకుడు, నా సృష్టికర్త, నా సమృద్ధి, నా రక్షకుడు, నన్ను విడిపించేవాడు, నన్ను స్వస్థపరచేవాడు, నన్ను కాపాడేవాడు. దేవుడు అనేక రకాలుగా కీర్తనాకారునికి కనిపిస్తాడు.
ప్రాచీన కీర్తనాకారులకు లేని సమాచారం ఈ రోజు మనకు ఉంది. ‘నక్షత్రముల సంఖ్యను ఆయన నియమించియున్నాడు. వాటికన్నిటికి పేరులు పెట్టుచున్నాడు’ (కీర్తన 147:4) అని నాటి భక్తుడు దేవుని స్తుతించాడు. అంతరిక్ష శాస్త్రము లో ఇంతకు ముందెన్నడూ లేనంత పురోగతి ప్రస్తుతము జరుగుతున్నది. కోటాను కోట్ల గాలాక్షీలు, బ్లాక్ హోల్ లు, గురుత్వాకర్షణ తరంగాలు, సాపేక్ష వ్యవస్థ, డార్క్ మేటర్, డార్క్ శక్తి ల గురించి మనము తెలుసుకొంటున్నాము. అంతరిక్షంలో ఎన్నో లక్షల కోట్ల నక్షత్రాలు ఉన్నాయి. దేవుడు వాటన్నిటికి పేరులు పెట్టి వాటిని గుర్తుపెట్టుకొన్నాడు. దేవుని యొక్క జ్ఞాన ఐశ్వర్యం మనకు ఇక్కడ కనిపిస్తున్నది. జులై 20, 1969 అపొల్లో 11 అంతరిక్ష యాత్ర జరిగింది. నీల్ ఆర్మ్ స్ట్రాంగ్, బుజ్ ఆల్డ్రిన్ అనే ఇద్దరు వ్యక్తులు చంద్రుని మీద పాదం మోపారు. చంద్రుని మీద 2 గంటల 15 నిమిషాలు గడిపారు. ప్రపంచ వ్యాప్తముగా కొన్ని కోట్ల మంది ప్రజలు ఆ దృశ్యాలు సమాచార వ్యవస్థల ద్వారా చూసారు. బుజ్ ఆల్డ్రిన్ చంద్రుని మీద కూర్చొని 8 వ కీర్తన చదివాడు.
‘నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి అందునుబట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించు చున్నాను నీ కార్యములు ఆశ్చర్యకరములు.’ (కీర్తన139:14) అని దావీదు జీవరాశులలో దాగిఉన్న దేవుని జ్ఞానమును చూసి ఆశ్చర్యపోతూ దేవుని స్తుతించాడు. అద్భుతమైన జీవ కణ వ్యవస్థ, గ్లైకోలాసిస్, ఎలెక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ చైన్, క్లోరోఫిల్, DNA, RNA, జీన్స్, క్రోమోసోములు మొదలగు వాటి గురించి మనము తెలుసుకొంటున్నాము. మనిషి తన సమాచారాన్ని భద్రపరచుకొనుటకు కోటానుకోట్ల కంప్యూటర్లు నిర్మించుకున్నాడు. అయితే ఆ సమాచారం మొత్తము ఒక కేజీ DNA లో భద్రపరచవచ్చు. ఇంకో 500 సంవత్సరాల తరువాత నేటి కంప్యూటర్లు పనికివస్తాయా? ఇంకో 5 వేల సంవత్సరాల తరువాత వాటిలోని సమాచారాన్ని బయటకు తేగలమా? కానీ, 5 వేల సంవత్సరాల క్రితము నాటి DNA లోని సమాచారాన్ని ఇప్పుడు బయటకు తేగలుగుచున్నాము.దేవుని జ్ఞానము అటువంటింది. ఒక వెంట్రుకలో 1/25,000 భాగము మందములో DNA లో దేవుడు సమాచారాన్ని భద్రపరచాడు.
దేవుని జ్ఞానము, శక్తి మరింతగా తెలుసుకొంటున్న మనము ఇంకెంతో ఎక్కువగా ఆయనను స్తుతించాలి. ఆయనలో ఆనందించాలి. క్రొత్త నిబంధనలో అన్నిటి కంటే ఎక్కువగా పేర్కొనబడిన పాత నిబంధన గ్రంథము కీర్తనల గ్రంథము. 117 వ కీర్తన బైబిల్ గ్రంథములో మధ్య కీర్తన. పౌలు, పేతురు అనేక సార్లు తమ ప్రసంగాల్లో ఈ గ్రంథమును పేర్కొన్నారు.
రచయిత:
అనేక మంది రచయితలను పరిశుద్ధాత్మ దేవుడు ఈ గ్రంథము వ్రాయుటకు ఉపయోగించుకున్నాడు.
దాదాపు 75… దావీదు
12 కీర్తనలు … ఆసాపు
11 కీర్తనలు…. కోరహు కుమారులు
2 కీర్తనలు …. సొలొమోను
1 కీర్తన …. మోషే
1 కీర్తన …. హేమాను
1 కీర్తన …. ఏతాను
49 కీర్తనలు… అనామక రచయితలు (ఎజ్రా, నెహెమ్యా మొదలగు వారు)
వ్రాయబడిన కాలము: మోషే (క్రీ.పూ1410) నుండిబబులోను చెర తరువాత వరకు (క్రీ.పూ 400) దాదాపు వేయి సంవత్సరముల కాలము
వ్రాయబడిన స్థలము: ఇశ్రాయేలు, మధ్య ప్రాచ్యము
ముఖ్య అంశాలు:
ఆసక్తి: కొన్ని కీర్తనలు దేవుని పట్ల ఆసక్తిని వ్యక్తపరుస్తాయి.(కీర్తన42, దుప్పి నీటివాగులకొరకు ఆశపడునట్లు దేవా, నీకొరకు నా ప్రాణము ఆశపడుచున్నది)
కృతజ్ఞత: కష్టాలలో ఉన్నప్పుడు దేవుని మీద మనకు కోపము రావచ్చు. కానీ, దేవుడు మనకు చేసిన మేలులు గుర్తుకుతెచ్చుకొని ఆయనను స్తుతించుట నేర్చుకోవాలి (కీర్తన103నా ప్రాణమా, యెహోవాను సన్నుతించుము ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము)
ఆదరణ: ఈ ప్రపంచములో ఎవ్వరూ ఇవ్వలేనంత ఆదరణ దేవుడు మనకు ఇస్తాడు (కీర్తన 94: నా అంతరంగమందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగ జేయుచున్నది)
కాపుదల: దేవుని కాపుదల మనకు ఎప్పుడూ ఉంటుంది (కీర్తన 23: యెహోవా నా కాపరి నాకు లేమి కలుగదు.
అభయము: దేవుని మీద చూపు పెట్టినప్పుడు, దేనికీ, ఎవరికీ భయపడవలసిన అవసరము లేదు (కీర్తన 23: గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను
విశ్వసనీయత: దేవుడు మనలను ఎన్నడూ వదిలిపెట్టడు (కీర్తన 90: “ప్రభువా, తర తరములనుండి మాకు నివాస స్థలము నీవే, యుగా యుగములకు నీవే మాకు దేవుడవు, దేవుడవు, దేవుడవు.” )
విఙ్ఞాపణ: ప్రతి రోజూ మన విఙ్ఞాపణలు వినుటకు దేవుడు సిద్ధముగా ఉన్నాడు (కీర్తన 40: లెక్కలేనిఅపాయములు నన్ను చుట్టుకొనియున్నవి.యెహోవా, దయచేసి నన్ను రక్షించుము యెహోవా, నా సహాయమునకు త్వరగా రమ్ము.
ముఖ్య వ్యక్తులు: దేవుడు, యేసు క్రీస్తు, మోషే, అబ్రహాము, దావీదు, సొలొమోను, కోరహు తదితరులు
గ్రంథ విభజన: కీర్తనల గ్రంథము 5 ప్రధాన భాగములుగా విభజించబడింది. అనేక రకాలుగా ఈ కీర్తనలు మనకు కనిపిస్తాయి.
1.భక్తి కీర్తనలు
2.కృతజ్ఞతా కీర్తనలు
3.స్తుతి కీర్తనలు
4.అభయ కీర్తనలు
5.విజ్ఞాపన కీర్తనలు
6.యాత్ర కీర్తనలు
7.జ్ఞాన కీర్తనలు
8.ప్రవచన కీర్తనలు
ముఖ్య ప్రవచనాలు:
మన ప్రభువైన యేసు క్రీస్తును గురించిన అనేక ప్రవచనాలు కీర్తనల గ్రంథములో మనకు ఇవ్వబడ్డాయి.
కీర్తన 2 : 7
యేసు క్రీస్తు దేవుని చేత అభిషేకించబడినవాడు
కీర్తన 8:6
యేసు క్రీస్తు పాదముల క్రింద సమస్తము ఉంటాయి
కీర్తన 16: 10
యేసు క్రీస్తు మరణం నుండి తిరిగిలేస్తాడు
కీర్తన 22:1
యేసు క్రీస్తు సిలువ మీద దేవుని చేత విడువబడతాడు
కీర్తన 22:7,8
యేసు క్రీస్తును అవమానిస్తారు, అపహసిస్తారు
కీర్తన 22:16
యేసు క్రీస్తు చేతులు,పాదములు పొడవబడతాయి
కీర్తన 22:18
యేసు క్రీస్తు వస్త్రాల కోసం వాళ్ళు చీట్లు వేసుకొంటారు
కీర్తన 34:20
యేసు క్రీస్తు ఎముకల్లో ఒక్కటి కూడా విరువబడదు
కీర్తన 35:19
యేసు క్రీస్తును కారణం లేకుండా వారు ద్వేషిస్తారు
కీర్తన 40:7,8
యేసు క్రీస్తు దేవుని చిత్తాన్ని జరిగిస్తాడు
కీర్తన 41:9
యేసు క్రీస్తు తన స్నేహితునిచేత అప్పగించబడతాడు
కీర్తన 45:6
యేసు క్రీస్తు సింహాసనము నిరంతరము నిలుచును
కీర్తన 68:18
యేసు క్రీస్తు ఆరోహణుడై పరలోకానికి వెళ్తాడు
కీర్తన 69:9
యేసు క్రీస్తు దేవుని ఇంటిని గూర్చి ఎంతో ఆసక్తి కలిగి ఉంటాడు
కీర్తన 69:21
యేసు క్రీస్తు చేదు చిరకను సిలువ మీద రుచి చూస్తాడు
కీర్తన 109:8
యూదా ఇస్కారియోతు స్థానంమరొకరికి ఇవ్వబడుతుంది
కీర్తన 110:1
యేసు క్రీస్తు ఎదుట ఆయన శత్రువులు మోకరిల్లుతారు
కీర్తన 110:4
యేసు క్రీస్తు మెల్కీసెదెకు క్రమము చొప్పున మనకు యాజకుడు అవుతాడు
కీర్తన 118:22
యేసు క్రీస్తు ప్రధానమయిన రాయి
కీర్తన 110:26
యేసు క్రీస్తు యెహోవా దేవుని పేరట వస్తాడు .
ప్రభువైన యేసు క్రీస్తు రూపం: పైన చెప్పబడినట్లు, ఈ గ్రంథము లో అనేక ప్రవచనాలు తన గురించే వ్రాయబడినవని సాక్షాత్తూ మన ప్రభువైన యేసు క్రీస్తే మనకు తెలియజేశాడు (లూకా 24: 44)
మనం నేర్చుకోవలసిన పాఠాలు:
- కీర్తనాకారుల వలె మనము కూడా అన్ని పరిస్థితులలో – సంతోషమైన, దుఃఖమైనా – దేవుని స్తుతించడము నేర్చుకోవాలి
- కొన్ని మన జీవితము మన చేతుల్లో ఉండదు.అటువంటి పరిస్థితులలో దేవుని సార్వభౌమాధికారము, ఆయన ప్రేమ, ఆయన కరుణ, ఆయన విశ్వసనీయత, ఆయన సామీప్యత లను గుర్తుచేసుకొంటూ దేవుని సహాయము కొరకు కీర్తనాకారుల వలె మనము కూడా నిరీక్షించాలి.