మీ అందరికీ ప్రభువైన యేసు క్రీస్తు మహిమ కలిగిన నామములో శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అప్పుడే క్రిస్మస్ వచ్చేసిందా అని నాకు అనిపిస్తున్నది. క్రిస్మస్ ని మనం ఏ విధముగా చూడాలి. క్రిస్మస్ ద్వారా దేవుడు మానవాళికి పంపిన సందేశం ఏమిటి? ఈ 21 శతాబ్దములో నివశిస్తున్న మనకు క్రిస్మస్ ఏమి నేర్పిస్తున్నది? క్రిస్మస్ రోజున ప్రభువైన యేసు క్రీస్తును మనము జ్ఞాపకము చేసుకొంటున్నాము. దేవుడు ఈ భూలోకానికి ఒక మానవుడిగా వచ్చాడు. అది మైండ్ షేక్ చేసే వాస్తవము.
ఈ విశ్వాన్ని సృష్టించిన దేవుడు ఈ భూమి మీదకు ఒక మానవునిగా వచ్చాడా? మన మైండ్ షేక్ అయిపోయే సత్యం అది.
ఈ చిన్న గ్రహము మీద జీవిస్తున్న మన మధ్యలోకి సాక్షాత్తు దేవుడు రావడము ఏమిటి అని మనకు అనిపిస్తుంది. ఆ సత్యము మనము అర్థం చేసుకొని నమ్మి ఆచరణలో పెడితే మన జీవితం కంప్లీట్ గా మారిపోతుంది. యేసు క్రీస్తు జననము గురించి అనేక అపోహలు ఉన్నాయి. అయితే ఆయన జననం గురించి సత్యాలు తెలుసుకోవాలంటే మనము బైబిల్ చదవాలి.
క్రొత్త నిబంధనలో 27 పుస్తకాలు ఉన్నాయి.ముందు 4 సువార్తలు ఉన్నాయి.మత్తయి సువార్త, మార్కు సువార్త లూకా సువార్త, యోహాను సువార్త 4 సువార్తలలో యేసు ప్రభువు మనకు 4 రకాలుగా కనిపిస్తాడు. మత్తయి సువార్త లో ఆయన యూదుల రాజు, సింహం; మార్కు సువార్త లో ఆయన సేవకుడు, ఎద్దు లూకా సువార్తలో మనుష్య కుమారుడు, మానవుడు యోహాను సువార్తలో ఆయన దేవుడు, పక్షిరాజు.
ఈ నాలుగు సువార్తలలో మత్తయి లూకా సువార్తలలో మాత్రమే ఆయన జన్మ గురించిన వివరాలు ఉన్నాయి. వాటిని చదివితే మనకు ఆయన దైవత్వము, మానవత్వము రెండూ కనిపిస్తున్నాయి. ప్రభువైన యేసు క్రీస్తు Divine King & Human Servant
Divine King దైవిక రాజు,
Human Servant, మానవ సేవకుడు
మత్తయి తన సువార్తలో ఆయనను యూదుల రాజుగా చూపిస్తున్నాడు. యూదుల రాజు యూదా గోత్రములో జన్మించాలి. యేసు ప్రభువు యొక్క యూదా గోత్రపు వంశం యొక్క వివరాలతో మత్తయి తన సువార్త ప్రారంభించాడు. దేవుడు యెషయా ప్రవక్త ద్వారా తెలియజేశాడు.
యెష్షయి మొద్దునుండి చిగురు పుట్టును
వాని వేరులనుండి అంకురము
ఎదిగి ఫలించును (యెషయా 11:1)
There shall come forth a shoot
from the stump of Jesse
and a branch from his roots
shall bear fruit.
యెష్షయి అంటే దావీదుకు తండ్రి. దావీదు వంశానికి దేవుడు రాజరికాన్ని ఇచ్చాడు. యెషయా ప్రవక్త ఈ మాటలు వ్రాసే సమయములో దావీదు వంశము చాలా క్షీణ స్థితిలో ఉంది. దావీదు, సొలొమోను లాంటి గొప్ప రాజులు వారికి ఇక లేరు.
ఇశ్రాయేలీయుల చుట్టూ బబులోను సామ్రాజ్యము విస్తరిస్తున్నది. బబులోను సైన్యాల ముందు యూదులు గడగడలాడుచూ బ్రతుకుతున్నారు. వారి అంతము రేపో మాపో అన్నట్లుగా వారి పరిస్థితి ఉంది.
ఆ సమయములో యెషయా ప్రవక్త వారి మధ్యలోకి వచ్చాడు. ఈ యెష్షయి మొద్దును చూడండి. ఒక రోజుల్లో అది ఒక మహా వృక్షములా ఎదిగింది. ఆ చెట్టు అందము ప్రపంచ దేశాలను ఆకర్షించింది. ఆ చెట్టు అనేక మందికి నీడ నిచ్చింది. ఆ చెట్టు క్రింద అనేక మంది సేదదీరారు. అయితే ఆ చెట్టు కొట్టివేయబడింది.
మొద్దు మాత్రమే మిగిలిఉంది. ఆ మొద్దు లో జీవం లేదు, దానిని చూసే వారికి నిరీక్షణ లేదు. అయితే దేవుడు ఒక వాగ్దానము మీకు చేస్తున్నాడు: యెష్షయి మొద్దులో నేను చిగురు పుట్టిస్తాను. ఆ మొద్దుకు జీవం ఇస్తాను దాని వేరులకు ప్రాణం పోస్తాను
ఇశ్రాయేలీయులను పాలించే రాజు దానిలో నుండి వస్తాడు తన ప్రజలను వారి పాపములలో నుండి రక్షించే రక్షకుడు దానిలో నుండి వస్తాడు. తన ప్రజలను పాలించే దావీదు కుమారుడు దానిలో నుండి వస్తాడు.
యెషయా చేసిన ఆ ప్రవచనము 700 సంవత్సరాల తరువాత నెరవేరింది.యూదుల రాజు జన్మించాడు. ఇశ్రాయేలు దేశము అప్పుడు రోమన్ సామ్రాజ్యము క్రింద నలుగుతూ ఉన్నది.దాని సామంత రాజు హేరోదు యెరూషలేములో రాజుగా పాలిస్తున్నాడు.
హేరోదు యూదులను తన కాళ్ళ క్రింద అణగద్రొక్కాడు. గొప్ప రాజ భవనాలు కట్టుకున్నాడు. చివరకు కుటుంబ సభ్యులను కూడా హతమార్చి తన సింహాసనాన్ని పటిష్ఠపరచుకొన్నాడు. అటువంటి సమయములో ఈ జ్ఞానులు యెరూషలేము వచ్చి అతని అడిగారు:
యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు?
ఆ ప్రశ్న విని హేరోదు ఖంగుతిన్నాడు. యేసు క్రీస్తు జన్మ అతనికి పిడుగుపాటు లాగా వినిపించింది. హేరోదు రాజు వెంటనే అత్యవసర సమావేశం పెట్టాడు.
ప్రధాన యాజకులను, శాస్త్రులను పిలిపించాడు. ‘నేను ఒక దుర్వార్త విన్నాను. యూదుల రాజు గురించి నన్ను అడుగుతున్నారు. క్రీస్తు ఎక్కడ పుడతాడు?’ వారు హేరోదుతో చెప్పారు: 700 సంవత్సరాల క్రితము మీకా ప్రవక్త ఒక ప్రవచనము చేశాడు.
ఏల యనగా యూదయదేశపు బేత్లెహేమా
నీవు యూదా ప్రధానులలోఎంతమాత్రమును
అల్పమైన దానవు కావు;
ఇశ్రాయేలను నా ప్రజలను పరిపాలించు అధిపతి
నీలో నుండి వచ్చును
ఆయన జన్మించేది బెత్లెహేములో దేవుడు ప్రవచనము చేస్తే అది ఖచ్చితముగా నెరవేరుతుంది. యేసు క్రీస్తు మీకా ప్రవక్త చెప్పినట్లే బెత్లెహేములో జన్మించాడు.
హేరోదు స్థానములో మీరు ఉంటే ఏమి చేస్తారు?
‘దేవుడు వాగ్దానము చేసిన రాజు నా అంతః పురానికి దగ్గరలోనే జన్మించాడా? నేను కూడా మీతో వస్తాను. నాకు కూడా ఆయనను చూడాలని ఉంది. నేనిక రాజుగా ఉండను, ఆయనే మనకు రాజు’ హేరోదు ఆ విధముగా అనుకోలేదు: ‘దేవుడు వాగ్దానం చేసిన రాజు పుట్టాడు అని తెలిస్తే ఈ జనం నా మాట వింటారా? యూదుల రాజు పుట్టాడు అని తెలిస్తే ఈ యూదుల రాజుగా నన్ను ఒక్క రోజు కూడా సహించరు’ అని అనుకొన్నాడు. తన సమస్యలను అధిగమించడానికి హేరోదు ఎంచుకొన్న మార్గము హత్యలు చేయించడం. వీడు నాకు అడ్డు వస్తున్నాడు అనుకొన్న ప్రతివానిని హత్యలు చేసి తన పీఠాన్ని కాపాడుకున్నాడు.
‘ఆ క్రీస్తు శిశువును చంపేయండి. పాలు త్రాగే పసివాడు అని కూడా చూడబాకండి’ అని ఆజ్ఞాపించాడు. బెత్లెహేము దాని చుట్టు ప్రక్కల ఊళ్లలో రెండేళ్ల కంటే చిన్న వయస్సు కలిగిన మగ బిడ్డలనందరినీ చంపివేయించాడు. మనిషి హృదయములో ఉండే దుష్టత్వము ఇక్కడ మనకు కనిపిస్తుంది. అధికారం కోసం దేవుణ్ణయినా చంపుతాను అని మనిషి అనుకొంటాడు. సోవియెట్ యూనియన్ ఏర్పడి నప్పుడు కమ్యూనిస్టులు దానిని ఒక నాస్తిక దేశముగా ప్రకటించారు. ఆ దేశము భూమికి సగం ఉంటుంది. అంత పెద్ద దేశములో దేవుని బహిష్కరించారు.
దేవుని యొద్ద నుండి అధికారము వస్తే, ఇక మేము ఎందుకు? క్రిస్మస్ పండుగ చేసుకొంటే చంపివేస్తాము అని ప్రజలను బెదిరించారు, చట్టాలు చేశారు. అది హేరోదు మనస్తత్వము. హేరోదు ఏమనుకొన్నాడు, ‘నాకు ఈ అధికారం కావాలి, క్రీస్తు వద్దు’ అది అనేక కోణాల్లో ప్రజలను క్రీస్తు యొద్దకు వెళ్లకుండా చేస్తుంది.
‘నాకు ఈ పాపము కావాలి, ఈ ఎంజాయిమెంట్ కావాలి, క్రీస్తు వద్దు’
‘నాకు ఈ స్థానము కావాలి, క్రీస్తు వద్దు’
‘నాకు మంచిపేరు కావాలి, క్రీస్తు వద్దు’
హేరోదు చేసిన తప్పే వారు చేస్తున్నారు. అయితే తూర్పు దేశపు జ్ఞానులు హేరోదు వలె ఆలోచించలేదు. మాకు దేవుడు కావాలి, మాకు రక్షకుడు కావాలి, ఆయన కోసమే ఇంత దూరము వచ్చాము, ఆయనను చూడటానికి బెత్లెహేము వెళ్తాము అని బయలుదేరారు. ఒక నక్షత్రము వారిని నడిపించింది. శిశువు ఉన్న ఇంటి వద్దకు వారిని చేర్చింది. అక్కడకు వెళ్ళినప్పుడు జ్ఞానులు అత్యానందభరితులయ్యారు. ఇంటిలోకి వెళ్లారు, కన్య మరియను చూశారు, క్రీస్తు శిశువును చూశారు. ఆయన ముందు సాగిలపడ్డారు.
ఆయనను పూజించారు.ఆయనను ఆరాధించారు. తమ పెట్టెలు విప్పారు, ఆయనకు కానుకలు సమర్పించారు. బంగారము, సాంబ్రాణి, బోళము ఆయనకు ఇచ్చారు. ఆయనకు వారు ఆరాధించారు. ఎందుకంటే ఆయన Divine King.ఆయన దేవుడు- రాజు.
మీరు గమనించండి, వారు కన్య మరియను పూజించలేదు. యేసుప్రభువును మాత్రమే పూజించారు. కన్య మరియకు ఎలాంటి దైవత్వము లేదు. ఈ రోజు మనము కూడా యేసు క్రీస్తును మాత్రమే మన దేవునిగా ఆరాధించాలి. ఆయన ప్రక్కన మరియమ్మను పెట్టి ఆరాధన చేయకూడదు.
ఆ విధముగా మత్తయి సువార్తలో శిశువైన క్రీస్తును Divine King, ఒక దేవుడు-రాజుగా మనము చూస్తున్నాము.
లూకా సువార్త 2 అధ్యాయములో క్రిస్మస్ ను మరొక కోణములో మనము చూస్తున్నాము.అగస్టస్ చక్రవర్తి రోమన్ సామ్రాజ్యమును పాలిస్తున్నాడు.
తన సామ్రాజ్యము మొత్తానికి ఒక జన సంఖ్య చెయ్యమని ఆజ్ఞాపించాడు. ఆ ఆజ్ఞ ఇవ్వబడిన సమయములో మరియ, యోసేపు దంపతులు గలిలయలో జీవిస్తున్నారు. ఇశ్రాయేలు దేశములో ఉత్తర ప్రాంతములో ఉంది. వారు అక్కడ నుండి దక్షిణమున ఉన్న యూదయ ప్రాంతానికి వెళ్లారు. అది సర్వలోకానికి జన సంఖ్య.
కోటానుకోట్ల మంది జన సంఖ్యలో యేసు ప్రభువు పేరు కూడా నమోదు కాబోవుచున్నది. ఆయన మానవులలో ఒక మానవునిగా మన మధ్యలోకి వచ్చాడు. ఎంత సాధారణ స్థితిలో ఆయన జన్మించాడో మీరొకసారి గమనించండి. ఆ సమయములో కన్య మరియ నిండు గర్భిణిగా ఉంది. ఆమెకు ప్రసవ వేదన
వచ్చినప్పుడు సత్రములో స్థలము లేదు.ఒక పశువుల పాకలో ఆమె క్రీస్తు శిశువుకు జన్మనిచ్చింది. పశువుల తొట్టె ఆయన మొదటి మంచము. నక్కలకు బొరియలును, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉండెను గాని మనుష్య కుమారునికి తలవాల్చుకొనుటకైనను స్థలము లేదు అన్న మాటలు ఆయన జన్మతోనే మొదలైనాయి.
దేవాది దేవుడు ఒక మానవునిగా మారాడు. A Human Servant ఒక మానవ సేవకుడయ్యాడు.
ప్రధాన మంత్రి మన ఊరు రావటమే ఎక్కువ, మన ఇంటికి వస్తే ఇంకా ఎక్కువ, నేను మీకు సేవకుణ్ణి అంటే ఎలా ఉంటుంది? దేవుడు ఈ భూమి మీదకు రావటమే ఎక్కువ. మన జీవితములోకి వస్తే ఇంకా ఎక్కువ. నేను నీకు సేవ చేస్తాను అంటే ఎలా ఉంటుంది! పరలోకములో తన మహిమను, ఆధిపత్యమును, అత్యున్నత స్థానమును వదలిపెట్టి భూమి మీద అత్యల్పమైన ఒక దాసుని స్థానమును ఆయన ఎన్నుకున్నాడు.
It’s a Magnificent Descent
సౌందర్యకరమైన తగ్గింపు
అపొస్తలుడైన పౌలు ఆ సౌందర్యకరమైన తగ్గింపును ఫిలిప్పీయులకు వ్రాసిన పత్రికలో వ్రాశాడు. ఆయన దేవుని స్వరూ పము కలిగినవాడైయుండి, దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని యెంచుకొనలేదు గాని మనుష్యుల పోలికగా పుట్టి, దాసుని స్వరూపమును ధరించుకొని, తన్ను తానే రిక్తునిగా చేసికొనెను.మరియు, ఆయన ఆకారమందు మనుష్యుడుగా కనబడి, మరణము పొందునంతగా, అనగా సిలువమరణము పొందు నంతగా విధేయత చూపినవాడై, తన్నుతాను తగ్గించుకొనెను. (ఫిలిప్పి 2:5-8)
బెత్లెహేములో ఆ పశువుల తొట్టెలో ఆయన పరుండినప్పుడు దేవదూత గొఱ్ఱెల కాపరులకు కనిపించాడు. వారికి ఒక గొప్ప శుభవార్త ను చెప్పాడు:
భయ పడకుడి; ఇదిగో ప్రజలందరికిని కలుగబోవు మహా సంతోషకరమైన
సువర్తమానము నేను మీకు తెలియజేయు చున్నాను;
దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి యున్నాడు,
ఈయన ప్రభువైన క్రీస్తు. దానికిదే మీకానవాలు;
ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్ట బడి యొక తొట్టిలో పండుకొనియుండుట మీరు చూచెద రని వారితో చెప్పెను.తూర్పు దేశపు జ్ఞానుల వలె ఈ గొఱ్ఱెల కాపరులు కూడా సంతోషముతో బెత్లెహేము వెళ్లి క్రీస్తు శిశువును చూసి ఆనందించి, ఆరాధించారు. దేవదూతలు కూడా దేవుని స్తుతించారు.
సర్వోన్నతమైన స్థలములలో
దేవునికి మహిమయు ఆయన కిష్టులైన
మనుష్యులకు భూమిమీద సమాధానమును
కలుగునుగాక అని దేవుని
స్తోత్రము చేయుచుండెను.
పశువుల తొట్టెలో మన రక్షకుడు పండుకొని ఉన్నాడు.దేవుడు మానవ రూపం పొందాడు. మానవ జాతికి గౌరవము ఇచ్చాడు, గుర్తింపు ఇచ్చాడు. నిన్న ఉదయము నా దగ్గరకు ఇద్దరు దంపతులు వచ్చారు. వారి చేతిలో ఒక 7 నెలల బిడ్డ ఉన్నాడు. ఆ శిశువుకు డౌన్ సిండ్రోమ్ ఉంది.
ఆ శిశువుకు ఆ దంపతులుఎంతో సేవ చేస్తున్నారు. ఆమె క్రైస్తవురాలు అబార్షన్ చేయించుకొని ఆ బిడ్డను చంపేయలేదు.‘ఎంత ఖర్చయినా ఫర్వాలేదు, ఎంత శ్రమైనా ఫర్వాలేదు, ఈ బిడ్డను దేవుడు మాకు ఇచ్చాడు’ అని వారు ప్రేమతో ఆ బిడ్డను పెంచుకొంటున్నారు.
ఐస్లాండ్ అనే ఒక దేశం ఉంది. ఈ దేశములో డౌన్ సిండ్రోమ్ అనే వ్యాధితో ఒక్క బిడ్డ కూడా జన్మించుటలేదు. డౌన్ సిండ్రోమ్ ఉన్న వారు అనేక శారీరిక, మానసిక వ్యాధులకు గురి అవుతారు.
ఈ ఐస్ ల్యాండ్ దేశములో గర్భిణీ స్త్రీలు పరీక్షలు చేయించుకొంటున్నారు. గర్భములో ఉన్న శిశువుకు డౌన్ సిండ్రోమ్ అని తెలిస్తే వారు అబార్షన్ చేయించుకొంటున్నారు. అందుకనే ఆ దేశములో డౌన్ సిండ్రోమ్ తో జన్మించే శిశువుల సంఖ్య సున్నాకు చేరింది. దేవుడు లేని ఐస్ ల్యాండ్ వాసులకు, దేవుడు ఉన్న ఈ దంపతులకు మధ్య ఉన్న తేడా అదే. ఒక బిడ్డ విలువ చదువులో వచ్చే ర్యాంక్ మీద ఆధారపడి ఉండదు,IQ మీద ఆధారపడిఉండదు, అంద చందాల మీద ఆధారపడి ఉండదు, వారి ఆరోగ్యం మీద ఆధారపడి ఉండదు. ఆ బిడ్డ దేవుని చేత దేవుని రూపములో సృష్టించబడ్డాడు అనే సత్యము మీద ఆధారపడి ఉంటుంది.
ఆ పశువుల పాకలో, పశువుల తొట్టెలో పండుకొని ఆయన మనకు డిగ్నిటీ ఇచ్చాడు.ఒక గ్రుడ్డివాడైనా ఆయన దృష్టిలో విలువైనవాడే.ఒక సారి శిష్యులు ఒక గ్రుడ్డి వాని చూపించి అడిగారు: ప్రభువా, వీడు ఎందుకు గ్రుడ్డి వాడుగా ఉన్నాడు? ఎవరి పాపం వీడికి పట్టింది? వీడి పాపమా? వీడి తల్లిదండ్రుల పాపమా? యేసు ప్రభువు వారితో ఏమన్నాడు? వాని పాపము కాదు, వాని తల్లిదండ్రుల పాపము కాదు. దేవుడు మహిమ కొరకు అతను అలా పుట్టాడు. ఒక గ్రుడ్డివానిలో, ఒక డౌన్ సిండ్రోమ్ బేబీ లో కూడా దేవుని మహిమ మనకు కనిపిస్తుంది.ఎందుకంటే వారిని దేవుడు ప్రేమించాడు, వారి కోసం దేవుడు మానవ జన్మ ఎత్తాడు, వారికి సేవ చేయటానికే ఆయన సేవకునిగా మారాడు.ఇప్పుడు మనకు శాంతి కలిగింది, మనకు సమాధానం కలిగింది.ఎందుకంటే ఆయన మన సేవకుడు. మనకు ఏ సమస్య ఉన్నా, మనకు ఏ ఇబ్బంది ఉన్నా, మనకు సేవ చేయటానికి ఆయన నడుంబిగిస్తున్నాడు.
ఈ రోజు మనము కూడా ఇతరులకు సేవచేయడమే నిజమైన క్రిస్మస్.క్రిస్మస్ రోజున కూడా నేను హాస్పిటల్ లో పేషెంట్ లను చూస్తాను. క్రీస్తు వలె ఇతరులకు సేవ చేయడమే నిజమైన క్రిస్మస్.
ప్రభువైన యేసు క్రీస్తు: The Divine King & Human Servant
ఆయన రాజుగా ఉన్నాడు. సోవియెట్ యూనియన్ క్రైస్తవులను అణచివేసింది, క్రిస్మస్ ని నిషేదించింది. 1991 లో మికాయిల్ గోర్బచెవ్ క్రిస్మస్ రోజున సోవియెట్ యూనియన్ ని అంతం చేశాడు.
ప్రజల హృదయాల్లో నుండి మనము యేసు క్రీస్తును తొలగించలేము అన్నాడు. 45 సంవత్సరాల తరువాత రష్యా ప్రజలు వీధుల లోకి వచ్చి క్రిస్మస్ పండుగ చేసుకొన్నారు. యేసు క్రీస్తు మా రాజు అన్నారు.
దేవుడు – రాజు, మానవుడు-సేవకుడు
దేవుడుగా మనలను సంరక్షిస్తాడు
రాజుగా మనలను పాలిస్తాడు
మనిషిగా మనతో జీవిస్తాడు
సేవకునిగా మనకు పరిచర్య చేస్తాడు
ఈ క్రిస్మస్ సమయములో ఆయన యొద్దకువచ్చి ఆయన ఇచ్చే రక్షణను, పాప క్షమాపణ, శాంతి, సమాధానం మీరు పొందాలన్నదే నేటి మా ప్రేమ సందేశం