క్రూసేడ్లు: ఎందుకు జరిగాయి? డాక్టర్ పాల్ కట్టుపల్లి

Crusades61218a.jpgఈ రోజు నేను టర్కీ దేశములోని ఇస్తాంబుల్ నగరములో హాగియా సోఫియా అనే మసీదును సందర్శించాను. ఈ మహా కట్టడము ఒక చర్చి గా నిర్మించబడింది. ఆ తరువాత అది మసీదు గా మార్చబడింది. ముస్లిములు, క్రైస్తవుల మధ్య జరిగిన క్రూసేడ్ యుద్ధాలకు ఈ గొప్ప భవనము మూగ సాక్షిగా నిలబడింది. 

     ముస్లిములు, హిందువులు, నాస్తికులు, ఇతరులు క్రైస్తవులను తరచుగా అడిగే ప్రశ్న: మీరు క్రూసేడ్ యుద్ధాలు చేసి లక్షలాది మంది ముస్లిములను హతమార్చలేదా? మీరా నీతులు చెప్పేది? అని మనల్ని విమర్శిస్తారు. భావోద్వేగాలకు గురికాకుండా అసలు క్రూసేడ్లు ఎందుకు జరిగాయి? ఎప్పుడు జరిగాయి? ఎలా జరిగాయి? ప్రస్తుత ప్రపంచము మీద వాటి ప్రభావము ఏమిటి? అన్న విషయాలు మనము చూడాలి. 

     క్రూసేడ్ యుద్ధాలు యూరప్  లోని క్రైస్తవులకు, మధ్యప్రాచ్యము లోని ముస్లిములకు మధ్య జరిగిన మత యుద్ధాలు. ఒక వైపు క్రైస్తవ దేశాలు, మరొక వైపు ముస్లిము దేశాలు ఉంటే, మధ్యలో ఈ ఇస్తాంబుల్ నగరము ఉంది. ఈ నగరములో గుండానే క్రూసేడ్ సైన్యాలు వెళ్లాయి. ఈ  క్రూసేడ్ యుద్ధాలు క్రీ.శ 1096 – 1204 ల మధ్య జరిగినవి. ప్రధానముగా 4 క్రూసేడ్ యుద్ధాలు జరిగినవి. 

మొదటి క్రూసేడ్

క్రీ.శ 1096- 1099

రెండవ క్రూసేడ్

క్రీ.శ 1147-1149

మూడవ క్రూసేడ్

క్రీ.శ 1189-1191

నాలుగవ క్రూసేడ్ 

క్రీ.శ 1202-1204

మొదటి క్రూసేడ్ 1096 లో మొదలయినది. ఈ క్రూసేడ్ గురించి అర్ధము చేసుకోవాలంటే కొంత చరిత్ర మనము తెలుసుకోవాలి. ఆ సమయములో క్రైస్తవ్యము యూరప్, టర్కీ దేశములలో విస్తరించి ఉంది. ఇస్లాం మధ్య ప్రాచ్యము, తూర్పు ఆసియా, ఉత్తర ఆఫ్రికా ప్రాంతములలో విస్తరించి ఉంది. క్రూసేడ్ లకు మూడు ప్రధాన కారణాలు ఉన్నాయి. 

1. క్రైస్తవుల పుణ్య క్షేత్రాలు ముస్లిములు ఆక్రమించుట: ఈ ఇస్తాంబుల్ నగరాన్ని క్రైస్తవ రాజు కాన్ స్టాంట్ టయిన్ నిర్మించాడు. తొలుత దానికి కాన్ స్టాంటి నోపుల్ అని నామకరణం చేశాడు. దీనిని కేంద్రముగా చేసుకొని బైజాంటైన్ సామ్రాజ్యం ఆ తరువాత విస్తరించింది. 

కాన్ స్టాంట్ టయిన్ మాతృమూర్తి హెలెనా అమ్మ గారు జెరూసలేము, దాని చుట్టు ప్రక్కల పర్యటించి ప్రభువైన యేసు క్రీస్తు జీవించి, మరణించి, తిరిగి లేచిన ప్రదేశాల్లో అనేక మందిరాలు నిర్మించింది. బేత్లెహేము లో యేసు ప్రభువు జన్మించిన చోట నేటివిటీ చర్చి, ఆయన మరణించి సమాధి చేయబడిన చోట హోలీ సెపల్కర్ చర్చి, ఆయన పరలోకమునకు వెళ్లిన చోట ఒలీవల కొండ చర్చి నిర్మించింది. యూరప్, ఆసియా, ఆఫ్రికా ఖండాల నుండి భక్తులు యెరూషలేము, బెత్లెహేము, గలిలయ ప్రాంతములకు యాత్రలు చేసేవారు. ఈ పుణ్య యాత్రలకు వెళ్తే పాప క్షమాపణ వస్తుందని, చనిపోయిన ఆత్మీయులకు ముక్తి కలుగుతుందని క్యాథలిక్ చర్చి అసత్య బోధలు చేసేది. ఆ మాటలు నమ్మి చాలామంది క్రైస్తవులు అనేక వ్యవప్రయాసలకు ఓర్చి ఇశ్రాయేలు ప్రాంతమునకు  యాత్రలు చేసేవారు. ఈ రోజు మనము కూడా యేసు ప్రభువు మీద అభిమానముతో ఈ యాత్రలు చేస్తాము. అయితే, వాటి వలన మనకు పాప క్షమాపణ కలుగుతుందని నమ్మము. 

    ఆ పరిస్థితుల్లో ఇస్లాము మతము జన్మించింది. అరబీయుడైన మహమ్మద్ గారు ఈ మతమును స్థాపించాడు. ఆయన క్రీ. శ 570 లో జన్మించాడు. అప్పుడు ఇప్పటి సౌదీ అరేబియా ప్రాంతము, నార్త్ ఆఫ్రికా, యూరప్ క్రైస్తవ రాజ్యాలుగా ఉండేవి. మహమ్మద్ గారు క్రీ. శ 632 లో చనిపోయాడు. ఆయన యెరూషలేము నుండి పరలోకము వెళ్లి తిరిగి వచ్చాడు అని ముస్లిములు నమ్ముతారు. దాని ఆధారముగా ముస్లిము సైన్యాలు వెళ్లి యెరూషలేమును ఆక్రమించుకొన్నాయి. ఆ నగరము తమకే చెందుతుందని వాదించాయి. ఈ పరిణామము యూదులకు, ముస్లిములకు ఇబ్బందులు కలుగజేసింది. 

     ఇప్పటి మక్కా, మదీనా నగరాలు ముస్లిములకు పవిత్ర నగరాలు. వాటిని క్రైస్తవులు ఆక్రమించుకొంటే ముస్లిములకు ఎంత కోపం వస్తుందో మనము ఊహించవచ్చు. క్రైస్తవులకు పుణ్య క్షేత్రాలుగా ఉన్న యెరూషలేము, బేత్లెహేములను ముస్లిములు ఆక్రమించుకొన్నప్పుడు క్రైస్తవులకు ఎలా కోపము వచ్చిందో మనము ఊహించగలము. 

     ముస్లిము సైన్యాలు క్రీ. శ 636 లో పాలెస్తీనా ప్రాంతాన్ని చేరుకొని క్రీ. శ 638 లో యెరూషలేమును ఆక్రమించుకొన్నాయి. క్రీ. శ 685 నుండి 691 వరకు అంతకు ముందు యూదులకు మహా  పవిత్ర ఆలయము 

గా ఉన్న స్థలములో డోమ్ ఆఫ్ ది రాక్ అనే ఒక పెద్ద మసీదు ను నిర్మించారు. దీని వలన యూదులకు, ముస్లిములకు మధ్య ఈ రోజు వరకూ ఘర్షణలు జరుగుతూనే ఉన్నాయి. హోలీ సెపల్కర్ చర్చి దిశలో ఈ మసీదు మీద ‘దేవుడికి కుమారుడు లేడు’ అని అరబిక్ భాషలో పెద్ద అక్షరాలతో వ్రాసి క్రైస్తవులను కూడా కవ్వించారు.

     యూదులకు, క్రైస్తవులకు, ముస్లిములకు – మూడు మతాల వారికీ యెరూషలేము పవిత్ర నగరముగా ఉంది. అయోధ్యలో రామ మందిరము ఉన్న చోట బాబ్రీ మసీదు నిర్మించుట వలన భారత దేశములో హిందువుల మనోభావాలు ఎలా దెబ్బతిన్నాయో, యెరూషలేములో యూదులకు అత్యంత పవిత్రమైన ఈ స్థలములో ఒక మసీదు నిర్మించుట వలన యూదుల మనోభావాలు కూడా తీవ్రముగా దెబ్బతిన్నాయి.

    యేసు ప్రభువు మరణించిన చోట హెలెనా అమ్మ గారు ఎంతో శ్రమపడి హోలీ సెపల్కర్ చర్చి నిర్మించింది. 1009 సంవత్సరము అక్టోబర్ నెల 18 తేదీన ముస్లిం రాజు కాలిఫ్ అల్ హకీమ్ అల్ అమర్ అల్లా ఈ చర్చిని పూర్తిగా నాశనము చేశాడు. పాలస్తీనా, ఈజిప్ట్ దేశాల్లో ఉన్న క్రైస్తవ పుణ్య క్షేత్రాలను నిర్మూలించడమే ఆయన తన జీవిత ధ్యేయముగా చేసుకొన్నాడు. ఈ సంఘటనలు క్రైస్తవులకు చాలా బాధ కలిగించాయి. 86 సంవత్సరాల తరువాత పోప్ అర్బన్ గారు మొదటి క్రూసేడ్ కి పిలుపునిచ్చినప్పుడు క్రైస్తవులు సానుకూలముగా స్పందించారు. కాబట్టి, క్రైస్తవ రాజ్యాలు క్రూసేడ్ యుద్ధాలు చేయడానికి మొదటి కారణము ముస్లిములు క్రైస్తవుల పుణ్యక్షేత్రాలను ఆక్రమించుకోవడము, ధ్వంసము చేయడము.  

     ఈ రోజు మనము ఇశ్రాయేలు దేశము వెళ్లి సంతోషిస్తాము, కానీ దాని వలన మనకు పుణ్యము, రక్షణ వస్తాయని అనుకోము. అయితే ఆ రోజుల్లో ఇశ్రాయేలు దేశము వెళ్లి వస్తే రక్షణ కలుగుతుందని ప్రజలు నమ్మారు. ఐర్లాండ్ దేశమునకు చెందిన బిషప్ లు భయంకరమైన పాపాలు చేసినవారికి యెరూషలేము యాత్ర చేస్తే తప్ప రక్షణ కలుగదు అని బోధించారు. ‘అయ్యా, పాస్టర్ గారూ, ఘోరమైన పాపము చేశాను, నా పరిస్థితి ఏమిటి?’ అని అడిగిన వారికి, ‘అయ్యో, ఎంత ఘోరమైన పాపము చేశావు! యెరూషలేము వెళ్లి, యేసు ప్రభువును సిలువ వేసిన స్థలములో నిలబడి ప్రార్ధన చేస్తేనే నీ పాపము పోతుంది’ అని చెప్పేవారు. యెరూషలేమును ముస్లిములు ఆక్రమించినప్పుడు క్రైస్తవులు తమ పాప క్షమాపణ మార్గానికి అడ్డుపడ్డారు అని వారి మీద కోపము వచ్చింది. 

2.క్రూసేడ్ యుద్ధాలు చేయటానికి రెండవ కారణము ఏమిటంటే ముస్లిం రాజ్యాలు క్రైస్తవ రాజ్యాల మీద యుద్ధాలు చేయడము. మహమ్మద్ గారు ఇస్లాం మతములో ఒక మూల సిద్ధాంతము పెట్టాడు: ప్రపంచము మొత్తాన్నీ అల్లా యొక్క అధీనము లోనికి తేవటం. ఆ సిద్ధాంతాన్ని ముస్లిం సైన్యాలు శరవేగముతో అమలుచేయడం మొదలు పెట్టాయి. మహమ్మద్ గారు క్రీ.శ 632 సంవత్సరములో చనిపోయాడు. ఆ తరువాత కేవలము 8 సంవత్సరములలోనే ముస్లిం సైన్యాలు మొత్తం మధ్య ప్రాచ్యము, సౌదీ అరేబియా ప్రాంతము, సైప్రస్, స్పెయిన్ దేశముల వరకు ఆక్రమించుకొన్నాయి. ఆ ప్రాంతములో ఉన్న క్రైస్తవులను బలవంతముగా మత మార్పిడులు చేయడమో లేక వారిని వెళ్లగొట్టడమో చేశారు. 

     అరేబియా కు ఒకవైపున బైజాంటైన్ సామ్రాజ్యము ఉంది. ఇంకోవైపున సస్సనిడ్ పర్షియన్ సామ్రాజ్యము ఉంది. ముస్లిం సైన్యాలు ఈ రెండు సామ్రాజ్యాలను ఆక్రమించుకోవటం మొదలుపెట్టాయి. 

సిరియా దేశాన్ని క్రీ.శ. 633 లో ఆక్రమించుకున్నారు. 

డమాస్కస్ ను క్రీ.శ. 635 లో వశపరచుకొన్నారు. 

క్రీ.శ. 636 ఆగష్టు నెలలో యార్ముక్ యుద్ధము జరిగింది. బైజాంటైన్ సామ్రాజ్యము ఈ యుద్ధములో ఓడిపోయింది. ముస్లిం కాలిఫ్ రాజు డమాస్కస్ ను రాజధానిగా చేసుకొని ఉమ్మాయుద్ కాలిఫెట్ అనే ముస్లిం సామ్రాజ్యాన్ని స్థాపించాడు. ఒక వైపున బైజాంటైన్ సామ్రాజ్యము యార్ముక్ యుద్ధములో ఓడిపోతే, మరొక వైపున అల్ కడీషియా యుద్ధములో సస్సానిద్ పర్షియన్ సామ్రాజ్యము క్రీ.శ. 636 నవంబర్ నెలలో ముస్లిం రాజుల చేతిలో మట్టికరచింది. అంతకు ముందు చాలా శతాబ్దాల పాటు బైజాంటైన్ సామ్రాజ్యము, సస్సానిద్ పర్షియన్ సామ్రాజ్యము ఒకదాని మీద ఒకటి యుద్ధాలు చేసుకొని బలహీన పడిపోయాయి. అలసి, సొలసి ఉన్న వారి సైన్యాలు ముస్లిం సైన్యాల ముందు నిలబడలేకపోయాయి.

     పర్షియన్ రాజధాని టేసిఫాన్ ముస్లింల కాళ్ళ క్రింద నలిగింది. కాలిఫ్ అల్ మన్సూర్ అనే ముస్లిం రాజు తన రాజధానిని డమాస్కస్ నుండి ఇరాక్ లోని టైగ్రిస్ నది ఒడ్డున నిర్మించిన క్రొత్త నగరము బాగ్దాద్ ను మార్చాడు.ఈ క్రొత్త సామ్రాజ్యానికి అబ్బాసిద్ కాలిఫెట్ అని పేరు పెట్టారు.

     పర్షియాను జయించిన తరువాత ముస్లిం సైన్యాలు తూర్పు దేశాల మీద దాడి చేశాయి. క్రీ.శ 711 లో అరబ్ రాజు మహమ్మద్ బిన్ కాసిమ్ సింధ్ ప్రాంతాన్ని, దక్షిణ పంజాబ్ ను జయించాడు. ఈ ప్రాంతములో ఉన్న హిందువులు, బౌద్ధులు బలవంతముగా మత మార్పిడులకు గురయ్యారు. మహమ్మద్ గారు చనిపోయిన వంద సంవత్సరాల్లోనే ముస్లిం రాజ్యాలు కాబూల్, సమర్ఖండ్, ఉజ్బేకిస్తాన్ దేశాలను జయించి ఇండియా దేశము వరకు చొచ్చుకువచ్చాయి. ఆ తరువాత భారత దేశములో అనేక ముస్లిం రాజ్యాలు ఏర్పడ్డాయి.

గజ్ఞావిడ్ సామ్రాజ్యము (క్రీ.శ.  975 – 1187) 

గూరిడ్ సామ్రాజ్యము (క్రీ.శ. 879 – 1215) 

ఢిల్లీ సుల్తానేట్ (క్రీ.శ. 1206 – 1526) 

మొఘల్ సామ్రాజ్యము (క్రీ.శ. 1526 – 1857) 

అంటే, క్రీ.శ. 711 నుండి 1857 లో బ్రిటిష్ వారి పాలనలోకి వచ్చేవరకు భారత దేశము ముస్లిం రాజుల పాలనలో చిక్కి విలవిలలాడింది. 

  అటువైపు పరిస్థితి ఎలా ఉందో చూద్దాము. యెరూషలేమును జయించిన తరువాత ముస్లిం సైన్యాలు ఈజిప్ట్ లోకి వెళ్లాయి.క్రీ.శ. 641 లోఈజిప్ట్ దేశాన్ని ఆక్రమించుకున్నారు. క్రీ.శ. 649 లో సైప్రస్ దురాక్రమణకు గురయ్యింది.సిసిలీ, రోడ్స్ దేశాలు కూడా నిలబడలేకపోయాయి. అప్పటి వరకు బైజాంటైన్ సామ్రాజ్యము క్రింద ఉన్న ఈజిప్ట్, ఉత్తర ఆఫ్రికా ప్రాంతాలు ముస్లింల క్రిందకు వచ్చాయి. క్రీ.శ. 698 లో కార్తేజ్ నగరము ఓడిపోయింది. ట్రిపోలి ప్రాంతమును కూడా ఓడించి ముస్లిం సైన్యాలు యూరప్ మీద కన్ను వేశాయి. తమ వైపు కు దూసుకువస్తున్న ముస్లిము సైన్యాలను చూసి యూరప్ వాసులు కంగారు పడ్డారు. 

   క్రీ. శ. 711 లో భారత దేశము ముస్లిం శక్తుల క్రిందకు వెళ్ళింది. అదే సంవత్సరము దాదాపు 10 వేల  మంది సైన్యముతో ముస్లింలు మొరాకో దేశము నుండి బయలుదేరి మధ్యధరా సముద్రము దాటి స్పెయిన్ దేశములోకి చొచ్చుకుపోయారు. రోడ్రిగో రాజు ఒక సైన్యాన్ని సిద్ధము చేసుకొని తన రాజధాని అయిన టోలెడో నుండి బయలుదేరి గూడ లాటే నది దగ్గర ముస్లిం సైన్యమును ఎదుర్కొన్నాడు. గూడ లాటే యుద్ధములో రోడ్రిగో రాజు మరణించాడు. అప్పటి వరకు ముస్లిములు బైజాంటైన్ సామ్రాజ్యము యొక్క క్రైస్తవులతోనే పోరాడుచున్నారు. అక్కడ నుండి వారు లాటిన్ క్రైస్తవులు, అంటే రోమన్ క్యాథలిక్ మతస్తులతో యుద్ధాలు చేస్తారు. స్పెయిన్ దేశాన్ని ఆక్రమించుకొని ముస్లిము సైన్యాలు ఫ్రాన్స్ దేశములోకి దూసుకువెళ్లాయి. క్రీ.శ.720 కల్లా ముస్లిం సైన్యాలు స్పెయిన్, ఫ్రాన్స్ దేశాలను వేరుచేసే పైరనీ పర్వతాలను దాటాయి.మార్గ మధ్యములో వారు చర్చిలను, క్రైస్తవ గృహాలను దోచుకొని ప్రజల మీద దాడులు చేశారు.

క్రీ.శ.721 లో ముస్లిం సైన్యము దక్షిణ ఫ్రాన్స్ (అకిటెన్) కు చెందిన  డ్యూక్ ఓడో చేతిలో ఓటమి చెందారు. క్రీ.శ 732 లో ముస్లిములు తమ శక్తిని తిరిగి కూడగట్టుకొని డ్యూక్ ఓడో ని దెబ్బకొట్టారు. ఆ సమయములో డ్యూక్ ఓడో సహాయము కొరకు చార్లెస్ మార్టిల్  ని అభ్యర్థించాడు. డ్యూక్ తన రాజ్యాన్ని తన రాజ్యములో కలిపివేస్తే సహాయము చేస్తాను అనే షరతు మీద చార్లెస్ మార్టిల్, డ్యూక్ కి సహాయము చేశాడు. క్రీ.శ.732 లో చార్లెస్ మార్టిల్ ముస్లిం సైన్యాలను టూర్స్ యుద్ధములో (Battle of Tours) ముందుకు పోకుండా ఆపాడు. ఫ్రాన్స్ దేశములోని టూర్స్, పోటియే పట్టణముల మధ్య జరిగిన ఈ యుద్ధము ప్రపంచ చరిత్రను మలుపు తిప్పిన యుద్ధముగా చెప్పుకోవచ్చు. ఈ యుద్ధములో క్రైస్తవులు ఓడిపోయిఉంటే యూరప్ ఖండము మొత్తము ముస్లిము రాజ్యము అయిపోయి ఉండేది. అప్పటికే ఆసియా, ఆఫ్రికా ఖండాల్లో చాలా దేశాలను ముస్లిములు తమ కాళ్ళ క్రిందకు తెచ్చుకొన్నారు. యూరప్ కూడా ఓడిపోతే వారి ప్రపంచాధిపత్యానికి ఎదురు లేకుండా  పోయి ఉండేది.

   పోప్  అర్బన్ II  1095 సంవత్సరము నవంబర్ 27 న క్లెర్ మోంట్ కౌన్సిల్ సభలో మొదటి క్రూసేడ్ యుద్ధానికి పిలుపు నిచ్చాడు. ఆయన క్రైస్తవులను ఈ యుద్ధానికి ప్రేరేపిస్తున్న సమయములో అంతకు 363 సంవత్సరాల క్రితమే క్రీ. శ 732 లో ముస్లిములు క్రైస్తవుల మీద చేసిన పోటియే యుద్ధము ఆయన మనస్సులో, సభికుల మనస్సులో మెదలివుంటుంది. 

   ముస్లిములు ఇతరుల మీద చేసిన యుద్ధాలు ఆ తరువాత కూడా కొనసాగాయి. 

క్రీ. శ. 653 సైప్రస్, 

క్రీ. శ. 672 లో రోడ్స్, 

క్రీ. శ. 824 లో క్రీతు 

క్రీ. శ. 835 లో మాల్టా 

క్రీ. శ. 878 లో సిసిలీ, సిరాక్యూస్ లు వారి చేతిలో ఓడిపోయాయి. సిసిలీ నుండి ముస్లిం సైన్యాలు దక్షిణ ఇటలీ లోకి ప్రవేశించి క్రీ. శ. 840 లో టరాంటో, బారి ప్రదేశాలను ఓడించాయి. కపువా, బెనివిటో లను పాదాక్రాంతము చేసుకొని క్రీ. శ.843 లో వారు రోమ్ నగరాన్ని కొల్లగొట్టారు. క్రీ. శ. 846 లో రోమ్ లోని ప్రసిద్ధ క్రైస్తవ ఆలయాలను యథేచ్ఛగా దోచుకున్నారు. పోప్ చేత బలవంతముగా భరణము కట్టించారు. 

  ఆవిధముగా ముస్లిము సైన్యాలు ప్రపంచ దేశాలను జయించాయి. మధ్య ప్రాచ్యము, ఇశ్రాయేలు దేశము, ఈజిప్ట్, ఉత్తర ఆఫ్రికా, బైజాన్ టైన్ సామ్రాజ్యము, స్పెయిన్, సిసిలీ, దక్షిణ ఇటలీ, భారత దేశము ఇలా ప్రపంచ దేశాలువారికి  పాదాక్రాంతమయ్యాయి.

   ఇస్తాంబుల్ నగరములో నేను పెద్ద బజారు (Grand Bazaar) కు వెళ్ళాను. ఈ బజారులో అనేక దుస్తులు, చక్కని కార్పెట్లు అమ్ముతున్నారు. ఇక్కడ బజారు, ఉస్మానియా, నీలోఫర్ అనే పదాలు చాలా చోట్ల నాకు కనిపించాయి. హైదరాబాద్ లో వినిపించే ఈ పదాలు టర్కీ దేశములో ఎందుకు ఉన్నాయి అని నాకు అనిపించింది. ఈ టర్క్ లు భారత దేశాన్ని జయించిన తరువాత ఈ పదాలు అక్కడ ప్రవేశపెట్టారు అని నాకు అర్ధము అయ్యింది. ఈ ఇస్తాంబుల్ నగరాన్ని టర్కులు క్రీ.శ 1453 లో జయించి వారి పేరు పెట్టు కొన్నారు. ఇక్కడనుండి పాలించిన ఒట్టోమాన్ సామ్రాజ్యము క్రీ.శ.1299 నుండి 1922 వరకు కొనసాగింది. క్రీ.శ. 1071 లో టర్కు లు మంజికర్ట్ యుద్ధములో బైజాంటైన్ సైన్యాన్ని ఓడించారు.

    ఆ రోజుల్లో నేటి టర్కీ దేశము వున్న ప్రాంతము ‘ఆసియ మైనర్’ గా పిలువబడేది. ఆ ప్రాంతములో అప్పుడు విస్తరించి ఉన్న బైజాంటైన్ సామ్రాజ్య ప్రాంతాన్ని టర్కు లు ఆక్రమించుకోవడము మొదలుపెట్టారు. అప్పుడు బైజాంటైన్ రాజు అలెక్సియస్ 1 రాజు సహాయము చేయవలసినదిగా రోమ్ లో ఉన్న పోప్ ను అభ్యర్ధించాడు. దానికి పోప్ ఇచ్చిన సమాధానమే మొదటి క్రూసెడ్ యుద్ధము.

   పోటియే యుద్ధము తరువాత యూరోపియనులు జాగ్రత్తగా ఉండడం మొదలుపెట్టారు.మనము కోల్పోయిన ప్రాంతాలు తిరిగి పొందుదాము రండి అని పోప్ ఇచ్చిన పిలుపుకు వీరు సానుకూలముగా స్పందించారు. 

అగస్టీన్ అనే క్రైస్తవ తత్వవేత్త ఒక మంచి పని కోసము యుద్ధము చేయడము సబబే అని బోధించాడు (Just war theory). అగస్టీన్ చెప్పిన మాటలు కూడా మతాధికారులు ప్రజలకు గుర్తుచేశారు. 

3.క్రూసెడ్ యుద్ధములు జరుగుటకు మూడవ కారణము క్యాథలిక్ చర్చి బోధించిన అసత్య బోధలు. ఒక అసత్య బోధ ఏమిటంటే, పరలోకము, నరకము లతో పాటు పర్గెటరీ అనే మూడవ ప్రదేశము ఉంది. చాలా మంది పరలోకము వెళ్లకుండా పర్గెటరీ కి వెళ్లారు. పర్గెటరీ నుండి పరలోకము వెళ్లాలంటే మతాధికారులకు కాసులు చెల్లించుకోవాలి. వీటిని ‘ఇండల్ జెన్సులు’ (indulgences) అని పిలిచారు. పర్గెటరీ గురించి వినిన ప్రజలు బెంబేలెత్తిపోయారు. మా తాత పరలోకము వెళ్లలేదా? మా అమ్మ పర్గెటరీ లో ఇరుక్కుపోయిందా? అయ్యో! ఎంత ఘోరం! అని ప్రజలు గుండెలు బాదుకొనేవారు. వారికి చర్చి బిషప్ లు చెప్పింది ఏమిటి? చనిపోయిన మీ ఆత్మీయులు, కుటుంబ సభ్యులు, బంధువులు పర్గెటరీలో నుండి విడిపించే మార్గము మా దగ్గర ఉంది. మా దగ్గర  ‘ఇండల్ జెన్సులు’ కొనండి. ‘ఇండల్ జెన్సులు’ అంటే క్షమాపణ పత్రాలు. 

బిషప్ : ‘మీ నాన్న ఏ పాపాలు చేశాడు?’ 

క్రైస్తవుడు: ‘మా నాన్న దొంగతనాలు చేశాడు’ 

బిషప్: ‘దొంగతనానికి క్షమాపణ పత్రము పది వేల  రూపాయలు అవుతుంది’ 

బిషప్: ‘మీ తాత ఏ పాపాలు చేశాడు?’ 

క్రైస్తవుడు: ‘మా తాత వ్యభిచారం చేశాడు’ 

బిషప్: ‘అమ్మో, అది చాలా భయంకరమైన పాపము. లక్ష రూపాయలు ఖర్చవుతుంది’ 

బిషప్: ‘మీ అమ్మ ఏ పాపాలు చేసేది?’ 

క్రైస్తవుడు: ‘మా అమ్మ అబద్ధాలు బాగా చెప్పేది’ 

బిషప్: ‘అబద్దాలు చెప్పేదా? వాటికి క్షమాపణ రావాలంటే 5 వేల రూపాయలు చెల్లించు. మీ నాన్న, తాత, అమ్మ ముగ్గురూ ఇప్పుడు పర్గెటరీ లో ఇరుక్కుపోయారు. మొత్తము లక్ష 15 వేల  రూపాయలు చెల్లించి ఈ క్షమాపణ పత్రాలు కొనుక్కో’ క్యాథలిక్ బిషప్ లు ఒక్కో పాపానికి ఒక్కో రేటు పెట్టి క్షమాపణ పత్రాలు అమ్మారు. ఉన్న ఆస్తులు అమ్ముకొని, లేకపోతే అప్పో, సొప్పో చేసి ప్రజలు బిషప్ లకు డబ్బులు చెల్లించి గుల్ల,గుల్ల అయిపోయారు. 5 శతాబ్దములో అగస్టీన్ పర్గెటరీ గురించి బోధించాడు. అయితే బైబిల్ గ్రంథములో పర్గెటరీ కి ఎలాంటి ఆధారాలు లేవు. క్యాథలిక్ చర్చి కూడా పర్గెటరీ ని పెద్దగా నమ్మలేదు కానీ డబ్బు కోసము పర్గెటరీ గురించి విపరీతముగా ప్రచారము చేసింది. 

  క్రూసేడ్ యుద్ధాలు చేయటానికి డబ్బులు కావాలి. ఆ డబ్బులు ఎలా వస్తాయి? వాటి కోసము బిషప్పులు ప్రజలకు క్షమాపణ పత్రాలు అమ్మారు. యుద్ధాలు పెరిగేకొద్దీ ఖర్చులు పెరిగాయి.  ‘ఇండల్ జెన్సులు’ రేట్లు కూడా పెంచుకొంటూ పోయారు. ప్రజలుకూడా ఎదురు చెప్పలేకపోయారు.నోరు మెదపకుండా ఆ ‘ఇండల్ జెన్సులు’ చెప్పిన రేటుకు కొనుక్కున్నారు. ఎందుకంటే వారికి బైబిల్ సత్యాలు తెలియవు. కానీ, బిషప్ లు చేస్తున్న ఈ నిలువు దోపిడీ కి ప్రజలు కొంత కాలము తరువాత విసికిపోయారు. పాప క్షమాపణ దేవుడు ఉచితముగా అనుగ్రహిస్తున్నాడు అని మార్టిన్ లూథర్ బోధించినప్పుడు అనేక మంది ప్రజలు ఆయనకు ఆకర్షితులయ్యారు. ఆ కోణములో చూస్తే ప్రొటెస్టెంట్ ఉద్యమానికి క్రూసేడ్ యుద్ధాలు బాటలు వేసాయి అని మనము చెప్పుకోవచ్చు.

ఎఫెసీ పత్రికలో అపోస్తలుడైన పౌలు వ్రాశాడు: 

ఎఫెసీయులకు 1:4

  1. ఎట్లనగా తన ప్రియునియందు తాను ఉచితముగా మనకనుగ్రహించిన తన కృపామహిమకు

కీర్తి కలుగునట్లు, 5. తన చిత్త ప్రకారమైన దయాసంకల్పముచొప్పున,యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై, మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని, 6. మనము తన యెదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై యుండవలెనని జగత్తు పునాది వేయబడకమునుపే, ప్రేమచేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను.

  తన రక్షణను మనకు దేవుడు ఉచితముగా అనుగ్రహించాడు అని అపోస్తలుడైన పౌలు ఇక్కడ మనకు బోధించాడు. దేవుడు ఉచితముగా పాప క్షమాపణ అనుగ్రహిస్తే దానిని మీరు అమ్ముకోవటము ఏమిటి? అని ప్రజలు మతాధికారులను నిలదీయలేకపోయారు, ఎందుకంటే ఎవ్వరికీ బైబిల్ పరిజ్ఞానము లేదు. 

  ‘ఎవడన్నా బైబిల్ చదివితే వాణ్ణి చంపివేస్తాము. ప్రాణాల మీద ఆశ ఉంటే బైబిళ్లు ముట్టుకోవద్దు’ అని బిషప్ లు ప్రజలను హెచ్చరించారు. కాబట్టి, బైబిల్ లో ఏముందో ప్రజలకు తెలియదు. బిషప్ లు పోప్ ఏమిచెబితే అది నమ్మారు. ‘యెరూషలేము వెళ్ళండి, ముస్లిములతో పోరాడండి, దేవుడు మీ పాపాలు క్షమిస్తాడు’ అని బోధించారు. ‘యుద్ధములో చనిపోతే మా పరిస్థితి ఏమిటి?’ అని ప్రజలు ప్రశ్నించారు. ‘చనిపోతే ఇంకా మంచిది. మీరు సరా సరి పరలోకము వెళ్ళిపోతారు’ అని నమ్మబలికారు. 

   క్రూసేడ్ యుద్ధాలు జరుగుటకు ఈ 3 ప్రధాన కారణాలు.

  1. ముస్లిములు యెరూషలేము, దాని చుట్టు ప్రక్కల ఉన్న క్రైస్తవ పవిత్ర స్థలాలను ఆక్రమించుకోవటము
  2. క్రైస్తవ దేశాల మీద ముస్లిములు యుద్ధాలు చేసి పాదాక్రాంతము చేసుకోవడము 
  3. క్యాథలిక్ చర్చి ‘పుణ్యము, పాప క్షమాపణ’ అంటూ క్రైస్తవులను ముస్లిముల మీదకు ఎగదోయటము 

పోప్ అర్బన్ 2 1096 సంవత్సరము ఆగష్టు నెలలో యుద్ధానికి బయలు దేరాలని నిర్ణయించాడు.క్రైస్తవ దేశాల నుండి ప్రజలు కోకొల్లలుగా యెరూషలేము వైపుకు దూసుకుపోయారు. హంగరీ దేశమును దాటుకొని జూన్ 1096 సంవత్సరానికి బెల్గ్రేడ్ దేశ ప్రాంతానికి చేరుకొన్నారు. అక్కడ నుండి కాంస్టాంటి నోపిల్ కు చేరుకొన్నారు. అక్కడ ఉన్న ప్రసిద్ధ హాగియా సోఫియా చర్చి లో ప్రార్ధన చేశారు. వీరిలో దేవుని ఎడల భక్తి లేని దుర్మార్గులు కూడా ఉన్నారు. వీరు తమతో తెచ్చుకొన్న వేశ్యలతో చర్చి లోనే డాన్సులు వేశారు. దీనిని బట్టి ఎటువంటి వ్యక్తులు ఆ యుద్ధాలు చేశారో మనము ఊహించవచ్చు. అక్కడ నుండి బయలుదేరి వారు ప్రస్తుత టర్కీ దేశము దాటి క్రీ. శ. 1097 అక్టోబర్ నెలకు అంతియొకయ చేరుకొన్నారు. అక్కడ జూన్ 28, 1098 వరకు ఉన్నారు. అక్కడ నుండి బయలుదేరి జూన్ 7, 1099 కల్లా యెరూషలేము పొలిమేరలకు చేరుకొన్నారు. ఆ నగరాన్ని చూసి వారి మనస్సులు తేలియాడాయి. దానిని చుట్టుముట్టి జూలై 15, 1099 తేదీన యెరూషలేము గోడలు బ్రద్దలు కొట్టి ఆ నగరాన్ని స్వాధీనము చేసుకొన్నారు. దాదాపు 3000 మంది నగర వాసులను హతముచేశారు.

   క్రూసేడర్లు మధ్య ప్రాచ్యములో 4 రాజ్యాలు ఏర్పాటు చేశారు.

యెరూషలేము

ట్రిపోలి

అంతియొకయ

ఎడెస్సా

మొదటి క్రూసేడ్ యుద్ధము విజయవంతమైనది, యెరూషలేము క్రూసేడర్ల పరమయ్యింది. కానీ ఆ తరువాత జరిగిన క్రూసేడ్ యుద్ధాలు ఘోరముగా విఫలమయ్యాయి. నాలుగవ క్రూసేడ్ లో క్రూసేడర్లు కాంస్టాంటినోపిల్ నగరాన్ని కూడా ఓడించారు. ఏప్రిల్ నెల, 1204 సంవత్సరములో క్రూసేడర్లు ఆ నగరము 9 వందల సంవత్సరాల చరిత్రలో ఎన్నడూ జరగని పని చేశారు. తోటి క్రైస్తవులు అని కూడా చూడకుండా ఆ నగర వాసులను హతమార్చి దోచుకున్నారు. క్రూసేడర్లు కాంస్టాంటినోపిల్ నగరములో తోటి క్రైస్తవులను ఎందుకు హతమార్చారు అని మీరు ప్రశ్నించవచ్చు.నాటి క్రైస్తవ దేశాలు పశ్చిమాన రోమన్ క్యాథలిక్ చర్చి క్రింద, ఉత్తరాన గ్రీక్ ఆర్థోడాక్స్ చర్చి క్రింద ఉన్నాయి. ఒకరి మీద ఒకరికి నమ్మకము లేక వారి మధ్య ఐకమత్యము దెబ్బతింది. క్రూసేడర్లు ఆ విధముగా కాంస్టాంటినోపిల్ నగరాన్ని ధ్వంసము చేసి బైజాన్టిన్ సామ్రాజ్యాన్ని బలహీనపరచారు. ఆ స్థితిలో ఒట్టోమన్ టర్కు ముస్లిములు దాడి చేసినప్పుడు నిలద్రొక్కుకొనే శక్తి బైజాన్టిన్ సామ్రాజ్యానికి లేకుండా పోయింది.

క్రూసేడ్ల వలన మంచి జరిగింది, చెడు జరిగింది. తమ మీదకు తోసుకొస్తున్న ముస్లిము సైన్యాలను కొంతకాలము క్రైస్తవులు ఆపగలిగారు. అప్పటికే ముస్లిములు ఆక్రమించుకున్న స్పెయిన్ దేశాన్ని తిరిగి కైవశము చేసుకొన్నారు. క్రైస్తవులు, ముస్లిములు తమ సంస్కృతులను పంచుకొన్నారు. ఇంతకు ముందు చెప్పినట్లు క్రూసేడర్లు కాంస్టాంటినోపిల్ నగరాన్ని నాశనము చేసి బైజాన్టిన్ సామ్రాజ్యాన్ని బలహీనపరచారు. అక్కడి క్రైస్తవులు సహాయము చేయమని పోప్ ని అభ్యర్థిస్తే, వారికి సహాయము చేయకపోగా వారి నగరాన్ని ధ్వంసము చేశారు. తూర్పున  బైజాన్టిన్ సామ్రాజ్యము బలహీనపడుట వలన ముస్లిము రాజ్యాలు యూరప్ మీదకు యుద్ధాలు చేయడము తేలిక అయ్యింది.1683 కల్లా ముస్లిము సైన్యాలు ఆస్ట్రియా దేశములోని వియన్నా ను చుట్టుముట్టాయి.