ప్రధాన యాజకుడు

PriesthoodSuperiorityofMelchizedekTelugu.jpg

నిర్గమ కాండము 28 అధ్యాయములో మోషే తన సోదరుడైన అహరోనును, అతని కుమారులను ప్రత్యక్షగుడారములో యాజకులను గా నియమిస్తున్నాడు. వీరు లేవీయులు. అహరోను ప్రధాన యాజకుడు, అతని క్రింద అనేక మంది యాజకులు నిత్యము దేవుని సన్నిధిలో ఉండి దేవుని సేవ చేయాలి. వారు ప్రజల తరుపున దేవుని ముందుకు వెళ్లారు. ప్రజల కొరకు బలులు, అర్పణలు చేశారు. అంటే మన రక్షణ, మన పాప క్షమాపణ ప్రధాన యాజకుని మీద ఆధారపడి ఉంది. ప్రధాన యాజకుడు చాలా ముఖ్యమైన వ్యక్తి. బైబిల్ ప్రవచనాల్లో ఈ ప్రధాన యాజకునికి చాలా ప్రాముఖ్యత ఉంది. బైబిల్ ల్లో మనకు రెండు యాజక క్రమములు కనిపిస్తాయి. మొదటిది మెల్కిసెదెకు యాజక క్రమము రెండవది లేవీ యాజక క్రమము. మెల్కిసెదెకు క్రమము లేవీ క్రమము కంటే ముందుగా ఉన్నది, శాశ్వతమైనది, శ్రేష్ఠమైనది, ఉన్నతమైనది. ఈ చార్ట్ మీరు చూస్తే ఈ రెండు యాజక క్రమములు ఎలా ఉన్నాయి, వాటి మధ్య బేధాలు ఏమిటి అనే విషయాలు మీకు అర్ధము అవుతాయి. ఈ చార్ట్ కావలసినవారు మా వెబ్ సైట్ http://www.doctorpaul.org కి వెళ్లి, బైబిలు ప్రవచనాల చార్టులు అనే పేజీ ని దర్శించండి. ఈ చార్టులు చూస్తూ బైబిల్ చదివితే ఈ సత్యాలు మీకు సుళువుగా అర్ధం అవుతాయి.

     మెల్కిసెదెకు యాజక క్రమము ఆదికాండములో మొదలై ప్రకటన గ్రంథము వరకూ కనిపిస్తుంది. బైబిల్ మొత్తము ఉన్న క్రమము ఇది. లేవీ క్రమము పాత నిబంధన కు మాత్రమే పరిమితమయ్యింది. ప్రభువైన యేసు క్రీస్తు ఈ మెల్కిసెదెకు క్రమమునకు చెందినవాడు. ఆదికాండము14 అధ్యాయములో 18-20 వచనాలలో మనకు మెల్కిసెదెకు మొదటి సారి కనిపిస్తాడు. అబ్రాహామును ఆశీర్వదించాడు. ఆయన షాలేము రాజు, సర్వోన్నతుడైన దేవునికి యాజకుడు. రాజు – యాజకుడు. ఆ మాటలు మీరు గమనించండి: ఈయన సర్వోన్నతుడైన దేవునికి యాజకుడు. ఈయన యూదులకు మాత్రమే యాజకుడు కాదు. యూదులకు,అన్యులకు అందరికి దేవుడైన సర్వోన్నతుడైన దేవునికి యాజకుడు. ప్రభువైన యేసు క్రీస్తు కూడా అంతే కదా! ఆయన యూదులకు మాత్రమే ప్రధాన యాజకుడు కాదు. విశ్వాసులందరికీ – యూదులయినా, అన్యులైనా – ఆయన ప్రధాన యాజకుడే. మెల్కిసెదెకు – మెల్కి అంటే రాజు, సెదెకు అంటే నీతి – అంటే ఈయన నీతి గల రాజు. నీతి గల రాజైన యాజకుడు. 

     లేవీ యాజక క్రమములో ఇది సాధ్యపడదు. ఎందుకంటే రాజరికము యూదా గోత్రానికి ఇవ్వబడింది. లేవీ గోత్రికులు రాజులు కాలేరు. మెల్కిసెదెకు King Priest – రాజైన యాజకుడు.ఆయనది Royal Priesthood – రాజరిక యాజకత్వము. 110 వ కీర్తనలో దావీదు రాజు వ్రాశాడు.భవిష్యత్తులో నా కుమారుడు వస్తాడు. ఆయన దేవుడు. ఆయన మెల్కిసెదెకు యాజక క్రమములో వస్తాడు, నిరంతరము మన ప్రధాన యాజకునిగా ఉంటాడు. దావీదు ప్రత్యక్ష గుడారము చూసాడు.లేవీయులను చూశాడు. వారి యాజక ధర్మమును చూశాడు. వారు అర్పిస్తున్న బలులు చూశాడు. వారు చేస్తున్న అర్పణలు చూశాడు. అయితే ఆ లేవీ యాజక ధర్మము మీద ఆయన గురిపెట్టుకోలేదు.ఆయన దృష్టి మెల్కిసెదెకు యాజక క్రమము మీద ఉంది. ఆయన కుమారుడైన ప్రభువైన యేసు క్రీస్తు క్రమము మీద ఉంది. ఆయన సిలువ మీద చేసే బలి మన అందరి పాపములను కడిగివేయ బోతున్నది. ఈ లేవీయులు చేసే బలులు పాపములను కడిగివేయలేవు, పాపపు శిక్ష నుండి మనలను విడిపించలేవు, దేవుని ఎదుట నిర్దోషులుగా మనలను తీర్చిదిద్దలేవు, దేవుని ఎదుట నీతిమంతులుగా మనలను తీర్చిదిద్దలేవు. అందుకనే దావీదుకు వాటిమీద నమ్మకము లేదు. 110 కీర్తనలో దావీదు ఏమంటున్నాడంటే – నా కుమారుడు మెల్కిసెదెకు క్రమములో వస్తాడు. దావీదు కుమారుడైన సొలొమోను యెరూషలేములో గొప్ప దేవాలయము కట్టాడు. ప్రపంచములోనే అత్యంత వైభవముగా దానిని నిర్మించాడు.

     అయితే విచారకరముగా ఆ ఆలయము బబులోనీయుల చేత నిర్మూలించబడింది. యెరూషలేములోకి వీధులలోకి వెళ్తే ప్రజలకు దేవుని మీద విశ్వాసము, భయము, భక్తి  లేనప్పుడు పెద్ద, పెద్ద ఆలయముల వలన దేవుని హృదయానికి సంతోషము ఉండదు. ఫ్రాన్స్ దేశము ప్యారిస్ లో నోట్రే డమ్ అనే గొప్ప చర్చి ఉంది. ఈ మధ్యలో అది కాలిపోయింది. అది చూసి నాకు చాలా బాధ కలిగింది. అయితే ప్యారిస్ వీధుల్లోకి వెళ్లి చూస్తే అక్కడ ఎంత మందికి దేవుని మీద విశ్వాసము, భయము, భక్తి ఉన్నాయి? యూదా దేశము, యెరూషలేము దేవుని మీద విశ్వాసము కోల్పోయినప్పుడు బబులోనీయులు వచ్చి ఆ గొప్ప దేవాలయాన్ని నిర్మూలము చేశారు. 

     యూదులు బబులోనుకు చెరపట్టబడి వెళ్లిపోయారు. ఆ సమయములో దేవుడు యెహెఙ్కేలు అనే ప్రవక్తకు ఒక దర్శనము అనుగ్రహించాడు. ఆ దర్శనములో యెహెఙ్కేలు యెరూషలేములో ఒక చక్కటి దేవుని ఆలయము చూశాడు. ఈ ఆలయము ఇది మూడవ ఆలయము. ప్రభువైన యేసు క్రీస్తు ఆయన వెయ్యేళ్ళ పాలనలో నిర్మించబోయే ఆలయము. అందులో ప్రధాన యాజకునిగా ఆయనే ఉంటాడు. యాజక ధర్మములో సాదోకు కుమారులు ఆయనకు సహకరిస్తారు అని యెహెఙ్కేలు గ్రంథము 44:15 లో, 48:11 లో మనకు కనిపిస్తుంది. ఆ ఆలయాన్ని చూసి బబులోను చెరలో ఉన్న యెహెఙ్కేలు కు ఎంత సంతోషము కలిగి ఉంటుంది! ఏ మానవుడూ నిర్మూలించలేని దేవుని ఆలయము ఆయన చూస్తూఉన్నాడు.

      బబులోను చెరలో నుండి యెరూషలేము తిరిగి వచ్చి యూదులు జెరుబ్బాబెలు నాయకత్వములో మరొక గొప్ప ఆలయము కట్టుకున్నారు.ఆ సమయములో జెకర్యా అనే ప్రవక్త వారి మధ్య జీవించాడు.  దేవుడు జెకర్యాకు ఒక ప్రవచనము అనుగ్రహించాడు. 6 అధ్యాయము 12-13 వచనాలు చూద్దాము.

యెహోవా సెలవిచ్చునదేమనగా

చిగురు అను ఒకడు కలడు; 

అతడు తన స్థలములోనుండి చిగుర్చును, 

అతడు యెహోవా ఆలయము కట్టును.

అతడే యెహోవా ఆలయము కట్టును; 

అతడు ఘనత వహించుకొని 

సింహాసనా సీనుడై యేలును,

సింహాసనాసీనుడై అతడు యాజకత్వము చేయగా ఆ యిద్దరికి సమాధానకరమైన యోచనలు కలుగును.చిగురు అను ఒకడు కలడు. ఆయన జీవము కలిగిన రక్షకుడు. దేవుని ఆలయము నిర్మిస్తాడు. సింహాసనాసీనుడై అతడు యాజకత్వము చేయగా… ఆ మాటలు మీరు గమనించండి. ఈయన సింహాసనా సీనుడై యాజకత్వము చేస్తాడు. Royal Priesthood అక్కడ మనకు కనిపిస్తున్నది. అంటే రాజరిక యాజకత్వము. మెల్కిసెదెకు యాజక క్రమము అక్కడ జెకర్యా చూస్తూ ఉన్నాడు. జెకర్యా కు కనిపిస్తున్న ఆ ప్రధాన యాజకుడు ఎవరంటే ప్రభువైన యేసు క్రీస్తే. యెరూషలేములో సింహాసనము మీద ఆయన ఆసీనుడై ఉన్నాడు. ఆ సింహాసనము మీదకు ఆయన సరాసరి వెళ్ళలేదు. ముందు సిలువ మీదకు వెళ్ళాడు. హెబ్రీయులకు వ్రాసిన పత్రిక 9:11-12 లో మనము చదువుతాము: 

అయితే క్రీస్తు రాబోవుచున్న 

మేలులవిషయమై ప్రధానయాజకుడుగా వచ్చి, 

తానే నిత్యమైన విమోచన సంపాదించి…… 

మేకలయొక్కయు కోడెలయొక్కయు 

రక్తముతో కాక, తన స్వరక్తముతో 

ఒక్కసారే పరిశుద్ధస్థలములో 

ప్రవేశించెను. 

యేసు క్రీస్తు అనే మన ప్రధాన యాజకుడు… మేకల రక్తముతో కాదు… గొఱ్ఱెల  రక్తముతో కాదు…. కోడెల రక్తముతో కాదు… తన స్వరక్తముతో మన పాపములనుండి మనలను విమోచించాడు. అందువలన ఈ రోజు మనము రాజులైన యాజక సమూహములో చేరాము.1 పేతురు 2:9 లోఆ సత్యము మనకు కనిపిస్తుంది.ప్రభువైన యేసుక్రీస్తు రక్తముతో కడుగబడిన వారంతా రాజులైన యాజకసమూహములో చేర్చబడ్డారు. మెల్కిసెదెకు యాజక క్రమము అక్కడ మనకు కనిపిస్తున్నది. ఈ రోజు మనమంతా రాజులైన యాజక  సమూహములో ఉన్నాము. ప్రతి విశ్వాసీ యాజకుడే. యాజకుడు ప్రజలముందు దేవుని ప్రతినిధి. దేవుని ముందు ప్రజలకు ప్రతినిధి. మనము ప్రజల ముందు దేవుని తరుపున మాట్లాడుతాము. దేవుని ముందు ప్రజల కోసము ప్రార్ధన చేస్తాము, విజ్ఞాపన చేస్తాము. 

ప్రభువైన యేసు క్రీస్తు మన ప్రధాన యాజకుడయితే, మనము ఆయన యాజకులము. ఇప్పుడు మన ప్రధాన యాజకుడు ఎక్కడ ఉన్నాడు? 

హెబ్రీ 9:24 

అందువలన నిజమైన 

పరిశుద్ధస్థలమును పోలి హస్తకృతమైన

పరిశుద్ధస్థలములలో క్రీస్తు 

ప్రవేశింపలేదు గాని, యిప్పుడు 

మనకొరకు దేవుని సముఖమందు

కనబడుటకు పరలొకమందే ప్రవేశించెను.

లేవీ క్రమములో ప్రధాన యాజకుడు 

ప్రత్యక్ష గుడారములో లేక దేవుని 

ఆలయములో పరిశుద్ధ స్థలములోకి 

వెళ్ళాడు. అయితే అవి హస్తకృతాలు. 

the holy places made with hands, 

which are copies of the true

అంటే పరలోకములో ఉన్న నిజమైన దేవుని సన్నిధిని చూసి మనుష్యులు నిర్మించినవి. పరలోకములో ఉన్న దేవుని ఆలయము చూసి భూమి మీద ఒక ఆలయము నిర్మించారు. పరలోకములో ఉన్న నిబంధన మందసము చూసి భూమి మీద నిబంధన మందసము నిర్మించారు. అయితే అవి కాపీలు మాత్రమే. ఒరిజినల్స్  కాదు. మన ప్రధాన యాజకుడు ఒరిజినల్స్ దగ్గరకు వెళ్ళాడు. ఆ విధముగా ఈ మెల్కిసెదెకు యాజక క్రమము లేవీ యాజక క్రమము కంటే శ్రేష్టమైనది. లేవీ యాజకులు మనుష్యుల తరుపున పరలోకము వెళ్ళలేరు. ఈ చార్ట్ చూడండి. లేవీ యాజక క్రమము తాత్కాలికమైనది. ప్రధాన యాజకుడు, యాజకులు ప్రజల తరుపున ప్రత్యక్ష గుడారములో సేవ చేశారు. ఆ ప్రత్యక్ష గుడారము తాత్కాలికమైనదే. కనాను దేశములోకి వెళ్లిన తరువాత వారు దేవుని మందిరము కట్టుకున్నారు. సొలొమోను కట్టిన మొదటి ఆలయమును బబులోనీయులు కూల్చివేశారు. 70 సంవత్సరాలు యూదులకు ప్రధాన యాజకుడు కనిపించలేదు. 

     బబులోను నుండి తిరిగివచ్చి జెరుబ్బాబెలు నేతృత్వములో రెండవ ఆలయము కట్టుకున్నారు. ప్రధాన యాజకుడు, యాజకులు తిరిగి యూదుల తరుపున మరలా దేవుని ఎదుట సేవలు చేశారు. ఈ రెండవ మందిరాన్ని రోమన్ ప్రభుత్వము క్రీస్తు శకం 70 సంవత్సరములో కూల్చి వేసింది. రెండు వేల సంవత్సరాలుగా లేవీ యాజక క్రమము లేదు, కనుమరుగయ్యింది. లేవీ క్రమములో దేవుని ఆలయము లేదు, బలులు లేవు, అర్పణలు లేవు, మందసము లేదు, ప్రధాన యాజకుడు లేడు. మెల్కిసెదెకు క్రమము శ్రేష్టమైనది. శాశ్వతమైనది. బబులోనీయులు, రోమీయులు ఎవరూ దీనిని ఆపలేరు. ఈ దేవుని ఆలయమును ఎవరూ కూల్చలేరు ఎందుకంటే ఇది ప్రభువైన యేసు క్రీస్తు నిర్మిస్తున్న ఆత్మ సంబంధమైన దేవుని మందిరము. దీనిని ఎవరూ తాకలేరు. క్రీస్తు అనే ఈ ప్రధాన యాజకుడు గొఱ్ఱెల రక్తమును చిందించలేదు, మేకల రక్తమును చిందించలేదు, తన స్వరక్తాన్ని చిందించాడు. శాశ్వతముగా మన పాపములనుండి మనకు విముక్తి కలిగించాడు. 

     మన రక్షణ ప్రధాన యాజకుని మీద ఆధారపడి ఉంది. ప్రధాన యాజకుడు లేకుండా మనము పాప క్షమాపణ పొందలేము. ఎందుకంటే రక్త ప్రోక్షణ తీసుకొని ప్రధాన యాజకుడు అతి పరిశుద్ధ స్థలములోకి వెళ్లి దేవుని చేత అంగీకరించబడాలి. అప్పుడే మనకు రక్షణ, పాప క్షమాపణ. రక్షణలో మూడు భాగాలు ఉన్నాయి.

Justification, 

Sanctification, 

Glorification

Justification అంటే క్షమించబడుట

Sanctification అంటే పరిశుద్ధపరచబడుట

Glorification అంటే మహిమపరచబడుట

వర్త మాన భూత భవిష్యత్తు కార్యాలు ఈ మూడింటిలో మనకు కనిపిస్తున్నాయి.గతములో నేను క్షమించబడ్డాను.ప్రభువైన యేసు క్రీస్తు సిలువ దగ్గర నా పాపములు క్షమించబడ్డాయి. నేను నీతి మంతునిగా తీర్చబడ్డాను. అది justification. ప్రస్తుతము sanctification.అంటే పరిశుద్ధపరచ బడుతున్నాము. దేవుని వాక్యము వలన మనము ఇప్పుడు పాపము నుండి పరిశుద్ధ పరచబడుతున్నాము. భవిష్యత్తులో జరగబోయేది Glorification. మనము మహిమపరచబడుతాము.

    రక్షణ లో ఉన్న ఈ మూడు భాగాలు మనము అర్ధము చేసుకోవాలి. మూడు భాగాల్లో పాపముతో మన సంభందం మూడు రకాలుగా కనిపిస్తున్నది. మొదటిగా గతములో పాపము యొక్క శిక్ష నుండి నాకు విడుదల కలిగింది, Salvation from the penalty of sin వర్తమానంలో పాపము యొక్క శక్తి నుండి రక్షణ. Salvation from the power of sin భవిష్యత్తులో పాపము యొక్క ఉనికి నుండి మనకు రక్షణ. Salvation from the presence of sin పాపము యొక్క ఉనికి నుండి మనము వేరుచేయబడి మనము పరలోకములో ప్రవేశిస్తాము.

     మన ప్రధాన యాజకుడు ఈ మూడు చోట్ల మనకు రక్షణ అనుగ్రహించాడు. గతములో పాపము యొక్క శిక్ష నుండి మనకు విడుదల అనుగ్రహించాడు. ప్రస్తుతము పాపము యొక్క శక్తి నుండి మనకు రక్షణ ఇస్తున్నాడు. పరలోకములో దేవుని సముఖములో మన పక్షమున విజ్ఞాపణ చేస్తున్నాడు. భవిష్యత్తులో పాపము యొక్క ఉనికి నుండి మనలను రక్షిస్తాడు. మన ప్రధాన యాజకుడు ఈ మూడు భాగాల్లో మనకు సహాయము చేస్తున్నాడు.

Justification: పాపము యొక్క శిక్ష నుండి మనలను రక్షించాడు

Sanctification: పాపము యొక్క శక్తి నుండి మనలను ఇప్పుడు రక్షిస్తున్నాడు.

Glorification: పాపము యొక్క ఉనికి నుండి భవిష్యత్తులో మనలను రక్షిస్తాడు.

 

    ఈ విధముగా మనలను రక్షించే శక్తి లేవీ  క్రమములో ఉన్న యాజకులకు లేదు. మెల్కిసెదెకు క్రమములో వచ్చిన ప్రభువైన యేసు క్రీస్తు మాత్రమే ఉంది. 

-లేవీ క్రమములో యాజకులు మానవులు, మెల్కిసెదెకు క్రమములో యాజకుడు దేవుని కుమారుడు 

-లేవీ క్రమము తాత్కాలికమైనది , మెల్కిసెదెకు క్రమము శాశ్వతమైనది 

-లేవీ క్రమములో రాజరికము లేదు, మెల్కిసెదెకు క్రమములో ఒక రాజైన ప్రధాన యాజకుడు మనకు కనిపిస్తున్నాడు. 

-లేవీ క్రమము పాత నిబంధన, మెల్కిసెదెకు క్రమము క్రొత్త నిబంధన 

-లేవీ క్రమములో యాజకులు ప్రతి రోజూ బలులు అర్పిస్తూనే ఉన్నారు; మెల్కిసెదెకు క్రమములో మన ప్రధాన యాజకుడు ఒక్క సిలువ బలితో అర్పణ ముగించాడు. 

-లేవీ క్రమము పాపములు తీసివేయలేకపోయింది, మెల్కిసెదెకు క్రమములో మన పాపములు 

కడిగివేయబడ్డాయి 

-లేవీ క్రమము మనుష్యులను రక్షించలేదు; మెల్కిసెదెకు క్రమము మనకు రక్షణ అనుగ్రహించింది 

-లేవీ క్రమము భూలోకానికే పరిమితమయ్యింది, మెల్కిసెదెకు క్రమము పరలోకానికి విస్తరించింది. ఈ రోజున మన ప్రధాన యాజకుడు పరలోకములో ఉన్నాడు. 

హెబ్రీయులకు వ్రాసిన పత్రిక 7 అధ్యాయములో ఒక మాట చూద్దాము.

  1. ఈయన నిరంతరము ఉన్నవాడు గనుక మార్పులేని యాజకత్వము కలిగిన వాడాయెను.
  2. ఈయన తనద్వారా దేవునియొద్దకు వచ్చువారి పక్షమున, విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై యున్నాడు.
  3. పవిత్రుడును, నిర్దోషియు, నిష్కల్మషుడును, పాపు లలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును. 

ఆకాశ మండలముకంటె మిక్కిలి హెచ్చయినవాడునైన యిట్టి ప్రధానయాజకుడు మనకు సరిపోయినవాడు. 

ఈ యేసు క్రీస్తు ఎలాంటి ప్రధాన యాజకుడు? 

ఆయన నిరంతరము ఉన్నవాడు మార్పులేని యాజకత్వము కలిగిన వాడు 

మన పక్షమున విఙ్ఞాపణ చేస్తున్నవాడు పవిత్రుడును, నిర్దోషియు, నిష్కల్మషుడును, పాపు లలో 

చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును. ఆకాశ మండలముకంటె మిక్కిలి హెచ్చయినవాడు…అంత గొప్ప

ప్రధాన యాజకుని మనము కలిగిఉన్నాము. అంత కన్నా గొప్ప ఆశీర్వాదము మరొకటి ఉండదు.

    లేవీ యాజక క్రమము, మెల్కిసెదెకు యాజక క్రమము…బైబిల్ లో ఉన్న రెండు యాజక క్రమములు మనము ఈ రోజు చూశాము. మోషే అహరోనును, అతని కుమారులను యాజకులుగా నియమించుట, 

వారు చేసిన బలులు, అర్పణలు, నైవేద్యాలు, వారు నిర్మించిన బలిపీఠాలు,  దీప వృక్షం, ప్రత్యక్ష గుడారము, ఆలయము అవన్నీ రాబోయే ప్రధాన యాజకుని యొక్క ఛాయ మాత్రమే. వాటి నిజ 

స్వరూపము ప్రభువైన యేసు క్రీస్తులో ఉంది.ఆయన యొద్దకు వచ్చి మీరు

పాప క్షమాపణ పొంది, రక్షణ పొందాలన్నదే నేటి మా ప్రేమ సందేశం.