మహా క్రైస్తవుడు అపోస్తలుడైన పౌలు : డాక్టర్ పాల్ కట్టుపల్లి

పాశ్చాత్య నాగరికత కు పునాదులు వేసిన నగరములుగా మూడు నగరములను పేర్కొనవచ్చు: రోమ్, ఆథెన్స్, యెరూషలేము. చట్టం, న్యాయ పరిపాలన రోమ్ ఇచ్చిన వరాలు, తన అస్తిత్వము గురించి మనిషి చేసిన తాత్విక శోధన, హేతుబద్దమయిన వాదన ఆథెన్స్ ఇచ్చిన వరాలు, బైబిలు గ్రంథం, ప్రవక్తలు, ప్రభువయిన యేసు క్రీస్తు  యెరూషలేము ఈ ప్రపంచానికి ఇచ్చిన కానుకలు. 

    యెరూషలేము, ఆథెన్స్, రోమ్: ఈ మూడు సంస్కృతుల సమ్మేళనములో ఎదిగిన వ్యక్తి అపోస్తలుడయిన పౌలు. ఆయన గ్రీకు పట్టణమయిన తార్సులో జన్మించి, రోమ్ సామ్రాజ్య పౌరుడు గా జీవించిన యూదుడు. ఈ మూడు సంస్కృతులకు తన సువార్తను అందించే భాద్యతను ప్రభువయిన యేసు క్రీస్తు పరిశుద్ద  పౌలు భుజాల మీద మోపాడు. 

             పౌలు యెరూషలేము వెళ్లి – మీ ప్రవక్తలందరూ ప్రవచించిన మేస్సీయ ఈయనే అని యూదులకు ప్రభువయిన యేసు ను చూపించాడు. ఆయన ఆథెన్స్ వెళ్లి, అక్కడ ఉన్న తాత్వికులతో – మీ మనస్సులను తొలిచి వేస్తున్న ప్రశ్నలకు సమాదానములు ఇచ్చేది సోక్రటీస్ కాదు, ప్లేటో కాదు, అరిస్టాటిల్ కాదు, ప్రభువయిన యేసు  అని వారి ఆలోచనలను క్రీస్తు వైపుకు తిప్పాడు. ఆయన రోమ్ నగరము వెళ్లి – మీ చట్ట పాలన గురించి మీరు గర్వ పడుచున్నారు కాని, దేవుని చట్టం ముందు మీరంతా నశించిన స్తితిలో వున్నారు, మీకు దేవుడు అనుగ్రహించే నీతి అవసరం అని వారికి రక్షకు డయిన యేసు క్రీస్తును ప్రకటించాడు. ‘అయ్యో, నేను సువార్తను ప్రకటింపక పోయిన యెడల నాకు శ్రమ’ అనుచూ అహరహం క్రీస్తు జీవ సందేశాన్ని నలు దిక్కులా భోదించిన పౌలు వంటి క్రీస్తు దాసుడు ఈ ప్రపంచములో మరొకడు పుట్టలేదంటే అతిశయోక్తి కాదు. 

పౌలు నుండి మనము నేర్చుకొనవలసిన పాఠములు 

     అపోస్తలుల కార్యముల గ్రంథములో సింహ భాగము లూకా గారు అపోస్తలుడైన పౌలు జీవితము, పరిచర్య లకు కేటాయించాడు. ప్రభువైన యేసు క్రీస్తు దేవుడు కాబట్టి ఆయనను లెక్కలోకి తీసుకోము. మానవుల వరకు లెక్కలోకి తీసుకొంటే, అపోస్తలుడైన పౌలు కంటే గొప్ప వ్యక్తి మరొకరు లేరు, ఆయన కంటే గొప్ప క్రైస్తవుడు మరొకరు లేరు, ఆయన కంటే గొప్ప సువార్తికుడు మరొకరు లేరు. ఆయన గొప్ప చారిత్రిక పురుషుడు.ప్రతి రోజూ ఒక్కసారైనా ఆయన నాకు గుర్తుకువస్తాడు. ఆయన మాటలో, ఆయన జీవితమో, ఆయన పనులో ఏదో ఒకటి నా మనస్సులో మెదులుతాయి. ఆయన జీవితము నుండి మనము నేర్చుకొనవలసిన సత్యాలు ఎన్నో ఉన్నాయి. ఆయన జీవితము నుండి 10 విషయాలు మీకు చూపించాలని నేను ఆశపడుతున్నాను. 

  1. పౌలు యొక్క మార్గము 
  2. పౌలు యొక్క మారణ హోమం 
  3. పౌలు యొక్క మారు మనస్సు 
  4. పౌలు యొక్క మాణిక్యం 
  5. పౌలు యొక్క మాగాణి 
  6. పౌలు యొక్క మాటలు 
  7. పౌలు యొక్క మాహాత్యము
  8. పౌలు యొక్క మానవత్వము 
  9. పౌలు యొక్క మాతృత్వము 
  10. పౌలు యొక్క మాదిరి

పౌలు యొక్క మార్గము

అపో. కార్యములు 22:3. నేను కిలికియలోని తార్సులో పుట్టిన యూదుడను. అయితే ఈ పట్టణములో గమలీయేలు పాదములయొద్ద పెరిగి, మన పితరుల ధర్మశాస్త్రసంబంధమగు నిష్ఠయందు శిక్షితుడనై, మీరందరు నేడు ఉన్న ప్రకారము దేవుని గూర్చి ఆసక్తుడనైయుండి…. 

    పౌలు కిలికియ లోని తార్సు అనే ఊరిలో జన్మించాడు. అది ప్రస్తుత టర్కీ దేశములో ఉంది. అది గ్రీకు సంస్కృతితో నిండిన పట్టణము. రోమన్ అధికారము క్రింద ఉన్న పట్టణము. పౌలు ఒక యూదుడు. ఆ మూడు సంస్కృతుల ప్రభావములో ఆయన పెరిగాడు. 

జన్మత యూదుడు, గ్రీకు సంస్కృతిలో పెరిగాడు, రోమన్ చట్టాల క్రింద జీవించాడు. ఆ మూడు సంస్కృతులు ఆయనలో కలిసి ఉన్నాయి. దేవుని పరిచర్యలో అవి ఆయనకు ఉపయోగపడినాయి. 

యూదుల సమాజ మందిరములోకి  వెళ్లి  యూదులతో మాట్లాడగలడు 

గ్రీకుల యొద్దకు వెళ్లి గ్రీకులతో మాట్లాడగలడు 

రోమన్ల యొద్దకు వెళ్లి రోమన్లతో మాట్లాడగలడు 

యూదుల దగ్గరకు వెళ్లి – తీయండి మీ బైబిల్. మీ ప్రవక్తలు చెప్పింది ఎవరి గురించి? 

నా వంటి ప్రవక్త మరొకరు మీలో జన్మిస్తారు అని మోషే చెప్పింది ఎవరి గురించి? 

నా చేతులు పొడవబడ్డాయి అని 22 కీర్తనలో దావీదు చెప్పింది ఎవరి గురించి? 

బేత్లెహేములో జన్మిస్తాడు అని మీకా చెప్పింది ఎవరి గురించి? 

గొఱ్ఱె వలె వధకు తేబడతాడు అని యెషయా చెప్పింది ఎవరి గురించి? ఈ యేసు క్రీస్తు గురించి కాదా అని యూదులను నిలదీశాడు.

    17 అధ్యాయములో ఏథెన్సు నగరములో గ్రీకులతో మాట్లాడుట మనము చూస్తాము. 

మీ తత్వవేత్తలు చెప్పింది ఏమిటి ? 

ఎపిక్యూరియనులు, స్తోయికులు బోధించింది ఏమిటి? 

అరిస్టాటిల్, ప్లేటో, సోక్రటీస్ చేసిన తత్వ శోధన దేని గురించి? 

అసలైన జ్ఞానము గురించి. జీవిత పరమార్ధం గురించి. అవి మీకు కావాలంటే మీరు క్రీస్తు దగ్గరకు రావాలి. 

    రోమన్ గవర్నర్ ఫెలిక్సు కు పౌలు సువార్త చెప్పాడు. మీ రోమన్ చట్టాలు అతిక్రమిస్తే, నువ్వు ఊరుకొంటావా? కేసులు పెట్టి వారికి తీర్పు తీర్చి శిక్షిస్తావు కదా? దేవుని చట్టాలు నీవు అతిక్రమించావు. దేవుని నీతిని  నీవు ఉల్లంఘించావు. 

    దేవుని తీర్పును, శిక్షను నువ్వు ఎలా తప్పించుకొంటావు? ఆ మాటలు విని ఫెలిక్సు గుటకలు వేసాడు, ఆయన గొంతు తడారిపోయింది. పౌలు ఆ విధముగా యూదులకు, గ్రీకులకు, రోమన్లకు సువార్త చెప్పగలిగాడు ఎందుకంటే ఆ మూడు సంస్కృతులు ఆయన రక్తములోనే ఉన్నాయి. 

    దేవుని పట్ల ఎంతో ఆసక్తితో జీవించాడు. గమలియేలు అనే గొప్ప ఆచార్యుని వద్ద ఆయన ధర్మశాస్త్రాన్ని అంటే ప్రస్తుత పాత నిబంధన గ్రంథాన్ని ధ్యానించాడు. ఆయన దగ్గర చదివితే,  ఐన్ స్టీన్ దగ్గర ఫిజిక్స్ చదివినట్లే. గమలియేలు ధర్మ శాస్త్రములో అంత  గొప్ప మేధావి. ప్రభువైన యేసు క్రీస్తు ఇశ్రాయేలు దేశములో పరిచర్య చేస్తున్న దినములలో సౌలు గమలియేలు పాదముల యొద్ద ధర్మ శాస్త్రము చదువుతున్నాడు. ప్రభువైన యేసు క్రీస్తు సిలువ వేయబడి, మరణించి తిరిగిలేచి ఆరోహణుడై పరలోకమునకు వెళ్ళాడు. పెంతెకోస్తు దినము రోజు పరిశుద్ధాత్ముడు భూమి మీదకు వచ్చాడు. ఇప్పుడు యూదులైనా, అన్యులైనా ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా దేవుని యొద్దకు రావలసినదే. ఆ క్రీస్తు మార్గము సౌలుకు నచ్చలేదు. తన మార్గములోనే ఆయన నడిచాడు. పాత నిభందననే పట్టుకొని వేలాడాడు. 

    కొంత మంది పేషెంట్లు నాకు ఫోన్ చేస్తారు. నాకు జలుబు, జ్వరం. పోయిన సంవత్సరము నువ్వు ఇచ్చిన మందు ఇంకా కొంత మిగిలిఉంది. అది వేసుకోనా? అని అడుగుతారు. నేను ఏమని చెబుతానంటే, ఆ మందు వేసుకోబాకు. అది పాత జబ్బు, పాత మందు. ఇప్పుడు కొత్త జబ్బుకు కొత్త మందు వేయాలి. పాత మందు  ఎక్సపయరీ (పాడు) అయిపోయినది. అది ఇప్పుడు పనికి రాదు. యూదా మతము దేవుడు ఇచ్చిందే. అయితే క్రీస్తు వచ్చిన తరువాత ఎక్సపయరీ అయిపోయింది. పాత నిబంధన వ్రాసింది దేవుడే. అయితే ఈ రోజు అది మనలను రక్షించలేదు. సౌలు ఆ మార్గములో నడుస్తున్నాడు. 

సౌలు యొక్క మారణ హోమం

    సౌలు యూదా మతాన్ని క్రైస్తవ్యము నుండి రక్షించాలి అని కంకణము కట్టుకున్నాడు. క్రైస్తవ్యము నీకు నచ్చకపోతే, యూదా మతాన్ని స్వేచ్ఛగా ప్రచారము చేసుకో ఎవరొద్దన్నారు? అయితే సౌలు హింసాత్మక పద్ధతులు ఎన్నుకొన్నాడు. ఒక తీవ్రవాది అవతారము ఎత్తాడు. ఒక టెర్రరిస్ట్ లాగా క్రైస్తవులను నిర్మూలించాలని నిర్ణయించుకున్నాడు. ప్రధాన యాజకుని, యూదా మత పెద్దలను కలిశాడు. అతని ప్లాన్ వారికి నచ్చింది. 

అనునయిద్దాము, హెచ్చరిద్దాము, భయపెడదాము, హింసిద్దాము, అవసరమైతే చంపేద్దాము. ఈ తెగులును మనము వెంటనే అరికట్టాలి. యెరూషలేము చుట్టు ప్రక్కలా క్రైస్తవుల మీద దాడులు చేశాడు. ఆ తరువాత దమస్కు వెళదామని బయలుదేరాడు.

అపోస్తలుల  కార్యములు 22:4. ఈ మార్గములోనున్న పురు షులను స్త్రీలను బంధించి చెరసాలలో వేయించుచు మరణమువరకు హింసించితిని.5. ఇందునుగూర్చి ప్రధాన యాజకుడును పెద్ద లందరును నాకు సాక్షులైయున్నారు. నేను వారివలన సహోదరులయొద్దకు పత్రికలు తీసికొని, దమస్కులోని వారినికూడ బంధించి దండించుటకై యెరూషలేమునకు తేవలెనని అక్కడికి వెళ్లితిని.

సౌలు యొక్క మారు మనస్సు 

    అపో.కార్య 22 6. నేను ప్రయాణము చేయుచు దమస్కునకు సమీపించినప్పుడు మధ్యాహ్నకాలమందు ఆకాశమునుండి గొప్ప వెలుగు అకస్మాత్తుగా నా చుట్టు ప్రకాశించెను.7. నేను నేల మీద పడి – సౌలా సౌలా, నీవెందుకు, నన్ను హింసించుచున్నావని నాతో ఒక స్వరము పలుకుట వింటిని.8. అందుకు నేను – ప్రభువా, నీవెవడవని అడిగినప్పుడు ఆయన – నేను నీవు హింసించుచున్న నజరేయుడనగు యేసును అని నాతో చెప్పెను.

  దమస్కు కు సౌలు, అతని అనుచరులు వెళ్ళుచూ ఉన్నారు. మధ్యాహ్న సమయములో  ఒక గొప్ప వెలుగు ఆయన చుట్టూ ప్రకాశించింది. సౌలా, సౌలా, నీవెందుకు, నన్ను హింసించుచున్నావని ఆయన సౌలును అడిగాడు. అది దేవుని వెలుగు అని సౌలుకు అర్ధమయ్యింది. ‘ప్రభువా, నీవెవడవు?’ అని అడిగాడు. ఆయన – నేను నీవు హింసించుచున్న నజరేయుడనగు యేసును అన్నాడు. 

    సౌలు షాక్ తిన్నాడు. యేసు క్రీస్తు రోమన్ల చేతిలో సిలువ వేయబడ్డాడు కదా. ఆయన శిష్యులు ఆయన మృతదేహాన్ని దాచిపెట్టి ఆయన తిరిగిలేచాడు అని కల్లబొల్లి కబుర్లు చెబుతున్నారు అని నేను ఇప్పటి వరకు అనుకొంటున్నాను. ఈ క్రైస్తవ్యము ఒక పెద్ద అబద్ధము అని స్తెఫెను వంటి ఎంతో మంది క్రైస్తవుల ప్రాణాలు తీశాను.ఎంత చీకటిలో ఇంత కాలము నేను బ్రతికాను అని అనుకొన్నాడు. సువార్త సత్యము తెలుసుకొని మారుమనస్సు పొందాడు. 

  రక్షణ పొందిన తరువాత తాను ఏమి చేయాలో పౌలుకు ప్రభువు తెలియజేశాడు. అపో కార్య 22:10 అప్పుడు నేనుప్రభువా, నే నేమి చేయవలెనని అడుగగా, ప్రభువునీవు లేచి దమస్కులోనికి వెళ్లుము; అక్కడ నీవు చేయుటకు నియమింపబడినవన్నియు నీకు చెప్పబడునని నాతో అనెను.

అపో.కార్య 11: 22. వారిని గూర్చిన సమాచారము యెరూషలేములో నున్న సంఘపువారు విని బర్నబాను అంతియొకయవరకు పంపిరి.25. అంతట అతడు సౌలును వెదకుటకు తార్సునకు వెళ్లి అతనిని కనుగొని అంతియొకయకు తోడుకొని వచ్చెను.26. వారు కలిసి యొక సంవత్సర మంతయు సంఘములో ఉండి బహుజనములకు వాక్యమును బోధించిరి. మొట్టమొదట అంతియొకయలో శిష్యులు క్రైస్తవులనబడిరి.

అయితే అతని మాటలు క్రైస్తవులు నమ్మలేదు. మనల్ని మోసము చేయటానికి ఈ నాటకము ఆడుతున్నాడు అనుకొని సౌలును దూరముగా పెట్టారు. అయితే బర్నబా తార్సు వెళ్ళాడు, అక్కడ సౌలును కలుసుకొని, ఇద్దరూ కలిసి అంతియొకయ వెళ్లారు. అక్కడ వాక్యము బోధించారు.

పౌలు యొక్క మాణిక్యము 

     ప్రభువైన యేసు క్రీస్తు ను ఆ గొప్ప వెలుగులో చూసిన క్షణమే,  ప్రభువా, నేను ఏమిచేయాలి? అని అడిగాడు. సత్యము తెలుసుకొన్న తరువాత సౌలు ఒక్క క్షణము కూడా వెను దిరిగిచూడలేదు. గమలియేలును అడిగివస్తాను, ప్రధానయాజకుని అడిగివస్తాను, మా నాన్నను అడిగివస్తాను, మా అమ్మను అడిగివస్తాను అని సౌలు వెళ్ళలేదు.

ప్రభువా, నేను ఏమి చేయాలో చెప్పు. ఇక నేను వెనుకకు తిరిగి చూడను. 

అపో కార్య  20:24. అయితే దేవుని కృపాసువార్తనుగూర్చి సాక్ష్యమిచ్చుటయందు నా పరుగును,

                    నేను ప్రభువైన యేసువలన పొందిన పరిచర్యను, తుదముట్టింపవలెనని

                     నా ప్రాణమును నాకెంత మాత్రమును ప్రియమైనదిగా ఎంచుకొనుటలేదు.

      క్రీస్తు అనే మాణిక్యం నాకు దొరికాడు. ఆయన కోసము, ఆయన నాకిచ్చిన పరిచర్య కోసము ఎంత వెల అయినా చెల్లిస్తాను. నా ప్రాణము పోయినా ఫర్వాలేదు. క్రీస్తు పౌలు యొక్క జీవితాన్ని పూర్తిగా ఆక్రమించాడు.

10. ఏ విధముచేతనైనను మృతులలోనుండి 

నాకు పునరుత్థానము కలుగవలెనని, ఆయన 

మరణవిషయ ములో సమానానుభవముగలవాడనై, 

ఆయనను ఆయన పునరుత్థానబలమును ఎరుగు నిమిత్తమును,

11. ఆయన శ్రమలలో పాలివాడనగుట యెట్టిదో యెరుగు నిమిత్తమును,

 సమస్తమును నష్టపరచుకొని వాటిని పెంటతో 

సమానముగా ఎంచుకొనుచున్నాను. ఫిలిప్పీ 3:10-11 

  క్రీస్తు అనే మాణిక్యము కోసము ఈ ప్రపంచములో సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. క్రీస్తు కోసము మనము వేటిని త్యాగము చేయగలము? అని మనము ప్రశ్నించుకోవాలి.

పౌలు యొక్క మాగాణి 

     పౌలు చుట్టూ చూశాడు. ఈ ప్రపంచము మొత్తము ఆయనకు ఒక పొలము వలె కనిపించింది. ముందు యూదులతో మొదలుపెట్టాడు. యూదులలో నుండి అనేక క్రైస్తవ సంఘాలు స్థాపించాడు. యూదులు తిరస్కరించినప్పుడు అన్యజనుల యొద్దకు వెళ్ళాడు.

అపోస్తలులు కార్యములు13: 46. అప్పుడు పౌలును బర్నబాయు ధైర్యముగా ఇట్లనిరి : దేవుని వాక్యము మొదట మీకు చెప్పుట ఆవశ్య కమే; అయినను మీరు దానిని త్రోసివేసి, మిమ్మును మీరే నిత్యజీవమునకు అపాత్రులుగా ఎంచుకొనుచున్నారు, గనుక ఇదిగో మేము అన్యజనులయొద్దకు వెళ్లుచున్నాము. 47. ఏలయనగా నీవు భూదిగంతములవరకు రక్షణార్థముగా ఉండునట్లు నిన్ను అన్యజనులకు వెలుగుగా ఉంచియున్నాను అని ప్రభువు మాకాజ్ఞాపించెననిరి.

    పౌలు తన పరిచర్యను ముందు ఆసియా ప్రాంతానికి పరిమితము చేసుకొన్నాడు. అయితే దేవుని ప్రణాళికలు వేరుగా ఉన్నాయి. అపోస్తలుల కార్యములు గ్రంథము 16 అధ్యాయములో మనము చదువుతాము. ఆయన త్రోయ అనే పట్టణములో ఉన్నాడు. అంటే నేటి టర్కీ దేశములో ఉన్న ట్రాయ్ పట్టణము. అలెగ్జాండర్ చక్రవర్తి ఈ మాసిదోనియ దేశము నుండి వచ్చినవాడే. అలెగ్జాండర్ ట్రాయ్ వెళ్లి అక్కడ ఉన్న గ్రీక్ దేవుడు జూస్ ఆలయములో నగ్నముగా ప్రదక్షిణలు, ప్రార్ధనలు చేశాడు. గ్రీకు కవి హోమర్ ట్రాయ్ పట్టణమును వేదికగా చేసుకొని తన ఇలియాద్ ఇతిహాసాన్ని వ్రాశాడు. మహా భారతములో కురుక్షేత్రము ఎలాంటిదో, ఇలియాద్ లో ట్రాయ్ అలాంటిది. ఆ ట్రాయ్ పట్టణములో దేవుడు పౌలుకు ఈ దర్శనము అనుగ్రహించాడు. ఆ దర్శనములో మాసిదోనియ దేశస్తుడు నిలబడి మాసిదోనియకు వచ్చి మాకు సహాయము చేయుమని వేడుకొంటున్నాడు. అప్పుడు పౌలు యూరప్ వైపు తన పరిచర్యను సాగించాడు. ప్రపంచ చరిత్ర ను గొప్ప మలుపు తిప్పాడు. 

     అపోస్తలులు కార్యములు 16:8-9 లో మనము చదువుతాము : 

8. అంతటవారు ముసియను దాటిపోయి త్రోయకు వచ్చిరి.9. అప్పుడు మాసిదోనియ దేశస్థుడొకడు నిలిచినీవు మాసిదోనియకు వచ్చి మాకు సహాయము చేయుమని తనను వేడుకొనుచున్నట్టు రాత్రివేళ పౌలునకు దర్శనము కలిగెను. 

   ఏథెన్సు పట్టణము వెళ్ళినప్పుడు ఆ పట్టణము విగ్రహములతో నిండిపోవుట చూసి పౌలు తట్టుకోలేకపోయాడు. 

    అపో.కార్య 17: 16. పౌలు ఏథెన్సులో వారికొరకు కనిపెట్టుకొని యుండగా, ఆ పట్టణము విగ్రహములతో నిండియుండుట చూచినందున అతని ఆత్మ పరితాపము పట్టలేకపోయెను.

పౌలు సువార్త విని అన్యజనులు రక్షణ పొందడము, విగ్రహారాధన మానుకోవడం జరిగింది. ఆ దేవతల పూజారులు పౌలు పరిచర్యను చూసి కలవరము చెందారు.

     అపో.కార్య 19:24  ఏలాగనగా దేమేత్రియను ఒక కంసాలి అర్తెమిదేవికి వెండి గుళ్లను చేయించుటవలన ఆ పని వారికి మిగుల లాభము కలుగజేయుచుండెను.25. అతడు వారిని అట్టి పనిచేయు ఇతరులను గుంపుకూర్చి అయ్యలారా, యీ పనివలన మనకు జీవనము బహు బాగుగా జరుగు చున్నదని మీకు తెలియును.26. అయితే చేతులతో చేయబడినవి దేవతలు కావని యీ పౌలు చెప్పి, ఎఫెసులో మాత్రము కాదు, దాదాపు ఆసియయందంతట బహు జన మును ఒప్పించి, త్రిప్పియున్న సంగతి మీరు చూచియు వినియు నున్నారు.27. మరియు ఈ మన వృత్తియందు లక్ష్యము తప్పిపోవుటయే గాక, మహాదేవియైన అర్తెమి దేవియొక్క గుడి కూడ తృణీకరింపబడి, ఆసియయందంత టను భూలోకమందును పూజింపబడుచున్న ఈమెయొక్క గొప్పతనము తొలగిపోవునని భయముతోచుచున్నదని వారితో చెప్పెను.28. వారు విని రౌద్రముతో నిండిన వారై ఎఫెసీయుల అర్తెమిదేవి మహాదేవి అని కేకలువేసిరి;29. పట్టణము బహు గలిబిలిగా ఉండెను. 

     పోయిన సారి నేను ఎఫెసు పట్టణము వెళ్ళినప్పుడు అక్కడ పౌలు సువార్త ప్రకటించిన ప్రాంతమునకు వెళ్ళాను. అక్కడ నుండి అర్తెమి దేవి ఆలయము ఉన్న ప్రాంతానికి వెళ్ళాను. ఇప్పుడు అక్కడ ఒక చిన్న స్థంబము నిలబడి ఉంది. పౌలు ఉన్న రోజుల్లో దానిని ప్రపంచము ఏడు వింతల్లో ఒక వింత( seven wonders of the world) లో ఒక వండర్ అనే వారు. ఆ ప్రజలందరినీ ఆయన దేవుని వైపు త్రిప్పాడు. 

     అనేక మంది రక్షణ పొందుట చూసి అన్యమత నాయకులు, యూదు నాయకులు ఇద్దరూ పౌలును ద్వేషించారు. 

అపో కార్య 23:12 ఉదయమైనప్పుడు యూదులు కట్టుకట్టి, తాము పౌలును చంపువరకు అన్నపానములు పుచ్చుకొనమని ఒట్టు పెట్టుకొనిరి.13. ఈ కుట్రలో చేరినవారు నలుబదిమంది కంటె ఎక్కువ.

23 అధ్యాయములో పౌలు ను చంపేదాకా మేము అన్నపానములు పుచ్చుకోము అని  40 మంది యూదులు ప్రతిజ్ఞ చేయడము మనము చూస్తున్నాము. 

24 అధ్యాయములో యూదు న్యాయవాది రోమన్ గవర్నర్ ఫెలిక్స్ తో ఏమంటున్నాడు? 

5. ఈ మనుష్యుడు పీడవంటివాడును, భూలోక మందున్న సకలమైన యూదులను కలహమునకు రేపు వాడును, నజరేయుల మతభేదమునకు నాయకుడునై యున్నట్టు మేము కనుగొంటిమి. 

ఈ  మనుష్యుడు పెద్ద పీడ, మా దేశానికి పట్టిన ఒక తెగులు – వారు అంతగా పౌలును ద్వేషించారు కానీ దేవుడు పౌలు పరిచర్యను ఆశీర్వదించాడు. రోమ్ నగరములో నేను పౌలు హతసాక్షి అయిన ప్రదేశానికి వెళ్ళాను. అక్కడ ఆయన సమాధి ప్రక్కనే ఆయనను శిరచ్చేదనము చేసిన గొడ్డలి కూడా ఒక గ్లాస్ పెట్టిలో పెట్టి భద్రపరిచారు. అక్కడ ఒక చక్కటి చర్చి నిర్మించారు. పౌలుకు మరణ శిక్ష విధించిన నీరో చక్రవర్తి రోమ్ నగరములో ఎన్నో అందమైన భవంతులు నిర్మించుకున్నాడు. అవన్నీ కాలముతో పాటు నేలమట్టము అయిపోయినాయి. అయితే పౌలు నిర్మించిన క్రైస్తవ సాక్ష్యము ఈ రోజు వరకు కొనసాగుతూ ఉన్నది. నీరో ఓడిపోయాడు, పౌలు గెలిచాడు అని నాకు అనిపించింది. పౌలు ప్రపంచము మొత్తాన్ని తన మాగాణి గా, పొలముగా చూశాడు. 

పౌలు యొక్క మాటలు 

పౌలు యొక్క మాటలు చూస్తే, ఆయన అవిశ్వాసులకు క్రీస్తు యొక్క రక్షణ వినిపించాడు, విశ్వాసులకు క్రీస్తు యొక్క సమృద్ధి ని వినిపించాడు. 

అపో . కార్య 13,17 అధ్యాయాల్లో చూస్తే యూదులకు పాత నిబంధన ప్రవచనాలు క్రీస్తులో ఎలా నెరవేరాయో బోధిస్తున్నాడు. 

అపో కార్య 17: 2. గనుక పౌలు తన వాడుక చొప్పున సమాజపు వారియొద్దకు వెళ్లిక్రీస్తు శ్రమపడి మృతులలోనుండి లేచుట ఆవశ్యకమనియు,3. నేను మీకు ప్రచురముచేయు యేసే క్రీస్తయియున్నాడనియు లేఖన ములలోనుండి దృష్టాంతములనెత్తి విప్పి చెప్పుచు, వారితో మూడువిశ్రాంతి దినములు తర్కించుచుండెను.

   20 అధ్యాయములో త్రోయ సంఘస్తులతో రాత్రి మొత్తము తెల్లారేవరకు ఆయన మాట్లాడుతూనే ఉన్నాడు. 11 అయింది, 12 అయింది వదలి  పెట్టు బాబూ నిద్ర పోతాము అని అనుకొంటూ ఐతుకు అనే యువకుడు మేడ మీద నుండి క్రిందపడి ప్రాణాలు కోల్పోయాడు. పౌలు ఏమి చేశాడు? క్రిందకు వెళ్లి అతని బ్రతికించి మళ్ళీ తన ప్రసంగము మొదలు పెట్టాడు. ఆ విశ్వాసులు ఆయన మాటలు ఆసక్తితో విన్నారు. 

అపో.కార్య 20:11  తెల్లవారువరకు విస్తారముగా సంభాషించి బయలు దేరెను.

    ఆయన మాటలు వ్యర్ధమైన భూమిలో కూడా పడ్డాయి. 

24 అధ్యాయములో రోమన్ గవర్నర్ ఫెలిక్స్ పౌలు ను పిలిపించుకొని మరీ ఆయన మాటలు వింటున్నాడు. 

24:26. తరువాత పౌలువలన తనకు ద్రవ్యము దొరుకునని ఆశించి, మాటిమాటికి అతనిని పిలిపించి అతనితో సంభాషణ చేయుచుండెను.

   నువ్వు క్రైస్తవ నాయకుడివి కదా, వందల సంఘాలు కట్టావు, ఇప్పుడు కేసుల్లో ఇరుకొన్నావు, నీకు వాళ్ళు డబ్బులు పంపించలేదా? నాకు లంచము ఇస్తే నిన్ను వదలిపెడతాను కదా! ఫెలిక్స్ పౌలు మాటలు విని రక్షణ పొందకుండా డబ్బు మీదే తన మనస్సు పెట్టుకొన్నాడు. 

26 అధ్యాయములో పౌలు ఫేస్తు కు సువార్త చెబుతున్నాడు. ఫేస్తు ఏమంటున్నాడు? 

అపో.కార్య 26:24 అతడు ఈలాగు సమాధానము చెప్పుకొనుచుండగా ఫేస్తుపౌలా, నీవు వెఱ్ఱివాడవు, అతి విద్యవలన నీకు వెఱ్ఱిపట్టినదని గొప్ప శబ్దముతో చెప్పెను.

   పౌలా, నువ్వు పిచ్చివాడివి అయిపోయావు. గమలియేలు లాంటి మేధావుల దగ్గర చదువుకున్న నీవు ఇప్పుడు ఎందుకు ఈ క్రీస్తు గురించి మాట్లాడుతున్నావు? నీకు పిచ్చి పట్టిందా? అక్కడే కూర్చున్న అగ్రిప్పను పౌలు అడిగాడు. 

   అపో.కార్య 26:  27. అగ్రిప్ప రాజా, తమరు ప్రవక్తలను నమ్ముచున్నారా? నమ్ముచున్నారని నేనెరుగు దును.28. అందుకు అగ్రిప్ప ఇంత సులభముగా నన్ను క్రైస్తవుని చేయ జూచుచున్నావే అని పౌలుతో చెప్పెను.29. అందుకు పౌలు సులభముగానో దుర్లభముగానో, తమరు మాత్రము కాదు, నేడు నా మాట వినువారందరును ఈ బంధకములు తప్ప నావలె ఉండునట్లు దేవుడనుగ్రహించుగాక అనెను. 

   అగ్రిప్ప రాజు పౌలుతో ఏమంటున్నాడంటే, ‘నన్ను క్రైస్తవుని చేయటము అంత ఈజీ అనుకొంటున్నావా? నీ ప్రశ్నల గూడార్ధం తెలియనంత అమాయకుడిలా నీకు కనిపిస్తున్నానా?’ పౌలు ఏమన్నాడు? ‘అగ్రిప్ప రాజా, సులభమో, కష్టమో, మీరే కాదు, ఇక్కడ ఉన్న  అందరూ యేసు క్రీస్తును నమ్ముకొని రక్షణ పొందితే మంచిది. ఈ సంకెళ్లు తప్ప మీరందరూ నాకు లాగా ఉండాలి.’ 

   ‘నేను ఏ నేరము చేయలేదు, నేను నిర్దోషిని, నన్ను వదిలిపెట్టండి, మీకు పుణ్యము ఉంటుంది‘అని పౌలు తన కోసము అభ్యర్ధించుటలేదు. తన గుండెలు బాదుకోవటల్లేదు. సంకెళ్లలో ఉండి నప్పుడు కూడా ఇతరుల ఆత్మ రక్షణ గురించి ఆయన ఆలోచిస్తున్నాడు. 

మనను కలుసుకునే వారి ఆత్మల గురించి మనము ఆలోచిస్తున్నామా? విమానములో మన ప్రక్కన కూర్చొనే వ్యక్తితో, బస్సులో, రైలులో మన ప్రక్కన కూర్చొనే వ్యక్తితో, మనతో పనిచేసే వ్యక్తులకు ఒక్క సారైనా యేసు క్రీస్తు గురించి చెబుతామా? ఎవరు ఎట్టబోతే నాకెందుకు అనే నిర్లిప్తతతో, ఉదాసీనతతో గడుపుతున్నామా? మా అమ్మ రాజాబాయమ్మ గారు అన్ని సందర్భాల్లో సువార్త చెప్పేది. బస్సులో, రైలు బండిలో, హాస్పిటల్ లో, ఇంట్లో ఎవరన్నా ఆమెతో మాట్లాడితే ఆమె వారితో వారి ఆత్మ రక్షణ గురించి మాట్లాడేది.

 విశ్వాసులకు పౌలు క్రీస్తు యొక్క సమృద్ధి గురించి చెప్పాడు. ఎంత చక్కటి మాటలు ఆయన కలము నుండి వచ్చాయో నేను ప్రత్యేకముగా చెప్పవలసిన అవసరము లేదు.  తార్సు అనే పట్టణములో ఆయన జన్మించాడు. 

అక్కడే మార్క్ ఆంటోనీ, క్లియోపాత్రా కలుసుకున్నారు. ప్రేమించుకున్నారు. అయితే, నిజమైన ప్రేమ ఎలా ఉంటుందో పౌలు తన మాటల్లో చెప్పాడు (1 కొరింథీ 13) 

పౌలు యొక్క మాహాత్యము 

   పౌలు చేత దేవుడు అనేక గొప్ప కార్యములు చేయించాడు. అపోస్తలుల కార్యములు 19:11-12 వచనములు 

11. మరియు దేవుడు పౌలుచేత విశేషమైన అద్భుతములను చేయించెను

12. అతని శరీరమునకు తగిలిన చేతి గుడ్డలైనను 

   నడికట్లయినను రోగులయొద్దకు తెచ్చినప్పుడు రోగములు వారిని విడిచెను, 

   దయ్యములు కూడ వదలి పోయెను.

పౌలు చేత దేవుడు గొప్ప అబ్దుతములు చేయించాడు. 

ఆయన శరీరమునకు తగిలిన గుడ్డలు తాకితేనే రోగములు విడిచి వెళ్ళినాయి. 

20 అధ్యాయములో పౌలు ఐతుకు అనే యువకుని మరణము నుండి కూడా లేపడము మనము చూస్తున్నాము. 

అపోస్తలుల కాలములో దేవుడు అటువంటి గొప్ప అద్భుతాలు వారిచేత చేయించాడు. 

ఈ రోజు అపోస్తలులు ఎవరూ మన ప్రపంచములో లేరు. 

    అపోస్తలులు ప్రభువైన యేసు క్రీస్తు చేత వ్యక్తిగతముగా పరిచర్యకు పంపబడ్డారు. వారు మరణించి, తిరిగి లేచిన సజీవుడైన క్రీస్తును చూశారు. ఈ రోజు యేసు క్రీస్తు భూమి మీద లేడు కాబట్టి ఆయన వ్యక్తిగతముగా ఎవరినీ పరిచర్యకు పంపే అవకాశము లేదు. కాబట్టి ఈ రోజు ఎవరూ నేను అపోస్తలుని అని పిలుచుకోకూడదు. 

ఈ రోజు అద్భుతాలు చేసే వరము కూడా ఎవరికీ  లేదు. దేవుడు ఇప్పుడు కూడా అద్భుతాలు చేస్తాడు, చేస్తున్నాడు. అయితే, అపోస్తలుల కాలములో జరిగినట్లు బహిరంగ అబ్దుతాలు ఇప్పుడు జరుగుట లేదు.

అద్భుతాలు చేసే వరము మాకు ఉంది అనుకునేవారు రెండు రకాలు. 

మొదటి రకము అమాయకులు: వీరు లేని వరమును ఊహించుకొంటారు. అయ్యా, జ్వరంగా ఉంది ప్రార్ధన చేయండి అని అడిగితే వీరు ప్రార్ధన చేస్తారు. ఆ జ్వరం తగ్గింది. ఒక జబ్బు తగ్గటానికి మూడు కారణములు ఉంటాయి. మొదటి కారణము మన శరీరములో ఉన్న ఇమ్మ్యూనిటీ. చాలా జబ్బులను నయము చేసే శక్తి మన శరీరములోని ఇమ్మ్యూనిటీ కి ఉంది. రెండో కారణము మనం వేసుకొనే మందులు.మూడో కారణము దేవుడు అద్భుతము చేయడము. ఈ మూడు కారణాలు ఒక్కొక్కటి పనిచేయొచ్చు, లేక కలిసి పనిచేయొచ్చు. ఒక వ్యక్తి ఇమ్మ్యూనిటీ వల్ల స్వస్థపరచబడి ఉండవచ్చు. అప్పుడు దేవుడు అద్భుతము చేశాడు కాబట్టే ఈయన స్వస్థపరచబడ్డాడు అని మనము చెప్పకూడదు. ఒక వ్యక్తి మందులు వేసుకొని స్వస్థపరచబడి ఉండవచ్చు. దానిని మనము ఆయన ప్రార్ధన చేశాడు, ఆయనకు స్వస్థత వరము ఉంది అని అనకూడదు. దేవుడు ఇప్పుడు కూడా అబ్దుతాలు చేస్తాడు. అయితే వాటిని మనము వ్యక్తులకు ఆపాదించకూడదు.కొంత మంది అమాయకులు ఆ మూడు కారణాల వలన జరిగిన స్వస్థత తమ వల్ల కలిగింది అని అనుకుంటారు.

రెండో రకము అబద్ధికులు: ఈ రకం స్వస్థత బోధకులు,  వారికి స్పష్టముగా తెలుసు వారికి ఏ స్వస్థతా వరము లేదని. అయితే వారు అబద్ధాలు చెప్పి ప్రజలను మోసము చేద్దామని నిర్ణయించుకొంటారు. నేను అపోస్తలుడను, నేను స్వస్థపరచగలను అని వీరు ప్రచారము చేసుకొంటారు. ఇంతకు ముందు చెప్పిన మూడు కారణాలను వీరు తమకు ఆపాదించుకొంటారు. మా వస్త్రాలు పట్టుకోండి, మా పరిశుద్ధ జలము త్రాగండి, మా పరిశుద్ధ నూనె పూసుకోండి అని వీరు వ్యాపారము చేసుకొంటారు. వీరు చేసే పనులు పైకి బాగానే కనిపించ వచ్చు.అయితే అవి చాలా ప్రమాదం. 

చాలా మంది రోగులు ఏమనుకొంటారంటే, ‘ఫలానా భక్తుడు ఆయనకు స్వస్థతా వరము ఉంది. ఆయన ప్రార్థన చేశాడు చాలు. నేను ఇక హాస్పిటల్ కు వెళ్ళను.నేను ఏ డాక్టర్ దగ్గరకు వెళ్ళను’ అంటారు. ఆ విధముగా వ్యాధులు ముదరబెట్టుకొని, ప్రాణాలు కోల్పోయే వారిని నేను చాలా మందిని చూశాను.

    అపొస్తలులు చనిపోయిన వారిని కూడా లేపారు. నేటి స్వస్థత బోధకులను చనిపోయినవారిని లేపమనండి చూద్దాము. అపోస్తలులు నయము చేయలేని వ్యాధి లేదు. కరోనా ని ఆపే స్వస్థత బోధకుడు ఎవరో చెప్పండి చూద్దాము. అపొస్తలుడైన పౌలు ప్రత్యేకముగా దేవుని చేత వాడబడ్డాడు. లూకా యేమని వ్రాశాడు? దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతములను చేయించెను. అపోస్తలుల కాలము ప్రత్యేకమైన కాలము. క్రైస్తవ సంఘమును, సువార్తను బలపరచడానికి దేవుడు ఆ కాలములో గొప్ప అబ్దుతములు చేశాడు.ఇప్పుడు ఆ అవసరము లేదు. కాబట్టి స్వస్థతల పేరుతో మనము ప్రజలను మోసము చేయకూడదు. 

పౌలు యొక్క మానవత్వము 

     అపోస్తలుల కార్యములు 14 అధ్యాయములో పౌలు, బర్నబా లుస్త్ర అనే పట్టణములో ఒక కుంటివానిని స్వస్థపరచుట మనము చదువుతాము. అక్కడ ప్రజలు ఆ అద్భుతాన్ని చూసి ఆశ్చరపోయారు. మీరు మానవులు కాదు, మీరు దేవుళ్ళు అని బర్నబా కు ద్యుపతి అని, పౌలు కు హెర్మే అని పేరుపెట్టారు. వారికి దండలు వేశారు, పూజలు చేయటానికి, బలులు అర్పించాలని మొదలు పెట్టారు. పౌలు, బర్నబా వాళ్ళ పనులు చూసి తమ బట్టలు చించుకొన్నారు. మేము కూడా మానవులమే అని తమ మానవత్వాన్ని చాటుకొన్నారు. 

     జేమ్స్ కుక్ అని ఇంగ్లాండ్ దేశానికి చెందిన ఒక నావికుడు ఉండేవాడు. ఆయన, ఆయన అనుచరులు పసిఫిక్ సముద్రములో హవ్వాయి దీవులకు వెళ్లారు. అక్కడి ఆదిమ జాతి ప్రజలు ఆయనను చూసి ఈయన మానవుని రూపములో మన దగ్గరకి వచ్చిన దేవత అనుకొన్నారు. ఆయనకు పూజలు చేయడము ప్రారంభించారు. ఆ దీవులలో మంచి ఆహారము ఆయనకు అందించి ఆయనకు, ఆయన ప్రక్కన వారికి సేవలు చేయడము ప్రారంభించారు. కొన్ని రోజుల తరువాత జేమ్స్ కుక్ స్నేహితుడు ఒకడు చనిపోయాడు. వీళ్లకు మన మీద అనుమానము రాక ముందే వాణ్ని పాతిపెట్టండి అని జేమ్స్ కుక్ ఆజ్ఞాపించాడు. అయితే, అప్పటికే ఆ ప్రజలకు కుక్ మీద అనుమానము వచ్చింది. ఆయన కోటు పట్టుకొని, ‘రేయ్, నీవు దేవుడవని చెప్పావుకదరా, నీ స్నేహితుణ్ని బ్రతికించు’ అని అడిగారు. ‘అరేయ్, పరిగెత్తండి రా’ అని కుక్ అరిచాడు. ఓడల వైపు వారు పరిగెత్తుతుంటే, ఆ దీవుల వారు వారిని వెంట బడి కొట్టారు. అపోస్తలులు ఆ విధముగా లేనివి చెప్పుకోలేదు. 

మేము కూడా మీలాంటి మానవులమే, మాకు ఆరాధన చేయవద్దు, దేవుని వైపు చూసి రక్షణ పొందండి అన్నారు. 

    12. బర్నబాకు ద్యుపతి అనియు, పౌలు ముఖ్యప్రసంగి యైనందున అతనికి హెర్మే అనియు పేరుపెట్టిరి.13. పట్టణమునకు ఎదురుగా ఉన్న ద్యుపతి యొక్క పూజారి యెడ్లను పూదండలను ద్వారములయొద్దకు తీసికొనివచ్చి సమూహముతో కలిసి, బలి అర్పింపవలెనని యుండెను. 14. అపొస్తలులైన బర్నబాయు పౌలును ఈ సంగతి విని, తమ వస్త్రములు చించుకొని సమూహములోనికి చొరబడి 15. అయ్యలారా, మీరెందుకీలాగు చేయుచున్నారు? మేము కూడ మీ స్వభావమువంటి స్వభావముగల నరులమే. మీరు ఈ వ్యర్థమైనవాటిని విడిచి పెట్టి, ఆకాశమును భూమిని సముద్రమును వాటిలోఉండు సమస్తమును సృజించిన జీవముగల దేవునివైపు తిరుగ వలెనని మీకు సువార్త ప్రకటించుచున్నాము.

 వారి యొక్క యధార్థ హృదయము మనకు ఇక్కడ కనిపిస్తున్నది. 

17 అధ్యాయములో పౌలు, సీలలు బెరయ సంఘస్తులతో మాట్లాడుచున్నారు.  పౌలు బోధించిన విషయాలు వాక్యము వెలుగులో వారు పరిశీలించారు. ప్రతిదినము లేఖనములు పరిశోధించారు. 

Acts 17: 11. వీరు థెస్సలొనీకలో ఉన్న వారికంటె ఘనులైయుండిరి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి, పౌలును సీలయును చెప్పిన సంగతులు ఆలాగున్నవో లేవో అని ప్రతిదినమును లేఖనములు పరిశోధించుచు వచ్చిరి.

‘నేను చెప్పిందే వేదము, మీరు ఇక ఏ వాక్యము చదవనక్కరలేదు’ అని పౌలు అనలేదు. దేవుని వాక్యము ప్రకటించాడు. లేఖనములను పరిశోధించండి అని ప్రోత్సహించాడు. అబద్ద బోధకులు ఆ విధముగా చేయరు. దేవుని వాక్యము కంటే తమ మాటలే ముఖ్యమని వారు అనుకొంటారు.

    పౌలు తన బలహీనతలను గురించి కూడా మాట్లాడాడు. 2 కొరింథీ 12:7 లో తన శరీరములో ఉన్న ముళ్ళు గురించి చెప్పాడు. మూడు సార్లు నేను దేవుని వేడుకొన్నాను అన్నాడు. నా కృప నీకు చాలును, బలహీనతయందు నాశక్తి పరిపూర్ణమగుచున్నదని యేసు ప్రభువు ఆయనను బలపరచాడు. 

పౌలు యొక్క మాతృత్వము 

ఆ తరువాత పౌలు యొక్క మాతృత్వము. సువార్త చెప్పి సంఘాలు నిర్మించాడు. సంఘము కట్టాను నా పని అయిపోయినది అని చేతులు దులుపుకోలేదు.  15 అధ్యాయములో ఆయన సంఘములను స్థిరపరచుట అపో. కార్య 15:40-41 40. పౌలు సీలను ఏర్పరచుకొని, సహోదరులచేత ప్రభువు కృపకు అప్పగింపబడినవాడై బయలుదేరి,41. సంఘ ములను స్థిరపరచుచు సిరియ కిలికియ దేశముల ద్వారా సంచారము చేయుచుండెను.

దేవుడు తన స్వరక్తమిచ్చి సంఘమును సంపాదించుకున్నాడు. దానిని జాగ్రత్తగా కాపాడుకోవాలి అని అన్నాడు. 20 అధ్యాయములో ఎఫెసీ సంఘస్తులతో ఆయన ఏమంటున్నాడంటే, 

27. దేవుని సంకల్పమంతయు మీకు తెలుపకుండ నేనేమియు దాచుకొనలేదు.28. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులనుగా ఉంచెనో ఆ యావత్తుమందను గూర్చియు, మీ మట్టుకు మిమ్మును గూర్చియు జాగ్రత్తగా ఉండుడి.29. నేను వెళ్లిపోయిన తరువాత క్రూరమైన తోడేళ్లు మీలో ప్రవేశించునని నాకు తెలియును; వారు మందను కనికరింపరు.30. మరియు శిష్యులను తమవెంట ఈడ్చుకొని పోవలెనని వంకర మాటలు పలుకు మనుష్యులు మీలోనే బయలుదేరుదురు.31. కావున నేను మూడు సంవత్సరములు రాత్రింబగళ్లు కన్నీళ్లు విడుచుచు ప్రతి మను ష్యునికి మానక బుద్ధి చెప్పితినని మీరు జ్ఞాపకము చేసికొని మెలకువగా ఉండుడి.

సంఘముల పట్ల ఆయన శ్రద్ధ ఒక తల్లి తన బిడ్డల పట్ల చూపించే శ్రద్ధ లాంటింది. ఒక తల్లి ఎంతో బాధను భరించి ఒక బిడ్డకు జన్మ నిస్తుంది. ఎంతో  శ్రమ పడి ఆ బిడ్డను పెంచుతుంది. తన బిడ్డల కోసము కన్నీటి తో ప్రార్థన చేస్తుంది. అదే విధముగా ఇక్కడ పౌలు రాత్రి, పగలు సంఘముల క్షేమము కొరకు కన్నీటితో ప్రార్థన  చేయుట మనము చూస్తున్నాము. 

గలతి 4:19. నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీయందేర్పడు వరకు మీ విషయమై మరల నాకు ప్రసవవేదన కలుగుచున్నది.

ఆయన లక్ష్యము మనకు స్పష్టముగా అక్కడ కనిపిస్తుంది. క్రీస్తు స్వరూపము మీలో ఏర్పడే వరకు నేను మీ కోసము ప్రయాస పడుతూనే ఉంటాను అని ఆయన అన్నాడు. 

పౌలు యొక్క మాదిరి 

ఫిలిప్పీ 3: 17. సహోదరులారా, మీరు నన్ను పోలి నడుచుకొనుడి; మేము మీకు మాదిరియైయున్న ప్రకారము నడుచుకొను వారిని గురిపెట్టి చూడుడి. 

   అపోస్తలుడైన పౌలు జీవితాన్ని దేవుడు మన ముందు ఒక మాదిరిగా ఉంచాడు. ఎంతో గొప్ప దేవుని జ్ఞానముతో, క్రమశిక్షణతో, లక్ష్యము మీద గురిపెట్టి ఆయన క్రైస్తవ పరిచర్య చేశాడు. ఆయన శత్రువులు ఆయన మీద ఎన్నో నిందలు వేశారు. ఆరోపణలు చేశారు. కేసులు పెట్టారు. 

అపో కార్య 20:33. ఎవని వెండినైనను, బంగారమునైనను వస్త్ర ములనైనను నేను ఆశింపలేదు;34. నా అవసరముల నిమిత్తమును నాతో ఉన్నవారి నిమిత్తమును ఈ నా చేతులు కష్టపడినవని మీకే తెలియును.

అపో కార్య 25: 8. అందుకు పౌలు యూదుల ధర్మశాస్త్రమును గూర్చి గాని దేవాలయమును గూర్చి గాని, కైసరును గూర్చి గాని నేనెంతమాత్రమును తప్పిదము చేయలేదని సమాధానము చెప్పెను. 

    యూదులు, అన్యులు ఆయన మీద ఆరోపణలు చేశారు. ధర్మ శాస్త్రమును ఉల్లంఘించాడు, దేవాలయమును అపవిత్రము చేస్తున్నాడు, రోమన్ల మీద కుట్ర చేస్తున్నాడు అన్నారు.పౌలు ఫెస్తు తో ఏమన్నాడంటే, అవన్నీ అబద్ధాలే. ఎవరి విషయములో నేను ఎలాంటి తప్పూ చేయలేదు. 

ఆయన తన యొక్క గొప్ప పోరాటం విజయవంతముగా పూర్తిచేశాడు.

ఆత్మీయ కుమారుడు తిమోతికి పౌలు వ్రాశాడు: 

మంచి పోరాటము పోరాడితిని, 

నా పరుగు కడ ముట్టించితిని, 

విశ్వాసము కాపాడుకొంటిని. 

ఇకమీదట నా కొరకు నీతికిరీట 

ముంచబడియున్నది.  2 తిమోతి 4:7-8 

ఇది తిర్నాల కాదు, ఇది ఒక విహార యాత్ర కాదు, ఇది పిక్నిక్ కాదు, ఇది ఒక పోరాటం. 

పౌలును మాదిరిగా చేసుకొని మనము కూడా మంచి పోరాటము పోరాడాలి.