
మార్కు సువార్త వ్రాసినది ఎవరు?
జాన్ మార్కు ఈ ‘మార్కు సువార్త’ ను వ్రాశాడని మొదటి శతాబ్దములోని క్రైస్తవులు తెలియజేశారు. ఈ మార్కు క్రొత్త నిబంధనలో అనేక చోట్ల మనకు కనిపిస్తాడు. పౌలు (కొలొస్స 4:10), బర్నబాస్ (అపోస్తలుల కార్యములు 15:39), పేతురు (1 పేతురు 5:13) అతని గురించి ప్రస్తావించారు. క్రైస్తవ సంఘ నాయకుడు పాపియస్ (Papias) ప్రకారం అపోస్తలుడైన పేతురు గారి అనుచరుడు ‘మార్కు’ ఈ మార్కు సువార్తను వ్రాశాడు. మరొక సంఘ నాయకుడు ఐరేనియస్ ప్రకారం పేతురు గారు మరణించిన తరువాత మార్కు ఈ సువార్త వ్రాశాడు. అంటే క్రీస్తు శకం 67 సంవత్సరం అయి ఉండవచ్చును. క్లెమెంట్ అఫ్ అలెగ్జాండ్రియా ప్రకారం ఈ సువార్త అపోస్తలుడైన పేతురు రోమ్ నగరములో ఉన్నప్పుడు ‘మార్కు’ వ్రాశాడు. దీనిని బట్టి ఈ సువార్త క్రీస్తు శకం 45 తరువాత వ్రాయబడింది.
మార్కు సువార్త ఎప్పుడు వ్రాయబడింది?
క్రీస్తు శకం 45 – 70 ల మధ్య ఈ సువార్త వ్రాయబడింది అని చెప్పుకోవచ్చు. కొంతమంది విమర్శకులు ఏమని ప్రతిపాదించారంటే, ‘యేసు క్రీస్తు గురించి మొదటిగా వ్రాయబడిన పుస్తకం ‘Q’. Q అంటే ‘quelle’ సోర్స్/మూలపుస్తకం. ఈ ‘మూల పుస్తకం’ లో నుండే మార్కు తన సువార్త ను వ్రాశాడు. మార్కు సువార్తను ఆధారం చేసుకొని మత్తయి సువార్త, లూకా సువార్తలు వ్రాయబడ్డాయి’. ఇలాంటి ప్రచారాలు చేసేవారు దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా ఈ సువార్తలు వ్రాయించాడు అని నమ్మరు. సువార్తలు కేవలం మనుష్యులు వ్రాసినవే అని నిరూపించడానికి వారు ఇలాంటి సిద్ధాంతాలు కల్పించారు. అయితే Q అనే మూల పుస్తకం ఉంది అనడానికి ఎలాంటి చారిత్రిక ఆధారాలు లేవు. ‘Q’ గురించి ఏ క్రైస్తవ చరిత్రకారుడు వ్రాయలేదు. Q ని నిరూపించే ప్రాచీన ప్రతులు ఎక్కడా లేవు. ఈ ‘Q’ సిద్ధాంతము కేవలం దేవుని నమ్మని వారి ఊహలలో నుండే పుట్టింది. మార్కు ఈ సువార్తను చాలా దృఢమైన సాక్ష్యాధారములతో వ్రాశాడని మనం చెప్పుకోవచ్చు. ఆయన యెరూషలేములో జీవించాడు.
అపోస్తలుల కార్యములు 12:12 చూడండి.
పేతురు మార్కు అను మారు పేరుగల యోహాను తల్లియైన మరియ యింటికి వచ్చెను.
అక్కడ అనే కులుకూడి ప్రార్థనచేయుచుండిరి
అపోస్తలుల కార్యములు 12:12
చెరసాలలో ఉన్న పేతురును దేవదూత విడిపించాడు. అప్పుడు పేతురు గారు మార్కు యొక్క తల్లి మరియ ఇంటికి వెళ్ళాడు. అక్కడ అనేకమంది ప్రార్థన చేస్తూ ఉన్నారు. మొదటి శతాబ్దములో క్రైస్తవులు ఇళ్లల్లోనే మీటింగ్ లు పెట్టుకునేవారు. అంటే మార్కు యొక్క ఇల్లే ఒక చర్చి గా ఉంది. దీనిని బట్టి యేసు క్రీస్తు యెరూషలేములో చేసిన పరిచర్య, ఆయన సిలువ, సమాధి, పునరుత్తానము లను మార్కు వ్యక్తిగతముగా
చూసి ఉండే అవకాశం ఉంది. ఆయనకు అపోస్తలులు అందరూ తెలిసి ఉంటారు. ఆయన ఇంటిలో అపోస్తలులు మీటింగ్ పెట్టుకునేవారు. మార్కు తల్లి అపోస్తలులను మార్కు కు పరిచయం చేసి ఉంటుంది. ‘ఒరేయ్ మార్కు, ఈయన మత్తయి గారు, ఈయన యోహాను గారు, ఈయన పేతురు గారు, ఈయన పౌలు గారు, ఈయన లూకా గారు’ అని మరియ తన కుమారుడైన మార్కుకు అపోస్తలులను పరిచయం చేసి ఉంటుంది.
ఈ 4 సువార్తలు వ్రాసిన వారు – మత్తయి, మార్కు, లూకా, యోహాను ఒకరి నొకరు కలుసుకునే అవకాశం ఎంతో వుంది. యేసు క్రీస్తు ప్రభువుతో వారి అనుభవాలు వారు చర్చించుకునే అవకాశం ఎంతో ఉంది. వారి వారి అనుభవాల ప్రకారం వారి కోణములో వారు ఈ 4 సువార్తలు వ్రాశారు. వీరందరూ ఒకరిని ఒకరు కాపీ కొట్టారని, లేక పోతే ‘Q’ అనే ఇతర గ్రంథములో నుండి వారి సువార్తలు వ్రాశారని చెప్పడం తప్పు. 4 సువార్తలలో కొన్ని వ్యత్యాసాలు మనకు కనిపిస్తాయి. అవి 4 గురి దృక్పధాలు గా మనం చూడాలి. ఆ వ్యత్యాసాలు తప్పులు కాదు.
మార్కు సువార్త ఎవరికి వ్రాయబడింది?
ఈ మార్కు సువార్త అన్య జనుల కొరకు వ్రాయబడింది. మత్తయి సువార్త యూదుల కొరకు వ్రాయబడింది. అందులో క్రీస్తు యొక్క యూదు పితరులు, వంశావళులు, యూదులు చేసుకొనే పండుగలు, వారి సాంప్రదాయాలు, వారికి దేవుడు తన ప్రవక్తల ద్వారా చేసిన అనేక ప్రవచనాలు లాంటివి కనిపిస్తాయి. అయితే మార్కు సువార్త లో అవి చాలా తక్కువగా కనిపిస్తాయి. మార్కు అన్యజనుల కు క్రీస్తు సువార్తను ఈ పుస్తకములో ప్రకటిస్తున్నాడు. రోమన్ ప్రజలను తన మనస్సులో పెట్టుకొని ఆయన ఈ సువార్తను వ్రాశాడు. అపోస్తలులు యెరూషలేము మొదలుకొని రోమ్ నగరం వరకూ యేసు క్రీస్తు సువార్త ప్రకటిస్తూ వెళ్లారు. అపోస్తలుడైన పౌలు, బర్నబా అనే వ్యక్తి తో కలిసి తన మొదటి సువార్త యాత్ర చేశాడు. బర్నబా యొక్క బంధువు మార్కు. పౌలు, బర్నబా మార్కు ను తమతో ఈ సువార్త యాత్రలో తీసుకొని వెళ్లారు. (అపొస్తలుల కార్యములు 12:25)
వారు ఎక్కడ సువార్త ప్రకటిస్తున్నా మార్కు వారి వెంట వెళ్లి వారికి ఉపచారము చేస్తున్నాడు (అపొస్తలుల కార్యములు 13:5) అయితే, మార్కు వారిని వదిలి పెట్టి యెరూషలేము వెళ్ళిపోయాడు (అపొస్తలుల కార్యములు 13:13) అతని ప్రవర్తన చూసి అపోస్తలుడైన పౌలు మనస్తాపం చెందాడు. కొంతకాలం తరువాత అపోస్తలుడైన పౌలు, బర్నబా మరొక ప్రపంచ సువార్త యాత్ర చేద్దాము అనుకొన్నారు. ‘మనతో ఎవరిని తీసుకొని వెల్దాము’ అనే ప్రశ్న వారికి వచ్చింది. బర్నబా ఏమన్నాడు? ‘మా బంధువు మార్కు ను తీసుకొని వెళదాం’ అన్నాడు. ఆ మాట పౌలుకు ఏ మాత్రం నచ్చలేదు. ‘ఈ మార్కు పోయిన సారి మనలను మధ్యలో వదలి పెట్టి వెళ్ళిపోయాడు.మరచిపోయావా? అలాంటి వ్యక్తిని మనతో తీసుకొని వెళ్ళవద్దు’ అన్నాడు. మార్కు విషయములో వారిద్దరి మధ్య గొడవ జరిగింది (అపొస్తలుల కార్యములు 15:37-40). ఆ వివాదము వలన పౌలు, బర్నబాలు వేరైపోవలసి వచ్చింది. మార్కు ఆ విధముగా మధ్యలో వదలి పెట్టి వెళ్లిపోయేవాడిగా, అపోస్తలుల మధ్య గొడవలు పెట్టేవాడిగా, వివాదాలకు కేంద్ర బిందువుగా మారాడు. అయితే అతను ఆ స్థితిలోనే ఉండి పోలేదు. అపోస్తలుడైన పేతురు మార్కును చేరదీశాడు, తన అనుచరునిగా చేసుకొన్నాడు. మార్కు పేతురుకి ఆత్మీయ కుమారుని గా మారాడు (1 పేతురు 5:13)
పేతురు మార్కుతో చెప్పిఉంటాడు: ‘మార్కూ, నేను కూడా ‘యేసు క్రీస్తు అంటే ఎవరో కూడా నాకు తెలియదు’ అని అబద్దాలు చెప్పి పారిపోయిన వాణ్ణే. నన్ను కూడా ఆయన చేరదీసాడు. ఈయన ప్రధాన కాపరి (1 పేతురు 5:4) వంద గొఱ్ఱెలలో ఒక్క గొఱ్ఱె పోయినా దాని కోసం వెదకే మంచి గొఱ్ఱెల కాపరి’. పేతురు ఇచ్చిన ప్రోత్సాహముతో మార్కు విశ్వాసములో ఎదిగాడు. తన ప్రవర్తన మార్చుకున్నాడు. నమ్మకముగా ఉండడం నేర్చుకొన్నాడు. అతని చివరి స్థితి ఎలా ఉంది? కొలొస్స 4:10 లో ఒక మాట చూద్దాము:
నాతోకూడ చెరలో ఉన్న అరిస్తార్కును,
బర్నబాకు సమీపజ్ఞాతియైన మార్కును
మీకు వందనములు చెప్పు చున్నారు;
ఈ మార్కునుగూర్చి మీరు ఆజ్ఞలు పొందితిరి,
ఇతడు మీయొద్దకు వచ్చిన
యెడల ఇతని చేర్చుకొనుడి.
కొలొస్స 4:10
ఒక రోజుల్లో పౌలు మార్కుతో ‘నాతో రావద్దు’ అని చెప్పాడు. అయితే ఇప్పుడు ఏమంటున్నాడు? ‘మార్కు ను చేర్చుకోండి. అతడు నమ్మదగిన వ్యక్తి’ ఆ విధముగా మార్కు క్రైస్తవ విశ్వాసములో ఎదిగి, స్థిరత్వము పొంది, అపోస్తలులకు నమ్మదగిన వానిగా మారాడు. మనకు కూడా కొన్ని సార్లు బ్యాడ్ నేమ్ రావచ్చు. మధ్యలో వదలి పెట్టి పారి పోయే రకం, ఆయన మాట నమ్మవద్దు, క్యారెక్టర్ లేని మనిషి, నమ్మకత్వం నిలబెట్టుకోలేడు’ అని ఇతరులు మన గురించి చెప్పుకోవచ్చు. అయితే మనం ఆ స్థితి లోనే ఉండడం దేవుని చిత్తం కాదు. మార్కు వలె మనం కూడా విశ్వాసములో ఎదగాలి, దేవుని ప్రజలతో సహవాసములో కొనసాగాలి. నమ్మకస్తులముగా మారాలి అని దేవుడు కోరుకొంటున్నాడు.
చివరకు అపోస్తలులు మార్కును ఇష్టపడ్డారు. ఆయనకు గొప్ప బాధ్యత అప్పగించారు. ‘మార్కూ, నువ్వొక సువార్త వ్రాయాలి’ అన్నారు. అపోస్తలుడైన పేతురు తన సాక్ష్యం మార్కుకు చెప్పాడు. యేసు క్రీస్తు తో తన అనుభవాలను మార్కుకు తెలియజేశాడు. పాపియస్ చెప్పినట్లు, అపోస్తలుడైన పేతురు గారి అనుభవాలను మార్కు ఈ సువార్త లో వ్రాశాడు. దీనిని బట్టి ఈ సువార్తను ‘పేతురు చెప్పిన సువార్త’ అని కూడా మనం పిలువ వచ్చు.
మార్కు సువార్త ఎందుకు వ్రాయబడింది?
మొదటిగా యేసు క్రీస్తు సువార్త చెప్పడానికి మార్కు తన సువార్త వ్రాశాడు. మరొక ఉద్దేశ్యం క్రైస్తవులను ప్రోత్సహించడానికి. క్రీస్తు పూర్వం 64 లో రోమ్ నగరములో గొప్ప అగ్ని ప్రమాదం సంభవించింది. అప్పటి రోమన్ చక్రవర్తి ఆ ప్రమాదాన్ని క్రైస్తవులు చేసిన నేరముగా ప్రచారం చేశాడు. చేయని నేరానికి క్రైస్తవులను రోమన్లు హింసించారు. ఆ క్రైస్తవులను ఓదార్చ డానికి మార్కు ఈ సువార్త వ్రాశాడు. అనేక శ్రమలను ఓర్చుకొని తన పరిచర్య విజయవంతముగా ముగించిన యేసు క్రీస్తును మాదిరిగా చేసుకోండి అనే సందేశం ఈ మార్కు సువార్తలో ఉంది.
మార్కు సువార్తలో యేసు క్రీస్తు ప్రభువు మనకు ఎలా కనిపిస్తున్నాడు?
ఈ సువార్తలో ఆయన మనకు అనేక రూపాల్లో కనిపిస్తున్నాడు. మార్కు సువార్త ముఖ్య సందేశం ఏమిటంటే, ‘యేసు క్రీస్తు – సేవకుడు’
4 సువార్తలలో యేసు క్రీస్తు 4 రకాలుగా మనకు కనిపిస్తాడు.
మత్తయి సువార్త లో యేసు క్రీస్తు రాజుగా
లూకా సువార్తలో మనుష్య కుమారునిగా,
యోహాను సువార్తలో దేవుని కుమారునిగా
ఇక్కడ మార్కు సువార్త లో ‘సేవకునిగా’ మనకు కనిపిస్తున్నాడు. ఈ సువార్త కు గుండె కాయ లాంటి వాక్యం మార్కు సువార్త 10:45 లో మనకు కనిపిస్తుంది.
మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు గాని పరిచారము చేయుటకును, అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము ఇచ్చుటకును వచ్చెను
మార్కు సువార్త 10:45
మనుష్య కుమారుడు పరిచారం చేయించుకోవటానికి రాలేదు. పరిచారం చేయడానికి వచ్చాడు. అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణం ఇవ్వడానికి వచ్చాడు.
-దెయ్యం పట్టిన వాడు సాతాను శక్తి క్రింద విలవిలలాడుతున్నాడు. అతనికి సేవ చేయడానికి యేసు క్రీస్తు వెళ్ళాడు. అతనిలో ఉన్న దురాత్మను పారదోలాడు (మార్కు1:24-26)
-పేతురు అత్తా జ్వరముతో బాధపడుతూ ఉంది. ఆమెకు సేవ చేయడానికి యేసు క్రీస్తు వెళ్ళాడు (1:31)
-ఒక కుష్ఠ రోగి మోకాళ్ళ మీద ఆయనను బ్రతిమలాడాడు. ప్రభువా, నన్ను స్వస్థపరచు
అని వేడుకొన్నాడు. ఆ కుష్ఠ రోగికి సేవచేయడానికి ఆయన వెళ్ళాడు. అతని మీద కనికరపడి ఆ కుష్ఠ రోగం నుండి అతని స్వస్థ పరచాడు (మార్కు 1:42)
-ఒక పక్షవాయువు గల మనుష్యుడు ఉన్నాడు. యేసు క్రీస్తు దగ్గరకు వెళ్లే అవకాశం అతనికి లేదు. వారు ఏమి చేశారంటే, ఇంటి కప్పు విప్పి పైనుండి ఆ రోగిని ఆయన ముందుకు దించారు. ఆ పక్ష వాయువు గల వ్యక్తిని చూసి – కుమారుడా, నీ పాపములు క్షమించబడ్డాయి అన్నాడు.
-ఈ సేవకుని యొక్క ప్రత్యేకత చూడండి. ఈయన పాపములు క్షమించే శక్తి ఉన్న ఏకైక సేవకుడు. ఈయన పాపము క్షమించే అధికారం ఉన్న ఏకైక దేవుని సేవకుడు.
-ఆ పక్ష వాయువు గల వ్యక్తిని ఆయన స్వస్థపరచినప్పుడు ఆ వ్యక్తి తన మంచము మీద నుండి లేచి పరుగు తీసాడు. ఈయన స్వస్థ పరచే దేవుని శక్తి గలిగిన సేవకుడు. ఎవరూ చేయలేని అద్భుతాలు చేసే సేవకుడు.
-మార్కు ఇతర సువార్తల కంటే ఎక్కువ అద్భుతాలు తన సువార్తలో వ్రాశాడు.
ఊచ చెయ్యి గలవాడు స్వస్థపడుట,గలిలయ సముద్రములో దోనెలో చిక్కు కొన్న శిష్యులను రక్షించుట, దెయ్యం పట్టి సమాధులలో సంకెళ్ళ చేత బంధించబడిన వ్యక్తిని
స్వస్థపరచుట లాంటి అద్భుతాలు మనకు ఈ సువార్తలో కనిపిస్తాయి.
పండెండు సంవత్సరములుగా ఒక మహిళ రక్త స్రావము తో బాధ పడుతూ ఉంది. అనేక మంది డాక్టర్ ల దగ్గరకు వెళ్ళింది. ఎంతో డబ్బు ఖర్చు పెట్టుకొంది. అయినప్పటికీ ఆమెకు స్వస్థత కలుగలేదు. శారీరిక బాధ కు మానసిక వేదన కూడా కలిసి మరింత కృంగిపోయింది. ఆమెకు సేవ చేయడానికి యేసు క్రీస్తు వెళ్ళాడు. ఆమెను స్వస్థపరచి, సమాధానం ఇచ్చాడు.
-సమాజ మందిరపు అధికారి కుమార్తె చనిపోయింది. ఆ ఇంటిలో వారందరూ ఏడుస్తూ గగ్గోలు పెడుతున్నారు. వారిని ఓదార్చడానికి, ఆ బాలికను మరణం నుండి తిరిగి లేపి ఆ కుటుంబమునకు సేవ చేయడానికి యేసు క్రీస్తు వెళ్ళాడు. ఆ బాలిక లేచిన తరువాత ‘ఆ బాలికకు ఆహారం ఇవ్వండి’ అన్నాడు. ఒక బాలిక ఆకలి కూడా ఆయన పట్టించుకొన్నాడు. ఒక సభలో ఐదు రొట్టెలు, రెండు చేపలు తీసుకొని వాటిని విరిచి పంచిపెట్టినప్పుడు ఐదు వేల మంది పురుషులు తృప్తిగా తిన్నారు. వేలాది మంది ఆకలి తీర్చిన దేవుని సేవకుడు.
-తూరు, సీదోను ప్రాంతములకు వెళ్లి సువార్త ప్రకటిస్తున్నాడు. ఒక అన్యురాలు ఆయనను వేడుకొంది. ‘ప్రభువా, నా కుమార్తె కు దెయ్యం పట్టింది. సహాయం చేయి’ అని ఆమె ప్రాధేయ పడింది. ఆమె కుమార్తెను స్వస్థ పరచి, అన్యజనులకు సహితము పరిచారం చేసిన దేవుని సేవకునిగా ఆయన మనకు కనిపిస్తున్నాడు (మార్కు 7)
-ప్రతి అద్బుతములో యేసు క్రీస్తు దేవుని సేవకునిగా మనకు కనిపిస్తున్నాడు. ఆయన తనలో ఉన్న దేవుని శక్తి ని తన కోసం కాకుండా బాధలో ఉన్న ఇతరుల సేవలో ఉపయోగించాడు. ఇలాంటి సేవకుడు మనకు ఇంకెక్కడా కనిపించడు.
ఇంత గొప్ప దేవుని శక్తి ఉన్నప్పటికీ ఆయన ప్రతి రోజూ ప్రార్థన లో గడిపాడు. సాతాను ఆయన ప్రార్థన లు ఆపడానికి ఎంతో ప్రయత్నించాడు. జోసెఫ్ కెన్నెడీ ఫుట్ బాల్ కోచ్. ఆయన ఒక హై స్కూల్ లో స్టూడెంట్స్ కి ఫుట్ బాల్ లో ట్రైనింగ్ ఇస్తూ ఉంటాడు. ప్రతి ట్రైనింగ్ తరువాత ఆయన కొంత సేపు ఆ మైదానములో కూర్చొని ప్రార్థన చేస్తాడు. అయితే కొంతమంది స్కూల్ అధికారులకు ఆయన ప్రార్థన చేయడం చూసి కన్ను కుట్టింది. ‘నువ్వు బహిరంగముగా ప్రార్థన చేస్తున్నావు. ఆపి వేయి. ఇక్కడ నువ్వు ప్రార్థన చేయడానికి వీలు లేదు’ అని ఆయనను బెదిరించారు. బహిరంగముగా ఎన్నో చెండాలపు పనులు చేసే వారు ఉన్నారు. వారిని మాత్రం, ‘ఆహా, ఎంత చక్కటి పని చేశావు’ అని వీరు మెచ్చుకొంటారు. ప్రార్థన చేసే వ్యక్తిని చూసి వీరు ఓర్చుకోలేకపోయారు. అయితే జోసెఫ్ వారితో పోరాడాడు. ఆయన కేసు అమెరికా సుప్రీమ్ కోర్ట్ వరకూ వెళ్ళింది. సుప్రీమ్ కోర్ట్ ఈ ప్రార్థన పరుని బలపరచింది. ఆట అయిపోయిన తరువాత ఆయన ప్రార్థన చేసుకొంటాడో, పాట పాడుకొంటాడో, వాక్యం చదువుకొంటాడో మీకెందుకు? ఆయన హక్కులకు భంగం కలిగించకండి అని సుప్రీమ్ కోర్ట్ జడ్జిలు వారికి చీవాట్లు పెట్టారు. సాతానుడు అంత్యంత ఎక్కువగా ద్వేషించేది ఏమిటంటే, క్రైస్తవ విశ్వాసి ప్రార్థన చేయడం.
యేసు క్రీస్తు ను కూడా ఆపాలని సాతానుడు ప్రయత్నించాడు. అయితే యేసు క్రీస్తు సాతానుకు లొంగకుండా, ప్రార్థన చేస్తూ తన సేవ చేశాడు. ఈ సువార్తలో వెంటనే అనే మాట ‘41 సార్లు మనం చూస్తాము. యేసు క్రీస్తు ఏమి చెప్పాడు అనే దాని కన్నా ఆయన ఏమి చేసాడు? అనే అంశం మీద మార్కు తన సువార్తను కేంద్రీకరించాడు.
‘వెంటనే’ immediately. ఎక్కడా టైం వేస్ట్ చేయకుండా, ఎక్కడా తన శక్తిని వృధా చేయకుండా, యేసు క్రీస్తు దేవుని సేవలో పూర్తిగా నిమగ్నమయ్యాడు.
ఈ సువార్తను ‘Gospel of Immediacy’ అని పిలిచారు.
‘Gospel of Immediacy’
‘వెంటనే’ సువార్త
ఆయన వెంటనే వెళ్ళాడు
వెంటనే స్వస్థపరచాడు
వెంటనే బోధించాడు
వెంటనే ప్రశ్నించాడు
వెంటనే సిలువ వేయబడ్డాడు.
సువార్తలో ఆ ‘immediacy ఉండాలి. ‘ఈ యేసు క్రీస్తు గురించి రేపు చూద్దాములే’ అని మనం అనుకోకూడదు. నా ఆత్మ గురించి వచ్చే సంవత్సరము ఆలోచిస్తాను లే; పాప పుణ్యాల గురించి, పరలోకం నరకం గురించి ఇప్పుడు తొందర ఏముందిలే అని మనం అనుకోకూడదు. ‘రేపు మనది’ అని చెప్పడానికి ఎలాంటి గ్యారంటీ లేదు. నేడే రక్షణ దినం అని మనం గుర్తించాలి. యేసు క్రీస్తు ‘వెంటనే’ అనే రీతిలో దేవుని సువార్త ప్రకటించాడు. ఎందుకంటే అది చాలా ముఖ్యమైనది.
యేసు క్రీస్తు దేవుని సేవకుడే కానీ ఆయన ఇతర సేవకుల వంటి వాడు కాదు. 9 అధ్యాయములో రూపాంతరపు కొండ మీద ఆయన మనకు కనిపిస్తున్నాడు. మోషే, ఏలీయాలు ఆ కొండ మీద యేసు క్రీస్తుతో మాట్లాడుతూ కనిపించారు. పేతురు ఏమన్నాడంటే, బోధకుడా, మనమిక్కడ ఉండుట మంచిది; మేము నీకు ఒకటియు మోషేకు ఒకటియు ఏలీయాకు ఒకటియు మూడు పర్ణశాలలు కట్టిద్దాము. అప్పుడు పరలోకములో నుండి దేవుడు ఒక మాట అన్నాడు:
ఈయన నా ప్రియకుమారుడు,
ఈయన మాట వినుడి
(మార్కు 9:7)
ఈ సేవకుడు అందరు సేవకుల వంటి వాడు కాదు
ఈయన మోషే, ఏలీయా ల వంటి మానవుడు కాదు
ఈయన దేవుని ప్రియ కుమారుడు
యేసు క్రీస్తు మనుష్య కుమారుడు మాత్రమే కాదు, సేవకుడు మాత్రమే కాదు ఈయన దేవుడు అనే సత్యము కూడా మనకు మార్కు సువార్తలో కనిపిస్తుంది.
మనుష్య కుమారుడు అనే మాట దానియేలు గ్రంథం 7:13 లో మనకు కనిపిస్తుంది. అక్కడ మనుష్య కుమారుడు ఒక దైవిక వ్యక్తిగా మనకు కనిపిస్తున్నాడు. ఆయన పరలోకము నుండి దిగివచ్చిన దేవునిగా మనకు కనిపిస్తున్నాడు. మనుష్య కుమారుడు అనే పేరులో యేసు క్రీస్తు దైవత్వం కూడా మనకు కనిపిస్తుంది.
మార్కు సువార్త 12:37 లో మనం చూస్తే అక్కడ యేసు ప్రభువు ఒక ప్రశ్న అడిగాడు.
35 ఒకప్పుడు యేసు దేవాలయములో బోధించుచుండగా క్రీస్తు, దావీదు కుమారుడని శాస్త్రులు చెప్పుచున్నా రేమి?
36 నేను నీ శత్రువులను నీకు పాదపీఠముగా ఉంచు వరకు నీవు నా కుడివైపున కూర్చుండుమని ప్రభువు నా ప్రభువుతో చెప్పెను అని దావీదే పరిశుద్ధాత్మవలన చెప్పెను.
37 దావీదు ఆయ నను ప్రభువని చెప్పుచున్నాడే, ఆయన ఏలాగు అతని కుమారుడగునని అడిగెను.
క్రీస్తు దావీదు కుమారుడు, దావీదుకు ప్రభువు ఎలా అయ్యాడు?
దావీదు కుమారుడు గా క్రీస్తు మానవుడు
దావీదుకు ప్రభువుగా గా క్రీస్తు దేవుడు
ఆ విధముగా క్రీస్తు లో ఉన్న మానవత్వం దైవత్వం రెండూ మనకు కనిపిస్తున్నాయి.
మార్కు సువార్తలో మనకు దైవత్వం కలిగిన సేవకుడు కనిపిస్తున్నాడు.
ఈయన సేవ కేవలం బోధలు, అద్భుతాలకు పరిమితం కాలేదు.
10:33 -34 లో
ఇదిగో మనము యెరూషలేమునకు
వెళ్లుచున్నాము; మనుష్య కుమారుడు
ప్రధానయాజకులకును శాస్త్రులకును
అప్పగింప బడును; వారాయనకు
మరణశిక్ష విధించి ఆయనను
అన్య జనుల కప్పగించెదరు.వారు ఆయనను అపహసించి, ఆయనమీద ఉమ్మి వేసి, కొరడాలతో ఆయనను కొట్టి చంపెదరు; మూడు దినములైన తరువాత ఆయన తిరిగి లేచునని చెప్పెను.
మార్కు 10:33 -34
ఇక్కడ ఈ సేవకుడు తన గురించి ఒక ప్రవచనం చేస్తున్నాడు:
యెరూషలేము లో నేను అప్పగించబడతాను,
నాకు మరణ శిక్ష విధించబడుతుంది
నేను సిలువ వేయ బడతాను
సమాధి చేయబడతాను
అయితే మూడవ దినమున సమాధి
నుండి తిరిగి లేస్తాను.
ఈ సేవకుడు తన ప్రాణం మన కొరకు పెట్టునంతగా మనకు సేవ చేసాడు.
మార్కు సువార్తలో మనకు కనిపిస్తున్న ఈ సేవకుని చూసి మనం కూడా నేర్చుకోవాలి.
అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు వ్రాసిన పత్రిక లో వ్రాశాడు:
క్రీస్తుయేసునకు కలిగిన యీ మనస్సు మీరును కలిగియుండుడి.
ఆయన దేవుని స్వరూ పము కలిగినవాడైయుండి, దేవునితో
సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని
భాగ్యమని యెంచుకొనలేదు గాని
మనుష్యుల పోలికగా పుట్టి,
దాసుని స్వరూపమును ధరించుకొని, తన్ను తానే రిక్తునిగా చేసికొనెను.
ఫిలిప్పీ 2:5-7
మార్కు సువార్త యొక్క సందేశం అదే. దేవుని స్వరూపం కలిగిన క్రీస్తు, దేవుని తో సమానుడైన క్రీస్తు మన కొరకు దాసుని స్వరూపం ధరించుకొని ఈ లోకానికి వచ్చి మనలను మన పాపములనుండి రక్షించాడు.