సమ్సోను

Samson12519i.png

   ఈ రోజు మన సమాజములో ఎంతో ఆగ్రహం మనము చూస్తున్నాము. అత్యాచారాలు, హింస, హత్యలు, దోపిడీలు ఎలా ఆగుతాయి అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. వారి ఆగ్రహము, ఆవేదన, లా ఎన్ఫోర్స్ మెంట్, న్యాయ వ్యవస్థ, రూల్ అఫ్ లా అన్నీ మంచివే. అవి సొల్యూషన్ కాదు.అవి పరిష్కారాలు కాదు. ప్రజలు దేవుని వాక్యము విని మారు మనస్సు పొందాలి. బైబిల్ సత్యాలు తెలుసుకొని వాటిని ఆచరణలో పెట్టాలి.అప్పుడే సమాజము మారుతుంది. అందుకనే మనము నిరంతరము దేవుని వాక్యము బోధించాలి. ఈ రోజు సమ్సోను జీవితములో నుండి కొన్ని సత్యాలు మనము చూద్దాము.   న్యాయాధి పతులు గ్రంథము 13 అధ్యాయము నుండి, సమ్సోను జీవితము గురించి ఈ రోజు మీతో కొన్ని విషయాలు పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను. ఇశ్రాయేలీయులు కనాను దేశములో స్థిరపడ్డారు. వారి చుట్టూ అనేక జనాంగముల వారు అప్పటికే అక్కడ ఉన్నారు. పశ్చిమాన ఫినిషియులు, ఫిలిష్తీయులు, తూర్పున అమ్మోనీయులు, మోయాబీయులు, దక్షిణాన ఎదోమీయులు వారిని చుట్టుముట్టారు. వారిని ఓడించండి అని దేవుడు వారిని ఆదేశించాడు.

Israelsurroundedbytribesphilistines.jpeg

     అయితే, ఇశ్రాయేలీయులు దేవుని మాట వినలేదు. తమ చుట్టూ ఉన్న జాతుల వారితో కలిసిపోవటం ప్రారంభించారు. ఈ జాతుల వారు ఇశ్రాయేలీయులను ఏడిపించడం మొదలుపెట్టారు. వారిని అందరి కంటే ఎక్కువగా వేధించింది ఫిలిష్తీయులు. ఈ ఫిలిష్తీయలతో ఇశ్రాయేలీయులు శతాబ్దాల పాటు యుద్ధాలు చేశారు, న్యాయాధిపతుల కాలములో, ఆ తరువాత సౌలు, దావీదు, సొలొమోను రాజుల కాలము వరకు కూడా వారి శత్రుత్వము కొనసాగింది. ఈ ఫిలిష్తీయులు గ్రీకు దేశమునుండి వలస వచ్చారు. ముందు ఐగుప్తు వెళ్లారు. ఐగుప్తు రాజు వీరిని వెళ్లగొట్టినప్పుడు, వీరు కనాను దేశములో మధ్యధరా సముద్రం తీరాన నివాసములు ఏర్పరచుకున్నారు. 5 నగరాలు అక్కడ నిర్మించుకున్నారు. గాజా, అష్డోదు, అష్కేలోను, ఎక్రోను, గాతు. ఒక్కొక్క నగరానికి ఒక్కొక్క రాజు ఉన్నాడు.

Philistinestelugu.jpeg

సముద్రము మీద వ్యాపారములు చేసుకొంటూ వారు బ్రతికారు. వారి దేవుడు దాగోను ఒక సముద్ర దేవుడు. ఆయనకు పైన మనిషి శరీరం, క్రింద చేప శరీరం ఉంటాయి. ఈ దేవతకు వారు పూజలు చేసేవారు. మద్యం త్రాగి డాన్సులు వేసేవారు. నర బలులు చేసేవారు. ఇశ్రాయేలీయులను కూడా తమ బలులకు ఆహ్వానించారు.

Dagon1.jpgదేవుని మార్గము నుండి ఇశ్రాయేలీయులు తొలగిపోయారు. ఇశ్రాయేలీయుల ఆత్మీయ పరిస్థితి ఎలా ఉందో మనకు అర్ధం కావటానికి రెండు వాక్యాలు చూద్దాము: 

మొదటిగా, న్యాయాధిపతులు 21:25 

ఆ దినములలో ఇశ్రాయేలీయులకు రాజు లేడు;  ప్రతి వాడును తన తన ఇష్టానుసారముగా ప్రవర్తించుచువచ్చెను. 

every man did that which was right in his own eyes.

రెండోదిగా న్యాయాధి పతులు 9:33, ఇక్కడ జెబులు అబీమెలెకు తో అంటున్నాడు: ‘నీ చేతికి నచ్చినట్లు చేయి’. వాళ్ళ ఫిలాసఫీ ఏంటంటే, కంటికి నచ్చితే చాలు, చేసేయి చేయికి నచ్చితే చాలు, చేసేయి దేవుడు లేడు, ధర్మ శాస్త్రము లేదు. I don’t care’ దీనిని Pragmatism అంటారు.మన కంటికి నచ్చింది కదా, ఫలితాలు బావున్నాయి కదా, చేసేద్దాము. దీనిలో దేవునికి స్థానము లేదు. ఇశ్రాయేలీయులు అటువంటి ఆత్మీయ స్థితిలో ఉన్నారు. దీనిని సమ్సోను జీవితములో కూడా మనము చూస్తాము. తన కంటికి నచ్చింది చేశాడు, తన చేతికి నచ్చింది చేశాడు. దేవుని గురించి, ఆయన వాక్యము గురించి ఆయన పట్టించుకోలేదు. ఇశ్రాయేలీయులు కష్టాల్లో ఉన్నప్పుడు మాత్రమే దేవుని గుర్తుచేసుకొని ఆయన సహాయము కోసము ప్రార్ధన చేశారు. ఫిలిష్తీయులు వారిని వేధిస్తున్నపుడు దేవుడు వారి ప్రార్ధన విన్నాడు.

     జొర్యా అనే పట్టణములో ఇద్దరు దంపతులు ఉన్నారు: మానోహ, అతని భార్య. మానోహ భార్యకు దేవుని దూత ప్రత్యక్షమయ్యాడు. ఈ దూత ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తే. ఇది ఒక Pre-Incarnate Apperance.అంటే బెత్లెహేము జన్మించక ముందు ప్రభువైన యేసు క్రీస్తు మానవులకు ప్రత్యక్షమైన సందర్భము. ఆ దూత ఆమెకు ఒక వాగ్దానము చేశాడు. నువ్వింత కాలము పిల్లలు లేకుండా ఉన్నావు. నువ్వు గర్భవతివై ఒక కుమారుని కంటావు. ఆ కుమారుడు దేవుని కొరకు ప్రత్యేక పరచబడతాడు. నాజీరు చేయబడతాడు. మద్యము త్రాగడు, అపవిత్రమైనవి తినడు, మృత దేహాలు ముట్టుకోడు, లైంగిక పాపాలు చేయడు, అతని తల మీద మంగల కత్తి పడదు.మనోహాతో కూడా దేవుని దూత కనిపించి అతనితో మాట్లాడాడు. అయితే అతను దేవుని దూత అని మనోహా గుర్తించలేకపోయాడు (న్యాయాధి 13:16). మానోహ, అతని భార్య దేవుని దూత ఎదుట ఒక రాతి మీద మేక పిల్లను అర్పణగా పెట్టారు. దేవుని దూత వారి ముందు ఒక అద్భుత కార్యము చేశాడు. అగ్నితో ఆ బలిపీఠమును మండించాడు. అగ్ని జ్వాలలలో  పరలోకమునకు తిరిగివెళ్ళాడు. 

     దేవుడు నిర్ణయించిన సమయములో మానోహ దంపతులకు ఒక బిడ్డ జన్మించాడు. వారు అతనికి సమ్సోను అని పేరు పెట్టారు. సమ్సోనును దేవుడు ఆశీర్వదించాడు. అతనికి తన ఆత్మను ఇచ్చాడు, తన శక్తిని ఇచ్చాడు. 

మొదటిగా, సమ్సోనుకు తన చూపులే ప్రధానము 

అయితే, సమ్సోను చేసిన మొదటి పని ఏమిటి?

న్యాయాధి 14:1 చూద్దాము: 

సమ్సోను తిమ్నాతునకు వెళ్లి తిమ్నాతు లో ఫిలిష్తీ యుల కుమార్తెలలో ఒకతెను చూచెను. ఇశ్రాయేలు దేశము లో ఇప్పుడు జరుగుతున్న త్రవ్వకాల్లో ఈ తిమ్నాతు బయటపడింది (Tel Batash). ఫిలిష్తీయులు నాడు దాగోను దేవతకు నిర్మించిన ఆలయాలు స్థంబాలతో సహా ఈ త్రవ్వకాల్లో బయటపడుతున్నాయి. బైబిల్ ల్లో ఉన్న వివరాలు చారిత్రిక వాస్తవాలు. ఈ రోజున ఆర్కియాలజిస్టులు బైబిల్ సత్యాలను నిరూపిస్తున్నారు.

Philistines12519dd.png

సమ్సోను ఈ తిమ్నాతుకు వెళ్ళాడు. అక్కడ ఒక యువతిని చూశాడు. సమ్సోను జీవితము చూపులతో మొదలయ్యింది. తల్లి దండ్రుల తో ఏమన్నాడంటే, నేను ఫిలిష్తీయులలో ఒక అమ్మాయిని చూశాను. ఆ అమ్మాయిని ఇచ్చి నాకు పెండ్లి చేయండి’.  వారేమన్నారంటే, ‘నువ్వు పెళ్లి చేసుకోవాలంటే, మన కమ్యూనిటీ లో ఎంతో మంది యువతులు ఉన్నారు.అన్యులను పెళ్లి చేసుకొని మనము వారితో సాంగత్యము చేయకూడదు’ ఆ మాటలు సమ్సోనుకు నచ్చలేదు.‘నీ అభిప్రాయముతో నాకు అనవసరం. నాకు ఆ అమ్మాయే కావాలి’ అని తండ్రిని గద్దించాడు. వాళ్ళ అమ్మను అసలు పట్టించుకోలేదు. ఆమె దేవుని జ్ఞానము కలిగిన స్త్రీ. దేవుని దూతతో మాట్లాడిన స్త్రీ. తన భర్త కంటే ఎక్కువ గ్రహింపు కలిగిన స్త్రీ. అయితే, సమ్సోనుకు ఆమె సలహా వినే శ్రద్ధ, ఆసక్తి, వినయము, విధేయత లేవు. సమ్సోను యొక్క అవలక్షణము ఇక్కడ మనకు కనిపిస్తుంది. అతడు మంచి స్త్రీల మాట వినడు, చెడు స్త్రీల మాట వింటాడు. ఆ స్వభావమే అతని కొంప ముంచింది. తల్లి దండ్రుల మాట వినకుండా సమ్సోను ఫిలిష్తీయుల యువతిని పెండ్లి చేసుకొన్నాడు.ఫిలిష్తీయలను ఓడించారా బాబూ అని దేవుడు పంపితే, సమ్సోను యుద్ధము చేయకుండా వారితో కాపురము చేస్తున్నాడు. ఈ రోజు మనం చేసే తప్పు కూడా అదే. లోకమును జయించండి అని దేవుడు మనల్ని పంపితే, మనము లోకముతో స్నేహము చేస్తాము, లోకస్తులతో కాపురము చేస్తాము.  

    అపొస్తలుడైన పౌలు మనలను ప్రశ్నించాడు: 

మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. 

నీతికి దుర్ణీతితో ఏమి సాంగత్యము?

వెలుగునకు చీకటితో ఏమిపొత్తు?

క్రీస్తునకు బెలియాలుతో 

ఏమి సంబంధము? 

అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది? 

దేవుని ఆలయ మునకు విగ్రహములతో

ఏమిపొందిక? మనము జీవముగల

దేవుని ఆలయమై యున్నాము;

(2 కొరింథీ 6:14-16) 

క్యాంప్ బెల్ మోర్గాన్ ఒక సారి అన్నాడు: 

 “The church did the most for the world when the church was least like the world” 

ప్రపంచములాగా ఉండాలి అనుకోబాకు, ప్రపంచానికి నువ్వు యెంత విభిన్నముగా ఉంటే నీ వాళ్ళ ప్రపంచానికి అంత ప్రయోజనం. సమ్సోను యెరూషలేము వైపు వెళ్లకుండా తిమ్నాతు వైపుకు వెళ్ళాడు. ఫిలిష్తీయులకు దగ్గరగా అతని జీవితం జరుగుకుంటూ వెళ్ళింది. తిమ్నాతు దగ్గర అతనికి ఒక కొదమ సింహం ఎదురుపడింది. దాని వీరోచితముగా చీల్చిచంపాడు. పెండ్లి విందు చేశాడు. ఫిలిష్తీయుల పెండ్లి విందులలో మద్యం ఏర్లుగా పారుతుంది. దేవుని చేత నాజీరు చేయబడిన వ్యక్తి కాబట్టి సమ్సోను మద్యానికి దూరముగా ఉండాలి,  అన్యులతో సాంగత్యము చేయకూడదు. సమ్సోను తన నాజీరు వ్రతమును మరచిపోయాడు. వారికి 7 రోజులు పెండ్లి విందు ఇచ్చాడు. వారికి విప్పుడు కథలు చెప్పాడు. బలమైనదానిలోనుండి తీపి వచ్చెను,తిను దానిలోనుండి తిండి వచ్చెను కథ భావము చెప్పినవారికి 30 సన్నపు నారబట్టలు, దుస్తులు ఇస్తానన్నాడు.సమ్సోను భార్య ద్వారా వారు ఆ విప్పుడు కథ భావము చెప్పారు.

Samson12519r.png

    అప్పుడు అష్కేలోను నగరము వెళ్లి అక్కడ 30 మందిని చంపి వారి సొమ్మును దోచుకొని తన విప్పుడు కథ చెప్పిన వారికి ఆ బట్టలు ఇచ్చాడు. సమ్సోను ముందు తిమ్నాతు వెళ్ళాడు, అక్కడ నుండి అష్కేలోను వెళ్ళాడు. క్రమక్రమముగా తన స్వజనులకు, యెరూషలేముకు, దేవుని సన్నిధికి దూరముగా వెళ్ళిపోయాడు. అతనికి ఇశ్రాయేలీయులలో స్నేహితులు లేరు, అతని స్నేహితులందరూ ఫిలిష్తీయులే. వారికి విందులు చేస్తూ, విప్పుడు కథలు చెప్పుతూ, కట్నకానుకలు ఇస్తూ గడుపుతున్నాడు.దేవుని కోసము, దేవుని ప్రజల కోసం అతడు ఏ పనీ చేయటల్లేదు.  

సమ్సోను చేసిన పనులు ఆయన కోసమే.

సమ్సోను దేవుని శక్తిని తన కోసము వాడుకున్నాడు. దేవుని వరములు తన కోరికలు తీర్చుకోవడానికి వాడుకున్నాడు.

1 కొరింథీ 12

  1. కృపావరములు నానావిధములుగా ఉన్నవి గాని ఆత్మ యొక్కడే.
  2. మరియు పరిచర్యలు నానా విధములుగా ఉన్నవి గాని ప్రభువు ఒక్కడే.
  3. నానావిధములైన కార్యములు కలవు గాని అందరిలోను అన్నిటిని జరిగించు దేవుడు ఒక్కడే.

సమ్సోను దేవుని వరమును తన స్వార్ధం కోసము వాడుకొంటున్నాడు. దేవుడు ఇచ్చిన శక్తిని ఇతరులను దోచుకొని సొమ్ము చేసుకొంటున్నాడు. దేవుడు ఆయనకు వరములు ఇచ్చింది ఇతరుల సొమ్ము దోచుకోమని కాదు.తన ప్రజలకు సేవ చేయమని.దిశా అత్యాచారములో నిందితులుగా ఉన్న 4 యువకులు ఎం కౌంటర్ లో చంపబడుట మనము చూశాము.ఎంత విచారకరం. దేవుడు ఆ నలుగురు యువకులను తన కోసము సృష్టించుకున్నాడు. ఆయనను తెలుసుకోవటానికి, ఆయనను సేవించటానికి వారికి జీవితము ఇచ్చాడు.అయితే ఆ జీవితాన్ని వారు ఇతరులను దోచుకోవటానికి, దొంగతనాలు  చేయటానికి, రేప్ లు చేయటానికి, మర్డర్లు చేయటానికి వాడారు.  అర్ధంతరంగా జీవితాలను ముగించారు. ఇక్కడ సమ్సోను దేవుని వరములను తన కోసం వాడుకున్నాడు. అతని జీవితం కూడా అర్ధంతరంగా ముగిసింది.

20 వచనము చూద్దాము.  

 అతడు కోపించి తన తండ్రి యింటికి  వెళ్లగా అతని భార్య అతడు స్నేహితునిగా భావించుకొనిన అతని చెలికాని కియ్యబడెను.

    ఇంత చేసి సమ్సోను భార్యను వదలి వేశాడు. తన భార్యను స్నేహితునికి ఇచ్చివచ్చాడు. తల్లి దండ్రులను ఎదిరించి ఆ యువతిని పెళ్లి చేసుకొన్నాడు, ఎంతో ఖర్చు పెట్టి వివాహ విందులు ఇచ్చాడు, భారీ కానుకలు అతిధులకు ఇచ్చాడు, అంత చేసి కోపము రాగానే తన భార్యను స్నేహితునికి వదలి  వేశాడు. అతనిలో కమిట్ట్మెంట్ లేదు. నిజమైన ప్రేమలో కమిట్మెంట్ ఉంటుంది. వైవాహిక జీవితములో మనకు అప్పుడప్పుడు కోపతాపాలు రావడం సహజమే. అయితే మన వివాహాలను కాపాడేది కమిట్మెంట్. కమిట్మెంట్ ఉన్నప్పుడే మనము కష్టాల్లో కూడా కలిసి ఉంటాము,  కమిట్మెంట్ ఉన్నప్పుడే మనము హాస్పిటల్ కి వెళ్తాము,  కమిట్మెంట్ ఉన్నప్పుడే కోపతాపాలు అణుచుకొని జీవిస్తాము. సమ్సోను లో అది లోపించింది. చూడగానే ఇష్టపడ్డాడు, ఇష్టపడగానే పెళ్లి చేసుకొన్నాడు, కోపం రాగానే భార్యను వదలివేశాడు. తిరిగి తన ఇంటికి వెళ్ళిపోయాడు. 

సమ్సోనుకు అతని భావోద్వేగాలే ముఖ్యము. 

మనందరికీ భావోద్వేగాలు ఉంటాయి. మన వ్యక్తిత్వములో భావోద్వేగాలకు చాలా ప్రాముఖ్యత ఉంది. అయినప్పటికీ, భావోద్వేగాలకన్నా దేవుని యొక్క వాక్యం ముఖ్యము. మన భావోద్వేగాలను మనము కంట్రోల్ చేయాలి కానీ అవి మన నిర్ణయాలను కంట్రోల్ చేయకూడదు. యేసు ప్రభువు లో అనేక భావోద్వేగాలు మనము చూస్తాము. ఆయన కోపగించుకోవటం, కన్నీరు పెట్టడం, ఆశ్చర్య పోవడం మనం చూస్తాము. అయితే ఆ భావోద్వేగాలు ఆయనను నియంత్రించలేదు. ఒక బూతు జోక్ వేస్తె నవ్వేవారు ఉంటారు. అయితే మనము నవ్వము. ఎందుకంటే దేనికి నవ్వాలో, దేనికి బాధపడాలో మనలో ఉన్న దేవుని వాక్యము, దేవుని పరిశుద్దాత్మ మనకు తెలియజేస్తాయి.  సమ్సోను జీవితాన్ని దేవుని వాక్యము కన్నా అతని ఎమోషన్స్, అతని భావోద్వేగాలే ప్రభావితము చేయడం మనము చూస్తున్నాము. అతనొక బిగ్ బేబీ లాగా మనకు కనిపిస్తున్నాడు. బిగ్ బేబీ 6 అడుగులు, కండల తిరిగి దృఢముగా ఉన్నాడు, అయితే ఒక చిన్నపిల్లవాడుఒక ఆట వస్తువును కొంతసేపు ఆడుకొని వదలివేసినట్లు అతను కూడా మనుష్యులను ఆవిధముగా చూశాడు. 

     సమ్సోను ఫిలిష్తీయల మీద అనేక విజయాలు సాధించాడు. దేవుడు అతనికి ఎంతో గొప్ప శక్తియుక్తులు ఇచ్చాడు. అతని శక్తి ఎలా ఉందంటే, అతనికి వేసిన ఇనుప సంకెళ్లను దారము వలె త్రెంచివేశాడు. ఒక గాడిద దవడ ఎముకను తీసుకొని 1000 మంది శత్రువులను సంహరించాడు. 16 వచనములో చూస్తే, సమ్సోను గొప్పలు చెప్పుకొంటున్నాడు, ‘నా శక్తి చూడండి, ఒక గాడిద ఎముకతో వెయ్యి మందిని చంపాను’ అంటున్నాడు. ఎప్పుడూ తన గురించి గొప్పలు చెప్పుకోవటమే తప్ప అతడు దేవుని స్తుతించడం, దేవునికి కృతఙ్ఞతలు చెప్పడము మనకు కనిపించదు.

SamsonandDelilah.jpg

15:18 ఒక సారి అతనికి విపరీతముగా దాహము అయినప్పుడు దప్పికతో దేవునికి  మొఱపెట్టాడు.దేవుడు ఒక గోతిని చీల్చి అతని దాహం తీర్చాడు. ఆ నీరు అతని బ్రతికించింది.

16:1 సమ్సోను ఒక సారి గాజా వెళ్ళాడు. అక్కడ ఒక వేశ్యను అతడు దర్శించాడు. సమ్సోను నాజీరు చేయబడినవాడు. దేవుని కొరకు ప్రత్యేకముగా, పవిత్రముగా జీవించ వలసిన వాడు. అతడు వేశ్యల దగ్గరకు వెళ్ళకూడదు. అయితే సమ్సోను దేవుని ఆజ్ఞలను పూర్తిగా ఉల్లంఘించాడు. ఫిలిష్తీయులు అతనికొరకు మాటు వేశారు. గాజా తలుపులు బిగించారు. సమ్సోను  తన శక్తితో ఆపట్టణపు తలుపులను ఊడబెరికాడు.వాటిని ఎత్తుకొని హెబ్రోను పట్టణము దగ్గర పారవేశాడు. సామెతలు గ్రంథము 16:32 లోమనము చదువుతాము: పట్టణము పట్టుకొనువానికంటె తన మనస్సును స్వాధీన పరచు కొనువాడు శ్రేష్ఠుడు. తన చూపుకు నచ్చినదాని  బట్టే అతని ప్రవర్తన ఉంది తప్ప దేవుని వాక్యము బట్టి లేదు.

    ఈ రోజున మన ప్రపంచములో ఈ సమ్సోను సంస్కృతి చాలా బలముగా ఉంది. చాలా మంది సమ్సోను వలె జీవిస్తున్నారు. సమ్సోను తన కంటికి నచ్చింది చేశాడు,  ఏ యువతి కనిపిస్తే ఆమె వైపుకు ఆకర్షించబడ్డాడు.ఈ రోజు చాలామంది వారి కంటికి ఏది నచ్చితే అది చేస్తున్నారు. నాస్తికులు ఎలా జీవిస్తున్నారు? దేవుడు లేడు, నా దృష్టికి ఏది నచ్చితే అది చేస్తాను. క్రైస్తవ సమాజములో కూడా సమ్సోను సంస్కృతి చాలా విస్తరించింది. సమ్సోను కు దేవుని మీద నమ్మకం ఉంది. ‘దేవుని మీద నాకు నమ్మకం ఉంది . కానీ, బైబిల్ లో ఏముందో నా కనవసరము, దేవుని వాక్యము నేను పట్టించుకోవలసిన అవసరం లేదు, నా దృష్టికి ఏది నచ్చితే అది చేస్తాను’ అది సమ్సోను స్వభావం. దాని నుండి మనము బయటపడాలి. ప్రభువైన  యేసు క్రీస్తు దగ్గరకు వచ్చి, మన పాపములు ఒప్పుకొని, రక్షణ పొందాలి. ఆ తరువాత దేవుని వాక్యము ప్రకారము మనము జీవించాలి. అదే నేటి మా ప్రేమ సందేశము.