కరోనా బీభత్సం 

corona.jpg

ఈ రోజు ప్రపంచము మొత్తము కరోనా వైరస్ ను చూసి వణకిపోతున్నది . ఈ రోజు మనము ఈ కరోనా వైరస్ గురించి కొన్ని విషయాలు చూద్దాము. ప్రపంచము మొత్తము ఇప్పుడు కరోనా వైరస్ గుప్పిట్లో ఉంది.ఇంతకు ముందు అప్పుడప్పుడూ సార్స్ వైరస్, మెర్స్ వైరస్, ఎబోలా వైరస్ లాంటివి ప్రపంచ ప్రజలను ఆందోళనకు గురిచేశాయి. కానీ ప్రజలు వాటిని పెద్దగా పట్టించుకోలేదు.ఈ కరోనా వైరస్ మాత్రం అందరినీ భయపెడుచున్నది. చైనా దేశములో వూహన్ అనే నగరములో గత సంవత్సరము డిసెంబర్ నెల లో ఈ వైరస్ బయటపడింది. చైనా అధికారుల నిర్లక్ష్యము వలన చాలా సమయము వృథా అయ్యింది.

    లీ వెన్ లియాంగ్ అనే ఒక డాక్టర్ ముందుగా ఈ వ్యాధిని గుర్తించాడు. సోషల్ మీడియా లో ఈ వ్యాధి గురించి వ్రాశాడు. తీసుకోవలసిన జాగ్రత్తలను గురించి హెచ్చరించాడు. అయితే పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు. తప్పుడు వార్తలతో ప్రజలను భయపెడుతున్నావు అని ఆయనను హింసించారు. అలా కాకుండా, ఆయన మాట విని అత్యవసరముగా వైద్య చికిత్స అందించి, ఈ వైరస్ విస్తరించకుండా జాగ్రత్తలు తీసుకొని ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదేమో. ఈ వైరస్ ఇప్పుడు చైనా దేశానికి పరిమితము కాలేదు. దాదాపు 60 దేశాలకు విస్తరించింది. ప్రపంచ వ్యాప్తముగా ఇప్పటికే లక్షమందికి పైగా ఈ వైరస్ అంటుకుంది. వారిలో 3000 మందికి పైగా మృత్యువాత పడ్డారు.Screen Shot 2020-03-01 at 7.59.29 PM.png

    ఈ వైరస్ ప్రభావము ప్రపంచ వ్యాప్తముగా మనము చూస్తున్నాము. ప్రభుత్వాలు రెడ్ అలెర్ట్ , ఎమర్జెన్సీ ప్రకటిస్తున్నాయి. విమాన ప్రయాణాలు, రైలు ప్రయాణాలు, బస్సు ప్రయాణాలు తగ్గిపోయినాయి. మెట్రో రైళ్లలో తిరగటానికి ప్రజలు భయపడుతున్నారు. ప్రపంచ దేశాలు ఇతర దేశాల ప్రజలను నియంత్రించుట, అడ్డగించుట చూస్తున్నాము. పర్యాటక స్థలాలు ఖాళీ అవుతున్నాయి. పారిస్ నగరములో లూ మ్యూసియం పలచన పడింది. ఇటలీ లో వెనిస్ నగరములో సెయింట్ మార్క్స్ స్క్వేర్ లో జనం కనిపించుట లేదు, మిలాన్ లో ప్రఖ్యాత కాథెడ్రల్ దగ్గర జనము గుమికూడుట లేదు. ఇరాన్ లోని టెహరాన్ లో వీధులు ఖాళీ అయిపోయినాయి.పెద్ద పెద్ద స్టేడియం లను మంచాలతో నింపుతున్నారు.హాస్పిటల్ ళ్లలో రూములు నిండిపోయినాయి.ప్రత్యేక గదులు సిద్ధము చేస్తున్నారు.స్కూళ్లలో, కాలేజీలలో విద్యార్థులు తగ్గిపోయారు.హొలీ పండుగ ను వేలాది మందితో  చేసుకోవటం మన దేశములో సాంప్రదాయం.అయితే ఆ పండుగకు ప్రజలు గుమికూడవద్దు అని ప్రభుత్వము ప్రకటించింది.చైనా ప్రజలను కొన్ని చోట్ల వివక్షతో చూస్తున్నారు.వ్యక్తులు కలిసినప్పుడు షేక్ హ్యాండ్ లు ఇవ్వటం లేదు. హలో, హలో అని మాటలతో పలకరింపులు చేసుకొంటున్నారు. వ్యాపారాలు నష్టపోతున్నాయి. స్టాక్ ఎక్స్చేంజి లు కుప్పకూలటం చూస్తున్నాము. సినిమా షూటింగ్ లు రద్దవుతున్నాయి. సినిమా హాళ్లు ఖాళీ అవుతున్నాయి. ప్రపంచము మొత్తము ఒక సూక్ష్మ జీవికి దాసోహం అయ్యింది. 

     పీటర్ మేడవర్ గొప్ప శాస్త్రవేత్త. 1960 లో ఆయనకు నోబెల్ బహుమతి వచ్చింది. ఆయన వైరస్ ల మీద ఎంతో రీసెర్చ్ చేశాడు. వైరస్ లను ఆయన ‘viruses ‘a piece of bad news wrapped up in a protein’ అని పిలిచాడు. వైరస్ లు ప్రోటీన్ లో చుట్టబడిన దుర్వార్తలు. ఆ దుర్వార్తలను ఈ రోజు మనము ప్రపంచము మొత్తము నుండి వింటున్నాము. ఇవి అనేక రూపాల్లో ఉంటాయి. ఈవైరస్ లలో DNA లేక RNA ఉంటుంది.ఇది జన్యు పదార్ధము. ఈ జన్యు పదార్థము చుట్టూ ప్రోటీన్ పొర ఉంటుంది. ఈ వైరస్ మన శరీరములో కణము మీద వాలుతుంది. తనలో ఉన్న జన్యు పదార్ధాన్ని మన కణములోకి  పంపుతుంది. మన కణ వ్యవస్థలను అది స్వాధీనం చేసుకొంటుంది. తన జన్యు పదార్ధాన్ని వేగముగా విస్తరిస్తుంది. మన శరీర కణాలు వాటి ప్రోటీన్లను తయారు చేయకుండా, ఈ వైరస్ ప్రోటీన్లను తయారు చేస్తాయి. ఈ వైరస్ లు మన శరీరాన్ని ఆ విధముగా హైజాక్ చేస్తాయి.

ఈ పరిస్థితుల్లో మనము ఎలా జీవించాలి అనే ప్రశ్న మనకు వస్తుంది. 7 విషయాలు మీకు చెప్పాలని నేను ఆశపడుతున్నాను. 

1. భయపడకూడదు

     మొదటిగా మనము భయపడకూడదు. ఈ వైరస్ లను చూసి మనము భయపడితే మన విశ్వాసానికి అర్థము  లేదు. ఈ కరోనా వైరస్ మన శరీరములో ఉన్న ఆరోగ్యాన్ని హైజాక్ చేయగలదేమో కానీ మన హృదయములో ఉన్న విశ్వాసాన్ని, దేవుని ప్రేమను అది హైజాక్ చేయలేదు. కరోనా వచ్చినవారిలో 3.4 శాతము మంది మృత్యువాత పడుతున్నారు అని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పింది. అంటే 96 శాతము మంది ఈ వైరస్ సోకినప్పటికీ ప్రాణాలతో బయటపడగలుగుతున్నారు. 14 శతాబ్దములోయూరప్ లో బ్లాక్ ప్లేగ్ వచ్చినప్పుడు 20 కోట్ల మంది చనిపోయారు. యూరప్ లోమూడో వంతు మృత్యువాత పడింది. అయితే ఆ పరిస్థితి ఇప్పుడు రాదు. ఎందుకంటే, అమెరికా, యూరప్, ఇశ్రాయేలు దేశాలు ఈ వైరస్ కి వాక్సిన్ చేయటానికి రాత్రి, పగలు కష్టపడుతున్నాయి. ఆందోళన చెంది మనం సాధించేది ఏమీ ఉండదు. ఆందోళన, స్ట్రెస్ వలన మన ఇమ్మ్యూనిటి తగ్గిపోయే ప్రమాదం కూడా ఉంది. 

2. తీర్పులు ఇవ్వకూడదు 

    రెండోదిగా మనము తీర్పులు ఇవ్వకూడదు. కొంతమంది ఏమంటున్నారంటే, దేవుడు ఈ దేశాన్ని శిక్షిస్తున్నాడు అందుకనే ఈ వైరస్ ని పంపాడు, దేవుడు ఈ జాతి వారిని శిక్షిస్తున్నాడు, అందుకనే ఈ కరోనా వచ్చింది. దేవుడు ఈ పాపాన్ని శిక్షిస్తున్నాడు. అందుకనే ఈ ఉపద్రవం వచ్చింది అనే వారు ఉన్నారు. అటువంటి తీర్పులు ఇవ్వటం వలన ప్రయోజనం ఉండదు. ఈ సందర్భములో యేసు ప్రభువు చెప్పిన మాటలు మనము జ్ఞాపకము చేసుకొంటే మనకు మంచిది.

లూకా 13 అధ్యాయము చూద్దాము

  1. పిలాతు గలిలయులైన కొందరి రక్తము వారి బలులతో కలిపియుండెను. ఆ కాలమున అక్కడనున్న కొందరు ఆ సంగతి యేసుతో చెప్పగా  2. ఆయన వారితో ఇట్లనెను ఈ గలిలయులు అట్టి హింసలు పొందినందున వారు గలిలయులందరికంటె పాపులని మీరు తలంచు చున్నారా? 3. కారని మీతో చెప్పుచున్నాను; మీరు మారుమనస్సు పొందనియెడల మీరందరును ఆలాగే నశింతురు. 
  2. మరియు సిలోయములోని గోపురము పడి చచ్చిన ఆ పదునెనిమిదిమంది, యెరూషలేములో కాపుర మున్నవారందరికంటె అపరాధులని తలంచుచున్నారా? 
  3. కారని మీతో చెప్పుచున్నాను; మీరు మారుమనస్సు పొందనియెడల మీరందరును ఆలాగే నశింతురు. లూకా 13:1-5 

    ఇక్కడ యేసు ప్రభువు తన శిష్యులకు రెండు సంఘటనలు చెప్పాడు. మొదటిది మనిషి  చేసే హాని, రెండోది ప్రకృతి చేసే హాని.

Human evil – మనిషి చేసే హాని

Natural evil – ప్రకృతి చేసే హాని

    మొదటిగా మనిషి చేసే హాని, Human evil పిలాతు మీద కొంతమంది గలిలయులు ఎదురుతిరిగారు.పిలాతు ఏమి చేశాడంటే, వారిని చంపి వారి రక్తాన్ని బలులతో కలిపాడు.అది విని ప్రజలందరూ వణకిపోయి, తన మీద తిరుగుబాటు చేయకుండా ఉంటారు అనేది పిలాతు ఆలోచన. యేసు ప్రభువు ఇక్కడ ఏమని చెబుతున్నాడంటే, పిలాతు చేతిలో చనిపోయిన ఆ అమాయకులు ఇతురుల కంటే పాపాత్ములా? కాదు. మారుమనస్సు పొందక పోతే మీరందరూ అలాగే నశిస్తారు.

చనిపోయిన వారు పాపాత్ములు కాదు, బ్రతికున్నవారు పుణ్యాత్ములు కాదు.

    రెండో సంఘటనలో ఆయన ప్రకృతి చేసే హాని గురించి చెప్పాడు. natural evil. సిలోయములో గోపురము పడి 18 మంది ప్రాణాలు కోల్పోయారు. అది ప్రకృతి చేసిన హాని. గోడలు కూలిపోవటం, గోపురాలు కూలిపోవటం, తుఫానులు, కరువులు, వరదలు, భూకంపాలు, కరోనా లాంటి అంటు వ్యాధులు ఇవి ప్రకృతి చేసే హాని. Natural Evil. ఇవి, ఎప్పుడు ఎవరి మీదకు వస్తాయో మనము చెప్పలేము. ఇక్కడ సిలోయము గోపురము కూలి 18 మంది అమాయకులు చనిపోయారు. యెరూషలేములో ఉన్న ప్రజలందరికంటే వారు పాపాత్ములా? యేసు ప్రభువు ఆ ప్రశ్న వారికి వేశాడు. సమాధానము కూడా ఆయనే చెప్పాడు. కాదు. గోపురం క్రింద పడి చనిపోయినవారు బ్రతికున్న వారి కంటే పాపాత్ములు కాదు. ఆ సత్యము మనం గ్రహించాలి.చనిపోయిన వారు పాపాత్ములు కాదు, బ్రతికున్నవారు పుణ్యాత్ములు కాదు. అందరూ దేవుని కృపవలనే జీవించగలరు. యేసు ప్రభువు వారితో ఏమన్నాడంటే, మారుమనస్సు పొందక పోతే మీరందరూ అలాగే నశిస్తారు.

3.సేవ చేయాలి 

    మూడోదిగా మనము సేవ చేయాలి. క్రైస్తవుల ప్రత్యేకత ఏమిటంటే వారు అన్ని సందర్భాల్లో సేవ చేస్తారు. క్రీ.శకం 165 – 180 ల మధ్య రోమ్ లో పెద్ద ప్లేగు రోగం వచ్చింది. పెద్ద సంఖ్యలో ప్రజలు చనిపోవుతున్నారు. గాలెన్ అనే ప్రఖ్యాత వైద్యుడు ఆ రోజుల్లో ఉండేవాడు. ఆయన ఒక ఉత్తరము వ్రాసి పారిపోయాడు. ‘పెద్ద సంఖ్యలో జనము చనిపోతున్నారు. వారి కోసము నా ప్రాణాన్ని పణంగా పెట్టలేను.’ అని వ్రాసి వెళ్ళిపోయాడు. అయితే క్రైస్తవ డాక్టర్లు, నర్సులు పారిపోకుండా ప్రజలకు వైద్య సేవలు అందించారు. ప్రజలు అది చూసి దేవుని మహిమపరచారు. యేసు క్రీస్తును మహిమపరచారు. ఈ రోజు చైనా దేశములో క్రైస్తవ డాక్టర్లు, నర్సులు ముందుండి వైద్య సేవలు అందిస్తున్నారు. వారిని చూసి చైనా ప్రజలు దేవుని స్తుతిస్తున్నారు. నా హాస్పిటల్ లో కూడా ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్నాను. 

    ఒక కాలేజ్ స్టూడెంట్ నా దగ్గరకు వచ్చాడు.అతడికి జ్వరం వచ్చింది.‘డాక్టర్, నాకు కరోనా వచ్చిందా?’ అని అడిగాడు.అతడు ఆందోళనతో కృంగిపోయాడు.నేను అతనికి పరీక్షలు చేస్తే అది ఫ్లూ జ్వరం అని తేలింది. అతనికి మందులు వ్రాసి, ధైర్యము చెప్పి ఇంటికి పంపించాను. నీకు వచ్చింది కరోనా కాదు, ఫ్లూ జ్వరం అని చెప్పినప్పుడు అతను ప్రశాంతతతో ఊపిరి పీల్చుకున్నాడు.జలుబు, దగ్గు, జ్వరం చూసి ‘కరోనా’ అని మనం ఆందోళన చెందకూడదు. మనము ప్రజలకు ఫేస్ మాస్కులు పంపిణీ చేయాలి, బహిరంగ ప్రదేశాలలో రోగాలను నిరోధించే రసాయనాలు చల్లాలి. రోగులకు వైద్య సేవలు అందించాలి. 

4.ప్రార్ధన చేయాలి

     నాలుగవదిగా మనము ప్రార్ధన చేయాలి. అన్ని సందర్భాల్లో మనము ప్రార్ధన చేయాలి. ఇలాంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ప్రజలకు దేవుని మీద విశ్వాసము సన్నగిల్లే ప్రమాదం ఉంది. 1755 లో పోర్చుగల్ దేశములోని లిస్బన్ నగరములో పెద్ద భూకంపం, సునామీ కలిగినాయి. లక్షమంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు.యూరప్ లో చాలా మందికి దేవుని మీద విశ్వాసం పోయింది. వోల్టాయిర్ అనే ఫిలాసఫర్ ఉండేవాడు. ప్రార్థన చేసేవారిని ఆయన వెక్కిరించాడు. ప్రార్థన చేసి మీరు సాధించేది ఏమీ లేదు అన్నాడు.

Screen Shot 2020-03-05 at 1.41.36 PM

    అమెరికా లో ఇప్పుడు కరోనా 18 రాష్ట్రాలకు పాకింది. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కరోనా ను ఎదుర్కొనే బాధ్యతను ఆ దేశ ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ కు అప్పగించాడు. మైక్ పెన్స్ మంచి క్రైస్తవ విశ్వాసి. వైట్ హౌస్ లో తన సహచరులతో కలిసి దేవుని సహాయం కోసం ప్రార్థన చేశాడు. ఆ ఫోటో బయటికి వచ్చింది. అది చూసి చాలా మంది అమెరికన్లు సోషల్ మీడియా లో విమర్శలు చేస్తున్నారు. ప్రార్థన వలన ప్రయోజనం ఉండదు అంటున్నారు. ప్రార్థన వలన నష్టమే తప్ప లాభం లేదు అని వీరు అంటున్నారు. వీరు చరిత్రను మరచిపోయారు. ప్రార్థన చేసి జార్జ్ వాషింగ్టన్ బ్రిటిష్ వారి నుండి మీకు స్వాతంత్రం తీసుకురాలేదా? ప్రార్ధన చేసి అబ్రహం లింకన్ సివిల్ వార్ నుండి మీ దేశాన్ని రక్షించలేదా? ప్రార్ధన చేసి రూస్ వెల్ట్ రెండో ప్రపంచ యుద్ధములో మీ దేశాన్ని రక్షించలేదా? ఇప్పుడు మైక్ పెన్స్ ప్రార్థన చేస్తే తప్పేంటి? మనకు దేవుని సహాయము కావాలంటే మనము ప్రార్థన చేయాలి. 

ఎఫెసీ 6:18 లో మనము చదువుతాము.

ఆత్మవలన ప్రతి సమయమునందును 

ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుడి.

             ఎఫెసీ 6:18

Pray in the Spirit on all occasions

with all kinds of prayers and requests

ప్రతి సమయములో మనము ప్రార్థన చేయాలి అని అపోస్తలుడైన పౌలు గారు ఇక్కడ వ్రాశాడు.

5.మన స్థితిని గమనించాలి 

    ఐదోదిగా మన స్థితిని గమనించాలి. ప్రార్థన దండగ అనుకొనే వారు ఆ పరిస్థితిలో ఎందుకు ఉన్నారు? వారికి దేవుని వాక్యము మీద నమ్మకము లేదు. మానవ శక్తి, జ్ఞానముల మీద వారి ఆశ పెట్టుకొన్నారు. ఆధునిక యుగములో శాస్త్ర, సాంకేతిక రంగాలలో మానవ సమాజము ఎంతో ప్రగతి సాధించింది. సంతోషమే. అయితే మాకు దేవుడు అక్కరలేదు, ప్రార్థన అక్కర లేదు, మానవ జ్ఞానముతో, మానవ శక్తితో మేము అన్నిటినీ శాసించగలము అనుకొనే వారు మన సమాజములో పెరిగిపోయారు. ఈ కరోనా ను చూసి వారు నేర్చుకొనవలసిన పాఠము ఒకటి వుంది. మానవుడు ఎంత ప్రగతి సాధించినా ప్రకృతిని నియంత్రించలేడు.

ఒక తుఫానును ఆపే శక్తి మనిషికి ఉందా? 

ఒక భూకంపాన్ని ఆపే శక్తి ఏ సైంటిస్ట్ కైనా ఉందా? 

కరోనా ని ఆపే శక్తి ఏ దేశ నాయకుడికైనా ఉందా? 

Screen Shot 2020-03-07 at 4.54.16 PM.png

    ఈ మధ్యలో భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గారు మాన్ వర్సెస్ వైల్డ్ అనే ఒక టీవీ కార్యక్రమములో బేర్ గ్రిల్స్ అనే పర్యాటకుడితో కలిసి పాల్గొన్నాడు. వారిద్దరూ కలిసి హిమాలయ పర్వతాల సమీపములో అడవిలో తిరిగారు. ఒక చోట బేర్ గ్రిల్స్ మోడీ గారికి ఒక కత్తి ని  కఱ్ఱకు కట్టి ఇస్తాడు. మోడీ ని చూసి బేర్ గ్రిల్స్ ఒక మాట అంటాడు: ‘మోడీ, నువ్వు భారత దేశానికి ప్రధాన మంత్రివి, అందరి కంటే శక్తి మంతుడివి, అయితే ఆ అధికారము ఈ అడవిలోనిన్ను కాపాడలేదు. ఇక్కడ పులులు, మొసళ్ళు, ఏనుగులు, పాములు ఉంటాయి. వాటి నుండి నిన్ను నువ్వే కాపాడుకోవాలి’ అంటాడు. మోడీ ఏమంటాడంటే, ‘ప్రతి మనిషి జీవితము దేవుని మీద ఆధారపడి ఉంటుంది’ ఆ అడవిలో ఆ ఇద్దరూ కొన్ని రోజులు కలిసి జీవించారు, ఎండలో నడిచారు, వానలో తడిశారు. చివరకు యాత్ర ముగించేటప్పుడు ఇద్దరూ ప్రార్థన చేసి వీడ్కోలు చెప్పుకొన్నారు. ప్రకృతి ముందు దేవుని కృప లేకుండా, దేవుని సహాయం లేకుండా మనం నిలబడలేము. ఆ గ్రహింపు వారిలో ఉంది. అటువంటి దీనత్వము చాలా మందిలో మనకు కనిపించుట లేదు. వారు ప్రార్థన చేయకపోగా, ప్రార్థన చేసేవారిని విమర్శిస్తున్నారు. 

    దేవుడు ఉంటే ఎందుకు ఈ కరోనా లాంటివి మన మీదకు వస్తున్నాయి అని వారు ప్రశ్నిస్తున్నారు. బైబిల్ లో వారి ప్రశ్నలకు సమాధానం ఉంది. ఆదికాండము చదవండి. ఆది దంపతులు ఆదాము, హవ్వ దేవుని మాటను అతిక్రమించినప్పుడు ఏదెను వనములో పాపము మానవ జాతిలోకి ప్రవేశించింది. అప్పుడే మానవ పతనము ప్రారంభమయ్యింది. ప్రకృతి శపించబడింది. ఈ ప్రకృతి పరిపూర్ణమైనది అని దేవుడు బైబిల్ లో ఎక్కడా చెప్పలేదు. ప్రకృతి ఈ రోజుకీ శాపము క్రిందే ఉంది.అందుకనే తుఫానులు, భూకంపాలు, కరోనా లాంటి అంటు వ్యాధులు మన ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తూ ఉంటాయి. ప్రభువైన యేసు క్రీస్తు తిరిగి వచ్చే వరకు ప్రకృతి మీద ఉన్న శాపము తొలగిపోదు. ఆయన వెయ్యేళ్ళ పాలనలో ప్రకృతి తిరిగి పూర్వ వైభవము పొందుతుంది.ఏదెను తోటలాగా మారుతుంది. కరోనా లాంటి వ్యాధులు ఆయన రాజ్యములో ఉండవు.ప్రకృతి మీద ప్రస్తుతము ఉన్న శాపమును మనిషి తీసివేయలేడు. ఆ సత్యము మనం గ్రహించాలి. 

6.సువార్త ప్రకటించాలి 

   ఆరవదిగా మనము సువార్త ప్రకటించాలి. పాపం ఒక వైరస్ లాంటిది. ఈ కరోనా వైరస్ చైనా లో ఒక్క వ్యక్తితో మొదలుపెట్టి ఇప్పుడు ప్రపంచము మొత్తాన్ని చుట్టుముట్టింది.పాపము కూడా ఆదాముతో మొదలై ఇప్పుడు ప్రతి వ్యక్తికీ అంటుకుంది. మీది ఏ ఊరు, ఏ దేశము, ఏ భాష, ఏ మతం ఈ కరోనా వైరస్ పట్టించుకోదు. అదే విధముగా పాపము కూడా ఏ బేధము లేకుండా అందరినీ నరకమునకు లాక్కొని వెళ్తున్నది.ఒక వైద్యుడు నా దగ్గర కరోనా కు మందు ఉంది అని ప్రకటిస్తే ప్రపంచము మొత్తం ఆయన ముందు నిలబడదా? యేసు ప్రభువు మనతో చెబుతున్నది అదే. పాపము నుండి నిన్ను రక్షించే మందు నా దగ్గర ఉంది.నరకము నుండి నిన్ను రక్షించే మార్గము నా దగ్గర ఉంది. ఈ యేసు క్రీస్తు మహిమ సువార్తను మనము ఈ సమయములో రక్షణ లేని వారికి అందించాలి.

 7. నిరీక్షణ కలిగి ఉండాలి 

ఏడవదిగా మనము నిరీక్షణ కలిగి ఉండాలి. యెషయా 40 అధ్యాయములో మనము చదువుతాము. 

బాలురు సొమ్మసిల్లుదురు అలయుదురు ¸

యౌవనస్థులు తప్పక తొట్రిల్లుదురు

యెహోవాకొరకు ఎదురు చూచువారు

నూతన బలము పొందుదురు 

వారు పక్షిరాజులవలె రెక్కలు చాపి పైకి

ఎగురుదురు 

అలయక పరుగెత్తుదురు

సొమ్మసిల్లక నడిచిపోవుదురు. యెషయా 40:30-31

యువకులు, ఎంతో  బలవంతులు కూడా తొట్రిల్లే  పరిస్థితులు వస్తాయి. అయితే, దేవుని మీద నిరీక్షణ కలిగిన వారికి నూతన బలము కలుగుతున్నది. కరోనా బీభత్సము లో మనము చేయవలసిన 7 పనులు ఈ రోజు మనము చూశాము. 

భయపడకూడదు

తీర్పులు ఇవ్వకూడదు 

సేవ చేయాలి 

ప్రార్ధన చేయాలి

మన స్థితిని గమనించాలి 

సువార్త ప్రకటించాలి 

నిరీక్షణ కలిగి ఉండాలి 

 

     రక్షణ పొందని వారు వెంటనే రక్షణ పొందాలి.  డైమండ్ ప్రిన్సెస్ క్రూజ్ షిప్ లో 3000 మందికి పైగా ప్రయాణికులు విహారయాత్రలు చేస్తూ ఉన్నారు. వారిలో ఒక్కడికి కరోనా అంటుకుంది. జపాన్ హార్బర్ లో ఆ ఓడను ఉంచారు. ఆ ప్రయాణికులు కరోనా ను చూడలేకపోయారు. సంతోషముగా ఆ ఓడలో వారు గడుపుతున్నారు. సముద్రములో ఆ ఓడ అనేక పట్టణములకు వారిని తీసుకొని వెళ్తున్నది. వారు ఈతలు వేస్తున్నారు. విందులు, వినోదాలు చేసుకొంటున్నారు. డాన్సులు వేస్తున్నారు, మద్యపానం చేస్తున్నారు, కబుర్లు చెప్పుకొంటున్నారు.అయితే వారిని కరోనా వైరస్ అంటుకోవటం వారు గమనించలేకపోయారు. కరోనా వారి శరీరాల్లో ప్రవేశించి అనేక మంది ప్రాణాలు తీసింది. వారు మంచి ప్రయాణాన్ని ఆశించారు కానీ కరోనాని కలలో కూడా ఊహించ లేదు. 

యాకోబు పత్రికలో మనము చదువుతాము.

నేడైనను రేపైనను ఒకానొక

 పట్టణమునకు వెళ్లి అక్కడ ఒక 

సంవత్సరముండి వ్యాపారముచేసి లాభము 

సంపాదింతము రండని చెప్పుకొనువార లారా,

రేపేమి సంభవించునో మీకు తెలియదు. 

మీ జీవమేపాటిది? మీరు కొంతసేపు

 కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటివారే.

కనుకప్రభువు చిత్తమైతే మనము 

బ్రదికియుండి ఇది అది చేతమని 

చెప్పుకొనవలెను.యాకోబు 4:13-15

    మన సమాజము కూడా అలాగే ఉంది. పాపము ఒక వైరస్ వలె మన జీవితాల్లో ప్రవేశించింది. అది మనలను మరణము వైపుకు ఈడ్చుకొని వెళ్తున్నది. దాని నుండి మనలను రక్షించడానికి దేవుడు మనకు ఒక వాక్సిన్ సిద్ధము చేశాడు. అదే యేసుక్రీస్తు సిలువ. ఆయన సిలువ దగ్గరకు వచ్చి మనము మన పాపములు ఒప్పుకోవాలి. యేసు ప్రభువును రక్షకునిగా అంగీకరించాలి.ఆ రక్షణ ఈ రోజు మీకు కలగాలన్నదే నేటి మా ప్రేమ సందేశము.

 

Please make a donation to our ministry

We are sustained by donations averaging about $20. Only a tiny portion of our readers give. Please support us to keep us online and growing. Thank you.

$20.00