ధర్మ శాస్త్రము – క్రీస్తు

 దేవుడు ఇశ్రాయేలీయులను ఐగుప్తు నుండి విడిపించాడు. ఫరో బానిసత్వము నుండి విడిపించాడు. దేవుడు లేకుండా స్వేచ్ఛ ఉండదు. స్వేచ్ఛను పొంది అరణ్యములోకి వారు వెళ్లారు. సీనాయి కొండ దగ్గరకు వచ్చారు. ఆ కొండ దగ్గర వారు 11 నెలలు ఉన్నారు. అక్కడ దేవుడు వారితో ఒక నిబంధన చేశాడు. నేను ఎవరిని? మీరు ఎవరు? వారితో చెప్పాడు. వారితో ఒక కాంట్రాక్టు చేశాడు. 4 వచనము చూద్దాము: 

నేను ఐగుప్తీయులకు ఏమి చేసితినో, 

మిమ్మును గద్ద రెక్కలమీద మోసి 

నా యొద్దకు మిమ్ము నెట్లు 

చేర్చు కొంటినో మీరు చూచితిరి.

ఒక గద్ద తన పిల్లల కోసము గూడు కట్టుతుంది. వాటికి ఆహారము ఇచ్చి పోషిస్తుంది. వాటిని శత్రువుల నుండి సంరక్షిస్తుంది. తన రెక్కల మీద వాటిని మోస్తుంది. దేవుడు ఆ విధముగా ఇశ్రాయేలీయులను పోషించాడు, సంరక్షించాడు, తన రెక్కల మీద వారిని మోసాడు. 

5 వచనము 

మీరు సమస్తదేశ జనులలో నాకు స్వకీయ సంపాద్య మగుదురు. 

A peculiar Treasure unto me 

మీరు నా స్వకీయ సంపాద్యము

మీరు నేను సంపాదించిన ఆస్తి

మీరు విమోచినబడిన వారు

మనలను విమోచించుటకు దేవుడు ఎంత గొప్ప క్రయధనము చెల్లించాడు?

ఆయన తన రక్తాన్ని సిలువ మీద చిందించాల్సి వచ్చింది (అపో.కార్య 20:28)

ఈ రోజు దేవుడు మనతో ఏమంటున్నాడంటే, మీరు నా స్వకీయ సంపాద్యము – A peculiar Treasure unto me ఆ తరువాత 6 వచనము చూద్దాము. మీరు నాకు యాజక రూపకమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనము గాను ఉందురని చెప్పుము. 

    దేవుడు ఇశ్రాయేలీయులను ఒక యాజక రాజ్యముగా చేసుకొన్నాడు.A Kingdom of Priests ఒక యాజకుడు ప్రజలందరి తరుపున దేవుని యొద్దకు వెళ్తాడు. దేవుని తరుపున ప్రజల ముందుకు వస్తాడు. ఇశ్రాయేలీయులు – ఆ దేశం మొత్తానికి దేవుడు ఒక యాజక ధర్మాన్ని ఇచ్చాడు. వారు దేవునికి, ఈ ప్రపంచానికి మధ్య యాజకునిగా ఉన్నారు, మధ్యవర్తిగా ఉన్నారు. దేవుని సందేశాన్ని మనకు ఇచ్చారు. మన వినతులను దేవుని ముందు పెట్టారు. ప్రభువైన యేసు క్రీస్తు యూదులలో నుండి వచ్చినవాడే. ఆయన మన ప్రధాన యాజకుడు. రక్షించ బడిన ప్రతి విశ్వాసీ ఒక యాజకుడే.

ఆ తరువాత మీరు పరిశుద్ధ జనము.A Holy Nation : ఇశ్రాయేలీయులారా, మీరు ఇతరుల వలె జీవించకూడదు, మీరు మీ చుట్టూ ఉన్న అన్యజనులవలె బ్రతకకూడదు. మీరు పరిశుద్ధ జనము. మీరు నా కోసం ప్రత్యేకముగా జీవించాలి. నేను మీకు ఈ సీనాయి కొండ మీద ప్రత్యక్షమవుతాను అని వారికి చెప్పాడు. దేవుడు అగ్నితో సీనాయి పర్వతము మీదకు దిగి వచ్చాడు. ఆ పర్వతము కంపించింది. గొప్ప బూర ధ్వని వినిపించింది. దేవుని ప్రత్యక్షత చూసి ప్రజలందరూ వణకిపోయారు. మోషే వారి తరుపున సీనాయి పర్వతము మీదకు వెళ్ళాడు.

దేవుడు వారికి తన ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. వారిని ఒక ప్రత్యేక జనాంగముగా చేశాడు. ఆ మూడు మాటలు మీరు గుర్తుపెట్టుకోండి.

A Peculiar Treasure, 

A Kingdom of Priests, 

A Holy Nation 

నా స్వకీయ సంపాద్యము

యాజక రాజ్యము

పరిశుద్ధమైన జనము.

     దేవుడు వారితో ఏమంటున్నాడంటే, 

మీరు ఎంతో విలువైన వారు: మీరు నా స్వకీయ సంపాద్యము

మీకొక కర్తవ్యము ఉంది: మీరు నాకు యాజకులు

మీకొక బాధ్యత ఉంది: మీరు నాకు ఒక పరిశుద్ధమైన జనము.

ఇశ్రాయేలీయులు అరణ్యములో ఉన్నారు, కొండల మధ్యలో ఉన్నారు. కట్టుబట్టలతో ఉన్నారు, వారికి ఆస్తిపాస్తులు లేవు. అయితే దేవుడు వారి జీవితానికి ఒక అర్ధం ఇచ్చాడు. దేవుడు వారి జీవితానికి ఒక పర్పస్ ఇచ్చాడు. దేవుడు వారి జీవితానికి ఒక భాద్యత ఇచ్చాడు. ఒక కర్తవ్యము ఇచ్చాడు.

దేవుడు మీతో ఉంటే, మీరు అరణ్యములో ఉన్నా,  మీ జీవితానికి ఒక విలువ ఉంటుంది, 

మీ జీవితానికి మీనింగ్ (అర్ధం ఉంటుంది), 

మీ జీవితానికి ఒక పర్పస్ ఉంటుంది, 

మీ జీవితానికి ఒక లక్ష్యం ఉంటుంది. 

     దేవుడు లేకపోతే, మీరు ఒక నగరములో ఒక విలాసవంతమైన జీవితము జీవిస్తున్నప్పటికీ మీ జీవితానికి విలువ ఉండదు, మీ జీవితానికి ఏ మీనింగ్ ఉండదు, పర్పస్ ఉండదు, లక్ష్యం ఉండదు. 

ఇంగ్లాండ్ లో ఈ మధ్యలో సన్ పత్రిక ఒక సర్వే చేసింది. మీ జీవితానికి అర్ధం ఉందా? మీ జీవితానికి పర్పస్ ఉందా? అని అన్ని వయస్సుల ప్రజలను అడిగారు. 16 నుండి 29 ఏళ్ళ వయస్సుల మధ్య 

యువతీయువకులలో 89 శాతము మంది ఏమన్నారంటే, మా జీవితానికి అర్ధం లేదు, మా జీవితానికి ఎలాంటి లక్ష్యం లేదు. ఒక అభివృద్ధి చెందిన దేశములో సకల సుఖాలు వారికి ఉన్నప్పటికీ మా జీవితానికి అర్ధము లేదు అని వారు అంటున్నారు. ఈ రోజు ఎంత హ్యాపీ గా ఉన్నామో అదే మాకు ముఖ్యము అంటున్నారు. వారు ఆ విధముగా ఎందుకు మాట్లాడుచున్నారంటే, వారి జీవితాల్లో దేవుడు లేడు. 

     రిచర్డ్ డాకిన్స్ లాంటి నాస్తికుల మాటలు వారు వింటున్నారు. డాకిన్స్ ఏమంటాడంటే, ‘దేవుడు లేడు, you dance to your DNA, మీ డిఎన్ఏ కి మీరు డాన్స్ వేస్తున్నారు, మీ జీన్స్ ఎలా నడిపిస్తే మీ ప్రవర్తన అలా ఉంటుంది. మీ జీవితానికి అర్ధం లేదు’ ఒక రోజుల్లో విన్స్టెన్ చర్చిల్ లాంటి గొప్ప నాయకులు ఇంగ్లాండ్  ని పరిపాలించారు. దేవుడు మనకు ఇచ్చిన స్వేచ్ఛను, స్వాతంత్రాన్ని ఎలాగైనా కాపాడుకోవాలి అని చర్చిల్ అనేవాడు. రెండో ప్రపంచ యుద్ధకాలములో హిట్లర్ లండన్ మీద దాడి చేసినప్పుడు, బ్రిటన్ అస్తిత్వమే ప్రశ్నార్ధకమయ్యింది. అయితే చర్చిల్ హిట్లర్ కి భయపడలేదు. ఎట్టి పరిస్థితుల్లో లొంగి పోయేది లేదు, దేవుడిచ్చిన స్వేచ్ఛను పోరాడి కాపాడుకొంటాము అన్నాడు. నాటి తరానికి చర్చిల్ హీరోగా ఉండేవాడు, నేటి తరానికి రిచర్డ్ డాకిన్స్ హీరో గా మారాడు. అందుకనే వీరు మా జీవితానికి అర్ధం లేదు, లక్ష్యం లేదు అంటున్నారు. ఇశ్రాయేలీయులకు డబ్బు లేదు, విలాసాలు లేవు, కట్టుబట్టలతో  వారు అరణ్యములో ఉన్నారు.అయితే దేవుడు వారి జీవితానికి ఒక అర్ధం ఇచ్చాడు, ఒక బాధ్యత ఇచ్చాడు, ఒక లక్ష్యం ఇచ్చాడు.

     20 అధ్యాయములో దేవుడు వారికి 10 ఆజ్ఞలు ఇచ్చాడు. అవి వ్రాయడానికి ఒక్క తెల్ల కాగితము మీద చాలు.వాటిని మనము అనుసరిస్తే అవి మన జీవితానికి, మన కుటుంబాలకు ఎంతో ఆశీర్వాదము.

మొదటి ఆజ్ఞ: నీ దేవుడైన యెహోవాను నేనే, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. దేవుడు మనతో ఒక వ్యక్తిగత సంభందాన్ని కోరుకొంటున్నాడు.

రెండవ ఆజ్ఞ: నన్ను తప్ప ఇంకెవ్వరినీ ఆరాధించకూడదు. నీవు విగ్రహములు చేసికొనకూడదు. కొంతమంది భౌతిక విగ్రహాలు పెట్టుకొంటారు. ఇంకొంతమందికి మానసిక విగ్రహాలు ఉంటాయి. ఆ విగ్రహాలకు మనం దూరముగా ఉండాలి.

మూడవ ఆజ్ఞ: నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. దేవుని మీద జోకులు వేసే వాళ్ళు మన సమాజములో ఉన్నారు. బూతులు తిడుతూ దేవుని నామాన్ని దూషించే వాళ్ళు ఉన్నారు. మనమైతే దేవుని పేరును వ్యర్థముగా ఉచ్చరించకూడదు.

నాలుగవ ఆజ్ఞ: విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుము. ప్రతి ఆదివారము మనము దేవునికి కేటాయించాలి. 

ఐదవ ఆజ్ఞ: నీ తండ్రిని, నీ తల్లిని సన్మానించుము. మనం తల్లిదండ్రులను గౌరవించాలి, వారికి మనం సహాయము చేయాలి. 

సామెతలు గ్రంథము లో సొలొమోను రాజు వ్రాశాడు: 

తన తండ్రినైనను తల్లినైనను 

దూషించువాని దీపము 

కారుచీకటిలో ఆరిపోవును. (20:20) 

     తల్లి దండ్రులను దూషించే వారి దీపము ఆరిపోతుంది అని సామెతలు గ్రంథములో మనము చదువుతున్నాము. వృద్ధాప్యములో ఉన్న తల్లిదండ్రులను చాలా మంది వదలివేస్తూ ఉన్నారు. కొన్ని దేశాల్లో యూథనేసియా ప్రవేశపెట్టారు. వృద్ధులకు డాక్టర్ ల చేత మత్తుమందులు ఇచ్చి వారి ప్రాణాలు తీస్తున్నారు. మనమందరమూ ఏదో ఒక రోజు వృద్ధులము అవుతాము. అలాంటి వ్యవస్థను ఈ రోజు మనము నిర్మిస్తే, రేపు ఆ వ్యవస్థ లో చిక్కుకొని మనం కూడా బాధితులము అవుతాము. రేపు మనకు కూడా అదే గతి పడుతుంది. వృద్ధులను గౌరవించి వారిని సంరక్షించాల్సిన బాధ్యత మన మీద ఉంది. 

ఐదవ ఆజ్ఞ లో నీ తండ్రిని, నీ తల్లిని సన్మానించుము అని దేవుడు మనకు ఆజ్ఞాపించాడు. 

ఆరవ ఆజ్ఞ: నరహత్య చేయకూడదు.మానవ ప్రాణము దేవుడు చేసింది. దానిని తీసుకొనే హక్కు ఎవరికీ లేదు. నరహత్యలు చేసే నరకానికి వెళ్తారు. ఎందుకంటే ప్రతి హత్యా దేవుని మీద దాడి చేయటమే. మనిషి ప్రాణాలకు ఈ రోజు మన సమాజములో విలువ లేకుండా పోయింది. ఈ మధ్యలో బెంగుళూరు లో ఒక 15 సంవత్సరాల అమ్మాయి సొంత తండ్రినే హత్య చేసింది. బాయ్ ఫ్రెండ్ తో తిరుగవద్దు అన్నందుకు ఆ అమ్మాయి తండ్రి మీద కక్ష పెట్టుకొంది. ఆయనకు మత్తు మందు ఇచ్చి, కత్తితో పొడిచి, పెట్రోలు పోసి తగులపెట్టింది. చిన్న, చిన్న పిల్లలు కూడా హత్యలు చేస్తున్నారు. కోపాన్ని అణుచుకోలేక పోవుచున్నారు. 

    మత్తయి సువార్త 5 అధ్యాయములో యేసు ప్రభువు చెప్పాడు. ప్రతి హత్య వెనుక కోపం ఉంది. అది దేవుని నీతిని నెరవేర్చడు.మన కోపాన్ని సిలువ దగ్గర మనం పూడ్చివేయాలి.

ఏడవ ఆజ్ఞ: నీవు వ్యభిచరింపకూడదు.వ్యభిచారము వలన ఈ రోజు ఎంతో మంది జీవితాలు పాడైపోతున్నాయి. ఎంతో మంది వివాహాలు విరిగిపోతున్నాయి. కుటుంబాలు ఛిద్రమయిపోతున్నాయి.

అక్రమ సంభంధాల వలన చాలా మంది ప్రాణాలుకూడాకోల్పోతున్నారు. వ్యభిచరింపకూడదు అని 7 ఆజ్ఞలో దేవుడు మానవ జాతిని ఆజ్ఞాపించాడు.

ఎనిమిదవ ఆజ్ఞలో ‘దొంగిల కూడదు’ అన్నాడు. నీవు దొంగతనము చేయవద్దు దొంగతనాలు చేయబాకండి. ఇతరుల డబ్బులు కానీ, వస్తువులు కానీ దొంగిలించకూడదు. అమెజాన్ కంపెనీ 

వారు మనం ఆర్డర్ ఇచ్చేవి డైరెక్ట్ గా మన ఇంటికి పంపిస్తారు. క్రిస్మస్ టైం లో వాళ్ళు చాలా బిజీ గా ఉంటారు. అమెజాన్ వాళ్ళు డెలివరీ చేసి వెళ్లిన క్రిస్మస్ గిఫ్ట్ లను కొంతమంది దొంగిలించి తీసుకువెళ్తున్నారు. ఈ దొంగతనాలు ఎలా ఆపాలో తెలియక అమెజాన్ వాళ్ళు తలలు బాదుకొంటున్నారు. 

     నేటివిటీ బొమ్మల్లో ఉండే బాలయేసు బొమ్మలను కూడా దొంగిలిస్తున్నారు. క్రిస్మస్ అంటే యేసు క్రీస్తు మనకోసం త్యాగము చేసిన రోజు. అది మనం ఇచ్చే రోజు, తీసుకొనే రోజు కాదు.

తొమ్మిదవ ఆజ్ఞ నీ పొరుగువానిమీద అబద్ధసాక్ష్యము పలుకకూడదు అన్నాడు. అబద్దాలు చెప్పబాకండి, లేని వార్తలు పుట్టించబాకండి, లేని నిందలు వేయబాకండి. అబద్దాలు చెప్పేటప్పుడు మనము సాతాను వలె మారతాము.

పదవ ఆజ్ఞ  నీ పొరుగువాని  యిల్లు ఆశింపకూడదు.నీ పొరుగువాని భార్యనైనను అతని దాసునైనను అతని దాసినైనను అతని యెద్దునైనను అతని గాడిదనైనను నీ పొరుగువానిదగు దేనినైనను ఆశింప కూడదు అని చెప్పెను. నీ పొరుగువాని దేనినైనను ఆశింప కూడదు ఇతరుల ఇల్లు చూసి, వారి బట్టలు చూసి, వారి కారులు చూసి అసూయతో రగిలిపోయేవారు మన సమాజములో చాలా మంది ఉన్నారు. మనకు కలిగిన దానిలో సంతృప్తి ఉండాలి, కంటెంట్మెంట్ ఉండాలి అని దేవుడు మనలను కోరుచున్నాడు. నీ పొరుగువాని భార్యను ఆశించవద్దు. పురుషులు ఇంకొక పురుషుని భార్య మీద మీ కన్ను వేయబాకండి. స్త్రీలు ఇంకొక స్త్రీ భర్త మీద మీ కన్ను వేయబాకండి అంటున్నాడు. ఎప్పుడో మూడు వేల సంవత్సరాల క్రితము మానవాళికి దేవుడు ఇచ్చిన ఈ పది ఆజ్ఞలు ఇప్పటికి కూడా వర్తిస్తాయి. సమాజం మారింది, ఎంతో టెక్నాలజీ వచ్చింది. ఫేస్ బుక్ లు, ట్విట్టర్ లు, మొబైల్ ఫోన్లు, డ్రోన్లు వచ్చినవి.మనం చేసే పాపాలు, వాటి ఫలితాలు మారలేదు.

     ఆ విధముగా దేవుడు సీనాయి కొండ దగ్గర మోషే ద్వారా ఇశ్రాయేలీయులతో ఒక నిబంధన చేశాడు, వారికి తన ధర్మశాస్త్రం ఇచ్చాడు. అది పాత నిబంధన. ఈ రోజు మనము క్రొత్త నిబంధన క్రింద ఉన్నాము. ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా ఇది మనకు అప్పగించబడింది. ధర్మ శాస్త్రము మనలను రక్షించలేదు.మనము ఎంత పాపాత్ములమో అది మనకు చూపించింది. యాకోబు పత్రికలో ధర్మశాస్త్రము ఒక అద్దముతో పోల్చబడింది. అద్దము ముందు నిలబడి మన మొహం చూసుకొంటాము.అద్దము మన మొహం ఎలా ఉందో మనకు చూపిస్తుంది కానీ అది మన మొహాన్ని కడుగలేదు, అది మనకు నీటిని ఇవ్వలేదు.  ధర్మ శాస్త్రము ‘ఇది నీ పాప పరిస్థితి’ అని మనకు చూపిస్తుంది కానీ మన పాపములను అది కడుగలేదు. పాపాల నుండి కడుగబడాలంటే

మనం యేసు క్రీస్తు దగ్గరకు వెళ్ళాలి, ఆయన సిలువ దగ్గరకు వెళ్ళాలి, ఆయన కార్చిన రక్తము దగ్గరకు వెళ్ళాలి. పాపము అంటే గ్రీకు భాషలో ‘హమార్టియా’ అనే పదం వాడాడు. అంటే missing the mark అంటే బాణము వదలేవు కానీ అది టార్గెట్ ని చేరుకోలేకపోతున్నది. మనం దేవుని నీతిని సాధించలేకపోతున్నాము.

-మోషే ఇచ్చిన పాత నిబంధన కంటే ప్రభువైన యేసు క్రీస్తు ఇచ్చిన క్రొత్త నిబంధన శ్రేష్ఠమైనది.

-మోషే నిబంధనలో పాపానికి శిక్ష ఉంది, యేసు క్రీస్తు నిబంధనలో పాప క్షమాపణ ఉంది.

-మోషే నిబంధనలో మరణము ఉంది, యేసు క్రీస్తు నిబంధనలోజీవము ఉంది.

-మోషే నిబంధనలోదేవుని నీతిని మనం పొందలేము, యేసు క్రీస్తు నిబంధనలో దేవుని నీతి మనం పొందాము.

-మోషే నిబంధన శాశ్వతమైనది కాదు అది సిలువకు కొట్టివేయబడింది, యేసు క్రీస్తు నిబంధన శాశ్వతమైనది, అది ఎవరూ కొట్టివేయలేనిది.

-మోషే నిబంధనలో అన్యజనులమైన మనకు స్థానము లేదు; యేసు క్రీస్తు నిబంధనలో అన్యజనులమైన మనకు స్థానము కల్పించబడింది.

-మోషే నిబంధనలో దేవునితో మనకు సాన్నిహిత్యము లేదు, యేసు క్రీస్తు నిబంధనలో దేవునితో మనకు సాన్నిహిత్యము, సహవాసము లభించినవి.

-మోషే నిబంధన సీనాయి కొండ దగ్గర ఇవ్వబడితే, యేసు క్రీస్తు నిబంధన కల్వరి కొండ మీద ఇవ్వబడింది.

-సీనాయి కొండ దగ్గర మనకు రక్షణ లేదు, మనము కల్వరి కొండ దగ్గరకు వెళ్ళాలి. సిలువ దగ్గరకు వెళ్ళాలి, యేసు క్రీస్తు రక్తము చేత కడుగబడాలి.

     నిర్గమ కాండము 19, 20 అధ్యాయాలు ఈ రోజు మనము ధ్యానించాము. దేవుడు ఇశ్రాయేలీయులను ఐగుప్తు దేశము నుండి బయటికి రప్పించాడు. వారిని తన ప్రజలుగా చేసుకొన్నాడు. వారిని తన స్వకీయ సంపాద్యముగా చేసుకొన్నాడు. వారిని ఒక యాజక రాజ్యముగా నియమించుకున్నాడు. వారిని ఒక పరిశుద్ధ జనముగా నిర్మించుకున్నాడు. వారికి ఆరాధించే భాగ్యము ఇచ్చాడు. వారితో ఆయన నిబంధన చేశాడు. వారికి ధర్మ శాస్త్రము ఇచ్చాడు. ఆ ధర్మ శాస్త్రము మనము నెరవేర్చలేకపోయాము. శాప గ్రస్తులమయ్యాము. దేవుడు మన కోసము ఒక రక్షకుని పంపించాడు. ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా, ఆయన రక్తము ద్వారా మనకు క్రొత్త నిబంధన ఇచ్చి, మనలను రక్షిస్తున్నాడు. ఆ రక్షకుని దగ్గరకు మీరు రావాలన్నదే నేటి మా ప్రేమ సందేశము.