దానియేలు ప్రవక్త

సొలొమోను కుమారుడైన రెహబాము పాలనలో ఇశ్రాయేలు దేశము రెండు ముక్కలు అయ్యింది. ఉత్తరాన ఇశ్రాయేలు దేశము, దక్షిణాన యూదా దేశము. ఈ రెండు దేశాలు దేవుని వాక్యాన్ని విడచిపెట్టి అన్య దేవతలను పూజించడము ప్రారంభించారు. దేవుడు అనేక ప్రవక్తలను వారి యొద్దకు పంపి వారిని హెచ్చరించాడు. బైబిల్ లో చాలా మంది ప్రవక్తలు ఉన్నారు. ఏ ప్రవక్త ఎప్పుడు వచ్చాడు, ఎక్కడ జీవించాడు అని ఆలోచిస్తే చాలా కన్ఫ్యూషన్ గా ఉంటుంది. ఆ గందరగోళం లేకుండా ఉండాలంటే ఈ చార్ట్ చూడండి. 

KingsofJudahandIsrael.png

ఏ ప్రవక్త ఎప్పుడు, ఎక్కడ జీవించాడు ఈ చార్ట్ లో ఇచ్చాము. ఈ చార్ట్ కావలసిన వారు మా వెబ్ సైట్ www.doctorpaul.org కి వెళ్లి దానిని డౌన్ లోడ్ చేసుకోండి. 

క్రీ.పూ 722 లో ఉత్తర దేశము, అందులోని 10 గోత్రాలు చెరలోనికి తీసుకొని వెళ్ళబడ్డాయి. దక్షిణాన యూదా దేశము మాత్రమే మిగిలి ఉంది. దేవుడు వారియొద్దకు ఐదుగురు ప్రవక్తలను పంపించాడు. యెషయా ప్రవక్త, మీకా ప్రవక్త, జెఫన్యా ప్రవక్త, యిర్మీయా ప్రవక్త, హబక్కూకు ప్రవక్త వారిని హెచ్చరించారు. మీరు మీ ప్రవర్తన మార్చుకోవాలి. మీ పాపములు వదలిపెట్టాలి. మీ విగ్రహారాధన మానుకోవాలి. లేకపోతే దేవుని శిక్ష మీ మీదకు వస్తుంది. దేవుడు ఈ దేశము లో నుండి మిమ్ములను వెళ్ళగొడతాడు, మీరు అన్యులకు దాసులుగా మారిపోతారు. ఐగుప్తు దేశములో మీరు బానిసలుగా ఉన్నారు. తిరిగి బానిసత్వములోకి వెళ్ళిపోతారు. మీ చరిత్ర పునరావృతం అవుతుంది. అయితే ఇశ్రాయేలీయులు ప్రవక్తలను పట్టించుకోలేదు. తమ దుష్టత్వములోనే కొనసాగారు. దేవుని శిక్ష వారి మీదకు దిగి వచ్చింది.

prophetstimetablebyPaulkattupalli.jpg

    క్రీ. పూ 586 లో నెబుకద్నెజరు, బబులోను సైన్యము వారి మీద దండెత్తి వచ్చింది. యెరూషలేములో సొలొమోను కట్టించిన గొప్ప దేవుని ఆలయమును వారు తగలబెట్టి కూల్చివేశారు. యూదులను సంహరించారు, వేలాది మందిని బానిసలుగా బబులోనుకు తీసుకువెళ్లారు. ఈ బానిసత్వము యెరూషలేమును నాశనము చేయకముందే మొదలయ్యింది. క్రీ.పూ 605 లో దానియేలును బానిసగా తీసుకువెళ్లారు. ఈ చార్ట్ చూడండి. దానియేలు, యెహెఙ్కేలు ప్రవక్తలు బబులోను లో సేవ చేశారు. 

     యెరూషలేము సర్వనాశనం అయ్యింది. అయితే దేవుడు ఓడిపోయినట్లు కాదు. బబులోనీయులు యూదులను అపహాస్యము చేశారు.‘మా దేవతల ముందు మీ దేవుడు ఓడిపోయాడు’ అయితే దేవుడు ఓడిపోయినట్లు కాదు.దేవుని మాట నిజమయ్యింది. దేవుడు తన ప్రవక్తల ద్వారా చేసిన హెచ్చరికలు నిజమయ్యినవి. మొన్న ఆంధ్ర జ్యోతి పత్రికలో నేనొక వ్యాసం చదివాను. కరోనా కళ్ళు తెరిపించేనా అనే వ్యాసములో, రాధా కృష్ణ గారు ఏమని వ్రాశాడంటే, ‘కరోనా మహమ్మారి కంటే దేవుడు గొప్పవాడు అని ప్రకటించి చర్చి లో సామూహిక ప్రార్థనలు చేయించిన ఒక ఫాథర్ అదే కరోనా బారినపడి మరణించిన వార్త మీడియాలో వచ్చింది.వైరస్ మహమ్మారి విజృంభించినప్పుడు ఏ దేవుడు కూడా ఏమీ చేయలేడు.హిందూ దేవుళ్ళు కానీ, అల్లా గానీ, యేసుక్రీస్తు గానీ ఈ మహమ్మారి నుంచి ప్రజలను కాపాడలేరు కదా’ అని ఆయన వ్రాశాడు. 

    కరోనా మహమ్మారి కంటే దేవుడు గొప్పవాడు అని చెప్పిన పాస్టర్ గారే కరోనాతో చనిపోయాడు. అదయ్యా మీ దేవుడి పరిస్థితి అని పత్రికల్లో వ్రాస్తూ ఉన్నారు. ఈ కరోనాను యేసు క్రీస్తు ఆపలేడు అని అంటున్నారు. అయితే, కరోనా మొత్తము మానవాళిని  కబళించినా దేవుడు గొప్పవాడే. దేవుడికి శక్తి లేక కాదు. ‘మీ తల వెండ్రుకలు లెక్కించబడి ఉన్నవి.’ ఎవరి తల మీద ఎన్ని వెంట్రుకలు ఉన్నాయో దేవునికి తెలుసు. ఏ వైరస్ ఎక్కడ ఉందో ఆయనకు తెలుసు. వాటిని ప్రపంచము మీదకు అనుమతి ఇచ్చింది ఆయనే. వాటిని ఆపే శక్తి ఆయనకు ఉంది, అయితే ఆయన చిత్తాన్ని జరిగించడానికి దేవుడు వాటిని అనుమతి ఇస్తాడు. ఈ ప్రపంచము ఇంకా 

ఆదాము పాపము వలన ఈ లోకము లో ప్రవేశించిన శాపము క్రిందే ఉంది. ప్రకృతి వైపరీత్యాలు, భూకంపాలు, తుఫానులు, కరోనాలు  ఈ శాపములో భాగమే. యేసు క్రీస్తు రెండవ రాకడ తరువాత వాటిని కూడా దేవుడు తొలగిస్తాడు. ప్రస్తుతము అవి దేవుని ప్రణాళికలో భాగమే. వాటిని చూసి దేవునికి వీటిని ఆపే శక్తి లేదు. దేవుడు భయపడి దాగుకొన్నాడు, యేసు క్రీస్తుకు శక్తి లేదు ఇలాంటి మాటలు మనము అనకూడదు. దానియేలుకు అటువంటి గ్రహింపు ఉంది. 

    బబులోను వారు యెరూషలేమును సర్వనాశనం చేశారు. దేవుని ఆలయాన్ని కూల్చివేశారు. కొంత మంది ఏమన్నారంటే, ‘దేవుడు చేతకాని వాడిలా చూస్తూ ఉన్నాడు, ఆయన పని అయిపోయింది’ అని అన్నారు.దానియేలు ఆ విధముగా చూడలేదు.అయి పోయింది దేవుని పని కాదు, మన పని మన పాపముల వలన మనం ఈ స్థితికి వచ్చాము. దేవా, మమ్ములను క్షమించి అబ్రహాముతో నీవు చేసిన వాగ్దానమును జ్ఞాపకము చేసుకో అని దానియేలు దీన మనస్సుతో ప్రార్ధన చేశాడు. తన పరిస్థితులను చూసి ఆయన దిగ్భాంతి చెందలేదు.

    దానియేలు జీవితం చూస్తే మనకు ఆ ముఖ్య మయిన సత్యం భోద పడుతుంది. ప్రపంచ చరిత్ర ఎంతటి చీకటి పరిస్థితి లో ఉన్నప్పటికీ, తన దేశానికి ఎంతటి దుర్గతి పట్టినప్పటికీ, తన చుట్టూ ఉన్న పరిస్థితులు యెంత విషాదకరముగా ఉన్నప్పటికీ, తనను నమ్ముకున్న వాడిని దేవుడు వదలిపెట్టడు. తన మీద  విశ్వాసం నిలిపినవాడిని ఆయన పరిత్యజించడు. దానియేలు బబులోను దేశములో చెరపట్టబడి ఉన్నాడు. యెరూషలేముకు జరిగిన ఘోర విధ్వంసాన్ని అతను చూశాడు. తన ప్రజలను నెబుకద్నెజరు సైన్యాలు పాశవికముగా సంహరించడం అతడు చూశాడు. దేవుని ఆలయము నేలమట్టం చేయబడడం చూసి దిగ్భాంతి చెందాడు. తన దేశం సర్వనాశనం చేయబడడం కళ్ళారా చూసాడు. ఆయన ఉన్న స్థితిగతులలో దేవుడు లేడు, పాడు లేదు అని నాస్తికుడిగా మారడం చాలా సులువు. కానీ దానియేలు తన దేశాన్ని విచ్ఛిన్నం  చేసిన శత్రువుల దేశంలో పరాయి వాడుగా ఉన్నప్పటికీ, తన విశ్వాసాన్ని దేవుని మీద నిలిపాడు.

       దానియేలులో దేవుని మీద ఎలాంటి ద్వేషం లేదు. అతని హృదయాన్ని దేవుని పట్ల అతను కఠినం చేసుకోలేదు, కష్టపెట్టుకోలేదు. దేవుని యెడల ఇప్పటికీ కృతజ్ఞత కలిగి ఉన్నాడు. సంతృప్తి కలిగి జీవించుచున్నాడు. ఇంగ్లీష్ భాషలో ఒక మంచి పాట ఉంది: 

 

  1. Can a little child like me

Thank the Father fittingly?

Yes, oh yes! Be good and true,

Patient, kind in all you do!

Love the Lord and do your part;

Learn to say with all your heart:

 

  1. For the fruit upon the tree,

For the birds that sing of thee,

For the sunshine warm and bright,

For the day and for the night,

For the joyful work and true

That a little child may do,

Father, we thank thee!

Father, we thank thee!

Father in Heaven, we thank thee!

నా లాంటి చిన్న బిడ్డ దేవునికి కృతఙ్ఞతలు చెప్పగలదా ? 

చెట్టు మీద ఉన్న ఫలములు 

నిన్ను స్తుతించే పక్షులు,

 చక్కటి సూర్య కాంతి, 

పగలు, రేయి 

చేసే పని 

వీటన్నిటిని బట్టి తండ్రీ

నీకు వందనాలు! కృతఙ్ఞతలు! 

దేవుడు నాకు ఎంతో చేస్తే కానీ నేను థాంక్స్ చెప్పను అన్నట్లు మనం ప్రవర్తించకూడదు. చిన్న, చిన్న వాటి కోసం కూడా మనం దేవునికి కృతఙ్ఞతలు చెల్లించాలి. దానియేలు అటువంటి దృక్పదముతో బబులోనులో జీవించాడు. ‘ఎందుకు’ బతకాలో తెలిసిన వాడికి ‘ఎలా’ బతకాలో అనేది ముఖ్యం కాదు –  అన్నాడు జర్మన్ తత్వవేత్త ఫ్రెడరిక్ నీచా.  ‘ఎందుకు’ బతకాలో తెలిసిన వాడికి ‘ఎలా’ బతకాలో అనేది ముఖ్యం కాదు.నేను దేవుని కోసం బ్రతకాలి అని దానియేలు నిర్ణయించుకున్నాడు. యెరూషలేములో ఉన్నాడో, బబులోనులో ఉన్నాడో అతనికి అనవసరం. కూరకాయలు తింటున్నాడో, వేట మాంసం తింటున్నాడో అతను పట్టించుకోలేదు. నేను దేవుని చిత్తాన్ని చేయాలి అన్నదే అతని నిత్య తపన గా మారింది. 

తన ప్రజలైన యూదుల భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? దేవునికి దూరముగా వెళ్ళిపోయిన తన సోదరులను ఎలా మంచి మార్గములోకి తీసుకురావాలి? అని అతను మధనపడ్డాడు. ‘ప్రపంచములో నువ్వు ఆశించే మార్పు నీతోనే మొదలు కావాలి’ అని అన్నాడు  మహాత్మా గాంధీ. ‘ప్రపంచములో నువ్వు ఆశించే మార్పు నీతోనే మొదలు కావాలి’ దానియేలు తన దేశస్తులలో  ఆశించిన మార్పును ముందు తనలోనే తెచ్చుకొన్నాడు. ‘దేవా, మా పాపములు క్షమించు’ అని తన ప్రజల తరుపున దేవుని వేడుకొన్నాడు. 

   దానియేలు 9 అధ్యాయము చూద్దాము: మొదటి వచనము.  మాదీయుడగు అహష్వేరోషు యొక్క కుమారుడైన దర్యావేషు కల్దీయులపైన రాజాయెను. బబులోను వారు మాదీయుల చేతిలో ఓడిపోతారు అని దేవుడు ముందే దానియేలుకు చెప్పాడు. ఏ సామ్రాజ్యము తరువాత ఏ సామ్రాజ్యము వస్తుందో దేవుడు ముందు గానే దానియేలుకు చెప్పాడు. దానియేలు 2 అధ్యాయములో బబులోను రాజు నెబుకద్నెజరు ఒక కల కన్నాడు.ఒక గొప్ప ప్రతిమ కనిపించింది.ఆ ప్రతిమకు 

శిరస్సు బంగారముతో 

చేయబడింది,  ఛాతీ, భుజములు వెండితో చేయబడ్డాయి, 

పొట్ట, తొడలు ఇత్తడి తో చేయబడ్డాయి, 

మోకాళ్ళు, పాదములు ఒక భాగము ఇనుము, ఒక భాగము మట్టితో చేయబడ్డాయి. 

ఆ కల భావము ఏమిటో అర్థము కాక నెబుకద్నెజరు మదనపడ్డాడు. దానియేలు ఆ కల భావము నెబుకద్నెజ్జరు కు తెలియజేశాడు.బబులోను సామ్రాజ్యములో ఒక్క దానియేలు మాత్రమే ఆ ప్రతిమ యొక్క అర్థము చెప్పగలడు. 

Danielgreatimagegoodsaltsmcas0062.jpg

బంగారు శిరస్సు: బబులోను సామ్రాజ్యము, 

వెండి ఛాతీ, భుజములు: మేడో- పర్షియా సామ్రాజ్యము

ఇత్తడి పొట్ట, తొడలు: గ్రీకు సామ్రాజ్యము, 

ఇనుము, మట్టి మోకాళ్ళు, పాదములు: రోమా సామ్రాజ్యము 

ప్రపంచ చరిత్ర మొత్తం దేవుడు ఆ కలలోని ప్రతిమలో చెప్పాడు.

    ఆ తరువాత దానియేలు 7 అధ్యాయములోబబులోను రాజైన బెల్షస్సరు పరిపాలనలో దానియేలుకు ఒక దర్శనము ఇవ్వబడింది. ఆ దర్శనములో నాలుగు గొప్ప జంతువులు మహా సముద్రములో నుండి బయటికి వచ్చినవి. 

మొదటి జంతువు సింహము. దానికి పక్షిరాజు రెక్కలు ఉన్నాయి. అది బబులోను సామ్రాజ్యమును సూచిస్తున్నది.

రెండవ జంతువు ఎలుగుబంటి.దాని నోటిలో నుండి మూడు ప్రక్కటెముకలు బయటకు వస్తున్నాయి. అది మేడో-పర్షియా సామ్రాజ్యమును సూచిస్తున్నది.

మూడో జంతువు చిరుతపులి.దాని వీపు మీద నాలుగు పక్షి రెక్కలు ఉన్నాయి, నాలుగు తలలు ఉన్నాయి. అది అలెగ్జాండర్ చక్రవర్తి గ్రీకు సామ్రాజ్యమును సూచిస్తున్నది.

నాలుగో జంతువు భయంకరమైన, ఘోరమైన జంతువు. దానికి ఇనుప దంతములు ఉన్నాయి, పది కొమ్ములు ఉన్నాయి.అది జూలియస్ సీజర్ రోమన్ సామ్రాజ్యమును సూచిస్తున్నది.

Danielbeastsnew.jpg

    ఆ విధముగా ప్రపంచ చరిత్రలో ఏ సామ్రాజ్యము తరువాత ఏ సామ్రాజ్యము వస్తుందో దానియేలు కు ముందే తెలుసు.బబులోను సామ్రాజ్యము తరువాత మేడో-పర్షియా సామ్రాజ్యమును చూసి ఆయన ఆశ్చర్యపోలేదు ఎందుకంటే దేవుడు ముందే ఆ విషయము ఆయనకు చెప్పాడు. అయితే, దానియేలు తన ప్రజలైన యూదుల గురించి ఆలోచిస్తున్నాడు.దేవుని ప్రణాళికలో వారి భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అనే ప్రశ్న ఆయనకు కలిగింది.బైబిల్ చదవడం ప్రారంభించాడు. 2 వచనము చూద్దాము.

 దానియేలను నేను యెహోవా తన 

ప్రవక్తయగు యిర్మీయాకు సెలవిచ్చి తెలియజేసినట్టు, 

యెరూషలేము పాడుగా ఉండవలసిన 

డెబ్బది సంవత్సరములు సంపూర్తిమవుచున్నవని 

గ్రంథముల వలన గ్రహించితిని.

యూదులు బబులోను చెరలో 70 సంవత్సరములు ఉంటారు అని యిర్మీయా ప్రవక్త ముందే తెలియజేశాడు. యిర్మీయా 25:11 లో ఆ ప్రవచనం మనకు కనిపిస్తుంది.

ఈ జనులు డెబ్బది సంవత్సరములు 

బబులోను రాజునకు దాసులుగా ఉందురు. 

యిర్మీయా 25:11 

యూదులకు దేవుడు 70 సంవత్సరాల శిక్ష విధించాడు. యిర్మీయా చెప్పిన ఆ ప్రవచనము అతని సేవకుడైన బారాకు పుస్తకంగా వ్రాశాడు. యిర్మీయా 36 అధ్యాయములో చూస్తే, ఆ విషయము యూదా రాజైన యెహోయాకీముకు తెలిసింది. ఈ లిస్ట్ చూడండి. యెహోయాకీము క్రీ. పూ 609 నుండి 598 వరకు జీవించాడు.దేవుని ప్రవచనము విని ఆయన మారు మనస్సు పొందలేదు. తన హృదయాన్ని కఠినం చేసుకొన్నాడు. యిర్మీయా వ్రాసిన ప్రవచనాలు నా దగ్గరకు తీసుకు రండి, వాటిని తగలబెడతాను అన్నాడు. ఆయన ప్రక్కన ఉన్న మంత్రులు ఆయనను బ్రతిమలాడారు: వద్దు రాజా, దానిని తగలబెట్టవద్దు, అది దేవుని వాక్యము. యెహోయాకీము వారి మాటలు వినకుండా దేవుని వాక్యమును తగల బెట్టాడు. 

    అయితే దేవుడు మరొక సారి యిర్మీయా కు ప్రత్యక్షమై, రాజు తగలబెట్టిన గ్రంథములో ఉన్న ప్రవచనములు మొత్తము మరొక సారి వ్రాయించు అన్నాడు.యిర్మీయా సేవకుడైన బారాకు అప్పుడు మరొక గ్రంథము వ్రాశాడు. ఇప్పుడు బబులోనులోఉన్న దానియేలుకు ఆ గ్రంథము ప్రతి దొరికింది.ప్రపంచ చరిత్రలో యెహోయాకీము వలె బైబిల్ ని తగలబెట్టిన వారు చాలా మంది ఉన్నారు. అయితే దేవుడు తన వాక్యాన్ని మన కోసము భద్రపరచాడు. 

     మత్తయి సువార్త 24:35 లో యేసుప్రభువు చెప్పిన మాటలు మనం చదువుతాము: 

ఆకాశమును భూమియు గతించును గాని నా మాటలు ఏ మాత్రమును గతింపవు.

ఆకాశము గతించి పోవచ్చు, భూమి గతించి పోవచ్చు, అయితే ప్రభువైన యేసు క్రీస్తు చెప్పిన ఏ మాటా గతించదు. 

119 కీర్తన

89 వచనంలో మనము చదువుతాము: 

యెహోవా, నీ వాక్యము ఆకాశమందు 

నిత్యము నిలకడగా నున్నది.

Forever, O LORD , 

Thy word is settled

 in heaven 

    నీ వాక్యము ఆకాశమందు నిత్యము నిలకడగా నున్నది.ఇక్కడ ఆకాశము అంటే మేఘాలు అని కాదు. అది పరలోకము. దేవుని వాక్యము పరలోకమందు నిత్యమూ నిలకడగా ఉంది. దానిని భూమి మీద ఉన్న మనిషి నాశనం చేయలేడు. 

యెహోయాకీము తగలబెట్టిన దేవుని వాక్యాన్ని దేవుడు భద్రపరచి దానియేలు దగ్గరకు 

పంపించాడు. బబులోనులో కూర్చుని ఆ గ్రంథములోని యిర్మీయా ప్రవచనాలు చదివి

దానియేలు 70 సంవత్సరాల శిక్ష ముగిసే సమయము వచ్చింది అని గ్రహించాడు.

ఇశ్రాయేలీయులకు 70 సంవత్సరాల శిక్ష ఎందుకు వేయాల్సి వచ్చింది? 

బైబిల్ లో 7 కు చాలా ప్రాముఖ్యత ఉంది.ఇశ్రాయేలీయులకు దేవుడు రెండు సబ్బాతులు నిర్ణయించాడు. సబ్బాతు దినము, సబ్బాతు సంవత్సరం. సబ్బాతు దినము 7 వ దినము, సబ్బాతు సంవత్సరము 7 వ సంవత్సరం.మొదటిగా సబ్బాతు దినము. దేవుడు 6 రోజుల్లో ఈ విశ్వాన్ని, అందులోని సమస్తాన్ని సృష్టించాడు. 7 రోజు విశ్రాంతి దినముగా ప్రకటించాడు. 

నిర్గమ కాండము 20:11 లో మనము చదువుతాము: 

ఆరు దినములలో యెహోవా ఆకాశమును

భూమియు సముద్రమును వాటిలోని 

సమస్తమును సృజించి, 

యేడవ దినమున విశ్రమించెను; 

అందుచేత యెహోవా విశ్రాంతిదినమును 

ఆశీర్వదించి దాని పరిశుద్ధపరచెను.

   మనిషి సృష్టిలోనే దేవుడు 7 అనే సంఖ్యను పెట్టాడు. 6 రోజుల్లో ఈ విశ్వాన్ని, 6 దినాన

నిన్ను నేను సృష్టించాను. 7 దినము నీకు విశ్రాంతి దినము. ఆ రోజు నీవు విశ్రాంతి తీసుకొని నన్ను జ్ఞాపకము చేసుకొని, ఆరాధించు.

    ఈ విశ్రాంతి దినముకు మరొక ప్రాముఖ్యత కూడా ఉంది. 

ద్వితీయోప దేశ కాండము 25:15 

నీవు ఐగుప్తుదేశమందు దాసుడవై

యున్నప్పుడు నీ దేవుడైన యెహోవా

బాహుబలముచేతను చాచిన చేతిచేతను 

నిన్ను అక్కడనుండి రప్పించెనని జ్ఞాపకము 

చేసికొనుము. అందు చేతను విశ్రాంతిదినము

ఆచరింపవలెనని నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించెను.

దేవుడు ఏమంటున్నాడంటే, నువ్వు ఐగుప్తు దేశములో బానిసగా ఉన్నప్పుడు నేను 

నిన్ను విడిపించి విమోచించాను. ప్రతి విశ్రాంతి దినము రోజు ఆ విషయము గుర్తు 

చేసుకో. సబ్బాతు లో దేవుడు ఆ రెండు విషయాలు మనకు గుర్తుచేస్తున్నాడు. 

  1. నువ్వు సృష్టించబడ్డావు 
  2. విమోచించబడ్డావు 

ఇశ్రాయేలీయులు ఆ రెండు విషయాలు మరచిపోయారు. సబ్బాతును వారు నిర్లక్ష్యము చేశారు. వారిని సృష్టించిన దేవుని వారు విడిచిపెట్టారు, వారిని విమోచించిన దేవుని వారు మరచిపోయారు, అన్య దేవతల వైపు, విగ్రహారాధన వైపు వెళ్లిపోయారు. 

    రెండవదిగా సబ్బాతు సంవత్సరము. లేవీయ కాండము 25 అధ్యాయము దీని గురించి మనం చదువుతాము: 

ఆరు సంవత్సరములు నీ చేను విత్తవలెను.

ఏడవ సంవత్సరము భూమికి మహా విశ్రాంతి కాలము

అది భూమికి విశ్రాంతి సంవత్సరము. (1-11 వచనాలు) 

    6 సంవత్సరాలు పంటలు పండించుకోండి. 7 సంవత్సరము భూమికి విశ్రాంతి ఇవ్వండి. ఒక సంవత్సరమంతా భూమికి విశ్రాంతి ఇస్తే ఎంత మంచిది. కరోనా లాక్ డౌన్ వలన వాతావరణ కాలుష్యము తగ్గిపోయింది. ఒక్క నెల రోజుల్లోనే చాలా పట్టణాల్లో 

కాలుష్యము తగ్గిపోయింది, నదులు కాలువలలో నీటి కాలుష్యము తగ్గిపోయింది. ప్రజలు మంచి గాలి పీల్చుకోగలుగుతున్నారు. ఒక్క సంవత్సరము విశ్రాంతి ఇస్తే ఈ భూమి కాలుష్యము ఎంతో తగ్గిపోతుంది. ఒక్క సంవత్సరము విశ్రాంతి ఇస్తే మన వాతావరణము బాగుపడుతుంది.ఇశ్రాయేలీయులకు దేవుని మాట నచ్చలేదు. ‘అమ్మో,ఒక సంవత్సరము మొత్తం విశ్రాంతి ఇస్తే మన పంట దిగుమతి తగ్గుతుంది, రవాణా ఎగుమతి తగ్గుతుంది, రాబడి తగ్గుతుంది, ఆదాయము తగ్గుతుంది, వ్యాపారము తగ్గుతుంది, దేవుని మాట మనం వినవద్దు’ అనుకొన్నారు. 

    490 సంవత్సరాల చరిత్రలో, 490/7 అంటే 70 సంవత్సరాలు వారు సబ్బాతు సంవత్సరాలు పాటించలేదు.70 సబ్బాతు సంవత్సరాలు మీరు పాటించలేదు కాబట్టి నేను మీకు 70 సంవత్సరాల శిక్ష విధిస్తున్నాను. బబులోను చెరలో మీరు 70 సంవత్సరాలు గడపాలి.దానియేలు జీవితమును ఈ రోజు మనం ధ్యానించాము. సబ్బాతు యొక్క ప్రాముఖ్యత గురించి చూశాము. నిన్ను సృష్టించాను, విమోచించాను అనే రెండు సందేశాలు దేవుడు సబ్బాతు దినము ద్వారా మనకు తెలియజేశాడు. ప్రభువైన యేసు క్రీస్తు మనలను సృష్టించాడు, తన రక్తముతో మనలను విమోచించాడు. ఆయన ఇచ్చే రక్షణను మీరు పొందాలన్నదే నేటి మా ప్రేమ సందేశము.