Life Lessons from the Cross: Paul Kattupalli, Telugu Message Transcript
కీర్తనలలో క్రీస్తు అనే అంశం మనం ధ్యానిస్తున్నాం. ఈ రోజు 22 వ కీర్తనను మనం కొనసాగిద్దాం. 22 వ కీర్తనను దావీదు వ్రాసాడు. యేసు క్రీస్తు యొక్క సిలువ శ్రమలను దావీదు ఈ కీర్తనలో ప్రవచించాడు. ఇంతకముందు 5 విషయాలు మనం చూసాం. (పార్ట్ 1 కొరకు ఇక్కడ క్లిక్ చేయండి)
A Scream
A Snub
A Spectacle
A Slaughter
A Sacrifice
ఈ రోజు ఆ తరువాత వచనాలు మనం ధ్యానిద్దాం.
ఆరవదిగా A Sponge
15 వచనం చూద్దాం. 22 వ కీర్తన
- నా బలము యెండిపోయి చిల్లపెంకువలె ఆయెను
- నా నాలుక నా దౌడను అంటుకొని యున్నది
- నీవు నన్ను ప్రేతల భూమిలో పడవేసి యున్నావు.
నా నాలుక నా దౌడను అంటుకొని యున్నది. ప్రభువైన యేసు క్రీస్తు సిలువ మీద తీవ్రమయిన దప్పిక గొన్నాడు. Dehydration – నీరు లేకపోవటం వలన వలన ఆయన నాలుక దవడకు అంటుకుపోయింది.
యోహాను 19
28. అటుతరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి, లేఖనము నెరవేరునట్లు నేను దప్పిగొను చున్నాననెను.29. పుడకకు తగిలించి ఆయన నోటికి అందిచ్చిరి.30. యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను.చిరకతో నిండియున్న యొక పాత్ర అక్కడ పెట్టియుండెను గనుక వారు ఒక స్పంజీ చిరకతో నింపి, హిస్సోపు సిలువ మీద యేసు క్రీస్తు దప్పిక గొంటాడు అని దావీదు ప్రవక్త ముందే తెలియజేశాడు. ఇక్కడ 22 వ కీర్తనలో నా నాలుక నా దౌడను అంటుకొని యున్నది అని చెప్పాడు. అదేవిధముగా 69 వ కీర్తనలో కూడా దావీదు దీని గురించి ప్రవచించాడు.
కీర్తనలు 69:21: వారు చేదును నాకుఆహారముగా పెట్టిరి నాకు దప్పియైనప్పుడు చిరకను త్రాగనిచ్చిరి.ఆ మాటలు సిలువ మీద నెరవేరినాయి. యేసు క్రీస్తుకు రెండు సార్లు చేదు చిరక అందించారు. ఆయన చేతులు, కాళ్లలో మేకులు కొట్టబోయేముందు సైనికులు ఆయనకు చేదు కలిపిన ద్రాక్షారసం అందించారు. మార్కు సువార్త లో మనం చదువుతాం. అందులో బోళము కలుపబడింది
మార్కు 15:23 లో చదువుతాం.
అంతట బోళము కలిపిన ద్రాక్షారసము ఆయనకిచ్చిరి గాని ఆయన దాని పుచ్చు కొనలేదు.
మత్తయి 27:34 లో మనం చదువుతాం.
చేదు కలిపిన ద్రాక్షారసమును ఆయనకు త్రాగనిచ్చిరి గాని ఆయన దానిని రుచి చూచి త్రాగనొల్లకపోయెను.సిలువ మీద వున్నప్పుడు మరొక సారి ఆయనకు చేదు చిరక అందించబడింది. ఆరు గంటల పాటు సిలువ మీద వ్రేలాడిన తరువాత యేసు క్రీస్తు తన ప్రాణం విడువటానికి సిద్ధపడ్డాడు. ఇంకా ఒక్క ప్రవచనం మిగిలివుంది. ఆయన దప్పిగొనాలి. నేను దప్పిగొనుచున్నాను అని ఆయన అప్పుడు పలికాడు.భాదను తగ్గించటానికి ఆ బోళము కలిపిన ద్రాక్షా రసం ఉపయోగపడేది. సైనికులు ప్రేమతో ఆ ద్రాక్షరసం ఆయనకు ఇవ్వలేదు. ద్రాక్షాసరం త్రాగిన మైకంలో ఆయన వున్నప్పుడు వారు ఏ ఇబ్బంది లేకుండా ఆయన చేతులు, కాళ్లలో మేకులు గొట్టటం వారి ఉద్దేశ్యం. ధనవంతులయిన యూదు స్త్రీలు సిలువ వేయబడే నేరస్తులకు కొంత ఉపశమనం కొరకు ఈ ద్రాక్ష రసం ఇచ్చే ఏర్పాటు తమ ఖర్చుతో ఏర్పాటుచేశారు. వారు ఇచ్చిన ద్రాక్ష రసం ఆయన త్రాగలేదు, ఎందుకంటే దేవుని యొక్క ఉగ్రతను మెలుకువగా వుండే భరించాలన్నది ఆయన ఉద్దేశ్యం. జీవ జలములు మనకు ఇవ్వటానికి వచ్చిన రక్షకుడు మన కోసం దప్పిగొన్నాడు.అప్పుడు వారు స్పంజీ తీసుకొని చిరక అంటే పులిసిన ద్రాక్ష రసములో దానిని తడిపి హిస్సోపు మొక్కల మీద దానిని ఉంచి యేసు క్రీస్తు కు అందించారు. ఆయన దానిని అందుకొని సమాప్తమయినది అని అరచి మరణించాడు. దేవుని వాక్యంలో ప్రతి పదానికి ప్రాధాన్యత ఉంటుంది. ఇక్కడ సిలువ దగ్గర హిస్సోపు మొక్క మనకు కనిపిస్తున్నది.
హిస్సోపు మొక్క
హిస్సోపు మొక్కలో యేసు క్రీస్తు మన యొక్క విమోచనగా, మన యొక్క పవిత్రత గా కనిపిస్తున్నాడు. ఇశ్రాయేలీయులు పస్కా పండుగ జరుపుకొనేటప్పుడు, గొర్రెపిల్ల రక్తాన్ని చిందించి, ఒక పళ్ళెములో దాని రక్తాన్ని ఉంచి, హిస్సోపు కుంచె తీసుకొని ఆ రక్తమును తమ ద్వార బంధముల మీద అద్దారు.
నిర్గామకాండము 12:21. కాబట్టి మోషే ఇశ్రాయేలీయుల పెద్దల నందరిని పిలిపించి వారితో ఇట్లనెనుమీరు మీ కుటుంబముల చొప్పున మందలోనుండి పిల్లను తీసికొని పస్కా పశువును వధించుడి.. 22. మరియు హిస్సోపు కుంచె తీసికొని పళ్లెములో నున్న రక్తములో దాని ముంచి, ద్వారబంధపు పైకమ్మికిని రెండు నిలువు కమ్ములకును పళ్లెములోని రక్తమును తాకింప వలెను.
ఆ రాత్రి మృత్యు దూత వచ్చినప్పుడు గొర్రె పిల్ల రక్తం క్రింద వున్న వారు మాత్రమే తమ ప్రాణాలు కాపాడు కోగలిగారు.
1 కొరింధీ పత్రిక 5:7 లో అపొస్తలుడయిన పౌలు వ్రాసాడు: క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను.
రెండవది గా ఈ హిస్సోపు మొక్క దగ్గర క్రీటు మన పవిత్రతగా కనిపిస్తున్నాడు. లేవీయ కాండం 14 లో కుష్టురోగిని పవిత్రుడిగా నిర్ణయించడానికి హిస్సోపు మొక్క వాడబడింది.
లేవీకాండము 14
1. మరియు యెహోవా మోషేకు ఈలాగు సెల విచ్చెను2. కుష్ఠరోగి పవిత్రుడని నిర్ణయించిన దినమున వానిగూర్చిన విధి యేదనగా, యాజకుని యొద్దకు వానిని తీసికొని రావలెను.3. యాజకుడు పాళెము వెలుపలికి పోవలెను. యాజకుడు వానిని చూచినప్పుడు కుష్ఠుపొడ బాగుపడి కుష్ఠరోగిని విడిచిన యెడల 4. యాజకుడు పవి త్రత పొంద గోరువాని కొరకు సజీవమైన రెండు పవిత్ర పక్షులను దేవదారు కఱ్ఱను రక్తవర్ణముగల నూలును హిస్సో పును తెమ్మని ఆజ్ఞాపింపవలెను.5. అప్పుడు యాజకుడు పారు నీటిపైని మంటిపాత్రలో ఆ పక్షులలో ఒకదానిని చంప నాజ్ఞాపించి 6. సజీవమైన పక్షిని ఆ దేవదారు కఱ్ఱను రక్తవర్ణముగల నూలును హిస్సోపును తీసికొని పారు నీటి పైని చంపిన పక్షిరక్తములో వాటిని సజీవమైన పక్షిని ముంచి 7. కుష్ఠు విషయములో పవిత్రత పొందగోరు వాని మీద ఏడుమారులు ప్రోక్షించి వాడు పవిత్రుడని నిర్ణ యించి సజీవమైన పక్షి ఎగిరిపోవునట్లు దానిని వదిలివేయ వలెను. కుష్టు రోగం, దానిని పొందిన రోగిని పాలెంలో నుండి విడదీసినట్లు, పాపం మనలను దేవుని యొద్దనుండి వేరుచేసింది. యేసు క్రీస్తు తన రక్తముతో మనలను పవిత్రపరచి మనలను దేవుని ఇంటిలోకి తీసుకువచ్చాడు.
ఆ తరువాత 51 వ కీర్తన 6 వచనం చూద్దాం.
కీర్తన 51
6. నీవు అంతరంగములో సత్యము కోరుచున్నావు
ఆంతర్యమున నాకు జ్ఞానము తెలియజేయుదువు.
7. నేను పవిత్రుడనగునట్లు హిస్సోపుతో నా పాపము పరిహరింపుము.
హిమముకంటెను నేను తెల్లగా నుండునట్లు నీవు నన్ను కడుగుము.
దావీదు పాపము చేసాడు. ఆయన బత్షెబ అనే వివాహిత స్త్రీని మోహించాడు. కుట్ర చేసి ఆమె భర్తను హత్య చేయించాడు. దేవుడు తన ప్రవక్త అయిన నాతానును పంపి దావీదు పాపాన్ని అతనికి చూపించాడు. దావీదును మనస్సాక్షి గద్దించింది. తాను ఘోరమయిన పాపం చేశానని దావీదు గ్రహించి ఈ 51 వ కీర్తన వ్రాసాడు.
7. నేను పవిత్రుడనగునట్లు హిస్సోపుతో నా పాపము పరిహరింపుము. హిమముకంటెను నేను తెల్లగా నుండునట్లు నీవు నన్ను కడుగుము అని దేవుని వేడుకొంటున్నాడు. ఈ మధ్యలో అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ ఒక వివరణ ఇచ్చాడు. ఆయన అమెరికా దేశానికి అధ్యక్షుడుగా పనిచేస్తున్నప్పుడు వైట్ హౌస్ లో తన అసిస్టెంట్ పనిచేస్తున్న అమ్మాయిని మోహించి, లొంగదీసుకుని, అక్రమ సంభంధం పెట్టుకొన్నాడు. ఆ వ్యవహారం బయటపడి అప్పట్లో చాలా గొడవ జరిగింది. ఆయన పదవీచ్యుతుడు అయ్యే ప్రమాదం ఎదుర్కొన్నాడు, కాని తృటిలో పదవి కాపాడుకున్నాడు. పదవి కాపాడుకొన్నాడు కానీ ఆయన పరువు పోయింది. మొన్న ఇంటర్వూ లో విలేకరి క్లింటన్ ని అడిగాడు: ‘ఆ అమ్మాయి జీవితం పాడుచేసావు, కనీసం సారీ చెప్పావా?’ క్లింటన్ ఏమన్నాడంటే, ‘నేను సారీ చెప్పను, అలాంటి పనులు జాన్ కెన్నెడీ చేయలేదా, లిండన్ జాన్సన్ చేయలేదా? ఆ వ్యవహారంలో 60 శాతం మంది అమెరికా ప్రజలు నాకే మద్దితి చ్చారు’ అన్నాడు. 20 సంవత్సరాల తరువాత కూడా క్లింటన్ గారికి పశ్చాత్తాపం లేదు. తాను చేసిన పాపాన్ని ఒప్పుకొని ఆ అమ్మాయికి క్షమాపణ చెప్పకుండా, తనను తాను సమర్ధించుకొంటున్నాడు. మనం చేసే పెద్ద తప్పు అదే. మన పాపాలు ఒప్పుకోకుండా, ఆయన చేయలేదా, ఆమె చేయలేదా, నేను చేస్తే తప్పేమిటి? చాలా మంది నాకు సపోర్ట్ చేస్తున్నారు అని మన పాపం కప్పిపుచ్చు కొనే ప్రయత్నాలు చేస్తాం.
సామెతలు గ్రంధం 28 అధ్యాయములో మనం చదువుతాం
సామెతలు 28:13
అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. మన పాపాలు కవర్ చేయటానికి ప్రయత్నిస్తే మనమే నష్టపోతాం. వాటిని ఒప్పుకొని, విడిచిపెడితే దేవుడు మనలను కనికరిస్తాడు. మొదటి యోహాను పత్రిక మొదటి అధ్యాయములో మనం చదువుతాం: యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును మన పాపములను మనము ఒప్పుకొనిన యెడల, ఆయన నమ్మదగినవాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతినుండి మనలను పవిత్రులనుగా చేయును. హిస్సోపు మొక్కల దగ్గర యేసు క్రీస్తు మన విమోచకుడిగా, మనలను పవిత్రపరచేవాడుగా కనిపిస్తున్నాడు. ఆయన మన పాపములనుండి మనలను విమోచించేవాడు, మనలను పవిత్రపరచేవాడు. మనకు పాపానికి మధ్య దూరం పెరగాలంటే, మనకు, దేవునికి మధ్య దూరం తగ్గాలి.
30 వచనంలో మనం చదివాము. 30. యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను.
సమాప్తం
Tetelestai
It is Finished
దేవుడు తనకు ఇచ్చిన బాధ్యతను యేసు క్రీస్తు సంపూర్ణం చేసాడు. పరిశుద్ధుడయిన దేవుని యొక్క న్యాయమయిన కోపాన్ని భరించాడు. మన పాపాన్ని కొట్టివేసాడు. సాతానును జయించాడు. మరణపు ముళ్ళు విరిసివేసాడు. ప్రవచనాలు నెరవేర్చాడు. నిత్యజీవాన్ని మన ముందు ఉంచాడు. సిలువ దగ్గర మనం నేర్చుకోవలసినది అదే.
ఈ మధ్యలో నీట్ NEET జాతీయ పరీక్షల ఫలితాలు విడుదల చేశారు. తెలుగు విద్యార్థులు టాప్ 50 ర్యాంకు లలో 8 ర్యాంకు లు సాధించారు. గొప్ప విజయం. అయితే కొంతమంది కృంగిపోయారు. MBBSసీట్ రాలేదని ఆత్మహత్యలు చేసుకొన్నారు. టెక్నాలజీ పెరగడం వలన వీళ్ళు మెట్లు ఎక్కి పైకి నడవడం, బిల్డింగ్ మీద నుండి క్రిందకు దూకడం, క్రింద పడి ప్రాణాలు కోల్పోవడం ఇవన్నీ CCTV లలో ఫొటోలుగా వస్తావున్నాయి. వారి తల్లితండ్రులకు యెంత కడుపుకోత! యెంత గర్భశోకం!నాకు MBBS సీటు మొదటి సారి రాలేదు. నేను కృంగిపోకుండా, ఇంకో సంవత్సరం మొత్తం చదివి పరీక్ష వ్రాసి MBBS సీట్ వచ్చింది. MD సీట్ కూడా అంటే. మొదటి సారి రాలేదు, ఇంకో సంవత్సరం మొత్తం చదివి వ్రాసాను, వచ్చింది.
నేటి అపజయాలే రేపటి విజయానికి పునాదులు.
మన సమాజములో ఎన్నో వృత్తులు వున్నాయి. ఏ పని చేసుకొని అయినా బ్రతకొచ్చు. దేవునితో సాలిసి నడవడమే ముఖ్యం కానీ, ఏ పని చేసి బ్రతికామన్నది ముఖ్యం కాదు. గత 20 సంవత్సరాల్లో ఆత్మ హత్యలు 30 శాతం పెరిగినాయి. సిలువ దగ్గర దేవుడు మానవాళికి గొప్ప పాఠం నేర్పిస్తున్నాడు. నా కుమారుణ్ణి చూడండి. ఆయనకు నేను ఒక భాద్యతను అప్పగించాను. ఆరునూరయినా, మానవులు వ్యతిరేకించారు. సాతాను అడ్డంకులు కల్పించాడు. దెయ్యాలు అభ్యంతరాలు కల్పించారు. వారందరిని అధిగమించి, ‘సమాప్తము’ అని ఆయన పలికాడు. అంత్యంత క్రూరమయిన సిలువ శిక్షనుండే అబ్దుతమయిన రక్షణ,అబ్దుతమయిన ప్రేమ, అబ్దుతమయిన కృప, అబ్దుతమయిన నిత్యజీవము మనకు అనుగ్రహించాడు.
7. A Spear
22 కీర్తన, 16 వచనం చూద్దాం
కుక్కలు నన్ను చుట్టుకొనియున్నవి. దుర్మార్గులు గుంపుకూడి నన్ను ఆవరించియున్నారు. వారు నా చేతులను నా పాదములను పొడిచియున్నారు. ఆ మాటలు మీరు గమనించండి. వారు నా చేతులను నా పాదములను పొడిచియున్నారు. ఇక్కడ ఆసక్తి కరమయిన విషయం ఏమిటంటే, దావీదు ఈ ప్రవచనం చేసినప్పుడు ఈ ప్రపంచములో సిలువ శిక్ష అనేదేలేదు.పర్షియనులు సిలువ శిక్షను మొదటగా కనిపెట్టారు. భూమిని వారు దేవతగా కొలిచేవారు. ఒక నేరస్తుడు భూమి మీద నిలబడి మరణిస్తే భూదేవతకు అపచారం అని వారు భావించేవారు. భూమికి తగులకుండా ఒక కొయ్య మీద నేరస్తుణ్ణి వ్రేలాడదీసి శిక్షించేవారు.
పెర్షియనుల నుండి ఈ పద్దతులను గ్రీకులు, ఆ తరువాత రోమన్లు నేర్చుకొని మార్పులు చేశారు. ఇది చాలా క్రూరమయిన శిక్ష అని రోమన్లకు కూడా తెలుసు. అందుకనే రోమన్ పౌరులకు ఈ సిలువ శిక్ష నుండి మినహాయింపు కలిగించారు. రక్షకుని యొక్క చేతులు, పాదాలు పొడవబడతాయి అని ప్రవక్తల ద్వారా దేవుడు ముందే మనకు తెలియజేశాడు.
జెకర్యా 12:10 లో మనం చదువుతాం
“వారు తాము పొడిచిన నా మీద” అని దేవుడు అక్కడ అన్నాడు.
Me whom they have pierced
యోహాను సువార్త లో ఈ ప్రవచనం ప్రస్తావించబడింది. మరియు తాము పొడిచిన వానితట్టు చూతురు అని మరియొక లేఖనము చెప్పుచున్నది అని యోహాను సువార్త 19:37 లో మనం చదువుతాం. యేసు క్రీస్తు యొక్క కాళ్ళు, చేతులలో దావీదు చెప్పినట్లే మేకులు కొట్టబడ్డాయి. ఆయన ప్రక్క ఈటెతో పొడవబడింది. మన పాప ప్రక్షాళన కోసం ఆయన పవిత్ర రక్తం చిందించ బడింది. బిల్లీ గ్రాహం గారు, ‘నా నిరీక్షణకు హేతువు’ అనే తన పుస్తకములో ఈ మాటలు వ్రాసాడు: ‘పాపము వలనే హింస, ద్వేషం,నొప్పి, భాధ, యుద్ధం మన ప్రపంచములోకి ప్రవేశించాయి. మన శత్రువు పాపమే. పాపమే దేవుని కుమారుణ్ణి సిలువకు కొట్టింది.’
8. A Skeleton
22 కీర్తన 14,17 వచనాలు చదువుదాం.
14. నేను నీళ్లవలె పారబోయబడి యున్నాను
నా యెముకలన్నియు స్థానము తప్పియున్నవి
నా హృదయము నా అంతరంగమందు మైనమువలె కరగియున్నది.
17. నా యెముకలన్నియు నేను లెక్కింపగలను
వారు నిదానించుచు నన్ను తేరి చూచుచున్నారు.
నేను నీళ్ల వలే పారబోయబడి యున్నాను.
మనుష్యులు చాలా అజాగ్రత్తగా యేసు క్రీస్తు పట్ల ప్రవర్తించారు.
నాలా నిర్లక్షంగా ఆయన దేహము మీద దాడి చేశారు. చాలా క్రూరముగా ఆయనను గాయపరచారు. అయితే దేవుడు తన కుమారుని యొద్ద, సిలువ దగ్గర నిలబడి వున్నాడు. నా యెముకలన్నియు నేను లెక్కింపగలను యోహాను సువార్త 19 అధ్యాయములో మనం చదువుతాం. విశ్రాంతి దినం రోజున సిలువ మీద ఎవరూ వ్రేలాడకూడదు. సిలువ మీద వున్న వారు తొందరగా చనిపోవాలని సైనికులు వారి కాళ్ళు విరుగగొట్టేవారు. యేసు క్రీస్తు కు రెండు వైపులా ఇద్దరు దొంగలను సిలువ వేశారు. సైనికులు వెళ్లి ఆ ఇద్దరి కాళ్ళు విరుగగొట్టారు. యేసు క్రీస్తు కాళ్ళు వారు విరుగగొట్టలేదు ఎందుకంటే ఆయన అప్పటికే మరణించాడు. యోహాను అక్కడ యేమని వ్రాశాడంటే,
అతని యెముకలలో ఒకటైనను విరువబడదు అను లేఖనము నెరవేరునట్లు ఇవి జరిగెను. యోహాను 19:36
కీర్తన 34:20 లో ఈ ప్రవచనం చెప్పబడింది. ఆయన వాని యెముకలన్నిటిని కాపాడును వాటిలోఒక్కటియైనను విరిగిపోదు.
22 కీర్తనలో కూడా అదే ప్రవచనం మనం చూస్తున్నాం. నా యెముకలన్నియు నేను లెక్కింపగలను ఎముకలు విరుగడం చాలా తేలిక. జారి క్రింద పడతాం, దెబ్బ తగులుద్ది. హాస్పిటల్ కి వెళ్లి x ray తీయించుకొంటాం. నీ ఎముక విరిగింది, కాస్టింగ్ చేయాలి, కొంతకాలం నువ్వు కట్టుకట్టుకోవాలని డాక్టర్ మనకు చెబుతాడు. ఫ్రాక్చర్ అవడం చాలా తేలిక. అయితే దేవుడు యేసు క్రీస్తుకు ఎలాంటి ఫ్రాక్చర్లు కాకుండా కాపాడాడు. ఆయనను ఈడ్చుకొని వెళ్లారు గుద్దారు, కొరడాలతో కొట్టారు,మేకులు కొట్టారు, ఈటెతో పొడిచారు.కానీ, ఆయన శరీరములో ఒక్క ఎముక కూడా విరువబడలేదు. దేవుని యొక్క సార్వభౌమాధికారంఅక్కడ మనకు కనిపిస్తున్నది. God’s Sovereignty
హెబ్రీయులకు వ్రాసిన పత్రిక 9:22 లో మనం చదువుతాం: ‘రక్తము చిందింపకుండ పాప క్షమాపణ కలుగదు’ దేవుడు యేసు క్రీస్తును సిలువ మీద వదలివేసి వెళ్లిపోలేదు. దేవుడు అక్కడే తన కుమారుని యొద్ద వున్నాడు. మీ పాప క్షమాపణ కొరకు నా కుమారుని రక్తం కావాలి కాబట్టి నా కుమారుని యొక్క రక్తం చిందించ టానికి మాత్రమే నేను మీకు అనుమతి ఇస్తాను. ఆయన ఎముకలను మీరు విరుగగొట్టలేరు. దానికి నేను అనుమతి ఇవ్వను. సిలువ దగ్గర మానవుడు ఏంతో దుర్మార్గముగా, క్రూరముగా దేవుని కుమారుని మీద రెచ్చిపోయాడు. అయితే అక్కడ కూడా దేవుని యొక్క సార్వభౌమాధికారం మనకు కనిపిస్తున్నది. మనం కష్టాలు, శ్రమలు వచ్చినప్పుడు, ‘దేవుడు నన్ను వదలివేసి వెళ్ళిపోయాడు’ అని అనుకొంటాము.
లూకా సువార్త 12 అధ్యాయములో యేసు ప్రభువు ఏమన్నాడు? 12:6-7
అయిదు పిచ్చుకలు రెండు కాసులకు అమ్మబడును గదా; అయినను వాటిలో ఒకటైనను దేవుని యెదుట మరువబడదు.మీ తలవెండ్రుకలన్నియు లెక్కింపబడియున్నవి. భయపడకుడి; మీరు అనేకమైన పిచ్చుకలకంటె శ్రేష్ఠులు కారా? అయిదు పిచ్చుకలు ఏంటి? రెండు కాసులు ఏంటి? వాటిలో ఒకటి అయినను దేవుని ఎదుట మరువబడదు. ఒక పిచ్చుకను కూడా మరచిపోని దేవుడు మిమ్ములను మరచిపోతాడా? మీ తలవెండ్రుకలు లెక్కించబడినవి అని అన్నాడు.
సిలువ మీద యేసు క్రీస్తు శరీరములో ఎముకలను లెక్కించిన దేవుడే మన తల మీద వెండ్రుకలను కూడా లెక్కించాడు. |
- A Shroud
18 వచనం చూద్దాం.
నా వస్త్రములు వారు పంచు కొనుచున్నారు. నా అంగీ కొరకు చీట్లు వేయుచున్నారు.
సిలువ దగ్గర ఈ ప్రవచనం నెరవేరింది.
మార్కు సువార్త 15:24 లో మనం చదువుతాం
- వారాయనను సిలువవేసి, ఆయన వస్త్రముల భాగము
ఎవనికి రావలెనో చీట్లువేసి, వాటిని పంచు కొనిరి.
సాధారణముగా 4 సైనికులు ఒక వ్యక్తిని సిలువ వేస్తారు.
ఆ వ్యక్తి యొక్క వస్త్రాలు, తలా పాగా, బెల్టు, చెప్పులు నలుగురు సైనికులు పంచు కొంటారు. యేసు క్రీస్తు వస్త్రాలు
కూడా వారు చీట్లు వేసుకొని పంచుకొన్నారు.
సిలువ మీద యేసు క్రీస్తు మన కోసం తన వస్త్రాలు కోల్పోయాడు.
ఒక వ్యక్తి యొక్క వస్త్రాలు తీసివేస్తే ఆ వ్యక్తి కి యెంత అవమానం!
మన మీద వున్న ప్రేమ కోసం ఆయన అంతటి అవమానం కూడా సహించాడు.
ఆదాము, హవ్వలు ఏదెను వనములో వున్నప్పుడు దేవుని మహిమతో వారు కప్పబడ్డారు. ఆ తోట మధ్యలో దేవుడు ఒక చెట్టు పెట్టాడు. ఆ చెట్టు కాయలు తినబాకు అన్నాడు. ఆదాము, హవ్వలు సాతాను మాట విని ఆ చెట్టు కాయలు తిన్నారు. అప్పుడు ఈ లోకములో పాపం ప్రవేశించింది. ఈ మధ్యలో ఒక నాస్తికుడు ఏమన్నాడంటే, దేవుడు ఏదెను తోటలో చెట్టు పెట్టడం తప్పు. ఆ చెట్టు పెట్టి దేవుడు వారిని శోధించాడు అన్నాడు. దేవుడు ఆ చెట్టును వారి మధ్య పెట్టింది వారిని శోధించటానికి కాదు, తన నమ్మకత్వాన్ని వారికి గుర్తుచేయడానికి. వివాహ కార్యక్రమములో వధువు, వరుడు ఉంగరాలు మార్చుకొని, ప్రమాణాలు చేసుకొంటారు. భవిష్యత్తులో వారి వైవాహిక జీవితములో వారికి తప్పకుండా శోధనలు వస్తాయి. ఆఫీస్ లోనో, బజారులోనో, బస్సులోనో, రైలు లోనో, విమానం లోనో వారు ఒంటరిగా వున్నప్పుడు వారికి శోధన రావచ్చు. ఆ సమయములో భర్త తన వేలు మీద వున్న ఉంగరం చూసుకొని భార్యను గుర్తుచేసుకొంటాడు. భార్యతో చేసిన ప్రమాణం గుర్తుచేసుకొంటాడు. భార్య కూడా తన వేలు మీద వున్నఉంగరం చూసుకొని తన భర్తను గుర్తుచేసుకొంటుంది. తన భర్తతో చేసిన ప్రమాణం గుర్తుచేసుకొంటుంది. ఏదెను వనములో దేవుడు నాటిన ఆ చెట్టు పెళ్లి ఉంగరం లాంటిది. ఆ చెట్టును చూసినప్పుడు నా ఆజ్ఞలు మీకు గుర్తుకు రావాలి అన్నాడు. భార్యను మోసం చేసిన భర్త, నాకు అసలు ఈ ఉంగరం ఎందుకు పెట్టావు అని గొడవ చేస్తే ఎలా ఉంటుంది? ఈ చెట్టెందుకు పెట్టావయ్యా? నాకు శోధన కాదా? అని విమర్శించడం కూడా అలాంటిదే.
ఆదాము, హవ్వలు తినవద్దు అన్న ఫలాలు తిని దేవునికి నమ్మక ద్రోహం చేశారు. వారికి వెంటనే సిగ్గు కలిగింది. తమ నగ్నత్వాన్ని వారు గుర్తించారు. అంజూరపు ఆకులతో వారు వస్త్రాలు చేసుకొని వేసుకొన్నారు. ఆ వస్త్రాలు వారి భయాన్ని తీసివేయలేకపోయాయి. దేవుడు పిలిచినప్పుడు వారు వెళ్లి దాగుకొన్నారు. దేవుడు కొన్ని జంతువులను చంపి వారికి చర్మపు చొక్కాలు చేయించి తొడిగించాడు. ఏదెను వనములో దేవుడు చేయించిన ఆ వస్త్రాలలో మనకు క్రీస్తు కనిపిస్తున్నాడు. ఆదాము హవ్వలకు వస్త్రాలు ఇవ్వటానికి ఆ జంతువుల రక్తం చిందించబడినట్లే, మనకు నీతి వస్త్రాలు అనుగ్రహించటానికి యేసు క్రీస్తు రక్తం చిందించబడింది. మనకు తన రక్షణ వస్త్రాలు ఇవ్వటానికి యేసు క్రీస్తు తన వస్త్రాలు కోల్పోయాడు. యెషయా గ్రంధం లో మనం చదువుతాం: మేమందరము అపవిత్రులవంటివారమైతిమి. మా నీతిక్రియలన్నియు మురికిగుడ్డవలె నాయెను (యెషయా 64:6)
దేవుడు నన్ను ప్రేమించటమే ఆశ్చర్యం. మిమ్మల్ని ప్రేమించటం ఇంకా ఆశ్చర్యం. నన్ను ప్రేమించాడంటే అర్ధం చేసుకోవచ్చు. మిమ్మల్ని ప్రేమించడం ఏంటి? కానీ, మనమందరం అప్పుడప్పుడూ అలాగే అనుకొంటాము. దేవుడు నన్ను ప్రేమించాడంటే అర్ధం చేసుకోవచ్చు, కానీ ఫలానా వ్యక్తిని ప్రేమించడం ఏమిటి ఆ వ్యక్తి చాలా ఘోరమయిన పాపి కదా అని మనం అనుకొంటాము. అయితే దేవుని దృష్టిలో మనం అందరం ఒక్కటే. ఒక చిన్న గ్రామములో రాజు, రవి అని ఇద్దరు స్నేహితులు వున్నారంట. రాజు హైదరాబాద్ వెళ్ళాడు. అతనికి ఏ వుద్యోగం రాక బిచ్చగాడుగా మారాడు. రవి కూడా రాజును ఆదర్శముగా చేసుకొని ఆ చిన్న గ్రామములోనే బిచ్చగాడుగా జీవిస్తున్నాడు. కొంత కాలం తరువాత రవి హైదరాబాద్ వెళ్లి రాజు ను కలిశాడంట, ‘ఒరేయ్, రాజు, మనిద్దరం చిన్నప్పటినుండి స్నేహితులం. మా అబ్బాయికి, మీ అమ్మాయిని అడుగుదామని వచ్చాను. మన స్నేహాన్ని శాశ్వత బంధం చేసుకొందాం రా’ అన్నాడంట. ఆ మాటలు విని రాజుకు కోపం వచ్చిందంట. ‘శాశ్వత బంధమా,నీ తల కాయా, నీ స్టేటస్ ఏంటి, నా స్టేటస్ ఏంటి, మన మధ్యలో పెళ్లి సంబంధాలు ఏంటి? అన్నాడంట. రవి ఆ మాటలకు ఆశ్చర్యపోయి, ‘నువ్వు బిచ్చగాడివి, నేను బిచ్చగాణ్ణి, మన మధ్యలో స్టేటస్ ఏంటి మావా?’ అన్నాడంట. రాజు అన్నాడంట, ‘నేను హైదరాబాద్ లో బిచ్చగాణ్ణి, నువ్వు ఒక చిన్న పల్లెటూరు బిచ్చగాడివి,’ అన్నాడంట.
మనం కూడా చాలా సార్లు ఆ బిచ్చగాళ్ల లాగానే ప్రవర్తిస్తాం. దేవుడు నన్ను ప్రేమంచాడంటే అర్ధం చేసుకోవచ్చు, వాణ్ని ఎలా ప్రేమంచాడయ్యా అని అనుకొంటాము. రోమా పత్రికలో మనం చదువుతాం:
ఏ భేదమును లేదు; అందరును పాపముచేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొంద లేకపోవుచున్నారు. రోమా 3:23
దేవుడు ఇచ్చే నీతి వస్త్రాలు లేకుండా మనలో ఎవరూ పరలోకం వెళ్ళలేరు.
లూకా సువార్త 15 అధ్యాయములో మనం చూస్తే, అక్కడ తప్పిపోయిన కుమారుడు తండ్రి ఆస్తిని మొత్తం వ్యర్థం చేసి, చాలా దుస్థితిలో తండ్రి ఇంటికి తిరిగి వెళ్ళాడు. తండ్రి ఆ కుమారుని కౌగలించుకొని, ముద్దు పెట్టుకొని, అతని మురికిగుడ్డలు తీసివేసి,ఒక ప్రశస్త వస్త్రాన్ని అతనికి తొడిగించి, ఇంటిలోకి ఆహ్వానించాడు. ఈ రోజు దేవుడు యేసు క్రీస్తు రక్తము చేత,గొప్ప వెల చెల్లించి సిద్ధపరచిన ప్రశస్తమయిన నీతి వస్త్రాలను మనకు తొడిగించి తన ఇంటిలోకి మనలను ఆహ్వానిస్తున్నాడు.
మిత్రమా, యేసు క్రీస్తును నీ జీవితములోకి ఆహ్వానించి ఈ రోజు రక్షణ పొందుము.