నాలుగు వందల సంవత్సరాల పాటు ఇశ్రాయేలీయులు ఐగుప్తులో బానిసత్వం క్రింద బ్రతికారు. దేవుడు వారిని మోషే నాయకత్వములో అక్కడ నుండి విడిపించి వాగ్దాన దేశము కనాను వైపుకు నడిపించాడు. మార్గ మధ్యములో సీనాయి పర్వతము దగ్గర దేవుడు వారిని దత్తత తీసుకొన్నాడు. రోమా పత్రిక 9 అధ్యాయములో అపొస్తలుడయిన పౌలు దేవుడు వారికి ఇచ్చిన ధన్యతలను వివరించాడు.
వీరు ఇశ్రాయేలీయులు; దత్తపుత్రత్వమును మహిమయు నిబంధనలును ధర్మశాస్త్ర ప్రధానమును అర్చనాచారాదులును వాగ్దానములును వీరివి. రోమీయులకు 9:4
దేవుడు యూదులకు అనేక ఈవులు అనుగ్రహించాడు. దత్తపుత్రత్వమును, మహిమయు, నిబంధనలును,ధర్మశాస్త్ర ప్రధానమును, అర్చనాచారాదులును, వాగ్దానములును వీరివి.
వీటిలో మొదటి ధన్యత దత్తపుత్రత్వము. దేవుడు వారిని adopt చేసుకొన్నాడు. అప్పుడు వారు ఆయన సంతానమయ్యారు. దేవుడు వారి మధ్య నివసించాలని కోరుకున్నాడు. ఒక ప్రత్యక్ష గుడారం నిర్మించవలసినదిగా దేవుడు మోషే గారిని ఆజ్ఞాపించాడు.
ఇంతవరకూ దేవుడు తన ప్రియులతో నడిచాడు. ఆదాము, హవ్వ, హేబెలు, హానోకు, నోవహు, అబ్రాహాము, ఇస్సాకు, యాకోబు వీరితో దేవుడు నడిచాడు. అయితే ఇప్పుడు తన ప్రియుల మధ్య నివసించటానికి దేవుడు తనకొక నివాస స్థలము నిర్మించవలసినదిగా అడుగుచున్నాడు.
నిర్గమ కాండము 25:8 – నేను వారిలో నివసించునట్లు వారు నాకు పరిశుద్ధస్థలమును నిర్మింపవలెను.
దేవుడు మోషే గారిని కొండ మీదకు పిలిచాడు. అక్కడ మోషే గారు 40 పగళ్లు, 40 రాత్రులు దేవుని సన్నిధిలో గడిపాడు. అప్పుడు దేవుడు మోషే గారికి ప్రత్యక్ష గుడారం ఎలా నిర్మించాలో ఒక ప్లాన్ ఇచ్చాడు. ఆ ప్రత్యక్ష గుడారం ఇశ్రాయేలీయుల పాలెం మధ్య నిర్మించబడింది. దాని చుట్టూ ఇశ్రాయేలీయుల 12 గోత్రాల ప్రజలు ఇల్లు కట్టుకున్నారు. దేవుని నివాసం, దేవుని ఆరాధన వారి మధ్యలో ఉన్నాయి. ఆరాధన మన జీవితాల్లో కేంద్రముగా ఉండాలి. తన సన్నిధి మన మధ్యలో వుండాలని దేవుడు కోరుకొంటున్నాడు. అందువలననే ప్రత్యక్ష గుడారాన్ని ఇశ్రాయేలీయుల మధ్యలో నిర్మించవలసినదిగా దేవుడు ఆదేశించాడు.
దేవుని ఆరాధనకు మనం అంత ప్రాధాన్యత ఇవ్వము. ఆరాధన అంటే ఎప్పుడో ఆదివారం ప్రొద్దున చేసుకొనేదిలే అని చాలా మంది అనుకొంటారు. అయితే ఆరాధన మనం ప్రతిరోజూ చేయవచ్చు. ఎక్కడ ఉన్నా చేయవచ్చు.
స్వాములను, బాబాలను, నియంతలు ఆరాధించటం ఈ ప్రపంచములో ఉన్నది. ఏప్రిల్ 15, 1912 – అది కిమ్ సుంగ్ (Kim Sung II) పుట్టిన రోజు. ఆ రోజు నార్త్ కొరియా ప్రజల కేలండర్ మొదలవుతుంది. ఆ నియంతను అతని సంతానాన్ని నార్త్ కొరియా ప్రజలు బలవంతముగా ఆరాధిస్తున్నారు. అయితే, ఇశ్రాయేలీయులు ఏ మనిషిని ఆరాధించకూడదు. ఆరాధన కేవలం దేవునికి మాత్రమే చెందినది.
అన్య మతాల ఆలయాల్లో అనేక వస్తువులు, స్తంబాలు పెట్టుకొని ప్రజలు వాటిని మ్రొక్కుతారు. ఈ ప్రత్యక్ష గుడారములో అనేక వస్తువులు, స్తంబాలు వున్నాయి. కానీ, ఇశ్రాయేలీయులు ఏ స్తంభాన్ని, ఏ వస్తువును పూజించరు. ఆరాధన అనేది కేవలం అదృశ్యుడయిన దేవునికి మాత్రమే చెందాల్సి వున్నది.
‘దేవుడు ఆత్మగనుక ఆయనను ఆరాధించు వారు ఆత్మతోను, సత్యముతోను ఆరాధింపవలెననెను’ అని యేసు ప్రభువు యోహాను సువార్త 4:24 లో మనకు తెలియజేశాడు.
2014 లో నేను హవ్వాయి దీవులకు వెళ్ళాను. అక్కడ హోనోలులు పట్టణములో USS మిస్సోరి నావ యొద్దకు వెళ్ళుటకు ఒక టాక్సీ మాట్లాడుకొన్నాను. దారిలో టాక్సీ డ్రైవర్ ని అడిగాను. ‘నీవు ఎక్కడ నుండి వచ్చావు’ అని ప్రశ్నించాను. ‘నేను జపాన్ నుండి వచ్చాను’ అని ఆ టాక్సీ డ్రైవర్ అన్నాడు. ‘నీ మతం ఏమిటి’ అని అతని అడిగాను.
‘నేను ప్రకృతిని పూజిస్తాను. ప్రకృతిలో ప్రతి దానిని పూజిస్తాను. రాళ్లు, రప్పలు, చెట్లు, జంతువులు, పాములు, మానవులు అందరిని పూజిస్తాను’ అని ఆ టాక్సీ డ్రైవర్ నాతో అన్నాడు. అయితే, ఆరాధన రాళ్లకు, రప్పలు, చెట్లకు, పుట్లకు, పురువులకు, పుణ్యాత్ములకు చేసేది కాదు. అది కేవలం దేవునికి మాత్రమే చెందాలి.
ప్రత్యక్ష గుడారాన్ని ఎలా కట్టాలో దేవుడే తెలియజేశాడు. ఆ క్రమం దేవుడే బయలుపరచాడు. అన్నదమ్ములయిన కయీను, హేబెలు ఇద్దరూ దేవుని ఆరాధించాలని వెళ్లారు. అయితే, కయీను ఆరాధనను దేవుడు అంగీకరించలేదు. హేబెలు ఆరాధనను మాత్రమే ఆయన అంగీకరించాడు, ఆస్వాదించాడు. కయీను తన ఇష్టానుసారంగా దేవుని ఆరాధించాలని వెళ్లి భంగపడ్డాడు. హేబెలు దేవుని క్రమములో వెళ్ళాడు. దేవుడు హేబెలు ఆరాధనను అంగీకరించాడు. ఆరాధనకు దేవుడు ఒక క్రమం నెలకొల్పాడు. ఆ క్రమం ఇక్కడ మనం చూస్తున్నాం.
దేవుడు మోషేతో ఏమన్నాడంటే, నిర్గమ కాండం 25:40, కొండమీద నీకు కనుపరచబడిన వాటి రూపము చొప్పున వాటిని చేయుటకు జాగ్రత్తపడుము.
ప్రత్యక్ష గుడారాన్ని నీ ఇష్టమొచ్చినట్లుగా కట్టడానికి వీల్లేదు. నేను చూపించినట్లుగా కట్టు. కొండ మీద మోషే గారు ఉన్నప్పుడు, దేవుడు ఆయనకు ప్రత్యక్ష గుడారం ఏ విధముగా ఉండాలో ఒక పరలోక దర్శనములో చూపించాడు. ఆ విధముగా చేయి అని దేవుడు మోషేను ఆజ్ఞాపించాడు.
హెబ్రీయులకు 8: 5 – మోషే గుడారము అమర్చబోయినప్పుడు కొండమీద నీకు చూపబడిన మాదిరి చొప్పున సమస్తమును చేయుటకు జాగ్రత్తపడుము అని దేవునిచేత హెచ్చరింపబడిన ప్రకారము ఈ యాజకులు పరలోకసంబంధమగు వస్తువుల ఛాయా రూపకమైన గుడారమునందు సేవచేయుదురు.
ఆ మాటలు దయచేసి గమనించండి. ఈ గుడారం ఏమిటి?
పరలోకసంబంధమగు వస్తువుల ఛాయా రూపకమైన గుడారము – the copy and shadow of heavenly things
మనకు ఇక్కడ కనబడుచున్న ప్రత్యక్ష గుడారం కేవలం ఛాయ మాత్రమే. నిజమయినది పరలోకములో వున్నది. ప్రకటన గ్రంథము 15: 5 – అటుతరువాత నేను చూడగా, సాక్ష్యపు గుడార సంబంధమైన ఆలయము పరలోకమందు తెరవబడెను.
పరలోక సంభందమయిన రూపం ప్రకారం దానిని కట్టాలి తప్ప, భూలోక సంభందమయిన జ్ఞానముతో దానిని కట్టడానికి వీల్లేదు. మీరు గమనించండి: పరలోకములో దేవుడు నిర్ణయించిన ప్రణాళిక ప్రకారం ప్రత్యక్ష గుడారం కట్టబడింది. అదే విధముగా, పరలోకం లో దేవుడు నిర్ణయించిన ప్రణాళిక ప్రకారం యేసు క్రీస్తు ఈ భూలోకానికి వచ్చాడు.
1 పేతురు 1:20 – ఆయన జగత్తు పునాది వేయబడక మునుపే నియమింపబడెను.
గలతీయులకు 4:4 – కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను.
ప్రత్యక్ష గుడారం నిర్మాణం కానీ, యేసు క్రీస్తు యొక్క విమోచన కార్యం కానీ దేవుడు నిత్యత్వమంతా చేసిన ప్రణాళిక వలన కలిగినవే తప్ప, అవి అనాలోచితముగా, యాదృచ్చికముగా, అకస్మాత్తుగా జరిగినవి కావు. ముందుగా ఈ ప్రత్యక్ష గుడారం ఎలా ఉంటుందో చూడండి. బయట ఆవరణలో ఒక బలి పీఠం, కాళ్ళు కడుక్కొనే గోళం ఉన్నాయి. గుడారములో పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము ఉన్నాయి.
పరిశుద్ధ స్థలములో రొట్టెల బల్ల, దీప వృక్షం, ధూమ పీఠం. అతి పరిశుద్ధ స్థలములో మందసము వున్నది. దానిలో ఆజ్ఞలు కల రెండు పలకలు, మన్నా కల పాత్ర, అహరోను కర్ర వున్నాయి. మందసము శుద్ధ బంగారముతో కప్పబడింది. దాని మీద కరుణా పీఠము, కెరూబులు ఉన్నాయి. కరుణా పీఠము దగ్గర దేవుడు తన ప్రజలను చిందించబడిన రక్తము ద్వారా కలుస్తున్నాడు.
ఇశ్రాయేలీయులు సొలొమోను రాజు క్రింద ఒక గొప్ప దేవాలయం కట్టుకున్నారు. ఇది కూడా ప్రత్యక్ష గుడారం ఆధారంగానే కట్టబడింది. దేవునికి ఒక క్రమం వున్నదని మనం గుర్తించాలి. వివాహం, కుటుంబం, సంఘం, ప్రభుత్వం వాటికి దేవుడు ఒక క్రమం నెలకొల్పాడు. ఆ క్రమాలు దేవుని వాక్యం చదివి మనం అర్ధం చేసుకొనగలము. ప్రత్యక్ష గుడారం నిర్మాణానికి ప్రజలు స్వచ్చంద కానుకలు తీసుకు వచ్చారు.
నిర్గమకాండము 25
- యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను 2. నాకు ప్రతిష్ఠార్పణ తీసికొనిరండని ఇశ్రాయేలీయులతో చెప్పుము. మనఃపూర్వకముగా అర్పించు ప్రతి మనుష్యుని యొద్ద దాని తీసికొనవలెను.3. మీరు వారియొద్ద తీసికొన వలసిన అర్పణ లేవనగా బంగారు, వెండి, ఇత్తడి,4. నీల ధూమ్ర రక్తవర్ణములు, సన్నపునార, మేకవెండ్రుకలు,5. ఎరుపురంగు వేసిన పొట్టేళ్లతోళ్లు, సముద్రవత్సల తోళ్లు, తుమ్మకఱ్ఱలు,6. ప్రదీపమునకు తైలము, అభిషేక తైలమున కును పరిమళ ద్రవ్యముల ధూపమునకు సుగంధ సంభార ములు,7. లేతపచ్చలు, ఏఫోదుకును పతకమునకును చెక్కు రత్నములు అనునవే.
దేవుడు ఇశ్రాయేలీయులు సంతోషముగా తీసుకొని వచ్చిన కానుకలను స్వీకరించాడు. దేవుడు తలచుకొంటే, పరలోకములో నుండి రెడీ మేడ్ గా ఒక ప్రత్యక్ష గుడారాన్ని ఇశ్రాయేలీయుల దగ్గరకు పంపేవాడే. కానీ ఆయన అలా చేయ దలచుకోలేదు.
‘మనఃపూర్వకముగా అర్పించు ప్రతి మనుష్యుని యొద్ద దాని తీసికొనవలెను.’
ఈ రోజున 10 రూపాయలు ఇచ్చి, పది కంప్లయింట్ లు చేసే వాళ్ళు మన సంఘాల్లో పెరిగిపోవుచున్నారు. అయితే, తనకు సంతోషముతో, ఉత్సాహముతో, మనఃపూర్వకముగా కానుకలు ఇవ్వాలని దేవుడు కోరుచున్నాడు.
‘సణుగుకొనకయు, బలవంతముగా కాకయు, ప్రతివాడును తన హృదయములో నిశ్చ యించుకొనిన ప్రకారము ఇయ్య వలెను; దేవుడు ఉత్సాహముగా ఇచ్చువానిని ప్రేమించును’ (2 కొరింథీ 9:7) అని వ్రాయబడింది.
3 వచనం నుండి చూడండి:
- మీరు వారియొద్ద తీసికొన వలసిన అర్పణలేవనగా బంగారు, వెండి, ఇత్తడి, 4. నీల ధూమ్ర రక్తవర్ణములు, సన్నపునార, మేకవెండ్రుకలు,…..
మొట్టమొదటిగా దేవుడు తన ప్రజల దగ్గరనుండి బంగారం అడిగాడు. దేవుడు తన ప్రజల నుండి శ్రేష్ఠమయినవి అడుగుచున్నాడు. పిచ్చివి, పనికిరానివి దేవునికి పడేద్దాం అని మనం అనుకోకూడదు. మన దగ్గర ఉన్న శ్రేష్ఠమయినవి, ప్రశస్త మయినవి దేవునికి మనం ఇవ్వాల్సివుంది. మోషే గారి అభ్యర్ధన విన్న వెంటనే, ఇశ్రాయేలీయులు తమ కానుకలు తీసుకొనివచ్చారు.
నిర్గామకాండము 36:5 – మోషేతో చేయవలెనని యెహోవా ఆజ్ఞాపించిన పని విషయమైన సేవకొరకు ప్రజలు కావలసిన దానికంటె బహు విస్తారము తీసికొని వచ్చుచున్నారని చెప్పగా 6. మోషేపరిశుద్ధస్థలమునకు ఏ పురుషుడైనను ఏ స్త్రీయైనను ఇకమీదట ఏ అర్పణనైనను తేవద్దని ఆజ్ఞాపించెను గనుక పాళె మందంతటను ఆ మాట చాటించిరి.
ఇశ్రాయేలీయులు దేవుని మీద యెంత ప్రేమ చూపించారో మనకిక్కడ కనిపిస్తున్నది. ఈ ప్రత్యక్ష గుడారాన్ని నిర్మించడానికి విస్తారముగా వారు కానుకలు ఇచ్చారు. యెంత విస్తారముగా ఇచ్చారంటే, ‘ఇప్పటి వరకు ఇచ్చింది చాలు బాబు, ఇక ఆపివేయండి’ అనేదాకా. కానుకలు ఇవ్వడం మాత్రమే కాకుండా, పురుషులు, స్త్రీలు ప్రత్యక్ష గుడారం నిర్మాణానికి శ్రమదానం చేశారు.
నిర్గమకాండము 35:25, 26
మరియు వివేక హృదయముగల స్త్రీలందరు తమ చేతులతో వడికి తాము వడికిన నీల ధూమ్ర రక్తవర్ణములు గల నూలును సన్ననార నూలును తెచ్చిరి.26. ఏ స్త్రీలు జ్ఞానహృదయము గలవారై ప్రేరేపింపబడిరో వారందరు మేక వెండ్రుకలను వడికిరి. వివేక హృదయముగల స్త్రీలందరు జ్ఞానహృదయము గలవారై సేవ చేశారు. యేసు ప్రభువు పరిచర్యలో కూడా అనేక మంది స్త్రీలు భక్తితో, ప్రేమతో ఆయనను వెంబడించి సేవ చేశారు. ఈ ప్రత్యక్ష గుడారాన్ని నిర్మించడానికి దేవుడు ఒక ప్రత్యేకమయిన వ్యక్తిని పిలిచాడు. అతని పేరు బెసలేలు
నిర్గమకాండము 31
- మరియు యెహోవా మోషేతో ఇట్లనెను 2. చూడుము; నేనుయూదా గోత్రములో హూరు మనుమడును ఊరు కుమారుడునైన బెసలేలు అను పేరుగల వానిని పిలిచితిని.3. విచిత్రమైన పనులను కల్పించుటకును బంగారుతోను వెండితోను ఇత్తడితోను పని చేయుటకును పొదుగుటకై 4. రత్నములను సాన బెట్టుటకును కఱ్ఱనుకోసి చెక్కుటకును
- సమస్త విధములైన పనులను చేయుటకును జ్ఞానవిద్యా వివేకములును సమస్తమైన పనుల నేర్పును వానికి కలుగునట్లు వానిని దేవుని ఆత్మ పూర్ణునిగా చేసి యున్నాను.
బెసలేలు అనగా ‘దేవుని నీడలో’ అని అర్ధం. బెసలేలు తన జ్ఞాన విద్యావివేకములతో ఈ గుడారాన్ని నిర్మిస్తున్నాడు.
నేను అప్పుడప్పుడు హాండెల్ వ్రాసిన మెస్సియా పాట వింటావుంటాను. జార్జ్ ఫ్రెడెరిక్ హాండెల్ (1685 – 1759) జర్మనీ దేశానికి చెందిన గొప్ప సంగీత విద్వాoసుడు. పోయిన సారి నేను లండన్ వెళ్ళినప్పుడు, అక్కడ వున్న వెస్టమిన్స్టర్ చర్చి లో హాండెల్ గారి సమాధి చూసాను. 1742 లో హాండెల్ గారు మెస్సయ్యా అనే పాట వ్రాసారు. క్రైస్తవ సంఘ చరిత్రలోనే గొప్ప పాటల్లో అది ఒకటి.
ఈ పాటకు చార్లెస్ జెనెన్స్ (Charles Jennens) అనే సువార్తికుడు సాహిత్యాన్ని అందించాడు. యేసు ప్రభువు యొక్క జీవితములో నుండి ముఖ్యమయిన ప్రవచనాలు, అబ్దుతాలు, సంఘటనలు ఆధారముగా చార్లెస్ జెనెన్స్ ఈ పాట వ్రాసాడు. హాండెల్ ఈ సాహిత్యానికి గొప్ప సంగీతాన్ని అందించాడు. చార్లెస్ జెనెన్స్ తన మిత్రుడయిన హాండెల్ ని ఎంతో ప్రోత్సహించాడు. ‘హాండెల్, నువ్వు దేవుని మహిమ కోసం ఈ సంగీతాన్ని సమకూర్చుతున్నావు. నీ జ్ఞానం, నీ అనుభవం, నీ శక్తియుక్తులన్నీ కేంద్రీకరించి పనిచేయి, ఎందుకంటె నువ్వు తీసుకున్న సబ్జెక్టు అంత గొప్ప సబ్జెక్టు. ప్రభువయిన యేసు క్రీస్తు – ఆ రక్షకుని గురించి నువ్వు చెబుతున్నావు’ అని చార్లెస్ జెనెన్స్ హాండెల్ ని ప్రోత్సహించాడు. హాండెల్ అప్పుడు సృష్టించిన ఆ గొప్ప సంగీత కావ్యం 260 సంవత్సరాల తరువాత నేటికీ మన హృదయాలను రంజింపచేస్తావున్నది.
హాండెల్ తన జ్ఞానముతో మెస్సయ్యా ని సృష్టించినట్లు, బెసలేలు పరిశుద్దాత్మ జ్ఞానముతో ఈ ప్రత్యక్ష గుడారమును సృష్టించాడు. ఈ ప్రత్యక్ష గుడారములో అనేక వస్తువులు వున్నాయి. ప్రతి వస్తువు దేనితో చేయాలో, ఏ కొలతలతో చేయాలో, దాన్ని ఎక్కడ ఉంచాలో దేవుడు సమగ్రమయిన వివరాలు మోషే గారికి ఇచ్చాడు.
పరిశుద్దాత్మ తో నింపబడి ఈ రోజు నీవు దేవుని కోసం ఏదయినా చేస్తే అది మాత్రమే శాశ్వతముగా నిలుస్తుంది. మిగిలినవన్నీ బూడిదలో పోసిన పన్నీరే. దేవుని క్రమములో ఆయన పనులు చేయటానికి దేవుడు తన జ్ఞానమును మనకు అనుగ్రహించును గాక!