పరిచయం: దేవుని గొప్ప సేవకుడైన మోషే 120 సంవత్సరాల సుదీర్ఘ జీవిత కాలము ముగింపులో ఈ పుస్తకము వ్రాసాడు. మోషే చనిపోక ముందు, 40 సంవత్సరాల పాటు అరణ్యములో తాను నడిపించిన ఇశ్రాయేలీయులకు మూడు గొప్ప ప్రసంగాలు చేసాడు. ఐగుప్తులో నుండి తన మహత్తుగల హస్తముతో మిమ్ములను దాస్యములో నుండి విడిపించిన దేవుని మరచిపోవద్దు, ఆయన పరిశుద్దతను విస్మరించవద్దు, ఆయన ధర్మశాస్త్రాన్ని విడిచిపెట్టవద్దు, అన్య దేవతల వైపుకు మరలవద్దు అని మోషే దేవుని ప్రజలకు పిలుపు నిచ్చాడు. దేవుని ఆజ్ఞలను గైకొంటే వచ్చే ఆశీర్వాదాలు, వాటిని ఉల్లంగిస్తే వచ్చే శాపాలను మోషే కూలంకుశముగా ఇశ్రాయేలీయులకు వివరించాడు (28 అధ్యాయము). దేవుని దృష్టిలో ఇశ్రాయేలీయుల యొక్క ప్రత్యేకతను వివరించాడు: నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనము, నీ దేవుడైన యెహోవా భూమిమీదనున్న సమస్త జనములకంటె నిన్ను ఎక్కువగా ఎంచి, నిన్ను తనకు స్వకీయజనముగా ఏర్పరచుకొనెను. (ద్వితీయోప 7:6)
రచయిత: మోషే
వ్రాయబడిన కాలము: క్రీ. పూ 1405, నలభై సంవత్సరాల అరణ్య యాత్ర చివరి నెల (1:3)
వ్రాయబడిన స్థలము: యొర్దాను నదికి తూర్పున ఉన్న మోయాబు దేశము.
ముఖ్య అంశాలు:
చరిత్ర మరచిపోవద్దు: బానిసత్వము క్రింద మ్రగ్గుతున్న మిమ్ములను దేవుడు ఐగుప్తు నుండి ఎలా విడిపించాడో జ్ఞాపకము పెట్టుకోండి.
దేవుని మరచిపోవద్దు: జీవము గల దేవుని మరచిపోయి, అన్య దేవతల వైపుకు వెళ్ళవద్దు.
నిబంధన మరచిపోవద్దు: దేవుడు మీ పితరులైన అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులతో చేసిన నిబంధన మరచిపోవద్దు.
ధర్మశాస్త్రము మరచిపోవద్దు: మీ పొరుగు వారికి, విధవరాండ్రకు, అనాధలకు, పేదలకు, వృద్దులకు న్యాయం, సహాయం చేయుటకు దేవుడు మీ కిచ్చిన ఆజ్ఞలను మరచిపోవద్దు.
ముఖ్య వ్యక్తులు: మోషే, యెహోషువ
గ్రంథ విభజన:
మోషే మొదటి ప్రసంగము (1:1 – 4:43)
-దేవుని మహత్కార్యములు
-ధర్మశాస్త్రానికి విధేయులు కండి
మోషే రెండవ ప్రసంగము (4:44 – 28:68)
-పది ఆజ్ఞలు
-అన్య దేవతల నుండి వేరుగా ఉండండి
-దేవునికి అవిధేయులు కాకండి
-ఆరాధన ఎలా చేయాలో సూచనలు
-ఆశ్రయపురములు
-విధేయతతో వచ్చే ఆశీర్వాదాలు, అవిధేయతతో వచ్చే శాపాలు
మోషే మూడవ ప్రసంగము (29:1 – 30:20)
మోషే స్తుతి కీర్తన (32)
మోషే దీవెన (33)
మోషే మరణము (34)
ముఖ్య ప్రవచనాలు:
ద్వితీయోప 18:16 – “నీ దేవుడైన యెహోవా నీ మధ్యను నావంటి ప్రవక్తను నీ సహోదరులలో నీకొరకు పుట్టించును” అని మోషే ఇశ్రాయేలీయులకు వాగ్దానము చేసాడు. ఆ ప్రవక్త మన ప్రభువైన యేసు క్రీస్తే (అపొ. కార్యములు 3:22-26). దేవునితో చాలా సన్నిహితముగా జీవించి, ముఖాముఖిగా దేవునితో మాట్లాడిన గొప్ప ప్రవక్త మోషే. యేసు క్రీస్తు దేవుని ప్రియకుమారుడిగా, దేవుని స్వరూపముగా వచ్చిన, ప్రవక్తలందరిలో గొప్ప ప్రవక్త. క్రీస్తు మోషే కంటే శ్రేష్టమైన ప్రవక్త. మోషే తన ప్రజలను విడిపించి, నడిపించి, బోధించిన ప్రవక్త. యేసు ప్రభువు కూడా తన ప్రజలను విడిపించి, నడిపించి, బోధించిన ప్రవక్త. మోషే తన ప్రజలను వాగ్దాన దేశములోనికి తీసుకొనివెళ్ళలేక పోయాడు. కానీ, యేసు ప్రభువు ప్రతి విశ్వాసిని పరలోకము తీసుకొనివెళ్తాడు.
ద్వితీయోప 21:23 – వ్రేలాడదీయ బడినవాడు దేవునికి శాపగ్రస్తుడు. అపొస్తలుడైన పౌలు ఈ వచనము ను యేసు క్రీస్తు కు అన్వయించాడు. ఆయన సిలువ మీద వ్రేలాడి, మన శాపాన్ని భరించి మనలను విమోచించాడు. ‘క్రీస్తు మనకోసము శాపమై మనలను ధర్మశాస్త్రముయొక్క శాపమునుండి విమోచించెను’ (గలతీ 3:13-14)
ద్వితీయోప 28: యూదులు ధర్మశాస్త్రానికి విధేయులయితే వచ్చే ఆశీర్వాదాలు, అవిధేయులయితే వచ్చే శాపాలను మోషే సమగ్రముగా ప్రవచించాడు. యూదుల చరిత్రలో ఈ ప్రవచనాలు నెరవేరినాయి, ఇంకా నెరవేరుచున్నాయి. అషూరీయులు, బబులోనీయులు, పర్షియనులు, గ్రీకులు, రోమన్లు యూదులను క్రూరముగా హింసించారు. నేటికీ దేవుని ఎరుగని వారు యూదులను హింసించుచునే ఉన్నారు. ఈ శాపం మెస్సియా వచ్చినప్పుడు తొలగిపోతుంది.
ప్రభువైన యేసు క్రీస్తు రూపం:
- ప్రభువైన యేసు క్రీస్తు తన భూలోక పరిచర్యలో అనేక సార్లు ద్వితీయోప దేశకాండములోని వచనాలను ప్రస్తావించాడు. ద్వితీయోప 6:5 – నీ పూర్ణహృదయముతోను నీ పూర్ణాత్మతోను నీ పూర్ణశక్తితోను నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. ధర్మ శాస్త్రములో ముఖ్యమైన ఆజ్ఞ ఏది అని ప్రశ్నించినప్పుడు, యేసు ప్రభువు ద్వితీయోప 6:5 ను సమాధానముగా చెప్పాడు (మత్తయి 22:37). సాతానుడు పెట్టిన మూడు శోధనలను ఎదుర్కొనేటప్పుడు, ఆయన మూడు సార్లు ద్వితీయోప దేశ కాండములోని వాక్యాలతోనే అపవాదికి సమాధానం ఇచ్చాడు (మత్తయి 4).
- మోషే ఇశ్రాయేలీయులను విడిపించినట్లు, యేసు క్రీస్తు మనలను విమోచించాడు. దేవుని వాక్యము గురించి మోషే తన ప్రజలను హెచ్చరించినట్లు, యేసు ప్రభువు కూడా విశ్వాసులను హెచ్చరించాడు (ప్రకటన 3:8).
- ఆశ్రయ పురములు: పొరపాటున మరొక వ్యక్తికి హాని చేసిన వాడు హతుని సంబంధికుల యొక్క ప్రతీకార చర్యల నుండి తనను కాపాడుకొనుటకుగాను దేవుడు 6 ఆశ్రయపురములు నెలకొల్పాడు. దేవుని ఉగ్రత నుండి మనలను కాపాడిన ఆశ్రయ పురము యేసు క్రీస్తు.
మనం నేర్చుకోవలసిన పాఠాలు:
- మరణించే ముందు మోషే ఇశ్రాయేలీయులకు ఇచ్చిన తుది సందేశమే ద్వితీయోప దేశ కాండము. గతములో వారు అనేక రకాలుగా విఫలం చెందినప్పటికీ, వెనుక ఉన్నవి మరిచి, దేవుని వైపు చూచుచూ ముందుకు సాగిపోవాలని మోషే వారిని కోరాడు. మనం కూడా గతములో దేవుడు మన పట్ల చూపిన విశ్వాస్యతను గుర్తుపెట్టుకొని, మన వైఫల్యాలను చూసి కృంగిపోకుండా, మన ముందు ఉన్న గమ్యము వైపుకు పరుగెత్తాలి. ‘వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటికొరకై వేగిరపడుచు, క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలెనని, గురి యొద్దకే పరుగెత్తుచున్నాను’. (ఫిలిప్పి 3:13-14)
- మోషే విశ్వాసమునుబట్టి ఐగుప్తు ధనముకంటె క్రీస్తువిషయమైన నింద గొప్ప భాగ్యమని యెంచుకొని, అల్పకాలము పాప భోగము అనుభవించుటకంటె దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి దేవుని సేవలో జీవితాన్ని గడిపాడు (హెబ్రీ 11:24,25). క్రీస్తు కొరకు సమస్తము ధారపోసిన మోషే మన అందరికి ఆదర్శప్రాయుడు.
- దేవుని ఆజ్ఞల పట్ల ప్రవర్తించిన తీరు ఇశ్రాయేలీయుల ఆశీర్వాదాలు, శాపాలను నిర్ణయించింది. దేవుని ఆజ్ఞల యొక్క తీవ్రతను మనం గుర్తిస్తున్నామా? మనం ఏమి విత్తుతామో ఆ పంటనే కోస్తాము (గలతీ 6:7).

Please make a donation to our ministry
We are sustained by donations averaging about $20. Only a tiny portion of our readers give. Please support us to keep us online and growing. Thank you.
$20.00