యెహోషువ: గ్రంథ పరిచయం, డాక్టర్ పాల్ కట్టుపల్లి

 

JoshuaJericho72818a copy.png

దాదాపు పది లక్షల మంది ఇశ్రాయేలీయులు మోషే నాయకత్వములో ఐగుప్తు నుండి కనానుకు బయలుదేరారు. దేవుడు అనేక అద్భుత క్రియలు, మహత్కార్యములు వారి ఎదుట చేసినప్పటికీ ఇశ్రాయేలీయులు అవిశ్వాసముతోనే జీవించారు. ఇద్దరు – యెహోషువ, కాలేబు – తప్ప అందరూ అరణ్యములో రాలిపోయారు. వారి సంతానము మాత్రమే, క్రీ పూ 1405 లో యొర్దాను నది దాటి కనాను దేశములో ప్రవేశించి వాగ్దాన దేశము (ప్రస్తుత ఇశ్రాయేలు దేశము) ను స్వతంత్రించుకొన్నారు. యెహోషువ నాయకత్వములో మొదట వారు యెరికో పట్టణమును జయించారు.

తొంభై సంవత్సరాల వయస్సులో మోషే నుండి నాయకత్వాన్ని పొంది, మరొక 20 సంవత్సరాలు దేవుని ప్రజలకు సేవ చేసి యెహోషువ నూట పది సంవత్సరముల వయస్సులో చనిపోయాడు. యెహోషువ నాయకత్వములో ఇశ్రాయేలీయులు వాగ్దాన దేశములో ప్రవేశించి యెరికో మొదలుకొని అనేక దుర్బేధ్యమైన పట్టణములను దేవుని శక్తితో ఓడించి వాటి బలమైన రాజులను మట్టికరిపించి వారి ప్రాంతాలను ఆక్రమించుకున్నారు. కనాను వాసులు మారుమనస్సు పొందుటకు దేవుడు 4 శతాబ్దాలు ఎదురుచూచాడు (ఆదికాండము 14:14-16). కానీ వారు తమ పాప క్రియలు మానుకోలేదు. అప్పుడు దేవుడు ఇశ్రాయేలీయులను తన ఆయుధముగా చేసుకొని కనానీయులను శిక్షించాడు. వారి దేశాన్ని తన ప్రజలకు స్వాధీనము చేసాడు. యెహోషువ తన ప్రజలకు విజయం ఇచ్చి, వారిని దేవుని హత్తుకొని ఉండవలసినదిగా విజ్ఞాపన చేసాడు. ‘మీరెవరిని సేవింప కోరుకొనినను నేనును నా యింటివారును యెహోవాను సేవించెదము’ (యెహోషువ 24:15) అని దేవుని యెడల తన కున్న భక్తిని, విశ్వాసాన్ని చాటుకున్నాడు.

రచయిత: యెహోషువ

వ్రాయబడిన కాలము: క్రీ. పూ 1405 – 1385

వ్రాయబడిన స్థలము: ప్రస్తుత ఇశ్రాయేలు దేశము

ముఖ్య అంశాలు:

యొర్దాను దాటుట: ఇశ్రాయేలీయులు యొర్దాను దాటి, కనాను దేశములో ప్రవేశించారు. మనము కూడా పాప జీవితము నుండి పరిశుద్ధ జీవితము లోకి దాటవలెను.

యుద్ధము: ఇశ్రాయేలీయులు తమ శత్రువులతో యుద్ధము చేశారు. నేడు మనము కూడా సాతాను శక్తులతో యుద్ధము చేస్తున్నాము (ఎఫెసీ 6: 12 – 17).

అద్భుతాలు: దేవుడు తన ప్రజల ఎదుట అద్భుత కార్యములు చేసాడు: యొర్దాను నదిని ఆపాడు (3 అ), యెరికో గోడలు కూల్చాడు (6 అ), వడగండ్లు కురిపించాడు (10 అ), సూర్యుని ఆపాడు (10 అ). సర్వ సృష్టికర్త అయిన దేవునికి ఈ అద్భుతాలు చాలా తేలికయినవి.

నమ్మకత్వము: దేవుడు తన ప్రజలను వదిలిపెట్టకుండా నమ్మకముగా నడిపించాడు.

పరిశుద్ధత: దేవుని ఆజ్ఞను తిరస్కరించిన ఆకానును దేవుడు శిక్షించాడు. దేవుడు తన పరిశుద్దతను తీవ్రముగా పరిగణిస్తాడు.

విజయము: దేవుడు తన ప్రజలకు కనాను దేశములో విజయము అనుగ్రహించాడు.

విశ్వాసము: దేవుని ప్రణాళికలను కార్య రూపములో పెట్టటానికి యెహోషువ విశ్వాసముతో ముందుకు నడిచాడు. విశ్వాసము లేకుండా మనము దేవునికి ఇష్టులము కాలేము.

నాయకత్వము: యెహోషువ నాయకత్వము సఫలము చెందింది ఎందుకంటే ఆయన పూర్ణ హృదయముతో దేవుని వెంబడించాడు.

ముఖ్య వ్యక్తులు: యెహోషువ, కాలేబు, రాహాబు, ఆకాను, ఎలియాజరు, ఫీనేహసు

గ్రంథ విభజన:

వాగ్దాన దేశములో ప్రవేశించుట (1:1 – 5:15)

యొర్దాను నది దాటుట

రాహాబు సంరక్షణ

వాగ్దాన దేశమును జయించుట (6:1 – 12:24)

మధ్య ప్రాంతము జయించుట (6:1 – 8:35)

దక్షిణ ప్రాంతము జయించుట (9:1 – 10:43)

ఉత్తర ప్రాంతము జయించుట (11:1 – 12:24)

వాగ్దాన దేశమును పంచుకొనుట (13:1 – 22:34)

యొర్దాను పశ్చిమ ప్రాంతము (13:1 – 19:51)

ఆశ్రయ పురములు (20:1-9)

లేవీయుల పట్టణములు (21:1-44)

యొర్దాను తూర్పు ప్రాంతము (22:1-34)

యెహోషువ ప్రసంగాలు

మొదటి ప్రసంగము (23:1-16)

రెండవ ప్రసంగము (24:1-28)

ముఖ్య ప్రవచనాలు:

  1. దేవుడు తన స్నేహితుడైన అబ్రాహాముకు  చేసిన వాగ్దానము యెహోషువ గ్రంధములో నెరవేర్చాడు (యెహోషువ 1:1-9; ఆదికాండము 12 – 17 అధ్యాయాలు). కనాను దేశమును (ప్రస్తుత ఇశ్రాయేలు) దేశమును అబ్రాహాము సంతానమునకు ఈవిగా ఇస్తానని దేవుడు మాట ఇచ్చాడు. నిలబెట్టుకున్నాడు.
  2. యెరికో ను పునర్నిర్మించే వారి మీదకు దేవుని శాపము వస్తుంది (యెహోషువ 6:26; 1 రాజులు 16:34)

ప్రభువైన యేసు క్రీస్తు రూపం:

‘యెహోషువ’ అను పేరుకు ‘దేవుడు రక్షించును’ అని అర్ధం. క్రొత్త నిబంధనలో ‘యేసు’ అను పేరుకు ఇది సరితూగుచున్నది.

యెహోవా సేనాధిపతి: యెరికో దగ్గరలో కత్తి చేత పట్టుకొని యెహోవా సేనాధిపతి యెహోషువకు కనిపించాడు. ఆ సేనాధిపతి నరావతారమునకు ముందు ప్రత్యక్షమైన యేసు క్రీస్తే.

ఎఱ్ఱని దారము: తన రక్షణ కొరకు రాహాబు తన కుటుంబం వారినందరినీ ఇంటిలో పెట్టుకొని తన కిటికీకి ఎఱ్ఱని దారము కట్టుకొంది. మన రక్షణ కొరకు, మన ఇంటి వారి రక్షణ కొరకు మనము ఎఱ్ఱని సిలువ రక్తము క్రిందకు రావాలి.

యెహోషువ నాయకత్వములో ఇశ్రాయేలీయులు తమ శత్రువులతో యుద్ధము చేశారు. ప్రభువైన యేసు క్రీస్తు నాయకత్వములో మనము సాతాను శక్తులతో యుద్ధము చేస్తున్నాము.

దేవుడు ఇశ్రాయేలీయులకు చేసిన వాగ్దానాలు యెహోషువ ద్వారా నెరవేరినాయి. దేవుడు మనకు చేసిన వాగ్దానాలన్నీ యేసు క్రీస్తు నందు నెరవేరినాయి (2 కొరింథీ 1:20)

మనం నేర్చుకోవలసిన పాఠాలు:

  1. యెహోషువ దేవుని పూర్ణ మనస్సుతో అనుసరించాడు (సంఖ్యా 32:12). మనం ఆ విధముగా దేవుని అనుసరిస్తున్నామా?
  2. ఆకాను చేసిన పాపము వలన ఇశ్రాయేలీయులందరూ హాయి ని జయించలేక ఓడిపోయారు. అతని కుటుంబ సభ్యులు కూడా అతని శిక్షను అనుభవించి ప్రాణాలు కోల్పోయారు. మనం చేసే పాపాలు మనతో ఆగిపోవు. మన చుట్టూ ఉన్న వారిని కూడా అవి బాధిస్తాయి.
  3. యెహోషువ దేవునికి పూర్తిగా విధేయత చూపించాడు. దేవుని పట్ల మన విధేయత ఎలా ఉంది?
  4. యెహోషువ దేవుని ఆజ్ఞల పట్ల చాలా జాగ్రత్తగా జీవిస్తూ, తన భాద్యతలు నెరవేర్చాడు. ‘కాబట్టి మీరు బహు జాగ్రత్తపడి మీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను’ (23:11). మనకు జాగ్రత్త ఉందా? దేవుని పట్ల ప్రేమ ఉందా? యెహోషువ వలె దేవుడు మనలను ఎక్కడకు వెళ్ళమంటే అక్కడకు వెళ్ళటానికి మనం సిద్ధముగా ఉన్నామా?
  5. తన ప్రజలయిన ఇశ్రాయేలీయులను కనాను దేశములోకి తోడ్కొని వెళ్లి దేవుడు తన విశ్వసనీయతను నిరూపించుకున్నాడు. దేవుని విశ్వసనీయతను మనము నమ్ముచున్నామా?

 

Please make a donation to our ministry

We are sustained by donations averaging about $20. Only a tiny portion of our readers give. Please support us to keep us online and growing. Thank you.

$20.00

Leave a Reply