2 సమూయేలు: గ్రంథ పరిచయం

AbsalomwithDavidTelugu2.png

పరిచయం: దావీదు ఇశ్రాయేలు దేశమునకు రాజు అగుట, అతని సింహాసనము స్థిరపరచబడుట తో 2 సమూయేలు గ్రంధము ప్రారంభమగుచున్నది. అయితే దావీదు పాపము, అతని కుటుంబం విచ్చిన్నమగుట, ఇశ్రాయేలు దేశములో అంతర్యుద్ధం మొదలగు విషాదకరమైన సంఘటనలతో ఈ పుస్తకం ముగుస్తుంది. అయితే ఈ పుస్తకములో శ్రేష్టమైన శుభవార్త కూడా ఉన్నది. 2 సమూయేలు 7:8-16 లో దావీదు నిబంధన (Davidic Covenant) మనం చూస్తున్నాం. దేవుడు దావీదుతో ఒక నిబంధన చేసాడు. ఇది శాశ్వత కాలము ఉండే నిబంధన. దానిని మానవ, సాతాను శక్తులు ఏవీ నిర్వీర్యం చేయలేవు. ఈ నిబంధన ప్రకారం దేవుడు

దావీదు సంతానానికి ఇశ్రాయేలు దేశాన్ని పాలించే అధికారాన్ని శాశ్వతముగా కట్టబెట్టాడు. ప్రభువైన యేసు క్రీస్తు లో ఈ దావీదు నిబంధన నెరవేరింది. ఆయన దావీదు సింహాసనం మీద కూర్చొని శాంతి యుగాన్ని మానవాళికి అందిస్తాడు.

రచయిత: ఖచ్చితముగా చెప్పలేము

వ్రాయబడిన కాలము: ఖచ్చితముగా చెప్పలేము

వ్రాయబడిన స్థలము: ఇశ్రాయేలు దేశము

ముఖ్య అంశాలు:

దావీదు సింహాసనం: దేవుడు దావీదుకు ఇశ్రాయేలు దేశాన్ని అప్పగించాడు. దావీదు ఆ దేశాన్ని స్వర్ణ యుగములోనికి తీసుకొని వెళ్లి, దాని మహా గొప్ప రాజుగా మారాడు.

దావీదు నిబంధన: దేవుడు దావీదు తో ఒక గొప్ప నిబంధన చేసాడు (7 అధ్యాయం).

దావీదు పాపము: దావీదు బెత్షెబ తో వ్యభిచారం చేసి, ఆమె భర్తను హత్యచేయించాడు.

దావీదు కుటుంబ కలహాలు: దావీదు పాపము అతని కుటుంబము మీదకు దేవుని తీర్పును తీసుకొని వచ్చింది.

ముఖ్య వ్యక్తులు: దావీదు, యోనాతాను, బెత్షెబ, నాతాను, అబ్షాలోము, యోవాబు, మెఫీబోషెతు, అబ్నేరు, ఇష్బోషెతు, షెబ

గ్రంథ విభజన:

సౌలు, యోనాతాను మరణం (1)

యూదాకు రాజుగా దావీదు (2)

హెబ్రోనులో దావీదు కుటుంబం (3)

అబ్నేరు, ఇష్బోషెతు ల హత్యలు (4)

ఇశ్రాయేలు సకల గోత్రముల వారికి రాజుగా దావీదు (5)

దేవుని మందసము తరలింపు (6)

దావీదు నిత్య రాజ్యమును గూర్చిన వాగ్దానము (7)

శత్రు సైన్యాల మీద దావీదు విజయం (8)

యోనాతాను కుమారుడు మెఫీబోషెతు కు దావీదు కనికరం (9)

దావీదు – హానూను ల సంఘర్షణ (10)

దావీదు చేసిన వ్యభిచారము, హత్య (11)

దావీదు మీద దేవుని తీర్పు, శిక్ష (12)

తామారు మీద అత్యాచారం (13)

అబ్షాలోము తిరుగు పయనం (14)

అబ్షాలోము తిరుగు బాటు (15)

దావీదు పారిపోవుట (16)

అహీతోపెలు ఆలోచన విఫలం, ఆత్మహత్య (17)

అబ్షాలోము మరణం (18)

దావీదు విలాపం (19)

షెబ తిరుగుబాటు (20)

ఇశ్రాయేలులో కరువు (21)

దావీదు స్తుతి గీతం (22)

దావీదు చివరి మాటలు (23)

దావీదు చేసిన జన సంఖ్య (24)

ముఖ్య ప్రవచనాలు:

7:16 – “నీ మట్టుకు నీ సంతానమును నీ రాజ్యమును నిత్యము స్థిరమగును, నీ సింహాసనము నిత్యము స్థిరపరచబడును”. దేవుడు దావీదుతో నిబంధన చేసాడు. ఈ నిబంధన  ప్రకారం దావీదు సంతానము నిత్యము ఇశ్రాయేలీయులను పాలిస్తుంది. ప్రభువైన యేసు క్రీస్తు ‘దావీదు కుమారుడు’ అని పిలువ బడ్డాడు. దేవా దూత కన్య మరియ కు వాగ్దానము చేశాడు: ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమా రుడనబడును; ప్రభువైన దేవుడు ఆయన తండ్రియైన దావీదు సింహాసనమును ఆయన కిచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగయుగ ములు ఏలును; ఆయన రాజ్యము అంతములేనిదై యుండునని ఆమెతో చెప్పెను. (లూకా 1:32,33). మొదటి రాకడలో ఆయన రాజకీయ అధికారానికి దూరముగా ఉన్నాడు. ఆయన సిలువ మీదకు వెళ్లి మన పాపముల కోసము విమోచన కార్యము చేయుటయే మొదటి రాకడ యొక్క ఉద్దేశ్యము. ఆయన రెండవ రాకడలో ఈ భూమి మీద రాజ్య స్థాపన చేస్తాడు. దావీదు సింహాసనము మీద కూర్చొని, యెరూషలేము నుండి ఈ ప్రపంచాన్ని పాలిస్తాడు. ఆయన యందు దేవుడు దావీదు తో చేసిన నిబంధన నెరవేరుతుంది.

ప్రభువైన యేసు క్రీస్తు రూపం: దావీదు పుత్రునిగా, దావీదుతో దేవుడు చేసిన నిబంధనను నెరవేర్చేవాడిగా యేసు ప్రభువు ఈ పుస్తకములో మనకు కనిపిస్తున్నాడు.

మనం నేర్చుకోవలసిన పాఠాలు:

శత్రువుల మీద ప్రేమ: తనను నాశనం చేయాలని చూసిన సౌలు కుటుంబీకులను కూడా దావీదు ప్రేమించడం అతని మంచితనాన్ని మనం చూస్తాము. వారు మరణించినప్పుడు దుఃఖించాడు కానీ సంతోషించలేదు. సౌలును పాతిపెట్టిన వారిని దావీదు సత్కరించాడు (1,2 అధ్యాయాలు). శత్రువులను ప్రేమించమని యేసు ప్రభువు ఇచ్చిన ఆజ్ఞను మనం పాటిస్తున్నామా? ‘మీ శత్రువులను ప్రేమించుడి. మిమ్మును హింసించు వారికొరకు ప్రార్థన చేయుడి.’ (మత్తయి 5:44)

పాపము యొక్క దుష్టత్వము: దావీదు ఊరియ భార్యను మోహించాడు. ఆమెను కూడి, వ్యభిచారం చేసాడు. ఆమె గర్భవతి అయినప్పుడు ఆ పాపము కప్పిపుచ్చుకొనుటకు ఊరియాను ఆమె యొద్దకు పంపించాలని ప్రయత్నించాడు కానీ విఫలం చెందాడు. చివరకు ఊరియా ను హతమార్చాడు.

పాపాన్ని కంట్రోల్ చేయలేము: దావీదు యొక్క మోహపు చూపు చివరకు హత్య తో ముగిసింది. అక్రమ సంభంధాల వలన ఈ రోజు అనేక మంది ప్రాణాలు కోల్పోచున్నారు. పాపమునకు దాసులు ఉంటారే కానీ యజమానులు ఉండరు (యోహాను 8:34) అని యేసు ప్రభువు చెప్పాడు. పాపాన్ని మనం కంట్రోల్ చేయలేము.

పాపము యొక్క పరిణామాలు: దావీదు పాపాన్ని దేవుడు ఉపేక్షించలేదు. తన ప్రవక్త యైన నాతానును పంపి దావీదు ను గద్దించాడు, దేవుని తీర్పును ప్రకటించాడు. పాపము దేవుని తీర్పును మన మీదకు తెస్తుంది. దావీదు కుటుంబములో కూడా హత్యలు, మాన భంగాలు జరిగాయి. పాపము యొక్క పరిణామాలు తీవ్రముగా ఉంటాయని గ్రహించావా?

అధికార దాహం, కలహాలు: దావీదు తరువాత దేవుని ప్రణాళికలో సొలొమోను ఉన్నాడు, అబ్షాలోము లేడు. ఇది గుర్తించని అబ్షాలోము అధికార దాహము ఇశ్రాయేలు దేశములో అంతర్యుద్ధానికి దారి తీసింది. అనేక మంది ప్రాణాలు తీసింది. అధికార, ధన, పదవీ దాహముల వలన ఎన్నో సంఘర్షణలు మొదలవుతాయి. దీన మనస్సుతో, సాత్వికముతో జీవించుట మేలు.

గర్వము మీద తీర్పు: 24 అధ్యాయములో దావీదు తానెంతమందికి రాజునో తెలుసుకోవాలనే అహంభావంతో కూడిన పౌర గణాంకము చేయించాడు. దాని వలన కూడా దేవుని తీర్పు ఇశ్రాయేలీయుల మీదకు వచ్చింది. మనం గర్వముతో చేసే పనులు కూడా తీవ్ర పరిణామాలకు దారి తీస్తాయి.

Introduction to 2 Samuel by Paul Kattupalli

Please make a donation to our ministry

We are sustained by donations averaging about $20. Only a tiny portion of our readers give. Please support us to keep us online and growing. Thank you.

$20.00

Leave a Reply