2 రాజులు:గ్రంథ పరిచయం

 

 

Screen Shot 2018-10-26 at 8.05.12 AM.png

పరిచయం:

1 సమూయేలు, 2 సమూయేలు, 1 రాజులు, 2 రాజులు ఈ నాలుగు పుస్తకాలు ఉత్తర ఇశ్రాయేలు దేశం, దక్షిణ యూదా దేశం ల సమగ్ర చరిత్రను, సౌలు నుండి సిద్కియా వరకు వివరిస్తాయి. 1 దిన వృత్తాంతములు, 2 దిన వృత్తాంతములు గ్రంధములు దక్షిణ యూదా రాజుల చరిత్రను మాత్రమే వివరిస్తాయి.

  క్రీ.పూ 853 నుండి ఇశ్రాయేలు, యూదా రాజుల చరిత్ర ఈ గ్రంధములో లిఖించబడింది. క్రీ. పూ 722 లో అష్షురు సామ్రాజ్యం ఉత్తర దేశమును (ఇశ్రాయేలు 10 గోత్రాలు) జయించి, చెరపట్టి తీసుకొని వెళ్ళింది. బబులోనీయులు క్రీ. పూ 612 లో అష్షురు రాజధాని నినివే ను జయించారు. బబులోనీయులు మూడు సార్లు

యూదా రాజ్యము (యూదా, బెన్యామీను గోత్రాలు) మీద దాడి చేసి చివరకు క్రీ. పూ 586 లో యెరూషలేమును నాశనం చేసి, దేవుని ఆలయాన్ని నిర్మూలము చేసి యూదా శ్రేష్ఠులను చెరపట్టుకొని వెళ్లారు.

 ఇశ్రాయేలు రాజులు, యూదా రాజులు తమ భక్తిహీనతతో తమ రాజ్యాలను నింపివేయడం, చివరకు దేవుని ఆగ్రహం వారి మీద రగులు కొని వారు చెర లోనికి వెళ్ళిపోవటం ఈ గ్రంధములో చూస్తాము.

రచయిత: ఖచ్చితముగా చెప్పలేము

వ్రాయబడిన కాలము: బబులోను చెర కాలము

వ్రాయబడిన స్థలము: బబులోను దేశము లో కావచ్చును

ముఖ్య అంశాలు:

నిబంధన ప్రాముఖ్యత: 2 రాజులు గ్రంధము ముగిసేనాటికి ఇశ్రాయేలీయులు పూర్తిగా దేవునికి విరోధులయిపోయారు. దేశం విగ్రహారాధన, వ్యభిచారం, స్వలింగ సంపర్కం, హింస, హత్యలతో నిండిపోయింది. మోషే ద్వారా దేవుడు చేసిన నిబంధన (ద్వితీయోప 28) ప్రకారం, దేవుని శిక్ష రెండు దేశాల వారి మీదకు వచ్చింది.

ముఖ్య వ్యక్తులు: ఏలీయా, ఎలీషా, నయమాను, యెహూ, యోవాషు, హిజ్కియా, యోషీయా, యెషయా

గ్రంథ విభజన:

1 అధ్యాయము  : అహజ్యా గురించి ఏలీయా ప్రవచనం

2 అధ్యాయము  : ఏలీయా పరలోకమునకు ఎత్తబడుట

3 అధ్యాయము  : యెహోరాము పరిపాలన

4 అధ్యాయము  : ఎలీషా చేసిన అద్భుత క్రియలు

5 అధ్యాయము  : నయమానుకు కుష్టు రోగము నుండి స్వస్థత

6 అధ్యాయము  : ఎలీషా సిరియనుల మీద విజయం

7 అధ్యాయము  : ఎలీషా ప్రవచనము చొప్పున పారిపోయిన సిరియనులు

8 అధ్యాయము  : బెన్హదదు, హజాయేలు, యెహోరాము, అహజ్యా ల పాలన

9 అధ్యాయము  : యెహూ పాలన, యెజెబెలు దుర్మరణం

10 అధ్యాయము: యెహూ అహాబు ఇంటి వారిని నిర్మూలించుట

11 అధ్యాయము: అతల్యా రాణి దుష్టపాలన, యోవాషు రహస్య పట్టాభిషేకము

12 అధ్యాయము: యోవాషు పాలన, దేవుని మందిరము బాగుచేయుట

13 అధ్యాయము: యెహోయాహాజు, యెహోయాషు ల పాలన

14 అధ్యాయము: అమజ్యా పాలన

15 అధ్యాయము: అజర్యా పాలన

16 అధ్యాయము: ఆహాజు పాలన

17 అధ్యాయము: హోషేయ పాలన

18 అధ్యాయము: హిజ్కియా పాలన

19 అధ్యాయము: హిజ్కియా పాలనలో అష్షురు దాడి, యెషయా ప్రవచనాలు

20 అధ్యాయము: హిజ్కియా రోగము, ప్రార్ధన, స్వస్థత

21 అధ్యాయము: మనష్షే దుష్ట పాలన, ఆమోను పాలన

22 అధ్యాయము: యోషీయా మంచి పాలన

23 అధ్యాయము: యోషీయా సంస్కరణలు, మరణం

24 అధ్యాయము: యెహోయాకీము, యెహోయాకీను ల పాలన

25 అధ్యాయము: నెబుకద్నెజరు యెరూషలేము మీద దాడి

ముఖ్య ప్రవచనాలు:

ఏలీయా సుడిగాలి చేత ఆకాశమునకు ఆరోహణమయ్యాడు (2:11). ఆయన మోషేతో కలిసి భవిష్యత్తులో  ఈ లోకానికి వచ్చి, ఈ ప్రపంచానికి శిక్ష విధిస్తాడు.(ప్రకటన 11:12)

2:1-14: ఎలీషా ‘నీకు కలిగిన ఆత్మలో రెండుపాళ్లు నా మీదికి వచ్చు నట్లు దయచేయుము’ అని ఏలీయా ను అభ్యర్ధించాడు.అగ్ని రథమును అగ్ని గుఱ్ఱములు పరలోకము నుండి వచ్చి వారిద్దరినీ వేరుచేసినాయి. ఏలీయా సుడిగాలిచేత ఆకాశమునకు ఆరోహణమయ్యేటప్పుడు ఎలీషా చూసి,ఏలీయాకు  కలిగిన ఆత్మలో రెండుపాళ్లు పొందాడు.

3:15-20: ఇశ్రాయేలు రాజు, యూదా రాజు, ఎదోము రాజుల చేతిలో మోయాబీయులు ఓడిపోతారు.

4:3-4: ఎలీషా ప్రవచించినట్లు అప్పుల ఊబిలో ఉన్న విధవరాలి పాత్రలు నూనెతో నింపబడ్డాయి.

5:10: నయమాను కుష్టు రోగము ఆయన యొర్దానులో 7 సార్లు మునిగితే నయమవుతుందని ఎలీషా చేసిన ప్రవచనం నెరవేరింది.

8:1: దేశములో 7 సంవత్సరాలు కరువు వస్తుంది.

8:12-13: హజాయేలు సిరియాకు రాజు అవుతాడు, ఇశ్రాయేలీయులను చాలా క్రూరముగా హింసిస్తాడు.

19:20-35: అష్షూరురాజైన సన్హెరీబు యెరూషలేము మీద దండెత్తినప్పుడు దేవుడు ఆ నగరాన్ని కాపాడుతాడు అని యెషయా చేసిన ప్రవచనం నెరవేరింది. ‘ఆ రాత్రియే యెహోవా దూత బయలుదేరి అష్షూరు వారి దండు పేటలో జొచ్చి లక్ష యెనుబది యయిదు వేలమందిని హతముచేసెను

20:1-11: హిజ్కియా రోగము వచ్చినప్పుడు కన్నీటితో దేవుని ప్రార్ధించాడు. దేవుడు మరో 15 సంవత్సరాలు ఆయుష్షు ఇస్తున్నట్లు యెషయా చేత ప్రవచించాడు.

20:16-19: రాబోయే యెరూషలేము పతనం గురించి, 70 సంవత్సరాల బబులోను చెర గురించి యెషయా చేసిన ప్రవచనం.

ప్రభువైన యేసు క్రీస్తు రూపం:

    ఇశ్రాయేలు రాజులందరూ మనుష్య మాత్రులే. వాగ్దాన దేశములో వారు ఇశ్రాయేలీయులను భద్రపరచలేకపోయారు. అషూరీయులు ఉత్తర దేశాన్ని చెర లోనికి తీసుకొని వెళ్తే, బబులోనీయులు దక్షిణ దేశాన్ని చెర లోనికి తీసుకొని వెళ్లారు. ప్రభువైన యేసు క్రీస్తు పరిపాలించేటప్పుడు ఇశ్రాయేలీయులకు పూర్తి భద్రత ఉంటుంది. ఆయన రాజ్యములో యూదులు వర్ధిల్లుతారు. యెరూషలేము మీద దాడులను ఆయన అడ్డుకొని నిర్వీర్యం చేస్తాడు. రూపాంతరపు కొండ మీద ఏలీయా చూసిన మహిమ గల క్రీస్తు, ఆయన రాజ్యం ఇశ్రాయేలులో ఉంటారు.

మనం నేర్చుకోవలసిన పాఠాలు:

ఏలీయా, ఎలీషా: దేవుడు అబ్దుతాలు చేయగల దేవుడు అని మనం గుర్తించాలి.

యెజెబెకుకు శిక్ష (1 రాజులు 21:23; 2 రాజులు 9:10): దేవుడు తన కాలములో దుర్మార్గులను శిక్షిస్తాడు.

నయమాను భార్యకు పరిచారం చేసే చిన్నది ఎలీషా స్వస్తతల గురించి వారికి చెప్పింది.  క్రీస్తును ఎరుగని వారికి పాప రోగము నుండి ఆయన ఇచ్చే స్వస్థత గురించి నీవు చెపుతున్నావా? లేక ఆయన గురించి సిగ్గుపడుచున్నావా? ‘సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడను కాను’ (రోమా 1:16)

యోషీయా సంస్కరణ, పునరుద్ధరణ (23:26-27): అతని కాలములో దేవుని ఆలయములో విగ్రహాలు ఉన్నాయి. స్వలింగ సంపర్కులు పెరిగిపోయారు. దేవుని వాక్యం ప్రజలు మరచిపోయారు. యోషీయా దేవుని వాక్యం కనుగొని వారికి వినిపించాడు, విగ్రహాలు తీసివేయించాడు, స్వలింగ సంపర్కులను వెళ్ళగొట్టాడు. ఈ రోజు మన సమాజం కూడా అలాగే ఉంది. దేవుని వాక్యాన్ని మనం హత్తుకొంటున్నామా?

Introduction to Second Kings by Dr.Paul Kattupalli

Please make a donation to our ministry

We are sustained by donations averaging about $20. Only a tiny portion of our readers give. Please support us to keep us online and growing. Thank you.

$20.00

Leave a Reply