ఎజ్రా: గ్రంథ పరిచయం

109.Ezra_Reads_the_Law_to_the_People.jpg

పరిచయం:‘పారసీకదేశపు రాజైన కోరెషు ఏలుబడిలో మొదటి సంవత్సరమందు యిర్మీయాద్వారా పలుకబడిన తన వాక్య మును నెరవేర్చుటకై యెహోవా’ (1:1) అను మాటలతో ఎజ్రా గ్రంధము మొదలవుచున్నది. తన దాసుడైన యిర్మీయా ద్వారా తాను చేసిన ప్రవచనాలను నెరవేర్చుటకు దేవుడు కార్యాచరణ ప్రారంభించాడు.

  ఐగుప్తు బానిసత్వములో నుండి దేవుని చేత విడిపింపబడి వచ్చిన ఇశ్రాయేలీయులు దేవుని యొక్క ఆజ్ఞలను తీవ్రముగా అతిక్రమించారు. దేవుని శిక్ష వారి మీదకు వచ్చి బబులోను బానిసత్వములోకి తీసుకొనివెళ్ళబడ్డారు.

మూడు విడతలుగా – క్రీ. పూ 605, క్రీ. పూ 597, క్రీ. పూ 586 – వారు బబులోనుకు వెళ్లారు. 70 సంవత్సరముల చెర తరువాత దేవుడు తిరిగి మూడు విడతలుగా వారిని – క్రీ. పూ 538, క్రీ. పూ 458, క్రీ. పూ 445 – వారిని ఇశ్రాయేలు దేశమునకు తిరిగి తీసుకు వచ్చాడు. ఆ క్రమములో దేవుడు అన్యులైన – కోరెషు, దర్యావేషు, అర్తహషస్త – చక్రవర్తులను తన ఉద్దేశ్యములను నెరవేర్చుకొనుటకు వాడుకున్నాడు.

   క్రీ. పూ 538 లో బయలుదేరిన మొదటి గుంపుకు జెరుబ్బాబెలు నాయకత్వము వహించాడు. క్రీ.పూ 458 లో బయలుదేరిన రెండవ గుంపుకు ఎజ్రా నాయకత్వము వహించాడు. క్రీ. పూ 445 లో బయలుదేరిన మూడవ గుంపుకు నెహెమ్యా నాయకత్వం వచించాడు.

క్రీ. పూ 539 లో పర్షియా కు చెందిన కోరెషు (Cyrus) బబులోను సామ్రాజ్యానికి ముగింపు పలికాడు. ఒక సంవత్సరం తరువాత క్రీ. పూ 538 లో  యూదులు యెరూషలేము వెళ్ళుటకు అనుమతి ఇస్తూ ఆజ్ఞ ఇచ్చాడు.

  క్రీ. పూ 536 లో రెండవ దేవుని ఆలయ నిర్మాణము మొదలై అనేక ఎదిరింపులు, ఒత్తిడులు, అవరోధాలు తట్టుకొని క్రీ. పూ 516 లో ముగిసింది. ఎజ్రా గ్రంధము 1-6 అధ్యాయాల్లో దేవుని మందిరము కట్టబడుటను చూచుచున్నాము, 7-10 అధ్యాయాల్లో ఎజ్రా యెరూషలేముకు వచ్చుట, దేవుని పని చేయుట చూచుచున్నాము. ‘పారసీకదేశపు రాజైన అర్తహషస్తయొక్క యేలుబడిలో ఎజ్రా బబులోను దేశమునుండి యెరూషలేముపట్టణమునకు వచ్చెను’ (7:1). ఎజ్రా అహరోను వంశములో పుట్టిన లేవీయుడు (7:1-5). ఎజ్రా ఇశ్రాయేలీయుల తప్పిదములను గుర్తించాడు. ‘మా దేవా, యింత కృపనొందిన తరువాత మేమేమి చెప్ప గలము? నిజముగా ప్రవక్తలైన నీ దాసులద్వారా నీవిచ్చిన ఆజ్ఞలను మేము అనుసరింపకపోతివిు గదా’ (9:10). వారి పక్షాన దేవుని ఎదుట మొఱ్ఱ పెట్టాడు. ఆత్మీయ సంస్కరణలు తెచ్చాడు. హగ్గయి, జెకర్యా ప్రవక్తలు కూడా దేవుని ఆలయము నిర్మాణ సమయములో ప్రవచించారు (5:1).

భౌతిక ఆలయము సరిపోదు, ఆత్మీయ మార్పు అవసరం అని బోధించారు.  

రచయిత:  ఎజ్రా

వ్రాయబడిన కాలము: ఎజ్రా క్రీ. పూ 458 లో పెర్షియా నుండి వచ్చిన రెండవ గుంపు యూదులకు నాయకత్వం వహించాడు. కాబట్టి, ఈ పుస్తకము ఆ తరువాత కాలములో వ్రాయబడి ఉండాలి.

వ్రాయబడిన స్థలము: ఇశ్రాయేలు దేశము

ముఖ్య అంశాలు:

ప్రవచనాల నెరవేర్పు: దేవుడు తన ప్రవక్తల ద్వారా చేసిన ప్రవచనాలను ఇశ్రాయేలీయులను బబులోను నుండి తిరిగి రప్పించుటలో నెరవేర్చాడు.

నాయకత్వం: జెరుబ్బాబెలు, ఎజ్రా, నెహెమ్యా లాంటి గొప్ప నాయకులను దేవుడు తన ప్రజలను నడిపించుటకు సిద్ధపరచి పంపించాడు.

ఆలయం పునః నిర్మాణం: అన్నికంటే ముఖ్యమైనది దేవుని ఆరాధన. ప్రజలందరూ దేవుని మందిరమునకు వచ్చి ఆయనను ఆరాధించాలి.

విజ్ఞాపన ప్రార్ధన (9:5-15): ఎజ్రా తన ప్రజల పక్షాన విజ్ఞాపన ప్రార్ధన చేసాడు. నాయకులను ప్రార్ధన జీవితం చాలా ముఖ్యం.

ముఖ్య వ్యక్తులు: కోరెషు చక్రవర్తి, దర్యావేషు, అర్తహషస్త, జెరుబ్బాబెలు, ఎజ్రా

గ్రంథ విభజన:

I . జెరుబ్బాబెలు నాయకత్వములో బబులోను నుండి తిరిగి వచ్చిన యూదుల మొదటి గుంపు

(50 వేల మంది)

1  అధ్యాయము: యెరూషలేములో మందిరం కట్టించుటకు కోరెషు చక్రవర్తి ఆజ్ఞ

2  అధ్యాయము: జెరుబ్బాబెలు తో పాటు యెరూషలేముకు పయనం

3 అధ్యాయము: దేవుని ఆలయం నిర్మాణం

4 అధ్యాయము: ఆలయ నిర్మాణానికి అడ్డంకులు, అర్తహషస్త ఉత్తరం

5 అధ్యాయము: హగ్గయి, జెకర్యా ప్రవక్తల పరిచర్య

6 అధ్యాయము: రాజైన దర్యావేషు ఆజ్ఞ

II  . ఎజ్రా నాయకత్వములో బబులోను నుండి తిరిగి వచ్చిన యూదుల రెండవ గుంపు

(2 వేల మంది)

7 అధ్యాయము: ఎజ్రా యెరూషలేముకు వచ్చుట

8 అధ్యాయము: తిరిగి వచ్చిన యూదుల వివరములు

9 అధ్యాయము: ఎజ్రా విజ్ఞాపన ప్రార్ధన

10 అధ్యాయము: అన్య స్త్రీలను వివాహమాడుట మీద నిషేధం

 

ముఖ్య ప్రవచనాలు:

3:11 – ఇశ్రాయేలీయుల విషయమై ఆయన కృప నిరంతరము నిలుచును. ఈ ప్రవచనం ఇశ్రాయేలు చరిత్రలో నెరవేరుస్తూ ఉన్నది. దేవుడు తన కృపను వారికి నిరంతరము చూపిస్తున్నాడు. ఈ ప్రపంచమంతా వారికి ఎదురు తిరిగినప్పటికీ దేవుడు వారిని రక్షిస్తాడు.

ప్రభువైన యేసు క్రీస్తు రూపం:

ఎజ్రా తన ప్రజలను అన్య దేశములో నుండి వాగ్దాన దేశములోనికి తీసుకొని వెళ్లి దేవుని ఆలయములో వారికి ప్రవేశం కల్పించాడు. యేసు క్రీస్తు అన్యులమైన మనలను తన రక్తముతో విమోచించి దేవుని సహవాసములోకి తెచ్చాడు. ఎజ్రా తన ప్రజల పక్షాన దేవునికి విజ్ఞాపన చేసిన యాజకుడు. యేసు క్రీస్తు మన పక్షాన దేవునికి విజ్ఞాపన చేసే ప్రధాన యాజకుడు.

మనం నేర్చుకోవలసిన పాఠాలు:

-దేవుడు తన వాగ్దానాలను నిలుపుకొంటాడు: 70 సంవత్సరాల బబులోను చెరలో నుండి విడిపించి అబ్రాహామును తాను ఇచ్చిన వాగ్దానము చొప్పున వారిని తిరిగి ఇశ్రాయేలు దేశమునకు తీసుకొనివెళ్ళాడు. దేవుడు ఇచ్చిన మాట నిలుపుకొనేవాడు అని గుర్తించావా?

-అన్యజనులైన – కోరెషు, దర్యావేషు, అర్తహషస్త – చక్రవర్తులను సహితము దేవుడు తన కార్యములు నెరవేర్చుకొనుటకు ఉపయోగించుకున్నాడు. దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదని నీవు గుర్తించావా?

-భౌతిక ఆలయాలు సరిపోవు, ఆత్మీయ మార్పు మన జీవితాములో ఉన్నప్పుడే దేవుడు సంతోషిస్తాడు అని ఎజ్రా గుర్తించి తన ప్రజలకు మారు మనస్సు పొందమని ప్రకటించాడు. ఈ సత్యం నీవు గుర్తించావా?

-7:10 ‘ఎజ్రా యెహోవా ధర్మశాస్త్రమును పరిశోధించి దాని చొప్పున నడచుకొనుటకును, ఇశ్రాయేలీయులకు దాని కట్టడలను విధులను నేర్పుటకును దృఢ నిశ్చయము చేసికొనెను’. ఎజ్రా వలె  దేవుని వాక్యానికి నీవు ప్రాధాన్యత ఇస్తున్నావా?

-10:1 ‘ఎజ్రా యేడ్చుచు దేవుని మందిరము ఎదుట… సాష్టాంగపడుచు, పాపమును ఒప్పుకొని ప్రార్థనచేసెను’. ఎజ్రా ఏడ్చుచూ తన ప్రజల పక్షాన విజ్ఞాపన ప్రార్ధన చేసాడు. ఎవరు ఏమై పొతే నా కెందుకులే అని అనుకోలేదు. నీవు ఇతరులను లక్ష్యపెడుచున్నావా? వారి కోసం ప్రార్ధన చేస్తున్నావా? నీ పొరుగు వారి కోసం విజ్ఞాపన చేస్తున్నావా?

-అన్య స్త్రీలను పెండ్లి చేసుకొనవద్దని ఎజ్రా కోరాడు. వారు దేవుని యొద్దను నుండి అన్య దేవతల వైపు మన దృష్టిని మరల్చే అవకాశం ఉంది. అవిశ్వాసులతో వివాహ బంధాలు తగవు అని నీవు గుర్తించావా?  

Introduction to the Book of Ezra by Dr.Paul Kattupalli

Image Credit: By Gustave Doré – Doré’s English Bible, Public Domain, https://commons.wikimedia.org/w/index.php?curid=10717139

Please make a donation to our ministry

We are sustained by donations averaging about $20. Only a tiny portion of our readers give. Please support us to keep us online and growing. Thank you.

$20.00

Leave a Reply