1 దినవృత్తాంతములు: గ్రంథ పరిచయం

solomontempleconstruction.png

పరిచయం: ఆదిమ హెబ్రీ గ్రంధములో 1 దినవృత్తాంతములు, 2 దినవృత్తాంతములు రెండూ ఏక గ్రంధముగా ఉన్నవి. 1 దినవృత్తాంతములు ఆదాముతో మొదలై, 2 దినవృత్తాంతములు యూదులు బబులోను నుండి తిరిగివచ్చుటతో ముగుస్తుంది. మానవ జాతి సృష్టిని, యూదుల చరిత్రను వేరుచేయలేము. విశ్వమును, మానవ జాతిని సృష్టించిన దేవుడే యూదుల ద్వారా తన ప్రత్యక్షతలను మానవ జాతికి తెలియజేస్తున్నాడు.

   ఆదాము నుండి కోరెషు చక్రవర్తి వరకు దేవుడు తన దాసులను తన కార్యముల కొరకు ఎలా ఉపయోగించుకొన్నాడో దినవృత్తాంతములు తెలియజేవుచున్నవి. ఆదాము మొదలుకొని దేవుడు తన విమోచన ప్రణాలికను ఏ విధముగా కార్యరూపములో పెడుచున్నాడో కూడా ఈ గ్రంధములో చూచుచున్నాము. ఈ గ్రంధములలో 2 సమూయేలు, 1 రాజులు, 2 రాజులు గ్రంధములలోని అనేక సంగతులు మరలా వివరించబడినప్పటికీ, చాలా క్రొత్త సంగతులు కూడా మనం దిన వృత్తాంతములు చదివి నేర్చుకొన వచ్చును.

  సౌలు, దావీదు, సొలొమోను రాజుల గురించి అనేక వివరాలు ఇవ్వబడ్డాయి. దేవుడు తన ప్రజలను సంఘటపరచి, వారి మధ్య ఒక ఆలయాన్ని నిర్మించాడు. అన్నిటి కంటే, ప్రేమతో చేసే తన ప్రజల యొక్క ఆరాధనను దేవుడు కోరుకున్నాడు.

రచయిత: యూదుల చరిత్ర ప్రకారం ఎజ్రా అయి ఉండవచ్చు కానీ ఖచ్చితముగా చెప్పలేము

వ్రాయబడిన కాలము: ఖచ్చితముగా చెప్పలేము కానీ, కోరెషు చక్రవర్తి ఆజ్ఞ (2 దిన 36:22) ప్రస్తావించబడినది గనుక క్రీ. పూ 537 తరువాత వ్రాయబడినది అని చెప్పుకొన వచ్చును.

వ్రాయబడిన స్థలము: బబులోను లేక ఇశ్రాయేలు దేశము

ముఖ్య అంశాలు:

దావీదు సిద్ధపాటు: దేవుని ఆలయాన్ని నిర్మించాలని దావీదు కోరిక. కానీ, అతని చేతులు ఎంతో రక్తపాతం సృష్టించాయి. “నీవు విస్తారముగా రక్తము ఒలికించి గొప్ప యుద్ధములు జరిగించిన వాడవు, నీవు నా నామమునకు మందిరమును కట్టించకూడదు, నా సన్నిధిని నీవు విస్తారముగా రక్తము నేల మీదికి ఓడ్చితివి” (22:8)  కాబట్టి,దేవుడు దావీదు చేతుల మీదుగా ఆలయ నిర్మాణం జరుగనీయలేదు. దేవుడు అహింసను కోరుకొంటాడు అని ఇక్కడ మనకు అర్ధం అగుచున్నది. దావీదు కృంగిపోకుండా, తన కుమారునికి  ఆలయమునకు కావాల్సిన వస్తువులు, ముడి సరుకులు సమకూర్చి, సూచనలు చేసాడు. ఆలయమునకు కావలసిన మానవ వనరులను ఆలయం నిర్మాణమునకు ముందే దావీదు సిద్ధపరచాడు. దేవుని కార్యములలో తగిన సిద్ధపాటు ఉండాలి.

స్తుతి, ప్రార్ధన: సిద్ధపాటుతో పాటు దావీదు దేవుని స్తుతించుచూ, ప్రార్ధించుచూ, దేవుని ప్రజలను ఆలయ నిర్మాణానికి ప్రోత్సహించాడు.

ముఖ్య వ్యక్తులు: ఆదాము, అబ్రాహాము, యబ్బేజు, సౌలు, దావీదు, సొలొమోను

గ్రంథ విభజన:

1  అధ్యాయము: ఆదాము నుండి అబ్రాహాము వరకు

2  అధ్యాయము: ఇశ్రాయేలు 12 కుమారులు, యూదా సంతానము

3  అధ్యాయము: దావీదు సంతానము

4  అధ్యాయము: యబ్బేజు ప్రార్ధన

5  అధ్యాయము: రూబేను, గాదు వంశస్తులు

6  అధ్యాయము: లేవీ, అహరోను వంశస్తులు

7  అధ్యాయము: ఇశ్శాఖారు, మనష్షే, ఎఫ్రాయిము ల వంశస్తులు

8  అధ్యాయము: బెన్యామీను, సౌలు వంశస్తులు

9  అధ్యాయము: యాజకులు, ద్వార పాలకుల వివరములు

10 అధ్యాయము: సౌలు, అతని కుమారుల మరణం

11 అధ్యాయము: దావీదు రాజుగా అభిషేకము

12 అధ్యాయము: దావీదు సహాయకులు

13 అధ్యాయము: కిర్యత్యారీము నుండి దేవుని మందసము తరలింపు, ఉజ్జా మృత్యువాత

14 అధ్యాయము: దావీదు కుటుంబం

15 అధ్యాయము: దావీదు దేవుని మందసమును తరలించుట, మీకాలు అమర్యాద

16 అధ్యాయము: దావీదు స్తుతి గీతం

17 అధ్యాయము: దావీదు సంతానము నిత్య రాజ్యం, నిత్య సింహాసనం వాగ్దానము

18 అధ్యాయము: దావీదు విజయాలు

19 అధ్యాయము: దావీదును అమ్మోనీయులు అపహసించుట

20 అధ్యాయము: రబ్బా ముట్టడి, ఫిలిష్తీయుల సంహారం

21 అధ్యాయము: దావీదు జనాభా లెక్కలు, దేవుని శిక్ష

22 అధ్యాయము: దేవుని ఆలయం నిర్మాణానికి దావీదు సిద్ధపాటు

23 అధ్యాయము: సొలొమోను రాజవుట, లేవీయుల నియామకం

24 అధ్యాయము: యాజకుల వర్గీకరణ

25 అధ్యాయము: దావీదు సంగీతకారులను నియమించుట

26 అధ్యాయము: ద్వార పాలకుల వర్గీకరణ

27 అధ్యాయము: రాజు యొక్క అధిపతుల నియామకం

28 అధ్యాయము: దావీదు ప్రసంగం, సొలొమోనుకు సూచనలు

29 అధ్యాయము: దావీదు ప్రార్ధన, మరణం

 

ముఖ్య ప్రవచనాలు:  

దావీదు నిబంధన (Davidic Covenant) 17:7-14:నీ జీవిత దినములు తీరి నీ పితరులయొద్దకు నీవు చేరునప్పుడు నీ కుమారులవలన కలుగు నీ సంతతిని నేను స్థాపనచేసి అతని రాజ్యమును స్థిరపరచెదను. అతడు నాకు ఒక మందిరమును కట్టించును, అతని సింహాసనమును నేను నిత్యస్థాపన చేసెదను. నేను అతనికి తండ్రినైయుందును, అతడు నాకు కుమారుడై యుండును; నీకంటె ముందుగా ఉన్నవానికి నా కృపను నేను చూపక మానినట్లు అతనికి నేను నా కృపను చూపక మానను. నా మందిరమందును నారాజ్యమందును నేను నిత్యము అతని స్థిరపరచెదను, అతని సింహాసనము ఎన్నటికిని స్థిరముగా నుండునని అతనికి తెలియజేయుము.” దేవుడు దావీదుతో చేసిన ఈ నిబంధన ప్రభువైన యేసు క్రీస్తు నందు నెరవేరింది.

22:10 – సొలొమోను తన కొరకు ఒక ఆలయాన్ని నిర్మిస్తాడని దేవుడు ప్రవచించాడు. దేవుడు చెప్పినట్లే, సొలొమోను యెరూషలేములో ఆలయాన్ని నిర్మించాడు.

ప్రభువైన యేసు క్రీస్తు రూపం:

దావీదు కుమారుడైన సొలొమోను గొప్ప దేవుని ఆలయం నిర్మించాడు. అయితే అది చివరకు శత్రువుల చేతిలో నిర్దాక్షిణ్యముగా కూల్చివేయబడింది. మరొక దావీదు కుమారుడైన యేసు క్రీస్తు తన రక్తముతో విమోచించబడిన ఆత్మ సంభందమైన రాళ్లతో మరొక గొప్ప దేవుని ఆలయమును నిర్మిస్తున్నాడు. దీనిని, మానవ, సాతాను శక్తులు ఏవీ పగులగొట్టలేవు, కూల్చివేయలేవు.

మనం నేర్చుకోవలసిన పాఠాలు:

-దావీదు ను దేవుడు ప్రేమించినప్పటికీ అతడు సృష్టించిన రక్తపాతాన్ని దేవుడు హర్షించలేదు. మనం హింసా ప్రవృత్తిని విడిచి, ప్రేమను, సమాధానాన్ని, అహింసను కోరుకొంటున్నామా?

-దావీదు, సొలొమోనుల వలె దేవుని మందిరము పట్ల మనకు ఆసక్తి ఉందా?

-దావీదు, సొలొమోనుల వలె మనం దేవుని స్తుతిస్తున్నామా?

-యేసు క్రీస్తు కట్టుచున్న దేవుని ఆలయములో నీవు చేర్చబడ్డావా?

Introduction to First Chronicles by Dr.Paul Kattupalli

Please make a donation to our ministry

$25.00

Leave a Reply