పరిచయం:
బబులోను లో యూదుల 70 సంవత్సరాల చెర తరువాత, వారు మూడు గుంపులుగా యెరూషలేము తిరిగివెళ్ళారు. మొదటి రెండు గుంపులు జెరుబ్బాబెలు, ఎజ్రా నాయకత్వములో తిరిగి వెళ్లగా, మూడవ గుంపు నెహెమ్యా నాయకత్వములో తిరిగివెళ్ళింది.
బబులోనీయుల తరువాత ప్రపంచ ఆధిపత్యం పర్షియనులకు సంక్రమించింది. పర్షియా లో యూదులకు కలిగిన పరిస్థితులను, అనుభవాలను ఎస్తేరు గ్రంథములో చదువుచున్నాము.
పర్షియా లోని షూష ను కోటలో అర్తహషస్త చక్రవర్తి (క్రీ పూ 464 – 423) క్రింద నెహెమ్యా పనిచేయుచున్నాడు. చక్రవర్తి క్రింద గవర్నర్ గా, ద్రాక్షారస పాత్ర అందించేవానిగా ఆయన ఉన్నాడు. ఆ సమయములో యెరూషలేము చాలా హీనమైన, శిధిలావస్థలో ఉన్నది. దాని స్థితి ని గూర్చి వినిన నెహెమ్యాకు గుండె బద్దలయ్యింది. క్రీ. పూ 445 లో ఆయన రాజు యొక్క అనుమతితో యెరూషలేము పయన మయ్యాడు.
అనేక వ్యవప్రయాసలు, శత్రువుల యొక్క అపహాస్యాలు, అవరోధాలు ఎదుర్కొని ఆయన యెరూషలేము ప్రాకారాలు నిర్మించాడు. శాస్త్రి అయిన ఎజ్రా తో కలిసి దేవుని ప్రజలను ఆత్మీయముగా మేలుకొలిపాడు. వారిని దేవుని ధర్మ శాస్తానికి కట్టుబడి ఉండేటట్లు శపథం చేయించి నడిపించాడు. ఎజ్రా శాస్త్రి, మలాకీ ప్రవక్త కూడా ఈ సమయములోనే సేవ చేశారు.
ఆదిమ హెబ్రీ గ్రంథములో ఎజ్రా, నెహెమ్యా పుస్తకములు ఏక గ్రంథముగా ఉన్నవి. ఆ తరువాత సెప్టూగింటు లో రెండు పుస్తకములుగా విభజించబడినవి. నెహెమ్యా రెండు పర్యాయాలు – మొదటి సారి క్రీ. పూ 445 – 433 ల మధ్య, రెండవ సారి క్రీ. పూ 424 – 410 ల మధ్య – పర్షియాలో గవర్నర్ గా ఉన్నాడు.
రచయిత: ఎజ్రా లేక నెహెమ్యా
వ్రాయబడిన కాలము: నెహెమ్యా కార్యములు క్రీ. పూ 430 కాలములో ముగిసినవి. దానిని బట్టి ఈ పుస్తకము ఆ తరువాత కాలములో వ్రాయబడి ఉండవచ్చు.
వ్రాయబడిన స్థలము: ఇశ్రాయేలు దేశము లేక పర్షియా
ముఖ్య అంశాలు:
నాయకత్వము: నెహెమ్యాను దేవుడు ఒక నాయకునిగా పంపించాడు. ఆయన నాయకత్వములో తన ప్రజల కొరకు గొప్ప కార్యాలు చేసాడు. దేవుడు మంచి నాయకుల మీద ఆధారపడతాడు.
పునర్నిర్మాణము: దేవుని సహాయముతో 52 రోజుల్లో నెహెమ్యా యెరూషలేము ప్రాకారములు పునర్నిర్మించాడు.
పరిస్థితులు ఎంత అధ్వానంగా ఉన్నా, భవనాలు ఎంత శిధిలావస్థలో ఉన్నా, మనం దేవుని మీద ఆధారపడితే దేవుడు తన కార్యములను తిరిగి మొదలుపెడతాడు. దేవుడు మనతో ఉన్నప్పుడు మనం ఎన్నిసార్లయినా పునర్నిర్మించవచ్చు.
శత్రువు దాడులు: నెహెమ్యా యెరూషలేమును బాగుచేయాలని చూసినప్పుడు దాని పొరుగువారి నుండి తీవ్ర వ్యతిరేకతను, ధిక్కారాన్ని ఎదుర్కొన్నాడు. దేవుని పని ఏదీ శత్రువు యొక్క అవరోధాలు లేకుండా జరుగదు. ‘ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు, గాని ప్రధానులతోను, అధికారులతోను, ప్రస్తుత అంధకారసంబంధులగు లోక నాథులతోను, ఆకాశమండలమందున్న దురాత్మల సమూహ ములతోను పోరాడుచున్నాము.’ (ఎఫెసీ 6:12). శత్రువు మన మీద దాడి చేస్తాడని మనం ఊహించగలిగి, సిద్ధపడాలే కానీ, శత్రువును చూసి, ఆశ్చర్య పోతూ బెంబేలెత్త కూడదు. దేవుడిచ్చు సర్వాంగ కవచము ధరించుకొని మనము శత్రువును ఎదుర్కోవాలి.
దేవుని సార్వభౌమాధికారము: నెహెమ్యా యొక్క ప్రయాసలు, శ్రమలు, శత్రువుల దాడులు అవన్నీ ఆయనను నిరాశపరిచి ఉండవచ్చు. అయితే దేవుని యొక్క హస్తము వాటన్నిటికంటే పైగా ఉండి ఆయనను నడిపించింది.
ముఖ్య వ్యక్తులు: అర్తహషస్త, నెహెమ్యా, ఎజ్రా, మలాకీ
గ్రంథ విభజన:
1 అధ్యాయం : నెహెమ్యా ప్రార్ధన
2 అధ్యాయం : నెహెమ్యా యెరూషలేము పయనం
3 అధ్యాయం : యెరూషలేము గోడలు కట్టుట
4 అధ్యాయం : శత్రువుల దాడులు ఎదుర్కొనుచూ గోడలు కట్టుట
5 అధ్యాయం : నెహెమ్యా జీవితములో దేవుని భయం
6 అధ్యాయం : శత్రువుల దాడులకు నిలబడి, గోడ నిర్మాణం పూర్తి
7 అధ్యాయం : యెరూషలేము గుమ్మములు, జన సంఖ్య
8 అధ్యాయం : ధర్మ శాస్త్ర గ్రంథ పఠనము, పర్ణ శాలల పండుగ
9 అధ్యాయం : జనులు పాపములు ఒప్పుకొనుట, దేవుని క్షమాపణ
10 అధ్యాయం: దేవుని వెంబడించుటకు ప్రజలు శపథం చేయుట
11 అధ్యాయం: యెరూషలేము పునరావాసము
12 అధ్యాయం: యెరూషలేము ప్రాకారము ప్రతిష్ట చేయుట
13 అధ్యాయం: నెహెమ్యా సంస్కరణలు
ముఖ్య ప్రవచనాలు:
దేవుడు అబ్రాహాముతో చేసిన శాశ్వత నిబంధన ప్రవచనం నెహెమ్యాను దేవుని ప్రజలను ఆడుకొనుటకు పురికొల్పింది. పరిస్థితులు ఎంత ఘోరముగా ఉన్నప్పటికీ దేవుడు తన ప్రవచనములను విస్మరించడు అని నెహెమ్యా గ్రహించి దేవుని పనికి ఉపక్రమించాడు. బైబిలు ప్రవచనాలు నేడు కూడా దేవుని పనికి మనలను ఉత్తేజులను చేసి పురికొల్పాలి.
దానియేలు 70 వారముల ప్రవచనము క్రీ. పూ 445 లో యెరూషలేము నిర్మాణానికి అర్తహషస్త ఇచ్చిన ఆజ్ఞతో మొదలవుతుంది. ఆ గొప్ప ప్రవచనము యొక్క తొలి అడుగు నెహెమ్యా గ్రంధములో మొదలయ్యింది.
ప్రభువైన యేసు క్రీస్తు రూపం:
ఎజ్రా, నెహెమ్యా, మలాకీల తరువాత 400 సంవత్సరాల నిశ్శబ్దము రాజ్యమేలింది. దేవుని యొద్ద నుండి ప్రత్యక్షతలు కలుగలేదు. తిరిగి బాప్తిస్మ మిచ్చు యోహాను, ప్రభువైన యేసు క్రీస్తు కాలములో దేవుని ప్రత్యక్షత కలిగింది.
నెహెమ్యా కట్టే వాడు, కాపాడేవాడు: ఒక చేతితో యెరూషలేమును కట్టుచునే మరొక చేతితో నెహెమ్యా దేవుని ప్రజలను కాపాడాడు (4:17). ప్రభువైన యేసు క్రీస్తు కూడా మనలను కట్టేవాడు, కాపాడేవాడు.
మనం నేర్చుకోవలసిన పాఠాలు:
నెహెమ్యా ఒక సామాన్యుడు, ఏ మత సంస్థతో ఆయనకు సంభందాలు లేవు, అయినప్పటికీ దేవుని పని పట్ల బాధ్యత కలిగినవాడై, యెరూషలేము వెళ్లి దేవుని పరిచర్య చేసాడు. దేవుని సేవ చేయటానికి మనకు ఎటువంటి మత పదవులు, డిగ్రీలు అక్కర లేదని నీవు గుర్తించావా?
Introduction to Nehemiah by Dr.Paul Kattupalli

Please make a donation to our ministry
$25.00