ఎస్తేరు గ్రంథ పరిచయం

Esthertelugu.jpg

పరిచయం:

    దక్షిణ దేశము (యూదా) లోని యూదులు 12 సంవత్సరాల కాలము లో బబులోను దేశమునకు చెరగా తీసుకొని వెళ్ళబడ్డారు. చివరకు క్రీ. పూ 586 లో యెరూషలేములోని దేవుని ఆలయము నాశనము చేయబడింది. బబులోను సామ్రాజ్యము తరువాత పర్షియనులు ప్రపంచ ఆధిపత్యం చేశారు (క్రీ. పూ 539 – క్రీ. పూ 331). క్రీ. పూ 537 లో కోరెషు (Cyrus) చక్రవర్తి యూదులు తిరిగి యూదా దేశమునకు తిరిగి వెళ్ళవచ్చు అని ఆజ్ఞ ఇచ్చాడు. చాలా మంది యూదులు యూదా దేశమునకు తిరిగి వెళ్లారు కానీ కొంతమంది పర్షియా దేశములోనే స్థిరపడ్డారు. కోరెషు తరువాత కాంబిసిస్ (Cambyses), దర్యావేషు (Darius), తరువాత అహష్వెరోషు పర్షియా దేశమును ఏలారు. అహష్వెరోషు – ఆయన గ్రీకుపేరు క్జెర్ జిస్ (Xerxes). ఎస్తేరు గ్రంథములో ఉన్న రాజు ఈయనే. ఈయన పాలన క్రీ.పూ 486 – 465 ల మధ్య సాగింది. ఆ పాలనలో క్రీ.పూ 483 – 473 ల మధ్య ఎస్తేరు గ్రంథములోని సంఘటనలు జరిగాయి.

    అహష్వెరోషు రాజ్యం భారత దేశము సరిహద్దుల నుండి యూరప్, ఆఫ్రికా ఖండాల వరకు వ్యాపించిన మహా సామ్రాజ్యం. యూదులు ఆయన రాజ్యం మొత్తం విస్తరించిఉన్నారు.వారందరినీ సంహరించాలని హామాను ఘోరమైన కుట్ర చేశాడు.ఆ సమయములో మొర్దెకై అను ఒక యూదుడు, అతని పెంపకపు కుమార్తె ఎస్తేరు అను ఒక యూదు యువతిని దేవుడు తన ప్రజలను రక్షించుటకు ఉపయోగించుకున్నాడు. ఎస్తేరు గ్రంథములో ఎక్కడా దేవుని పేరు ఒక్కసారి కూడా కనిపించదు. దేవుని పేరు ఈగ్రంథములో కనిపించకపోయినప్పటికీ, ఆయన తెర వెనుక ఉండి తనప్రజలను ఎలా రక్షిస్తాడో, చరిత్రను ముందుకు ఎలా నడిపిస్తాడో ఎస్తేరు గ్రంథము యొక్క ప్రధాన అంశం.

రచయిత: మొర్దెకై లేక పర్షియా దేశపు యూదుడు

వ్రాయబడిన కాలము: అహష్వెరోషు (Xerxes) క్రీ.పూ 465 లో హత్యచేయబడ్డాడు. ఎస్తేరు గ్రంథము ఆయన జీవితం చివరి దశలో వ్రాయబడి ఉండవచ్చు.

వ్రాయబడిన స్థలము: పర్షియా దేశము లేక ఇశ్రాయేలు దేశము

ముఖ్య అంశాలు:

  1. కనిపించకుండా నడిపించే దేవుడు: ఎస్తేరు గ్రంథములో దేవుని పేరు కనిపించకపోయినా, ఆయన హస్తం మనకు కనిపిస్తుంది. మనకు కనిపించకుండా దేవుడు తన పనులు నిర్వహిస్తాడు.

      2.దేవుని విశ్వసనీయత: నీ సంతానాన్ని ఎక్కడున్నా, ఎప్పుడైనా రక్షిస్తాను అని అబ్రాహాము కు ఇచ్చిన మాటను (ఆదికాండము12:1-3) దేవుడు 1500 సంవత్సరాల తరువాత  పర్షియా దేశములో కూడా నిలబెట్టుకున్నాడు.

  1. సామాన్యులను వాడుకొనే దేవుడు: మొర్దెకై, ఎస్తేరులు చాలా సామాన్యమైన యూదులు. అయితే దేవుడు వారిని ఉపయోగించుకొని ప్రపంచాన్ని నాడు వణికిస్తున్న అహష్వెరోషు రాజు జీవితాన్ని, అతని ప్రజల జీవితాలను ప్రభావితం చేసాడు. అబ్రహాము వంటి ఒక ముసలి వాని శరీరం, మోషే లాంటి నత్తి వాని కఱ్ఱ, యెహోషువ వంటి ఒక యోధుని కత్తి, దావీదు వంటి ఒక గాయకుని గొంతు, ఎస్తేరు వంటి ఒక యువతి అందం – దేవుడు ఎవరినైనా తన కార్యములకు ఉపయోగించుకొనగలడు.

      4.గర్విష్ఠులను అణగద్రొక్కే దేవుడు: హామాను వంటి గర్విష్ఠులను అణగద్రొక్కి, దేవుడు మొర్దెకై వంటి దీనులను హెచ్చించాడు.

  1. ఏ సమయానికి ఆ మనుష్యులు: ఎస్తేరు 4:14 లో కనిపించే ‘నీవు ఈ సమయమును బట్టియే’ (For such a time as this) ఈ గ్రంథము లో కీలకమైన మాటలు. దేవుని ప్రణాళికలో ఏ సమయానికి, ఏ పనికి తగ్గట్టు, ఆ వ్యక్తులు వాడబడుతారు.
  2. యూదు ద్వేషము: హామాను అమాలేకీయుల జాతి వాడు. శతాబ్దాల యూదు ద్వేషాన్ని తన కడుపులో దాచుకొన్న ఉగ్రవాది. అయితే దేవుడు తన ప్రజలను వాని నుండి విడిపించాడు.
  3. శత్రువులను శిక్షించే దేవుడు: ఏ ఉరి కంబం హామాను మొర్దెకై కోసం సిద్ధపరచాడో అదే ఉరి కంబం మీద అతను నిర్వీర్యుడయ్యాడు.

 

ముఖ్య వ్యక్తులు: అహష్వెరోషు, మొర్దెకై, వష్తి రాణి, ఎస్తేరు, హామాను

గ్రంథ విభజన:

1 అధ్యాయం: అహష్వెరోషు రాజు, వష్తి రాణి

2 అధ్యాయం: ఎస్తేరు, రాణి గా మారుట

3 అధ్యాయం: హామాను కుతంత్రాలు

4 అధ్యాయం: యూదులకు శ్రమలు

5 అధ్యాయం: హామాను కుట్ర, ఉరి కొయ్య సిద్ధం

6 అధ్యాయం: హామాను ఏడుపు; తెర వెనుక దేవుని హస్తం

7 అధ్యాయం: హామాను ఉరి

8 అధ్యాయం: మొర్దెకై హెచ్చింపు, యూదులకు క్షేమము

9 అధ్యాయం: యూదులు తమ శత్రువులను సంహరించుట, సంతోషించుట

10 అధ్యాయం: ప్రధాన మంత్రిగా మొర్దెకై

ముఖ్య ప్రవచనాలు:

ఈ గ్రంథములో ఏ ప్రవచనాలు లేవు.కానీ దేవుడు ఇంతకు ముందు అబ్రాహాము నకు చేసిన ప్రవచనం ఏవిధముగా నిలబెట్టుకొన్నాడో ఈ గ్రంథములో మనం చూస్తాము.

యూదు ద్వేషము: ఈ గ్రంథములో యూదు వ్యతిరేకత(Antisemitism) మనకు కనిపిస్తుంది. అంత్య దినాల్లోఇది ఇంకా తీవ్ర స్థాయికి చేరుతుంది. హామాను నుండి, హిట్లర్ల నుండి యూదులను విడిపించిన దేవుడే వారిని భవిష్యత్తులోకూడా రక్షిస్తాడు.

ప్రభువైన యేసు క్రీస్తు రూపం: హామాను లాంటి దుష్టుల నుండి యూదులను రక్షించుటకు దేవుడు మొర్దెకై, ఎస్తేరులను ఉపయోగించాడు. భవిష్యత్తులో క్రీస్తు విరోధి నుండి యూదులను రక్షించుటకు దేవుడు ప్రభువైన యేసుక్రీస్తును వాడుకొంటాడు. యూదులు తమ రక్షణను బట్టి సంతోషించి, పండుగ చేసుకొనుట ఎస్తేరు గ్రంథములో చూస్తాము.యేసు క్రీస్తు రాజ్యములో కూడా యూదులు తమ విమోచనను బట్టి ఆనందిస్తారు.

మనం నేర్చుకోవలసిన పాఠాలు:

-పరిస్థితులను మార్చివేసే దేవుడు: యూదులను సర్వనాశనం చేయాలని హామాను భయంకర కుట్ర చేస్తే దేవుడు దానిని విఫలం చేసాడు.దేవుడు ఎంతటి సంక్లిష్టమైన పరిస్థితులనైనా తన శక్తితో మార్చగలడు అని గ్రహించావా?

మొర్దెకై సహనముతో ఎస్తేరుకు శిక్షణ ఇచ్చాడు.మీ శిక్షణ క్రింద ఉన్నవారిని దేవుడు తన కార్యాల కొరకు వాడుకొంటాడు అని గ్రహించారా?

-ఎస్తేరు, మొర్దెకై లు ఉపవాస ప్రార్ధన చేసి తమ శత్రువులను జయించారు. ఉపవాస ప్రార్ధన యొక్క శక్తిని మీరు అర్ధం చేసుకున్నారా?

Feed a Hungry Child with as little as $10 per month

Give a helping hand to feed the hungry children and to provide them health care and education

$10.00

Leave a Reply