బైబిల్ ప్రవచనాలు: క్రైస్తవ సంఘము ఎత్తబడుట

rapture125a.jpg

క్రీస్తు చేత విమోచించబడిన వారిని ఈ భూలోకము లో నుండి వేరుచేసి దేవుడు  పరలోకములోనికి తీసుకొని వెళ్ళుటను ‘రాప్చర్’ లేదా ‘సంఘము ఎత్తబడుట’ అని పిలుస్తాము. ఆ ప్రత్యెక మయిన సంఘటన కు ముందు చనిపోయిన విశ్వాసులకు ఏమి జరుగుతుంది? అనే సందేహం చాలా మందిని ఆందోళన కు గురిచేస్తుంది. క్రీస్తు నందు చనిపోయిన విశ్వాసులు వెంటనే ఆయన సన్నిధిలొనికి ప్రవేశిస్తారని బైబిలు తెలియజేస్తున్నది. ‘ఇట్లు ధైర్యము గలిగి యీ దేహమును విడిచి పెట్టి ప్రభువునొద్ద నివసించుటకు ఇష్టపడుచున్నాము’ (2 కొరింథీ 5:8). ‘ఈ రెంటి మధ్యను ఇరుకునబడియున్నాను. నేను వెడలిపోయి క్రీస్తుతోకూడ నుండవలెనని నాకు ఆశయున్నది, అదినాకు మరి మేలు’. (ఫిలిప్పీ 1:23). దేహమును విడిచిపెట్టిన తరువాత మనము వెంటనే ప్రభువు సన్నిధి లోనికి ప్రవేశిస్తామని ఇక్కడ అపోస్తలుడు మనకు భోదించాడు.

సంఘము ఎత్తబడే దినము వరకూ చనిపోయిన, చనిపోయే విశ్వాసులందరూ వెంటనే ప్రభువు సన్నిధి లోనికి ప్రవేశిస్తారు. వారి ఆత్మలు ప్రభువు తో సహవాసములొ గడుపు తాయి. వారి మృతదేహాలు స్మశాన వాటికలో విడువబడి, సంఘము ఎత్తబడే దినము వరకు అక్కడే పూర్తిగా క్షీణించిన దశలో వుంటాయి. ప్రతి విశ్వాసి యొక్క జీవితమును నాలుగు భాగములుగా విభజించవచ్చును. 1. క్రీస్తు లేని: ఆయనను ఎరుగక మునుపు మనము గడిపిన జీవితము 2. క్రీస్తు నందు: ఆయనను విశ్వసించిన వెంటనే మొదలయ్యే మన జీవితం 3. క్రీస్తు కొరకు: ఆయనను విశ్వసించిన దినం నుండి భూలోకములో మనం గడిపే చివరి దినం వరకు వుండే జీవితం 4. క్రీస్తు తో: భౌతిక శరీరం విడచిన దగ్గరి నుండి మనం క్రీస్తు తో గడిపే జీవితం. ఈ నాలుగవ భాగమునకు అంతం వుండదు. నిత్యత్వమంతా మనం క్రీస్తుతోనే ఉంటాము.

అపోస్తాలుడయిన పౌలు రక్షించబడిన తరువాత  తన ఇహలోక జీవితం మొత్తం ప్రభువు కొరకే వినియోగించాడు. ఆయనను సేవించుచునే, తన జీవితం మొత్తం ప్రభువు యొక్క రాకడ కొరకు నిరీక్షించాడు. “ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను; మన మందరము నిద్రించము గాని నిమిషములో, ఒక రెప్ప పాటున, కడబూర మ్రోగగానే మనమందరము మార్పు పొందుదుము.  బూర మ్రోగును; అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు, మనము మార్పు పొందుదుము” 1 కొరింథీ 15:51-52). సంఘము ఎత్తబడుట చాలా కాలము పాటు ఒక మర్మము గా వున్నది. దేవుడు ఆ మర్మమును పౌలు గారి ద్వారా ఇక్కడ వాక్యములో మనకు వివరించాడు. తన జీవిత కాలములోనే ప్రభువు తన సంఘము కొరకు తిరిగి వస్తాడని, తాను కూడా ఎత్తబడతానని  పౌలు గారు ఆశించాడు. ‘మరనాతా’ అని ఆయన విశ్వాసులకు చెప్పే శుభాకాంక్షలకు అర్ధము: ‘ప్రభువా, రమ్ము’

ప్రభువు రావాలని, వస్తాడని ఆయన ఆశించాడే గాని, ప్రభువు ఇప్పుడు వస్తాడని, అప్పుడు వస్తాడని ఆయన తేదీలు పెట్టలేదు. “అయితే ఆ దినమును గూర్చియు ఆ గడియనుగూర్చియు తండ్రి మాత్రమే (యెరుగును) గాని, యే మనుష్యుడైనను పరలోకమందలి దూతలై నను కుమారుడైనను ఎరుగరు” (మత్తయి 24:36), “కాల ములను సమయములను తండ్రి తన స్వాధీనమందుంచుకొని యున్నాడు; వాటిని తెలిసికొనుట మీ పనికాదు” (అపొ. కార్య 1:7) అని ప్రభువు తన శిష్యులకు చేసిన బోధ పౌలు గారికి ఎరుకే. కాబట్టి, తేదీలు పెట్టకుండా, బుద్ధి గల కన్యక వలె ‘మహా దేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమయొక్క ప్రత్యక్షత కొరకు ఎదురుచూచాడు’ (తీతు 2:13). తన జీవితం ఆఖరి దశకు సమీపించినప్పుడు, ప్రభువు రాకడ ముందే తాను నిద్రిస్తానని ఆయన గ్రహించాడు. ‘నేనిప్పుడే పానార్పణముగ పోయబడుచున్నాను, నేను వెడలిపోవు కాలము సమీపమై యున్నది. మంచి పోరాటము పోరాడితిని, నా పరుగు కడ ముట్టించితిని, విశ్వాసము కాపాడుకొంటిని’ (2 తిమోతి 4:6-7). దేవుడు ప్రభువును లేపెను; మనలను కూడ తన శక్తివలన లేపును (1 కొరింథీ 6:14)

దేవుడు ప్రభువును లేపెను; మనలను కూడ తన శక్తివలన లేపును

దేవుడు ప్రభువయిన యేసు క్రీస్తును మరణము నుండి లేపాడు కాబట్టి మనలను కూడా మరణము నుండి లేపుతాడు. మనం జాగ్రత్తగా గమనించవలసిన విషయం ఏమిటంటే, మన యొక్క పునరుత్థానము ప్రభువు యొక్క పునరుత్థానముతో ఐక్యము చేయబడినది. ఆయన లేచాడు కాబట్టే మనమూ లేస్తాము. పౌలు గారు మరింత విశదముగా విశ్వాసుల యొక్క పునరుత్థానము ను 1 థెస్సలొనీక 4:13-18 లో వ్రాసాడు.

“సహోదరులారా, నిరీక్షణలేని యితరులవలె మీరు దుఃఖపడకుండు నిమిత్తము, నిద్రించుచున్నవారిని గూర్చి మీకు తెలియకుండుట మాకిష్టములేదు. యేసు మృతి పొంది తిరిగి లేచెనని మనము నమ్మినయెడల, అదే ప్రకారము యేసునందు నిద్రించినవారిని దేవుడాయనతో కూడ వెంటబెట్టుకొని వచ్చును. మేము ప్రభువుమాటను బట్టి మీతో చెప్పునదేమనగా, ప్రభువు రాకడవరకు సజీవులమై నిలిచియుండు మనము నిద్రించినవారికంటె ముందుగా ఆయన సన్నిధి చేరము.  ఆర్భాటముతోను, ప్రధానదూతశబ్దముతోను, దేవుని బూరతోను పరలోకమునుండి ప్రభువు దిగివచ్చును; క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితోకూడ ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశమండలమునకు మేఘములమీద కొనిపోబడుదుము. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడ ఉందుము. కాబట్టి మీరు ఈ మాటలచేత ఒకనినొకడు ఆదరించుకొనుడి”

మన ఆత్మీయులు చనిపోయినప్పుడు దుఃఖపడడం సహజమే. మా కుటుంబ సభ్యులు, స్నేహితులు మరణించినప్పుడు నేను కూడా ఏడ్చాను. ప్రభువు కూడా లాజరు సమాధి వద్ద కన్నీరు పెట్టాడు.

ప్రఖ్యాత క్రైస్తవ సాహితీవేత్త C.S.Lewis (1898-1963) తన భార్య కాన్సర్ తో చనిపోయే టప్పుడు ఎంతో వేదన చెందాడు. రోజు తర్వాత రోజు మృత్యు వాకిలి యొద్దకు ఆమె ఈద్వాబడుచూ వున్నప్పుడు, ప్రక్కనే ఉండి ఏమీ చేయలేక పోవు చున్నానే అని నైరాశ్యం ఆయన హృదయాన్ని తీవ్రమయిన దిగులుతో నింపివేసింది. తన భార్యను సమాధి చేసిన తరువాత, ఆయన ‘నేను పడిన శోకము’ (A Grief Observed) అనే పుస్తకం వ్రాసాడు. ‘కాన్సర్, కాన్సర్, కాన్సర్. నా తల్లి, నా తండ్రి, నా భార్య….తర్వాత ఎవరు? ఎవరిని అది కబలిస్తుంది?’ అని ఆయన ఆ పుస్తకములో చింతిస్తూ వ్రాసిన మాటలు , మరణం మనందరి జీవితాల్లో కలిగించే అభద్రత, అనిశ్చితి, అసహాయతలను ప్రతిబింబిస్తాయి. కాన్సర్ కాకపొతే మరొక వ్యాధి, భాద వలన కావచ్చు. మనలను కూడా మరణం వేదిస్తుంది. ఆ సమయములలో ప్రభువు మనకు వాగ్దానము చేసిన ఆయన సన్నిధి, మరణము మీద ఆయన సాధించిన విజయములను మనము జ్ఞాపకము చేసుకోవాలి.  

మరణం మిగిల్చే దుఃఖం మన ఆత్మీయులను కోల్పొయామే అనే ఎడబాటు వలను కలుగుతుందే తప్ప, నిరీక్షణ లేక కాదు. క్రీస్తును ఎరుగని వారికి ఈ నిరీక్షణ వుండదు. మరణం వారిని తమ ఆత్మీయుల నుండి శాశ్వతముగా విడదీస్తుంది. కాని విశ్వాసులు, విశ్వాసులుగా మరణించిన తమ వారి యొక్క స్థితిని బట్టి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ‘యేసు మృతి పొంది తిరిగి లేచెనని మనము నమ్మినయెడల, అదే ప్రకారము యేసునందు నిద్రించినవారిని దేవుడాయనతో కూడ వెంటబెట్టుకొని వచ్చును’. దేవుడు యేసు క్రీస్తును మృతి నుండి లేపాడు కాబట్టి, ఆయన యందు విశ్వసించిన మనలను కూడా మృతి నుండి లేపుతాడు. ఇంతకు ముందు చెప్పినట్లు, మన యొక్క పునరుత్థానము ప్రభువు యొక్క పునరుత్థానముతో ఐక్యము చేయబడినది. ప్రభువయిన యేసు క్రీస్తు -మనము పాపముల విషయమై చనిపోయి, నీతివిషయమై జీవించునట్లు, ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రానుమీద మోసి కొనెను (1 పేతురు 2:24). ఆయన మన పాపముల కొరకు చేసిన యాగము వలన మనకు దేవుని నీటి ప్రాప్తించింది. “ఎందుకనగా మనమాయనయందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మనకోసము పాపముగాచేసెను” (2 కొరింథీ 5:21). ప్రభువు యొక్క సిలువ మరణం దేవుని యొక్క నీతినీ, పరిశుద్దతనూ, న్యాయాన్ని పరిపూర్ణముగా నెరవేర్చింది కాబట్టి, దానిని నిరూపించుటకు దేవుడు ప్రభువయిన యేసు క్రీస్తును మృత్యువు నుండి తిరిగి లేపాడు. క్రీస్తు యొక్క నీతి మనలను కూడా దేవుని ఎదుట నిర్దోషులనుగా నిలబెట్టింది కాబట్టి, దేవుడు ఆయనను మరణం నుండి లేపినట్లే, మనలను కూడా మరణం నుండి లేపుతాడు.

   ‘నేను జీవించుచున్నాను గనుక మీరును జీవింతురు’ అని ప్రభువయిన యేసు క్రీస్తు మనకు అభయం ఇచ్చాడు (యోహాను 14:19). ఆయన ఇచ్చిన ఈ గొప్ప నిశ్చితను గుండెల్లో పెట్టుకొని విశ్వాసులు మరణాన్ని దాని కళ్ళల్లోకి చూస్తూనే అపహాస్యం చేసారు. అమెరికా దేశం అంతర్యుద్ధము లో కొట్టుమిట్టాడుతున్నప్పుడు, దక్షిణ సైన్యములో స్టోన్ వాల్ జాక్సన్ అనే ఒక గొప్ప సైనికాధికారి ఉండేవాడు. చుట్టూ బుల్లెట్ల వర్షం కురుస్తున్నప్పటికీ తొనక కుండా, బెనక కుండా శత్రువులను వేటాడే ఆయన ధైర్య సాహసాలు చూసి చుట్టూవున్న సైనికులు ఆశ్చర్యపోయేవారు. నీ తెగువ యొక్క రహస్యం ఏమిటని ఎవరైనా ప్రశ్నిస్తే, ‘దేవుడు నిర్ణయించిన రోజు వచ్చే వరకూ ఏ బుల్లెట్టూ నన్ను చంపలేదు. చని పోయిన మరు క్షణం నేను ప్రభువు తో వుంటాను, ఇక నేను బయపడాల్సిన అవసరం ఏమి వుంది?’ అని ఆయన సమాధానమిచ్చేవాడు. ‘ప్రభువైన యేసును లేపినవాడు యేసుతో మమ్మునుకూడ లేపును’ (2 కొరింథీ 4:14).  క్రైస్తవ నిఘంటువు లో ‘మరణం’ యొక్క పేరు ‘నిద్ర’ గా మార్చబడింది. ‘ఓ మరణమా, నీ విజయమెక్కడ? ఓ మరణమా, నీ ముల్లెక్కడ?’

                పునరుత్థానము చెందిన విశ్వాసులు ప్రభువుతో పాటుగా పరలోకం తిరిగి వెళ్తారు. అక్కడ ఆయన వారికొరకు సిద్ధము చేసిన ప్రేమ సౌధం లో వారు నిరంతరం నివసిస్తారు. ‘మీ హృదయమును కలవరపడనియ్యకుడి; దేవుని యందు విశ్వాసముంచుచున్నారు నాయందును విశ్వాస ముంచుడి. నేను వెళ్లి మీకు స్థలము సిద్ధపరచినయెడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరల వచ్చి నాయొద్ద నుండుటకు మిమ్మును తీసికొని పోవుదును’. (యోహాను 14:1-3) పరలోకములో ఆయన సిద్ధము చేయుచున్న మహిమ గల పట్టణము ను దృష్టిలో వుంచుకొని, భూలోకములో మనము కలవరపడకూడదని ప్రభువు ఉద్దేశ్యము. పాప బంధకాలు తెంచుకొని, మనం స్వేచ్చగా పరలోక వీధులలో గంతులు వేస్తాము. మహానుభావుడు C.S.Lewis  అనేక గొప్ప పుస్తకాలలో ఒకటి Screwtape Letters అనే కల్పిత కధ. ఇందులో సీనియర్ దెయ్యం ఒక జూనియర్ దెయ్యం కు సలహాలు ఇస్తూ వ్రాసిన ఉత్తరాలు వుంటాయి. విశ్వాసులను ఎలా భాదించాలొ, వేదించాలో సీనియర్ దెయ్యం జూనియర్ దెయ్యానికి సవివరముగా వ్రాస్తాడు. ఒక ఉత్తరములో, విశ్వాసి జీవించి ఉన్నంత కాలమే మన దుశ్చర్యలు సాగుతాయని, విశ్వాసి చనిపోయిన తరువాత తన పాపమలిన వ్రస్తాలు, మన దాడికి అనువయిన శోధన ఆపేక్షలు కోల్పోయి దేవుని యొక్క పరిపూర్ణత లోకి, పరలోకం ఇచ్చే మహిమ, భద్రత, స్వేచ్చ లోకి ప్రవేశిస్తాడని సీనియర్ దెయ్యం వ్యధ చెందుతాడు. మరణం ఆ విధంగా విశ్వాసికి వరమని వాపోతాడు. నిజమే. మనం పొందబోయే పరలోక ఐశ్వర్యాలు మనకన్నా ఎక్కువగా సాతానుకు తెలుసు.

సంఘము ఎత్తబడే ‘రాప్చర్’ లో యేసు ప్రభువు భూమి మీద అడుగు పెట్టడు. ఆయన రెండవ రాకడలో మాత్రమే ఆయన మీద మీదకు వస్తాడు. ‘ఆర్భాటముతోను, ప్రధానదూతశబ్దముతోను, దేవుని బూరతోను పరలోకమునుండి ప్రభువు దిగివచ్చును’ ఏ దేవదూతనో, ఏ ప్రవక్తనో పంపకుండా  ఆయనే స్వయముగా తన ప్రజల కోసం దిగివస్తాడు. అది ఆర్భాటము తో వుంటుంది. యుద్ధ భూమిలో శత్రువులను మట్టికరిపించిన తరువాత సైనికులు పెట్టే కేకల వలె, దేవుని ప్రజలు ఆ రోజున విజయ గర్వముతో నినాదాలు చేస్తారు. అప్పుడు ప్రధానదూత శబ్దము వుంటుంది. అప్పటి వరకూ అపవాదితో వాదించి, విసికిపోయిన (యూదా 9)   ప్రధానదూత కూడా జయోత్సాహముతో దేవుని ప్రజల కేకలకు తన శబ్దము కలుపుతాడు. ఆ సమయములోనే దేవుని బూర కూడా వినిపిస్తుంది. పాత నిబంధనలో ఇశ్రాయేలీయుల యొక్క పండుగలు, ఉత్సవాలు, కూడికలకు బూర ఊదడం ఆనవాయితీ. ఆ బూర విని ప్రజలు దేవుని సన్నిధి లో సమకూడేవారు. ఆ విధంగానే, దేవుని బూర వినబడినప్పుడు, ఇంతకు ముందు చనిపోయిన విశ్వాసులు, భూమి మీద జీవించి ఉన్న విశ్వాసులు కలిసి ప్రభువు యొద్దకు ఒకే సమూహముగా చేరతారు. ‘క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు.ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము….’ మనకంటే ముందుగా ఈ లోకంలో జీవించి వెళ్ళిన సీనియర్లను గౌరవించడం సబబు కాబట్టి ముందుగా వారు తమ మహిమగల శరీరములతొ లేస్తారు. తరువాత, ‘మనము వారితోకూడ ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశమండలమునకు మేఘములమీద కొనిపోబడుదుము’. విశ్వాసులందరూ ఆ విధముగా భూలోకములో నుండి పరలోకమునకు తీసుకెల్లబడతారు. దేవుని ప్రజలకు అది సువర్ణ దినము అయితే, దేవుని ఎరుగని వారికి అది చీకటి దినం. ఎందుకంటె, సంఘము భూమి మీద నుండి వెళ్లిపోయిన తరువాత, ‘శ్రమల కాలము’ మొదలవుతుంది. అంత వరకూ సాతాను ఆగడాలను కొంతమేర వరకయినా అడ్డుకొన్న క్రీస్తు శరీర మయిన క్రైస్తవ సంఘము, భూమి మీద నుండి వెళ్ళిపోవటముతో, సాతానుడు, వారి దూతల సమూహం మరింత రెచ్చిపోయి, స్వైర్యవిహారం చేస్తారు.

క్రీస్తు ఆగమనం – సంఘం ఎత్తబడుట

1 థెస్సలొనీక 4:13 నుండి కొన్ని వచనాలు చూద్దాము.

 1. సహోదరులారా, నిరీక్షణలేని యితరుల వలె మీరు దుఃఖపడకుండు నిమిత్తము, నిద్రించుచున్నవారిని గూర్చి మీకు తెలియకుండుట మాకిష్టములేదు.
 2. యేసు మృతి పొంది తిరిగి లేచెనని మనము నమ్మినయెడల, అదే ప్రకారము యేసునందు నిద్రించినవారిని దేవుడాయనతో కూడ వెంటబెట్టుకొని వచ్చును.
 3. మేము ప్రభువు మాటను బట్టి మీతో చెప్పునదేమనగా, ప్రభువు రాకడవరకు సజీవులమై నిలిచియుండు

మనము నిద్రించినవారికంటె ముందుగా ఆయన సన్నిధి చేరము.

 1. ఆర్భాటముతోను, ప్రధానదూతశబ్దముతోను, దేవుని బూరతోను పరలోకమునుండి ప్రభువు దిగివచ్చును;

క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు.

 1. ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితోకూడ ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశమండలమునకు మేఘములమీద కొనిపోబడుదుము. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడ ఉందుము.
 2. కాబట్టి మీరు ఈ మాటలచేత ఒకనినొకడు ఆదరించుకొనుడి.

 

ఈ వాక్య భాగము నుండి 10 విషయాలు చూద్దాము.

 1. ఆందోళన
 2. ఆవేదన
 3. ఆగమనం
 4. ఆకస్మికము
 5. ఆర్భాటము
 6. ఆరోహణము
 7. ఆకాశము
 8. ఆలింగనము
 9. ఆనందము
 10. ఆదరణ

 

1.ఆందోళన: అపొస్తలుడయిన పౌలు థెస్సలొనీక సంఘమును ఓదార్చుచూ ప్రభువు రాకడ గురించి చాలా ఆసక్తికరమైన సత్యాలు మనకు తెలియ జేశాడు. థెస్సలొనీక సంఘము వారు శ్రమలలో ఉన్నారు. ఏడేండ్ల  శ్రమలు మొదలయినాయా అని వారు సంశయము చెందారు. లోకము మీదకు దేవుని ఉగ్రత వచ్చిందేమో అనే అనుమానము వారికి కలిగింది.

 

2.ఆవేదన: ఆ ఆందోళన నుండి వారికి ఆవేదన కలిగింది.

 1. సహోదరులారా, నిరీక్షణలేని యితరుల వలె మీరు దుఃఖపడకుండు నిమిత్తము,

నిద్రించుచున్నవారిని గూర్చి మీకు తెలియకుండుట మాకిష్టములేదు.

అపొస్తలుడైన పౌలు వారి యొక్క శ్రమలకు, ఏడేండ్ల శ్రమలకు ఎటువంటి సంబంధము లేదని వారికి స్పష్టము చేశాడు. దీనిని బట్టి ఏడేండ్ల శ్రమలు మొదలుకాకముందే విశ్వాసులు ఈ లోకమునుండి ఎత్తబడతారని మనకు అర్ధం అవుచున్నది. వారి శ్రమల తరువాత సంఘము ఎత్తబడుతుంది అని నమ్మితే, థెస్సలొనీక సంఘస్తులు ప్రభువు రాకడ సమీపించినదని సంతోషించేవారు. కానీ వారి పరిస్థితి ఆ విధముగా లేదు. విశ్వాసులందరూ 7 సంవత్సరాల శ్రమలు ప్రారంభము కాకముందే ఈ లోకము నుండి ఎత్తబడతారు. దానియేలు 70 వారముల ప్రవచనములో 69 వారములు ముగిసినవి. 69 వారము ముగిసింది. 70 వ వారము భవిష్యత్తులో ఉంది. ప్రస్తుతము మనము 69 వారము, 70 వారము మధ్యలో ఉన్న గ్యాప్ లో ఉన్నాము. 70 వారము ఏడేండ్ల శ్రమలు. ఈ ఏడేండ్ల శ్రమలు ప్రారంభము కాకమునుపే క్రైస్తవ సంఘము ఎత్తబడుతుంది.

చనిపోయిన తమ ప్రియుల గురించి కూడా థెస్సలొనీక సంఘస్తులు ఆందోళన చెందుతున్నారు.

“నిద్రించుచున్నవారిని గూర్చి మీకు తెలియకుండుట మాకిష్టములేదు.”

మన ఆత్మీయుల గురించి మనమందరమూ ఆందోళన చెందుతాము.

మా తాత, మా నాన్న యోహాను గారు, మా అమ్మ రాజాబాయమ్మ గారు, మా మామయ్యలు, ఇంకా అనేకమంది మరణము నన్ను బాధించింది. వారిని భవిష్యత్తులో చూస్తాను అనే నిరీక్షణ నాకు ఉంది.

అయితే థెస్సలొనీక లోని విశ్వాసులకు చనిపోయిన తమ ఆత్మీయుల గురించి దేవుని ప్రణాళిక ఏమిటో తెలియక ఎంతో ఆందోళన చెందారు.వారి అనుమానాలను నివృత్తి చేయుటకు అపొస్తలుడైన పౌలు వారికి ఈ పత్రిక వ్రాశాడు.

చనిపోయిన విశ్వాసులకు ఏమి జరుగుతుంది?

  చనిపోయిన వారి ఆత్మల గురించి క్రైస్తవులలో అనేక మూఢ నమ్మకాలు గూడుకట్టుకొని వున్నాయి. ‘మా ఆంటీ చనిపోయింది, ఇప్పుడు దెయ్యం అయ్యి మా అంకుల్ ని అప్పుడప్పుడూ రాత్రి పూట వేధిస్తున్నది’ ‘పరీక్షలకు ముందు నేను మా తాత ఆత్మను తలంచుకొంటాను. ఆయన ఆత్మ నన్ను ప్రోత్సహిస్తుంది’ ‘నీ మీద నాకు చచ్చేంత కోపముగా ఉంది.నేను చనిపోయి, దెయ్యం అయ్యి నిన్ను జీవితమంతా వేధిస్తాను’ లాంటి మాటలు నేను చాలా సార్లు విన్నాను. అయితే, ఎవరూ – అవిశ్వాసులు, విశ్వాసులు – చనిపోయిన తరువాత దెయ్యాలు కారు.వారి మృత దేహాలు సమాధుల తోటలో విడువబడితే వారి ఆత్మలు సృష్టికర్త యొద్దకు తిరిగి చేరుతాయి.

మన్నయి నది వెనుకటివలెనే మరల భూమికి చేరును,

ఆత్మ దాని దయచేసిన దేవుని యొద్దకు మరల పోవును.

                                                                    ప్రసంగి 12:7

ఆత్మ దేవుని యొద్దకు తిరిగి వెళ్తుంది. కాబట్టి చనిపోయిన  వారి ఆత్మలు దెయ్యాలు, దేవ దూతలు కావు. వారి ఆత్మలు భూమి మీద తిరుగుట, ఇళ్లల్లో చొరబడుట, మనుష్యులను వేధించుట వంటి పనులు చేయవు. కొన్ని క్రైస్తవ సంఘాల్లో చనిపోయిన తమ సంస్థాపకుడి కోసము స్టేజీ మీద ఖాళీ  కుర్చీ వేస్తారు. ‘మా అయ్య గారి ఆత్మ వచ్చి ఇక్కడ కూర్చుంటుంది’ అని చెప్పుకొంటారు. ఇటువంటి మూఢ నమ్మకాలు క్రైస్తవులలో ఉండుట విచారకరము. చనిపోయిన విశ్వాసులు వెంటనే ప్రభువు సన్నిధిలో ప్రవేశిస్తారు.

నామట్టుకైతే బ్రదుకుట క్రీస్తే, చావైతే లాభము.

నేను వెడలిపోయి క్రీస్తుతోకూడ నుండవలెనని నాకు ఆశయున్నది, అదినాకు మరి మేలు. ఫిలిప్పీ 1: 21-23

having a desire to depart and to be with Christ, which is far better;

యీ దేహమును విడిచి పెట్టి ప్రభువునొద్ద నివసించుటకు ఇష్టపడుచున్నాము. 2 కొరింథీ 5: 8

   చనిపోయిన వారు భవిష్యత్తులో పునరుత్తానము చెందుతారు. అటువంటి నమ్మకాలను ఎగతాళి చేసే వారు ఎప్పుడూ ఉంటారు. ఏథెన్సు లో గ్రీకు ప్రజలు అపొస్తలుడైన పౌలు ను అపహాస్యము చేశారు.                                    మృతుల పునరుత్థానమును గూర్చి వారు వినినప్పుడు కొందరు అపహాస్యముచేసిరి (అపో.కార్యములు 17:32)

చనిపోయిన వారు తిరిగి లేచుట ఏమిటి అని ఏథెన్సు ప్రజలు పౌలు గారిని విమర్శించారు. ప్రభువైన యేసు క్రీస్తు పునరుత్తానము మీద క్రైస్తవ విశ్వాసము నిర్మించబడింది. ఆయన మరణమును జయించాడు.

క్రీస్తు యేసను మన రక్షకుని ప్రత్యక్షతవలన బయలుపరచబడి నదియునైన తన కృపనుబట్టియు, మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచెను. ఆ క్రీస్తుయేసు, మరణమును నిరర్థకము

చేసి జీవమును అక్షయతను సువార్తవలన వెలుగులోనికి తెచ్చెను. 2 తిమోతి 1:10

but is now made manifest by the appearing of our Savior Jesus Christ, who hath abolished death and hath brought life and immortality to light through the Gospel.

ఆ క్రీస్తుయేసు, మరణమును నిరర్థకము చేశాడు కాబట్టే, పౌలు గారు మరణము యొక్క శక్తిని ప్రశ్నించాడు.

ఓ మరణమా, నీ విజయమెక్కడ?

ఓ మరణమా, నీ ముల్లెక్కడ? 1 తిమోతి 15:55

 1. ఆగమనం

 

మనం ఆందోళన, ఆవేదన చెందాల్సిన అవసరము లేదు, ఎందుకంటే ఆయన ఆగమనం మనకు ముందుగా ఉన్నది.

ఆర్భాటముతోను, ప్రధానదూతశబ్దముతోను, దేవుని బూరతోను పరలోకమునుండి ప్రభువు దిగివచ్చును

 

ఒక విదేశీ నేత మన దేశానికి వస్తే మన ప్రభుత్వము ఒక అధికారినో, దౌత్య వేత్తనో, మంత్రినో ఆయనను విమానాశ్రయములో స్వాగతించుటకు పంపును. కానీ స్వయముగా ప్రధాన మంత్రే ఆ విదేశీయుణ్ణి ఆహ్వానించుటకు విమానము యొద్దకు వెళ్తే ఆయన ఎంత ముఖ్యుడో అని మనము అనుకొంటాము.

తన వారికొరకు ప్రభువైన యేసు క్రీస్తు స్వయముగా వస్తున్నాడు. భూలోకము నుండి ప్రజలు వస్తున్నారు, నలుగురు దేవదూతలను పంపిస్తాను, వారి కదే ఎక్కువ అని ఆయన అనుకోవడము లేదు. ఆయనే స్వయముగా విశ్వాసుల కొరకు వస్తున్నాడు.

 1. ఆకస్మికం

ఆయన  ఆగమనము ఆకస్మికముగా  జరుగుతుంది. ఆయన ఇప్పుడు వస్తున్నాడు, ఈ సంవత్సరము, ఈ నెల, ఈ రోజు, ఈ సమయము  అని లెక్కలు కట్టే వారు ఉన్నారు. వీరి వలన క్రైస్తవ్యము నలుగురి ముందు నవ్వులు పాలు అవుతుందే కానీ మరొక ప్రయోజనము లేదు.అయితే ఆ దినమును గూర్చియు ఆ గడియనుగూర్చియు తండ్రి మాత్రమే (యెరుగును) గాని, యే మనుష్యుడైనను పరలోకమందలి దూతలై నను కుమారుడైనను ఎరుగరు. (మత్తయి 24:36). అపొస్తలుల కార్యములు 1:6 లో ప్రభువైన యేసు క్రీస్తు పరలోకమునకు తిరిగి వెళ్ళు సమయములో ఆయన శిష్యులు ఆయనను ప్రశ్నించారు.

కాబట్టి వారు కూడివచ్చినప్పుడు ప్రభువా, యీ కాలమందు ఇశ్రాయేలునకు రాజ్యమును మరల అను గ్రహించెదవా? అని ఆయనను అడుగగా ఆయన 7. కాలములను సమయములను తండ్రి తన స్వాధీనమందుంచుకొని యున్నాడు; వాటిని తెలిసికొనుట మీ పనికాదు. 

మన పని ఆయన కొరకు ఎదురుచూడడము తప్ప, కాలములను, సమయములను మనము నిర్ణయించకూడదు, ప్రకటించకూడదు.

తీతు పత్రికలో చదువుతాము.

మహా దేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమయొక్క ప్రత్యక్షత కొరకు ఎదురుచూచుచు…

ఆయన ప్రత్యక్షత కొరకు మనము ఎదురుచూడాలి. అది ఆకస్మికముగా, మనము ఊహించని సమయములో జరిగేది.

 1. ఆర్బాటం

ఆ తరువాత ఇక్కడ ఆర్భాటము కూడా మనకు కనిపిస్తున్నది.

‘ఆర్భాటముతోను, ప్రధానదూతశబ్దముతోను, దేవుని బూర తోను పరలోకమునుండి ప్రభువు దిగివచ్చును’

ఆర్భాటముతోను,κελεύσματι

ఒక పెద్ద ధ్వనితో ఆయన వస్తాడు. లాజరు సమాధి దగ్గర ఆయన కేక పెట్టాడు: ‘లాజరూ, బయటికి రా’

ఆ పిలుపు వినగానే లాజరు మృతులలో నుండి లేచి బయటికి వచ్చాడు. ఆగమన సమయములో యేసు ప్రభువు కేక విని ప్రపంచములో అన్ని దేశాల్లో, అన్ని గ్రామాల్లో ఉన్న  సమాధుల తోటలన్నీ అతలాకుతలము అయిపోతాయి. ప్రపంచ చరిత్ర లో వేలాది సంవత్సరాలుగా సమాధి చేయబడిన పరిశుద్ధులందరూ, ఇంకా సముద్రాల్లో, అడవుల్లో, అరణ్యాల్లో గుర్తు తెలియకుండా మరుగైన పరిశుద్ధులందరూ ఆ స్వరము విని తిరిగి లేస్తారు.

ఆర్భాటముతోను, ప్రధానదూతశబ్దముతోను…. దేవుడు చేసే ముఖ్య సంఘటనల ముందు ప్రధాన దూత శబ్దము వినిపిస్తుంది. ప్రభువైన యేసు యొక్క గొంతుకు ప్రధాన దూత శబ్దము కూడా కలుస్తుంది.

3.దేవుని బూరతోను……. ప్రజలను పండుగలకు, ఉత్సవాలకు, సభలకు, ప్రకటనలకు, యుద్ధాలకు బూర ఊది పిలుచుట యూదుల ఆచారము. పరిశుద్దులందరినీ ఒక చోట చేర్చుటకు ఈ దేవుని బూర వినిపించబడుతుంది.

‘ఆహాయ బూర ఎప్పుడు ధ్వనించునో, ఆహా నా యాశ ఎపుడు తీరుతుందో…’ అని మనము పాడుకొంటాము.

ఇప్పుడు ప్రపంచములో 700 కోట్లకు పైగానే ప్రజలు ఉన్నారు. వీరిలో 100 కోట్ల మంది వెళ్ళిపోయినా ఎంతో గలిబిలి కలుగుతుంది. ఆ కోట్ల మంది మధ్యకాశములో ప్రభువైన యేసు క్రీస్తును ఆరాధించుటకు తమ స్వరము ఎత్తినప్పుడు ఆ జయధ్వనులు ఎలా ఉంటాయో ఊహించగలమా?

భూమి మీద నుండి ఎత్తబడిన పరిశుద్ధులందరికీ మహిమ దేహాలు ఇవ్వబడతాయి.

సమస్తమును తనకు లోపరచుకొనజాలిన శక్తినిబట్టి ఆయన మన దీనశరీరమును తన మహిమగల శరీరమునకు సమ రూపము  గలదానిగా మార్చును. ఫిలిప్పి 3:20-21

మృత దేహము విత్తనము ఐతే మహిమ దేహము దాని ఫలము. మన మృత దేహము మట్టిలో కలిసిపోతుంది. అది తిరిగి పునర్నిర్మాణము చెందదు. దేవుడు మనకు మహిమ దేహము ఇస్తాడు. క్రొత్త వాటిని ఇష్టపడని వారు ఎవరు? క్రొత్త దుస్తులు, క్రొత్త వస్తువులు, క్రొత్త పుస్తకాలు, క్రొత్త ఫోన్ లు, క్రొత్త ఇల్లు, క్రొత్త కారు, క్రొత్త కంప్యూటర్, క్రొత్త ఫర్నిచర్… క్రొత్తవి ఎన్నో మనము సమకూర్చుకొనగలము కానీ క్రొత్త దేహము మనము పొందలేము. వయస్సు పెరిగేకొద్దీ మన దేహము బలహీనపడి అనేక వ్యాధులకు నిలయముగా మారుతుంది.

ఈ రోగగ్రస్తమైన శరీరము మనకు మరలా ఎందుకు? యేసు ప్రభువు ఇచ్చే నూతన దేహము శ్రేష్టమైనది.

 1. ఆరోహణము:

    ఆర్భాటముతో, ప్రభువు స్వరము, ప్రధాన దూత శబ్దము విని నిద్రించిన వారు లేపబడతారు. ఆ తరువాత సజీవులుగా ఉన్న విశ్వాసులు ఆరోహణము చెందుతారు.

ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను;

మన మందరము నిద్రించము గాని నిమిషములో, ఒక రెప్ప పాటున, కడబూర మ్రోగగానే

మనమందరము మార్పు పొందుదుము.

                                                                1 కొరింధీ 15:51

కోట్లాది మంది ప్రజలు ఈ ప్రపంచము నుండి కనుమరుగు అవుతారు. మా టీచర్ గారు ఏమైపోయారు అని తరగతిలో విద్యార్థులు అడుగుతారు. నా భార్య ఎక్కడికి పోయింది? అని అనేక మంది భర్తలు అడుగుతారు. నా భర్త ఎట్లా  మాయమై పోయాడు? అని అనేకమంది భార్యలు అడుగుతారు. మెకానిక్కులు, నాలాంటి డాక్టర్లు, ఇంజినీర్లు, ఉద్యోగస్తులు ఆ రోజు అదృశ్యమవుతారు. ఆ రోజు ప్రమాదాలు జరిగే అవకాశము కూడా ఉంది. ఒక బస్సు డ్రైవర్ నడిచే బస్సు లో నుండి అదృశ్యమైతే ఆ బస్సు పరిస్థితి ఏమిటి? ట్రైన్ డ్రైవర్ వెళ్ళిపోతే నడిచే ట్రైన్ పరిస్థితి ఏమిటి? పైలట్ వెళ్ళిపోతే ఆ విమానము పరిస్థితి ఏమిటి? ఆ రోజున విడువబడడం నాకు ఇష్టము లేదు.

 1. ఆకాశం

ఏడవదిగా ఆకాశము. మనము ప్రభువైన యేసు క్రీస్తును ఆకాశములో కలుస్తాము. భూమి మీద కాదు. విశ్వాసులు – మరణము నుండి లేపబడినవారు, సజీవులు – అందరూ ఆకాశములో యేసు ప్రభువును కలుస్తారు. అందరూ కలిసి నిత్యత్వమంతా ప్రభువుతో ఉండుటకు పరలోకానికి వెళ్తారు.

    ప్రభువైన యేసు క్రీస్తు యోహాను సువార్త 14 అధ్యాయములో చేసిన వాగ్దానము అప్పుడు నెరవేరుతుంది.

 1. నా తండ్రి యింట అనేక నివాసములు కలవు, లేనియెడల మీతో చెప్పుదును;

మీకు స్థలము సిద్ధపరచ వెళ్లుచున్నాను.

 1. నేను వెళ్లి మీకు స్థలము సిద్ధపరచినయెడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరల వచ్చి నాయొద్ద నుండుటకు మిమ్మును తీసికొని పోవుదును.

ఇది తన వారిని తండ్రి ఇంటికి తీసుకొనివెళ్ళుటకు ప్రభువైన యేసు క్రీస్తు చేసిన వాగ్దానము. భూలోకములో జీవించుచున్నప్పుడే కొంతమందికి దేవుడు పరలోకమును చూసే ధన్యత ఇచ్చాడు. స్తెఫెను, యోహాను, పౌలు పరలోక సౌందర్యమును భూమి మీద ఉండే చూశారు. 2 కొరింథీ 12 అధ్యాయములో పౌలు తన పరలోక యాత్రను వివరించాడు. అయితే ఆ అనుభూతిని వివరించుట అసాధ్యమని ఆయన వ్రాశాడు.

అట్టి మనుష్యుని నేనెరుగుదును. అతడు పరదైసులోనికి కొనిపోబడి, వచింప శక్యము కాని మాటలు వినెను; ఆ మాటలు మనుష్యుడు పలుకకూడదు. 2 కొరింథీ 12:3-4

ఆ తరువాత మాటలు చూద్దాము.

క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు.

ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితోకూడ ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు

ఆకాశమండలమునకు మేఘములమీద కొనిపోబడుదుము.

ఇక్కడ ‘మేఘములమీద కొనిపోబడుదుము’ అని వ్రాయబడింది. బైబిల్ లో మేఘములు దేవుని ప్రత్యక్షతకు గుర్తుగా ఉన్నాయి. దేవుడు మోషేతో మాట్లాడుటకు దిగివచ్చినప్పుడు, మేఘము కనిపించింది.

 1. మోషే కొండమీదికి ఎక్కినప్పుడు ఆ మేఘము కొండను కమ్మెను.
 2. యెహోవా మహిమ సీనాయి కొండమీద నిలిచెను; మేఘము ఆరు దినములు దాని కమ్ముకొనెను;

ఏడవ దినమున ఆయన ఆ మేఘములోనుండి మోషేను పిలిచినప్పుడు…. నిర్గమ 24:15,16

దేవుడు ప్రత్యక్ష గుడారములో కనిపించినప్పుడు ఒక మేఘము కనిపించింది.

అప్పుడు మేఘము ప్రత్యక్షపు గుడారమును కమ్మగా యెహోవా తేజస్సు మందిరమును నింపెను. నిర్గమ 40:34

దేవుడు తన మందిరములో ప్రత్యక్షమైనప్పుడు ఒక మేఘము కనిపించింది.

 1. యాజకులు పరిశుద్ధస్థలములోనుండి బయటికి వచ్చినప్పుడు మేఘము యెహోవా మందిరమును నింపెను.
 2. కాబట్టి యెహోవా తేజోమహిమ యెహోవా మందిర ములో నిండుకొనగా ఆ మేఘమున్న హేతువుచేత యాజ కులు సేవచేయుటకు నిలువలేక పోయిరి. 1 రాజులు 8:10-11

ప్రభువైన యేసు క్రీస్తు తన ముగ్గురు శిష్యుల ఎదుట కొండ మీద రూపాంతరము చెందినప్పుడు ఒక మేఘము కనిపించింది.

ఇదిగో ప్రకాశమాన మైన యొక మేఘము వారిని కమ్ముకొనెను;

ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేనానందించు చున్నాను,

ఈయన మాట వినుడి (మత్తయి 17:5)

ఆయన పరలోకమునకు ఆరోహణమైనప్పుడు ఒక మేఘము కనిపించింది.

వారు చూచుచుండగా ఆయన ఆరోహణమాయెను,

అప్పుడు వారి కన్నులకు కనబడకుండ ఒక మేఘము ఆయనను కొనిపోయెను. అపో.కార్యములు 1:9

ఒక మేఘము ప్రభువైన యేసు క్రీస్తును పరలోకమునకు కొనిపోయింది. ఆయన తిరిగి వచ్చేటప్పుడు కూడా మేఘముల మీద వస్తాడు. ‘మేఘములు’ దేవుని ప్రత్యక్షతను, మహిమను సూచించుచున్నవి. యేసు క్రీస్తు ఆగమనములో విశ్వాసులందరికీ దేవుని మహిమ ప్రత్యక్షత కలుగుతుంది. ప్రతి సారీ మీరు ఆకాశములో మేఘములు చూసినప్పుడు త్వరలో రానైయున్న ప్రభువైన యేసు క్రీస్తును జ్ఞాపకము చేసుకోండి.

 

 1. ఆలింగనం

విశ్వాసులందరూ ఎత్తబడతారు. వారందరూ కలుసుకొని ఆనందిస్తారు.

క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు.

 1. ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితోకూడ ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు

ఆకాశమండలమునకు మేఘములమీద కొనిపోబడుదుము.

క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు.

చనిపోయిన క్రైస్తవులు మొదట లేస్తారు. నేను పదవ తరగతి పాస్ అయిన తరువాత ఇంటర్మీడియట్ చదువుటకు తెనాలి లోని VSR కళాశాలలో చేరాను. పేపర్ చదువుటకు లైబ్రరీ కి వెళ్ళాను. సీనియర్లు చదివిన తరువాతే పేపర్ జూనియర్లకి వచ్చేది. ‘మేము సీనియర్ లము రా. మమ్మలను గౌరవించండి’ అని సీనియర్లు మాకు ఉద్బోధ చేసేవారు.

  దేవుడు ఇక్కడ సీనియర్లకు గౌరవము ఇస్తున్నాడు.సజీవులుగా ఉన్న విశ్వాసులకంటే కొంత ముందుగా మరణించిన క్రైస్తవులు సమాధులలో నుండి లేచి ప్రభువును కలుస్తారు.

 1. ఆనందం

 

అది ఎంతో ఆనందము కలిగించే సంఘటన. మీ కుటుంబ సభ్యులను, బంధువులను, స్నేహితులను, సంఘస్తులను చాలా కాలము తరువాత కలిసినప్పుడు మీకు ఎంత ఆనందము కలుగుతుందో కదా! వారే కాకుండా సమస్త యుగములలో జీవించిన భక్తులందరినీ మీరు కలుసుకోవచ్చు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, యోసేపు, మోషే, యెహోషువ లాంటి గొప్ప నాయకులను మీరు కలుసుకోవచ్చు. దావీదు, సొలొమోను, హిజ్కియా, యోషీయా లాంటి గొప్ప రాజులతో మీరు మాట్లాడవచ్చు. దానియేలు, యెషయా, యిర్మీయా, యెహెఙ్కేలు లాంటి ప్రవక్తలతో గడుపవచ్చు. మత్తయి, మార్కు, లూకా, యోహాను, పేతురు, యాకోబులాంటి అపొస్తలులతో కబుర్లు చెప్పవచ్చు. మార్టిన్ లూథర్, భక్త్ సింగ్, సైలస్ ఫాక్స్, దేవదాసు, జాన్ నెల్సన్ డార్బీ లాంటి సంఘ  స్థాపకులను మీరు కలుసుకోవచ్చు. ఫానీ క్రాస్ బీ, చార్లెస్ వెస్లీ, పులిపాక జగన్నాథం, పురుషోత్తం చౌదరి, పంతగాని పరదేశి లాంటి గొప్ప గాయకులను మీరు కలువ వచ్చు. వీరే కాకుండా, ప్రపంచములోని అన్ని ప్రదేశాలు, అన్ని భాషలు, అన్ని జాతులు, అన్ని కులాలు, అన్ని వర్గాలలో నుండి వచ్చిన కోట్లాదిమంది విశ్వాసులు అక్కడ ఉంటారు.

    మరణం మనలను విడదీస్తుంది.అయితే క్రీస్తులో మనము ఐక్యము చేయబడుతాము. మన బలహీనతల గురించి అప్పుడు మనము విచారపడము, ఎందుకంటే మనమందరమూ ప్రభువైన యేసు క్రీస్తును పోలి ఉంటాము.

ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన యున్నట్లుగానే  ఆయనను చూతుము

గనుక ఆయనను పోలియుందుమని యెరుగు దుము. 1 యోహాను 3:2

 1. ఆదరణ

చివరిగా ఇక్కడ మనకు ఆదరణ కనిపిస్తున్నది.

 1. కాబట్టి మీరు ఈ మాటలచేత ఒకనినొకడు ఆదరించుకొనుడి.

ఆయన తిరిగివచ్చుట మనలను భయపెట్టేది కాదు, ఆదరించేది. అవిశ్వాసులకు అది భయం కలిగించవచ్చు, కానీ విశ్వాసులకు అది ఆదరణ. థెస్సలొనీక లోని సంఘస్తులు ఆ కాలములో ఎంతో శ్రమలు అనుభవిస్తున్నారు. ప్రభువైన యేసు క్రీస్తు తిరిగి రానై ఉన్నాడు అనే సత్యము వారిని ఎంతో ఆదరించింది. శ్రీ లంకలో చర్చి లో బాంబుల నుండి నైజీరియా లో క్రైస్తవుల ఇళ్లలో బాంబుల వరకు ముస్లిం తీవ్రవాదులు, నాస్తికులు, ఇతర వర్గాల నుండి క్రైస్తవులు నేటి కాలములో ఎంతో హింసను చవిచూస్తున్నారు. యేసు క్రీస్తు రెండవ రాకడ వారి హృదయాలకు ఎంతో ఆదరణ చేకూర్చే నిరీక్షణ.

 హింస లేకపోయినా ఇతర సమస్యలు మనల్ని వెంటాడుతూనే ఉంటాయి. ఆరోగ్య సమస్యలు, ఉద్యోగ సమస్యలు, కుటుంబ సమస్యలు, పిల్లల సమస్యలు, ఊళ్ళో సమస్యలు, వీధిలో సమస్యలు..ప్రతి మనిషికీ ఏదో ఒక సమస్యలు ఎప్పుడో ఒకప్పుడు ఉంటానే ఉంటాయి. మనమందరమూ ప్రభువు ఆగమనము గురించి ఎదురుచూచుచూ ఆదరణ పొందవచ్చు.

మనయెడల ప్రత్యక్షము కాబోవు మహిమయెదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నతగినవి కావని యెంచు చున్నాను.రోమా 8:18

ఈ రోజు ఎటువంటి సమస్యల గుండా మీరు వెళ్లుచున్నప్పటికీ, ఎంత బాధలో ఉన్నప్పటికీ ఆ రోజు మీరు పొందబోయే మహిమ ఎదుట నేటి సంక్లిష్ట పరిస్థితులు ఎన్నతగినవి కావు.

2 కొరింథీ 4:17 లో మనము చదువుతాము.

మేము దృశ్యమైనవాటిని చూడక అదృశ్యమైన వాటినే నిదానించి చూచుచున్నాము

గనుక క్షణమాత్రముండు మా చులకని శ్రమ మాకొరకు అంత కంతకు ఎక్కువగా నిత్యమైన

మహిమ భారమును కలుగ జేయుచున్నది.

For our light affliction,which is but for a moment, worketh for us a far more exceeding and

eternal weight of glory,

నిత్యమైన మహిమ భారము…eternal weight of glory ……αἰώνιον βάρος δόξης

మహిమ భారము… గ్రీకు భాషలో పౌలు గారు బారోస్ డొక్సస్ అని వ్రాశాడు. బారోస్ లో నుండే బారోమీటర్ అనే పదము వచ్చింది. ఒక వ్యవస్థ లోని పీడనం/pressure ని కొలుచుటకు బారోమీటర్ వాడుతాము. భవిష్యత్తులో మనకు కలిగే దేవుని ప్రత్యక్షత నేడు మన మీద ఒక ఒత్తిడిని ఉంచింది. ఆ మహిమ భారము ఎదుట నేటి కాలపు శ్రమలు ఎన్నతగినవి కావు. ఆ నిత్య మహిమ ముందు నేటి తాత్కాలిక శ్రమలు మనలను ఏమీ చేయలేవు.

కాబట్టి మీరు ఈ మాటలచేత ఒకనినొకడు ఆదరించుకొనుడి. కనికరము చూపు తండ్రి,

సమస్తమైన ఆదరణను అనుగ్ర హించు దేవుడు (2 కొరింథీ1:3) మనకు ఉన్నాడు. ఆయన రాకడ కూడా మనలను ఆదరిస్తుంది.

  ప్రభువైన యేసు క్రీస్తు ఆగమనము, క్రైస్తవ సంఘము ఎత్తబడుట గురించి మనము 10 సత్యాలు ఈ రోజు చూశాము.

 1. ఆందోళన
 2. ఆవేదన
 3. ఆగమనం
 4. ఆకస్మికము
 5. ఆర్భాటము
 6. ఆరోహణము
 7. ఆకాశము
 8. ఆలింగనము
 9. ఆనందము
 10. ఆదరణ

 

ఈ సత్యాలు మీ జీవితానికి ఆశీర్వాదకరముగా ఉండును గాక.

డాక్టర్ పాల్ కట్టుపల్లి 

Leave a Reply