క్రైస్తవులు – రాజకీయాలు : Christians & Politics

ఎప్పుడెప్పుడా అని అందరూ ఎదురుచూస్తున్న ఎన్నికల ఫలితాలు వచ్చినవి. క్రొత్త ప్రభుత్వాలు కొలువుదీరినాయి. ఆంధ్ర ప్రదేశ్ లో వై.స్.జగన్ గారు ముఖ్యమంత్రి అయ్యారు. భారత ప్రధానిగా నరేంద్ర మోడీ గారు రెండవ పర్యాయము ప్రమాణ స్వీకారం చేశారు. మనము ఓట్లు వేసిన వారు గెలవ వచ్చు, గెలవక పోవచ్చు; అయితే దేవుడు ఎవరికి అధికారం ఇచ్చినా వారి కోసము మనము ప్రార్ధన చేయాలి. దేవుడు వారిని క్షేమముగా ఉంచాలని, వారికి తన జ్ఞానాన్ని, ప్రేమను, కృపను అనుగ్రహించాలని మనము ప్రార్ధన చేద్దాము. నిర్గమ కాండము లో మనము ధ్యానము చేస్తున్నాము.

నిర్గమ కాండము 5 అధ్యాయములో మనము మొదటి రెండు వచనాలు చూద్దాము.

  1. తరువాత మోషే అహరోనులు వచ్చి ఫరోనుచూచిఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా అరణ్యములో నాకు ఉత్సవము చేయుటకు నా జనమును పోనిమ్మనిఆజ్ఞాపించుచున్నాడనిరి.
  1. ఫరోనేను అతని మాట విని ఇశ్రాయేలీయులను పోనిచ్చుటకు యెహోవా ఎవడు? నేను యెహోవాను ఎరుగను, ఇశ్రాయేలీయులను పోనీయ ననెను.

                                                                 నిర్గమ కాండము 5:1-2

   మోషే ఫరో ముందుకు వెళ్ళాడు. నా ప్రజలను వెళ్లనివ్వు. మేము దేవుని ఆరాధించాలి అన్నాడు. ఫరో చక్రవర్తి కి చాలా కోపం వచ్చింది. ‘ఎవడ్రా, నీ దేవుడు, నీ దేవుడు గురించి నాకు తెలియదు. మిమ్ములను వెళ్లనివ్వను. వెళ్లి పని చేయండి’ అన్నాడు. మోషే తన ప్రజల స్వాతంత్రము కోసము ఒక గొప్ప చక్రవర్తితో తలపడుచున్నాడు. మోషే ఒక స్వాతంత్ర యోధుడు. ప్రజాస్వామ్యానికి పునాదులు వేసిన వ్యక్తుల్లో ఒకడు. మాకు మత స్వాతంత్రము కావాలి. అని ఫరో ముందు డిమాండ్ చేసాడు. మమ్ములను వెళ్లనివ్వు, నీ క్రింద బానిసలుగా మేము బ్రతకలేము, మాకు స్వేచ్ఛగా మా దేవుని ఆరాధించే హక్కు కావాలి అని మోషే అడిగాడు. సామాజిక స్వాతంత్రము, మత స్వాతంత్రము ఎప్పుడూ కలిసేవుంటాయి. నిజమైన ప్రజాస్వామ్యములో సామాజిక స్వాతంత్రము, మత స్వాతంత్రము రెండూ కలిసే ఉంటాయి. మత స్వాతంత్రము లేకుండా, స్వేచ్ఛగా ఆరాధన చేసే భాగ్యము లేకుండా ప్రజాస్వామ్యమునకు అర్ధము లేదు. ఆ విధముగా బైబిల్ ప్రజాస్వామ్యానికి పునాదులు వేసింది.

   భారత దేశము ఇప్పుడు ప్రపంచములోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశముగా ఉంది. ఈ దేశములో 130 కోట్ల మంది ప్రజలు ఉన్నారు. వారిలో దాదాపు సగం మంది 60 కోట్ల మంది 10 లక్షల పోలింగ్ కేంద్రాలకు వెళ్లి  ఈ ఎలెక్షన్ లలో ఓట్లు వేశారు. ఈ రోజు ప్రపంచమంతా భారత దేశము వైపు చూసి ఆశ్చర్య పోతున్నది. పైన హిమాలయ పర్వతాల నుండి క్రింద కన్యాకుమారి వరకు,బంగాళా ఖాతములో అండమాన్ దీవుల వరకు ఎన్నికలలో ప్రజలు ఓటు హక్కు వినియోగించుకున్నారు. క్రొత్త ప్రభుత్వాలు ఏర్పడుతున్న సందర్భముగా ప్రభుత్వాల పట్ల క్రైస్తవులు ఏ విధముగా ప్రవర్తించాలి అనే విషయం కూడా  మనం చూద్దాము.

   రోమా పత్రిక 13 అధ్యాయము నుండి కొన్ని వచనాలు చదివి మీకు వినిపిస్తాను. అపొస్తలుడైన పౌలు గారు వ్రాసిన ఈ మాటల్లో 4 విషయాలు చూద్దాము.

  1. ప్రతివాడును పై అధికారులకు లోబడియుండవలెను;

ఏలయనగా దేవునివలన కలిగినది తప్ప మరి ఏ అధికారమును లేదు; ఉన్న అధికారములు దేవునివలననే నియమింపబడి యున్నవి.

  1. కాబట్టి అధికారమును ఎది రించువాడు దేవుని నియమమును ఎదిరించుచున్నాడు;

ఎదిరించువారు తమ మీదికి తామే శిక్ష తెచ్చుకొందురు.

                                       రోమా పత్రిక 13:1-2

ఆ మాటలు మీరు గమనించండి: ఏలయనగా దేవునివలన కలిగినది తప్ప మరి ఏ అధికారమును లేదు. ఈ విశ్వం దేవునికి చెందినది. అన్ని అధికారాలు ఆయన చేతిలో ఉంటాయి. రెండ్రోజుల క్రితము సముద్రములో ఈత వేయటానికి వెళ్ళాను. నేను ఈదుతూ ఉంటే, నా క్రిందుగా ఒక షార్క్ చేప వెళ్ళింది. అది కూడా నా అంత సైజు లో ఉంది. నాకు యోనా గుర్తుకు వచ్చాడు. యోనా పారిపోవుతున్నప్పుడు సముద్రములో వేయబడ్డాడు. యోనా ను మ్రింగివేయుటకు దేవుడు ఒక తిమింగలమును పంపాడు.ఆ తిమింగలము దేవుని మాటవింది, యోనాను చంపకుండా, నమిలి తినకుండా, అతని మ్రింగికడుపులో పెట్టుకొంది. నేను పసిఫిక్ సముద్రములో ఈతవేస్తున్నాను. ఒక తిమింగలం ఆ ప్రాంతానికి వచ్చింది. నేను ప్రార్ధన చేసుకొన్నాను: ‘యేసు ప్రభువా, నన్ను ఈ తిమింగలం నుండి కాపాడు, భార్య పిల్లలు ఉన్నవాణ్ణి, నన్ను ఈ తిమింగలము మ్రింగివేయకుండా కాపాడు’ దేవుడు నన్ను కాపాడాడు.

   సముద్రములో ఉండే షార్కులు, తిమింగలాలు కూడా దేవుని మాట వింటాయి, ఎందుకంటే వాటన్నిటినీ సృష్టించింది ఆయనే. ఈ ప్రపంచములో ఉన్న అన్ని అధికారాలు ఆయన దగ్గర నుండి వచ్చినవే.

దేవుడు మన కోసము 4 అధికార వ్యవస్థలు సృష్టించాడు.

1.ప్రభుత్వము

2.క్రైస్తవ సంఘము

3.కుటుంబ వ్యవస్థ

4.ఉద్యోగ వ్యవస్థ

   మనం పాపాత్ములము కాబట్టి మనల్ని నియంత్రించటానికి దేవుడు ఈ అధికార వ్యవస్థలు నిర్మించాడు. సమాజం మొత్తాన్ని నియంత్రించటానికి ప్రభుత్వ వ్యవస్థ ని నిర్మించాడు.దానికి మనము లోబడి ఉండాలి. విశ్వాసులను నియంత్రించటానికి క్రైస్తవ సంఘమును నిర్మించాడు. సంఘానికి మనము లోబడి ఉండాలి.మూడవదిగా కుటుంబ వ్యవస్థ. పిల్లలను నియంత్రించే అధికారము తల్లి దండ్రులకు దేవుడు ఇచ్చాడు. వారికి మనం లోబడి ఉండాలి.

   నాలుగవది ఉద్యోగ వ్యవస్థ. మనం చేసే వృత్తులను, ఉద్యోగాలను నియంత్రించటానికి ఈ వ్యవస్థనుదేవుడు నెలకొల్పాడు. ఈ నాలుగు అధికార వ్యవస్థలను దేవుడు మన క్షేమము కోసమే నిర్మించాడు.

ప్రభుత్వ వ్యవస్థ: ప్రభుత్వానికి ఆ అధికారము ఇచ్చింది దేవుడే. పూర్వము రాజరిక వ్యవస్థ ఉండేది. రాజులు మేము దేవుని సేవకులము అని గుర్తుంచుకొని ప్రజలను పాలించే వారు. వారు దేవుని మరచిపోయినప్పుడు ప్రజలను వేధింపులకు గురిచేసే వారు. 13 శతాబ్దములో ఇంగ్లాండ్ దేశములో కింగ్ జాన్ వన్ అనే రాజు ఉండే వాడు.ఆయన ప్రజల మీద అధిక పన్నులు వేసేవాడు, తప్పుడు కేసులు పెట్టి, అరెస్ట్ చేసి జైల్లో పెట్టేవాడు. అతని ఘోరాలు చూసి ప్రజలు విసిగిపోయారు. కింగ్ జాన్ ని  ఎదిరించారు. ‘నువ్వు రాజువు, నిన్ను గౌరవిస్తాము.అయితే నువ్వు కూడా దేవుని క్రింద ఉన్న వాడివే. దేవుడు నీ కిచ్చిన అధికారాన్ని దుర్వినియోగము చేయవద్దు.’ అని కింగ్ జాన్ ని నిలదీశారు. ఒక ప్రజా హక్కుల పత్రం వ్రాసుకొని కింగ్ జాన్ చేత సంతకము చేయించారు. దానిని మాగ్నా కార్టా అని ఇప్పుడు మనము పిలుచుకొంటున్నాము. గత్యంతరం లేక కింగ్ జాన్ మాగ్నా కార్టా మీద సంతకము చేయ వలసి వచ్చింది. ఈ మాగ్నా కార్టా ప్రజలకు అనేక హక్కులను ఇచ్చింది. ఇష్టానుసారంగా పన్నులు వేయటానికి లేదు, హెబియస్ కార్పస్ అంటాము, అంటే ఒక వ్యక్తిని అరెస్ట్ చేస్తే లేకపొతే జైల్లో పెడితే ఆ వ్యక్తిని కోర్ట్ కి తీసుకొని వెళ్లి న్యాయ మూర్తి ముందు హాజరు పరచాలి. న్యాయవాది ని కలిసే హక్కు ఉండాలి. ఇలాంటి హక్కులను మాగ్నా కార్టా ప్రజలకు ఇచ్చింది. ప్రపంచ ప్రజలను పురికొల్పింది. దానిని చదివి అనేక దేశాల రాజ్యాంగ నిపుణులు తమ రాజ్యాంగాలు వ్రాసుకున్నారు. ప్రజాస్వామ్యము వైపు అడుగులు వేశారు. ఆ విధముగా ప్రజాస్వామ్యము క్రైస్తవులు ఈ ప్రపంచానికి అందించిన ఒక గొప్ప కానుక. మన హక్కులు దేవుడు ఇచ్చేవి, ప్రభుత్వాలు ఇచ్చేవి కాదు, దేవుడు ఇచ్చిన హక్కులను పరిరక్షించటమే ప్రభుత్వాల భాద్యత.

   ఇంగ్లాండ్ దేశము రాజును ఎదిరించి అమెరికా ప్రజలు ఒక ప్రజాస్వామ్య దేశము నిర్మించుకున్నారు. థామస్ జెఫెర్సన్ Declaration of Independence వ్రాశాడు. the Laws of Nature and of Nature’s God అనే పదాలు వ్రాశాడు. మానవ హక్కులు ప్రకృతి నియమాలు, ఆ ప్రకృతి ని సృష్టించిన దేవుని నుండే వస్తాయి అని వ్రాశాడు. జెఫెర్సన్ ఏమని వ్రాశాడంటే,

We hold these truths to be self-evident, that all men

are created equal, that they are endowed by their Creator with certain

unalienable Rights, that among these are Life, Liberty and the pursuit of Happiness.

మానవులందరూ సమానముగా సృష్టించబడ్డారు, జీవితము, స్వేచ్ఛ, సంతోషము ఈ హక్కులు సృష్టికర్త నుండి వచ్చినవే.సమానత్వము, స్వేచ్ఛ లేకుండా ప్రజా స్వామ్యము లేదు.అవి దేవుని యొద్ద నుండి వచ్చినవే. కాబట్టి ప్రభుత్వాలు దేవుని అధికారాన్ని గుర్తించాలి. ఈ రోజు నాస్తికులు పరిపాలిస్తున్న దేశాలను మీరు గమనించండి. ఫిలిప్పీన్స్, చైనా, నార్త్ కొరియా, క్యూబా, వెనిజువేలా ఈ దేశాల నాయకులు నాస్తికత్వాన్ని ఆ దేశ ప్రజల మీద రుద్దుతున్నారు. అందుకనే ఆ దేశాల్లో ప్రజా హక్కులు చాలా ఘోరముగా ఉన్నాయి. వారికి మత స్వాతంత్రము లేదు. స్వేచ్చగా దేవుని ఆరాధించలేకపోవుచున్నారు. ఆ దేశ నాయకులు ‘మేమే అందరికీ పైన ఉన్నాము. మాకు పైన ఎవ్వరూ లేరు.’ అనుకొంటున్నారు. ఈ రోజు వెనిజువేలా దేశాన్ని మీరు చూడండి.

   నేను మొన్న ఈక్వడార్ దేశములో  వున్నప్పుడు అక్కడి ప్రజలు నాతొ చెప్పారు. వారికి పైన ఉన్న వెనిజువేలా దేశము నుండి ఎంతో మంది శరణార్థులు ఈక్వడార్ దేశము వెళ్లుచున్నారు. ఒక రోజుల్లో ఆ దేశము దక్షిణ అమెరికా ఖండములోనే ధనిక దేశము. ఆ దేశ నాయకులు సోషలిజం ని ఆ ప్రజల మీద రుద్దారు. వారికి మత స్వాతంత్రము లేకుండా చేశారు. పిల్లలకు ఆహారము లేదు, ప్రజలు చెత్త, చెదారములో వెతుక్కునే పరిస్థితి వచ్చింది. తీవ్ర ఆర్ధిక మాంద్యము వచ్చింది. డబ్బులు కట్టలు కట్టలు తీసుకొని మార్కెట్ కి వెళ్లినా ఆ డబ్బుకు ఎలాంటి విలువ లేకుండా చెత్త కాగితాలుగా మిగిలిపోయిన పరిస్థితి వచ్చింది. పిల్లల్ని ఎలా పోషించాలో తెలియక అనేక మంది తల్లిదండ్రులు వ్యధ చెందుతున్నారు. సరైన ఆహారము లేక చాలా మంది పిల్లలు బక్కచిక్కి పోయారు. వారి పరిస్థితి చూసి నాకు ఎంతో బాధ కలిగింది. ఆ దేశ నాయకులకు దేవుని భయం లేదు. .మాకు అధికారము ఉంటే చాలు, జనము ఎంత మంది చచ్చినా we dont care అనే పరిస్థితిలో వారు ఉన్నారు. దేశ నాయకులు దేవుని వైపు చూడాలి. దేవుని ప్రార్ధించాలి. ప్రజలకు స్వేచ్ఛ ఇవ్వాలి. అన్ని అధికారాలు దేవుని యొద్ద నుండే వచ్చాయి అనే సత్యము గుర్తించాలి. మోషే చేసింది అదే. ఫరో చక్రవర్తి ఐగుప్తు దేశములో ఉన్న  యూదులను బానిసత్వములో బంధించాడు, వారి పిల్లలను చంపివేస్తున్నాడు. మోషే దానిని ప్రశ్నించాడు. దేవుడైన యెహోవా నిన్ను ఆజ్ఞాపిస్తున్నాడు, దేవుని అధికారాన్ని గుర్తించు అన్నాడు. ఫరో కి దీన మనస్సు లేదు. ఎవడ్రా నీ దేవుడు, పో నా దగ్గరి నుండి అని మోషే ని వెళ్ళగొట్టాడు.

   దేవుడు మోషే ద్వారా ఫరో మీదకు 10 తెగుళ్లు పంపించాడు. ఐగుప్తు దేశము మొత్తము కకావికలమై పోయింది. కాబట్టి, దేవుడు పెట్టిన ఆర్డర్ ని, క్రమాన్ని మనము గుర్తించాలి. దేవుని క్రింద దేవుని క్రింద దేశ నాయకులు, అధికారులు ఉన్నారు. వారి క్రింద మనము ఉన్నాము. అపొస్తలుడైన పౌలు రోమా పత్రిక 13 అధ్యాయములో ఆ సత్యమే మనకు వివరించాడు.

3 వచనము చూద్దాము.

నీకు మేలు కలుగుటకు అధికారులు దేవుని పరిచారకులు; వారికి భయపడక ఉండ కోరితివా,

మేలు చేయుము, అప్పుడు వారిచేత మెప్పు పొందుదువు.

పౌలు గారు ఏమంటున్నాడంటే, అధికారులు దేవుని పరిచారకులు. వారిని గౌరవించు అంటున్నాడు.

ఆ తరువాత 7 వచనం చూద్దాము.

ఇందుకే గదా మీరు పన్నుకూడ చెల్లించుచున్నారు? కాబట్టి యెవనికి పన్నో వానికి పన్నును, ఎవనికి సుంకమో వానికి సుంకమును చెల్లించుడి. పౌలు ఇక్కడ ఏమంటున్నాడంటే, ప్రభుత్వానికి పన్నులు కట్టండి. కొంతమంది క్రైస్తవులు ఏమంటారంటే, మా డబ్బులు మాకు దేవుడు ఇచ్చాడు. మేము పన్నులు కట్టము. అది పొరపాటు. బైబిల్ ఏమని చెబుతుందంటే, పన్నులు కట్టండి. యేసు ప్రభువు కూడా పన్నులు కట్టాడు. యేసు క్రీస్తు ఈ లోకములో ఉన్నప్పుడు రోమన్ చక్రవర్తి టైబీరియస్ యూదులను పాలిస్తూ ఉన్నాడు. కొంతమంది పరిసయ్యులు ఆయన దగ్గరకు వచ్చారు. మత్తయి సువార్త 22 అధ్యాయములో మనము చదువుతాము. ‘బోధకుడా, కైసరుకు పన్నివ్వ వచ్చా?’ అని ప్రభువైన యేసు క్రీస్తును వారు అడిగారు. ఆయన సమాధానము విని ఆయనను ఇరికించాలని వారి ఉద్దేశ్యము. యేసు క్రీస్తు, ‘ఆ కైసరు దుర్మార్గుడు, అతనికి పన్నులు కట్టవద్దు’ అని చెబితే, ‘ఈ యేసు క్రీస్తు, పన్నులు కట్టవద్దు అని భోదిస్తున్నాడు, ఈయన దేశ ద్రోహి’ అని అందాము అని వారు కాచుకు కూర్చున్నారు. యేసు ప్రభువు వారితో ఏమన్నాడంటే, నా దగ్గరకు ఒక నాణెము తీసుకురండి అన్నాడు. ఆ నాణెము మీద ఎవరి రూపం ఉంది అన్నాడు. ‘కైసరు రూపము ఉంది’ అని వారు అన్నారు. ఆయన ఏమన్నాడంటే,

‘ఆలాగైతే కైసరువి కైసరునకును, దేవునివి దేవునికిని చెల్లించుడి’ ఆ నాణెముల మీద కైసరురూపము

ఉంది, అవి కైసరుకు ఇవ్వండి, మీ మీద దేవుని రూపము ఉంది, మీరు దేవునికి చెందిన వారు అన్నాడు. ప్రభువైన యేసు క్రీస్తు ఆ విధముగా ప్రజాస్వామ్యానికి పునాదులు వేసాడు. ఆయన యొక్క గొప్ప రాజనీతి ఈ మాటల్లో మనము చూస్తున్నాము. Separation of  Church and State అని దీనిని అంటారు. కొన్ని ప్రభుత్వ వ్యవస్థల్లో దేవుడే ప్రభుత్వము, కొన్ని ప్రభుత్వ వ్యవస్థల్లో ప్రభుత్వమే దేవుడు. అయితే యేసు ప్రభువు ఏమన్నాడంటే, ప్రభుత్వమే దేవుడు అనవద్దు, దేవుడే ప్రభుత్వము అనవద్దు, ప్రభుత్వానికి చెందాల్సినవి ప్రభుత్వానికి చెందాలి, దేవునికి చెందాల్సినవి దేవునికి చెందాలి.

యేసు ప్రభువు బోధించిన ఈ గొప్ప రాజకీయ సూత్రమును ఈ రోజు ప్రపంచములో అనేక ప్రజాస్వామ్య దేశాలు అనుసరిస్తున్నాయి.  చివరిగా పౌలు ఏమన్నాడంటే, 8 వచనము చూద్దాము.

  1. ఒకని నొకడు ప్రేమించుట విషయములో తప్పమరేమియు ఎవనికిని అచ్చియుండవద్దు.

పొరుగువానిని ప్రేమించువాడే ధర్మశాస్త్రము నెరవేర్చినవాడు.

ఆ మాటలు మీరు గమనించండి.

పొరుగువానిని ప్రేమించువాడే ధర్మశాస్త్రము నెరవేర్చినవాడు.

ధర్మ శాస్త్రము మొత్తము ప్రేమ మీదే నిర్మితమై ఉంది. ఈ ఎన్నికల సమయములో రాజ కీయ నాయకులు ఏమనుకొన్నారు? నేను నీకు గిఫ్ట్ పంపిస్తున్నాను. నువ్వు నాకు గిఫ్ట్ పంపిస్తే, నేను నీకు రిటర్న్ గిఫ్ట్ పంపిస్తాను. అందులో ప్రేమ లేదు. నీకు రిటర్న్ గిఫ్ట్ పంపిస్తా, నీ మీద ప్రతీకారము తీర్చుకుంటా అంటున్నారు. పౌలు ఏమంటున్నాడంటే, పాలిటిక్స్ అలా ఉండ కూడదు. పొరుగువానిని ప్రేమించువాడే ధర్మశాస్త్రము నెరవేర్చినవాడు. ప్రభుత్వము, అధికారులు, ప్రజలు పొరుగు వారిని ప్రేమించుట ద్వారానే ధర్మ శాస్త్రమును నెరవేరుస్తారు. ప్రభువైన యేసు క్రీస్తు మనకు చూపించింది అదే:

రోమా 6:23 లో మనము చదువుతాము.

ఏలయనగా పాపమువలన వచ్చు జీతము మరణము,

అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తుయేసునందు నిత్య జీవము.

For the wages of sin is death, but the gift of God is eternal life through Jesus Christ our Lord.

              రోమా 6:23

మన పాపములు మనలను నరకానికి తీసుకొని వెళ్లుచున్నప్పుడు, దేవుడు

మనకు ఒక గిఫ్ట్ పంపించాడు. యేసు క్రీస్తు ప్రేమ వలన, ఆయన సిలువ మరణము వలన ఆ గిఫ్ట్

మనకు ఇవ్వబడింది. ఆ నిత్యజీవాన్ని మీరు పొందాలన్నదే నేటి మా ప్రేమ సందేశము.  

Leave a Reply